వాగ్దేవి కళాశాల వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీలో ” ప్రేమ వివాహాలూ- పెద్దలు కుదిర్చిన వివాహాలూ” అనే అంశంపై ముందురోజు మాట్లాడిన సహవిద్యార్థిని సౌందర్యను గ్రంధాలయంలో చూసి కంగ్రాట్స్ చెప్తూ,
“అదరగొట్టేసేరుకదండీ” అన్నాడు సహవిద్యార్థి సతీష్.
“థాంక్సండీ” అంది సౌందర్య.
“నేనే జడ్జ్ నయితే …”
“అమ్మాయిలందరికీ ప్రైజ్ లు ఇచ్చేసేవారేమో! ఏమ్ ఐ కరెక్ట్? “అంది సౌందర్య.
“ఛ! ఛ! అందరికీ ఎలా ఇస్తానండీ మీలాంటివాళ్లకు తప్ప?” అన్నాడు సతీష్.
“థాంక్యూ ఫర్ ది కాంప్లిమెంట్. ఇంతకీ ఏమిటో నాలో స్పెషాలిటీ?” అడిగింది సౌందర్య.
“ఎలక్యూషన్‍లో మీరు చెప్పిన అభిప్రాయాలూ, నా అభిప్రాయాలూ ఒకటేనండీ. అదీ స్పెషాలిటీ” అంటూ “మీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు.
“మాట్లాడుతున్నారుగా! అయినా అదేంటండీ క్రొత్తవాళ్ళలా? రోజూ కాలేజీలో కలుస్తుంటాము కదా! అప్పుడు మాట్లాడొచ్చు. ఇది లైబ్రరీ. అటు చూడండి. ఆ బోర్డ్. ష్! కీప్ సైలెన్స్. నిశ్శబ్దమును పాటింపుము. ఇక్కడ చదువుకోడానికేగాని మాట్లాడడానికి కాదు” చెప్పింది సౌందర్య.
“పోనీ కేంటీన్‍కి వెళ్లి కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందామా? ప్లీజ్. మీరు మరేమీ అనుకోనంటేనే”
“సరే! అంత ఇంపార్టెంట్ మేటర్ అయితే పదండి” అని లేచింది సౌందర్య. మరో ఐదునిముషాల్లో ఇద్దరూ కేంటిన్లో వున్నారు.
“అదేంటండీ! ఇందాకటినుండి చూస్తున్నాను. కాఫీ వదిలేసి నీళ్ళునమలడం అంటారు చూడండి, అలా వాటర్ సిప్ చేస్తున్నారు. నేను కాఫీ త్రాగడం పూర్తయిపోయింది” తెలియపరచింది సతీష్‍కి సౌందర్య.
“అబ్బే! అదేం లేదండీ” అన్నాడు సతీష్.
“నాతో ఏదో మాట్లాడాలన్నారు. చెప్పండి ఏంటో?” అడిగింది.
“అదేనండీ! ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు.ఎలా ప్రారంభించాలో తెలియక…”
“ప్రెపేరయి రండి. అప్పుడు చెప్పుదురుగాని” సలహా ఇచ్చింది.
‘ఆ! అక్కర్లేదండీ” తేరుకుని అన్నాడు.
” పోనీ వన్,టూ,త్రీ …చెప్పనా? ” పరిహాసంగా అంది.
“నేను సీరియస్‍గా చెప్తుంటే మీకు జోక్‍గా ఉంది.”అన్నాడు
” సరే! నేనూ సీరియస్‍గానే వింటాను చెప్పండి.”
“అపార్థం చేసుకోరు కదా?”
“అసలు మీరు చెప్పాలనుకున్నదేమిటో చెప్పకుండానే అపార్థం చేసుకోవడం వరకూ ఎందుకండీ? ఆ చెప్పేదేదో త్వరగా చెప్పండి. అవతల
క్లాస్‍కి టైమవుతుంది.”
“నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సౌందర్యగారూ! ఐ లవ్ యూ సో మచ్” అనేసి జవాబుకోసం చూస్తున్న సతీష్ సౌందర్య దిగ్గున లేచి వెళ్లిపోవడం గమనించి “సౌందర్యగారూ” అంటూ పిలిచేడు. కానీ లాభం లేకపోయింది. “ప్చ్! ఏమనుకుంటుందో ఏమో!” అని భయమేసింది.
కాలేజ్ హాస్టల్ రూమ్‍లో తన రూమ్మేట్ వాసుని అడిగేడు సతీష్ “నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించేవా?” అని. “ఎప్పుడో ఏమిటి? ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను” చెప్పేడు వాసు. “ఎవర్నో చెప్పరా ప్లీజ్” అడిగేడు సతీష్.
”మా అమ్మనీ, నాన్ననీ, తమ్ముడ్నీ, చెల్లాయినీ”
ఆ సమాధానం విన్న సతీష్ “ఛ! ఉదయాన్నే వెధవ జోకూ నువ్వూను. నేనడిగింది అదికాదురా! నువ్వెప్పుడైనా, ఎవరికైనా ప్రేమలేఖ వ్రాసేవా?”అడిగేడు.
“ప్రేమలేఖ రాయటం కాదుగదా శుభలేఖ కూడా ఇవ్వలేదు”
“ఓరి దద్దమ్మా! ప్రేమలేఖ ఫలిస్తేనే శుభలేఖ వరకూ వస్తుంది. నీకింకా అనుభవం ఉందేమో అడుగుదామనుకున్నాను” అన్నాడు నిరాశగా సతీష్. “ ఏమిటి కథ? నువ్వు ఎవరికైనా ప్రేమలేఖ వ్రాస్తావా?” అడిగేడు ఆత్రుతగా వాసు. అవునన్న సతీష్‍ని “ఎవరికీ” అని అడిగేడు
”ఇప్పుడప్పుడే చెప్పను. ఫలించేక చెప్తాను”
” నువ్వు కాలేజ్‍కి వచ్చేది పరీక్షలు వ్రాయడానికా? ప్రేమలేఖలు వ్రాయడానికా?” ఎదురుప్రశ్న వేసేడు వాసు.
“ప్రేమలేఖ వ్రాయడం కూడా ఓ పరీక్షేరా! అయినా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా. కాలేజ్‍కి గుడ్‍బై చెప్పేసే టైం దగ్గర పడింది” గుర్తుచేసేడు సతీష్ .
“ఎలాగో తగలడు కాని ఇంతకీ నీ లేఖ అందుకునే నాయిక ఎవరో? చూస్కో. నీ ప్రేమకు పరీక్ష కాగలదు” హెచ్చరించేడు వాసు శ్రేయోభిలాషిలా. “మాట సాయం లేదుగాని బోడి సలహా ఒకటి” దెప్పిపొడిచేడు సతీష్. “అది కాదురా” అంటున్న వాసుతో “ నువ్వింకేం చెప్పక్కర్లేదు” అన్నాడు. “ప్చ్! వీడికి ప్రేమ పిచ్చి పట్టుకుంది.ఆ భగవంతుడే వీడిని కాపాడాలి” అనుకున్నాడు వాసు.
***
కాలేజ్ క్లబ్‍లో ఉన్న సౌందర్యను పిలిచింది స్నేహితురాలు ప్రమీల. ఊహు పలకలేదు. “ఏయ్! నిన్నేనే” అంది.
“ఊ” అంది సౌందర్య పరధ్యానంగా. “ఏమిటే, ఈలోకంలో ఉన్నట్టు లేవు.” అనగానే ‘ఆ’ అంటూ అప్పుడు చూసింది. “అర్థమైంది. అర్థమైంది. ఎలక్యూషన్‍లో ఎరేంజ్‍డ్ మేరేజ్‍స్‍కన్నా లవ్‍మేరేజ్‍స్ బెటర్ అని చెప్తున్నప్పుడే అనుకున్నాను నువ్వేదో ప్రేమలో పడ్డావని. ఏమిటి కథ? పెళ్లి కాకుండానే స్వప్నలోకాల్లో విహరిస్తున్నావంటే…”
“అబ్బే! అదేం లేదే!” అంది సౌందర్య.
“ నిజమేలే! పెళ్లి కాకముందే కలల్ని కనాలి. పెళ్లయేక పిల్లల్ని కనాలి. అంతేనా?” ఆటపట్టించడానికి అంది ప్రమీల.
“ పోవే ముదురు జోకులూ నువ్వూను”
“అంటే? నీ కంటికి నేను ముదురుదానిలా కనిపిస్తున్నానా? అను అను. టైం నీది. ఏం చేస్తాం?” చిన్నబుచ్చుకుంది ప్రమీల.
“ అది కాదే !”
“ఏది కాదు? నీది స్టన్నింగ్ బ్యూటీ.అంచేత నిన్ను ఎవరైనా ప్రేమిస్తారు” అసూయగా అంది.
“ సారీ రా! నేనా ఉద్దేశంతో అనలేదు.నువ్వు అనవసరంగా ఫీలవుతున్నావు తప్ప మనిద్దరిదీ ఒకటే వయసు. నేనొక్కటి అడుగుతాను
ఫ్రాంక్‍గా చెప్పు. ప్రేమించేవాళ్ళు అందం చూసే ప్రేమిస్తారంటావా?”
“నూటికి తొంభైతొమ్మిదిమంది అంతే .అబ్బాయిలే కాదు అమ్మాయిలూను. కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శ్రుతం. అమ్మాయి అబ్బాయి రూపాన్ని వరిస్తుంది. అమ్మాయి తల్లి అబ్బాయి సంపాదన చూస్తుంది. అమ్మాయి తండ్రి అబ్బాయి కులం, గోత్రం, వంశం, సంప్రదాయం, గుణగణాలూ చూస్తాడు.” తేల్చి చెప్పింది ప్రమీల.
“ఇవన్నీ నీకెలా తెలుసే?”
