(ఆంధ్రభూమి, మాసపత్రిక నవంబర్ 2007)
“కూరలో ఉప్పు లేదు” ఎన్నోసార్లు విందామె మాటలని తన జీవితంలో. పుట్టింట్లో ఉప్పు తక్కువ తినడం అలవాటు. అదే అలవాటుకొద్దీ ఇక్కడ మరపుగా తక్కువేస్తే ఎవరూ తినరు.
“మనిషికి స్వార్థం వుండకూడదు” ఈమాటల్నీ అన్నారు. కానీ తప్పని తనకి తనే అర్ధం చేసుకుంది. స్వార్థం లేకపోతే ఏదీ నాదనుకోవడం ఉండదు. నాదనుకోకపోతే ప్రేమా ఉండదు. అప్పుడు జీవితానికి గమ్యంగానీ, అర్ధంగానీ ఉండవు. అలాంటి అర్థరహితమైన జీవితంలో ఎడారిలో వంటరి బాటసారిలా ప్రయాణించి అప్పటికి ఆచోటుకి చేరుకుంది ఆమె… సుగుణ.
నారాయణమూర్తి చనిపోయి ఆవేళ్టికి పదకొండోరోజు. వచ్చిన చుట్టాలంతా చాలావరకు వెళ్లిపోయారు. చాలా ముఖ్యమైనవాళ్లు మాత్రం మిగిలారు. వాళ్లంతా హాల్లో కూర్చొని ఒక విషయంమీద తీవ్రంగా చర్చిస్తున్నారు.
నారాయణమూర్తికి ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. మొదటిభార్య చనిపోతే సుగుణని రెండోపెళ్లి చేసుకున్నాడు. సుగుణకి పిల్లలేరు. పిల్లల్లేని కారణాన ఆమె జరిగిన తతంగమంతట్లోనూ అప్రధానంగానే ఉంది. పదోరోజు కార్యక్రమం మాత్రమే ఆమె చుట్టూ తిరిగింది.
తెల్లటి నేతచీర కట్టుకుని హాలుకి ఆనుకుని ఉన్న చిన్నగదిలో నేలమీద, మోచేతిని తలకింద ఉంచుకుని పడుక్కుని ఉంది. నిద్రపోవట్లేదు. హాల్లో జరుగుతున్న చర్చలు తన గురించేనని అర్థమౌతోంది. ఏం జరుగుతుందోనన్న కుతూహలం తప్పించి పెద్దగా బాధేం లేదు ఆమెలో. తనది కాని సంసారాన్ని ఎన్నో ఏళ్లు మోసింది. అవసరానికేతప్ప మరెందుకూ తనని ఎప్పుడూ ప్రేమించని భర్త తాలూకూ వైధవ్యాన్ని ఇప్పుడు మోస్తోంది. ఇంత చేసినా భర్త పోగా మిగిలిన సంసారంలో తనకెక్కడా చోటు కనిపించడం లేదు. అతనిది ప్రైవేటు ఉద్యోగం, పెన్షను రాదు. సంపాదించి మిగిల్చినది లేదు. రిటైరయ్యాకకూడా చాలారోజులు చిన్నాపెద్దా వుద్యోగాలు చేసాడు అతను. కొడుకులు కొద్దిగా పంపేవారు. కష్టమ్మీద ఇల్లు నడిచేది. చివర్లో పక్షవాతం వచ్చింది. తప్పదన్నట్టు పెద్దకొడుకు తీసుకెళ్ళాడు. పిల్లలకి తండ్రంటే ప్రేమలేక కాదు, తండ్రివెంట వుండే సుగుణని చూసి ఆ ఎడం.
ఏడాదిపాటు మంచంలో వున్నాడు నారాయణమూర్తి. అతని సేవలు సుగుణకి తప్పలేదు. పైనుంచీ ఇంటిపనంతా చేయించేది కోడలు. వెసులుబాటు వున్నా సాయానికి మనిషిని పెట్టాలని ఎవరికీ అనిపించలేదు. అందరూ ప్రమాణం చేసుకుని తనని బైటిమనిషిగా చూస్తున్నారని అర్థమైంది సుగుణకి.
ఆమె ఉనికి అందుకే ప్రశ్నార్థకంగా మారింది.
“ఎక్కడుంటుందో ఆవిడనే అడిగితే సరి” అన్నాడు పెద్దకొడుకు..
“అడగడందాకా ఎందుకు? ఆవిడ పుట్టింటివైపు మాత్రం ఎవరున్నారు? ఏదేనా వృద్ధాశ్రమంలోనో చేర్పిద్దాం” రెండోకొడుకు అన్నాడు.
