మూడురోజులైంది అరుణా, ప్రసాద్ మాట్లాడుకోవటం మానేసి. గొడవపడ్డం, మాటలు మానెయ్యటం, మళ్ళీ మాటలు కలుపుకోవటం ఇంతకుముందు కూడా ఎన్నోమాట్లు జరిగింది. ఈసారెందుకో ఆమె వుదాశీనంగా వుండిపోయింది. అతను మాటకలిపే ప్రయత్నం చేస్తుంటే దూరం జరుగుతోంది.
తనేం తప్పుమాటన్నాడని? ఒకవేళ తప్పుగానే అనిపించినా ఆమె మంచికోసమేకదా? సమర్ధించుకోవాలని చూసాడు.
పొద్దున్న ఆరున్నర, ఏడైతేగానీ నిద్ర లేవదు అరుణ. లేచి, బ్రష్‍చేసుకుని పెద్దకప్పుడు కాఫీ అదేదో అమృతం అన్నట్టు జాగ్రత్తగా చేసుకుని, చెవులకి యియర్‍పోన్లు తగిలించుకుని పాటలు వింటూ పెరటిమెట్లమీద కూర్చుంటుంది. అరగంట ప్రహసనం అది. ఆ తర్వాత లేచి నెమ్మదిగా ఒకొక్కపనీ మొదలెడుతుంది. ఆసరికి తన వాకింగ్, వర్కౌట్లు అన్నీ పూర్తౌతాయి. అలా ఆమెని చూస్తుంటే ఎంతో చిరాగ్గా వుంటుంది.
“ఓ గంటో అరగంటో నాతో వాకింగ్‍కి రావచ్చుకదా?” అంటాడతను.
తమ పెళ్ళై ముప్పయ్యైదేళ్ళు. ఈ యిన్నేళ్ళుగా అంటూనే వున్నాడు. ఆమె వింటూనే వుంది. కానీ మూడురోజులక్రితం గొడవకి మాత్రం అదే కారణమైంది.
“నేను లేచేదాకా మీరు ఆగచ్చుగా?” అంది. ఎప్పటి జవాబే. అడిగిఅడిగి ఆ ప్రశ్నకీ, చెప్పిచెప్పి ఈ జవాబుకీ విసుగొచ్చిందేమోగానీ తామిద్దరికీమాత్రం రాలేదు.
“ఓ గంట ముందు లేవచ్చుకదా?”
“నావల్లకాదు. గంట ఆలస్యంగా నడవటంవలన కొంపలేం అంటుకుపోవు”
“పొద్దున్న తాజాగాలి దొరుకుతుంది”
“మన పెళ్ళైనప్పట్నుంచీ అదేదో అప్పున్నట్టు అలారం పెట్టుకుని మరీ లేచి అందరికీ అన్నీ అమర్చాను. మళ్ళీ పడుక్కునేసరికి ఏరోజూ పదకొండు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా, ఏవో ఒక అవసరాలని వాళ్ళు పరిగెత్తుకురావటం, వాళ్ళ పిల్లలు… ఇప్పుడేకదూ, మీరిటైర్‍మెంటు, వాళ్ళు ఎడం జరగడంతో కాస్తంత తీరిక చిక్కింది? కంటినిండా నిద్రకూడా పోనివ్వరేమిటి?” విసుగ్గా అంది.
ఇద్దరూ మళ్ళీ అరిగిపోయిన రికార్డు వేసుకున్నారు.
“ఇన్నాళ్ళూ చేసింది మాకోసం. ఇప్పుడు చేసేది నీకోసం. అనారోగ్యాలు మీదపడేది ఈ వయసులోనే. రోజూ ఓ గంట నడిస్తే నీ ఆరోగ్యానికే మంచిది” అన్నాడతను తగ్గకుండా.
ఆమె చెప్పే జవాబు అతనికి తెలుసు. “మీరు వచ్చాక నేను వెళ్తాను. ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగండి. పనమ్మాయి వస్తుంది. తన పని తను చేసుకుని వెళ్తుంది. ఏదేనా అడిగితే కాస్త పలకండి” అతను అనుకున్నట్టే ఒక్కమాట పొల్లుపోకుండా అంది.
గంటసేపు నడిచి వచ్చి, హాయిగా టీవీముందు పేపరు పట్టుకుని కూర్చోక ఈ బాదరబందీలు పెట్టుకోవడం అతనికి నచ్చదు. అవన్నీకుడా తనే చేస్తే ఇంక ఆమెకి వుండే పనేమిటి? తనతోపాటే లేచి వాకింగుకి రావాలన్న పాయింటు అతను వదల్లేదు.
