గోడమీద బొమ్మ ఇంకా పూర్తవలేదు. రెక్కల గుర్రానికి రెండో రెక్క వేస్తోంది. చేతిలోని బొగ్గుముక్క అయిపోవడానికి సిద్ధంగా ఉంది. రెక్కలని అందంగా వేయాలని చూస్తుంది. అంతలో బిగ్గరగా తలుపు తోసి లోపలికొచ్చిన చప్పుడు, గట్టిగా అరుస్తూ బొగ్గుముక్క ఉన్న చేతిని బలంగా తన్నాడు ఒకడొచ్చి. బొగ్గు ముక్క ఎగిరిపోయింది. ఎక్కడ పడిందో కనబడలేదు. బొమ్మ పూర్తయింది. కానీ, రెక్కలు అందంగా అనిపించడంలేదు. రెక్కలగుర్రంమీద రాజకుమారుడు నల్లరంగుతో మాసినగోడలమీద ఒక చీకటిగదిలో ఒకమూలన.
జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చాడు గది బయటికి. వాడి చేతిలో పెద్దగన్ను ఉంది. గట్టిగా ముందుకు తోసుకుంటూ ఇరుకైన కారిడార్‍లో నడిపించుకొని పోతున్నాడు. టైం ఎంతయిందో తెలీదు. బహుశా ఉదయం అయుంటుంది. అందుకే వీడొచ్చి ఇంత మర్యాదగా తీసుకెళ్తున్నాడు పని చేయించుకోవడానికి అనుకుంది.
బాత్రూములు, లేవటరీలు క్లీన్ చేయడంతో మొదలవుతుంది తన దినచర్య. రొట్టెలు చేయడం, కాల్చడం మూడుపూటలా. పాలు కాచడం, టీ చేయడం రెండు పూటలా. తనతోపాటూ ఉన్న మిగిలిన ఆడపిల్లలకి ఇంటి పనుల్లోనే వీలున్నప్పుడు సహాయపడడం సాయంత్రంవరకూ. చీకటిపడితే గదిలోకి ఎవరొస్తారో తెలీదు, ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, రోజుకొకలాగ ఉంటుంది అవస్థ. ఉదయంవరకూ ఉండి పోనీ తోడుగా ఏమన్నా మాట్లాడతారా అంటే? అది కూడా లేదు.
బయటి ప్రపంచంలోకూడా ఇలానే ఉంటుందేమో?? ఎప్పుడో చిన్నప్పుడే ఇక్కడికి తీసుకొచ్చేశారు నిండా పది, పదకొండేళ్ళుకూడా ఉండవేమో నాకు. అప్పటికే దేశపరిస్థితి పెద్దగా బాగాలేదు. అందులోనూ మా ఊరి పరిస్థితి ఇంకా అధ్వాన్నం. పరిస్థితి అంటే ఆర్థికపరిస్థితి. కానీ, ఆ లోటు తెలియకుండా చేయడానికే ఉందన్నట్టు ప్రకృతి చుట్టూ. అందమైన కొండలు, మంచుతో ఉంటాయి చాలావరకూ. దానిలో చిన్నలోయలాంటి ప్రదేశంలో మా ఊరు. కొండమీద పుట్టిన చిన్నచిన్న సెలయేళ్ళు వేసవి మొదలుగాకముందునుంచీ చలికాలం మొదలైనంతవరకూ గలగలా పారుతాయి. చలికాలంమాత్రం ఇంట్లో మంచుని కరగబెట్టాల్సిందే. స్కూలు లేదు. దగ్గర్లోనే ఎవరో పెద్దాయన రోజూ ఏదో చెబితే అతని అనుభవాల్లోంచి, అదే మాకు చదువు. అదే ఉపయోగడుతుందేమో మరి! అప్పట్లో తెలియలేదు, తర్వాత తెలిసే అవకాశమూ రాలేదు.
