“ఏమండీ! ఎవరూ?” ఫోన్‍లో మాట్లాడుతున్న కృష్ణమూర్తిని అడిగింది ఆయన అర్ధాంగి అనసూయ వంటింట్లో నుండి చేతులు తుడుచుకొంటూ వస్తూ.
“అబ్బాయే! అమెరికా నుంచి” అని కృష్ణమూర్తి అన్నాడో లేదో “ఏదీ, ఇలా ఇవ్వండీ నేను మాట్లాడతాను” అంది అనసూయ ఆరాటంగా.
“ఉండవోయ్. ఇప్పుడేగా, ఫోనొచ్చింది? నేను మాట్లాడుతున్నాగా? అయిపోయాక ఇస్తాను” చెప్పేడు కృష్ణమూర్తి.
“ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఎప్పుడొస్తాడట?” ప్రశ్నల వర్షం కురిపిస్తున్న భార్యతో .
” నేను నీతో మాట్లాడనా? వాడితో మాట్లాడనా? సరే! అదేదో నువ్వే మాట్లాడి నాకు చెప్పు వాడేమన్నాడో” అని ఫోన్ ఇచ్చేసేడు భార్యకి కృష్ణమూర్తి. భర్త అలకని ఆ సమయంలో పట్టించుకోలేదు అనసూయ. వెంటనే ఫోన్ తీసుకొని వంటింట్లో కి వెళ్ళిపోయి మాట్లాడడం మొదలుపెట్టింది. “అభీ! ఎలా ఉన్నావు? సత్య ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు?” అంటూ.
అమ్మ అనురాగం, ఆప్యాయతకు సెల్ వేడెక్కిపోయింది. అంటే అంత సేపు మాట్లాడిందన్నమాట. “ఇంకా అవలేదా మాట్లాడడం?” అని కృష్ణమూర్తి అనేసరికి అనసూయ కళ్ళు కొడుకుని చూసినంత ఆనందంతో చెమ్మగిల్లేయి. అది గమనించిన కృష్ణమూర్తి “ఇంతకీ వాడేమంటున్నాడు?” అని అడిగేడు.
“ఏమంటాడు? అమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్నగారెలా ఉన్నారు?” అని అడిగేడు.
“సరేలే అవి మామూలే. ఇంతసేపు మాట్లాడేవుకదా, ఏంటి కబుర్లు?” ఆరాతీసేడు కృష్ణమూర్తి.
“మీ పుట్టినరోజు ఎప్పుడని అడిగేడు”
“ఎందుకూ ? చెప్పేసేవా? వింతేముంది? ప్రతి ఏడాదీ వచ్చేదే కదా!”
“అడిగేక చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా ఈ ఏడాది ప్రత్యేకమే. తమరు 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు” అని తెలియజెప్పింది అనసూయ.
“అయితే ?’
“అయితే ఏంటి? వాడు మీ షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా జరిపిస్తాడంట” చెప్పింది గొప్పగా అనసూయ.
“అలాంటివి నాకు ఇష్టం లేదని తెలుసుకదా?” అన్నాడు కృష్ణమూర్తి.
“మీకు ఇష్టంలేకపోయినా వాడి సరదా వాడిది. అయినా అంత అభిమానంతో కొడుకు అమెరికానుండి వచ్చి చేస్తానంటుంటే మీరేంటి?” దెప్పిపొడిచింది భర్తని.
“వాడి సరదా వాడిదైతే నా సరదా నాదీ”
“ఈ దొరగారి సరదా ఏమిటో” వేళాకోళంగా అంది అనసూయ.
“చూద్దువుగాని”
“మీతో మాట్లాడలేను “అంటూ ముఖం తిప్పేసుకుంది అనసూయ.
“అందుకే మాట్లాడకుండా పడుకో” అంటూ నిద్రకుపక్రమించేడు కృష్ణమూర్తి.