“ఆవిడ వంటిమీదున్న బంగారం మాటో? ముందూవెనుకా ఆలోచించకుండా అమ్మదంతా ఆమెకే ఇచ్చేశాడు నాన్న” చిన్నకొడుకు విసుక్కున్నాడు.
“వచ్చేది తలో రెండుతులాలే అవచ్చుగానీ, అది అమ్మ జ్ఞాపకంగా మనకి చెందాలి”
“పెద్దవాళ్లింత తెలివితక్కువపనులెందుకు చేస్తుంటారో? నలభైయ్యైదేళ్లొచ్చాక నాన్నెందుకు రెండోపెళ్లి చేసుకున్నట్టు?””
“ఎప్పుడో జరిగినదాని గురించి ఇప్పుడెందుకులేరా? కృప పెళ్లయ్యాక అంతంత గొడవలొస్తేనే ఇవ్వని మనిషి ఇప్పుడు అడిగితే తీసిస్తుందా? అడిగి, నలుగుర్లో పరువుపోగొట్తుకోవడం తప్ప? అదంతా అమ్ముకుని బేంకులో వేసుకుని ఆవిడ బతుకు ఆవిడని బతకమందాం. సరిపోతుంది” పెద్దకొడుకు తీర్మానించాడు. ఇవతలిగదిలో సుగుణ నిట్టూర్చింది. జరిగిన విషయాలు ఒక్కొక్కటీ గుర్తొస్తున్నాయి.
తనకన్నా దాదాపు పదిహేనేళ్ళు పెద్దవాడిని చేసుకుంది సుగుణ… కోరీ, వలచీ కాదు… కట్నం ఇవ్వలేక… ఎంతకీ పెళ్లవ్వక… పెద్దవాళ్లు బలవంతపెట్టడంచేత. ఆ పెళ్లిలో నారాయణమూర్తి పెద్దభార్య నగలు… నగలంటూ పెద్దగా లేవు. రెండు జతల గాజులు, సూత్రాల గొలుసు, నల్లపూసలు, దుద్దులు, ఉంగరం అన్నీ కలిపి పదికాసులదాకా సుగుణమ్మకి పెట్టాడు. అతను అన్నీ అనుభవించినవాడవ్వటం, తనుకూడా ముప్ఫైలో ఉండటంచేత ఆమెపట్ల శృంగారనాయకుడవ్వలేదు. పైగా కుటుంబబాధ్యతలు ఆమెకి అతనిపట్ల ప్రేమ పుట్టలేదు. ఇకపోతే పిల్లలు. వాళ్లని చూస్తుంటే పుట్టింట్లో తన తమ్ముడూ, చెల్లెలూ గుర్తొచ్చేవారు. అక్కడ వాళ్లమధ్య తనకి సమానత్వం ఉండేది. ఇక్కడ వీళ్లమధ్య తనకి సమానత్వం మాట అటుంచి పదిలమైన చిన్నచోటుకూడా కనిపించేది కాదు.
పైగా నారాయణమూర్తి ఆమెని నిత్యం ఒక అనుమానభావంతోటే చూసేవాడు. పిల్లల్ని సరిగ్గా చూస్తోందా లేదా? ఎదిగిన మగపిల్లల్తో హుందాగా వుంటోందా? అనవసరంగా పెళ్ళి చేసుకున్నాడేమో! ఇలాంటి ఆలోచనలు అతన్ని సతమతం చేసేవి. అతని పిల్లలకి అది వాళ్ళిల్లు. ఇంట్లో సర్వహక్కులూ ఉండేవి. తల్లిలేని పిల్లలన్న జాలి కూడా పుష్కలంగా లభించేది. సుగుణదిమాత్రం ఒక విచికిత్సలో వున్న స్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్లకీ ఆమెకీ మధ్య అనుబంధం పెరగలేదు. అన్నీ ఒక బాధ్యతగా చేసేది. ప్రేమరహితమైన బతుకు నిస్సారంగా అనిపించేది. అలా ఉండటం దుస్సాధ్యం కాబట్టి తనని తను ప్రేమించుకోవటం అలవాటుచేసుకుంది. తనకి పిల్లలేకపోవటం ఆమెని తీవ్రంగా బాధించేది. పెద్దతనంలో ఎలాగన్న భయం అభద్రతాభావంలోకి నెట్టేసేది.
