“సారీ సార్! ఇలాంటి డిసీస్ నేను నా ఇన్నేళ్ళ సర్వీసులో చూడలేదు. చాలా అరుదైన కండిషన్ మీది. రక్తకణాలు చాలా త్వరగా నశిస్తున్నాయి. దీని వలనే మీరు తొందరగా అలసటకి గురవుతున్నారు, అలానే వార్థక్యానికి దగ్గరవుతున్నారు. నిన్న చూసిన మీరులా లేరు ఈరోజు మీరు”’ అని డాక్టర్ ముగించాడు.
ఇలా చెప్పిన ఇరవయ్యైదవ డాక్టర్ ఇతను. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హెమటాలజిస్ట్. ముందు చూసిన డాక్టర్లు తక్కువవాళ్ళేమీ కాదు. వాళ్ళు చేయని టెస్టూ లేదు, ఇవ్వని మందూ లేదు. ఐనా ఇది తగ్గే సూచనలు కనిపించడం లేదు. తగ్గదని అతనికూడా తెలుస్తూనే ఉంది. నెలరోజుల్లో ఇరవయ్యేళ్ళు ముసలాడినైపోవడంవల్ల అది మరింత బలపడింది. ఇంత డబ్బూ, అంతస్తూ ఉండి ఏం లాభం. ఇలా బతకడంకంటే చనిపోవడం మేలేమో అనుకుని ఒక బటన్ ప్రెస్ చేశాడు. అతని పర్సన్ అసిస్టెంట్ వచ్చాడు. ఏవో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని. దాన్లో కొన్ని సంతకాలు పెట్టాల్సినవి, కొన్ని అతను నేషనల్ ఆర్కైవ్స్‌లోంచి రహస్యంగా తెప్పించుకున్నవీను. సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్, డాక్యుమెంట్స్ పక్కన పెట్టి, ఆర్కైవ్స్ లోంచి తెచ్చిన డాక్యుమెంట్స్‌ని చదవసాగాడు. కొన్ని ఎప్పుడో గుప్తులకాలంనాటివి, ఇంకొన్ని బుద్ధునికాలంనాటివి. ఫొటోస్టాట్ కాపీలే అయినప్పటికీ దానికింద ఇంగ్లీషులో రాసిన పదాల ఆధారం చేసుకుని చదవసాగాడు.
జీవకుడు రాసిన కొన్ని రసాయనసమ్మేళనాలు, నాగార్జునాచార్యుడు రాసిన రససిద్ధాంతంలోని కొన్ని రహస్యాలూ కలిపి వైద్యరంగంలో ఆనాటికి అత్యద్భుతమైన ఔషధాన్ని తయారుచేసిన ఫార్ములా ఆ డాక్యుమెంట్స్‌లో ఉంది. రాజార్జునాచార్యుడు బుద్ధుని తర్వాత బుద్ధుడంతటివానిగా పేరు తెచ్చుకున్నాడు. బుద్ధునిలా నిర్వాణస్థితిని పొందడానికి కేవలం కోరికలను త్యజిస్తే సరిపోతుందనుకోలేదు, అందువలన కోరికలను కూడా త్యజించలేదు. రాజార్జునాచార్యుడు తన అవసానదశలో ఒక గుప్తరోగానికి గురయ్యాడు. దాన్నుంచి బయటపడడానికి రాసిన గ్రంథమే, చేసిన యజ్ఞమే ఇప్పుడు అతని చేతిలో ఉన్నది. పోతే దీనిలో చెప్పిన ఒక జంతువు ఇప్పుడు అంతరించిపోయింది. దాని పీయూషగ్రంథినుంచి తీసిన రసాయనాన్ని, పైత్యరసంలో కలిపి ఔషధాన్ని తయారుచేయాల్సి ఉంటుంది, అతనికి వచ్చిన రక్త వ్యాధిని తగ్గించాలంటే. ఎందుకంటే ఆ రాజార్జునాచార్యుని గుప్తరోగం, అతనికున్న ఈ రక్తవ్యాధిని పోలినట్టే ఉంది.
