తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao

  1. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  2. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  3. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  4. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  5. మృతజీవుడు by Ramu Kola
  6. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  7. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  8. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  9. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  10. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  11. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  12. ఏం దానం? by Mangu Krishna Kumari
  13. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  14. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  15. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  16. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  17. జ్ఞాననేత్రం by Rama Sandilya
  18. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

ఆంగ్లమూలం ప్రభాకర్ ధూపాటి గారి “Paradise Slipped”

పోలీస్‍స్టేషన్‍కి రమ్మని నాకు పిలుపు వచ్చింది. నా శ్రీమతికి ఆ పిలుపెందుకు వచ్చిందో అని ఆశ్చర్యం, సందేహం.
ఆ పోలీస్‍స్టేషన్ హౌస్ ఆఫీసర్ చాలా చాలా కరుకుగా వీలయినంత త్వరలో నన్ను పోలీస్‍స్టేషన్‍కి రమ్మని చెప్పాడట. నేను ఇంట్లో లేనని ,ఇంటికి రాగానే చెప్పి పంపుతానని చెప్పిందట నా భార్య.
నేను ఇంటికి రాగానే “అసలేమయింది? ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకంత తీవ్రంగా మాట్లాడాడు? ఎందుకు పోలీస్‍స్టేషన్‍కి రమ్మన్నాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది నాపై.
“ఎందుకు రమ్మన్నాడో నాకూ తెలియదు. మన ఫార్మ్‌లో పనిచేసేవాళ్లంతా మంచివాళ్ళే. ఒకవేళ ఎప్పుడైనా తేడా,పాడా వచ్చినా నాకు ఫార్మ్ హెడ్ వెంటనే తెలియ జేస్తాడు” అని అన్నాను.
మా డ్రైవర్ మా ఇంటి ఆవరణలో సర్వెంట్ క్వార్టర్స్‌లోనే ఉంటాడు. ఎక్కడికీ వెళ్ళకుండా నాతోనే వున్నాడు. మా కార్లన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి. మాపిల్లలు అమెరికాలో వాళ్ళ కరోనా వైరస్ సమస్యలతో తలమునకలుగా వున్నారు.
ఇక మా పౌల్ట్రీఫార్మ్‌లో చికెన్ చివరి బ్యాచ్ … చాలా నష్టమే అయినా తప్పక అతి తక్కువ ధరలకి లాక్‍డౌన్‍కి ముందే అమ్మేసాను. ప్రభుత్వం, ప్రెస్ చికెన్ తినవచ్చు అని చెబుతున్నా రిటైల్ షాప్స్ మూతపడటంతో పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొనుగోలుదారులు రేపటి ఆదాయాలు ఎలా ఉంటాయో అనే భయంతో ప్రతి రూపాయి దాచుకుంటూ అన్నిరకాల విలాసాలకు చేసే కొనుగోళ్లు ఆపేశారు. పశ్చిమదేశాలలోలా కాక ఇండియాలో చికెన్ కొనటం ఒక లగ్జరీగా భావించి ఆదివారం స్పెషల్‍గా వండుకుంటారు.
హోటల్స్,రెస్టౌరెంట్స్, ఫుడ్ జాయింట్స్,హాస్టల్స్, ఫంక్షన్ హాల్స్,కన్వెన్షన్ హాల్స్ ఇలా ఒకటేమిటి చికెన్ ఎక్కువగా కొనే ప్రతీవ్యాపారం, వ్యవహారం నిలిచి పోయాయి. ఫార్మ్‌లో పనిచేసేవాళ్ళు చాలామంది వాళ్ళ ఊళ్ళు వెళిపోయారు.
ఒక్క జంట మాత్రం ఎన్నో ఏళ్లుగా మాతో ఉండటం అలవాటు అయిన కారణంగా ఎక్కడికీ వెళ్ళకుండా మాతోనే ఉండిపోతాం అని ఉండి పోయారు. గత ఆదివారం నా భార్య వాళ్ళకి ఆరునెలలకి సరిపడేలా కావలసిన సరుకులు అన్నీ ఇచ్చింది. బీహార్‍నుండి వచ్చి నా డైరీలో పని చేస్తున్న లేబర్ నిన్న వెళిపోయారు. కావలసినవి అన్నీ ఇస్తాను వుండమన్నా వాళ్ళు ఉండటానికి సుముఖత చూపించలేదు. ఇక వాళ్ళని ఒప్పించ లేక నా టాటా సుమో ఇచ్చి దాంట్లో వెళ్ళి పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ జాగర్తగా దాన్ని తెచ్చి ఇయ్యమని వాళ్ళలో నాకు నమ్మకస్తుడయిన ఒకతనికి అప్పజెప్పాను. అతను తల అడ్డంగా ఊపుతూ వారెవరికీ డ్రైవింగ్ రాదు అని చావు కబురు చల్ల గా చెప్పాడు.