“ నువ్వే చెప్పేవు కదే! ముదురుదాన్నని.”
“సారీ చెప్పేను కదే!”
“సరేలేగాని ఇంతకీ అసలు సంగతి చెప్పేవుకాదు. నీ పరధ్యానానికి కారకుడైన ఆ దుష్యంతుడెవరో?” అడిగింది ప్రమీల.
“దుష్యంతుడూకాదు. ప్రవరాఖ్యుడూ కాదు.”
“ పోనీ ఎవరైతేనేం అదృష్టవంతుడు.”
“అదేం కాదుగాని నువ్వు అడిగేవు కాబట్టి చెప్తున్నాను.”
“చెప్పవే! సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాను” అని ప్రమీల అనగానే “మన క్లాస్‍మేట్ సతీష్’ అని చెప్పేసింది సౌందర్య.
“ఆ! ఏమన్నాడు? నీ ముఖం చంద్రబింబంలా ఉందన్నాడా?” ఎంక్వయిరీ చేసింది స్నేహితురాలు. “నీకెలా తెలుసు” అని అడిగింది సౌందర్య. తెలియడానికేముందీ? వాడెవడో నన్ను మంకీఫేస్ అన్నప్పుడు ఇతను నిన్ను పింకీ రోజ్ అనడంలో వింతేముంది? ఇంతకీ ఏమన్నాడూ?” కుతూహలంగా అడిగింది ప్రమీల.
“ పిలిచి ఆ మాటా, ఈ మాటా కలిపి చివరికి ఐ లవ్ యూ అన్నాడు. “ చూసేవా? నేను చెప్పలేదూ? అదే మాట నాతో అనలేడు.” అంటున్న ప్రమీలతో“ ఎందుకే అంత ఇన్‍ఫీరియర్‍గా ఫీల్ అవుతావు? ఇప్పుడు నీకేం తక్కువని? బాహ్యసౌందర్యంకన్నా మానసికసౌందర్యం విలువైనది. తెలుసా? “ అంటూ సముదాయించింది సౌందర్య స్నేహితురాల్ని.
“నువ్వు నా ఫ్రెండ్‍వి కాబట్టి ఆ మాటంటున్నావ్. నీలా అనుకునే అబ్బాయిలు ఉంటారంటావా?” అడిగింది ఆశగా.
“ ఏం, ఎందుకుండరు?”
“ అయితే నిన్ను ప్రేమించే సతీష్ ఆ కేటగిరీయేనంటావా?” తెలుసుకోడానికి అడిగింది ప్రమీల.
“ఏమో నాకేం తెలుసు?” అంది సౌందర్య.
“మరెలా తెలుసుకుంటావ్?”
“ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుని ఏం చెయ్యాలి?” ఎదురు ప్రశ్న వేసింది.
“ఆతను నీకు ఐ లవ్ యూ చెప్పేడన్నావు కదా! మరి ఆ ప్రపోజల్‍కి నువ్వేం సమాధానం చెప్తావ్?”
“నాకిష్టమైనప్పుడు కదా?” చెప్పింది సౌందర్య.
“అయితే అతనంటే నీకిష్టం లేదంటావ్?” అనేసరికి “ఏమోనే చెప్పలేను“ అంది.
“అంటే ఏదో మూల ఉందన్నమాట. అతనికేం తక్కువ? ఈడూ జోడూ సరిపోతుంది. అందగాడు. చదువుకున్నాడు. ఆస్తిపాస్తులూ, అంతస్తూ తెలియకపోయినా తన కాళ్ళమీద తను నిలబడగలవాడు. ప్రేమించడానికి ఇంతకంటే ఏం కావాలి మగాడికి?” బోధపర్చింది ప్రమీల.
“ అయినా అతని ప్రేమ ఎంత స్వచ్చమైందో,అందులో ఎంత నిజాయితీ ఉందో ఎలా తెలుస్తుంది?”అని అడిగింది సౌందర్య.
“వెయిట్ ఎండ్ సీ లేదా పరీక్ష పెట్టు.అందులో నెగ్గితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయ్”
“పెద్ద అనుభవజ్ఞురాలిలా చెప్తున్నావ్?”
“ దీనికి అనుభవమే అక్కర్లేదు. ఆలోచన ఉంటే చాలు. ఇంతకీ ఈ సంగతి మీ ఇంట్లో చేప్పేవా?”
“ఇంకా చెప్పలేదు. అయినా ఇప్పటినుంచీ ఎందుకు? నేను ఇంకా డిసైడ్ అవలేదు కదా!” చెప్పింది సౌందర్య.
“ఒకవేళ చెప్తే ఒప్పుకుంటారా?” అడిగింది ప్రమీల.
“ చస్తే ఒప్పుకోరు”
“మరేం చేస్తావ్?”
“ఎలాగో మేనేజ్ చెయ్యాలి”
“విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి నే వస్తా” అంటూ వెళ్ళిపోయింది ప్రమీల.
“ఏమోయ్! నీ సుపుత్రుడు ఏడీ? కొంపకి ఇంకా తగలడలేదా?” అసహనంగా అన్నాడు విశ్వనాథం భార్య వైదేహితో. ఇంకా రాలేదని చెప్పింది వైదేహి.
”రాలేదని మెల్లిగా చెప్తావేంటి? ఇప్పుడు టైమెంతయిందనుకుంటున్నావ్? పది. మరింతవరకూ రాలేదంటే బయట ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నాడు? కాలేజ్ ఇంతవరకూ ఉండదు కదా!”
“మీకెప్పుడూ వాడిమీద అనుమానమే” తల్లిలా బాధపడింది. “మరి వాడ్నలా తయారు చేసింది నువ్వు కాదూ?” ఆరోపించేడు ఆయనగారు.
“మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అని వాడు మగవాడు తిరక్క ఏం చేస్తాడు?”
“నువ్విలాగే వాడ్ని సపోర్ట్ చేస్తుండు. రేప్రొద్దున్న వాడు ఏకు మేకై కూచుంటాడు. ఆ తర్వాత ఏ అమ్మాయినో తీసుకొచ్చి ఇదిగో అమ్మా! నీ కోడలు అని చూపిస్తాడు. అప్పుడు సరిపోతుంది” ముందుజాగ్రత్త చెప్పేడు విశ్వనాథం.
“ఎందుకండీ ప్రతి చిన్నదానికీ అంత ఎక్కువగా ఊహించుకుంటారు?”
“నేను ఊహించుకోవడం కాదు. రోజులలా ఉన్నాయి” చెప్పేడు తండ్రిగా. “మీరెప్పుడూ మంచిగా ఆలోచించరు.” చురక అంటించింది భార్యామణి. “మంచిగా ఆలోచించబట్టే వాడి గురించి అడుగుతున్నాను. వాడికి బొత్తిగా భయం లేకుండా పోయింది” బాధపడుతూ అన్నాడు భర్తగారు.
“అదిగో మాటల్లోనే వచ్చేడు. వాడినే అడగండి ఎందుకింత ఆలస్యమైందో”
“ఏరా? ఇల్లు ఇప్పుడు గుర్తుకొచ్చిందా?” వెటకారంగా అడిగేడు విశ్వనాథం కొడుకుని. “ లేదు.డాడీ! మా ఫ్రెండ్ ఒకడు పార్టీ ఇస్తేనూ అక్కడికి వెళ్లి వస్తున్నాను” సంజాయిషీ చెప్పేడు కొడుకు.
”ఎప్పుడూ పార్టీలేనా? ఈ ఏడాదీ పాసవడం ఉందా?”
“నా ప్రయత్నం నేను చేస్తున్నాను డాడీ!”
“చాల్లే! ప్రయత్నంట ప్రయత్నం. భగీరథ ప్రయత్నంలాగ”
“ఇంటికి రాగానే వాడిమీద అలా విరుచుకుపడతారెందుకు? ఎంత అలిసిపోయి వచ్చేడో” తల్లి మనసు విలవిల్లాడింది.
“అవును పాపం. పార్టీలో మెక్కి అలిసిపోయి వచ్చేడు. చూడు సేద దీర్చు. నువ్విలా గారాబం చెయ్యబట్టే వాడు అలా తయారయేడు”
“నేను గారాబం చేసినా ఏం లాభం? మీరు రాద్ధాంతం చేస్తున్నారు కదా! తనయుడు చెడుగైన తండ్రి తప్పు అన్నారు” బాణం వదిలింది భార్యామణి. “అంటే వాడు చెడిపోవడానికి నేను కారణమా?” తడుముకుంటూ అన్నాడు తండ్రి. “మరి మీ క్రమశిక్షణకు భయపడి వాడు ఇంటిపట్టున ఉండడంలేదు” తెలియజెప్పింది తల్లి.
“అయితే గాలికి వదిలేయమంటావా?” అడిగేడు విశ్వనాథం. “ ముందు నన్నొదిలేస్తే నేను వెళ్లి పని చూసుకుంటాను” అంది వైదేహి.
”వదిలేస్తానుగాని నీ అతి గారాబం తగ్గించు”చెప్పేడు భార్యకి భర్తగా.
“అలాగే మీ అతి క్రమశిక్షణ కూడా తగ్గించండి “సలహా ఇచ్చింది సాధ్వీమణి.
కాలేజ్‍లో క్లాసులు అయిపోయేక వెళిపోతూ సతీష్‍ని చూసి “గుడ్ ఈవెనింగ్ సతీష్‍గారూ’ అంది సౌందర్య. “వెరీ గుడ్ ఈవెనింగ్. మీరా?’ అన్నాడు సతీష్.
“నా పేరు మీరా కాదు. సౌందర్య”
“గుడ్‍జోక్. అది సరే.ఇప్పుడు మీరు ఫ్రీయేనా?” మళ్ళీ మొదలుబెట్టేడు సతీష్. ’ ఏం? ఎందుకని?” అడిగింది సౌందర్య.
