డైనింగ్ హాలు చిరాగ్గా ఉంది. రోజూ హడావిడిగా ఉండేది! ఖాళీపళ్ళాల చప్పుళ్ళు, ఎవడో పాడుతున్నాడు. నలుగురు కూర్చుని తింటూ అరుస్తూ ఆనందిస్తున్నారు. ఎవరెవరో వచ్చిపోతున్నారు.
రవి ఒక్కడూ వచ్చి పళ్ళెంలో టోకెనుపెట్టి టిఫిను కౌంటరు దగ్గర క్యూలో నించున్నాడు. “ఇద్దరు-ఒక్కరు-నేను” పంచింగ్ అయింది. కిచిడీ ముద్ద, పచ్చడి అడ్డదిడ్డంగా వేశాడు కౌంటర్లో వాడు. కాస్త పచ్చడి ఒలికి చెయ్యిమీద పడింది.
రవి వాడికేసి చూశాడు. వాడేదో పాడుకుంటున్నాడు. “వైదిస్ కొలవరి, కొలవరి, కొలవరి” ప్రయోజనం లేదు తన చూపుకి, అనుకుని మెల్లగా మూలమీద టేబుల్ దగ్గరికెళ్ళాడు. ఖాళీ పళ్ళాలు తీసే కుర్రాడు అటూ ఇటూ తిరుగుతూ స్పాంజితో పడిపోయిన మెతుకులవీ తుడుస్తున్నాడు.
“వీడెందుకు బతుకుతున్నాడు? ఎలా ఈ చెత్తపని చేస్తున్నాడు?” రవి బుర్రలో ప్రశ్నలు. గొంతులో కాయ అడ్డంగా నిలువుగా తిరుగుతోంది. ఇదేం జబ్బో? మొన్న డాక్టరు చూసి “పర్లేదు, ఎనీమియా, బాగాతిను” అని చెప్పాడు.
“తినడానికే అడ్డుపడుతుందిరా” అంటే వింటే కదా! సీరియస్‍గా నాలుగు రకాల మందులు రాసి ఇచ్చాడు.
ఈ నాయర్ కిచిడీ ప్రతీసారీ ఒకేలా రుచీ పచీ లేకుండా ఎలా చేస్తాడో! ఉడికినట్లు, ఉడకనట్టు, మాడు వాసన ఉందోలేదో తెలీనట్టు.
అమ్మ! పాపం, ప్రతి రోజూ ఎవరో ఒకరు. రాముడో, శివుడో, హనుమంతుడో, గణపతో ఎవరో ఒక దేవుడిమీద పాటలు, దండకాలు పాడుకుంటూ, ప్రతిసారీ గొప్ప రుచిగా చేస్తుంది!
ఊర్నుంచి తను వస్తే కాస్త నెయ్యి తగిలిస్తుంది. నాలుగు జీడిపప్పులు కూడా పెడుతుంది. అమ్మ, నాన్న నే లేనప్పుడు ఏం తింటారో అని అనుమానం! దొంగతనంగా వెళ్ళి చూడాలనిపిస్తుంది.
నాన్న జెడ్ పీ ఆఫీసులో ఆఫీసరు. ఏమాత్రం ధనాసక్తి, ఫలాపేక్ష లేనివాడు. అమ్మకి నాన్న కూడా దేవుడే! హాయిగా రెండుగదుల్లో పెద్దవిల్లాలో ఉన్నట్టు సంతోషంగా ఉంటారు. కబుర్లు, సెటైర్లు, “ఏవోయ్” అని నాన్న, “చాల్లెండి చూసాం” అని అమ్మ.
ఇప్పుడు వాళ్ళుకూడా కళ్ళకి కనిపించట్లేదు. అలుక్కుపోయారు. రవి సగం తిని నీళ్ళ గ్లాసు పూర్తిగా ఖాళీచేసి, లేచి పోబోయి, పళ్ళెం తీసుకెళ్ళి నీలం టబ్‍లో వేసేడు.
“థాంక్యూ భయ్యా” ఆ కుర్రాడి అరుపు, విజిల్ వినిపించాయి..
