ఆ సత్రంలో ప్రతీరోజూ తెల్లవారుఝామునించే సందడి మొదలవుతుంది. చనిపోయినవారికి దశదిశ కర్మ కాండలు, మాసికాలు సంవత్సరీకాలు, అంతా చాలా పద్ధతిగా జరిపిస్తారు. పరిశుభ్రత, నియమనిష్ఠలు ప్రధానంగా పాటిస్తారు. పూజలు, తంతులూ అయిన తరవాత, ఆ నిర్మాల్యం తీసిందికి తేలికగా ఉండే బకెట్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయి.
నిష్ఠ ఎక్కువగా ఉండే నాగేశ్వరరావుగారు మాటలు సరిగ్గారాని, నత్తిగా మాటాడే ఓ పేద బ్రాహ్మణ కుర్రాడికి తంతులు అయిన తరవాత దర్బలు అరిటాకులలాటివన్నీ బాల్చీల్లోకి ఎత్తే పని అప్పచెప్పేరు. వాడి పేరు మన్యం. మన్యం చాలా హుషారుగా ఈపని చేస్తాడు.
అపర కర్మలు చేయించే బ్రాహ్మణుల కార్యక్రమాలకోసం కొన్ని గదులు, ఎక్కడెక్కడినించో వచ్చేవారు ఉండడానికి వేరే గదులు, భోక్తలకి భోజనాలు, కర్మ చేసే ఇంటివారికి , వారి బంధువులకి భోజనాలు వడ్డించిందికి వేరే హాళ్ళూ, మడిగా వంటలు వండే వాళ్లకోసం ప్రత్యేకమయిన వంటగదులూ అన్నీ పద్ధతిగా ఉంటాయి.
పితృదేవతలకి అందించే వాయసపిండాలు తీసుకునే కాకుల ‘కావు కావు’లు వింటూ కర్తలు, బంధువులు పులకించిపోతూ ఉంటారు.
ఆకాశదండేల మీదన మడిచీరలు, పంచెలూ ఆరుతూ ఉంటాయి.
సోమిదేవమ్మ లాటి కాఁవమ్మగారి, ఆధ్వర్యంలో వంటలు చకచకా వండేస్తారు. పద్ధతి తప్పకుండా నాలుగు కూరలు, పచ్చళ్ళు, పెసరపప్పు, గారెలు, నువ్వులుండలు, పరమాన్నంతోపాటు కర్తలు ఏదేనా ప్రత్యేకంగా కోరితే ఆ వంటకం చేస్తారు.
ఘుమఘుమలు బయటివరకూ ఘుమాయిస్తాయి. సహాయకులు ఎంతమంది ఉన్నా, కావమ్మగారికి కుడిభుజం రుక్మిణే! సదా వంటలూ వడ్డనలతో ఉన్నా ఆమె నాజూకుగా ఉంటుంది. ఒకసారి మధ్యప్రదేశ్‍నించీ వచ్చిన బృందంలో ఒకావిడ అడిగింది
“అమ్మాయ్! ఎప్పుడూ ఇన్ని విశేషవంటలు వండుతూ వడ్డిస్తూ ఉంటావు కదా! ఇంత సన్నగా ఎలా ఉన్నావ్?”
రుక్మిణి నవ్వుతూ ఉంటే కావమ్మగారు జవాబు చెప్పేరు. “అందుకే మా రుక్కమ్మ ఏదీ తినదు. ఎప్పుడూ ఉంటాయి కాబట్టే తినబుద్ధి అవదు”
సత్రం మేనేజ్మెంట్ అంతా చూసేది నాగేశ్వరరావుగారే! ఫొన్‍లోనో, మేసేజ్‍లోనో ఎలాగొలా బుక్ చేసుకుంటారు. అన్ని రాష్ట్రాలనించీ వస్తూనే ఉంటారు. ఎవ్వరినీ నిరాశపరచరు నాగేశ్వరరావుగారు. బాగా వృద్ధులు చనిపోతే కర్మకాండలు చేసుకుందికి వచ్చినవాళ్ళు చాలా సంతృప్తిగా వెళతారు.
ఆరోజు నాగేశ్వరరావుగారు కావమ్మనీ రుక్మిణినీ పిలిచేరు.
“అమ్మా! మనకి యుపినించీ ఒకతను వస్తున్నాడు. అతని భార్య చనిపోయిందిట. మరీ పెద్దవాడు కాదు. ఒక్కతే కూతురుట. తనే కర్మ చేస్తాడట”
“అవునా, మనం అన్నీ చేద్దామండీ” అంది రుక్మిణీ.