“అలా ఏదైనా రెస్టారెంట్‍కి వెళ్లి మాట్లాడుకుందామని…”
“ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా కేంటీన్‍లోనో, లైబ్రరీలోనో?”
“కేంటీన్‍లో అయితే గోలగోలగా ఉంటుంది. లైబ్రరీలో అయితే సైలెన్స్ అని మీరే అంటారు.ఇంకేం మాట్లాడుకుంటాం?”
“అయినా మొన్న మాట్లాడేసేరు కదా! ఇంకా ఏం మాట్లాడాలి?”అడిగింది అనుమానంగా.
“నేను మాట్లాడేను సరే. మీరేం మాట్లాడలేదు కదా? నా ప్రపోజల్‍కి మీనుండి ఏ రెస్పాన్సూ లేదు.అందుకని…
“ మేన్ ప్రపోజెస్. గాడ్ డిస్పోజెస్” చెప్పింది సౌందర్య.
“కరెక్టే! కానీ ముందు మీరు ప్రపోజ్ చెయ్యాలికదా గాడ్ డిస్పోజ్ చెయ్యాలంటే?” అనగానే ‘సరే! ఎక్కడికెళ్దాం?” అని అడిగింది సౌందర్య. “అదిగో! ఎదురుగా రెస్టారెంట్ ఉంది కదా, అందులోకి వెళ్దాం పదండి” అంటూ ఇద్దరూ బయలుదేరి రెస్టారెంట్‍లోకి వెళ్ళేరు.
“ఇప్పుడు చెప్పండి సౌందర్యగారూ! మీ ఒపీనియన్. మీరు ఎలక్యూషన్‍లో చెప్పిందాన్నిబట్టి మీరు లవ్‍మేరేజ్‍స్‍కి ఫర్ అన్నట్టే కదా?”
“నిజమే కాని అదీ పేరెంట్స్ అంగీకరిస్తేనే” చెప్పింది సౌందర్య .
“మీ పేరెంట్స్ ఒప్పుకోవాలంటే నాలో ఏ ఏ లక్షణాలు ఉండాలనుకుంటున్నారు? పోనీ ముందు మీకు ఇష్టమా కాదా చెప్పండి ”ఆత్రుతగా అడిగేడు ప్రేమార్థి. “అది చెప్పాలంటే కొన్ని క్లేరిఫై చేసుకోవాలి” అని నిర్మొహమాటంగా చెప్పేసింది.
“ఓ.కే. ఇంటర్వూ చేస్తారా?నేను రెడీ. అడగండి. అన్నాడు అభ్యర్థి. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది.
“మీరు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేరు కదా! నాలో ఏం చూసి ప్రేమిస్తున్నారు? రంగా? రూపమా? చదువా? లేక ఆస్తిపాస్తులేవయినా ఉన్నాయనుకుంటున్నారా?”
“ప్రేమించడానికి కావలసింది రంగూ, రూపమూ కాదండీ. గుణం. అలాగే చదువుంటే సరిపోదు. సంస్కారం ఉండాలి. ఆస్తీ, అంతస్తూ లేకపోయినా అభిమానం, ఆప్యాయతా ఉండాలి.”
“అలాంటప్పుడు మీరు మా ఫ్రెండ్ ప్రమీల్ని ప్రేమించొచ్చు కదా! మీరు చెప్పినవన్నీ తనలో కూడా ఉన్నాయి”
“నేను మీగురించి అడుగుతుంటే మీ ఫ్రెండ్ సంగతి ఎందుకండీ ఇప్పుడు?”
“సరే! ఏం లేదు. రేప్రొద్దున్న నా రూపంలో ఏదైనా మార్పు వస్తే అప్పుడూ నన్ను ఇలాగే ప్రేమిస్తున్నానంటారా?”
“షూర్! ముమ్మాటికీ.”
“నేను ఉద్యోగం చెయ్యడం మీకిష్టమేనా?”
“మరి చదివింది ఎందుకండీ? ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం కామన్. సర్వసాధారణమైపోయింది. అసలు చెప్పాలంటే అవసరం కూడాను.”
“కట్నం తీసుకోవడంపై మీ అభిప్రాయం?”
“నేను వరకట్న వ్యతిరేకిని.”
“కావచ్చు. కాని మీ పేరెంట్స్ ఆశించరా?”
“ఆశించవచ్చు. కాని వాళ్ళను కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. అది నేను చూసుకుంటాను. ఇంతకీ మీరు బయటపడలేదు”
“చివరిగా ఒక్కటి?”
“అడగండి.
“మీకు కేస్ట్ ఫీలింగ్ లేదా?”
“ఉంటే ఈపాటికి మీ కేస్ట్ అడిగి ఉండేవాడిని కదా!”
“మీకుండకపోవచ్చు. కాని మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని?”
“నేను చెప్పేను కదా మా పేరెంట్స్ సంగతి నేను చూసుకుంటానని. ముందు మీ సంగతి చెప్పండి. మీకు ఓ.కే. నా?”
“మనిద్దరి అభిప్రాయాలూ ఒకటేనండి”
“అయితే ఓ.కే. అన్నమాట. ఐ యాం వెరీ హేప్పీ అండీ. మరి మీ పేరెంట్స్ సంగతి?”
“ఇంకా నేను వాళ్లకు చెప్పలేదు. మీగురించి అన్నీ తెలుసుకోకుండా ఎందుకని? అయినా అభ్యంతరం చెప్పడానికి మీలో ఎత్తి చూపడానికేమున్నాయని?”
“థాంక్యూ సౌందర్యగారూ! థాంక్యూ వెరీ మచ్. రియల్లీ ఐ యాం సో లక్కీ . ఐ లైక్ యూ.”
సౌందర్య కూడా “ఐ టూ” అనడంతో రెస్టారెంట్‍లో ఇంటర్వ్యూ ముగిసింది.
#
సిటీబస్‍లో టిక్కెట్లు ఇస్తున్న కండక్టర్ని పిలిచి అడిగింది సౌందర్య “ఇవి లేడీస్ సీట్లేనా” అని.
”అదేంటి మేడమ్ అలా అడుగుతున్నారు? పైన వ్రాసి ఉంది కదా! అయినా క్రొత్తగా అడుగుతారెంటి? రంగు చూస్తే తెలియడం లేదూ?”
“అక్కడ వ్రాసి ఉన్నదేమిటో నాకు తెలియకా కాదు. రంగు కనబడకా కాదు. లేడీస్‍సీటులో మగాళ్ళు కూచున్నారు. అందుకని అడుగుతున్నాను”
“నేను టిక్కెట్లు ఇచ్చేసరికే చస్తుంటే ఇంకా ఏ సీట్లో ఎవరు కూర్చున్నారో చూడడం ఒకటా? స్టూడెంట్స్‌లా ఉన్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఇక పని అయినట్టే. మీరే వాళ్ళని అడగండి” అని చెప్పి వెళ్లిపోయేడు కండక్టర్.
“ఎవరో హీరోయిన్లా అడుగుతుందిరా. ఎవరూ అడగలేదు” అని ఒకడూ, “ఈ ఊరికి క్రొత్తనుకుంటాను” అని ఒకడూ, “పాపం సిటీబస్ ఎక్కడం ఇదే మొదటిసారేమో” అంటూ ఒకడూ నవ్వుతున్నారు.
అది చూసి సౌందర్య “చూడండి. ఇది లేడీస్ సీటు. లేడీస్ నిలబడి ఉండగా మీరు ఈ సీట్లో కూచోవడం…” అంటుంటే “బాగులేదంటారా? లేక నేరమంటారా?”అన్నాడు మరొకడు.
”ఏమంటారోగాని ఇది లేడీస్‍సీటని మాత్రం అంటారు. వ్రాసి ఉంది చూడలేదా?” అని అడిగింది. దానికి జవాబుగా ఇంకొకడు “అలా అయితే అక్కడ “నో స్మోకింగ్ అని కూడా వ్రాసి ఉంది. అంతమాత్రంచేత బస్‍లో పొగత్రాగడం మానేస్తున్నారా?” అడిగేడు.
”అదీ మీ మగాళ్ళు చేసే పనే” చెప్పింది సౌందర్య. ”అయితే మీ ఆడాళ్ళు చేసే పనేమిటో?” అడిగేడు ఒకడు. “ఏమీ చెయ్యకే మీరిలా మాట్లాడుతున్నారు” అంది సౌందర్య హెచ్చరికగా. “లా పాయింట్ తీస్తుందిరోయ్!’ అన్నాడొకడు. ఇంతలో ఓ పెద్దాయన “అబ్బాయిలూ!అనవసరంగా తగువెందుకు? మీరు లేచి ఆవిడకు సీటిచ్చేస్తేపోలా?” నచ్చజెప్పేడు వాళ్ళకు. “అంత జాలి గుండెగలవాళ్ళయితే మీరే నిలబడి మీ సీటు ఆవిడకివ్వొచ్చుగా! చెప్పోచ్చేరు మహా” అన్నాడా స్టూడెంటు. మీరు కూర్చున్న సీటులో నేనుంటే అలాగే చేసేవాడ్ని” అన్నాడా పెద్దాయన.
“చూసేవురా! అదీ పెద్దమనిషి తరహా అంటే.”అన్నాడొకడు.”అలాగా అయితే మీరీ సీట్లోకి వచ్చేయండి. మేం మీసీట్లో కూర్చుంటాం” అన్నాడు ఆ స్టూడెంటు.
“పోనీ అలాగే కానివ్వండి” అన్నాడా పెద్దాయన.