…
తల బరువుగా తోచింది రవికి. సరే, షాపులో సిగరెట్ కొన్నాడు. ఇందాక ఆఖరి టోకెన్, ఇది ఆఖరి పదిరూపాయలు. సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టాలని ఉద్దేశ్యం. “సాలే ఈ పక్క కాదు, ఆ పక్కరా వెలిగిస్తారు” ఎవరో ఎస్.ఎస్. (సూపర్ సీనియర్) నెత్తిమీద జెల్లకాయ కొట్టాడు. “చల్, నికల్ పో! ఇక్కడ్నుంచి” గదమాయించాడు.
అవ్వాల్సిందే తనకి. పొగరు నెత్తికెక్కి, వెధవపని చేద్దామంటే, వాతావరణం సహకరించట్లేదు!
రెండురోజులుగా కేంపస్ సెలక్షన్లు, పగలూ, రాత్రి పడీపడీ రిఫరెన్సులు, రౌండ్లు. ఇన్ని టీలు ఎప్పుడూ తాగలేదు. అన్ని బిస్కెట్లు తినలేదు.
మెకానికల్ ప్రొఫెసరు ఇంటిపక్కనుంచి ఫుట్‍బాల్‍గ్రౌండుకి దారితీసాడు.
ఎందులోనూ తనకి ఓపెనింగ్సు కుదరట్లేదు. “ఏరా! కేంపస్ వస్తుందంటావా?” వాన్న ఫోన్లో మాట తనకి ఛాలెంజింగా తోచింది. “కుదిరితే బాగుంటుంది. దూరంగా వెళ్ళి చదువుకున్నందుకు నలుగురిలో పరువూ దక్కుతుంది” ఆఖరి మాటలు ఇంకా బరువైపోయాయి.
ఎవరో బాగా తయారై, బంతిని అటూ ఇటూ తన్ను కుంటున్నారు. పాపం బంతికి షూస్ దెబ్బలెన్నో!
ఛ! కనీసం ఓ గర్ల్‌ఫ్రెండు లేదు. మూడేళ్ళు పూర్తిగా. బాషే రాలేదు. ఎవర్నైనా ఇంప్రెస్ చేసేంత పెర్సనాలిటీ కాదు.
“ఒరే టైంపాస్ రా! కలర్‍ఫుల్‍గా ఉంటుంది” అన్న సీనియర్ మాటల్ని వాళ్ళవాడే ఖండించాడు. ఇంకోడు, “ఒద్దురా బాబూ! సెంటిమెంటుతో మంట పెట్టేస్తారు. బోలెడు మెయింటెనెన్స్ కాస్టు! ఓ బండి కొనుక్కోవచ్చు” అంటూ.
“నాకంతలేదులే” అని డిసైడైపోయాడు రవి.
ఎవరో పిలిచారు, “అన్నా! ఏమి ఒక్కడివీ వెళ్తున్నావ్?”
చేత్తోనే “ఏం లేదని” ఊపి, “వ్యూ పాయింటు”కు వెళ్ళాడు రవి.
కాస్త ఎత్తుగా, కింద 15-20 అడుగుల వరకు రాళ్ళు. కంపలు, చిన్న అర్ధచంద్రాకారంలో ఓ పారాపెట్ గోడ.
పూర్తిగా చీకటి పడ్డాక, దూరంగా వెళ్ళే వాహనాల వెల్తురు కళ్ళలో పడుతోంది. “నా కళ్ళు గేదె కళ్ళల్లా మెరుస్తాయా? వాళ్ళకి కనపడతాయా?”
ఇవాళ లేదుగానీ రేపు పొద్దున్న ఇంకో ఇంటర్వ్యూ ఉంది. అదే ఆఖరుది. విసుగ్గా ఉంది. తనకేం రాదు. మైండ్ బ్లాంకైపోతోంది. ఏం జబ్బో ఏంటో!
నెమ్మదిగా లైటైరీ లోపలికెళ్ళాలా వద్దా అని తటపటాయించాడు. అరిగిపోతున్న చెప్పుల్ని కాలి బొటనవేలికి, పక్కవేలికి మధ్య గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా మెట్లెక్కాడు.
“తలుపు తొయ్యాలా? లాగాలా? ” ఆలోచిస్తున్నాడు. తోసాడు, ఓ బల్ల దగ్గర కూచున్నాడు. పాతబల్ల. మూలవైపు అక్కడ దుమ్ముపట్టిన కొన్ని పేపర్లుంటాయి. కానైతే కిటికీలోంచి కేంటిస్ కనబడుతుంది. ఎంతసేపైందో తెలీదు. “సహ్ లే బేటా!” అన్న మాటతో ఇహలోకంలోకొచ్చాడు.
