ఆంగ్లమూలం ప్రభాకర్ ధూపాటిగారు
ఆ కంపెనీకి సీఈఓగా నేను వచ్చి సుమారు ఒక నెల అయింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నన్ను సీఈఓగా నియమించిన తరవాత మొదటిరోజు ఆఫీస్‍లో వైస్ ప్రెసిడెంట్స్ అందరికీ పరిచయంచేయటానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీనుండి ముంబై వచ్చి, పరిచయకార్యక్రమాలు, ఇతర ఫార్మాలిటీస్ అన్నీ ముగిసేవరకు ఉండి వెళ్ళింది.
ఆమె నన్ను గురించి తన పరిచయవాక్యాలలో నా గతకాలపు సాఫల్యతలను, విజయాలను ప్రశంసించింది. బ్లీడింగ్‍క్యాష్‍తో సతమతమౌవుతున్న కంపెనీయొక్క దశ, దిశ బోర్డ్ అంచనాలకు తగినస్థాయిలో నేను మార్చగలుగుతాను అనే ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. కంపెనీలో ఉన్న ప్రస్తుత క్లిష్టపరిస్థితి దృష్ట్యా అంతవరకు ఉన్నవి కాక కొత్త ఆలోచనలు, విధానాల ఆవశ్యకత ఉండటంవలన అప్పటికే కంపెనీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ ఎవరికీ సీఈఓగా పదోన్నతి కల్పించలేకపోయినందుకు తన విచారాన్ని తెలిపింది. ఈ విషయంలో అందరి సహాయసహకారాలు అర్థిస్తూనే మారిన పరిస్థితులలో తమవంతు చేస్తూ కంపెనీ అభివృద్ధికి సహకరించనివాళ్ళని ఎంత అనుభవం, సర్వీసు వున్నా తొలగించక తప్పని పరిస్థితి అని స్పష్టం చేసింది.
“ఈసారి చేయబోయే మార్పులతో కంపెనీ విజయవంతం కావటం జరగాలి. అలా జరగని పక్షంలో మొత్తం కంపెనీని అమ్మేయటమో, లేదా ఉన్న స్టాక్స్ అన్నీ సొమ్ముగా మార్చేసుకోవటం, యంత్రాలన్ని తుక్కు కింద ఇచ్చేయటం, భూములు మరొక వ్యాపారసంస్థకి ధారాదత్తం చేసేయటంను మించిన మార్గం లేదు” అంది. “రాబోయేరోజుల్లో ఇక్కడ కొనసాగడానికి ఇష్టపడనివాళ్ళు వెళిపోవచ్చుకానీ ఎంత సీనియర్లు అయినా అవిధేయతను సహించే ప్రసక్తి లేదు” అని కుండబద్దలుకొట్టింది.
తరవాత నన్ను మాట్లాడమన్నారు. నేను నా అర్హతలు, అనుభవం గురించి సంక్షిప్తంగా చెప్పాను. నాకిది పదిసంవత్సరాల అమెరికా, యూరపులలో అనుభవం తరవాత ఇండియా వచ్చాక లభించిన రెండవ అవకాశం అని చెబుతూ, బోర్డ్ నాపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేసాను. కంపెనీని అభివృద్ధిపథంలో తీసుకుపోవటానికి అందరినుండి పూర్తి సహకారం అవసరము కనుక అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసాను.
తరవాత అక్కడి మార్కెటింగ్, ఉత్పత్తి, మానవవనరుల వినియోగం, అభివృద్ధిని గురించి అవగాహనకోసం కంపెనీ వైస్ ప్రెసిడెంట్స్‌తో వరుస సమావేశాలు ఏర్పాటుచేసాను. కంపెనీ సమస్యలు అర్ధం చేసుకుందికి నేను ఎక్కువభాగం శ్రోతగా వుంటూ, వారు చెప్పేది అర్ధంచేసుకోవటం, కంపెనీని ఎలా లాభాలబాట పట్టించాలి అనేది ఆలోచించటం తప్ప మరో తలపు లేదు నాకు. అంతలా వాటిలో మునిగిపోయాను.
ఇలా ఓ వారంపాటు సమావేశాలు జరిగాక కంపెనీ సీఎఫ్ఓతో సమావేశం ఏర్పాటుచేసాను. ఆమె చాలా తెలివైన, చురుకైన యువతి. ఐఐఎం అహ్మదాబాద్‍నుండి ఎంబియ్యే చేసింది. ఈమధ్యనే నియమించబడింది. ఆమెకి అకౌంట్స్‌పట్ల అంత సద్భావం లేదు. ఆవిడ మంచివక్త. తన వాక్చాతుర్యంతో ఆర్ధికసంస్థలనుండి వర్కింగ్ కాపిటల్, ఫైనాన్స్, టర్మ్ లోన్స్ సమర్ధవంతంగా రాబట్టగలిగే దిట్ట.
