బిందువు by Sailaja Ramshaw

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

(ఆంధ్రభూమి వారపత్రిక 20/12/12)

ఫోన్ మాట్లాడుతున్న గణేష్ మొహం వివర్ణం అవడం గమనించిన అపర్ణ కాఫీ చేతికి అందించే ప్రయత్నం మానుకుంది. ఫోన్ అయ్యేటప్పటికి మొహం వడలిపోయినట్లుగా అయ్యింది. ఫోన్ ఆన్‍లో వున్నప్పుడు ముందుకి ఒరిగి మాట్లాడుతున్నవాడు అవ్వగానే వెనక్కి వాలాడు. మొహం భారంగా ఉండడంతో ఏమీ తోచలేదు అపర్ణకి. నెమ్మదిగా భర్త చేతిమీద చేయి ఆనించింది. ఉలిక్కిపడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. ఎలాంటి విషయాన్నయినా నిర్భయంగా చర్చించగలిగే చనువు ఉన్న అపర్ణ కూడా జంకింది. ఫోన్ చేసినవారెవరో తెలియదు. ఎలాంటి వార్త విన్నాడో తెలియదు. అందుకే మౌనంగా కాఫీ తాగుతున్న గణేష్ వైపు అలా చూస్తుండిపోయింది.
గణేష్ చాలా గుంభనగా ఉంటాడు. భార్యకి కష్టం కలిగించనివీ, ఆహ్లాదం కలిగించేవి మాత్రమే ఇంటివరకూ తీసుకువస్తాడు. ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెళ్లయింది. అబ్బాయి ఐఐటీలో పీజీ చదువుతున్నాడు. పాతికేళ్ల వైవాహిక జీవితం జలపాతాల హోరుని తట్టుకొని, నిండుగా ప్రవహించే నదీస్థాయికి వచ్చి చాలారోజులయింది.
మెల్లిగా తలెత్తి చూసిన గణేష్ “సిద్ధాంత్ ఇంటినుండి పారిపోయాడట” అన్నాడు అపర్ణతో.
సిద్ధాంత్ గణేష్ స్నేహితుడు కృష్ణ కొడుకు. వాడికి పన్నెండేళ్లుంటాయి
“ఎలా?” అన్న ప్రశ్న అపర్ణ పెదవి దాటకముందే, “పద వెళదాం, రాజీ కళ్ళు తిరిగిపడిపోయిందట” అని బయలుదేరదీశాడు. కారు ఎక్కిన తరువాత గణేష్ చెప్పసాగాడు.
“ఈరోజు ప్రొద్దుటినుండి కనబడటం లేదట, వీళ్ళు సాయంకాలానికిగాని తెలుసుకోలేకపోయారు. ఎప్పటిలా స్కూల్ బస్సులో ఇంటికి రాకపోవడంతో, ఎంక్వయిరీ చేస్తే వాడసలు స్కూలుకే రాలేదని హడావుడిగా వెతుకుతుంటే కృష్ణకి ఫోన్ చేసాడట. వైజాగ్‍లో నానమ్మ దగ్గరికి వెళుతున్నాను, మీరెవరూ నాకోసం వెదకవద్దు అని. రాజీ అది వినగానే కళ్ళు తిరిగి పడిపోయింది. మీ దగ్గరికి వద్దామంటే రాజీ పరిస్థితి బాగాలేదు. మీరే వస్తారా? అని అడిగాడు” అన్నాడు గణేష్.
“వైజాగ్‍లో ఉన్నావిడ కృష్ణకి పిన్ని కదా! ఆమె రిటైర్ అయినప్పుడు సిద్ధాంత్ ఆవిడని ఇక్కడికి తీసుకురమ్మని పేచీ పెట్టినట్టున్నాడు కదా!” అన్నది అపర్ణ.