నేను కాస్త విసుగ్గా” మీకు తుపాకీలు పేల్చటం వచ్చుగానీ డ్రైవింగ్ రాదు” అని అన్నాను. దానికి వాళ్లంతా నవ్వేశారు.
అంతా నలభయ్ ఏళ్లలోపువారు కావటంవలన వాళ్ళ సామాన్లు మూటలు కట్టుకుని తలల మీద పెట్టుకుని కాలి నడకన వాళ్ళ వాళ్ళ ఊర్లకి ప్రయాణం అయ్యారు. నేను వాళ్ళకి రెండేసి నెలల జీతాలు అడ్వాన్స్‌గా ఇచ్చేసి నాతో టచ్‍లో ఉండమని చెప్పాను. వాళ్ళు నా కాళ్ళకి నమస్కరించి బయలు దేరారు. ఉత్తరాదివాళ్ళకి ఈ కాళ్ళకి నమస్కరించే అలవాటు నేటికీ ఉంది. వాళ్ళపట్ల నేను సౌమ్యంగా వుంటూ దయచూపిస్తానని వారికి నాపై గౌరవాభిమానాలు మెండు. వారి దయనీయ పరిస్థితికి, రేపటినుండి నా డయిరీలో గేదెల పరిస్థితి తలుచుకుని నాకు వారు వెళుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గేదెలకి మేత,సంరక్షణ ఇవన్నీ ఎలా అని మనసులో దిగులు కమ్ముకుంది.
మా మామగారికి ఫోన్ చేసాను. ఆయన మెదక్ జిల్లాలో రైతు.
“అధైర్యపడకు బాబూ! ఇలాటపుడు మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి. నేను ఇద్దరు పనివాళ్ళను పంపుతాను. నువ్వు నీ గేదెలకు దినవారీగా వాడే మందులు అవీ ఇచ్చి గేదెలన్నీ నా దగ్గరకు పంపెయ్యి. పరిస్థితి చక్కబడేవరకు నేను వాటిని నాకు తెలిసిన వారి ఇళ్ళకి పంపిణీ చేసి వాటి ఆలనాపాలనా చూసుకునేలా ఏర్పాటు చేస్తాను. నేను ఆయనకి ధన్యవాదాలు చెబుతూ అప్పటికి పెద్ద బరువు తొలగిందన్న భావనతో గాఢంగా నిట్టూర్చాను.
ఇది చాలదన్నట్లు పులి మీద పుట్రలా నిన్న కురిసిన అకాలవర్షానికి నా మామిడితోట, వరిపంట అంతా మొత్తం నాశనం అయిపోయాయి. వాటిని చూసుకునే వ్యక్తి నా ఫార్మ్‌లో ఒకతని భార్య. ఎంతగానో ఏడ్చింది. ఆమెనెలా ఓదార్చాలో నాకు అర్ధం కాలేదు. ఆమె వృద్ధురాలు. నా తోటనీ, పొలాన్నీ చంటిబిడ్డల్ని సాకినట్లు సాకింది. వాటిపై వచ్చే రాబడులు నావి అయినా వాటితో గాఢమైన అనుబంధం ఆమెది. రైతుబిడ్డని కావటంవలన పండించే చేతులకి మట్టితో వుండే అనుబంధం నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో మాకున్న ఎడ్లల్లో ఒక ఎద్దు చచ్చిపోయినపుడు మా అమ్మ ఎంతగా ఏడ్చిందో, అలాగే వడగళ్ళవాన పడి మా పొలంలో పంట అంతా పోయినప్పుడు మా నాన్న గుండె చెరువు అయేలా ఎలా ఏడ్చాడో ఇప్పటికీ గుర్తే. అప్పట్లో మా కుటుంబానికి అవే జీవనాధారం.