నాలుగురోజుల తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది కృష్ణమూర్తికి కొడుకునుండి. సారాంశం ఏమిటంటే “మీ షష్టిపూర్తి ఫంక్షన్‍కి అన్ని ఏర్పాట్లూ చేయమని బలరాం బాబాయ్‍కి చెప్పేను. అన్నింటికీ ఖర్చు ఎంతవుతుందో కనుక్కొని చెప్పమని చెప్పేను. ఆ డబ్బులు నేను మీకు పంపిస్తాను. అవి బాబాయికి ఇవ్వండి. అన్ని ఏర్పాట్లూ చేస్తాడు. మీరేం శ్రమ పడనక్కరలేదు. మేము ఆరోజు ఉదయం వస్తాము. సాయంకాలం ఫంక్షన్. ఈలోపు నాకు రావడం అవదు. అందుకే బాబాయికి పనిపెట్టేను అని” ఇంతలో కాలింగ్‍బెల్ మోగింది.
తలుపు తీయగానే బలరామ్ ప్రత్యక్ష్యం.
“బలరాం, రా రా! నూరేళ్లాయుష్హు. ఇప్పుడే నీగురించి అనుకొంటున్నా. మావాడు ఫోన్ చేసేడు. నీకూ చేసేడట కదా?” అడిగేడు కృష్ణమూర్తి.
“అవునన్నయ్యా! అభిరామ్ నాకు చెప్పినవన్నీ నీకూ చెప్పే ఉంటాడు అందుకే వచ్చేను” అన్నాడు బలరామ్. ఇంతలో అనసూయ “మరిదిగారూ! బాగున్నారా!?” అంటూ వచ్చింది.
“బాగున్నాం వదినా!”
“చెల్లెమ్మ ఎలా ఉంది?” అని కుశల ప్రశ్నలడిగింది. ఇంతలో ‘అనసూయా! బలరామ్‍కి ముందు మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా, టిఫిన్ తయారయేలోపు ” ఆర్డరిచ్చేడు అనసూయ వాళ్లాయన.
‘అన్నయ్యా! నా టిఫిన్, కాఫీ అయిపోయాయి. వదినా! నువ్వేం పని పెట్టుకోకు. అభిరామ్ చెప్పిన పనిమీద వచ్చేను. ఏమిచేయాలో, ఎలా ఉండాలో, ఏవేవి ఎంతలో ఉండాలో తెలుసుకొందామని వచ్చేను” అని చెప్పేడు బలరామ్.
“పోనీ, కాఫీ తెస్తాను మొహమాటపడకండి” అంది అనసూయ.
‘మీ దగ్గర నాకు మొహమాటమేమిటమ్మా? అన్నయ్య షష్టిపూర్తి ఫంక్షన్ పనులన్నీ నావే. మీరేం కంగారుపడకండి” అన్నట్లు భరోసా ఇచ్చేడు బలరాం.
“సరే, ఈలోపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకొంటుండండి” అంటూ వంటింట్లోకి వెళ్లింది అనసూయ. అనసూయ అలా వెళ్లడమేమిటి తమ్ముడితో మెల్లగా అన్నాడు కృష్ణమూర్తి.
‘ఏ ఏర్పాట్లూ చేయవద్దు నువ్వు. నీకు తెలుసుగదా నాకిలాంటివి ఇష్టం ఉండవు”
“తెలుసుకానీ బాబాయ్, అన్ని ఏర్పాట్లూ చేసేసేవా అని అభిరాం అడిగితే ఏం చెప్పను?” అడిగేడు బలరాం.
“అన్నీ చేసేసేను అని చెప్పేయ్” అని సలహా ఇచ్చేడు కృష్ణమూర్తి.
“ఏమిటో! నువ్వు అన్నయ్యవి. నేను తమ్ముడ్ని. నువ్వు చెప్పినట్లు నేను చెయ్యాలి. కానీ ఈ విషయంలో కృష్ణమూర్తి అంటే నువ్వు ఈ బలరాముడు చెప్పింది వినాలి” మెలికపెట్టేడు తమ్ముడు. అనసూయ వంటింట్లోంచి రావడం చూసి కృష్ణమూర్తి, “ష్! మీ వదిన వస్తుంది. మరేం మాట్లాడకు. నేను చెప్పింది గుర్తుందిగా అలాగే చెయ్యాలి” అన్నాడు.