“అవును, ఇదంతా జరిగి ఓ రెండేళ్లు అయ్యింది. అయితే వాడక్కడికి నానమ్మమీద ప్రేమతో వెళ్లాడా?” సాలోచనగా అన్నాడు గణేష్. ఇంతలోనే మారేడ్‍పల్లిలోని కృష్ణ ఇంటికి చేరడం, ఆ వెనువెంటనే కృష్ణ బయటికి రావడంతో మౌనంగా కారు దిగారు గణేష్-అపర్ణ. కృష్ణ ఇల్లు అధునాతనంగా ఉంటుంది. ఇంటిముందు భార్యాభర్తలిరువురివీ రెండు కార్లు పార్క్‌చేసి ఉన్నాయి. కృష్ణ-రాజీలది ప్రేమ వివాహం. విద్యావంతులు కావడంతో, మంచి ఉద్యోగాలు, జీతాలు. సిద్ధాంత్ తరువాత పిల్లలు లేరు. వద్దనుకున్నారో, కలగలేదు తెలీదుకానీ, “ఒకే పిల్లాడుకాబట్టి జమిందారులా పెంచుతాం అక్కా! మాకేం తక్కువ?” అనేది రాజీ రాజసంగా.
పరుల సంపదను చూసి అసూయపడే తత్వంలేని అపర్ణ సన్నగా నవ్వి ఊరుకొనేది. అది గమనించి కొంచెం దూరంగా, మరికాస్త జాగ్రత్తగా ఉండమనేవాడు గణేష్. అపర్ణ ఆలోచనలతోనే కృష్ణ వెనక ఇంట్లోకి అడుగుపెట్టింది.
“రాజీ లోపల ఉంది వదినా” అన్నాడు కృష్ణ.
కృష్ణ చాలా సంవత్సరాలనుండీ గణేష్‍కి స్నేహితుడు. వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ పేరుతోటే పిలుస్తాడు. అపర్ణని వదినా అని పిలుస్తాడు. పిల్లలుకూడా కృష్ణని చిన్నాన్న అని పిలుస్తారు. ఎవరూ బోధించకుండా, నిర్బంధించకుండా ఏర్పడ్డ ఈ బంధాలలోకి రాజీ అడుగుపెట్టింది. సహజంగానే కృష్ణ సరసన అమరింది. పిల్లలకి స్నేహితురాలిగా, తనకి అక్కచెల్లెలుగా కనిపించేది. అప్పుడప్పుడూ విద్యాధికురాలని, ఉద్యోగస్తురాలని, కాస్త డామినేషన్ చూపించినా, కృష్ణ వెంటనే వెళదామని లేచేవాడు లేదా తానే సర్దుకొనేది.
రాజి పడక గదిలో శోకదేవతలా కూర్చుంది. వార్త చేరి గంట అయ్యిందేమో, అంతలోనే ఎంత తల్లడిల్లిపోయిందీ? తల్లి హృదయం కదా! అనుకొంటూ గబగబా దగ్గరికి నడిచింది.
“అక్కా!” అంటూ కావిలించుకొని బావురుమంటూ ఏడవసాగింది రాజీ. వెక్కిళ్లమధ్య కొడుకును తలచుకొంటూ, “వాడికేమి తక్కువ చేశాను అక్కా, ఇలా చేసాడు?” అని వాపోయింది.
“నువ్వే ధైర్యంగా లేకపోతే కృష్ణ ఎంత బెంగటిల్లిపోతాడో? అతను ఏదైనా అలోచించి చేయాలన్నాకూడా నువ్వు తోచనివ్వాలి కదా! లేచి మొహం కడుక్కో! వాడిని క్షేమంగా వైజాగ్ చేరనీ! మీ చిన్నత్త గారికి ఫోన్ చేసి విషయం చెప్పవా?” అంటూ బుజ్జగిస్తే, కొంచెం సర్దుకొని, లేచి మొహం కడుక్కుంది రాజీ.
“పద కొంచెం టీ చేద్దాం” అంటూ బయటకు తీసుకువచ్చింది అపర్ణ. కృష్ణ, గణేష్‍లను కూడా డైనింగ్ హాల్లోకి పిలిచింది. కృష్ణకూడా వంటింట్లోకి వచ్చి కప్పులు ట్రేలో సర్ది, బిస్కట్లు ప్లేట్లలో పెట్టి తీసుకువచ్చి గణేష్ ముందు పెట్టాడు తీసుకోమన్నట్లుగా. అపర్ణ టీ తీసుకురాగానే, గణేష్ బిస్కట్టు, కప్పు తీసుకొని, ప్లేట్‍ని, కృష్ణ కి పాస్ చేశాడు. కృష్ణ బిస్కట్టు అందుకోగానే, రాజీలో అసహనం మొదలయ్యింది.
