“సీతా! ఆ ఐటీ లెక్కలు వేసావా? పాపం ఫణి రెండులక్షల టేక్స్ అనేసరికి కంగారెత్తిపోతున్నాడు. ఏమైనా తగ్గుతుందేమో చూడు… రామ్మూర్తి పెన్షన్‌లో తేడా గురించి లెటర్ డ్రాఫ్ట్ చేసావా? అస్తమానూ ఆ పిచ్చి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటావేమిటి? చేతిలో వున్న విద్యేకదా? కంప్యూటరుంది. నలుగురికీ సాయపడచ్చన్న ఆలోచన లేదు నీకు…” శ్రీనివాస్ స్తోత్రం సాగుతోంది. చదువుతున్న నవల పక్కని పడేసి చిరాగ్గా చూసింది సీత.
“ఊళ్ళో వున్న కేసులన్నీ నా దగ్గిరకి పట్టుకొస్తారేమిటి? రిటైరయ్యాను. ఒక్కరోజు ప్రశాంతంగా వుండనివ్వట్లేదు. ఆఫీసులో వదిలించుకున్నానంటే ఇంట్లో మీరు పట్టుకుంటున్నారు” అంది కొంచెం గట్టిగానే.
“రోజంతా ఖాళీగానేగా, వుండేది? తప్పేముంది, ఫ్రెండ్స్‌కి చేసి పెడితే?” అతనూ గట్టిగానే అడిగాడు. రిటైరైనవాళ్ళు ఎంతంత సోషల్ సర్వీసు చేస్తారు? తనవరకు తనకి? నిముషం తీరిక వుండదు. సీతేమిటి యిలా? మొద్దులా సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుకుంటూ, పాటలు వింటూ, సెల్ చూసుకుంటూ అదే జీవితంలా గడుపుతుంది! లేని పిల్లల్ని నలుగురిని పోగుచేసి పాఠాలు చెప్పచ్చు… ఇంకా ఎన్నో చెయ్యచ్చు. ఆఫీసులో ఇన్‌కమ్‌టాక్స్, పెన్షను కేసులూ చూసేది. తన ఫ్రెండ్సువి కేసులు తెచ్చిస్తే సరిచూడటానికి ఓ… తెగ ఇదైపోతోంది!
“నాకు ఇంట్రెస్టు లేదని చెప్పానుకదా? మీకు ఇంట్రెస్టుంటే మీరు చెయ్యండి” అంది విసుగ్గా.
“నాకే వస్తే నిన్నెందుకు దేవిరిస్తాను?”
“అబ్బా! ప్లీజ్! మీకు చేతనైతే చెయ్యండి. లేకపోతే వదిలెయ్యండి. టాక్స్ కన్సల్టెంటు చేసినదాంట్లో ఇంకా నేను చూసేదేమిటి? ఫణిగారికి అదే చెప్పండి. రామ్మూర్తిగారి పెన్షన్ కేసేనా అంతే. ఆయన భార్యని డ్రాఫ్ట్ చెయ్యమనండి. లేకపోతే కొడుక్కో కూతురికో డిక్టేట్ చేసి చేయించుకొమ్మనండి… నావల్ల కాదు. ఇరవయ్యేళ్ళవయసునుంచీ చేస్తున్నాను… నా సబ్జెక్టు బయాలజీ. సర్వీసంతా అకౌంట్సూ, లెక్కలే. ఏ లెక్కల్ని చదువుకునేప్పుడు తప్పించుకున్నానో అవి వుద్యోగంలో వచ్చి మెడకి చుట్టుకున్నాయి” అని పుస్తకం తీసుకుని అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
శ్రీనివాస్‌కి బాగా కోపం వచ్చింది. అతనికి చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ వుంది. ఇప్పుడిప్పుడే ఒకొక్కరూ రిటైరౌతున్నారు. పెన్షను లెక్కలు, టాక్స్ లెక్కలు… భార్యకి అప్పజెప్పి, తను క్రెడిట్ కొట్టేద్దామనుకుంటాడు.