ఎప్పుడూ మాట్లాడని లైబ్రేరియన్ విఠల్, తన ఎదురుగా స్టూల్‍మీద. ఉలిక్కిపడ్డాడు. రవి తలమీద చెయ్యిపెట్టి, జుట్టు సర్దాడు. వేళ్ళతో అటూ ఇటూ వెంట్రుకలు పాయలు తీసి “సహ్ లే బీటా” బేస్‍వాయిస్‍లో లాలనగా మళ్ళీ అన్నాడు ఆయన.
“ఓర్చుకో బిడ్డా! కొంచెం ఓర్చుకో”
రవికీ, తన కళ్ళజోడు తీసి పక్కన పెట్టడం గుర్తుంది. ఆ తర్వాతంతా విఠల్ మాటలే. నెమ్మదిగా పి.బి. శ్రీనివాస్ పాటని నాన్న పాడుతున్నట్టు! “ఈ ఇంటర్వ్యూలు ఇక్కడిలాగే జరుగుతాయి. ఉదయం అంతా రాయిస్తారు. సాయంకాలం వాయిస్తారు. బోలెడు ప్రశ్నలు. జల్లెడపట్టి, నీ బుర్రలో గుజ్జు ఎంతుందో అని ఓ పధ్ధతిగా అంచనావేస్తారు”.
“…”
“కానీ, ఓర్చుకో బిడ్డా! వాళ్ళకి కత్తులు కావాలి. కానీ సత్తురేకు కూడా పనికివచ్చేదే. ఏం ఫర్వాలేదు! అమ్మానాన్నకి నువ్వు చదువుతున్నావని తెలుసు. ఇందులో ఒకో పరీక్షకూ నువు పడే కష్టం తెలీదు. ఎందుకంటే వాళ్ళకి జీవించడం ఒకటి తెలుసు. కష్టంకూడా తమతోపాటి ఇంట్లో సభ్యుడు వాళ్ళకి!”
రవికి కడుపులో పేగు తిప్పినట్టయింది.
“ఓ రోజు తక్కువతిన్నా, నిన్నూ, నీ తోడబుట్టిన అయ్యనో, అమ్మనో ఎలా పెంచుకోవాలో, ఎంత ప్రేమగా చూసుకోవాలో తప్ప వాళ్ళకి పెద్దగా ఏం తెలీదు. సుఖమంటే తెలీదు. వాళ్ళకి అక్కర్లేదు. పిల్లలు ముఖ్యం” రవి కళ్ళల్లో అమ్మ, నాన్న కదులాడారు.
“ఓర్చుకో బిడ్డా, నడిచినంత దూరం రహదారి ఉంటే, అది పెద్ద నగరం. నీకు నువ్వే ముళ్ళు, రాళ్ళు తీసుకుంటూ, అడ్డొచ్చిన కంప సరిచేసి చదును చేసుకుంటూ వెళ్తే అది నువ్వేసిన దారి. కొత్తదారి”
“…”
“ఇంతట్లోనే భారమా? అలవాటు లేనివాడివి సిగరెట్ కొన్నావు. ప్లేటు కిచిడీ తిన్లేపోయావు! కేంపస్‍లో తిరుగుతున్నావా? నీ మెదడును అడవిచేసి అందులో అనవసరపు కుంగుబాటు ఆలోచనలతో తిరుగుతున్నావా?
“నేనూ! ఏం…” రవి ఏవో అడ్డు చెప్పబోయాడు. విఠల్ స్టూలుమీద సర్దుకుని కూర్చున్నాడు. పొడుగు చేతులచొక్కా, కుడిచేతిది మడతపెట్టుకుంటూ రవి కళ్ళల్లోకి చూడకుండా, పట్టి పట్టి జాగ్రత్తగా కోర్టులో నిజాలని ప్రవేశపెట్టే పోలీసులాగ అన్నాడు, “దేఖో బేటా! కేంటిన్ చోటూ, గార్డినర్ పాండూ నా సి.సి. టి.వి. కెమేరా కళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు నాకు దొరికావు బేటా!”
రవి గుండె ఝల్లుమంది.