నాకోసం కంపెనీ అద్దెకి తీసుకున్న అపార్ట్‌మెంట్ ఇంకా తయారవకపోవటంవలన నేను కంపెనీ గెస్ట్‌హౌస్‍లో వుండేవాడిని. రాత్రిళ్ళు కంపెనీ ఆర్ధికలావాదేవీలు, ఇతర వ్యవహారాలకి సంబంధించిన ఫైల్స్ అన్నీ అక్కడికే తెప్పించుకు చూసేవాడిని.
ఇన్ని సమావేశాలు అయినా నాకు కంపెనీలో అంతలా క్యాష్‍లాస్‍కి మూలకారణం ఏమిటో అంతుపట్టలేదు. ఇక ఆరోజు సీఎఫ్ఓను, కంపెనీ మేనేజ్‍మెంట్ అకౌంటెంట్‍ను నా దగ్గరికి పంపించమన్నాను.
ఆమె, “అలాటి వారెవరూ కంపెనీకి లేరు” అన్నది. “ఆర్ధికాంశాలకు సంబంధించిన పత్రాలు, ఫైల్స్ అన్నీ తయారు చేసేది ఫైనాన్సియల్ అకౌంటెంట్ మాత్రమే” అని చెప్పింది.
నాకు వెంటనే కంపెనీ ఆర్థికనష్టాలకు కారణం ఏమిటో అర్థమైనట్టనిపించింది. కంపెనీ దశను మార్చగలననే నమ్మకం కలిగింది.
మరునాడు వైస్ ప్రెసిడెంట్స్ సమావేశంలో అందరినీ వచ్చే నెలనుండి రాబోయే సంవత్సరానికి వార్షికప్రణాళికలు తయారుచేయమన్నాను. కంపెనీ ఉత్పత్తులకు, తయారుచేసే విధానాలకు, కొనుగోళ్ళకు, అమ్మకాలకు సంబంధించిన ప్రతిఅంశంతో సవివరంగా సమాచారం ఆడిగేసరికి సీఎఫ్ఓ తెల్లమొహం వేసింది. ఫైనాన్సిల్ అకౌంటెంట్‍కి వీటన్నికీ సంబంధించిన పత్రాలు తయారుచేయమని చెప్పాను.
ఎలా చేయాలన్నది ఫైనాన్సియల్ అకౌంటెంట్‍తో చర్చిస్తూ ఉంటే నాకు మా ఊరినుండి ఫోన్ వచ్చింది. మా పొరుగున ఉన్న వ్యక్తి మాట్లాడాడు. మా అమ్మగారికి తీవ్ర అస్వస్థతట. “మిమ్మల్ని చూడానుకుంటున్నారు” అని చెప్పాడు.
నేను వెంటనే ఢిల్లీ ఆఫీస్‍కి ఫోన్ చేసి లీవ్ తీసుకున్నాను. జనరల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‍కి ఫోన్ చేసి హైద్రాబాద్‍కి ఏ ఫ్లైట్ ఉంటే దానికి టికెట్ బుక్ చేయమని చెప్పి, ఆఫీస్‍బాయ్‍ని పిలిచి గెస్ట్‌హౌస్‍కి వెళ్ళి నా బట్టలు, కావలసిన సామాన్లు సూట్‍కేస్‍లో పెట్టి తీసుకురమ్మన్నాను. ఫ్లైట్ టైం తెలుసుకుని హైద్రాబాద్‍లో ఇంటికి ఫోన్‍చేసాను.
హైద్రాబాద్‍లో నా నాలుగురూమ్‍ల అపార్ట్‌మెంట్ట్ కనిపెట్టుకు ఉండటానికి, నాకు వంట చేసిపెట్టటానికి మా స్నేహితునికి తెలిసిన ఒక బ్రాహ్మణవితంతువు, సీతమ్మగారు వుంటారు. మాఊరినుండి వచ్చిన ఒక అమ్మాయి డిగ్రీ చదువుతూ అక్కడే సర్వెంట్ క్వార్టర్స్‌లోఉంటుంది. ఆమె పాత్రలు కడగటం, బట్టలు వాషింగ్‍మెషీన్‍లో వేయటం, వాటి ఇస్త్రీలు, ఇల్లు శుభ్రం చేయటం, ఇతరత్రా పనులు చేస్తుంది.
“అమ్మా! నేను హైద్రాబాద్ వస్తున్నాను. కానీ ఇంటికి వచ్చే టైం లేదు. డ్రైవర్‍ని ఓ నాలుగు రోజులకి సరిపడా తన లగేజీతో, మెడికల్‍షాప్‍లో నాకు కావలసిన మందులు తీసుకునివచ్చి నన్ను కలవమని చెప్పండి. నాకు భోజనం పంపవద్దు. తినాలని లేదు” అని చెప్పాను సీతమ్మగారికి.