మాదేశం ఎప్పుడూ వార్తల్లో ఉండేది. ఆ తాత చెబుతుండేవాడు. అతనిదగ్గర ఒక పాతరేడియో ఉండేది. దాన్లోంచి వచ్చేవే మా ఊరందరికీ చెప్పేవాడు. ఊరంటే ఐదువందల గడపలూ, పదిహేనువందలమంది జనం కాదు. పదిహేను ఇళ్ళు, పాతికమంది జనాభా. అదే మా ఊరు. అదంటే నాకు చాలా ఇష్టం. కొన్నిరోజులకి మా ఊరిని దాటుకుంటూ చాలా పెద్దపెద్ద వాహనాలు వెళ్ళేవి, అవన్నీ మిలటరీ వాళ్ళవంట. వాటిని ట్యాంకర్లు అంటారట. అలానే ఆకాశంలో కూడా విమానాలూ, హెలీకాప్టర్లూకూడా వెళ్ళేవి. చాలా గందరగోళంగా, గొడవ గొడవగా ఉండేది. అవి తిరుగుతున్నంతసేపూ. అవి ఆగిపోతే బాగుండు అనుకుంటుండేదాన్ని, ఎందుకంటే ఆ గొడవలో మా ఊరి వేసవిని ఆస్వాదించడం జరగదని.
అలానే అయింది కొన్నిరోజులకి, రాకపోకలూ, శబ్దాలూ ఆగిపోయాయి. నేననుకున్నందుకే అయిందేమోనని అనుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. నేనేదనుకుంటే అది అయిపోతుందనే పిచ్చిభావన మనసులో పుట్టింది. కొన్నినెలలు చాలా ఆనందంగా గడిచాయి. చలికాలం ప్రారంభమైంది మా లోయలో. చలికాలం త్వరగా అయిపోవాలనుకున్నాను. కానీ, అలా కావటం లేదు. నాకు భయం మొదలైంది. నేననుకున్నది కావడంలేదని. చాలానెలలు చలికాలం ఉండబోతుందని తాత చెప్పాడు.
అంతలో దేశంలో అల్లకల్లోలం మొదలైందట. మా ఊరికి కొంతమంది మనుషులు గన్‍లూ, బాంబులూ చేతుల్లో పట్టుకొని వచ్చారు. ముసలాళ్ళని ఏం చేయలేదు. మా నాన్ననిమాత్రం వచ్చిన గుంపు వాళ్ళతో తీసుకెళ్ళిపోయింది. అలాగే, చాలామంది నాన్నలనుకూడా. మా అమ్మ ఏడుస్తూనే ఉండేది చలికాలం తగ్గిపోయేంత వరకూ.
వేసవి మొదలవబోతుంది, ఈసారి ఇంకా పెద్దగుంపు వచ్చారు. గుంపులో మానాన్న లేడు, మా ఊరివాళ్ళ నాన్నలెవరూ లేరు. మగవాళ్ళెవరూ లేకపోవడంవల్లేమో మరి, వాళ్ళు నన్నూ, అమ్మనీ కూడా పట్టుకెళ్ళారు. కానీ, మా అమ్మతో నన్ను ఉండనివ్వలేదు. ఇక్కడికి తెచ్చిపడేశారు నన్ను. మా అమ్మ ఎక్కడికెళ్ళిపోయిందో. ఆరుసంవత్సరాలవుతోందేమో నేను ఇక్కడికొచ్చి. ఇక్కడికొచ్చినప్పటి నుంచీ ఖాళీ లేకుండా పని. పశువుల్నికూడా మా ఊళ్ళో చాలాప్రేమగా చూసుకునేవాళ్ళం. ఇక్కడ నామీద నాకే జాలివేసేటట్లు చేశారు. ఏం చేస్తారో తెలీదు, ఈ ఆరుసంవత్సరాలలో వందలమందిని చూశాను.