“భార్యంటే చాలా ప్రేమ కాబోలు. దానాలన్నీ ప్రత్యక్షదానాలే చేస్తాడట. గోదానం అంటే గోవునే ఇస్తాడట. భూదానం కూడా భూమిని కొని మరీ దానం చేస్తాడట. దానం తీసుకున్నవాళ్ళకే దక్కేలా చూడమని ఫోన్‍లో అడిగేడు. శర్మగారికి అప్పచెప్తాను. వంటకాలు మాత్రం మనం కాస్త ప్రత్యేకంగా ఇతనికి అన్నీ జరపాలి, కాఁవమ్మగారూ, మీరూ రుక్మిణీ నామాట నిలబెట్టాలి”
కాఁవమ్మ వెంటనే చెప్పేసింది “అయ్యో, ఎంతమాటండీ…. మీరు చెప్పడం మేం చేయకపోడమూనా? ఉత్తరాది అంటున్నారు. అటువేపు తీపి చేయాలన్నా, నేను రుక్కూ మడిగా చేస్తాం” రుక్మిణి కూడా మాటిచ్చింది.
“అతను తెలుగువాడేటమ్మా.. భార్య యుపి బ్రాహ్మణుల్లా ఉంది. వంటకాలు మన సంప్రదాయం ప్రకారమే చేద్దాంలెండి” అనేసారు నాగేశ్వరరావుగారు.
అనుకున్న రోజుకి యుపినించీ గోకులశర్మా అతని బంధువులు (హిందీవారు) దిగేరు.
నాగేశ్వరరావుగారు స్వయంగా గోకులశర్మని కలిసి సానుభూతి చెప్పేరు. అతను ఇస్తున్న దానాలు వినీ బ్రాహ్మణులు అందరూ అతని భార్యకి పిండప్రదానం చేయించిందికి సిద్ధం అయేరు. శ్రాద్ధక్రియలు చేయించడంలో మంత్రం చదవడంలో మంచి పేరున్న సూర్యనారాయణశర్మగారికి అప్పచెప్పేరు. గోకులశర్మ అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ దానాలు ఇస్తానని చెప్పేడు. దానితో కర్మలు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అందరూ.
మంచికుర్చీమీద పట్టుచీర వేసి, దానిమీద గోకులశర్మ భార్య లావణ్యాశర్మ ఫొటోపెట్టి మంచి పూల దండ వేసేరు. ఆమెకి గులాబులంటే ఇష్టమట. బుట్టతో గులాబీలు అక్కడ ఉంచేరు.
గోకులశర్మ ప్రత్యక్షదానాలు చేస్తాను కానీ, తీసుకున్నవారికే అవి దక్కాలని, ఉప్పు తిలలలాటి దానాలు తీసుకున్నవారికి వేరే డబ్బు ఇస్తానని కోరేడు. మాట నిలబెట్టుకోడం అలవాటు ఉన్న సూర్యనారాయణశర్మగారు ఆవూ దూడా అమ్మే గొల్ల మల్లయ్యని పరిచయం చేసేరు. మల్లయ్య వినయంగా, “ఆవు అలవాటు పడ్డదాకా తను రోజూ వారింటికి వెళ్ళి గడ్డీ, కుడితీ పెడతాననీ దాణాకి తనకి డబ్బు ఇచ్చీమని” కోరేడు.
గోదానం తీసుకునే సోమేశ్వరశర్మ ఆ గోవుని ప్రాణపదంగా చూసుకుంటానని, తన పెరట్లో జాగాఉందని, తన భార్యకి సాకడం వచ్చని మాట ఇచ్చేడు.
సత్రంలో గోకులశర్మ వాళ్ళ హడావిడి చాలా ఎక్కువగా కనిపించింది. ఇతరులుకూడా కుతూహలంగా చూస్తున్నారు.
పదోరోజు తర్పణాలు వదిలి వచ్చిన గోకులశర్మా అరుగుమీదే భార్య ఫొటో పట్టుకొని ‘వెక్కి వెక్కి’ ఏడవడం మొదలెట్టేడు. ఏదో పనిమీద అటు వస్తున్న రుక్మిణీ గోకులశర్మని చూసి ఉలిక్కిపడింది. తనని అతను చూడకుండా అడుగులు వెనక్కివేసింది.
ఇంతలో ఏడుస్తున్న గోకులశర్మని అతని బంధువులు చుట్టుముట్టి హిందీలో ఓదార్చడం మొదలెట్టేరు.
భోక్తలకి వడ్డనలు చేసిందికి గోకులశర్మ బంధువు కోడలి వరసామె ముందుకి వచ్చింది. రుక్మిణి వడ్డనల జోలికి రాకుండా వంటగదిలోనే ఉండిపోయింది.
మర్నాడు వంటలని తెగమెచ్చుకున్నారు.
కాఁవమ్మగారు వచ్చి “ఒసే రుక్కూ, నువ్వు చేసిన కూరలు ఆ గోకులు తింటూ ‘అచ్చం మా అమ్మ చేసినట్టే ఉన్నాయి’ అని తెగ మెచ్చుకున్నాడే,
‘మా రుక్కమ్మ చేసిందబ్బాయ్’ అంటే అతను భార్య పేరుమీద రేపు ఒకరికి పట్టుచీరమీద నగ పెట్టి దానం చేస్తాడట. నీకు చేస్తాను అని అంటున్నాడు” అంది.
“మూసివాయనం ముత్తయిదువులు వచ్చేరు కదా” అంది రుక్మిణి.
