రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.
కొత్తగా వచ్చిపడిన తన స్థాయిని అందరూ గుర్తించాలన్న ఆరాటంకూడా అతనికి బాగా వుంది. అందుకు కొన్ని చిట్కాల్లాంటివి పాటిస్తాడు. ఒక భజనబృందం అతన్ని తరుచు నలుగుర్లో పొగుడుతుంటుంది. కింది వుద్యోగస్తులని ఆఫీసు మెట్లదగ్గర అందరూ చూసేలా కలవమంటాడు. తనొక స్థాయిలో వున్నట్టు చూసేవాళ్ళకి తెలవాలని. బైటివాళ్ళెవర్నీ నేరుగా కలవడు. మర్యాదలు పాటించాలి. ముందస్తుగా రికార్డుగుమస్తా, కార్యదర్శికి నివేదించాలి. ఆయన (నామమాత్రపు) టిట్యూలర్‍కౌన్సలర్‍కో సంబంధిత మరో అధికారికో చెప్పుకోవాలి. అక్కడినుంచీ ఈ అధికారికి చేరాలి. అదొక దర్పం, ప్రదర్శన. అతననే కాదు, ప్రతివారూ అంతే. తాము గొప్పవాళ్ళమనుకుంటూ తమ పై అధికారులని అనుకరించడంతో పనులేవీ కాకుండా ప్రభుత్వశాఖల్లో మేట్లుపడిపోయి వుంటాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే టిట్యులర్ కౌన్సలర్లలో ఎవరికేనా పదోన్నతి వచ్చి, ఎంత చిన్న ఆఫీసుకి బదిలీ ఐనా , అక్కడ ఆర్భాటంగా ఆడియన్స్ చాంబర్ పెట్టేసుకుని కలవటానికి వచ్చి వెళ్ళేవారికి తలుపు తీసి వెయ్యటానికి ఒక మనిషిని నియమించుకుంటారు… నిజానికి అలాంటి సందర్భం ఎప్పుడూ రాదు.
అకాకీ కలవటానికి వెళ్ళే అధికారి కిందిస్థాయి వుద్యోగుల విషయంలో చాలా నిక్కచ్చిగా వుంటాడు. వాళ్ళు ఫైళ్ళు పట్టుకుని రాగానే క్రమశిక్షణ గురించి వుపదేశాలిస్తాడు. అతననుకునే క్రమశిక్షణ వేరు. నిఘంటువుల్లో వుండేది వేరు.
వాస్తవానికి కిందిస్థాయి వుద్యోగస్తుల్లో ఆ భయం సహజంగానే వుంటుంది. ప్రత్యేకించి నేర్పక్కర్లేదు. అతన్ని దూరంనుంచీ చూస్తూనే వాళ్ళంతా చేస్తున్న పని వదిలేసి అతను వెళ్ళేదాకా వరుసలో నిలబడతారు. అతను వాళ్లతో చాలా కఠినంగా మాట్లాడతాడు.
“నీకెంత ధైర్యం? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరిముందు నిలబడి వున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?”’ అని ఐనదానికీ కానిదానికీ వాళ్ళని కోప్పడతాడు.
అకాకీ వచ్చిన సమయానికి ఆ అధికారి బాల్యమితృడు వచ్చాడు. ఇద్దరూ కలుసుకుని చాలా ఏళ్ళైంది. కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. అలా అనటంకన్నా, కొన్నేళ్ళక్రితం రిటైరై, ప్రస్తుతం ఎలాంటి అధికారాలూ, మందిమార్బలం లేని ఆ మితృడిముందు ఇతడు తన అధికార దర్పాన్ని చూపిస్తున్నాడనటం సబబుగా వుంటుంది. సరిగ్గా అదే సమయానికి కింది వుద్యోగి ఒకడు అకాకీ అతన్ని కలవడాఅనికి వచ్చినట్తు చెప్పాడు..
“బాష్మచ్కిన్…” అని అకాకీ పేరు చెప్పగానే,
“ఎవరది?” అని నొసలు చిట్లించాడు.
“ఒక ప్రభుత్వోద్యోగి…”
“ఉండమను. నాకు తీరిక లేదు. వేరే ముఖ్యమైన పనిమీద వున్నాను” అనేసాడు.