ఇది ఈ ముప్ఫైరోజుల్లో అతడు చదివిన నాలుగువందలవ పుస్తకం. ఎన్నెన్నో పుస్తకాలు, చదివి వాటికింద ఇచ్చిన రిఫెరెన్సులను తిరగేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇంతా చేరాక ఇలా అంతరించిపోయిన జీవి ఈ చికిత్సకి అనివార్యం అని తెలుసుకుని చతికిలపడ్డాడు. కానీ, బతకాలనే ఆశ, ఇప్పటివరకూ చేసిన ప్రయత్నం రెండూ ఇంకా ప్రయత్నించమనే ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆ జీవి యొక్క జాడ తెలుసుకోవాలి.
రకరకాల జియోలాజికల్ బుక్స్‌ని తెప్పించుకున్నాడు. ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అతనున్న వ్యాపారరంగం నమ్మకంమీద, ఇతర అనేక పరిస్థితులమీద ఆధారపడి ఉంటుంది. అతని రోగవార్త వింటే ఆ కంపెనీలకి నష్టం వాటిల్లుతుంది. అది ఎంతగా అంటే ఏదేనా అద్భుతం జరిగి అతను కోలుకున్నా, అవి తిరిగి కోలుకోలేనంతగా. అందుకే ఆ గోప్యత.
చివరగా ఆ జీవి పదహారువందల సంవత్సరాలక్రితం అండమాన్ నికోబార్ దీవులకు ఆగ్నేయంగా, ఇండోనేషియాకి దగ్గరలో కనిపించిందని, దాని శిలాజాలు అక్కడ లభించాయని సమాచారం. అంటే ఆ జీవి మనుగడ దాదాపు అసాధ్యం. బహుశా అప్పట్లోకూడా ఆ జీవిని అనేక ఔషధాల తయారీలకొరకు అమానుషంగా వేటాడేసి ఉంటారేమో అనుకున్నా, తన పరిస్థితి తలచుకొని ఎలాగైనా దాన్ని వెదికేందుకు ప్రయత్నించమని చెబుదామనుకున్నాడు.
డాక్టరుకి ఫోన్ చేసి రమ్మన్నాడు. అతనికి ఈ రెసిపీ గురించి చెప్పి, ఈ జీవిని సంపాదించడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు.
ఆ డాక్టర్ కొంచెంసేపు ఆలోచించి, “ఈ జీవి ఉనికి ప్రశ్నార్థకమే, ఒకవేళ ఉన్నా అది ఉన్న ప్రదేశాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత ప్రపంచ రాజకీయపరిస్థితులు, యుద్ధవాతావరణంవల్ల ఇంటర్నేషనల్ జలాల్లోకి మందీమార్బలంతో వెళ్ళడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా నువ్వు పంపించడం, నీకు నీ కంపెనీకి కూడా మంచిది కాదు. ఇది చాలా లో-కీగా జరిగిపోవాలి. ఈ జీవి అంత పెద్దదేమీ కాదని ఈ డ్రాయింగ్సే చెబుతున్నాయి. శాఖాహారి, హానిపరిచేది కాదు. అందుకని ఎవరినైనా ఒక సముద్రప్రాంతవ్యక్తిని సముద్రయానంపట్ల, ఆ చుట్టుపక్కల పరిస్థితులపైన, అవగాహన ఉన్నవాడిని పంపించాలి. అతడు అవసరంలో ఉండాలి, ఆ అవసరాన్ని మనంమాత్రమే తీర్చగలిగేలా ఉండాలి. ఒకసారి అతను ఆ జీవిని, అది ఉన్న ప్రదేశాన్ని గనుక మనకి చేరవేస్తే తరువాత, మనం మనచర్య తీసుకోవచ్చు” అని చెప్పి ముగించాడు.
