(డా. గరిమెళ్ళ రామజోగారావు గారి స్మారక బహుమతి పొందిన కథ, ఏప్రిల్ 2022 తెలుగుతల్లి కెనడాలో ప్రచురితమైంది)
సాయంత్రం ఆరు దాటుతోంది. అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన మృదుల, వస్తూనే భుజాన ఉన్న బాగ్‍ని, మంచం ప్రక్కన ఉన్న టేబుల్‍మీద విసురుగా పడేసింది.
“అత్తయ్యా, అత్తయ్యా!!” అరచినట్లు పిలిచేసరికి వంటింట్లో ఉన్న సావిత్రి కంగారుగ వచ్చింది.
“మృదులా, నువ్వొచ్చి ఎంతసేపయింది? అయ్యో, తలుపు తీసే ఉందా? నేను చూసుకోలేదమ్మా… పిల్లలు ఆడుకోవడానికెళ్ళినట్లున్నారు…” అంటూ ఉండగానే, “అదేకదా మా ప్రాబ్లమ్! తలుపులన్నీ తెరిచి పెట్టేసి, ఆ వంటిల్లేదో మీ స్వర్గసీమన్నట్లు అక్కడే పడి ఉంటారు. బయటనుంచి ఎవరొచ్చి ఇల్లు దోచుకుపోయినా మీకు పట్టదు. ఎప్పుడూ ఏదో ఒకమూల పుణుక్కుంటూ కూర్చుంటారు” అంటూ పెద్దగా విసుక్కుంటూ, కాళ్ళు కడుక్కోడానికి బాత్రూమ్‍లోకి వెళ్ళింది మృదుల. ఆమె బయటకొచ్చేటప్పటికి, పిల్లలకోసం చేసిన బజ్జీలు, కప్పుతో వేడివేడి కాఫీ డైనింగ్‍టేబుల్‍మీద రెడీగా పెట్టింది సావిత్రి.
“మళ్లీ నూనెసరు పెట్టి చేసేసారా? ఏదన్నా అంటే పిల్లలమీద వంక పెట్టేస్తారు. ఇంకా ఏమన్నా అంటే రాజాకిష్టమని చేసానమ్మా అని నా నోరు మూసేస్తారు. ఎప్పుడూ ఆ నూనెలో దేవినవి ఎలా తింటారో? నాకైతే కడుపులో తిప్పుతుంది. మీకేమో అవిష్టం. అందుకే ఎప్పుడూ అవే చేస్తారు…” అంటూనే, పెట్టిన బజ్జీలు తినేసి, కాఫీ తాగేసి… టీవీ రిమోట్‍తో ఛానల్స్ మార్చుకుంటూ చూసుకుంటూ సోఫాలో కాళ్ళు జాపుకుని పడుకుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరుగా జాబ్ చేస్తున్న మృదుల.
చిన్నబోయిన ముఖంతో, రెప్పలచాటున దాచిన కన్నీటితో… రాత్రి వంట చెయ్యడానికి భారంగా ఉపక్రమించింది సావిత్రి. కూరలు తరుగుతుంటే, ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి.
సావిత్రి, రామారావు దంపతులకు ఇద్దరూ అబ్బాయిలే. పెద్దవాడు రాజా సిటీలోనే ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నవాడు కిశోర్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. వారి క్రొత్త ఇంటి గృహప్రవేశానికి, చాలా తక్కువ మందిని పిలిచి సింపుల్‍గా చేసుకోవాలనుకున్నారు. సావిత్రి తల్లితండ్రులు, రామారావు తల్లిదండ్రులు, చాలా దగ్గర స్నేహితులైన ఓ రెండు కుటుంబాలవారిని మాత్రమే పిలిచారు. సావిత్రి వారి సహాయంతోనే, పనులన్నీ చేసుకుంది.