ఇదంతా చూసి “సార్! సార్! వద్దు. నామూలంగా మీకెందుకు శ్రమ? లేడీస్ లేనప్పుడు కూర్చున్నా వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళ సీట్లు వాళ్ళకివ్వాలన్న ఇంగిత జ్ఞానం ఎవరికి వాళ్ళకుండాలిగాని సీట్లమీద వ్రాసినంతమాత్రాన, సీట్లకు రంగులు వేసినంతమాత్రాన సరిపోదు” చురక అంటించింది సౌందర్య.
“పాప ఏ కాలేజ్‍లో చదువుతుందో?” అని ఒకడంటే “పాపేంటి?ఇంకా చదవడమేంటి? ఏ కాలేజ్‍లో పనిచేస్తుందో అను. లెక్చరిస్తుంది కదా!”అన్నాడు మరొకడు. అలా నవ్వుకుంటున్నారు.ఇంతలో ఒకడు సౌందర్యకు టచ్ అవుతుంటే “ఏయ్ మిస్టర్! కాస్త దూరంగా నిలబడండి.” అంది. ”దూరదూరంగా నిలబడడానికి ఇదేం మీ ఇల్లు కాదు. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. సిటీ బస్సు”అన్నాడు వాడు.
“అలా అని మీద పడాలని లేదుగా?”
“డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తె నేనేం చెయ్యను?”అన్నాడు అమాయకుడిలా.
“అందుకే దూరంగా నిలబడమన్నది.”
“ఏవమ్మోయ్! ద్రౌపదీదేవిలాగ మాట్లాడుతున్నావ్.అంత ఎవరూ తగలకుండా ఉండాలంటే ఏ ఆటోలోనో వెళ్ళలేకపోయేవా? ఈ క్రిక్కిరిసిన బస్ ఎక్కడం ఎందుకు?” అన్నాడు.
“నిజమే . నాకామాత్రం తెలీకా, నీలా ఇలాంటి సలహాలిచ్చేవాళ్ళు లేకా” అనుకుంటూ తన స్టాప్ వచ్చిందని దిగిపోయింది సౌందర్య.*
“ఏమండీ! అమ్మాయి కాలేజ్‍నుండి ఇంకా ఇంటికి రాలేదు” కంగారుగా చెప్పింది సుశీల భర్త శ్రీకాంత్‍తో.
“వస్తుందిలేవోయ్! గాబరాపడకు” ధీమాగా చెప్పేడు శ్రీకాంత్.
“అది కాదండీ. ఇప్పుడు టైం ఎంతయిందనుకున్నారు? ఏడుగంటలు” గడియారం చూపించింది భర్తకి.
“కరక్టేకానీ సిటీబస్‍లో రావడం కదా లేటవుతుంది ఒక్కోసారి” ధైర్యం చెప్పేడు తండ్రిగా. “ఆడపిల్ల టైముకి ఇంటికి రాలేదంటే చీమ కుట్టినట్లయినా లేదు మీకు.” దెప్పిపొడిచింది భర్తని సుశీల. “చీమేం ఖర్మ. నువ్వు కుడుతున్నావు కదా!” ఎగతాళిగా అన్నాడు శ్రీకాంత్.
”మీకు అన్నిటికీ వేళాకోళమే. అమ్మాయి కదా అందుకే భయం. అసలే రోజులు బాగులేవు.”
“నా కూతురికేం భయం లేదు. అలా భయపడుతుంటేనే అవతలివాళ్ళు భయపెడుతుంటారు” కూతురిమీద నమ్మకంతో అన్నాడు శ్రీకాంత్.
“మీ అమ్మాయేం ఝాన్సీ లక్ష్మీబాయా?”
“ఝాన్సీలక్ష్మీబాయి కూడా ఇలాంటి అమ్మాయే. ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మాయిలకు ధైర్యం చెప్పాలిగాని పిరికితనం నూరిపొయ్యకూడదు ” సలహా ఇచ్చిన భర్తతో అంది సుశీల. “చాల్లెండి. అలాగే చెప్పండి. తెలిసీ ఎవరూ నిప్పును పట్టుకోరు. అది మనమీద పడితే మనకే ముప్పు. మన జాగ్రత్తలో మనం ఉండాలి” అంటూ.
“ఇంతకీ ఏంటంటావ్?” అని శ్రీకాంత్ అంటుండగా “హాయ్ డాడీ! హాయ్ మమ్మీ!” అంటూ వచ్చేసింది సౌందర్య. “ఏంటమ్మా, ఇంత ఆలస్యం?” అని అడిగింది తల్లి.
“సిటీ బస్సులన్నీ ఒకటే రష్ మమ్మీ!” అని చెప్పింది కూతురు. “పోనీ ఆటోలో వచ్చేయలేకపోయేవా అమ్మా!” అన్నాడు తండ్రి.
“ఇంతదూరం ఆటోలో ఒక్కర్తే ఎలా వస్తుందండీ?” అడిగింది సుశీల. “ఇంక ఈ సిటీబస్సులూ వద్దు, ఆటోలూ వద్దు. ఓ స్కూటీ కొనిస్తాను. దానిమీద ఎంచక్కా వెళ్లివస్తుండు” అని తండ్రి చెప్పగానే “మై స్వీట్ డాడీ!” అంటూ ఎగిరిగంతేసింది కూతురు. “దాన్ని అలాగే ముద్దు చేస్తుండండి. నెత్తికెక్కి కూచుంటుంది” అంటున్న భార్యతో మెల్లిగా “ఏం నిన్ను చెయ్యలేదా?” అని అడిగేడు శ్రీకాంత్.
“ఏంటంటున్నారూ?” అని భార్య అనగానే “అబ్బే!ఏం లేదు. ఏం లేదు” అంటూ అక్కడినుండి జారుకున్నాడు.
***
ఒకరోజు సౌందర్య స్కూటీమీద వెళ్తుంటే “హాయ్! బ్యూటీ! “అంటూ ఒకడు అడ్డంగా వచ్చేడు.
“ఏయ్ మిస్టర్! ఏంటిది? అడ్డు తప్పుకో” అంది సౌందర్య.
“నీ స్పీడుకి బ్రేక్ వేద్దామని” అన్నాడు వాడు.
“మొన్న సిటీబస్సులో, ఇప్పుడు ఇక్కడ. నీకు వేరే పనేమీ లేదా?” అడిగింది.
“ఏం పనేదైనా చూపిస్తావా?” అన్నాడు.
“పని చూపించడం కాదు నీ పని చెప్తాను.” అంది ముందు జాగ్రత్తగా.
” ఏం చేస్తావ్?” అన్నాడు వాడు.
“నువ్వు ఇలా ఫాలో అయితే ఏదైనా చేస్తాను.” బెదిరించింది.
“నీకింత ఫాలోయింగ్ ఉన్నందుకు నువ్వు గర్వపడాలిగాని భయపడితే ఎలా? అవునూ ఆ సతీష్‍గాడు నీ లవర్ అని తెలిసింది. వాడే మగాడా? నేను కానా?”
“నువ్వు మగాడివి కాదు. మృగానివి” అనగానే “మృగంలా నువ్వే చేస్తున్నావ్” అన్నాడు. “నేనేం చేసేను?” అంది సౌందర్య.
“నువ్వేం చెయ్యలేదు. నీ బ్యూటీయే చేసింది. ఇంకా అర్థం కాలేదా? నేనూ నిన్ను లవ్ చేస్తున్నాను. అందుకే నిన్ను ఫాలో అవుతున్నాను” అన్న విలన్‍తో “అదే! అవద్దనే చెప్తున్నాను” అంది సౌందర్య భయం భయంగా.
“ఏం?ఎందుకని?” అడిగేడు వాడు. “నన్ను లవ్ చెయ్యమని నీకు నేను చెప్పేనా? నిన్ను లవ్ చేసే బ్యూటీని చూసుకో.”ధైర్యం కూడగట్టుకుని చెప్పింది.
“నేను లవ్ చేసే స్వీటీ కావాలిగాని నన్ను లవ్ చేసే బ్యూటీ నాకక్కర్లేదు.”
“మర్యాదగా తప్పుకో! లేకపోతే…” అంటుండగా అటుగా పోలీస్‍వేన్ వస్తుంటే “పోలీస్! పోలీస్!” అని పిలిచింది సౌందర్య. దెబ్బకు “ఇప్పటికయితే తప్పించుకున్నావుగాని మరోసారి తప్పించుకోలేవ్ ” అంటూ వెళ్లిపోయేడు వాడు.
“సౌందర్యా! ఏమిటే అంత టెన్షన్‍గా ఉన్నావ్?’ అడిగింది ప్రమీల కాలేజ్‍లో.
“ఓ దొంగరాస్కెల్ నన్ను ఫాలో అవుతున్నాడే. లవ్ చేస్తున్నానని ఒకటే గొడవ చేస్తున్నాడు. ఈసారికెలాగో తప్పించుకున్నానుగాని వాడు వదిలేలాలేడు” చెప్పింది సౌందర్య తన క్లోజ్‍ఫ్రెండ్‍కి.
“మీ ఇంట్లోవాళ్లకి ఈ విషయం చేప్పేవా” అని అడిగింది ప్రమీల.
“లేదు. చెప్తే మా మమ్మీ గాబరాపడిపోతుంది. డాడీకి నేనంటే ప్రాణం. హర్ట్ అవుతారు. అదే భయం” అంది సౌందర్య.
“మరి చెప్పకపోతే ఎలాగే? ఏం చేద్దామనుకుంటున్నావ్?”
“అదే ఆలోచిస్తున్నాను. నేనే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకుంటున్నాను.”
“గుడ్ ఐడియా. ఎంతైనా నువ్వు డేరింగ్ అండ్ డేషింగ్ గర్ల్‌వి కదా! ఇంతకీ సతీష్ సంగతేం చేసేవ్?”
“అదేనే. నన్ను ఫాలో ఆయే రౌడీ వెధవకి సతీష్ నన్ను లవ్ చేస్తున్నట్లు తెలిసిపోయింది.”