“ఔను… తెల్లారుగట్టే లేచి, గబగబ వాకింగ్ చేసేసి ఇంటికొచ్చి, తమరు టీవీముందు సెటిలైతే, ఏ తేడా రాకుండా వేడివేడిగా కాఫీలు, టిఫెన్లు అందించాలి… అంతేనా? మహాప్రభో! మా ఆడవాళ్ళకి ఈ వాకింగులవీ కలిసిరావుగానీ, మీరెళ్ళి ఆ ఆరోగ్యమేదో సంపాదించుకు రండి” అనేసింది.
ఉన్నమాటే అయినా, ఆమె ఎద్దేవాగా అనేసరికి కోపం వచ్చేసింది. “ఇంత మొండితనమేమిటి నీకు? చెప్పేది నీమంచికోసమేకదా? తలనొప్పనీ, కాళ్ళునొప్పులనీ డాక్టర్లకి తగలేస్తున్నావు. ఈసారి ఏదేనా వస్తే నేను వైద్యం చేయించను” అన్నాడు. చివరిమాట గట్టిగానే అన్నాడు. కావాలనే.
అలామాట్లాడ్డం తనకి అలవాటే. ఏదేనా పని చెయ్యడానికి అవతలివాళ్ళు యిష్టపడకపోతే వాళ్లని రెచ్చగొడతాడు. ఆ వుక్రోషంతోనేనా చేస్తారని.
ఇప్పుడుకూడా అదే ధోరణిలో అనేసాడు.
అన్నాక ఒక సంఘటన గుర్తొచ్చింది.
ఇద్దరు పిల్లలు వాళ్లకి. ఇద్దరూ కొడుకులు. పెద్దకొడుకు బాగా పెయింటింగ్ వేసేవాడు. పోటీలకి పంపేవాడు. తనకి నచ్చేదికాదు. ఎప్పుడూ రంగులూ, బ్రష్షులూ కొనేవాడుకాదు. తాతగార్లదగ్గర గారంపోయి కొనిపించుకునేవాడు. చదువుకోవల్సిన సమయాన్ని ఇలా వృధా చేస్తున్నాడని ఎన్నోసార్లు కోప్పడ్డాడు. ఒకరోజు తను ఆఫీసునించీ వచ్చేసరికి బాగా లేటైంది. హాల్లో టీపాయ్‍మీద రంగులూ, బ్రష్షులూ, అలాగే వున్నాయి. కొడుకు అప్పుడే భోజనం చేసి నాప్‍కిన్‍తో చేతులు తుడఉచుకుంటూ ఇవతలికి వచ్చాడు.
“అలాగే వుండనీమ్మా! రేపు తీసేస్తాను. చాలా టైర్డ్‌గా వుంది” అన్నాడు. ప్రసాద్‍కి కొడుకు వాటిని అలా వదిలెయ్యటం యిష్టంలేదు.
“నేను తీస్తాలేరా! ” అని భార్య అనేదేమో, ఆ అవకాశంకూడా యివ్వలేదతను.
అనేసాడు. “అన్నం తిన్నావా? చెయ్యీమూతీ కడుక్కున్నావా? తరవాత కడుక్కుంటానని అలాగే వదిలేసావా?” అని.
గదిలోకి వెళ్ళబోతున్న పెద్దకొడుకు ఆగి, దిగ్గుమని వెనక్కి తిరిగి చూసాడు.అతనికళ్ళలో అదోలాంటి భావం. వెంటనే వెనక్కి వచ్చి, టీపాయ్ క్లియర్ చేసి వెళ్ళాడు. ఆ మర్నాడు అతను వేసిన పెయింటింగ్ డస్ట్‌బిన్లో వుండలా కనిపించింది. అరుణ దాన్నీ తీసి సాపుచేస్తుంటే చూసాడు. కొడుకు చేతిలో మళ్ళీ బ్రష్ చూడలేదు.
ఆ సంఘటన ఇప్పుడెందుకు గుర్తొచ్చిందో అతనికి అర్థమవలేదు. ఆరోజుని తను కొత్తగా అన్నదీ లేదు, అన్నిసార్లు చెప్పినా వినని కొడుకు ఎందుకు పెయింటింగ్ వదిలిపెట్టేసాడో అర్థమయిందీ లేదు.
తోటివాకర్‍తో చిన్న చర్చ.
“మీ మిసెస్ వాకింగ్ చెయ్యరా?” అడిగాడు.
“తను ఆలస్యంగా లేస్తుంది. ఎనిమిదైపోతుంది. ఏవో హెల్త్ ఇష్యూస్. లేచాక నిదానంగా వెళ్తుంది”
“ఎందుకని అలా? పొద్దుటే నడిస్తే మంచిదికదా?” శోధన.
అతను నవ్వాడు. “అది ఆమె యిష్టం. ఆమెకి తెలీదా? చదువుకుంది, సోషల్‍మీడియాలో యాక్టివ్‍గా వుంటుంది. అన్నీ తెలుసనే అనుకుంటాను. ఐనా మోటివేట్ కావట్లేదంటే ఏదో సమస్య వుండి వుంటుంది. ఒకటిరెండుసార్లు అడిగాను నాతో రమ్మని. తను పట్టించుకోలేదు. పదేపదే అడిగి విసిగించడం దేనికి? నిన్నమొన్నటిదాకా కాలంతోపాటు పరుగుపెట్టి, ఎక్కడివాళ్ళనక్కడికి పంపించి తనుకూడా ఆఫీసుకి వెళ్ళిన మనిషే” అన్నాడు.