సుగుణతో తన పెళ్లయిన పదేళ్ళకి నారాయణమూర్తి కూతురి పెళ్ళి చేశాడు. ఒక్కగానొక్క కూతురు సుఖపడాలని కొంచెం పెద్ద సంబంధానికే వెళ్లాడు. వాళ్లడిగినవన్నీ ఇచ్చేందుకు తన స్థాయిని కుదించుకున్నాడు. అక్కడినుంచీ సుగుణలో సంఘర్షణ మొదలైంది. ఇబ్బందులుపడటానికా, తను రెండోపెళ్లివాడిని చేసుకున్నది? ఉన్నదంతా ఊడ్చి కూతురికే పెట్టేస్తే ముందుముందు ఎలా? భర్తకేదేనా జరిగితే ఆ తర్వాత మిగిలే తనని… ఎవరు చూస్తారాని మధనపడేది. భర్త చేసే ఖర్చులకి అభ్యంతరపెట్టడం ప్రారంభించేసరికి అప్పటిదాకా ఆమెలో తెరమరుగుగా ఉన్న స్వచింతన స్వార్థంగా బహిర్గతమైంది. అందరి దృష్టిలోకీ వచ్చింది.
నారాయణమూర్తి కూతురు కృప. ఆ పిల్ల పెళ్లై వెళ్లినప్పట్నుంచే అత్తవారింట్లో గొడవలు. మనుషుల్ని వెన్నెముకగల ప్రాణులుగా చెపుతుంది సైన్సు. కానీ వాళ్లలో సగంమంది వెన్నెముక లేని ప్రాణులే. వెన్నెముక అనేది భౌతికంగా కనిపిస్తూనే ఉంటుంది. మనిషి నిఠారుగా నిలబడే ఉంటాడు. వ్యక్తిత్వంమాత్రం మరొకరి ప్రభావంలో ఉంటుంది. అందుచేత వ్యక్తిత్వపరంగా కృంగిపోయే ఉంటాడు. అలాంటివాడు కృప భర్త మధు. తల్లి అతని వ్యక్తిత్వానికి వెన్నెముక. ఆవిడెలా చెప్తే అలా. ఎంత చెప్తే అంత.
ముగ్గురు మగపిల్లలమీద ఒక్కర్తే ఆడపిల్లగాబట్టి పెట్టుపోతలనీ ఘనంగా జరుపుతారని ఆశించి చేసుకున్నాడు మధు, కృపని. అతని అంచనాలకీ, ఆమె తెచ్చినదానికీ మధ్య అగాథమంత వెల్తి ఉండేది. దాన్ని నింపమని ఆమెని వేధించేవాడతను. అతను ఆశించినంత తన పుట్టింట్లో లేదని చెప్పడానికి ఆమెకెలాంటి అవకాశం ఇచ్చేవాడు కాదు. కొట్టేవాడు. కొట్టి పుట్టింటికి పంపించేవాడు. తండ్రి దగ్గర ఏడ్చేది కృప. ఉన్నంతలో ఇచ్చి పంపేవాడతను. మళ్లీ గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చేది. ఇలా కొంతకాలం సాగాక తాజాగా బైకుకోసం ఇండెంటు పెట్టాడు మధు. అప్పటికే డబ్బొచ్చే అన్నిదారులూ మూసుకుపోయాయి నారాయణమూర్తికి. భార్యని బంగారం ఇమ్మని అడిగాడు ఆఖరిదారిగా.
“నేనివ్వను.” కచ్చితంగా చెప్పింది సుగుణ.
“దాని కాపురం నిలబెట్టు” అహం విడిచి బతిమాలాడు.
“తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత? ఊడితే ఎంత? దాన్ని పట్టుకుని ఎంతకాలం తిరగ్గలం?” అంది.
“ఏదో ఒకటి చేసి ఇస్తే మళ్లీమళ్లీ అడగనని నామీద వట్టేసి చెప్పారు పిన్నీ” కృప ఏడ్చింది. ఐనా ఆమె కరగలేదు. “అవి మా అమ్మవి. నువ్వేసుకుంటే నీవైపోతాయా?” నిస్సహాయకోపంతో బెదిరించింది.
“మీ నాన్న నాకిచ్చాడు” నిర్లక్ష్యంగా జవాబిచ్చింది సుగుణ. అంతేకాదు. “ఇప్పటికే చాలా పెట్టాం. ఉన్నవన్నీ అమ్ముకున్నాం. అప్పులూ చేశాం. ఇంకా యింకా తెమ్మంటే ఎక్కడినుంచి వస్తుంది? మగపిల్లల చదువులింకా అవ్వలేదు. మారోజులు వెళ్ళాలి” నారాయణమూర్తి చెప్పలేకపోయిన మాటల్ని తను చెప్పింది.