“కొడుకు ఇంటినుండి పారిపోతే ఏమీ పట్టనట్టుగా బిస్కట్లు తింటున్నావా?” అని అడిగింది, సీరియస్‍గా.
ముగ్గురూ నిశ్చేష్టులయ్యారు ఒక్క క్షణం.
“అక్కా! మీ ఇద్దరూ మరోలా అనుకోకండి, అసలు కృష్ణ మొహంలో ఏమైనా టెన్షన్ కనపడుతోందా? సిద్ధాంత్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు. వాడు ఫోన్‍లో ఏమి చెప్పాడో కూడా తెలీదు. వాడు వైజాగ్ వెళ్లిపోవడానికి నేనే బాధ్యురాలినా?” అన్నది రోషంగా రాజీ.
అయోమయంగా చూస్తున్న అపర్ణ వైపు సాభిప్రాయంగా చూసి ఏదో అనబోతున్న కృష్ణని భుజంమీద చేయి వేసి వారించి, తనతో పాటు బయట పోర్టికోలోకి తీసుకువెళ్లాడు గణేష్. రెండు గార్డెన్ చైర్స్ వేసుకొని టీ తాగసాగారు.
పక్కనే ఉన్న రాజీ తలని భుజంమీదకు ఆనించుకుని “కొంచెం ఓపిక పట్టు రాజీ, ఇంతకన్నా మార్గం లేదు” అంటూ రాజి చేతికి టీ కప్పు అందించింది అపర్ణ. కొడుకు క్షేమం గురించి అల్లాడుతూ అలానే నిద్రకొరిగింది రాజీ. బయట పోర్టికోలో మాట్లాడడం మొదలుపెట్టాడు కృష్ణ. సిద్ధాంత్ ఇంటికిచేరే దాకా కనిపెట్టుకొని ఉంటాడని చెప్పాడు. “మరి ఈ విషయం రాజీకి చెప్పవా?” అని అడిగాడు గణేష్. “ఇంకేమైనా ఉందా? అతని సెల్‍కి ప్రతీ అయిదునిముషాలకి ఫోన్ చేసి ప్రాణం తీస్తుంది.” అన్నాడు నీరసంగా కృష్ణ.
“నువ్వుకూడా ఆ అమ్మాయి మనసు అర్ధం చేసుకోకపోతే ఎలా కృష్ణా? ఆదుర్దా సహజమే కదా!” అన్నాడు గణేష్.
“ఊరుకో గణేష్! వాడు ఫోన్‍లో చెప్పిన మాటలు, వాడి గదిలో దొరికిన నోట్స్ చదివితే నేను అసలు ఎప్పటికైనా తలెత్తుకోగలనా అనిపిస్తుంది. వాడు పెద్దవాడవుతున్నాడనే ఇంగితజ్ఞానం మా ఇద్దరికీ లేకపోవడంవల్ల ఇలా అయ్యింది” అన్నాడు కృష్ణ.
“ఏమన్నాడు?” అని అడగడానికి సంకోచపడుతున్న గణేష్‍కి మెల్లగా చిన్న పుస్తకం తీసి ఇచ్చాడు చదవమన్నట్లుగా. సిద్ధాంత్ తన మనసులోని అలజడిని రాసుకున్నాడు నోట్స్‌లాగ. వాడికి అంత మంచి భాష, భావప్రకటనా సామర్ధ్యం ఉన్నాయని తెలియదు. మదిలోని బాధ, అలజడి, సంఘర్షణ అన్నీ వివరంగా రాసుకొన్నాడు.
ఈరోజు నాన్న అలసిపోయి, ఆఫీసునుండి లేటుగా వచ్చారు. రాగానే అమ్మ విరుచుకుపడింది. ఇంత లేట్‍గానా రావడం, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారని అనుకున్నాను. ఎప్పుడూ ఇంతే. మీ పనులకు ప్రయారిటీ ఉంటుంది. నన్ను తీసుకువెళ్ళడానికే మీకు తీరిక ఉండదు- అంటూ గొడవ చేసింది.
ఒంట్లో బాగాలేదా రాజీ! చెప్పనే లేదేం?- అంటూ దగ్గరికి వచ్చిన నాన్న మొహంలో ఆదుర్దాని లెక్కలేనట్టుగా వదిలేసింది. కిట్టీ పార్టీలకి, బ్యూటీ పార్లర్‍కి, షాపింగ్‍కి ఒంటరిగానే తిరిగే అమ్మ జనరల్ చెకప్‍కిమాత్రం నాన్నతోనే వెళ్లాలనుకొంటుంది. ఎందుకో?