ఈరోజు నా పరిస్థితి వేరు. నేను పూర్తిగా ఫార్మ్‌మీద వచ్చే రాబడిమీద ఆధారపడలేదు. నా పిల్లలు అమెరికాలో చక్కగా స్థిరపడ్డ స్థితిమంతులు. నేనుకూడా విదేశాలలో చదువుకుని, ఉద్యోగం చేసి ఆర్థికంగా బాగా బలపడ్డాకా ఇండియా వచ్చి ఇక్కడ అగ్రోబేస్డ్, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెట్టాను. ఇప్పుడీ కరోనా వైరసూ, వడగళ్లవానల వలన నేను పెట్టుబడి పెట్టిన రంగాలన్నీ కుదేలు అయ్యాయి.
పశ్చిమదేశాల్లో బీదరికం అంటే కేవలం ఆకలితో అలమటించటం. కానీ మనదేశంలో మొదటినుండీ బీదలు పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. నాకు 2004లో బాక్సింగ్ డే, అదే ఏడాదిలో సునామీ, 2010లో హైతీ భూకంపం ఇవన్నీ గుర్తే. సత్యజిత్ రే పథేర్ పాంచాలీ నేను అసలు చూడ లేకపోయాను. చూస్తుంటే కడుపులో దేవేసింది. ఇలాటి దయనీయ, దారుణపరిస్థితులలో అలా పోలీస్‍స్టేషన్‍నుండి పిలుపు రావటం నన్ను చకితుడిని చేసింది.
నేను పోలీస్‍స్టేషన్‍కి వెళ్ళాను. స్టేషన్‍హెడ్‍ని కాక, ముందు ఏసీపీని కలిసాను. ఆ ఏసీపీని గతంలో నేను వేరే సందర్భాలలో రెండుమూడుసార్లు కలిసాను. అతను నన్ను చూసి ఆశ్చర్యం గా ” మీరిలా ఇక్కడ? ఏమిటి సంగతి సార్? ” అని అడిగేడు.
“నాకూ తెలియదు! మీ సీఐ మా ఇంటికి ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను” అన్నాను.
అతను ఓ కాన్‍స్టేబుల్‍ని పిలిచి నేను వచ్చినట్లు సీఐగారికి తెలియజెప్పమన్నాడు. కొన్ని నిముషాల తరువాత సీఐ వచ్చాడు. ఏసీపీ సీఐకి నన్ను పరిచయం చేశాడు.
అరవైల్లో ఉన్న నన్ను చూసిన సీఐ మొహంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా కనిపించింది. అతను”ఏదో పొరపాటు జరిగినట్లుంది సర్. మీరు ఒక ఫోన్ నెంబర్‍కి ప్రేమ సంకేతాలు పంపుతున్నట్లు కంప్లైంట్ వచ్చింది” అన్నాడు.
ఏసీపీ నవ్వుతూ “ఏంటి సంగతి సర్? ఇది సెకండ ఇన్నింగ్స్ లేదా థర్డ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా !” అన్నాడు జోవియల్‍గా. నేను సిగ్గుపడుతూ తెల్లబోయాను ఈ పరిణామానికి.
ఒక తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో “సోరీ అండీ. అందులో పొరపాటు ఏమీ లేదు. నేను నా స్నేహితురాలు ఒకామెకు ప్రేమసంకేతాలు పంపిన మాట నిజమే. ఆమె నాకు కాలేజీరోజుల్లో క్లాస్‍మేట్. ఆమెను నేను మరిచిపోలేదు. ఈ మధ్యనే ఆమె భర్తను పోగొట్టుకున్నదన్న విషయం తెలిసింది. ఆమె ఫోన్ నెంబర్ నాకు మా ఇద్దరికీ తెలిసిన మరో మిత్రురాలిద్వారా వచ్చింది. ఆ నెంబర్‍కి ఫోన్ చేస్తే ఆమె నాతో మాట్లాడింది. నేను ఫోన్ చేసినందుకు ఎంతో సంతోషించింది కూడా. తరవాత ఎందుకో ఆమె ఫోన్ డెడ్ అయి పోయింది. ఆమె దగ్గరినుండి కాల్ వస్తుంది అని ఎదురు చూసి ఎప్పటికీ రాకపోవటంతో నేనే ఆమెకు ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తూ సంకేతాలు పంపాను. ఆమె ఆ నెంబర్ సరెండర్ చేసిందేమో. ఆ నెంబర్ వేరేవాళ్ళకి ఇచ్చి వుంటారు. నా సంకేతాలు వారిని చేరాయి. జరిగిన దానికి చింతిస్తున్నాను” అన్నాను.