రామారావు, రామ, గోపాలం ముగ్గురూ బాల్యస్నేహితులు. ఆ ముగ్గురి మధ్యలోనే కాక, వారి భార్యలైన సావిత్రి, జానకి, ప్రమీలల మధ్య కూడా చిక్కని అనుబంధం నెలకొంది. రామచంద్ర కుమార్తె మృదుల. ఆయన భార్య జానకి. హాస్టల్లో ఉండి, ఇంజనీరింగ్ చదువుతున్నది, మృదుల. ఒక్క కుమార్తె అయినా చాలా ఒద్దికగా ఉన్నది. వీరి గృహప్రవేశం సమయానికి, ఏవో సెలవులని ఇంటికొచ్చిన మృదులను కూడా తమతో తీసుకువచ్చింది జానకి. రామచంద్ర చాలాకాలంగా వేరే రాష్ట్రంలో ఉండిపోవటంవలన, మృదుల చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాత్రమే చూసిన రామారావు దంపతులకు, ఇప్పుడా అమ్మాయిని చూస్తుంటే, ఎంతో ముచ్చటగా అనిపించింది. చాలా సందడిగా, క్రొత్త ఇంట్లో… గలగలలాడుతూ తిరుగుతున్న మృదులను చూసి, రామారావు, సావిత్రి దంపతులిద్దరూ చాలా సంతోషపడిపోయారు. సావిత్రి కొడుకులిద్దరూ పని చేస్తుంటే, వారి వెనుకే ఏదో ఒక పని అందుకుంటూ వారితో కలివిడిగా ఉన్న ఆ అమ్మాయిని మురిపెంగా చూస్తున్నారందరూ.
ఫంక్షన్‍కి గోపాలం, అతని భార్య ప్రమీల మాత్రమే వచ్చారు. వారి ఇద్దరు పిల్లలు, పూజ, రవి జర్మనీలో మెడిసిన్ చదువుతున్నారు. గృహప్రవేశం, పూజలు అయ్యాక, భోజనాలు చేసి, కొంచెం సేపు గడిపి ఎక్కడి వారక్కడకి, రామారావు కుటుంబసభ్యుల దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరి వెళ్లిపోయారు. మృదుల, రాజా తమ ఫోన్ నెంబర్లు మార్చుకున్న విషయం ఎవరికీ తెలియదు.
రాత్రిపూట సంభాషణలతో ఆరునెలలు గడిచాయి. వారిద్దరి మధ్యా చనువు బాగా పెరిగింది. ఆ చనువు స్నేహమై, ఆ స్నేహం ప్రణయమై చిగురించి పూచింది. నెమ్మదిగా ఇరువురూ సినిమాలకూ, మాల్స్‌కూ తిరగడం బాగా అలవాటైంది. మృదుల, తన హాస్టల్ వార్డెన్‍కి, రాజా తన తల్లిదండ్రులకూ ఆలస్యానికి కారణాలుగా ఎన్నో అబద్ధాలు చెప్పడం మొదలైంది. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించలేని మృదుల వాళ్ళ వార్డెన్, రామచంద్రకు ఫోన్ చేసి రమ్మని చెప్పటంతో ఆయన వెంటనే వచ్చి, విషయం విని, మృదులను తనతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు.
ఉరుములేని పిడుగులా తమ ఇంటికి వచ్చిన స్నేహితులను ఆనందంగా ఆహ్వానించారు రామారావు దంపతులు. అతిథి మర్యాదలూ, కుశల ప్రశ్నలూ అవగానే వెంటనే విషయంలోకి వచ్చేసాడు రామచంద్ర.
“రామూ, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. నేను చెప్పే విషయం నీకు నచ్చక పోతే అది మన స్నేహానికి ఎటువంటి ఆటంకము కాకూడదు. అలా అని మాటివ్వు. అలా అయితేనే, నేను నీతో ఆ విషయం మాట్లాడుతాను” అన్నాడు.
“ఏమిటి చంద్రా, కొత్తగా నేనెందుకు నీతో మాటలు మానేస్తాను? అంత కాని విషయాలేముంటాయి మన మధ్యలో? సరే మాటిస్తున్నాను. నీవు చెప్పే ఏ విషయం కూడా మన స్నేహం మీద ప్రభావం చూపదు.” అన్నాడు రామారావు.
రామచంద్ర వెంటనే రామారావుతో, మృదుల రాజాలు ప్రేమించుకున్నారని చెప్పాడు.
“పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి అన్ని విషయాలు మాట్లాడుదాము. వారికి నచ్చితే తప్పకుండా పెళ్లి చేసేద్దాము. దానికి ఇంత కంగారెందుకు నీకు?” అని రామచంద్ర భుజంమీద స్నేహపూర్వకంగా తట్టి చెప్పాడు. అలాగే పిల్లలతో, పెద్దలు మాట్లాడడం, వారు కూడా తమకిష్టమేనని చెప్పడంతో వెంటనే ముహుర్తాలు పెట్టించేశారు. ముహుర్తాలు పెట్టే రోజు జానకి, సావిత్రితో, “సావిత్రీ, మృదులను మీ ఇంటికి పంపిస్తుంటే నా మనసు చాలా తేలికగా ఉంది. ఒక్కగానొక్క పిల్ల, కొంచెం గారాబం చేసాము. కానీ పద్ధతిగానే పెంచాము. ఆ గారాబంలో కొంచెం పేచీలు అవీ పెట్టినా తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకుంటావని నీ చేతుల్లో పెడుతున్నాము. మాకు చాలా నిశ్చింతగా ఉంది…” అన్నది. దానికి జానకిని దగ్గరకు తీసుకొని, ఆమెను హత్తుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది సావిత్రి. చాలా చక్కగా ఉన్నంతలో చాలా బాగా వివాహం జరిపించారు ఇరువైపుల వారు.
ఆరునెలల కాలంలో అనేక మార్పులు జరిగిపోయాయి, కిశోర్ ఆస్ట్రేలియాలోనే జరీనా అనే అమ్మాయిని పెళ్ళి చేసేసుకుని, అక్కడే స్థిరపడిపోయాడు. మృదుల చదువు పూర్తి కావడంతో, రామారావు తన పరపతితో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వేయించాడు మృదులకు. అత్తారిల్లు, పుట్టిల్లు మధ్య ఆనందంగా ఉంది మృదుల.
ఆ రోజు చాలా దుర్దినం…
రామారావు, గోపాలం కలిసి ఒకరోజు స్కూటర్‍మీద రామచంద్ర ఇంటికెడుతుండగా ఆక్సిడెంటయి ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మరణించారు. సావిత్రి, ప్రమీలల జీవితాలలో పెనుచీకట్లు క్రమ్ముకున్నాయి. ప్రమీల పిల్లలిద్దరూ జర్మనీలోనే ఉన్నారు. తల్లిని జర్మనీకి వచ్చెయ్యమని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అక్కడికే తీసుకెళ్లిపోయారు.
సావిత్రి జీవితం మాత్రం అనేకానేక మార్పులతో పుష్కరకాలంపాటు గడిచింది. అన్నీ మనం ఊహించినట్లు జరిగితే భగవంతుడెందుకసలు? పన్నెండు సంవత్సరాలలో ముగ్గురు స్నేహితురాళ్ళు కలవలేకపోయారు. ప్రమీల జర్మనీ వెళ్లిన కొత్తలో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేది సావిత్రితో. తరువాత అది కూడా క్రమంగా తగ్గిపోయింది.
సావిత్రి జీవితం పూర్తిగా మారిపోయింది. మృదులకు ప్రభుత్వాధికారిగా ఐదంకెల తెచ్చుకుంటున్నానన్న అహంకారం పెరిగిపోగా, సావిత్రిని చిన్నచూపు చూడసాగింది. ముద్దులకోడలని ప్రేమగా చూసుకున్నందుకు, సావిత్రి తన కోడలికి జీతంబత్తెంలేని పనిమనిషిగా, ఆమె పిల్లలకు ఆయాగా మారిపోయింది. తన ఆరోగ్యం పాడవుతున్నా కొడుక్కి సైతం చెప్పలేని అసహాయస్థితిలో రోజులు వెళ్ళదీస్తోంది. ఆమెకు వచ్చే పెన్షన్ కూడా రాజాయే తీసుకోవటంవలన చేతిలో పైసా ఉండేది కాదు.
కుక్కర్ కూతపెట్టడంతో, ఆలోచనలలోనుంచి బయటపడింది సావిత్రి. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడచి, అంట్లుతోమే కార్యక్రమంలో పడింది.
వారం రోజుల తరువాత…
ఆరోజు అలవాటుగా మృదుల అత్తగారిని సాధిస్తూ ఉంది. సావిత్రి నిలబడి కళ్లనీళ్లతో మృదులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తోంది. రాజా ఇదేమీ తన సమస్య కాదన్నట్లు టీవీ చూసుకుంటూ, విలాసంగా తల్లి చేసిపెట్టిన దోసెల రుచిని ఆస్వాదిస్తున్నాడు. పిల్లలిద్దరూ ఆటసామానంతా హాలులో చిందరవందరగా జిమ్మేసి వాటి మధ్యలో ఒకరి జుట్టు వేరొకరు పీక్కుంటూ, కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. వీధి తలుపు చప్పుడైతే, అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. గుమ్మంలో చక్కటి నేతచీరతో, కళ్ళకు పెద్దపెద్ద చలువ కళ్ళద్దాలతో పాతసినిమా హీరోయిన్ బి. సరోజాదేవిలా ఉన్న ఒక నిండైన విగ్రహం నిలబడింది.