మరో సంఘటన.
నేను స్కూలునుంచి వచ్చేసరికి అమ్మ, నాన్న ఇంట్లోనే ఉన్నారు. దేనిమీదో వాదన అయినట్టుంది. ఇద్దరి మొహాలూ జేవురించి ఉన్నాయి. నేను రావడం చూసి, అమ్మ బెడ్రూమ్‍లోకి, నాన్న జిమ్‍కి వెళ్లిపోయారు. నాన్న సత్యాగ్రహంకి దిగడంతో ఇంట్లో నిశ్శబ్దం. ఇలా ఓ రెండురోజులు గడిచాక అమ్మ మొబైల్ ఫోన్ విరిగిపోయింది. ఆ తర్వాత ఎలా సర్దుబాటు అయ్యిందో తెలియదుకానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
మరోరోజు.
చిన్నాయనమ్మ రిటైర్ అయ్యింది కదా! బాబయ్య, అత్తా అమెరికాలో ఉన్నారు, నానమ్మని మన దగ్గరికి తెచ్చుకొందాం నాన్నా! -అని అడిగితే, నాన్న మోహంలో సంతోషం. నానమ్మ పోతే, చిన్నప్పటినుండి, చిన్నాయనమ్మే నాన్నని సాకింది. పిన్ని అంటే ఎంతో ఇష్టం నాన్నకి. నాన్న అమ్మని అడిగితే-
పెద్దవాళ్ళు పెంచితే పిల్లలు చాదస్తంగా తయారవుతారు, మనం ఇద్దరం ఆఫీసులో ఉంటాం. ఆవిడకి ఏదైనా వస్తే, ఎవరు చూస్తారు
-అంటూ అయిష్టం చూపించింది.
ఇలాంటివి వాడు చాలా వ్రాసుకొన్నాడు. ఈ సంఘర్షణ వాడి వయసు, మనసుమీద ఎంత ప్రభావం చూపించి ఉంటుందో… పాపం పిచ్చితండ్రి! అనుకున్నాడు గణేష్. కృష్ణని మెల్లిగా కదిపాడు.
“ఏం చేద్దామనుకుంటున్నావు?” అడిగాడు.
“వైజాగ్ వెళ్ళాలి గణేష్, కానీ మొహం చెల్లట్లేదు. వాడు ఫోన్‍లో ఏమన్నాడో తెలుసా? ఇలా అస్తమానం తగవులు పడడానికేనా ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు? అని అడిగాడు. ఇంట్లో మమ్మల్ని ఆపే పెద్దవాళ్లు లేకపోవడం, చిన్నవాడి మనసుమీద ఇది ప్రభావం చూపుతుందేమో అనే జ్ఞానం లేకపోవడం ఈరోజు ఇలా పరిణమించడానికి కారణమైంది”
“…”
“నువ్వూ నాతో వస్తావా? సిద్ధాంత్‍ని నేనొక్కడినే ఫేస్ చేయాలంటే గుండెదడ వస్తుంది” అన్నాడు కృష్ణ.
“ఒకసారి రాజీతో ముందు మాట్లాడు. నువ్వు చెప్పకపోతే వాడు ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయాడో ఎలా తెలుస్తుంది తనకి? నువ్వు ఇప్పుడు ఏ హామీ ఇచ్చి తీసుకువచ్చినా రాజీ తోడ్పాటు లేకపోతే కష్టం కదా?” అన్నాడు గణేష్. ఒక నిట్టూర్పు విడిచాడు కృష్ణ.
“నిజమే గణేష్! రేపే బయలుదేరతాను వైజాగ్‍కి. రెండు టిక్కెట్లు బ్లాక్ చేయమని చెపుతాను. ఒకవేళ రాజీ రాను అంటే మాత్రం నువ్వు రావలసి ఉంటుంది” అన్నాడు కృష్ణ.