మొదట్లో మానాన్న వయస్సున్నవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. రానురానూ ఇక్కడుండేవాళ్ళ వయస్సులు తగ్గిపోసాగాయి, తుపాకుల సైజులుమాత్రం పెరగసాగాయి. అందరి కళ్ళల్లోనూ కోపం, క్రోధం, ఆవేశం. ఆ ఆవేశాన్ని అణచుకోలేక, మామీద వెళ్ళగక్కడం. ఎన్నిగాట్లున్నాయో నావంటిమీద, లెక్కెట్టుకోవడానికే మూడునెలలు పడుతుందేమో. ఇంత జరుగుతున్నా నాకు చచ్చిపోవాలన్న ఆలోచన రాలేదు. అసలు ఆలోచనలే రాలేదు మొన్నరాత్రివరకూ.
ఆరోజు ప్రతీరాత్రిలానే ఎవరో వచ్చారు. తలుపుతోసుకుని ఎప్పట్లా కాకుండా, కొంత జాగ్రత్తగా. క్రొత్తగా అనిపించింది ఇన్నేళ్ళలో ఎప్పుడూ తలుపు తన్నడమేకానీ, తోసుకొని జాగ్రత్తగా వేసి లోపలికి రావడం నిజంగా వింతే అనిపించింది. వచ్చినప్పటినుంచీ రాత్రుళ్ళు ఎవరూ నాతో మాట్లాడ్డం ఎరగని నేను, ఆరోజు మొదటిసారి ఒక మగగొంతు ఏడవడం విన్నాను. అది భయంతోనా, బాధతోనా అనిమాత్రం చెప్పలేకపోయా. ఎప్పుడూ అందరూ నన్నే దగ్గరకు బలవంతంగా లాక్కోవడమే ఎరిగిన నేను, ఆ మనిషిని దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకున్నాను. ప్రేమతో కాదు, జాలితో. పాపం అందరి మగాళ్ళకీ ఇలానే ఏడవాలని ఉంటుందేమో, లోపల బాధని బయటపెట్టడానికి కేవలం సమాజం ఏర్పరచిన మగతనం’అడ్డొస్తుందేమో??
అసలు బాధతోనే ఏడుస్తున్నాడని నేనెందుకు అనుకోవడం?? ఏదైతేనేం ఆ సమయంలో మాత్రం కరుణరసమే కరెక్టనిపించింది. నేనేం మాట్లాడకముందే ఎక్కిళ్ళమధ్యలో చెప్పడం ప్రారంభించాడు. బహుశా నేను దగ్గరకి తీసుకుని గుండెలకి హత్తుకోవడంవలన, నామీద నమ్మకం కలిగుంటుంది. ఇక్కడ ఉన్న మగాళ్ళసంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుందట. బయటనుంచికూడా ఎవరెవరో వచ్చి చంపేస్తున్నారంట వాళ్ళని, వాళ్ళకి దగ్గర్లోకే వచ్చేశారంట శత్రువులు. రెండుమూడురోజుల్లో ఇక్కడికికూడా వచ్చేస్తారట, కానీ తనకి చచ్చిపోవాలని లేదని చెబుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చివరగా.
అప్పటివరకూ లేని ఆలోచనలూ, ఆశలూ అప్పుడే ఆ క్షణమే మొదలయ్యాయి మెదడులో. గడ్డకట్టుకుపోయిన మా లోయలా ఉన్న నామనసు హఠాత్తుగా సూర్యరశ్మి పడి కరిగిన మంచు అయింది ఆ క్షణాన. ఎప్పటెప్పటివో జ్ఞాపకాలు సీతాకోకచిలుకల గుంపుల్లా తలనిండా ఎగురుతున్నాయి. ఎందుకో మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభం అవుతుందేమోనన్న బావన తలంపుకొచ్చింది. కన్నీళ్ళు ఆగిపోగానే ఆ యువకుడు కళ్ళు తుడుచుకొని గబగబా బయటికి వెళ్ళిపోయాడు, తలుపు జాగ్రత్తగా వేసి మరీ.
అతను వెళ్ళిపోతున్నప్పుడు ఆగిన ఆలోచనా పరంపర, తలుపు మూసుకున్న వెంటనే మళ్ళీ మొదలయింది. ఎందుకో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది. ఒకరాజ్యంలో రాజు, రాణి, వారి కూతురు యువరాణి ఉండేవారు. తల్లినీ, తండ్రినీ వాళ్ళ సైన్యాధిపతే చంపేసి యువరాణిని చిన్నప్పుడే బంధీచేసి చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. ఆ యువరాణి చాలా అందమైంది, తెలివైంది, మంచిది, ధైర్యవంతురాలు. అలా మా అమ్మ చెబుతున్నప్పుడు నన్నే ఆ యువరాణిగా అనుకునేదాన్ని. అయితే ఆ రాజ్యప్రజలు కొత్తరాజు పెట్టే బాధలు భరించలేక పక్కరాజ్యం రాజును తమను కాపాడాల్సిందిగా వేడుకుంటారు. ఆ రాజు సరేనని ఒప్పుకుని తనవద్ద ఉన్న పెద్ద సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యానికి సారథ్యం వహించేది ఆ దేశ యువరాజు. ఆ యువరాజు ఒక అందమైన రెక్కలగుర్రంపై వస్తాడు, వచ్చి ఆ దుష్టరాజుని సంహరించి, వెళ్ళిపోతున్నప్పుడు బంధించబడిన యువరాణిని చూస్తాడు. ఆమెను విడిపించి, చెయ్యి అందిస్తాడు గుర్రమెక్కమని. అలా వెళ్ళిన యువరాణి ఆ యువరాజుని పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉంటుంది. ఇది కథ. నాకు చిన్నప్పటినుంచీ ఈ కథ చాలా ఇష్టం. ఇన్నేళ్ళకు మళ్ళీ గుర్తొచ్చింది. అదే నేను బొమ్మగా వేద్దామనుకున్నా, నా గదిలో.
అలా వేస్తున్నప్పుడే, కొట్టి నన్ను ఈడ్చుకుపోతున్నారు ఇప్పుడు. ఇంతలో పెద్దశబ్దం. బాంబు పడినట్టు. అందరూ అటూఇటూ పరిగెడుతున్నారు. నన్ను విడిచిపెట్టేసి, నన్ను పట్టుకున్నవాడుకూడా పరుగెట్టాడు. వాడి తుపాకీని ఎదురుగా గురిపెట్టుకుంటూ. ఇరవైనిమిషాలు గడిచాయి. నేను ఒక గదిలో దాగుండిపోయా, కానీ బాంబుపడడంవల్లేమో పైకప్పు పూర్తిగా ధ్వంసమైపోయింది. సూర్యకిరణాలు పడి గది వెలుతురితో నిండింది. అప్పటికే శబ్దాలు ఆగిపోయాయి. ఐతే చిన్నప్పుడు విన్న హెలికాప్టర్ శబ్దంమాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఆ పైకప్పు కన్నంలోంచి పైకి చూస్తున్నా. సూర్యరశ్మి కంటిలోపడి సరిగ్గా కనిపించడంలేదు. ఎవరో ఒక వ్యక్తి, నల్లని దుస్తులతో ఉన్నవాడు తాడు సహాయంతో లోపలికి దిగుతున్నాడు, చెయ్యి చూపాడు, నా చెయ్యి అందించమని సైగ చేశాడు. పట్టుకున్నాడు గట్టిగా. దగ్గరగా తీసుకొని ఏదో సంజ్ఞ చేశాడు, మెల్లిగా పైకి లేవసాగాం ఇద్దరం, పైన గర్వంగా ఎగురుతున్న మిలటరీ హెలీకాప్టర్, రెక్కలగుర్రంలాగా.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.