ఇదీ ఒకరకంగా మితృడికి గొప్పతనం చూపించుకోవటమే. అలా వుద్యోగులు తనకోసం ఎదురుచూస్తుంటారంటే అతనికి చాలా గర్వంగా వుంది. మితృలిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంక చెప్పుకోవటానికి కూడా ఏమీ మిగిలిలేవు. ఆ మిగిలిన మౌనాన్నికూడా పనికిరాని మాటలతో నింపేసాక ఇద్దరూ సిగర్స్ తాగారు. ప్రముఖవ్యక్తి తన ఆర్మ్‌చెయిర్లో సౌకర్యంగా వెనక్కి వొరిగాడు. గదిగుమ్మం దగ్గర చేతిలో ఫైళ్ళతో నిలబడి వున్న కార్యదర్శిని పిలిచి,
“ఎవరో నాకోసం వచ్చారన్నావుగా, పంపించు” అన్నాడు.
అకాకీ వొచ్చాడు. అతని సాదారూపం, చిరిగిపోయిన బట్టలు చూసి చులకనభావం కలిగింది. “ఏం కావాలి?” కటువుగా అడిగాడు.
అకాకీకి చాలా బెరుగ్గా వుంది. ఆ బెదురుతో తడబడుతూ విషయం చెప్పాడు. ఎంత అమానుషంగా తన కోటుని వాళ్ళెత్తుకుపోయారో చెప్పి, “దయచేసి మీరు జిల్లా పోలీసు ప్రధానాధికారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి నా కోటు వెతికించి నాకిప్పించగలరు” అన్నాడు.
అతను హద్దుమీరినట్టనిపించింది అధికారికి. మధ్యలోనే ఆపి,
“నేనేం చెయ్యాలో నాకు చెప్తున్నావా? అసలు నీకు ఆఫీసు పద్ధతులూ, మర్యాదలూ తెలియదల్లే వుంది. నువ్వు కలిసింది ఎవర్నో తెలుసునా? ఇలా నేరుగా వచ్చెయ్యటమేనా? ఒక అర్జీ పెట్టుకోవాలి. అది అంచెలంచెలుగా అందరూ పరిశీలించాక అప్పుడు కార్యదర్శి నాకు పంపాలి” అన్నాడు.
“కానీ దొరవారూ!” అన్నాడు అకాకీ. భయంతో దిగచెమట్లు కారుతున్నప్పటికీ వీలైనంత సాదాగా వుండటానికి ప్రయత్నం చేసాడు. “తమరిని ఇబ్బందిపెట్టడానికి కారణం నాకు కార్యదర్శులెవరూ సాయం చెయ్యరు. అలాంటి లక్షణం వాళ్ళలో లేదు” అని పూర్తిచేసాడు.
“ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమౌతోందా? ఎంత ధైర్యం నీకు? అసలు నీకు ప్రభుత్వ కార్యదర్శులగురించి ఇలాంటి దురభిప్రాయం ఎందుకు కలిగింది? మీ యువకులందరికీ ఎందుకింత దురహంకారం? “’ అని అడిగాడు కోపంగా. నిజానికి అకాకీ వయసు యాభై దగ్గర్లో వుంటుంది. సరైన పోషణలేక కుంచించుకుపోయిన అతని ఆకృతి ఆ మహాశయునికి అలా కనిపించింది. అతనికి క్షణక్షణానికీ కోపం పెరిగిపోతోంది అకాకీ చేసిన అభియోగానికి. ” నువ్వెవరిముందు నిల్చుని వున్నావో ఎవర్తో మాట్లాడుతున్నావో తెలుసా, నీకు? ఎంత ధైర్యం?” కాలితో నేలని బలంగా తంతూ పెద్దగా అరిచాడు.
అకాకీ నిలువునా వొణికిపోయాడు. అతనేకాదు, ఆ అరుపులకి అక్కడ అతను కాక మరెవరున్నాకుడా అంతే జరిగేది. అకాకీ ఇంకాస్త భయస్తుడు. నేలమీద కుప్పకూలిపోయాడు. స్పృహతప్పిపోయింది. అక్కడున్న పోర్టర్లు అతన్ని లేపి బయటికి తీసుకెళ్ళారు. అధికారికి చాలా గర్వంగా అనిపించింది. ఓరకంట మితృడిని చూసాడు. అతడికి ఇదంతా నచ్చనట్టుంది. ఇబ్బందిపడుతున్నాడు. వెళ్ళటానికి వుద్యుక్తుడయాడు.