“ఇలాటివి అప్పుడప్పుడు జరుగుతాయి సర్. మేము సర్దుబాటు చేసేస్తాంలెండి. కానీ ఇకపై ఇలా జరగకుండా చూసుకోండి.” అన్నాడు సీఐ.
సీఐకి, ఏసీపీకి ధన్యవాదాలు చెప్పి పోలీస్‍స్టేషన్‍నుండి వచ్చేసాను.
నేను ఇంటికి వస్తుంటే నా ఆ స్నేహితురాలు మధు ఫోన్ చేసింది. “సోరీ డియర్! మా అబ్బాయి అమెరికానుండి వచ్చాడు. వాడి వత్తిడిమీద నేను అమెరికా వచ్చేసాను. నేను ఎంత రానన్నా వాడు ఒప్పుకోలేదు. ఇండియా వదలక తప్పింది కాదు. ఈ హడావుడిలో నీకు ఫోన్ చేయటానికి కుదరలేదు. నా నెంబర్ డెడ్ అయిపోయింది. సోరీ! కాలేజ్ రోజుల్లో మా అమ్మానాన్నల అధీనంలో, ఇప్పుడు నా పిల్లల అధీనం లో” అంటూ సన్నగా ఏడ్వసాగింది.
తనని ఎలా ఓదార్చాలో నాకు అర్ధం కాలేదు. “నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు?” అన్నాను. ఏదో తెలియని అలజడి నాలోన.
ఒక కొడుకు న్యూజెర్సీలో వుంటూ న్యూయార్క్‌లో పనిచేస్తున్నాడు అని ఇంకో కొడుకు కాలిఫోర్నియో ఉన్నాడని చెప్పి తాను ప్రస్తుతం న్యూ జెర్సీలో ఉన్న అబ్బాయింట్లో ఉన్నానని చెప్పింది.
నేను వెంటనే, “జాగర్త. నీ నీ కుటుంబభద్రతకోసం తీసుకోవలసిన జాగర్తలన్నీ తీసుకో. అమెరికాలో, అందులో నువ్వున్న ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని వింటున్నాను.” అన్నాను గొంతులో ఆప్యాయత ధ్వనిస్తుండగా.
అసలు ట్రంప్ ప్రభుత్వం అంత తెలివి తక్కువగా ఎలా వ్యవహరించిందో. నాకు ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక మతం రాజధానిలో అంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తుంటే కళ్ళుమూసుకుపోయిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మనదేశంలో…
“ఏమనాలి వీళ్ళని?” అని దీర్ఘనిశ్వాసం విడిచాను.
తనకి కావలసినది అందని పసివాడిలా ఉంది నా పరిస్థితి. మేము కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నపుడు తనకన్నా ఏడేళ్లు పెద్దవాడయి జీవితంలో ఉన్నతస్థానంలో స్థిరపడిన వ్యక్తితో మధు పెళ్ళి జరిగిపోయింది.
ఆరోజుల్లో ఉద్యోగాలు దొరికేవి కావు. నేను ఇంకా చదువుతున్నాను కనుక మధుని పోషించే శక్తి నాకు లేదు. గ్రాడ్యుయేషన్ తరవాత నేను తనని ఎప్పుడూ కలవలేదు. ఆమె జీవితంలో స్థిరపడింది. సుఖప్రదమైన జీవితం గడుపుతోంది అని సంతోషపడ్డాను. తరవాత తన భర్త మరణవార్త తెలిసింది. అది ఎప్పుడో జరిగినా నాకు మాత్రం ఈ మధ్యనే తెలిసింది. అది తెలిసి తనని కలవడానికి వెళ్ళినపుడు తాను నేను అనుకున్నంతగా భర్త మృతికి చెదిరినట్లు నాకు అనిపించలేదు. వీలున్నప్పుడల్లా తనని కలిసి స్వాంతన కలిగిద్దాం అనుకున్నాను. కానీ తాను అమెరికా వెళిపోయింది. ఆ సాంత్వన నాకేనేమో!
తాను వెళిపోవటంతో నాలో నాకే అర్ధంకాని శూన్యం ఏర్పడింది.
నేను ఇంటికి వచ్చాకా నా భార్యకు అబద్ధం చెప్పాను. “వేరేవ్యక్తికి బదులు నాకు ఫోన్ చేసారు” అన్నాను.
దానికి ఆమె “నేనూ అదే అనుకున్నాను. బుర్రతక్కువ మనుషులు వాళ్ళు.” అంది.