“ఇలా తెలుసుకున్నాడా ఈయన!” దీర్ఘనిశ్వాస విడిచాడు. చాలా వేడిగా ఉంది.
“కాస్త ఓపిక తెచ్చుకో బేటా!”
విఠల్ గొంతు ఈసారి రేడియోలో వార్తలు చదువుతున్నట్టుగా లేదు. మెత్తగా, తండ్రి ఒక కొడుకునో, పెద్దన్నయ్య తన ఆఖరు తమ్ముడితోనో మాట్లాడుతున్నట్టుంది.
“ఓటమిని ఓర్చుకో, ఇంటర్వ్యూలో ప్రశ్నలకి జవాబు చెప్పలేని నీ మౌనాన్ని ఓర్చుకో. నీకన్నా నీ పక్కవాడు ముందుకెళ్ళిపోతుంటే నీ చేతనితనాన్ని నువ్వే ఓర్చుకో”.. ఒక్క వాక్యం రవికి ఒక బిందనీళ్ళు పోసినట్లు! “నేను నీలాగే ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగాలు రాలేదు. ఇంట్లో తెలిస్తే తిడతారని మేడెక్కి దూకాను. కాలు విరిగింది. లైబ్రరీ సైన్సు చదువుకొని, ఇలా పి.హెచ్. లో ఇక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాను. ఏ పిల్లాడైనా వాడి కళ్ళల్లో చీకటితో, గుండెల్లో నిరాశతో ఖాళీ కోక్‍డబ్బాలా ఫ్లాట్‍పిచ్‍లో బయటకు వినపడని ఘోష పెడుతూ ఉంటే, నా కళ్ళు నా చెవులు పనిచేస్తాయి. ఇవాళ నువ్వు..!!”
రవి గుండెలు హోరుమన్నాయి. కళ్ళు చెరువులయ్యాయి. రెండు నిమిషాలు వెక్కివెక్కి ఏడ్చాడు. బల్లమీద తలవాల్చి, విఠల్ లేచి వీపు రాసాడు.
“ఓర్చుకో బిడ్డా, ఓర్చుకుంటే నేర్చుకుంటావు” ఆఖరు వాక్యం చెప్పి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయాడాయన.
మూడు సంవత్సరాలు. నార్త్ ఇండియా. చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. రవి గుండె గట్టిపడిందిప్పుడు.
అయినా, చిఠల్! ఎప్పుడూ “చెక్కముఖం”, “పిల్లిగడ్డం”, “సినికల్ ఫెలో”, “ముంగి”, “ఎవర్ డిటాచ్డ్”, “జీరో వాట్” అని అందరూ రకరకాల
నిక్‍నేమ్స్‌తో పిలిచే విఠల్, ఇలా!!
చిత్రం. గొంతులో కాయ పోయింది! ఆకలిస్తోంది. అమ్మతో మాట్లాడాలి. రేపు ఇంటర్వ్యూ రాకపోయినా ఫర్లేదులే!!!
Dr.కాళ్ళకూరి శైలజ .కాకినాడ
తల్లిదండ్రులు :
Sri.హరినాధబాబు,శేషమ్మ., ఇద్దరు చెల్లెళ్ళు,ఒక తమ్ముడు.
భర్త డాక్టర్ శేషగిరి రావు పల్మనాలజిస్ట్.
కుమారుడు హరి వివేక్.
చదువు:
ప్రాధమిక విద్య : తూర్పు గోదావరి జిల్లా.
హైస్కూల్ శ్రీకాకుళం , ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో
ఇంటర్:
Amrat Kapadia women’s college, హైదరాబాద్.
డిగ్రీ: బి ఎస్ సీ, ఖమ్మం,
ఎస్.ఆర్.బిజి.ఎన్.ఆర్.కాలేజీలో చేస్తుండగా,
MBBS: కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించింది.
పీ.జీ.: General Surgery, DNB.
Laparoscopic Surgery.
FCGP ,FIAGES
ప్రస్తుతం:
అసోసియేట్ ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ లో పనిచేస్తున్నాను.
శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి గారు, శ్రీమతి మల్లీశ్వరి గారు సంపాదకులు గా వెలువరించిన ‘నవ నవలా నాయికలు’ లో ఒక వ్యాసం వ్రాసే సదవకాశం వారు కల్పించారు.అదే నా తొలి రచన. నవలా నాయికలు వ్యాస సంకలనం లో ‘అవతలి గట్టు’ అరవింద గారు వ్రాసిన నవలా నాయిక పై విశ్లేషణ. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,2019).