ఎప్పుడు తనని తను కూడదీసుకున్నాడో, మెట్లెలా దిగాడో, రోడ్డుమీదికి ఎలా వచ్చాడో అకాకీకి తెలీలేదు. జీవితంలో ఎప్పుడూ అంతటి అవమానాన్ని పొందలేదు. అధికారి అరుపులు అతన్ని వెంటాడుతున్నాయి. తను తిన్న తిట్లని జీర్ణించుకోలేకపోతున్నాడు. కోటు పోగొట్టుకున్న బాధకన్నా ఎక్కువగా బాధపెడుతున్నాయి. అడుగులు తడబడుతుంటే విస్తృతంగా కురుస్తున్న మంచులో నడక మర్చిపోయినట్టు నడుస్తున్నాడు. చలిగాలులు అతన్ని అన్నివైపుల్నించీ తాకి వుక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలిగాలి నోట్లోకి పోయి గొంతు మంట మొదలైంది. టాన్సిల్స్ వాచిపోయాయి. ఇంటికి చేరి మంచంమీద వొరిగిపోయాడు.
మరుసటిరోజుకి విపరీతమైన జ్వరం వచ్చేసింది. వాతావరణం ప్రతికూలంగా వుంది. పరిస్థితి మామూలుకన్నా త్వరితంగా విషమించింది. డాక్టరు వచ్చాడు. రోగి నాడి పట్టుకుని చూసాడు. మరో రోజున్నరకి మించి బతకడని నిర్ధారించాడు. ఐనా కూడా రోగిని అలా వదిలెయ్యలేక ఒక కొన్ని మూలికలు, బెరళ్ళలాంటివాటితో చేసిన పిండికట్టు కట్టి, ఇంటావిడతో చెప్పాడు.
“అతనింక బతకడు. కాఫిన్ తెప్పించడం మంచిది. పైన్‍వుడ్‍తో చేసినది చాలనుకుంటా. ఓక్‍వుడ్‍కి ఇతనివద్ద డబ్బులుండకపోవచ్చు” అన్నాడు.
అకాకీ ఆ మాటలని విన్నాడా? విని వుంటే అవి అతనిమీద మరో బలమైన ప్రభావం చూపి వుంటుందా? తను అనుభవించిన జీవితంలోని విషాదం ఈ చివరిక్షణాల్లో స్ఫురణకి వచ్చిందా? ఎవరికీ తెలీదు.
ఓవర్‍కోటు… శరీరాన్ని చలినుంచీ కాపాడుతుంది. వెచ్చదనాన్ని ఇస్తుంది. సౌఖ్యంగా వుంచుతుంది. ఓవర్‍కోటు ఇచ్చేలాంటి రక్షణ, ప్రేమ, సాంత్వన… అతనికి లేవు. బైటి మనుషుల కాఠిన్యంవల్ల అతని మనసుకి ఎన్నో గాయాలయ్యాయి. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అతనసలు బాహ్యస్పృహలోనే లేడు. ఏవో దృశ్యాలు కళ్ళముందు కదిలాయి.
పెట్రొవిచ్ ముందు నిలబడి వున్నాడు. “నాకో కొత్త ఓవర్‍కోటు కుట్టిపెట్టు పెట్రొవిచ్. ” చెప్పాడు. దొంగలని కట్టిపడేసే వలల్లాంటివి దానికి వుండాలన్న కోరికని వెలిబుచ్చాడు.
దొంగలు తన మంచం కింద దాక్కుని వున్నారని భయపడ్డాడు. తన దుప్పటీలోనే వున్నారనీ వాళ్ళని లాగిపారెయ్యమనీ ఇంటామెని ప్రాదేయపడ్డాడు. కొత్తకోటు కుట్టించుకున్నాక కూడా ఇంకా తనీ దుప్పటీ ఎందుకు కప్పుకున్నాడని వాపోయాడు. మరుక్షణమే తను అధికారి ముందు నిలబడి వున్నాననుకున్నాడు. “నన్ను క్షమించండి మహాశయా!” అన్నాడు. ఆ తర్వాత ప్రతిసారీ మహాశయా అంటూనే అతన్ని తిట్టడం మొదలుపెట్టాడు. అలాంటి అసహ్యకరమైన తిట్లు ఇంటామె ఎప్పుడూ అతనినోట ఎప్పుడూ వినలేదు. ఆ తర్వాత అర్థంపర్థంలేని మాటలెన్నో మాట్లాడాడు. ఆ మాటలన్నీ పోగొట్టుకున్న కోటు గురించే. అతని మొదటి విజయం దాన్ని కుట్టించుకోవటం. చివరి వోటమి దాన్ని పోగొట్టుకోవటం. రెండూ ఒక్కరోజులో జరిగాయి. ఆఖరిశ్వాస తీసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.