“నీ పుట్టింటిదేం నాకు తెచ్చి పెట్టడంలేదుకదా, పిన్నీ? మా అమ్మవి వేసుకుని తిరగడానికి నీకెంత సిగ్గులేదు?… ఇదే మా అమ్మే అయితే అడక్కుండానే అవసరం ఎరిగి తీసిచ్చేది. అందుకే సవిత్తల్లి… అంటారు” నిరసనగా అంది కృప.
“నలుగురుపిల్లల తండ్రిని, వయసు మీరినవాడిని చేసుకున్నందుకుగాను, మీ అందరికీ చాకిరీ చేసేందుకుగాను పెట్టారు. అంతేగానీ దయాధర్మంగా పెట్టలేదు. నేను స్వతంత్రించి తీసుకోనూలేదు.” అనేసింది సుగుణ ఠకీమని. అలా అనటానికి ఆమే ఏమీ సంకోచపడలేదు. పిడికిలి మూసినంతకాలం అందులో ఏముందోనన్న కుతూహలమే ఉంటుంది. నారాయణమూర్తికి భార్య మనసులోని భావాలు కచ్చితంగా తెలీవు. ఆమె తనని గౌరవిస్తోందో లేదో కూడా తెలీని పరిస్థితి. అంత వుదాశీనత ఆమెలో. ఆ తెలీనితనం ఆమెమీద అతనికి కొంత పట్టునిచ్చింది. ఇప్పుడా పట్టు జారిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో భార్య పోయి అస్తవ్యస్తంగా తయారైన ఇల్లు నడవాలంటే పెళ్లవ్వాలి. పెళ్లయితేనే చాలని ఉన్నదేదో పెట్టేశాడు. భార్యేకదా అనుకున్నాడు. మొదటిభార్యకి ప్రత్యామ్నాయం అనుకున్నాడు. మొదటామె ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీటిని తాకట్టుపెట్టాడు. ఎప్పుడూ ఎందుకని అడగకుండా తీసిచ్చింది. సుగుణకూడా అంతేననుకున్నాడు. కాదని తెలిసేసరికి తల తిరిగిపోయింది.
ఎంత స్వార్థం ఈమెలో? తను మళ్లీ పెళ్లిచేసుకుని పిల్లలకి అన్యాయం చేశాడా? దిగ్భ్రాంతి చెందాడు.
మధుకి సమాధానం చెప్పలేకపోయాడు. కృప పుట్టింట్లోనే ఉండిపోయింది. గృహహింస కేసు పెట్టాలన్న ఆలోచన ఎవరూ ఇవ్వలేదు నారాయణమూర్తికి. అతను అలాంటి కేసు పెట్టకుండా రెస్టిటూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్‌నుంచీ అన్ని కేసులూ తనే వేసి ఇంత అలిమనీ పడేసి విడాకులిచ్చి మరో పెళ్లిచేసుకున్నాడు మధు. కృపకింక మరో మార్గం లేకపోయింది. కంప్యూటర్ నేర్చుకుని డాటా ఎంట్రీ ఆపరేటర్‍గా ఒక చిన్నసంస్థలో చేరింది. రెండుమూడు కంపెనీలు మారి అదే వృత్తిలో స్థిరపడిపోయింది.
“పిన్ని విషయంలో తర్జనభర్జన అనవసరం. ఆమెని తీసుకెళ్లి నా దగ్గిరుంచుకుంటాను” అన్నదమ్ముల తర్జనభర్జనల మధ్య మంద్రస్థాయిలోనే అయినా స్థిరంగా కృపగొంతు వినిపించి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచే తేరుకుంది సుగుణ.
“పిన్ని నాకు మంచే చేసిందో, చెడే చేసిందో! ఆరోజున ఆవిడ బంగారం అమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్లి ఉంటే ఈ రోజుని ఇలా ఉండేదాన్ని కాదు.. మననుంచీ ఇంక డబ్బు రాదని తెలిసి బావే నన్నేదైనా చేసినా, అతను పెట్టే బాధలు తట్టుకోలేక నా అంతట నేనే ప్రాణం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆవిడది స్వార్థమే కావచ్చు… అందులోంచే నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను. నాకంటూ ఒక ఉద్యోగం, సంపాదనా ఉన్నాయి ఈరోజుని. నిత్య దండన తప్పింది” అంది కృప.
“అందుకని ఆవిడని దగ్గిరుంచుకోవడం దేనికే? నీకిలా జరిగిందని ఏ రోజేనా బాధపడిందా ఆ మనిషి?” పెద్దకొడుకు రోషం.