“నీకే అన్నీ తెలుసునని పెద్ద పొగరు” ఆమెకి వినిపించేలా గట్టిగా అన్నాడు. ఆమె చెయ్యనందని వదిలిపెట్టడు. చేసేదాకా నసపెడతాడు. తనదార్లోకి ఆమె రావల్సిందే తప్ప, అతను మాత్రం తగ్గడు. మళ్ళీ ఇవతలికి వచ్చింది సీత.
“ఎవరు మీ ఫ్రెండ్సు? ఎలాంటి ఫ్రెండ్సు? నాలుగురోజులక్రితం ఎవరో రాఘవగారనే ఆయన్ని అలానే తీసుకొచ్చారు. ఆయనతో మరో ఇద్దరొచ్చారు. వచ్చినవాళ్లకి కాఫీలు, మర్యాదలు… పోనీ ఏమన్నా మర్యాదగా మాట్లాడతారా అంటే, కూర్చుని పెన్షన్లు తీసుకునేవాళ్ళకి మా కష్టాలేం తెలుస్తాయి అన్నాడు ఒకాయన. ఇప్పుడు పెన్షన్లు రానివాళ్లందరికీ మనతో సమానంగా జీతం యిచ్చి పైన ఇంకో పదిశాతం సీపీఎఫ్లో కలుపుతోందా గవర్నమెంటు? ముప్పయ్యైదేళ్ళపాటు పదిపర్సంటు అదనపు జీతం… ఇంక దేనికట ఆ గొడవ? ఇంకొకాయన గవర్నమెంటులో జీతాలు తక్కువని మొదట్నుంచీ ప్రైవేటు వుద్యోగాలే చేసాట్ట, సర్వీసంతా ఏసీ కోచిల్లోనూ, విమానాల్లోనూ తిరిగాడట. ఆయనకీ దు:ఖమే మనకి కూర్చోబెట్టి పెన్షను ఇస్తున్నారని. ఐదువందల జీతంతో గుమస్తాలుగా చేరినప్పటి కష్టాలు వీళ్లకేం తెలుసు? గవర్నమెంటు ఉద్యోగం చేసినందుకు ఎన్ని రూల్స్? సర్వీసు రూల్స్, కాండక్ట్ రూల్స్, డిసిప్లినరీ రూల్స్ ఒకటా? పిల్లకి ఒంట్లో బాలేదని లీవడిగితే మా ఆఫీసరు ఇవ్వలేదు. నేను గట్టిగా అడిగితే లీవు హక్కుకాదు, ఇవ్వటం, ఇవ్వకపోవటం అనే నిర్ణయానికి లోబడి వుంటుంది అని వల్లించాడు. ఎంత పెద్ద బందిఖానా అది? అదే నేనంటే, ఐతేనేం? ఎవరు పాటించారు వాటిని? అసలు గవర్నమెంటు వుద్యోగస్తుల్లో పని చేసేవాళ్ళెవరు అని మరోమాట. ఎవరూ పని చెయ్యకపోతేనే ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం నడుస్తోందా? ఇప్పుడుకదా, కంప్యూటర్లు వచ్చింది? రాసిందే రాసి, చేసిందే చేసి, వళ్ళూ మనసూ అరిగిపోయాయి. ఇంకా యింటికొచ్చి వీళ్ళ రువాబేమిటి?” తగ్గకుండా అడిగింది.
“కూర్చుని తీసుకుంటుంటే చూసేవాళ్ళకి అలానే వుంటుంది. వాళ్ళు అన్నారని మనమేం పెన్షన్లు వదులుకోం కదా? అందుకే కాస్త నలుగురికళ్ళూ చల్లబడేలా ఇలాంటివి చెయ్యమనేది” అన్నాడు.