“అయ్యో వాళ్ళకి మంచిచీరలే ఇస్తున్నారు. ఇది అదనంగా ఇస్తాడట” అంది కాఁవమ్మ
“ఒద్దు పిన్నిగారూ! మన సరస్వతి కూతురికి పెళ్ళి చేయాలంటోంది. తనకి పనికి వస్తుంది. ఆమెకి ఇప్పించండి. నాకొద్దు” అనేసింది రుక్మిణీ. గొణుక్కుంటూ ఊరుకుంది కాఁవమ్మ.
పన్నెండోరోజు దానాలు గోకుల శర్మ చేసినవి చూసి బ్రాహ్మణులందరూ అదిరిపోయేరు. సువర్ణదానం సూర్యనారాయణగారి కొడుకు రామశర్మకే ఇప్పించేరు. ఉంగరం ఇచ్చేరు. గోదానం సోమేశ్వరశర్మ తీసుకొని, గోవుని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేడు.
భూదానం సూర్యనారాయణశర్మకే చేసేరు. సిటీకి కాస్త దూరంగా నూటయాభై చదరపు గజాల జాగా కొనే డబ్బు ఇచ్చేసాడు. వెండి, తిలలూ, నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, గుడాదానం, లవణదానం తీసుకున్నవాళ్ళకి ఎక్కువ దక్షిణ రూపాన ఇచ్చేడు. అందరూ సంతృప్తిగా
అతని భార్యకి స్వర్గలోకప్రాప్తి లభిస్తుంది అని దీవించేరు.
కాఁవమ్మగారి ఆధ్వర్యంలో సరస్వతికి పట్టుచీరమీద ఒక్కపేట గొలుసుతో భార్య చెల్లిచేత ఇప్పించేడు.
గోకులశర్మా బంధువులూ కార్లో బయలుదేరుతూ ఉంటే నాగేశ్వరరావుగారు, ఆప్యాయంగా సాగనంపుతూ ధైర్యవచనాలు చెప్పేరు. సంవత్సరీకాలు ఇక్కడ చేసుకోవచ్చని హామీ ఇచ్చేరు.
గోకులశర్మకి భార్యమీదున్న ప్రేమని అందరూ పొగుడుతూనే ఉన్నారు. కాసేపటికి అలిసిపోయి అందరూ ఎక్కడవాళ్ళు అక్కడ సద్దుకున్నారు. పాతఙ్ఞాపకాలతో మోకాళ్ళ మీద తలపెట్టుకొని వంటగదిలో ఓమూల కూచుంది రుక్మిణి.
కాఁవమ్మగారు వచ్చి పక్కనే చతికిలపడింది. “అబ్బా! ఆ గోకులశర్మకి పెళ్ళాం అంటే ఎంత ప్రేమే రుక్కమ్మా, పదివేలు ఖరీదుచేసే పట్టుచీరమీద తులంన్నర గొలుసుతో ఇచ్చేడు. మాట విన్నావుకాదు. నీకే దక్కునుకదే ఆ చీరా గొలుసు. ముత్తయిదువ చీర తీసుకోడం తప్పు కాదు కదే!” అంది.
కందగడ్డలా మారిన మొహంతో, లేచి రుక్మిణి విసురుగా అంది. “అతనెవరో నాకు దానం ఇచ్చేదేమిటి పిన్నిగారూ, పదిహేనేళ్ళ కిందట
నేనే అతనికి దానం చేసేను” అంది ఉద్రేకంగా.
“నువ్వా….. ఏం దానం చేసేవు?” అనుమానంగా అడిగింది కాఁవమ్మ.
“గర్భాదానం” దుఖం పొర్లుతూఉంటే అంది రుక్మిణి.
ఉలిక్కిపడ్డాది కాఁవమ్మ. “ఏవిటీ, ఆ గోవిందుడే ఈ గోకులశర్మా?” అనిమాత్రం అనగలిచింది.
తనకి చదువులేదని, అందం తక్కువని పెళ్ళయిన రెండునెలలలోపలే వదిలేసి ఎవరో హిందీ అమ్మాయిని పెళ్ళి చేసుకొని తన భర్త గోవిందరావు అయిపులేకుండా పారిపోయేడని రుక్మిణి ఎప్పుడో చెప్పడం తలపుకి వచ్చి ఇంకోమాట మాటాడకుండా రుక్మిణి తలనిమురుతూ
మౌనంగా కూచుంది.
నేను మంగు కృష్ణకుమారి. ఇండియన్ నేవీలో 37 సంవత్సరాలు సర్వీస్ చేసి, ఆఫీస్ సూపరింటెండెంట్ గా రిటైర్ అయేను. చిన్నప్పుటినించీ కథల పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటు. చదువుకొనే రోజుల్లో ఓ కథ ఆంధ్రపత్రిక వార పత్రికలో వచ్చింది. ఆ తరవాత మళ్ళా రిటైర్ అయిన తరువాత ఫేస్బుక్ లోకి వచ్చి మళ్ళా కథలు రాయడం మొదలెట్టేను. మాకు ఒక అమ్మాయి. అమెరికాలో ఇద్దరు పిల్లలతో ఉంది.