(ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక – 16/05/2002)
“నీ భార్య చాలా అందంగా ఉంది. ఉద్యోగం కూడా చేస్తుందన్నావుగా జాగ్రత్త సుమా! భార్యా రూపవతీ శత్రు” అంటూ పెళ్ళివాళ్ళు టీ టైంలో పెట్టిన స్వీట్లు తినేస్తూ వాగుతున్నాడు రామనాధం.
అప్పుడే పురుగు బుర్రలోకి ఎక్కినట్టుగా శేషు మొహం ఎర్రగా తయారైంది.
“నువ్వేం ఫీలయిపోకు, కాస్త మన కంట్రోల్ స్ట్రాంగ్‍గా ఉందనుకో ఏం జరగదులే! ప్రతివాడి కళ్ళూ బయటికి వెళ్లే ఆడవాళ్ళమీదే. వీళ్ళు కొంచెం ఆకర్షణలో చిక్కుకున్నారనుకో మన కొంప కొల్లేరు అయిపోతుంది. అందులో మీ ఆవిడ బ్యాంకు ఉద్యోగిని. పబ్లిక్‍తో బాగా టచ్ ఉంటుంది. నీ జాగ్రత్తలో నువ్వుంటే ఏమీ కాదులే” అంటూ లేచాడు రామనాధం.
“అరేయ్! అలా అనేసి వెళ్ళిపోతే ఎలా? ఆ జాగ్రత్తలు ఏంటో చెప్పు” అంటూ ఆపాడు శేషు.
“అప్పుడప్పుడు చెయ్యి ఝాడిస్తే సరి. వాళ్ళే దారిలో ఉంటారు” అంటూ వెళ్ళిపోయాడు రామనాధం.
శేషు, రమ్యల కాపురం బాగానే ఉందికానీ, శేషు మనసులో అనుమానం అప్పుడప్పుడు మాటల రూపంలో ముల్లులా గుచ్చుకొంటూ ఉండేది రమ్యకు. ఆఫీసు నుండి అలసిపోయి వస్తే, “ఏం చేసి అలసిపోయావు?” అన్నట్టు మాట్లాడుతాడు. ఉత్సాహంగా వస్తే “అందమైనదానివి కదా! నీతో ఎవడు పని చేయిస్తాడు?” అని ఎగాదిగా చూస్తాడు. ఏమిటో ఇతని మనస్తత్వం అనుకుంటూ రాజీపడుతోంది రమ్య.
అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉండి పెళ్ళిచూపుల పరీక్షలో మొదటిసారే నెగ్గి, ఉన్న ఊళ్ళో సంబంధం, అందరితో కలసిమెలసి ఉండవచ్చు అని అనుకొంటూంటే ఇతని దృక్పథంలో ఏదో తేడా కనిపిస్తుంది. తన భార్య అనే సొంతభావనతో తనగురించి మాత్రమే ఇలా ఆలోచిస్తాడా, లేక అందరి ఆడవాళ్ళ గురించి ఇలాగే ఊహించుకొంటాడా, అని మధనపడుతూ, కాలం ఇతనిలో మార్పు తెస్తుందిలే అని ఆశిస్తూ, నీరసపడిన మనసుని సముదాయించింది.
“అయ్యో! ఈరోజు బాగా లేటయ్యిందండీ, క్యాష్ బాలన్స్ కుదరలేదు” అంటూ సంజాయిషీ చెపుతూ లోపలికి వచ్చిన రమ్య వైపు తేరిపారా చూశాడు శేషు. అలసి ఆఫీసు నుండి వచ్చిన రమ్యలో ఏదో ఆకర్షణ కనబడి మనసు ఉక్రొషంతో మండిపడింది.
“ఏం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయట్లేదా? వాడివైపు, వీడివైపు దొంగచూపులు చూడడం మానేస్తే, పని సరిగ్గానే సాగుతుంది.” అంటూ విరుచుకుపడ్డాడు శేషు.