ఆమె, “సావిత్రి ఉందా?” అని అడిగేసరికి, మృదుల, “మీరెవరండీ?” అన్నది.
“నా పేరు ప్రమీల. సావిత్రీ, నేనూ స్నేహితులం…” అని చెప్పింది. ఆ మాటలకు సావిత్రివైపు చూపించింది మృదుల. ప్రమీల, సావిత్రి వైపు నివ్వెరపోయి చూసింది. మూర్తీభవించిన లక్ష్మీదేవిలా వుండే తమ సావిత్రి ఈమేనా? ఎప్పుడూ చిరునవ్వుతో, అమ్మలా కనిపించే ఆ సావిత్రికి, దైన్యానికి ప్రతిరూపంలా, మాసిన ముతకబట్టల్లో, గాజుకళ్ళలాంటి జీవంలేని కళ్ళతో, నూనె ముఖమే చూడని పీచు రేగిన తెల్లని జుట్టుతో… పాతపోలికలకోసం ఎంతో వెతకసాగింది సావిత్రి ముఖంలో.
“సావిత్రి, ఏంటిది? ఇలా అయిపోయావేంటి?” అనేసరికి సావిత్రిలో దుఃఖం కట్టలు తెంచుకున్న నదీప్రవాహంలా వచ్చింది. గభాల్న స్నేహితురాలిని కౌగలించుకుని, ఆమె భుజంమీద తలపెట్టుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. అలాగే సావిత్రి వెన్ను రాస్తూ, చాలాసేపు ఉండిపోయింది ప్రమీల.
ఇదంతా తమాషాగా చూస్తున్న మృదుల, ప్రమీలనుద్దేశించి, “ఇంతకూ మీరెవరో?” అంది వెటకారంగా.
దానికి జవాబుగా “మీ నాన్న, మీ మావగారు, మావారు స్నేహితులని అప్పుడే మర్చిపోయావా మృదులా?” అని అడిగింది.
మృదుల ఆశ్చర్యంగా, ఆనందంగా, “మీరా ఆంటీ? చాలా సంవత్సరాలైపోయింది కదా, గుర్తు పట్టలేదు…” అత్తగారివైపు తిరిగి, “అలా మొద్దులా నిలబడ్డారేంటి? ఆంటీకి మంచినీళ్లు, కాఫీ తెండి…” అని ఆజ్ఞాపించింది. సావిత్రిని, మృదులను మార్చిమార్చి చూస్తోంది ప్రమీల. సావిత్రి భయంగా మృదులవైపు చూస్తూ వంటగదివైపు నీరసంగా అడుగులేసింది.
ప్రమీల అక్కడి పరిస్థితిని ఆకళింపు చేసుకొని, సాలోచనగా రాజా వైపు చూస్తూ, “రాజా, రాగానే ఇలా అడుగుతున్నందుకు ఏమి అనుకోకు, అమ్మను రెండు రోజులు నాతో తీసుకు వెడతాను…” అన్నది.
రాజా సమాధానం చెప్పే లోపలే మృదుల, “కుదరదాంటీ, అత్తగారు లేకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది. నాకు, రాజాకు సెలవుల్లేవు. నాకు ఆఫీసులో బోలెడు పనుంటుంది. చిన్నకొడుకు దగ్గరకు వెళ్ళలేదు. కనుక, ఎప్పటికీ ఈమె భారం మేము వహించాల్సిందే. ఈవిడ మీతో వచ్చేస్తే పిల్లల్నెవరు చూస్తారు?” అని చాలా గట్టిగా చెప్పి, ఇంక మీరు వెళ్లొచ్చన్నట్లు ముఖం తిప్పుకుంది.