గణేష్‍కి కృష్ణ మంచి స్నేహితుడు. పెళ్లికాకముందు ఇంట్లో ఒక పిల్లవాడిలా తిరిగినవాడు. తనకి, అపర్ణకే కాక పిల్లలకి కూడా మంచి స్నేహితుడు. నిమిషాలమీద పిల్లల పనులు చేసేవాడు. తాను కంపనీ ప్రాజెక్ట్ పనిమీద ఆరునెలలు అమెరికా వెళితే ఇక్కడ తన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. కృష్ణ-రాజీల వివాహం తరువాత కొంచెం దూరం జరిగినా, రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడలేదు.
“రాజీకి నచ్చచెప్పి తీసుకువెళ్ళు కృష్ణా! ఏ వైపునుంచి చూసినా అదే కరెక్టు” అన్నాడు గణేష్. రాత్రి చాలాసేపటిదాకా అక్కడే ఉండి ఇద్దరికీ హితవు చెప్పి బయలుదేరారు అపర్ణ-గణేష్. ఇంటికి వస్తుంటే అపర్ణ అడిగింది గణేష్‍ని.
“ఏమైందసలు? కృష్ణ రాజీని కన్నెత్తి చూడడం లేదు” అన్నది అపర్ణ.
“వాళ్లిద్దరూ మాట్లాడుకొంటే తగవుల్లోకి పరిణమిస్తుంది అపర్ణా! అది భరించలేకే సిద్ధాంత్ ఇంటినుండి వెళ్ళిపోయాడు. కాకపోతే వాడు చాలా ధృడనిశ్చయంతో ఉన్నాడు. వైజాగ్ వెళుతున్నానని ధైర్యంగా చెప్పాడు. వాడి ఉద్దేశ్యం వీళ్ళని హర్ట్ చేయాలని కాదు. ఈ ఇద్దరు సౌఖ్యంగా, సరదాగా ఉండాలని ఆశిస్తున్నాడు” అన్నాడు గణేష్.
“వీళ్ళిద్దరూ ఒకరి సమక్షంలో ఒకరు ఇబ్బందిగా ముభావంగా ఉండడం ఈమధ్య జరుగుతూనే ఉంది. ఒకరినొకరు అర్ధం చేసుకొని కోరి పెళ్లిచేసుకొన్నారు. నాకు తెలిసినంతవరకూ ఆర్ధిక ఇబ్బందులు లేవు. కృష్ణ విడిగా సాఫ్ట్ పర్సన్. జీవితాన్ని ప్రేమిస్తాడు. తన సిద్ధాంతాలు తనవైనా ఎవరినీ బలవంతం చేయడు. రాజీకి, అతనికి పడకపోవడం అనేది విచిత్రంగా ఉంది” అన్నది అపర్ణ.
“ఊ .. కృష్ణ గురించి బాగానే చెప్పావు. మరి రాజీ?” అన్నాడు నవ్వుతూ గణేష్.
“రాజీ కనబడడానికి డామినేటింగ్‍గా కనిపిస్తుంది, గారాబంగా పెరిగిన పిల్ల. ఎటెన్షన్ సీకింగ్, తనమాటే చెల్లాలనే మంకుతనం ఉన్నాయి. అయినా ఒకరినొకరు ఇష్టపడి, కావాలని అనుకునే పెళ్లి చేసుకున్నారు కదా!” అన్నది అపర్ణ.