“ఛ, ఛ! ఏం మాటలండీ? అలా బయటకు వెళ్లే ఆడవాళ్లందరికీ ఎవరో ఒకరితో సంబంధాలు అంటగడితే ఎలా? మీరూ ఒక ఆడపిల్ల తండ్రి అయ్యారు. ఇప్పుడైనా కనీసం మమ్మల్ని గౌరవంగా చూడడం నేర్చుకోండి” అంటూ క్రెచ్ నుంచి తీసుకొచ్చిన పాపని క్రిందకు దింపడానికి ఒంగింది రమ్య.
“ఏం కూశావ్! నీకు, నా కూతురికి పోలికా? నా కూతురు నిప్పు. నా రక్తం పంచుకు పుట్టింది. అయినా నీకు మాటలు బాగా మీరాయి” అంటూ వంగి ఉన్న రమ్య వీపు మీద రెండు దెబ్బలు వేసి, బయటకి నడిచాడు శేషు.
అర్ధరాత్రిదాకా బార్లో తాగిగాని ఇంటికి చేరలేదు శేషు. అలాంటి రాత్రుళ్ళు ఎన్నో అలవాటయ్యాయి రమ్యకు.
ఎంతో హాయిగా, ఇద్దరి సంపాదనతో, బాదరబందీ లేకుండా గడపవలసి జీవితం ఇంత వ్యధాభరితంగా తయారవుతుందని ఆశించని రమ్య లోలోపల రోదిస్తూ, రోజులు వెళ్లదీస్తుంది. ఉద్యోగం మానడంవలన ఈ మాత్రం ఆధారం కూడా ఉండదని ఆ పని చేయకుండా అతికష్టం మీద గడుపుకొస్తోంది.
శేషు తాగుడు ఇంకా ఎక్కువైంది. తద్వారా రమ్యను హింసించడం కూడా ఎక్కువైంది. ఈ పరిస్థితులలో మరో బిడ్డకు కూడా తల్లయింది రమ్య. ఈసారి మగబిడ్డ అవడంతో “తన్నేవాళ్ళు, తన్నించుకొనేవాళ్ళు ఇద్దరూ పుట్టారు నా ఖర్మ! ఇంతే చాలు. ఇకనైనా జాగ్రత్త పడాలి. వీళ్ళని సవ్యంగా పెంచగలిగితే చాలు” అనుకొంటూ రోజులు వెళ్లదీస్తోంది.
ఈ చికాకులతో చిక్కి శల్యమవుతున్న భార్యను చూసి, “దీని అందం ఇంకా పెరుగుతుందే! అయినా నాకు భయపడి, వెధవ్వేషాలు ఏమీ వెయ్యదులే. ఏదో ఆ రామనాధంగాడు చెప్పబట్టి, ఈ మాత్రం కంట్రోల్లో ఉంచుకొన్నాను” అని తనను తాను మెచ్చుకొంటూ, తాగుతూ, తిరుగుతూ, రమ్యను హింసిస్తూ ఇంకో రెండు సంవత్సరాలు గడిపాడు. తాగుడు ఎక్కువై, ఆఫీసుకి తాగి వెళ్లడం, ఆఫీసు డబ్బు కొంత సొంత ఖర్చుకి వాడుకోవడంతో ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. తన ఖర్చులకి కూడా రమ్యమీద ఆధారపడి, ఇంకొంచెం ఎక్కువగా మందు కొట్టడం మొదలుపెట్టాడు.
సడన్‍గా ఒకరోజు ట్రాన్స్ఫర్ వచ్చిందని, వేరే ఊర్లో వెంటనే జాయిన్ అవ్వాలని, పిల్లలతో సహా బయలుదేరింది రమ్య. వెళ్ళగానే డబ్బు పంపిస్తానని, ఇక్కడ అన్నీ సెటిల్ చేసేసి సామాన్లు తీసుకురమ్మని చెపుతూ “కొంత డబ్బు చేతి ఖర్చుకి ఉంచండి” అంటూ వెళ్ళింది.