ఇదేదో సినిమా కథలా అనిపించినా, కరెక్టే అనిపించింది అతడికి. వెంటనే కోస్తాప్రాంతంలో ఉన్న తన కంపెనీవాళ్ళతో మాట్లాడి, ఒక జాలరివాడిని (యువకుడే) తీసుకుని రమ్మని చెప్పి, వాడికి అవసరానికి తగిన డబ్బుని ఇవ్వమనికూడా చెప్పాడు.
కోస్తాప్రాంతంలో తీవ్రమైన కాలుష్యం ప్రబలుతుండడంవలన చాలామంది రోగగ్రస్తులయ్యారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రకరకాల రోగాలతో సతమతవుతున్నారు. ఒక జాలరి, తన కొడుకు రక్తపువాంతులు చేసుకోవడంతో డాక్టరు దగ్గరికి తీసుకెళ్తే, ఇది తగ్గడానికి చాలా ఖర్చవుతుందని చెప్పాడు. ఇలాంటి జాలర్లూ, వాళ్ళ కొడుకులూ కోస్తాతీరమంతా కోట్లలో ఉన్నారు. అతని కంపెనీవాళ్ళు కలిసింది ఈ ప్రత్యేకమైన్ అ జాలరినే. డబ్బు ఇచ్చేసరికి పని ఏంటోకూడా తెలుసుకోకుండా వెంట వచ్చేశాడు వాళ్ళతో అతనిదగ్గరికి. కృతజ్ఞతంటే ఇదేనా? లేక తెలివితక్కువతనమా?
అతను చెప్పింది జాగ్రత్తగా విన్నాడు. అతనిచ్చిన మ్యాపులు పట్టుకున్నాడు. జీవి ఉందో లేదో తెలీదు, అతనూ చెప్పలేదు. కానీ, అతనేం చెప్పినా చేయడానికి సిద్ధపడ్డవాడిలా ఉన్నాడు. ఉన్మాదంకాదు, అతని కళ్ళల్లో ఉద్వేగం, తన కొడుకు చికిత్సకి సాయపడ్డందుకు. బయలుదేరాడు, అతనికి తెలిసినంతవరకూ జాలరి బుర్రలో ఒకటే ఆలోచన తిరుగుతుంది. అదే – ఆ జీవిని తెచ్చి అప్పగించడం.
ఇంటికి వెళ్ళి, సామాన్లు తెచ్చుకున్నాడు. ఎన్నిరోజులు పడుతుందో అక్కడికి వెళ్ళడానికి లెక్కతీసుకున్నాడు. దానికి అనుగుణంగా బోటులో సామాను సర్దుకున్నాడు. పిల్లాడిని హాస్పిటల్లోనే ఉంచమని భార్యకు చెప్పి, ఒక సంచి ఆమె చేతిలో పెట్టాడు. ముందు ఆమెకు అర్థంకాలేదు ఆ సంచి అంత బరువెందుకుందో. తర్వాత గ్రహించింది అదేంటో. డబ్బు ఎంత బరువున్నా బాగానే అనిపిస్తుందేమో! ఆమె ముఖంలో అది కనిపించింది. అతను ఎక్కడికెళుతున్నాడోకూడా అడగలేదు ఆమె.
బోటు తీశాడు, రెండురోజుల ప్రయాణంతర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఒక దీవి దగ్గరగా వచ్చాడు. రాత్రి అయిపోయింది. అతనికి కొత్తేమీకాదు కొత్త దీవులూ, చీకటి రాత్రులూనూ. దూరంగా నీటిలో నీలంగా మెరుస్తోంది. ఇలాంటివన్నీ చూశాడు. ఎన్నో వింతలూ, విశేషాలూ ఇన్నేళ్ళ చేపలవేటల్లో. కానీ, ఇది పదో వింత ఆకారంలా తోచింది. బోటు దగ్గరగా వచ్చింది, చిన్ని హరికేన్‍లాంతరు వెలుగులో, కింద పరిచిన కాగితాల్లో ఉన్న ఒక ఆకారంలా అనిపించింది ఆ మెరుస్తున్న ఆకారం. అదే జీవి. నిశ్శబ్దంగా వలవేశాడు. వలకి చిక్కినట్టనిపించింది. కొంచెం కొంచెం వలను బిగించసాగాడు. బరువు పెరుగుతన్నట్టనిపిస్తోంది.