“ఆరోగ్యం పాడవదా?” ఇంకా ఏదో తెలుసుకోవాలని అడిగాడు. మనిషి తప్పో పొరపాటో చేస్తాడు. అలా చేసినట్టు మనసుకి స్పష్టంగా తెలుస్తుంటుంది. ఒప్పుకోవడానికి అహం వప్పదు. సమర్ధించుకొవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ప్రసాద్ చేస్తున్నది అలాంటి ప్రయత్నమే.
“ఎవరిది?” అతను మరింత నవ్వి అడిగాడు.
ఇంటికొచ్చాడు ప్రసాద్.
అరుణ అతనికోసమే ఎదురుచూస్తోంది.
రాగానే బ్రేక్‍ఫాస్ట్ వున్న హాట్‍పేక్, వాటర్‍బాటిల్ టీపాయ్ మీద పెట్టింది. ఫ్లాస్కుకూడా.
“హాలూ కిచెనూ తుడిచేసాను. మీపనులు కానిచ్చుకోవచ్చు. పనమ్మాయిని మార్చేసాను. ఇదివరకటి పిల్లకి పొద్దున్న ఏడింటితర్వాత రావటానికి కుదరదట. పిల్లల్ని బడికి పంపించాలట. ఇప్పుడంత పొద్దున్నే ఎవరూ చేయించుకోవట్లేదు. ఇంకో యిల్లు దొరకడం కష్టమని చెప్పింది. రెండిళ్ళే చేసేది. పిల్ల ఫీజులకి సరిపోయేది. ఇప్పుడిక మరోయిల్లు దొరక్కపోతే ఏం చేస్తుందో! ఐనా మనకెందుకులెండి? మనకి అనువుగా అన్నీ జరిగిపోవాలంటే మిగతావాళ్ళు ఎంతోకొంత నష్టపోతేనే సాధ్యపడుతుంది. కొత్తపిల్ల పదింటికి వస్తానంది. నేను వాకింగ్‍కి వెళ్తున్నాను” అంది.
“మరోమాట. నడవకపోతే నాకేదో పుట్టెడు అనారోగ్యం వచ్చి పడిపోతుంది, మీరు వైద్యం చేయించరన్న భయంతో వెళ్ళట్లేదు. నడవటానికి నేను వ్యతిరేకమూ కాదు. నాకా గంట నిద్రా చాలా అవసరం. సహజంగా మెలకువ రావటం రోజంతా నన్ను వుల్లాసంగా వుంచుతుంది. ముప్పయ్యైదేళ్ళ పరిశీలన నాది. మనం నిజాన్నీ, మారిపోయినరోజుల్నీ, పెరిగిన టెక్నాలజీనీ గమనిస్తే ఏ మనిషీ రెండోమనిషిమీద ఆధారపడి లేరన్న విషయం తెలుస్తుంది. మన పెద్ద వియ్యపురాలు… ఎవరూ అందుబాటులో లేని సమయంలో కాలు జారి పడిపోయింది. తనే అంబులెన్స్ పిలుచుకుని వెళ్ళి హాస్పిటల్లో చేరింది. ఆ తర్వాతకదా, అందరూ తలోవైపునించీ పరిగెత్తుకొచ్చింది? ఇక డబ్బు… కన్నతల్లికి వైద్యం చేయించకుండా వదిలేసేలా మన పిల్లలు పెరగలేదు. ఇలాగని విషయం చెప్తే మా నాన్న అప్పటికప్పుడు ఐదులక్షలు ట్రాన్స్‌ఫర్ చేసాడు. నాకు మీ డబ్బుకూడా అక్కర్లేదు. ఇవన్నీ మీరు గుర్తిస్తే మంచిది”
ఆమె వెళ్ళిపోయింది.
నువ్వా, నేనా అనే ప్రశ్న ఇద్దరిమధ్య తలెత్తినప్పుడు బంతి ఎప్పుడూ మన కోర్టులోనే వుంటుందన్న విషయం కొంచెం ఆలస్యంగా అర్థమైంది అతనికి. కొంచెం తగ్గడమా, అవతలివాళ్ళు తగ్గేదాకా వదలకపోవటమా అనేదానిమీద బంధాలు నిలబడి వుంటాయి. మొదట కొడుకు, ఇప్పుడు భార్య.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
Can I simply say what a comfort to discover someone who genuinely understands what they are talking about online. You definitely realize how to bring a problem to light and make it important. More people need to read this and understand this side of your story. I cant believe you arent more popular because you definitely possess the gift.