“అందుకే ఈలోపునే సతీష్‍తో ఏదో ఒకటి డిసైడ్ అయిపో. లేదా సతీష్‍కి ఈ సంగతి చెప్పు. అప్పుడు ఆ విలన్ నీజోలికి రాడు” సలహా ఇచ్చింది ప్రమీల.
“అబ్బే. అది కరెక్ట్ కాదు. ఇందులో అతన్ని ఇన్వాల్వ్ చెయ్యకూడదు.ఈ కేస్ నేనే డీల్ చెయ్యాలి. ఈ ప్రోబ్లం ఏదో నేనే సాల్వ్ చేసుకోవాలి ” తన నిర్ణయాన్ని తెలిపింది సౌందర్య ప్రమీలకి.
“జాగ్రత్త! దుష్టుడికి దూరంగా ఉండాలంటారు.”
“నేను దూరంగానే ఉంటున్నాను. వాడినే దూరం చెయ్యాలి. పద. క్లాస్‍కి టైం అయింది” అంటూ బయలుదేరింది సౌందర్య.
“మమ్మీ! నీతో కొంచెం మాట్లాడాలి” అంటున్న కూతురితో ‘కొంచెమేం ఖర్మ? ఎక్కువే మాట్లాడు” అంది సుశీల యథాలాపంగా.
“జోక్ కాదు సీరియస్ మేటర్” అంది సౌందర్య. సుశీల కంగారుగా “సీరియస్ మేటరా? ” వయసులో ఉన్న కూతురు తల్లితో సీరియస్ మేటర్ మాట్లాడాలన్నదంటే సీరియస్‍గానే తీసుకోవాలి అని తనలో తను అనుకుంటూ “ఏంటమ్మా అది?” అని అడిగింది.
“నేనో అబ్బాయిని ప్రేమించేను మమ్మీ!”
“ఆ! ఎంతపని చేసేవే” అంటూ, “ఏమండీ అర్జంట్‍గా ఇలా రండి. మీ అమ్మాయి ఆటంబాంబ్ పేల్చింది” అని భర్తను పిలిచింది.
“ఏంటోయ్! ఏమైందీ?” అంటూ వచ్చేడు శ్రీకాంత్.
‘ఏమయిందా? మీ ముద్దుల కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందట” చేసిన ఘనకార్యం చెప్పింది సుశీల. “ఇదెక్కడి చోద్యమే? ఇంటా వంటా లేదు” అన్నాడు శ్రీకాంత్.
“ఇంటా వంటా లేదు కాబట్టే ఇది ప్రవేశపెట్టింది” కోపంగా అంది తల్లి మనసు బాధపడగా.
“ఇంతకీ ఎవరే ఆ అబ్బాయి?” ఎంక్వయిరీ ప్రారంభించేడు తండ్రి.
“సతీష్ అని నా క్లాస్‍మేట్.”
“అందగాడా?”
“చూస్తే మీరే మెచ్చుకుంటారు.”
“అదీ సంగతి. దీన్ని లవ్ అనరమ్మా! ఎట్రాక్షన్ అంటారు”
“ అంటే అందమైన అబ్బాయిని ప్రేమించకూడదా?”
“అది కాదు బేబీ! ప్రేమ గ్రుడ్డిది అంటారు”
“గ్రుడ్డిదయితే అందాన్నెలా చూస్తుంది డాడీ?”
“చూసేరా! మీకే మాటలు నేర్పుతుంది అది. ఇన్నాళ్ళూ మీరు దాన్ని వెనకేసుకుని వచ్చినందుకు మీకు మంచి గుణపాఠం చెప్పిందండీ” అంది సుశీల ఉక్రోషంగా.
“అది కాదు డాడీ! అబ్బాయికి అందం, చదువూ అన్నీ ఉన్నాయి.”
“అంతేనా? అవి ఉంటే సరిపోతుందా?”
“ఇంకేం కావాలి? కులమేంటి? మతమేంటి? అంటారు. ఒకప్పుడు వృత్తులనుబట్టి కులాల్ని ఏర్పరిచేరు. ఇప్పుడా వృత్తుల్ని అందరూ చేస్తున్నారా? బ్రాహ్మణులందరూ పౌరోహిత్యం చేస్తున్నారా? రాజులు రాజ్యాలు ఏలుతున్నారా? కోమట్లందరూ వ్యాపారాలు చేస్తున్నారా?శూద్రులందరూ సేవలు చేస్తున్నారా? అలాగే అవసరాలకోసం మతాల్నే మార్చుకుంటున్నప్పుడు ఏ మతమైతే ఏంటి? అయినా ఆ అబ్బాయి హిందూయే. తక్కువ కులమేమీ కాదు”
“బాగుందమ్మా! రేప్రొద్దున్న నువ్వు లెక్చరర్‍గా ఇవ్వబోయే లెక్చర్ ముందు మాకే ఇస్తున్నట్టుంది. మీ తరానికి పెళ్లి అంటే ఫ్రెండ్‍షిప్‍లా అయిపొయింది. ఇష్టం ఉన్నన్నాళ్ళూ కాపురం చేసి ఇష్టం లేకపోతే విడిపోయేలా. వంశం, సంప్రదాయం అవీ చూసుకో అక్కరలేదా?” అన్న తల్లితో “మీ చాదస్తంగాని వంశంలో అందరూ ఒక్కలాగే ఉంటున్నారా? సంప్రదాయాలూ, ఆచారాలూ అందరూ పాటిస్తున్నారా?” అంది సౌందర్య ఆవేశంగా.
“ఇంతకీ ఏంటంటావ్? నీ ప్రేమ అంత గొప్పదైతే ఏ కురూపినో,వికలాంగుడినో ఎందుకు ప్రేమించలేకపోయేవు? అందమైన అబ్బాయే ఎందుకు కావలసి వచ్చేడు?” అడిగేడు తండ్రి.
“అవతలివాడి మనసు నచ్చితే రంగూ, రూపంతో పనిలేదు” చెప్పింది సౌందర్య.
“ప్రేమించినవాళ్ళందరూ మొదట్లో ఇలాగే అంటారు” ముందు హెచ్చరికగా చెప్పేడు తండ్రి.
“చూద్దురుగాని అయినా ఆ అబ్బాయికేం తక్కువని మీరు ఒప్పుకోరు?”ఎదురు ప్రశ్న వేసింది కూతురు.
“అందం, చదువూ ఉంటే సరిపోతుందా? సంస్కారం ఉండక్కర్లేదా? అదెలా తెలుస్తుంది? అది చూసినంతమాత్రాన తెలిసేది కాదు.”
“ఇలా అన్నానని ఏమనుకోకండి డాడీ! మరి పెళ్లి చూపుల్లో చూసినంతమాత్రాన ఏం తెలుస్తుంది సంస్కారం?”
“తర్వాత ఎంక్వయిరీ చేస్తాం కదా!”
“అలాగే నేనూ గమనించేను అతన్ని. అన్ని సద్గుణాలూ ఉన్నాయి అతనిలో”
“సౌందర్యా! ఎందుకే ఈ పంతాలూ,పట్టింపులూను? నేను చెప్తున్నాను వినవే. మేం మంచి సంబంధం చూస్తాం. బుద్ధిగా చేసుకోవే. మాకూ సంతోషంగా ఉంటుంది. కూతురు సుఖంగా, సంతోషంగా ఉండాలనే ఏ తల్లిదండ్రులయినా కోరుకుంటారు” నచ్చజెప్పింది సుశీల.
“మీరు చూసిన సంబంధం చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. అవునా?”
“అవునే. నా మాట వినవే”బ్రతిమలాడింది తల్లి.
“అలాగే నేను ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. ఆ తర్వాత మీ ఇష్టం ” తెగేసి చెప్పేసింది కూతురు.
“చూసేరా! అది ఎంత ఎదిగిపోయిందో! ఎంత ధైర్యం వచ్చేసిందో దానికి?” అంది భర్తతో సుశీల. “ఇన్నాళ్ళూ ఆడపిల్లంటే తలిదండ్రులకు బరువు సమస్య. ఇప్పుడు ఈరోజుల్లో పరువు సమస్య”అన్నాడు నెత్తిబాదుకుంటూ తండ్రి.
“మన పరువూ, మర్యాదా, సంతోషం దానికక్కర్లేదండీ” అంది బాధతో తల్లి.
“ఇప్పుడు మీ పరువూ మర్యాదలకేం భంగం వాటిల్లింది? నేనేం పరువు తక్కువ పనేమీ చేయలేదే! ప్రేమించి పెళ్లి చేసుకుంటాననడం పరువు తక్కువ పనా?” అడిగింది ధైర్యంగా ముద్దుల కూతురు. “కయ్యానికైనా,వియ్యానికైనా సమఉజ్జీ ఉండక్కర్లేదా?” మళ్ళీ అడిగేడు ఆశతో శ్రీకాంత్.
“మీ ఉద్దేశ్యంలో సమఉజ్జీ అంటే కులం, ఆస్తీ, అంతస్తూ ఇవేనా? వాటిగురించి చెప్పేను కదా? మళ్ళీ అడుగుతారెందుకు?” అంది చిరాగ్గాసౌందర్య.
“అందుకే అంటారు పిల్లల్ని కనగలంగాని వాళ్ళ రాతల్ని కనగలమా? అని. ” నిట్టూర్చేడు నిరాశతో అమ్మాయి తండ్రి.
“చూసేరా! మీరే ఒప్పుకున్నారు నా రాత మీ చేతిలో లేదని” అంది కూతురు. “మేం చెప్పింది వినకపోతే నీ ఖర్మ. అనుభవిస్తావు. తర్వాత ఏడ్చి ప్రయోజనమా లేదు” చివరిసారిగా చెప్పి తల్లీ, తండ్రీ అక్కడనుండి నిష్క్రమించేరు.