అనసూయ వస్తూ మరిదికి కాఫీ ఇచ్చి, “ఇంతకూ ఏర్పాట్ల గురించి కనుక్కున్నారా?” అని అడిగింది.
“అన్నీ కనుక్కున్నాను వదినా! అది చెప్దామనే వచ్చేను” అన్నాడు బలరాం.
“అయితే మావాడికి లెక్కంతా చెప్పేవా?” అడిగేడు కృష్ణమూర్తి.
“చెప్పేను. నువ్వూ చూడు అన్నయ్యా! ఫంక్షన్‍హాల్‍కి పదిహేను, లైటింగ్, డెకరేషన్‍కి ఐదు…. మొత్తం కలిపి అరవైవేలు”
“అయితే అదీ షస్టిపూర్తే అన్నమాట” అన్నాడు కృష్ణమూర్తి.
“అన్నమాట కాదు తమ్ముడి మాటే” అంది అనసూయ.
“ఏమిటో, మీమాటే చెల్లుతుంది” అన్నాడు కృష్ణమూర్తి.
బలరాం వదిన ఇచ్చిన కాఫీ త్రాగి “మరి వస్తా అన్నయ్యా! అభిరాం నీకు డబ్బులు పంపాక అవి నాకిస్తే అన్నీ బుక్ చేసేస్తాను. వస్తాను వదినా!” అని వెళ్లిపోయేడు.
మరో రెండ్రోజుల్లో కృష్ణమూర్తికి అభిరాంనుండి లక్ష అందింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసేడు కృష్ణమూర్తి.
‘ఏరా! మీ బాబాయి చెప్పిన లెక్క అరవయ్యే అయితే లక్ష పంపించేవెందుకూ?’ అంటూ.
‘ఏం లేదు నాన్నా! ఎందుకైనా మంచిదని … అవునూ, ఇంతకీ అందర్నీ పిలవడం అయిపోయిందా లేదా?”
“అయిపోయిందిరా!”
“ఏదీ, అమ్మకివ్వండి ఫోన్. ఓసారి మాట్లాడతాను” అనగానే, “ఏమోయ్, నీ గారాలకొడుకు నీతో మాట్లాడతాడట” అని ఫోన్ అనసూయకి యిచ్చేసేడు కృష్ణమూర్తి.
“మీకన్నీ వెటకారమే” అనుకొంటూ ఫోన్ తీసుకొంది. మాట్లాడడం అయిపోయేక “అవునూ, అందర్నీ పిలవడం అయిపోయిందని చెప్పేరట. ఎక్కడ పిలిచేం? మీరుగాని పిలిచేరా, నాకు తెలియకుండా?”
ఎవడి పెళ్ళికి వాడు పిలుచుకోడు కదోయ్? బలరాం ఈపాటికి అందరికీ ఫోన్‍లో చెప్పేసే ఉంటాడు. అయినా ఈరోజుల్లో ఇంకా పిలుపులేమిటి! వాట్సాప్‍లో ఆహ్వానపత్రికలు పంపించేయడమే” సర్దిచెప్పేడు కృష్ణమూర్తి.
“ఏమిటో మీ వ్యవహారం నాకేదో అనుమానంగానే ఉంది” వ్యక్తపరిచింది అనసూయ.
“అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారంటారు. ఔను, ఇంతకీ నీ పేరేంటి?” అడిగేడు కృష్ణమూర్తి భార్యని.
“అదేంటలా అడుగుతున్నారు? మీకు తెలియదా?” ఎదురుప్రశ్న వేసింది.
“తెలుసు చెప్పవోయ్!”
“అనసూయ”
“అంటే ఎవరు?”