“సర్వీసులో చేరగానే ఐదొందలపేజీల రిజిస్టరు కొనుక్కుని సర్వీసు ఎక్కడెక్కడ చేసామో, లీవు ఎప్పుడెప్పుడు వాడుకున్నామో రాయమనీ, జీతం వివరాలూ, లీవు అకౌంటూ వేసుకొమ్మనీ అందరికీ చెప్తాను. ఒక్కసారి సర్వీస్ బుక్ చూస్తే ఎలా రాసుకోవచ్చో అర్థమౌతుంది. నెలమొత్తంలో మహా ఐతే పావుగంట పని. మనదగ్గిర వివరాలుంటే మనమే చెక్ చేసుకోవచ్చుకదా? ఏడాదికోసారి ఆఫీసుకి వెళ్ళి సర్వీస్ బుక్ చూసుకోవటానికి ప్రొవిజన్ వుంది. ఐదేళ్ళకోసారి ఫస్ట్ పేజీలో నమూనా సంతకం పెట్టాలి. ఇవన్నీ ఎవరేనా చేస్తున్నారూ? పోనీ నేనింత వెంటబడి చెప్తే మీరెప్పుడేనా చేసారా? చెయ్యలేదు. అలా చెయ్యకుండా కళ్ళుమూసుకుని గాఢనిద్రపోయి రిటైరయే టైముకి ఆఫీసువాళ్ల లెక్కల్లో తేడాలున్నాయేమోనని అనుమానంతో లేస్తారు. రామ్మూర్తిగారిని సర్వీసు రికార్డు కాపీచేసుకు రమ్మన్నాను. చేసుకు రాలేదు. ఆయన నోటిమాటమీద నేను ఎలా చెక్ చేస్తాను? ” అంది సీత.
“ఈ ఇద్దరి ప్రాబ్లమ్సూ ఎలాగోలా సాల్వ్ చెయ్యి. ఇంక వేరేవాళ్లవి తేనులే… ముసలమ్మలా మూలని కూర్చుందువుగాని ” ఎద్దేవా చేసాడు శ్రీనివాస్.
అతను వినడు. ఆమె నిట్టూర్చింది. వాళ్ల ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చెయ్యాలి… అంతే. క్షణాల్లో నిర్ణయం తీసుకుంది.
శ్రీనివాస్ బేక్బెంచర్. చదువులో పెద్ద చురుకైనవాడు కాదు. నకల్ చిట్టీలు పెట్టుకుని టెంత్ పాసయ్యానని తనే చెప్తాడు. కోహినూర్ బేకరీలో పేపర్లు లీకై వస్తే ఆబ్జెక్టివ్ టైపుకి ఏబీసీడీలు బైహార్ట్ చేసానని చెప్పుకుంటాడు. అలా పేపరు లీకు కాకపోతే ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో తెలీనివాటన్నికీ ఒకే జవాబు పెట్టి కొన్ని మార్కులు సంపాదించుకున్నాడట. మొత్తానికి గవర్నమెంటు వుద్యోగం దొరికింది. అతని వుద్యోగాన్ని సీత వుద్యోగంతో సరి తూచేసి పెళ్ళి చేసేసారు సీత తల్లిదండ్రులు.
మనిషి మంచివాడే. కానీ మూర్ఖత్వం. సీత తెలివైనదీ, అన్నీ సులువుగా అర్థం చేసుకోగలదీ కాబట్టి ఆమె తెలుసుకుని ఆ తెలిసినవన్నీ తనకి నేర్పాలంటాడు. ఆమె బుర్రలో వున్నదంతా తన బుర్రలోకి ఎక్కించాలంటాడు. ఆమె ఏ పనేనా స్వతంత్రంగా చేసేసి ఐందనిపిస్తే కోపం. అన్నీ
ఆన్లైన్ అయ్యాక అతని గొడవ మరీ పెరిగిపోయింది.