మర్నాడు సౌందర్యకు మళ్ళీ తారసపడ్డాడు ఆ విలన్ రోడ్డుమీద ” ఏయ్ స్వీటీ” అంటూ. “మళ్ళీ ఎందుకొచ్చేవ్?” భయపడుతూ అడిగింది సౌందర్య. “అదేం ప్రశ్న? జవాబు తెలిసిన ప్రశ్న. నువ్వు నన్ను లవ్ చేసేననేవరకూ ఇలా వస్తూనే ఉంటాను” అన్నాడు.
“రావద్దనే చెప్తున్నాను”
“ఏం నాలో ఏం తక్కువని?” అడిగేడు, ఆ అడ్డగాడిద అంటే అడ్డుకునే గాడిద.
“అన్నీ ఎక్కువే” అంది సౌందర్య.
“అందగాడిని కాదా?” మరో ప్రశ్నవేసేడు.
“మనిషికి కావలసింది అందం కాదు. మంచితనం, మానవత్వం”
“నువ్వు ‘ఊ’ అంటే నేనూ మంచివాడిగా మారిపోతాను. లేకపోతే మనిషిని కాను”అని వార్నింగ్ ఇస్తూ “చదువుకుని సంపాదించేవాళ్ళకన్నా నాకు చదువు అబ్బకపోయినా సరిపడా సంపద ఉంది” అన్నాడు.
“కాని సంస్కారం లేదుగా” అంది.
“అది నిన్ను చేసుకుంటే వస్తుంది” అని చెప్పేడు. ముందు తప్పుకోమని చెప్పింది సౌందర్య చివరిగా.
“ఇప్పుడు నేను తప్పుకునేది లేదు. ఆవేళంటే పోలీస్ వేన్ వచ్చింది కాబట్టి తప్పించుకున్నావు. అవునూ! నామీద పోలీస్‍స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చేవట. ఎంత ధర్యం నీకు? ఏం చూసుకుని మిడిసిపడుతున్నావ్? నీ అందం చూసుకునా? నన్ను కాదన్న నీ అందం అరక్షణంలో అదృశ్యమైపోతుంది. చూడు ఇదిగో! ఏసిడ్. దీన్నిగాని నీముఖంమీద పోస్తే ఇంక నీ ముఖం సతీష్‍గాడేకాదు ఎవడూ చూడడు. అంతెందుకు?నువ్వే చూసుకోలేవు. ఏవంటావ్?”
“ప్లీజ్! నన్నేం చెయ్యకు” బ్రతిమలాడింది సౌందర్య మరో గతిలేక. “నిన్నేం చెయ్యను. నీముఖాన్నే చేస్తాను చూడు ” అంటూ ఏసిడ్ సౌందర్య ముఖంమీద పోసి పారిపోయేడా విలన్.
బాధతో విలవిల్లాడిపోతూ ” అమ్మా” అని అరుస్తూ “హెల్ప్! హెల్ప్!” అని కేకలేస్తున్న సౌందర్యను చూసి ఆ దారినపోయేవాళ్ళు “ఏవమ్మా ఏవయింది?” అంటూ వచ్చి చూసి జరిగింది తెలుసుకుని 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో హాస్పటల్‍కి తీసుకెళ్ళేరు.*
ఈసంగతి ప్రమీలకు తెలిసి వెంటనే హాస్పటల్‍కు ఉరుకులుపరుగులమీద వచ్చి “సౌందర్యా! ఏమిటే ఈ ఘోరం?” అని అడిగింది. సౌందర్య మూలుగుతూ “చెప్పేను కదే, ఓ రౌడీవెధవ నా వెంటపడుతున్నాడని. వాడిమీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చేనని తెలిసీ, వాడ్ని కాదన్నానని ముఖంమీద ఏసిడ్ పోసేసేడే” చెప్పింది.
“ఎంత అందంగా ఉండే నీ ముఖం ఎలా అయిపోయిందే?” బాధపడుతూ అంది ప్రమీల. “ఇప్పుడనిపిస్తుంది అందంగా ఉండడమే ఓ శాపమేమోనని. నాలా ఉంటే జోలికి ఎవడూ రాడు.వెంటపడడు. ఏంటోనే తలచుకుంటే నా కడుపే తరుక్కుపోతుంది. ఇంక మీ మమ్మీ, డాడీ ఎంత బాధపడతారో నిన్నిలా చూసి. ఈ ఘాతుకాన్ని ఎలా భరిస్తారోనని భయమేస్తుంది” అంటుండగా సౌందర్య తల్లీదండ్రులు రానే వచ్చేరు. తల్లిని చూసి “మమ్మీ!” అంటూ ఏడవడం మొదలుపెట్టింది.
“అమ్మా! ఏమిటే ఈ దారుణం?” అంటూ భర్తతో “చూడండి, అమ్మాయి ఎలా అయిపోయిందో” కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది. ”డాడీ!” అంది సౌందర్య. లోపలినుండి ఉబికి వస్తున్న బాధను అణచుకుంటూ “బేబీ! నీకేం కాదమ్మా! నేనున్నాను. ఎంతఖర్చయినా ట్రీట్మెంట్ చేయిస్తాను. నువ్వు మామూలుగా అవుతావు. నా ప్రాణం పోయినాసరే నీకిలా చేసినవాడ్ని వదిలిపెట్టను. అదిగో పోలీసులు వస్తున్నారు. నువ్వేం భయపడకుండా జరిగింది జరిగినట్టు స్టేట్‍మెంట్ ఇవ్వమ్మా! తర్వాత సంగతి నేను చూసుకుంటాను” అన్నాడు శ్రీకాంత్.
*
“ఏమోయ్! అర్జంట్‍గా ఇలా తగలడు” అంటూ భార్యను పిలిచేడు విశ్వనాథం.
“మీ నోటంట ఎప్పుడూ ఆ తగలడడం అన్నమాట తప్పించి మరొకటి రాదా? ” అంటూ వచ్చింది వైదేహి.
“ఎలా వస్తుంది? సుపుత్రా, కొంప పీకరా అన్నట్టు నీ గారాలపుత్రుడు మన కొంప తగలపెడుతున్నాడు ఇప్పుడు” చెప్పేడు విశ్వనాథం.
“ఏమైందీ? ఎప్పుడూ వాడ్ని ఆడిపోసుకోవడమేనా మీ పని?”
“నా పని కాదు. వాడు చేసిన పని చూడు.”
“ఏం చేసేడు?”
“అదిగో! టీ.వీ. లో ఫ్లాష్‍న్యూస్ చూడు. వీడిని ప్రేమించలేదని పాపం ఎవరో అమ్మాయిమీద ఏసిడ్ పోసి పారిపోయేడట. పోలీసులు వాడికోసం వెదుకుతున్నారట.”
“ఆ! భగవంతుడా! ఇదెక్కడి సమస్య తెచ్చిపెట్టేడు?” కంగారుగా అంది వైదేహి.
“తోటకూర దొంగిలించి తెచ్చిననాడే తోవలో పెట్టాలి అని సామెత. ఇప్పుడేడిస్తే ఏం లాభం?”
“ఇప్పుడేం చెయ్యాలండీ? నాకు కాళ్ళూ,చేతులూ ఆడడం లేదు” భయపడుతూ అంది భార్యామణి.
“నోరు ఆడుతుంది కదా.” వెటకారంగా అన్నాడు విశ్వనాథం.
“ఇలాంటప్పుడు కూడా మీ ఎత్తిపొడుపులేంటి?”
“నేను చెప్పింది చేస్తావా?” అడిగేడు. “చెప్పండి” అంది వైదేహి. “పోలీసులకు వాడు దొరికీ, వాళ్ళు మన ఇల్లు తెలుసుకుని వచ్చి వాడి గురించి అడిగితే ఏం చెప్తావ్?”
“వాడికేం తెలియదనీ, వాడే పాపం ఎరగడనీ చెప్తాను. “ అంది.
“అప్పుడు నిన్నూ, నన్నూ కూడా తీసుకెళ్తారు పోలీస్‍స్టేషన్‍కి”
“ఎందుకూ?” అమాయకంగా అడిగింది అర్థాంగి. “ఎంక్వైరీకి” చెప్పేడు. భర్తగారు. “అమ్మో! అయితే ఏం చెప్పమంటారు?” అడిగింది.
“ మాకేం తెలియదనీ, మేమే పాపమూ ఎరగమని చెప్పు”
“మరి మీరేం చెప్తారు?” తిరిగి ప్రశ్నించింది వైదేహి.
“ఏం చెప్పాలో నేను చూసుకుంటానుగాని నువ్వు మాత్రం నేను ఎలా చెప్పమన్నానో అలా చెప్పు. పుత్రుడంటే పున్నామనరకంనుండి తప్పించేవాడంటారుగాని నీ సుపుత్రుడు మనల్ని పోలీస్‍స్టేషన్‍కి రప్పించేవాడు అయేడు. ఇప్పుడైనా తెలిసిందా? నేరం చేయనివాడికి శిక్షపడేలా చేయడం ఎంత తప్పో నేరం చేసినవాడికి శిక్ష పడకుండా తప్పించడం అంతకంటే పెద్ద తప్పు. అదిగో! కాలింగ్ బెల్ మ్రోగుతుంది. అప్పుడే పోలీసులు వచ్చేసినట్లున్నారు. నేను చెప్పింది గుర్తుందికదా? ఒకవేళ నీ సుపుత్రుడే పోలీసుల కళ్లుగప్పి వచ్చేసేడేమో చూడు. వెళ్లి తలుపు తియ్యి” అన్నాడు విశ్వనాథం.
“మీరే తియ్యండి. నాకు భయంగా ఉంది” అంది వైదేహి.