“మీ భార్యని”
“అదీ తెలుసు. అదికాదు, నేనడిగింది. అనసూయ ఓ పతివ్రత. అంచేత నా మాటని గౌరవించడమే నీ ధర్మం”
“నేనెప్పుడు గౌరవించలేదు? ఈమధ్య మీరు బొత్తినా నాకు అర్ధం కావడం లేదు” నిష్టూరంగా అంది.
“నీకు అర్ధం కాకపోయినా మిగతావాళ్లకు అర్ధమయితే చాలు… అదిసరే, ఉండు బలరాంకి డబ్బులిచ్చేసి వస్తాను. అన్నీ బుక్ చేయాలి కదా?” అంటూ బయటికెళ్లపోయేడు కృష్ణమూర్తి.
షష్టిపూర్తిరోజు వచ్చేడు అభిరాం భార్యా పిల్లలతో. బలరాం, సత్య, పిల్లల పలకరింపులయిపోయేయి.
“అన్ని పనులూ అయిపోయాయా బాబాయ్? ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా?” అని అడిగేడు.
“ఊ<” అని తల ఊపేడు బలరాం అన్నయ్య కృష్ణమూర్తి చేసిన కనుసైగ చూస్తూ. ” నేనూ ఓసారి అన్నీ చూస్తా” అన్నాడు అభిరాం.
బలరాం కంగారుపడ్డాడు. “ఎందుకూ? నువ్వు చెప్పినట్లే అన్నీ చేసేను కదా! ఇంకెంతసేపు?” అన్నాడు కృష్ణమూర్తివైపు చూస్తూ. “అవునవును” అన్నాడు కృష్ణమూర్తి. సరేనని ప్రయాణ బడలిక తీర్చుకొంటూ అమ్మా నాన్నలతో కబుర్లలోపడ్డాడు . అత్తాకోడళ్ల మాటలతో, తాతామనవల ముచ్చట్లతో ఇంటికి పండుగ సందడి వచ్చింది.
“అమ్మయ్యా!” అని బలరాం ఊపిరి పీల్చుకొంటూ “వస్తాన్రా, అభిరాం. రడీగా ఉండండి అందరూ” అని అందరికీ చెప్పి నిష్క్రమించేడు.
సాయంత్రం కృష్ణమూర్తి ఇంటిముందు రెండుకార్లు వచ్చి ఆగేయి. కృష్ణమూర్తి, బలరాం, అభిరాం జంటలు, పిల్లలతో బయలుదేరేరు. కానీ కృష్ణమూర్తి, బలరాంల మనసులు మనసుల్లో లేవు. అభిరాం ఏమనుకొంటాడో, ఏమంటాడో అని.
“ఏంటి బాబాయ్! ఇక్కడ ఆపేరు?” అని అభిరాం అడిగేంతవరకూ కారు ఆగిన సంగతే గమనించలేదు. వెంటనే తేరుకొని “అందరూ దిగండి” అన్నాడు బలరాం.
“ఏంటి? ఇది ప్రేమసమాజం అనాధాశ్రమం. ఇక్కడేం పని?” అడిగేడు అభిరాం.
“దిగరా చెప్తానూ” అని కృష్ణమూర్తి అనడంతో అర్ధంకాక అందరూ దిగేరు. “అందరూ రండి” అంటూ కృష్ణమూర్తి నడిచేడు.
ఆ అనాథాశ్రమమ నిర్వాహకుడు వచ్చి స్వాగతం పలికి అందరినీ లోపలికి తీసుకెళ్ళేడు. కృష్ణమూర్తి, బలరాంలకు తప్ప మిగతావాళ్ళెవరికీ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అనాథాశ్రమ నిర్వాహకుడికి అందరినీ పరిచయం చేసేడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి కార్లో ఉన్న పార్శిళ్ళు తీయించి అక్కడున్న పిల్లలందరికీ అభిరాం చేత ఒక్కో డ్రెస్ ఇప్పించేడు. వాళ్లను డ్రస్‍లు మార్చుకొని రమ్మన్నాడు. రాగానే వాళ్లకు స్వీట్స్ పంచిపెట్టించేడు. ఆ తర్వాత అప్పటికే రడీ చేసి ఉంచిన స్పెషల్‍భోజనం వడ్డించబడింది. ఇదంతా ఫంక్షన్‍కి ముందు తంతేమో అనుకున్నారు అభిరాంతోపాటు అందరూ.