“ఇద్దరూ విడిగా మంచివాళ్ళే అపర్ణా! కానీ జీవితంపట్ల దృక్పధాలు వేరు. ఆ అమ్మాయికి సమాజంలో గుర్తింపు, అందరి దగ్గరా మంచిపేరు కావాలి. తనమాట మీరజాలని భర్త కావాలి. లైఫ్‍ని ఎంజాయ్ చేయాలనే తపన ఉంది. కృష్ణకి ఆర్థికపరమైన హోదా, తాను నిర్మించుకున్న నాలుగుగోడల మధ్య ప్రశాంతత కావాలి. వర్క్‌హాలిక్. తాను ఎవరినైనా కావాలని అనుకోవాలిగాని, ఎవరైనా తనని కావాలనుకుంటే మాత్రం వెనకడుగు వేస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందులేవీ లేవన్నావుకదా! అదే పెద్ద సమస్య. ఆర్ధికంగా ఇబ్బంది ఉంటే జీవితంలో స్ట్రగుల్ ఉంటుంది. సహజంగా ఉండే పోరాటపటిమను ఆర్ధికంగా ఉండే ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగిస్తారు. సమస్య లేకపోవడంతో జీవితంలో అనవసరవిషయాలలో ఈ పోరాటపటిమను ఉపయోగిస్తారు. ఒకరినొకరు గెలవాలనే తపనలో హిట్లర్ అయిపోతారు. అర్ధం చేసుకోవడం అన్నావుకదా, సాధారణంగా చాలామటుకు ప్రేమవివాహాలలో ఒకరినొకరు అనే కాన్సెప్ట్ ఉండదు. ఒకరు పూర్తిగా నిల్ అయితేనే ఆ పెళ్లి నిలుస్తుంది. ఏ బలహీనక్షణంలోనో, విచారంతోనో, మొదలయ్యే స్నేహం సహజమైన ఆకర్షణ వలనో, వయసు ప్రభావంచేతనో ప్రేమ అనే భావనతో ప్రేమించడం మొదలుపెడతారు. బెటర్ సైడ్ చూపించుకొంటూ, ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకొంటూ వ్యక్తిత్వాలు మరుగునపడిపోతాయి ఒకవేళ అంతగా నచ్చని విషయం బయటపడినా, దాన్ని మేం మా చాతుర్యం తో మార్చుకోగలమనే భ్రమలో ఉంటారు. పెళ్లి అయిన తరువాత మొదటి అభిప్రాయబేధానికే విపరీతంగా రియాక్ట్ అవుతారు” అన్నాడు గణేష్.
“మరి పెద్దలు కుదిర్చిన వివాహాలలో ఇవన్నీ ఉండవా?” అని అడిగింది అపర్ణ.
“ఉంటాయి. కానీ ఒకరినొకరు తెలుసుకోవాలనే కోరిక, అవతలివారి ఇష్టాయిష్టాలు, అవసరాలు తెలుసుకొనేటప్పటికే దంపతుల మధ్య ఒక అనురాగం ఏర్పడుతుంది. నునుసిగ్గులు, మోమాటాలు తీరేటప్పటికీ అంతర్లీనంగా పటిష్టమైన బంధం తయారవుతుంది. బాధ్యతలను పంచుకోవడంలో, పిల్లలను పెంచడం లో, పెద్దవాళ్ళను చూసుకోవడం లో ఆనందాన్ని చవిచూస్తారు”
“…”
“పెళ్ళికి ముందే కాగితంమీద టాస్క్ లిస్టులు రాసుకొనే నెగోషియేషన్ పెళ్ళిళ్ళకి జీవితకాలం ఎంత? ఈ మధ్య ఆఫీసులో పెళ్లి చేసుకోబోయే జంట, అబ్బాయి తల్లిని గుడికి, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లే పని ఎవరిదో రాసుకొంటుంటే వారి మానసికస్థాయిని అర్ధం చేసుకోవచ్చు. అలా అని అన్ని ప్రేమవివాహాలు ఇలాగే వుంటాయని, అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నీ సుఖంగా ఉంటాయని అనుకోలేం” అన్నాడు గణేష్.
“కానీ, పెళ్ళికిముందే పరిచయం ఉంటే బాగుంటుందేమో?” అన్న అపర్ణ మొహంలోకి తరచి చూశాడు గణేష్.
“ఏం? ఏనాటికైనా ఆ థ్రిల్ మిస్ అయ్యానని అనుకొంటున్నావా?” నవ్వుతూ అడిగాడు నలభై అయిదేళ్ల అపర్ణని.
అప్పుడే సన్నగా వెండిని అద్దుకొంటున్న మీసాలకిందనుంచి, చక్కటి ఆరోగ్యమైన చిగుళ్ల మధ్యనుండి సమమైన పలువరసనుంచి విరుస్తున్న ఆ నవ్వును చూస్తూ మైమరిచిన ఆమె అంతలోనే తెలివితెచ్చుకొని, “ఛ! అదేం లేదు” అంది తాను కూడా నవ్వేస్తూ.
మర్నాడు సాయంకాలం ఆరుదాటుతుండగా కృష్ణ ఫోన్. దంపతులిద్దరూ కలిసి వెళ్లారని, సిద్ధాంత్‍తో విడివిడిగా రెండు గంటలు మాట్లాడారని చెప్పాడు. వాళ్ళ పిన్నితోకూడా మాట్లాడి, ఆమెను వచ్చి తమతో ఉండడానికి ఒప్పించారని, ఓ రెండురోజులు ఆగి అక్కడి వ్యవహారాలు చక్కబెట్టి వస్తామని చెప్పాడు.