“పోన్లేరా, పెద్దది. నాకూ ఓ తోడు కావాలి”
“తోడుకోసమని ఆవిడ భారం మెడకేసుకుని మోస్తావా? ఎవరేనా ముందుకొచ్చి చేసుకుంటారేమోనని నీకు నేను సంబంధాలు చూస్తున్నాను” అతని జవాబు.
నెమ్మదిగా ఇవతలికొచ్చింది సుగుణ. వాళ్ళ సంభాషణలో కలగజేసుకుంది. “మీ అమ్మగారు నా స్థానంలో ఉండి ఉంటే అప్పుడు కూడా ఇలాగే అనేవారా బాబూ?” మెత్తగా అడిగింది.
అప్పటిదాకా ఆమెని గమనించని వాళ్లంతా కంగారుపడి సర్దుకున్నారు.
“కృపకోసమని నా వంటిమీదివి తీసివ్వలేదని మీకందరికీ కోపంగా ఉంది. కాదనను. ఆ విషయం మన కుటుంబంవరకే తెలుసు. ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్లున్నారు. ఇప్పుడు విన్నారు. వాళ్లలో ఒక్కరేనా ఈ చర్చ తప్పని చెప్పారా? చెప్పలేదు. చెప్పరు. ఎందుకంటే సవిత్తల్లిని కాబట్టి. ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను”” అంది.
“నువ్వు నాకు మంచే చేశావు పిన్నీ! ఆలస్యంగానేనా ఆ విషయాన్ని గుర్తించాను. నాకు నీమీద ఎలాంటి కోపంలేదు. నాతో తీసుకెళ్తాను. వచ్చెయ్” అందర్లోకీ ముందుగా తేరుకుని అంది కృప. ఆ అనటంలో ఎలాంటి ఆరాటం లేదు. కృతజ్ఞత, ఆర్తిలాంటి భావాల్లేవు. తండ్రికీ తద్వారా తమకీ కావల్సిన వ్యక్తి అనే మమకారం లేదు. తమ కుటుంబానికి ఆమె ఎంతో కొంత చేసి, తల్లి పోయాక చెదిరిపోకుండా నిలబెట్టిందన్న ఆప్తభావం కూడా లేదు. ఆమెకోదారి చూపిస్తున్నానన్న ధోరణిలో అంది. అంతే!
“నేనెవరి దగ్గిరకీ రాను కృపా! నావంట్లో ఇంకా ఓపికుంది. పదిమంది పిల్లల్ని చేరదీసి బేబీసెంటరు పెట్టుకున్నా బతకగలను. మిమ్మల్ని నలుగుర్నీ, అక్కడ మా తమ్ముణ్నీ చెల్లెల్నీ పెంచిన అనుభవం ఉంది. చాలు. మీకు చిన్నతనం అనిపిస్తే నేను మీ మనిషినని చెప్పుకోకండి” అంది సుగుణ. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కొద్దిరోజులు బలవంతం పెట్టి తనతో తీసుకెళ్లింది కృప. ఆ తర్వాత వచ్చేసింది సుగుణ.
“ప్రతిమనిషిలోనూ నేను అనే ఇంకో వ్యక్తి వుంటారు కృపా! ప్రేమ, దయ ఇవన్నీ ఆవ్యక్తికి కావాలి. కోరుకున్నదేదీ దొరకనప్పుడు ఆ వ్యక్తి బయటకి వచ్చేస్తాడు. అతన్నే అంతా స్వార్థం అంటారు. మీకు నాలో అదే కనిపించింది. పేదరికంలో పుట్టడంచేత కావచ్చు, ఆడపిల్లగా పుట్టి వాళ్ళకి అనవసరమైన బాధ్యత కలగజేసానని కావచ్చు, నాకు నా పుట్టింట్లో ఎలాంటి ప్రేమా దొరకలేదు. పెళ్ళై మీ యింటికి వచ్చినా, మీ నాన్న నాపట్ల కనీసపు ప్రేమకూడా చూపించలేదు. మీకు… మీ అమ్మెవరో, ఆవిడ మీకోసం ఎలా సర్దుకుపోయేదో తెలుసు. నేనుకూడా అలా వుండాలని ఆశించారే తప్ప మీరు ఆవిడతో వున్నట్టు అరమరికలు లేకుండా నాతో వున్నారా?” వచ్చేముందు అంది. “నేను ఏవీ తెంపుకుని వెళ్ళట్లేదు. మీకు ఏ అవసరం వున్నా నన్ను పిలిస్తే వస్తాను”
కృప ఆమెని ఆపగలిగేంత బలమైన జవాబు లేదు. “నాలోంచీ కూడా ఆ నేను బయటపడ్డాకే నువ్వు కొద్దిగా అర్థమయావు పిన్నీ!” అని మాత్రం అనుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.