కాలేజ్ హాస్టల్‍రూమ్‍లో ఉన్న సతీష్ దగ్గరికి పరుగెత్తుకుని వచ్చి “సతీష్! ఇది విన్నావా?’అని అడిగేడు రూమ్‍మేట్ వాసు. “నువ్వు చెప్పందే?” అన్నాడు సతీష్. “అయితే నీకు ఇంకా తెలియదా?” అడిగేడు వాసు.
“ఇదెక్కడి గొడవరా, అసలు సంగతేంటో చెప్పకుండా…”
“సౌందర్యమీద ఏసిడ్ దాడి జరిగిందట” కంగారుగా చెప్పేడు వాసు.
“అవును. టీ.వీ.లో చూసేను” అన్నాడు సతీష్.
“అయితే నీకు తెలుసన్నమాట. అదేంట్రా? అంత మామూలుగా చెప్తున్నావ్?” ఆశ్చర్యపడుతూ అన్నాడు వాసు.
“లేకపోతే ఏం చెయ్యమంటావ్?”
“హాస్పటల్‍కి వెళ్లేవా?”
“లేదు దేనికీ?”ఎదురు ప్రశ్న వేసేడు హీరో.
“దేనికంటావేంట్రా? సౌందర్యను చూడడానికి” చెప్పేడు వాసు.
“చూసి ఏం చెయ్యాలి?”
“ఏం మాటల్రా అవి? సౌందర్య ఎవరూ? నీ లవ్ కాదా?” గుర్తుచేసేడు రూమ్‍మేట్.
“నేనే కాదు. సౌందర్యని లవ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అందులో ఒకడే ఇప్పుడు ఏసిడ్ పోసేడు.”
“ఒరేయ్! నువ్వేనా ఇలా మాట్లాడేది?” అసహ్యించుకుంటూ అన్నాడు వాసు.
“అవును నేనే. ఏంటంటావ్?”
“ఛ! అసలు నీలాంటివాడిని నేను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది” బాధపడుతూ అన్నాడు రూమ్‍మేట్
“అలాగయితే చెప్పుకోకు” ఉచితసలహా ఇచ్చేడు సతీష్.
“ఏమైందిరా, నీకు? సౌందర్యని లవ్ చేస్తున్నానన్నావ్?”
“అది నిన్నటివరకూ. ఇప్పుడు ఏం చూసి చెయ్యాలి?”
“ఇంతకుముందు ఏం చూసి చేసేవ్?”
“బ్యూటీ చూసి” నిస్సిగ్గుగా చెప్పేడు అసలు రూపం బయటపెడుతూ.
“అంతేనా?” అవాక్కయ్యేడు వాసు.
“లేకపోతే? చదువూ, ఆస్తీ, అంతస్తులూ చాలామందికి ఉంటాయి”
“నువ్వు నిజంగా నమ్మకద్రోహివిరా. ప్రేమిస్తున్నానని సౌందర్యని నమ్మించి తనకు ఇప్పుడు అలా అవగానే ఇలా మాట్లాడతావా?”
“మరెలా మాట్లాడాలి? నేను సౌందర్యపిపాసిని. సౌందర్యలో ఆ సౌందర్యం ఇప్పుడు పేరులోనేగాని ముఖంలో లేదు” తేల్చి చెప్పేసేడు కపటప్రియుడు.
“ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదేదో పెళ్లయేక జరిగితే ఇలాగే వదిలేస్తావా?” అడిగేడు వాసు.
“పెళ్లవలేదుకదా? అవనిదానిగురించి ఎందుకు ఆలోచించడం? టైం వేస్ట్” అన్నాడు సతీష్.
“అసలు నిన్ను అని ఏం ప్రయోజనం? తప్పంతా సౌందర్యది” అన్నాడు వాసు.
“అదేంటి?”
“అవును. మేకవన్నె పులిలాంటి నిన్ను నమ్మింది చూడు, అదీ తను చేసిన పెద్ద పొరపాటు. ఏ అమ్మాయయినా తనకు నచ్చిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే ఐసయిపోతుంది. అదే చేసింది సౌందర్య కూడా”
“అంత బాధపడి పోయేవాడివి ఆ సౌందర్యనేదో నువ్వే చేసుకోవచ్చుకదా?” తెలుసుకోవడానికన్నట్లుగా అడిగేడు హీరో.
“నేను నీలాగ తనకు ఐ లవ్ యూ చెప్పలేదు. సౌందర్య నిన్ను ప్రేమించింది కాని నన్ను కాదు” తెలియజెప్పేడు.
“తనదాకా వస్తే అందరూ ఇలాగే చెప్తారు”
“వయసులో ఉన్నప్పుడు కలిగే ప్రేమ అంటే ఆకర్షణ. ఇలాగే ఉంటుంది.”
“వయసులో ఉన్నప్పుడు కాకపోతే వయసు మళ్లేక ప్రేమిస్తార్రా ఎవరైనా?”
“అదికాదు. ప్రేమ వ్యామోహం కాకూడదు. వయసు మళ్లినా నిలిచేదే అసలైన ప్రేమ. పరిణతి చెందిన ప్రేమ” చెప్పేడు వాసు.
“మరికనేం నువ్వు వయసుమళ్లేవరకూ ప్రేమిస్తుండు. అప్పుడు అది అసలైన ప్రేమో కాదో తెలుస్తుంది” సలహా ఇచ్చేడు సహాధ్యాయి.
“నేను ఇక్కడకు వచ్చింది నీలాగ ప్రేమపాఠాలు నేర్చుకోవడానికి కాదు” చెప్పేడు వాసు.
“ఆహా! మరి దేనికో?”
“నన్ను పెంచి పెద్దచేసి చదివిస్తున్న నా తలిదండ్రుల ఆశయాల్నీ, ఆశల్నీ నేరవేర్చడానికి”
“ఓహో! పెద్ద చెప్ప వచ్చేడండీ, ఆదర్శపుత్రుడు” వెటకారంగా అన్నాడు సతీష్.
“నువ్వేమన్నా అనుకో. నేనుమాత్రం సౌందర్యను చూసి పలకరించి వస్తాను.”
“మంచిది. పనిలోపని. నాతరఫున కూడా నాలుగు మాటలు చెప్పి ఓదార్చు”
“దుర్మార్గుడా!” అంటూ బయటకు వెళ్లిపోయేడు వాసు.*
సౌందర్యకు మంచి ట్రీట్‍మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ అయేక ఇంటికి తీసుకువచ్చేరు తలిదండ్రులు. ఆరోజు మమ్మీని “భోజనంచేసేవా?” అని అడిగింది సౌందర్య. లేదని చెప్పింది సుశీల. “ఏం” అని అడిగింది కూతురు. ఆకలిగా లేదని అబద్ధం చెప్పేసింది తల్లి. “డాడీ చేసేరా?” అని అడిగింది. దానికీ మళ్ళీ “లేదు” అనే సమాధానం. “ఎంచేత?” మళ్ళీ అడిగింది కూతురు.
“నిన్ను ఇలా చూస్తుంటే మాకు భోజనాలు ఎలా సహిస్తాయమ్మా?” కారణం చెప్పింది కన్నతల్లి.
“భగవంతుడి దయవల్ల కోలుకున్నానుకదమ్మా!”
“కోలుకున్నావు సరే. పెళ్లి చేయవలసిన టైములో నీకిలా జరిగిందనే మా బాధ అంతా. అన్నీ లక్షణంగా ఉన్న అమ్మాయిలకే ఏవో వంకలు పెడుతుంటారు”
“అదా! నన్నెవరు చేసుకుంటారు అనేనా నీ బాధ? నీకా బెంగేమీ అక్కర్లేదు”
“అంటే? పెళ్లి చేసుకోవా?” అనుమానంగా అడిగింది సుశీల.
“అలా అని నేననలేదే?”
“మరి దానర్థం?”
“నన్ను చేసుకునేవాడు ఉన్నాడూ అని” ధైర్యం చెప్పింది కూతురు. “ఎవరమ్మా ఆ పుణ్యాత్ముడూ?“ ఆత్రుతగా అడిగింది తల్లి. “సతీష్ అని చెప్పేను కదమ్మా? నా క్లాస్‍మేట్. నన్ను ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు”
“ఇంతకుముందు ప్రేమించేవాడేమోగాని ఇప్పుడూ ప్రేమిస్తాడా?”
“అతను ప్రేమించేది నన్ను. నా రూపాన్ని కాదు.అతనిది అసలైన ప్రేమ.”
“అంత ప్రేమించేవాడే అయితే ఇంతవరకూ నిన్ను చూడడానికి ఎందుకు రాలేదు?” సూటిగా అడిగింది సుశీల.
“నాకిలా జరిగిన సంగతి తెలియదేమో“ సర్దిచెప్పడానికి ప్రయత్నించింది సౌందర్య.
“తెలియక పోవడమేంటి? టీ.వీ.లో చూపించేరు. పేపర్లో వేసేరు. ఇంకా తెలియదంటే ఎవరు నమ్ముతారు? ఇన్నాళ్ళయినా రాలేదంటే ఏమనుకోవాలి?” నిష్కర్షగా అడిగింది తల్లి.
“అతనలాంటివాడు కాదు మమ్మీ! ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది”
“నే చెప్పలేదూ? మరి అతను నీకు కనబడడు. చెప్పడం సులువేకానీ ఆచరించడమే కష్టం”
“నిజమే మమ్మీ. కానీ అలా చెప్పింది ఆచరించేవాళ్ళుకూడా ఉంటారు. అందులో సతీష్ ఒకడు” ఇంకా సడలని నమ్మకంతో చెప్పింది సౌందర్య. “చాల్లే! చెప్పోచ్చేవ్. కాలేజ్‍లో డిబేట్‍లలో చెప్పినట్లు చెప్పడం కాదు ప్రేమంటే” బోధపర్చింది తల్లి. అయినా, “చూద్దాం” అంది సౌందర్య. “ఇంకా చూసేదేముందీ? నాకేం నమ్మకం లేదు. నీ తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది” అనుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది సుశీల.