“మీకుండే తెలివితేటలు మీకుంటాయి. నాకుండేవి నాకుంటాయి. ఇవేమీ పెద్దపెద్ద రాచకార్యాలు కావు, ప్రతీదీ ఇద్దరం కలిసే చెయ్యటానికి. ఎవరు చెయ్యగలిగినవి వాళ్ళు చేస్తే మనకి కాస్త టైం మిగులుతుంది” అంటుంది. వినడు. ఐదునిముషాల్లో జరిగే పనికి గంటలతరబడి ఇద్దరూ వాదించుకోవటం, దెబ్బలాడుకోవటం… అతని కోపం… అలక…
ఒక చిన్న సూత్రం వుంటుంది. ఒకళ్లకి మన పని అప్పజెప్పినప్పుడు, వాళ్ళెలా చేస్తే అలా చేయించుకోవాలి. ఒకళ్లపని చేస్తామని మనమే ముందుకి వస్తే వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి.
“నువ్వు నేర్చుకుని నాకు నేర్పిస్తే, నేను దగ్గరుండి నీ చేత చేయిస్తాను” అంటాడు. సీత జీవితమంతా ఆ మూడుముక్కల మధ్యే గడిచింది.
“వాడికి ప్రతీదీ తెలుసుకోవాలని వుంటుంది. చిన్నతనం లేకుండా వాడే నీదగ్గర నేర్చుకుంటానంటే ఇబ్బందేమిటి?” అంటుంది అత్తగారు.
“అన్నీ నేర్చుకొమ్మని అతనే చెప్తుంటే నీకేమిటే?” అంటుంది తల్లి.
“ప్రతీదీ మీవారు దగ్గరుండి చూసుకుంటారు. అదృష్టవంతురాలివి” అంటారు స్నేహితులు.
అతననే ఒక్క వాక్యాన్నీ మూడుముక్కలుగా విరిచేసుకుని ఎవరికి నచ్చింది వారు సీతకి చెప్తారు. అందులో వుండే బాధేమిటో ఆమెకే తెలుసు.
ఇద్దరూ రిటైరయ్యాక ఇప్పుడివి కొత్త సమస్యలు.
సాయంత్రం ఫణి, రామ్మూర్తి కలిసే వచ్చారు.
“ఐటీ రూల్స్ బుక్ కావాలండీ! స్వామీ పబ్లికేషన్స్దైతే బాగుంటుంది. లా పబ్లికోలో దొరుకుతుంది. ఛార్టెర్డ్ అకౌంటెంట్ చేసినదాన్ని నేను తిరిగి చూడాలంటే బుక్ లేకుండా కష్టం. అది తెచ్చి ఇచ్చారంటే ఏవేనా ప్రొవిజన్స్ వున్నాయేమో వెతుకుతాను ” అంది ఫణితో.
“అదేమిటి? మీకు బోల్డు నాలెడ్జి వుంటుందికదా? మీ సర్వీసంతా అదేనని చెప్పాడు శ్రీనివాస్” అన్నాడతను ఆశ్చర్యంగా.
“వర్కింగ్ నాలెడ్జి వుంటుందిగానీ సియ్యేకి వున్నంత లోతైన అవగాహన వుండదుకదా?” అంది.
రామ్మూర్తితోటీ చెప్పింది, “ఎఫ్ఫార్ ఎస్సార్, పెన్షన్ రూల్స్ బుక్స్ కొనుక్కురండి. ఆఫీసుల్లో వుండే పాతవి కాకుండా లేటేస్ట్ ఎడిషన్స్ తీసుకోండి. ఇక మీ కేసు ముందేసుకు కూర్చుంటాను” అని.
వాళ్ళిద్దరూ ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సీతకి పదునైన అస్త్రం చేతికి వచ్చింది. శ్రీనివాస్ వెంటకూడా పడుతోంది.
“కాండక్ట్ రూల్స్ చదువుదాం, క్లాసిఫికేషన్ అపీల్ కంట్రోల్ రూల్స్ బుక్ తీసుకురండి, మీ ఫ్రెండ్సుకి డాఫ్టులు రాసిపెట్టచ్చు” అని. అతను కూడా ఆమెని తప్పించుకు తిరుగుతున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.