“నాన్నగారూ, ఇక వెళ్దామా?” అన్నాడు అభిరాం.
“ఎక్కడీకి రా?” అన్నాడు కృష్ణమూర్తి.
‘ఫంక్షన్‍హాల్?” అన్నాడు అభిరాం. వెంటనే కృష్ణమూర్తి, “చూడు అభీ! నేను నీకు తండ్రిని, పెద్దవాడిని. అంచేత నీ మనసు బాధపెడితే చిన్నవాడివైన నిన్ను క్షమించమని అడగలేను. కానీ ఇప్పుడు అసలు సంగతి చెప్తున్నాను. ఇదే ఫంక్షన్ హాల్. ఇంతకంటే ఉత్తమమైన ఫంక్షన్ హాల్ ఇంకెక్కడా ఉండదు” అందరూ నోరెళ్ల బెట్టి వింటున్నారు. “ఈ పిల్లల కళ్లల్లో వెలుగులే లైటింగ్. వాళ్ల డ్రెస్సులే డెకరేషన్. వాళ్ల కేరింతలే స్టీరియో సౌండ్‍లకన్నా మిన్న. ఇక వీడియో అంటావా , పైన ఉన్న ఆ భగవంతుడే తీస్తున్నాడు. ఈ అనాథబాలలే మన అతిథిదేవుళ్ళు. తిండికి లోటులేనివాళ్ళకు విందు ఇచ్చి మిగతాది పారబోసేకన్నా ఒక్కరోజు వీళ్లకు విందు పెడితే మహాపుణ్యం. నేను చేసిన పనికి నీకు కోపం రావచ్చు. కానీ నువ్వు నా షష్టిపూర్తి ఫంక్షన్‍కని పంపిన డబ్బులు దేనికోసం? నా ఆనందంకోసమే కదా? ఈరోజు వీళ్ల మధ్య గడపడంతో నాకు కలిగే ఆనందం పరమానందం. అంచేత నువ్వు పంపిన డబ్బులు ఈ అనాధాశ్రమానికి విరాళంగా ఇచ్చేను. నేను చేసింది తప్పని నీకనిపిస్తే నన్ను మన్నించు” అన్నాడు కృష్ణమూర్తి. అభిరాంకే కాదు, అక్కడున్న వాళ్లందరికీ నోట మాట రాలేదు.
‘అవును బాబాయ్, ఇదంతా నీకు తెలిసే జరిగిందా? మరి అయితే నాకెందుకు చెప్పలేదు?’ అడిగేడు అభిరాం బలారాంని.
“అవున్రా, అభిరాం! నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎందుకంటే నువ్వే నాకు అంతా అప్పజెప్పేవు కదా! అయినా మీ నాన్న మాట కాదనలేకపోయేను. ఆయన ఆనందమే మా అందరి పరమానందం. నన్ను క్షమించు” అన్నాడు బలరాం.
‘అదేంటి బాబాయ్! అంతమాటనకు. నాన్న చేసిందీ మంచిదే కదా! నాకా ఆలోచనే రాలేదు” అనడంతో ఆ అనాథాశ్రమం ఆనందాశ్రమం అయిపోయింది.
(అమెరికా అంతర్జాలపత్రిక “వాస్తవం” 27.08.2016లో, అంతర్జాలపత్రిక “ఆఫ్ ప్రింట్” 24.04.2017లో, వసుధ ఎన్విరో/ఆర్.జి.బి.ఇన్ఫోటైన్ 16.06.2017లో ప్రచురితమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 14.03.2017న ప్రసారితమైంది)

పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.