(హాస్యకథ )
సుబ్బారావుకు పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ దసరా. అందుకే వాళ్ళ మామగారు మర్యాదపూర్వకంగా వచ్చి అల్లుడిని పండుగకు రమ్మని పిలిచేరు. ముందుగా అమ్మాయిని తనతో పంపించమని అడిగేరు. అలాగేనని తన శ్రీమతి సుందరిని మామగారితో పంపించేడు సుబ్బారావు. ఆ ఆహ్వానం సందర్భంగానే అందరికంటే ముందుగా సెలవుకు దరఖాస్తు చేసి కొత్త పెళ్లికొడుకన్న సానుభూతిపై సెలవు మంజూరు చేయించుకున్నాడు. దాని పర్యవసానమే సుబ్బారావు అత్తారింటి ప్రయాణం.
ట్రైన్ దిగి ఆటో ఎక్కేడేగాని సుబ్బారావు అత్తారింట్లో తనకు జరగబోయే మర్యాదల గురించిగాని, మామగారిచ్ఛే పండుగ కానుక గురించిగాని ఆలోచించడంలేదు. మరదలు గురించే ఆలోచిస్తున్నాడు. అదేంటి, కొత్త పెళ్ళికొడుకు తన భార్యగురించి ఆలోచించాలిగాని అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సుబ్బారావును మరదలు మాధవి అంత ఆట పట్టిస్తుంది, అందుకని. సుబ్బారావు పెళ్ళిలో మాధవి ఆడిన పరాచికాలు ఇప్పటికీ మర్చిపోలేదు.
ఇంటి ముందు ఆటో ఆగడం చూసి సుబ్బారావు అత్తవారి కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చేరు. సుబ్బారావు బేగ్ తీసుకుని ఆటోవాడికి డబ్బులిచ్చేసి వస్తుండగా “బావగారూ ఆటోలో ఏదో వదిలేసి వచ్చేస్తున్నారు” అంది మాధవి. అన్నది మరదలని తెలిసినా యధాలాపంగా ఆటో లోపలికి తొంగి చూసేడు. అంతే మాధవి నవ్వడం మొదలుపెట్టింది. సుబ్బారావు ప్రశ్నార్థకంగా చూసేడు. “అదే బావగారూ! మీరు ఆటో దిగి వచ్చేరంటే సీటొదిలి వచ్చినట్లే కదా” అంది. అప్పుడే మొదలయిందన్నమాట అనుకున్నాడు సుబ్బారావు.
మామగారు అల్లుడిని సాదరంగా ఆహ్వానించి “మాధవీ చెంబుతో నీళ్లు పట్టుకురా” అన్నారు అల్లుడు కాళ్ళు కడుగుకుంటాడనే ఉద్దేశంతో. “అదేంటి నాన్నగారూ! బావగారికి మళ్ళీ కాళ్ళు కడుగుతారా ఏంటి కొంపదీసి. అలాగైతే కన్యాదానం చేయాలి. అక్క ఒప్పుకుంటుందా ” అంటున్న మాధవిని మందలించేరు తల్లీ,తండ్రీ. “జస్ట్ ఫర్ ఫన్ బావగారూ! సీరియస్‌గా తీసుకోకండి ఏదీ ” అంది మరదలు.
లోపలికి వచ్చేక “బావగారూ! టీ త్రాగుతారా? కాఫీయా? “అడిగింది మాధవి. ఇంక అందులో ఏం కలుపుతుందో అని ” వద్దులే తల్లీ త్రాగి వచ్చేను” అన్నాడు సుబ్బారావు. “అదేంటి బావగారూ! ఈ అలవాటు ఎప్పటినుండీ? అక్కకు తెలుసా? త్రాగినా మీరు తూలడం లేదే!”చురక అంటించింది మరదలు పిల్ల. ఈసారి సుందరి కోప్పడింది చెల్లెల్ని. సుబ్బారావు నవ్వడం చూసి ఫీల్ అవలేదని తెలుసుకుంది.
రాత్రి భోజనానికి పిలవడానికి వచ్చింది మరదలు “పదండి బావగారూ! విందుకు ముందు సందుకు వెనక ఉండాలిట.” అంటూ తీసుకు వెళ్ళింది. తీరా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేక కుర్చీ తీసేసింది. “అదేమిటే నువ్వు శృతి మించిపోతున్నావు ” అన్నారు తల్లీ,తండ్రీ.
” అది కాదు బావగారూ! కూర్చుని తింటే కొండలయినా తరిగిపోతాయిట.అందుకే ఈ రోజుల్లో బఫే పెడుతున్నారు. సారీ బావగారూ! మీరు తినేదానికి మాకేవీ తరిగిపోవులెండి. రండి.కూర్చోండి” అంటూ కుర్చీ త్రోసింది. అలా రాత్రి గడిచింది.
తెల్లవారుతూనే మరదలు మళ్ళీ ప్రత్యక్షం “బావగారూ! పండుగ రోజుకూడా రోజూలాగ లేట్‌గా లేవకూడదు. బ్రష్ చేసేరా ఇంకా లేదా ? ” అని అడిగింది.
“లేదు మరదలా! నా బేగ్లో బ్రష్ కనబడడంలేదు”అన్నాడు సుబ్బారావు. “అందుకే తెచ్చేను నేచురల్ టూత్ బ్రష్. దీనితో తోముకుంటే మీ దంతాలు మిలమిలా మెరుస్తాయి ” అంది.
“అంటే ఇది నీ పనేనన్నమాట ? ఇదేంటి వేపపుల్ల. దీనితో తోముకుంటే దంతాలు మిలమిలలాడడంకాదు జలజల రాలిపోతాయి “
“ఏం అంత వీక్‌గా ఉన్నాయా బావగారూ? “అడిగింది. ఇంక లాభం లేదని ఎలాగో మరదలి బారి నుండి తప్పించుకుని వెళ్లి స్నానం చేసి తయారయి వచ్చి టిఫిన్ చేస్తుండగా సెల్ మ్రోగింది.
” బావగారూ మీకు ఫోన్ ” అంటూ అందించింది మాధవి. ఫోన్ అందుకుని సుబ్బారావు, “హలో … నమస్తే సర్ … ఏంటి సర్ … ఈవేళ జీఎంగారు వస్తున్నారా … నేను అర్జంటుగా రావాలా … తప్పదా … సరే సర్ ” అంటుంటే బావగారి ఫోన్ కాల్ నిజమేనా లేక ఫేక్ కాలా అనుకుంది మరదలు పిల్ల.
(ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ (అమృతోత్సవ) ప్రత్యేక సంచిక 12.4.2017 మధురిమలో ప్రచురితమైంది.)
పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.