వెళ్లి పదిహేను రోజులు గడుస్తున్నా రమ్య ఉత్తరం రాయలేదు. మత్తులో ఉండి ఏ ఊరో అడగలేదు. అయినా అదెక్కడికి పోతుంది? ఎవరితో పోతుంది? నాలుగురోజులు ఓపిక పడదాం. చేతిలో డబ్బులున్నాయిగా అనుకుంటూ కాలం గడపసాగాడు శేషు. సరిగ్గా రమ్య వెళ్లిన నెల రోజులకి పోస్ట్ అంటూ పోస్టుమ్యాన్ వచ్చి ఇంటి ముందు నిలిచాడు. డబ్బు వచ్చి ఉంటుందనుకొని, ఆత్రంగా బయటకు వచ్చాడు శేషు.
“ఇదిగో మీ ఉత్తరం” అంటూ చేతిలో పడేసి పోబోయాడు పోస్టుమ్యాన్. ఉత్తరం ఓ మూలకు విసిరేస్తూ, “డబ్బు ఏమీ రాలేదా?” అంటూ పోస్టుమ్యాన్ వెంటబడ్డాడు శేషు.
“వస్తే ఇవ్వనటండీ, మీ చాదస్తంగాని” అంటూ విసుక్కొని వెళ్ళిపోయాడు అతను.
ఇంట్లో ఉన్న ఒక్కొక్క సామాను అమ్మేస్తూ, “ఈ రమ్య ఎక్కడికి చచ్చిందో?” అని విసుక్కొంటూ కాలం గడపసాగాడు శేషు.
రమ్య ముందు పనిచేసే బ్యాంకుకి వెళితే, “నువ్వేం మొగుడివయ్యా! ఆమె ఇక్కడ ఉద్యోగం రిజైన్ చేసి, దాదాపు రెండు నెలలవుతోంది. వ్యక్తిగత కారణాలతో మానేసింది. నువ్వు తాగి, ఆ అమ్మాయిని తంతావని మాకు తెలుసు. ఆమె ప్రాణం తీసేసి, ఏదైనా నాటకం ఆడుతున్నావా? పోలీసులని పిలవమంటావా?” అని తిరిగి శేషుని వాయించాడు మేనేజర్.
“లేదండీ, ఏదో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందని, పిల్లలను తీసుకొని మరీ వెళ్ళింది. నామీద అలిగి ఉంటుంది” సర్ది చెప్పి బ్రతుకుజీవుడా అని బయటపడ్డాడు శేషు.
రమ్య పుట్టింటికి వెళితే, రెండునెలలనుండీ, కూతురు రావడం లేదేమని, తిరిగి వాళ్ళే శేషుని అడిగారు.
నోరు నొక్కుకొని అక్కడి నుండి ఎలాగో బయటపడ్డాడు. తాగిన శరీరం, మత్తులో మునిగిన మనసు ఆలోచించనివ్వటంలేదు. బ్యాంకు దగ్గర తెలిసిన విషయాలనుబట్టి, రమ్య చాలా మంచిదని, తానే అనవసరంగా విసిగించానేమో అని అనుకొంటూ ఇంటికి చేరి తాళం తీశాడు శేషు.
ఎప్పుడో నెలక్రితం మూలకి విసిరికొట్టిన ఉత్తరం ఎగిరి వచ్చి కాళ్ళకి అడ్డం పడింది. ఇంతకీ ఈ ఉత్తరం ఎవరిదో అంటూ తెరిచాడు. లోపల చూస్తే అది రమ్య సంతకంతో ఉన్న ఉత్తరం.
శేషూ!