ప్రమీల ఏమాత్రం లెక్కచేయకుండా, “మృదులా, నీ గురించి అన్నీ తెలిసిన నా స్నేహితురాలు మీ ఇంటి వివరాలన్నీ చెప్పి పంపింది నన్ను. అందుకని మర్యాదగా ఒప్పుకుంటే, గొడవేమీ లేకుండా తీసుకెడతాను. నువ్వు గొడవచేస్తే నాతో వచ్చిన లాయర్, ఎస్సైలను లోపలికి పిలిచి వారి సహాయంతో తీసుకు వెడతాను. మరి నీ ఇష్టం!” అని చాలా నెమ్మదిగా, మర్యాదగా, హుందాగా చెప్పింది.
మృదుల గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంది.
రాజా ఆశ్చర్యపోతూ, “మా ఇంటి విషయాలు మీతో మాట్లాడే ఆ స్నేహితురాలెవరు?” అన్నాడు.
“మీ అత్తగారు!” అంటూ… వంటింటి వైపు వెళ్లి, సావిత్రి చెయ్యిపట్టుకుని, మెల్లగా నడిపిస్తూ, వీధిగుమ్మంవైపు అడుగులేసింది ప్రమీల. ఆశ్చర్యంతో రాజా, మృదుల బొమ్మల్లా నిలబడి పోయారు. కొంచెం సేపటికి రాజా తేరుకుని, అత్తగారికి కాల్ చేసాడు.
“అత్తయ్యగారూ, జర్మనీ నుండి ప్రమీలాంటి వచ్చారు….”
“నాకు తెలుసు రాజా!”
“అదేంటి… మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు అమ్మని తీసుకెళ్లి, ఆమె ఏమిచేస్తుందిట?”
కొంచెంసేపు నిశ్శబ్దం… తరువాత జానకి, మాట్లాడటం మొదలు పెట్టింది.
“రాజా, నేను మీతో ఎన్నోసార్లు చెప్పాను. అమ్మను అలా చూడకూడదు అని. కానీ మీనుంచి ఒక నవ్వే సమాధానంగా వచ్చింది. సావిత్రి మిమ్మల్ని ఎలా పెంచిందో మీకు తెలుసు, అయినా మీరు ఆమెను చూస్తున్న పద్ధతి సరియైనదేనా? దేవతలాంటి తల్లిని చూసే తీరు అదేనా? తల్లని కూడా చూడకుండా పనిమనిషి కంటే హీనంగా వాష్ రూమ్స్ కూడా కడిగించుకుంటున్నారు. ఇది సరియైన పద్ధతేనా? రామారావు అన్నయ్యగారు పోయినప్పటి నుంచీ ఆమెను మీరు పెట్టిన తిప్పలు, మేము చూసి, మృదులను వారించమని ఎన్నోసార్లు నీతో చెప్పాము.
ఒకటిరెండుసార్లు మీరు లేనప్పుడు సావిత్రికి కాల్ చేసి-
ఎందుకిలా ఉంటున్నావు? మా మృదుల నిన్ను ఇబ్బంది పెడుతోందా?
-అని అడిగితే, ఆ దేవత చెప్పిన సమాధానం-
మృదుల చాలా మంచిది. చాలా ప్రేమగా చూస్తుంది నన్ను…
అనే కానీ, నా కూతురిమీద ఒక్క చెడ్డమాట చెప్పలేదు. రెండు సంవత్సరాలైంది. మేము మీ ఇంట కాలుపెట్టి. ఈమధ్య ఒకరోజు మీరిద్దరూ ఆఫీస్‍కి వెళ్ళినప్పుడు మీ ఇంటికొచ్చి చూస్తే, వీధి తలుపులన్నీ తీసే ఉన్నాయి. ఇంట్లోకెళ్లి చూస్తే, గుండెపట్టుకుని ఆయాసపడుతోంది మీ అమ్మ. ఏమైందని అడిగితే-
ఏమో! తెలియటం లేదు జానకీ! ఈమధ్య అస్తమానూ ఇలాగే అవుతోంది
-అని చెప్పింది. కానీ మీ ఇద్దరితో ఈ విషయాన్ని చెప్పవద్దని ఒట్టు వేయించుకుంది నాతో. దానితో ఇంటి పరిస్థితి, నా కూతురి అసలు స్వభావం, పూర్తిగా అర్థం అయింది నాకు” అన్నది.
రాజా, గొణుగుతున్నట్లుగా, “మృదులకు నేను చెబుతూనే ఉన్నానత్తయ్యా! అమ్మకి రెస్ట్ కావాలని…” అన్నాడు.