“చలో! సుఖాంతం అయ్యింది” అన్నాడు గణేష్.
చిన్న చిరునవ్వు నవ్విన అపర్ణ “ఈ ప్రభావం సిద్ధాంత్‍మీద ఎన్ని రోజులుంటుందో?” అన్నది.
“వాడి వయస్సుకన్నా, వాడు పెద్దగా ఎదిగాడు అపర్ణా! నిరంతరం తల్లిదండ్రుల వ్యక్తిత్వాలమధ్య ఘర్షణ, ఇంట్లో ఆదరించే పెద్దవాళ్ళు లేకపోవడంతో తనకి చేతనైనట్టుగా జీవితాన్ని ఆకళింపు చేసుకున్నాడు. లాజికల్‍గా ఆలోచించడం, సమస్య ఎక్కడుందో పట్టుకోగలగడం వాడికి వచ్చింది. ఇంత డిస్టర్బన్స్ ఉండి, లోలోపల ఉడుకుతున్న కుటుంబంలోకి పెద్దకుదుపు తీసుకువచ్చాడు. నాయనమ్మను తెచ్చుకోవడంద్వారా ఓ చిన్న మార్పునూ తీసుకువచ్చాడు. ఇకనైనా కృష్ణలో లొంగుబాటుతనం తగ్గి, కొంచెం గట్టిగా ఉండి, లోలోపల ముడుచుకోకుండా, తాను తన కుటుంబం ఎలా వుండాలనుకొన్నాడో అలా మలచుకోగలగాలి. రాజీకూడా తన బాధ్యతనెరిగి సిద్ధాంత్‍పట్ల ప్రేమ, కృష్ణతో అన్యోన్యత ప్రకటించగలిగితే వాడి కుటుంబం కుదుటపడుతుంది” అన్నాడు గణేష్.
“నిజమేనండీ! చాలా మంచిస్నేహితులు వాళ్ళిద్దరూ మనకి. ఇలా బాధపడుతుంటే సిద్ధాంత్‍మీద కోపం వచ్చింది. కానీ వాడు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్‍లా పనిచేస్తుందనిపిస్తుంది” అన్నది అపర్ణ.
“ఇలాంటి పెళ్లిళ్లలో కృష్ణ లాగా ఒకరు నిల్ అయిపోవడం సాధారణం. దాంపత్య జీవితం ఓ పూర్ణంలాంటిది. ఎన్నో భాగాలు కలిస్తేనే అది సంపూర్ణంగా రూపుదిద్దుకొంటుంది. కేంద్రబిందువుమాత్రం అనురాగమే. ఇద్దరి అభిరుచులు, అలవాట్లు వేరువేరు అయినాగానీ, సరయినదిశలో ప్రయాణిస్తూ, ఒకరికొకరు అర్ధం చేసుకొని నడుచుకొంటేనే ఆ సంపూర్ణత సిద్ధిస్తుంది. ఏ బిందువు దగ్గరైనా నిలుచుని వెనక్కి తిరిగి చూసుకొంటే ఏదైనా కోల్పోయిన భావన వస్తే ఆ వివాహం ఆనందదాయకం కాదు. చిన్నచిన్న సర్దుబాట్లు, వేచి చూడడాలు, ఎదుటివారి ఇష్టాలను తెలుసుకోవడం, అంగీకరించడం, పడకగది దాటని ప్రణయకలహాలు, ఒకరికోసం ఒకరు నేర్చుకొనే ఒద్దిక.. ఇవన్నీ ఆనందంగా తలచుకోగలిగితేనే బిందువు పూర్ణ బిందువు గా మారుతుంది” అన్నాడు గణేష్.
“సున్నితమైన, రేఖామాత్రమైన బంధాలు కలకాలం నిలబడగలిగే రహస్యం ఇదేనన్నమాట.” అంటూ నవ్వింది అపర్ణ.
వైశాఖమాసంలో ఘల్లున తాకే మల్లెల గుభాళింపులా ఉన్న ఆ నవ్వును ఆస్వాదిస్తూండిపోయాడు గణేష్.