నీకొక పేరు ఉంది కాబట్టి సంబోధిస్తున్నాను. ఆ గౌరవానికి నువ్వు ఎంత మాత్రం అర్హుడవు కాదు. నీకు సహనం చాలా తక్కువ అని నాకు తెలుసు. అయినా ఈ ఉత్తరం పూర్తిగా చదువు. లేకపోతే నష్టం నీకే. అనగనగా ఒక కాకి ఉండేది మీ రామనాధంలా. అది ఒకరోజు ఒక మర్రిపండుని తీసుకువచ్చి దేవాలయం మీద కూర్చొని తిన్నది. గింజని అక్కడే వదిలిపెట్టింది. అది మాత్రం హాయిగా కడుపునిండిన తృప్తితో రెక్కలు ఆడించుకొంటూ ఎగిరిపోయింది. మాళ్ళు పెట్టిన భోజనం తృప్తిగా ఆరగించిన నీ స్నేహితుడిలాగా. అది విడిచిన గింజమాత్రం ఆ గోడమీద పగులులోకి జారుకుని, మట్టిలో కూరుకుపోయింది. ఎండకి ఎండి, వర్షానికి తడిచి, మొలకెత్తి, మొక్కయ్యింది. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో, వృక్షమయ్యింది. వేళ్ళు దేవాలయం గోడలంతా విస్తరించాయి. ఊడలు దిగాయి. కొన్ని రోజులకు దేవాలయం కూలిపోయింది. నీ తలలోకూడా నీ స్నేహితుడు, నీ శ్రేయోభిలాషి వేసిన బీజం మహావృక్షమై, నిన్ను నిలువెల్లా కూల్చేసింది. నీ అనుమానరోగంతో నన్నూ హింసించావు. పిల్లలనూ అకారణంగా కొట్టావు. ఉద్యోగినులమీద, అందమైన ఆడవాళ్ళమీద ఇన్ని సత్యాలు చెప్పిన నీ కాకి, తన భార్య నాకన్నా అందమైనదని, నాకన్నా మంచి ఉద్యోగం చేస్తుందని మర్చిపోయింది. నువ్వుకూడా గ్రహించుకోలేకపోయావు. మెల్లిమెల్లిగా నీ ఇన్ఫ్లుయెన్స్ పిల్లలమీద కూడా పడుతుంది. మూడేళ్ళవాడు అయిదేళ్ళ అక్కని కొట్టడం మన ఇంట్లోనే జరుగుతోంది.
అక్కని కొట్టడం తప్పు కాదా- అంటే
నిన్ను నాన్న కొట్టడంలేదా- అంటూ అడుగుతున్నాడు. నీ ప్రభావంలో పెరగడంకన్నా పిల్లలకి తండ్రి ఛాయ లేకుండా చేయడం ఆరోగ్యకరం అని నిర్ణయించుకొన్నాను. మేం చదువుకోవడం, ఉద్యోగం చేయడం, మా వ్యక్తిత్వ వికాసానికి కాకుండా, మీ జల్సా ఖర్చులకి, మీరు పెట్టే హింసని భరించడానికైతే అలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఆడపిల్లలందరికీ నేను చూపించే జవాబు ఏమిటో తెలుసా? మొగుడ్ని వదిలేసి ఉద్యోగం చేసుకోమని.