ఆ జీవి నీటి ఉపరితలంపైకి వచ్చి జాలరివైపు చూసినట్టు చూసి, లోపలికి వేగంగా కదిలింది. బలంగా ఆ వలని లాగింది తనతోపాటు. బోటు మరీ పెద్దది కాకపోవడంతో వూగి, ఆ వూగడంతో పెద్దగా కదిలి జాలరి నీటిలో పడిపోయాడు, వలతోసహా. ఆ జీవి వలని, వలతోపాటు జాలరినీ యీడ్చుకుపోతోంది వేగంగా. భయపడిందేమో మరి.
ఆ వేగానికి, నీటిలో ఊపిరి ఆడకపోవడంతో, స్పృహతప్పుతోంది జాలరికి.
కళ్ళు తెరిచేసరికి ఒక జలాంతర్భాగంలో వున్న గుహలాంటిదాన్లో ఉన్నాడు. ఎదురుగా, అదే జీవి మెరుస్తూ. దాని కళ్ళలో భయం, బాధ. చుట్టూ నీరు ఉన్నా, ఆ గుహలోకి నీరు రాకపోవడం, ఎయిర్‍పాకెట్ ఉండడం తను గాలిపీల్చుకోగలగడం వింతగా అనిపించింది. ఒక్క ఉదుటున, ఆ జీవిమీదకి దూకి పట్టుకోబోయాడు, హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాయో వందలాది అలాంటి జీవులే, దాన్ని మూసేశాయి జాలరికి దొరక్కుండా. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఆశ్చర్యపోయాడు, కొంచెం భయపడ్డాడు. ఇంతలో దూరంగా మనిషిలాంటి ఆకారం కనిపించింది. అది దగ్గరగా రావడం ప్రారంభించింది. దాన్ని చూసి అవాక్కయ్యాడు. తను కథలలో చదువుకున్న మత్స్యకన్య ఆమె. ఆమె “‘ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఈ జీవిని ఎందుకు పట్టుకెళదామనుకున్నావు?”’’అని అడిగింది.
అప్పుడు తన వృత్తాంతం అంతా చెప్పి, “ఎందుకో తెలీదు, తీసుకుని రమ్మన్నారు” అని చెప్పాడు.
అప్పుడు ఆమె నవ్వి, చెప్పడం ప్రారంభించింది.
“కొన్నివందలయేళ్ళ పూర్వంవరకూ మనుషులూ, మేమూ ఐకమత్యంతో ఉండేవాళ్ళం. వాళ్ళకు ఏం సహాయం కావాల్సినా మేం చేసేవాళ్ళం, మాకు ఏం ప్రమాదం వచ్చినా వాళ్ళు రక్షించేవాళ్ళు. కానీ, మనుషుల ప్రవర్తనలో మార్పు రాసాగింది. అవసరమైనదానికంటే ఎక్కువ ఆర్జించటం, దాచుకోవటం, దోచుకోవడం, ప్రకృతిధర్మాల్ని కాలరాస్తూ, ప్రకృతిని నాశనంచేస్తూ ప్రకృతిపై గెలిచేస్తున్నామని భావించసాగాడు. అందుకు తగ్గట్టుగానే అనేకరకాలైన వ్యాధులు చుట్టుముట్టసాగాయి మనిషిని. మనిషి ఊరుకొనేరకం కాదుగా, ఎలాగైనా దానికి విరుగుళ్ళు కనిపెట్టాలని ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నాలు ఫలించి, ఇప్పుడు నీవు పట్టుకోవడానికి చూసిన జీవిద్వారా ఔషధాలు తయారుచేయవచ్చని తెలుసుకున్నాడు. ఇక వాటిని వేటాడడం, వెంటాడడం, చంపి దానినుంచి ఔషధాలు తయారుచేయడం, ఇదేపనిగా పెట్టుకున్నాడు. ఒకానొకదశలో ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఇవనే కాదు, మమ్మల్నీ వదల్లేదు. ప్రయోగాలూ, పరిశీలనలని వేధించాడు. కాలుష్యాన్ని నదులూ సముద్రాల్లోకి పంపించసాగాడు. ఇలా వీల్లేదని మేమందం మనిషికి కనిపించే పరిధిలోకి రాకుండా ఉండకుండా మా జీవనాల్ని మార్చుకున్నాం. అలానే జీవిస్తున్నాం. అసలు ఈ జీవి స్రవించే రసాయనాలు అత్యద్భుతగుణాలున్నవి. ఇవి బ్రతికుండగా స్రవించిన ద్రవాలు అమృతంతో సమానం. అది తెలుసుకోలేని మనిషి వీటిని చంపి, అప్పుదు స్రవించిన ద్రవాలను ఔషధాలుగా వాడుతున్నాడు. ఆ ఔషధాలు ఒక్కశాతంకూడా ప్రభావవంతమైనవి కావు. అయినాసరే, దీర్ఘరోగాల్నికూడా నయంచేస్తున్నాయంటే అర్థంచేసుకో, దీని ప్రభావం. సామరస్యంగా ఉంటూ, దీన్నుంచి సాగు చేసుకోవచ్చు ఆ దివ్యద్రవాన్ని. అది తెలుసుకోలేకపోయాడు తెలివైన మానవుడు. అతనికేగాక, ప్రకృతికీ జీవికీకూడా హానితలపెడుతున్నాడు. ఇలా చేయడంవల్లనే వాడికీ, మాకూ ప్రమాదం సంభవించింది. మేం ఇక్కడికి వచ్చేసి హాయిగా ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఇలా. దయచేసి వెళ్ళిపో, ఇక్కడినుంచి. మా ఉనికిని ఎవ్వరికీ చెప్పకు”’ అని వేడుకుంది.
తన కొడుక్కి సహాయంచేసినవాడు ముఖ్యమా? వీరెవరో, ఏం చెబుతున్నారో, చెబుతున్నది నిజమో, అబద్ధమో తెలియకుండా వీరికి సహాయం చెయ్యాలా? ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఆ మత్స్యకన్య ఒక చిన్నసీసాలో కొన్నిచుక్కల ద్రావణాన్ని వేసి అందించింది జాలరికి.
“ఇది అమృతతుల్యమైనది, చనిపోతున్న మనిషిని బ్రతికిస్తుంది. దీర్ఘరోగులను రోగరహితులుగా, నవయవ్వనులుగా మార్చి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. ఇది నీవు మాకు చేయబోయే మేలుకు కానుక” అంటూ, ఆ జీవుల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది వేగంగా.
కళ్ళు తెరిచాడు నైట్‍డ్యూటీ డాక్టర్. కళ్ళు నులుముకొని చెబుతున్నాడు, తన కొలీగ్‍తో, “డాక్టర్ లైఫ్ చాలా స్ట్రెస్‍ఫుల్‍రా, బాబూ! ఏవేవో కలలు వస్తున్నాయ్, సైన్స్‌కి అందనివి. సముద్రాలూ, వింతజీవులూ, మత్స్యకన్యలూ” లేచి టేబుల్ పైనున్న గ్లాస్‍వైల్‍ని షేక్ చేస్తూ అన్నాడు.
బయట వరండాలో అలసిన ముఖంతో ఆ జాలరి కునికిపాట్లు పడుతున్నాడు, మధ్యమధ్యలో లేస్తూ చూస్తున్నాడు లోపలికి. తన పిల్లాడివంక. నయమై తీరుతుందన్న నమ్మకంతో.
అక్కడ ఆ బిలియనీర్ చేతికి ఉన్న కాన్యులాకి ఒక సెలైన్‍బాటిల్ కనెక్ట్ చేసిన నర్స్, ఒక తెల్లటి ద్రావణం ఉన్న వైల్‍ని బ్రేక్‍చేసి సిరంజిలోకి లోడ్ చేస్తోంది.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.