వెంటనే జానకి, “కానీ… రాజా, నీకు అమ్మ పరిస్థితి కనిపించలేదా? ఇంటిపని, వంటపని, పిల్లలపని అన్నీ తానే చేస్తోందని? పనిమనిషినికూడా మృదుల పెట్టలేదనీ నీకు తెలియదా? అమ్మ ఆరోగ్యస్థితి ఎలా ఉందో ఎప్పుడైనా చూసావా? అంతెందుకు? అమ్మతో నీవు మనసారా మాట్లాడి ఎన్నాళ్ళు అయింది? మృదులకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు అమ్మకు దూరమైపోయావు. ఈ వయసులో అంత పని ఎలా చేయగలుగుతుంది అనుకున్నావు? ఆఫ్టరాల్ తన సంపాదన చూసుకుని మిడిసిపడుతోందే ఆ రాక్షసి…ఛీ… దాన్ని నా కూతురనటానికికూడా మనసు రావటం లేదు. ఆ ఉద్యోగం తన మామగారి భిక్ష అన్న విషయం మరచిపోయింది. ఆయన ప్రోత్సహించకపోతే, దగ్గరుండి ఆ పరీక్షలు రాయించకపోతే వచ్చేదే కాదు. మృదుల అంటే మెత్తనిది, సున్నితమైనది అని అర్ధం… దానికా పేరు ఏమాత్రమూ తగదు. అది కఠినాత్మురాలు… నేను, మీ మామయ్య, సావిత్రికి జరుగుతున్న అన్యాయానికి బాధపడని క్షణం లేదు. ఆ సమయంలో, దేవుడు పంపినట్టే వచ్చింది మా ప్రమీల. ఆమె ఇండియా వచ్చి మొదట నన్ను కలిసింది. సావిత్రి విషయమంతా ఆమెకు చెప్పాము. మీ ఇద్దరూ అహంభావంతో సావిత్రిని పెట్టిన బాధలన్నీ కూడా చెప్పాము. ప్రమీల ఇక్కడ బాధల్లో ఉన్న స్త్రీలకోసం ఒక ఆశ్రమం నిర్మించే ఉద్దేశ్యంతో వచ్చింది. దానికి సహాయంగా మేము నిర్మించుకున్న ఇల్లు రాసిచ్చేసాము. ఆమె చేసే మంచి పనిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఆ ఆశ్రమం నేను, సావిత్రి, ప్రమీల కలిసి నడుపుతాము. మీ మామయ్య మాకు సహాయంగా ఉంటారు. ఇది మా నిర్ణయం రాజా!” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఫోన్‍లోని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం వలన, మృదుల తన తల్లికి, భర్తకు మధ్య జరిగిన సంభాషణంతా విని కోపంతో ఊగిపోతూ భర్తను, అత్తగారిని నానా దుర్భాషలాడుతూ, తిట్టడం మొదలు పెట్టింది. ఉన్నట్లుండి, ఒక్కసారిగా ఆమె కళ్లుబైర్లు కమ్మాయి. మృదులకు, ఏమి జరిగిందో అర్ధమయ్యేసరికి మళ్లీ చెయ్యి ఎత్తాడు ఇంకో చెంపమీద కొట్టడానికి.
“మృదులా! ఇంకా, బుద్ధి రాలేదా నీకు? నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా అసమర్ధత వలన. నీ తల్లితండ్రులు, ఆస్తి మొత్తం ఆశ్రమానికి రాసేసారు నీ మీద నమ్మకం లేక. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బ్రతుకుదాము. లేకపోతే నీదారి నీది, నాదారి నాది. పిల్లలు అనాథలుగా ఎక్కడో పెరుగుతారు. కుటుంబమంటే నేను కాదు, మనం అనుకుంటేనే సంసారం బావుంటుందని పెద్దవారైన మన తల్లితండ్రులు మనకు తెలియచేశారు. సరిగ్గా ఉంటావో ఉండవో నీ ఇష్టం” అంటూ పిల్లల్ని ఎత్తుకుని తల్లి దగ్గరకు బయలు దేరాడు రాజా. ఆలోచనాదృష్టితో వారు వెళ్లినవైపే చూస్తూ ఒంటరిగా నిలుచుంది మృదుల! ఒక్కసారిగా మనసును ఎవరో కుదిపినట్టై ఆమెలో నిద్రపోతున్న జ్ఞాననేత్రం రెప్ప విచ్చుకోసాగింది!!