పదిహేడు సంవత్సరాల విద్యార్జన, ఆరేళ్ళ ఉద్యోగవిధి, ఆరేళ్ల దాంపత్య జీవితంలో నేను సాధించింది నీ నిరాదరణ, నీవు వేసే నిందలు, ఇద్దరు పిల్లలు అయితే, వుద్యోగంలోమాత్రం నా ధర్మం క్రమంగా నిర్వర్తించినందుకు, నాకు ఓవర్ సీస్ బ్రాంచ్ ప్రమోషన్‍తో పోస్టింగ్ వచ్చింది. నీకు ఈ ఉత్తరం అందేటప్పటికీ నేను వేరే దేశంలో ఉంటాను. ముందు బొంబే వచ్చి అక్కడినుండి ఆర్డర్లు తీసుకోమని నాకు తెలియచేశారు. ఈ స్టేట్‍నుండి, సెలెక్ట్ అయిన వాళ్ళల్లో నేను రెండవదాన్ని. నా మెరిట్, నా రాంక్, ఉద్యోగసమయంలో నా రికార్డు వీటన్నింటినీ పరిగణించి నన్ను సెలెక్ట్ చేశారు. ఇదే విషయం నీకు చెబితే, ఏ వెధవపని చేసి ఈ అవకాశం సంపాదించుకొన్నావని నీవు తప్పకుండా అంటావని తెలుసు. ఇవన్నీ నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ నీ పిల్లలని నేను సక్రమమైన ఆర్జనతో పెంచుతున్నానని నీకు తెలియచేయడానికే ఈ ఉత్తరం. నీ పిల్లలు నాలాగా తయారవ్వరని చెప్పేవాడివి, నీ రక్తం అని విఱ్ఱవీగేవాడివి. ఒక విషయం తెలుసా నీకు, తల్లి మాత్రమే పిల్లలకి నిజం, తండ్రి ఒక నమ్మకం అని. నేను ఎవర్ని చూపిస్తే వాడే నా పిల్లలకి తండ్రి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ ఇదే పద్ధతి. అయినా నీ మనఃశాంతి కోసం నేను చెబుతున్నాను. నీ పిల్లలు అనుకొంటున్న ఈ పిల్లలు, నీ పిల్లలే. నీవు మా గతంలోని మనిషివేతప్ప, నీకు మా వర్తమానంలోకానీ, భవిష్యత్తులోకానీ చోటు లేదు. దయచేసి ఇది గుర్తుంచుకొని మెలుగు. నేను నా ఉజ్వల భవిష్యత్తులోకి, నా ఇద్దరి పిల్లలతో సుదూరతీరాలకి వెళుతున్నాను. నన్ను నువ్వు చట్టపరంగా, న్యాయపరంగా ఏమీ చేయలేవు. చదువుకొన్న నేటి, మేటి, ఆడపిల్లగా నా జాగ్రత్తలన్నీ నేను తీసుకొన్నాను. ఇంకా సెలవు.
రమ్య.
ఉత్తరం పూర్తవుతూనే షాక్‍కి నోట మాట రాక స్పృహ కోల్పోయాడు శేషు.
పేరు: శైలజా రాంషా
నివాసం: హైదరాబాద్
కార్పొరేట్ ఉద్యోగం
చదువు: తెలుగు సాహిత్యం లో B.A.
అమ్మ సాహిత్య ప్రయాణంలో తోడు వెళుతూ హాజరైన అనేక సాహితీసభలనుండి అందుకున్న చిన్నచిన్న మెరుపులతో సాహిత్యంపట్ల అభిలాష పెరిగింది. కొన్ని సంవత్సరాల జాతీయ పోలీసు అకాడెమీ వుద్యోగం, అక్కడి గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు కధలు వ్రాయాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్నగారు, శ్రీవారి ప్రోత్సాహంతో వ్రాయడం మొదలైంది. పత్రికలు ప్రచురించడం మొదలైనప్పటినుండీ మామయ్య కళ్ళల్లో కనిపించిన ప్రశంస, అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ప్రైడ్, బైలైన్లో పేరు చూసుకొన్నప్పుడు కలిగిన సంతోషం ఇంకా వ్రాయాలనే ఆలోచనను పెంచాయి అంటారు శైలజా రాంషా. వీరి కధలు, వ్యాసాలూ, కవితలు వివిధపత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు ఆన్లైన్
ఫోరమ్లలో కధలు, బ్లాగులు ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్న చిన్న బహుమతులు గెలుచుకొన్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.
పలు ఆన్లైన్ ఫోరమ్లలో కధలు, బ్లాగ్స్ ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్నచిన్న బహుమతులు గెలుచుకున్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.