***
కొన్నాళ్ళ తర్వాత శ్రీకాంత్ కూతుర్ని పిలిచి “అమ్మా సౌందర్యా! చదువైపోయింది కదా. ఏం నిర్ణయించుకున్నావ్?’ అని అడిగేడు. “దేనిగురించి డాడీ?” అమాయకంగా అడిగింది సౌందర్య. “ఇంక దేని గురించి? నీ పెళ్లి గురించే” చెప్పేడు తండ్రి.
“మళ్ళీ క్రొత్తగా చెప్పేదేముంది డాడీ? చెప్పేనుకదా, సతీష్‍ని ప్రేమిస్తున్నానని”
“ఇంక ఆ ఆలోచన మానుకో. ఈ ప్రేమా, దోమా అంతా ట్రాష్. అదంతా లవ్ కాదు. లస్ట్. కామం”
“అదేంటి డాడీ, అలా అంటారు?”
“అలా అనకపోతే ఇంకేమనాలి? పాఠాలు నేర్చుకోవలసిన కాలేజ్‍లో ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నారు. సినిమాలూ, సీరియల్సూ చూసి చెడిపోతున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. వాళ్ళకింకేమీ ఆక్కర్లేదు. అప్పుడు తలిదండ్రులు గుర్తుకురారు. వాళ్ళ అభిప్రాయాలూ అక్కర్లేదు. ప్రేమమైకంలో పడిపోతారు. చదివి ఉద్దరిస్తారని తలిదండ్రులు కష్టపడి సంపాదించి డబ్బు పంపితే వాటితో సినిమాలూ, షికార్లూ, పార్టీలూ, నిరసనలూ, ధర్నాలూ, ఉద్యమాలూ. ప్రేమను తిరస్కరిస్తే ఏసిడ్ దాడులు. ఇవీ చదువుకోమని కాలేజ్‍కి పంపితే చేసే నిర్వాకాలు” అంటున్న తండ్రితో “నేనలాంటివేవీ చేయలేదే? శ్రద్ధగానే చదివేను” సంజాయిషీ ఇచ్చింది సౌందర్య.
“నేను చెప్పేది నీగురించి కాదు. ఈకాలం కుర్రకారు గురించి. నువ్వూహించుకున్న ప్రేమ గురించి. ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయాలి. జీవితం సినిమా కాదు. చదువుకోవలసిన టైములో ఈ ప్రేమపురాణాలేంటి? పిల్లలకు పెళ్లి వయసొచ్చేసరికి తలిదండ్రులెలాగూ చేస్తారు. ప్రేమించేవాళ్ళు ఎప్పుడైనా ప్రేమించవచ్చు. పెళ్లయేక మొగుడూ, పెళ్ళాలు ఒకర్నొకరు ప్రేమించుకోవచ్చు. అంతేకాని పెళ్ళికి ముందు ప్రేమలు కత్తిమీద సాములాంటివి” ఇలా సాగిపోతున్న తండ్రి వాక్ప్రవాహానికి అడ్డుగా సౌందర్య “అంటే మీ ఉద్దేశం?” అని అడిగింది.
“మీ ప్రేమే నిజమైతే ఏడీ నీ ప్రేమికుడు? ఇన్నిరోజులయింది ఇంతవరకూ ఎడ్రస్ లేదే? మనిషి పత్తా లేడు. వాడు ఫోన్ చెయ్యలేదు. నువ్వు చేస్తే దొరకడం లేదు. ప్రేక్షకలోకానికీ, పాఠకలోకానికీ అందరికీ నీ సంగతి తెలిసిందిగాని నీ ప్రియుడికింకా తెలియలేదా?” గద్దించి తండ్రి అడిగేసరికి “సారీ డాడీ! నా అంచనా తప్పయింది”అని ఒప్పేసుకుంది సౌందర్య.
“తెలిసిందికదా? మా అంచనా కరెక్ట్ అని. మేము ముందే చెప్పేం. వాడు నీ అందాన్ని ప్రేమించేడు. ఎప్పుడైతే నీ రూపమే నీకు శాపమైందో మరి వాడు నీ చాయలకు కూడా రాలేదు చూసేవా? అసలైన ప్రేమికుడైతే ఇలాగే ఉంటాడా?” బోధపర్చేడు తండ్రి. “నిజం తెలుసుకున్నాను డాడీ!ఇటుపైని మీరు ఏం చెప్తే అది వింటాను. ఏం చెయ్యమంటే అది చేస్తాను.” గీతోపదేశం పొందిన అర్జునుడిలా అంది సౌందర్య.
“మై గుడ్‍గర్ల్. నావల్లే నువ్విలా తయారయేవని మీ అమ్మ మాటిమాటికీ నన్ను తప్పుపడుతుంది. కాని ఒకటి చెప్పనా? పిల్లలు చెడిపోతే తలిదండ్రుల తప్పంటారు. మంచివాళ్ళయితే వాళ్ళ గొప్పతనం అంటారు. కాని చెడిపోవడమూ, బాగుపడడమూ అనేది వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్నిబట్టి ఉంటుంది. చెడిపోయేవాడు గారాబం చేసినా చెడిపోతాడు. క్రమశిక్షణ భరించలేకా చెడిపోతాడు. బాగుపడేవాడు గారాబాన్నీ, క్రమశిక్షణనీ తన మంచికోసం మలచుకుంటాడు” తండ్రి సద్బోధల్ని చెవులారా విన్న సౌందర్య “వెరీ నైస్ డాడీ! ప్రేమంటే ఏమిటో బాగా చెప్పేరు. టీనేజ్ ప్రేమంటే ఇదేనా?” అంది. శ్రీకాంత్ కూడా తన సందేశం ఫలించినందుకు తెగ సంబరపడిపోయేడు.
****
సౌందర్యను చూడడానికి ప్రమీల మరోసారి వచ్చింది. ”ఎలా ఉన్నావే?” అంటూ పలకరించింది. బాగానే ఉన్నానని చెప్పింది సౌందర్య. “ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావట” అడిగింది. “అవునే, డాడీ పట్టుబట్టి చేయించేరు” చెప్పింది.
“నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అంత గండంనుండి గట్టెక్కి మళ్ళీ మామూలు మనిషయ్యేవ్. ఇంతకీ ఆ సతీష్ నిన్ను చూడడానికి వచ్చేడా?”
“వాడి ఊసు ఎత్తకే. వళ్ళు మండుతుంది. ఇంత జరిగినా వాడు నన్ను చూడడానికి రాలేదు సరికదా ఫోన్ అయినా చెయ్యలేదు. నేను చేస్తే దొరకడం లేదు. అంచేత వాడి ప్రేమకు నీళ్ళోదిలేసేను”చెప్పింది సౌందర్య తన నిర్ణయం.
“మరేం చేద్దామనుకుంటున్నావ్?” అడిగింది ఆప్తమిత్రురాలు. “డాడీ ఓ సంబంధం తీసుకొచ్చేరు. ఆయన ఫ్రెండ్ అబ్బాయట. వాళ్ళు చూడడానికి వచ్చేరు. అబ్బాయికి నేను నచ్చేనట” చెప్పింది శుభవార్త. “నువ్వు నచ్చనిదెవరికే?” కాంప్లిమెంట్ ఇచ్చింది కాలేజ్ ఫ్రెండ్. “ఇంకా ముఖంమీద ఓ మచ్చ ఉండిపోయిందే” అంది సౌందర్య నిరుత్సాహంగా. “ అందమైన చందమామకి లేదా మచ్చ? అలాగే. ఇంతకీ నీకు ఆ అబ్బాయి నచ్చేడా లేదా?” అడిగింది ప్రమీల.
”ఆ! నచ్చేడు”
“ఎలా ఉంటాడు?”
“పెద్ద అందగాడేమీ కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మంచి కుటుంబం. ఆస్తిపాస్తులేం పెద్దగా లేవనుకో”చెప్పింది సౌందర్య.
“ఆస్తిపాస్తులెందుకే? మంచి మనసుండాలిగాని” మనసులో మాట చెప్పింది ఫ్రెండ్‍కి.
“అందుకే ఒప్పేసుకున్నానే”
“మంచిపని చేసేవ్. కంగ్రాట్స్! పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఏ ప్రోబ్లం వచ్చినా రెండు పార్టీల సపోర్ట్ ఉంటుంది. ఎక్కడోగాని ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్నాళ్ళో నిలవవు” అనుభవజ్ఞురాలిలా చెప్పింది ప్రమీల.
“మరి నీ సంగతేమిటే?” అడిగింది ఆప్యాయంగా సౌందర్య.
“అది చెప్దామనే వచ్చేనే. నాకూ మేచ్ కుదిరిందే” అందించింది కమ్మనైన కబురు.
“అదేంటే? అంత మెల్లిగా చెప్తున్నావ్ శుభవార్త? హార్టీ కంగ్రాట్స్ మన ఇద్దరికీ ఒకేసారి మేచ్ ఫిక్సింగ్ అన్నమాట. ఎవరే పెళ్ళికొడుకు?”ఆత్రుతగా అడిగింది ఆనందం పట్టలేక.
“నీలాగే నాదీ ఎరేంజ్డ్ మేరేజేనే. ఎం.బి.ఎ. చేసేడు. జాబ్ చేస్తున్నాడు”
“ఇకనేం? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. ఎలాగైతేనేం మనిద్దరి కథా సుఖాంతమైంది”
“మనమే కాదు, మన పేరెంట్స్ కూడా హేపీ. ప్రేమంటే ఇదేనే”
( ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 18.03.2011, 27.06.2012 తేదీలలో ప్రసారితం)
పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.