‘చినుకు’, ‘సారంగ’, ‘కౌముది’, ‘ కొలిమి’,’సంచిక’, ‘విపుల’ మేగజైన్స్ లో కధలు ప్రచురింపబడ్డాయి.
ప్రముఖ సైన్స్ రచయిత, మీడియా విశ్లేషకులు శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారి తో కలిసి మహాత్మా గాంధీ గురించి వ్యాసాలు వివిధ దినపత్రికల్లో అచ్చు అయ్యాయి.
‘కరోనా’ నేపధ్యంలో అస్తవ్యస్త మైన జనజీవనం పై విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా దినపత్రికల్లో వచ్చాయి.
‘కవిసంగమం’ ఒక గొప్ప వేదిక ను ఇచ్చి వచన కవిత వ్రాసే ఓనమాలు నేర్పింది.ఎందరో కవులను,భావుకులను, రచయితలను అంతర్జాల మాధ్యమంలో కలుసుకోవడానికి,తెలుసుకోడానికి అవకాశం ఇచ్చింది.
ఇందుకు సదా కృతజ్ఞతలు.
సాహిత్యం మానవ సంబంధాల సంక్లిష్టతను పరిష్కరించడానికి, వ్యక్తిగత అభిప్రాయాల కు పరిమితం కాకుండా సంఘం గురించి ఆలోచన,సహానుభూతి పెంచేందుకు కృషి చేయాలి.శరవేగంతో వస్తున్న సాంకేతికత మనిషిని మరమనిషిగా చేసి రాబోయే రోజుల్లో మానసిక క్రుంగుబాటుకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.ఇందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్ గా పనిచేయాలి. అన్నిటి కంటే స్త్రీల సమస్యలు, గ్లోబలైజేషన్ పేరిట సాంస్కృతిక పరాయీకరణ నన్ను బాధ పెడతాయి .వీటిని అర్థం చేసుకునేలా సాహిత్య ఉద్యమాలు నాపై ముద్ర వేసాయి.
పుస్తకాలు:
1.Interludes – a novelette
Patridge publications.
2. నవతరానికి రోల్ మోడల్ గాంధీజీ
గాంధీ భవన్, కాకినాడ వారిచే ప్రచురణ.
డా.కాళ్ళకూరి శైలజ
9885401882.
sailaja7074@gmail.com
అద్భుతం గా రాసరండీ. ఈ తరం యువకుల
మనస్తత్వానికి అద్దం పట్టింది.కొందరు ఆకాశం హద్దుగా ఎగురు తుంటే కొందరు పాతాళం లోకి కృంగి పోయి జీవితాలుఅంతం
చేసుకుంటున్నారు. చేతకాని తనం,తమమనసుకు నచ్చని మార్గం లో నలుగుతూ నిత్య సంఘ్ర్షణకు లోనవుతూ అది భరించలేక ఒంటరి గా కుమిలి పోయే వీరి స్థితికి కారణం కుటుంబం,సమాజం కలిసి కట్టు గా వారి ని చట్రాల్లో బంధించి ఊపిరి సలపకుండా చేయటమే. . అయితే కొందరు ఆ విషయం గుర్తించి ఎదో ఒకస్థితి లో అధిగమించ గలుగుతారు. మరి కొందరు లొంగి పోయి
వైఫల్యాల బాట లో చితికి పోతారు. ఈ కధ లో విఠల్ అనుభవం, మాటల ఫలితం గా తన ఆలోచనా విధానం మార్చు కోవాలి అని ప్రధాన పాత్ర అనుకోవటం అయ్యో ఈ బిడ్డ ఏమి చేస్తాడో చివరికి అనుకునే పఠిత కు కూడాఒక పెద్ద రిలీఫ్. మాంచి కధ అందించిన రచయిత్రికి అభినందనలు
అనేకానేక ధన్యవాదాలు.సమస్య తో పాటు పరిష్కారం సూచనా ప్రాయం గా నైనా చెప్పాలనే ఒక కొంచెం పాత స్కూల్ కు చెందిన తరం అండీ.అందుకే నా కథల ముగింపు ఆశాభావంతో ఉంటుంది.మీకు నచ్చినందుకు సంతోషం.