ఆమె అన్నీ విని సరేనని “నీకు అంతా మంచిగా ఉందా నాయనా!”అని అడిగింది.
“నేను మంచిగానే వున్నాను. ఊర్లో అమ్మకి బావులేదు. ఫోన్ వచ్చింది. వెళుతున్నాను”అన్నాను.
ముంబై ఎయిర్‍పోర్ట్‌కి ఆఫీస్‍నుండి నాతో వచ్చిన డ్రైవర్ నా లగేజ్‍ని మోసి కార్ట్‌మీదకూడా పెట్టాడు. అతనికి నేను టిప్ ఇవ్వబోతే మరియాదగా తిరస్కరించాడు. నేను చాలా యాంత్రికంగా చెక్ ఇన్ అయాను.
ఫ్లైట్‍లో కూడా నా మనసులో వార్షికప్రణాళిక, కంపెనీస్థితి మెరుగుపరచడానికి అమలుపరచవలసిన వ్యూహాలు.
హైద్రాబాద్ ఎయిర్‍పోర్ట్‌లో దిగేసరికి అక్కడ మా డ్రైవర్ నాకోసం ఎదురు చూస్తున్నాడు. అతను నా లగేజ్ నా కార్ టయోట ఫార్చ్యూనర్‍లో పెట్టి “మనం గ్రామానికి వెళుతున్నాంకదా, బీఎండబ్ల్యూకన్నా ఇది బావుంటుంది అని తెచ్చాను సర్!” అన్నాడు. నేను మాట్లాడకుండా తల ఊపాను. అతను పరిస్థితి అర్ధంచేసుకుని మరేమీ మాట్లాడలేదు.
కారు కదిలింది. నా మనసు మళ్లీ ఆలోచనలలోకి జారుకుంది. నేను పుట్టిన ఊరు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు గుర్తువచ్చారు. మా అమ్మగారి గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు మాధవీలత గుర్తుకు వస్తుంది. మాధవీలత ఇంజినీరింగ్‍లో నా క్లాస్‍మేట్. తమిళ అయ్యరు కుటుంబంనుండి వచ్చింది. తను అందం, తెలివితేటలు, చురుకుదనాల కలబోత. అంతకిముందు ఆమె చదువు చెన్నైలో జరిగినది. అక్కడే కళాక్షేత్రలో భరతనాట్యం నేర్చుకుని డిప్లొమా తీసుకుంది. కర్ణాటకసంగీతం చక్కగా పాడుతుంది. వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది.
మాధవీలత తండ్రి ఐఏఎస్. ఢిల్లీలో పనిచేస్తున్నాడు. తను ఇక్కడ అన్నావదినలతో ఉంటోంది. వాళ్లిద్దరూ డాక్టర్లు. సొంత నర్సింగ్‍హోమ్ నడుపుతున్నారు. నేను చాలా స్తబ్దుగా వుండే విద్యార్థిని. పేదరికం నా మొహంమీద ప్రస్ఫుటంగా కనిపించేది. పెద్దకుటుంబానికి నేనే ఆధారం. నా తండ్రి పోవటంతో ఆ భారం అంతా నాపైనే పడింది. ఇంటర్మీడియట్ అవగానే ఒక సంవత్సరం మెకానిక్‍షాప్‍లో పనిచేసాను. అక్కడ మోటారువాహనాలు, వాటి మరమ్మత్తులగురించి నేర్చుకున్నాను. గ్రహణశక్తి ఎక్కువ అవటంవలన ఎలాటి బండి రిపేర్‍కి వచ్చినా సమస్యని ఇట్టే పట్టేసి సరిచేసేసేవాడిని. నా పనితనానికి, తెలివితేటలకి, మర్యాదపూర్వక ప్రవర్తనకు షాప్ ఓనర్ ముచ్చటపడి “బేటా! నువ్వు ఉదయం, సాయంత్రం ఇక్కడ పనిచెయ్యి. మిగిలిన టైంలో కాలేజ్‍కి వెళ్ళు. ఇంజినీరింగ్ చెయ్యి. ఫీజు నేను కడతాను. నువ్వు ఈ వర్కుషాప్‍లోనే ఉండవచ్చును” అన్నాడు. నేను ఆ మాటలకి చాలా సంతోషించి కష్టపడి ఇంజినీరింగ్‍సీట్ సంపాదించి కాలేజ్‍లో చేరాను.
కాలేజ్‍లో నేను అందరికీ భిన్నంగా వుండేవాడిని. ఒకరోజు మా ఓనర్ వర్క్‌షాప్‍కి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక డాక్టర్ కార్ టైర్ మార్చాలని నన్ను , షాప్‍లో పని చేసే రాము అనే మరో అతనిని వెళ్ళమన్నాడు. నేను స్పేర్‍టైర్, టూల్స్ పట్టుకుని బాక్‍సీట్‍మీద కూర్చోని రాముతో స్కూటర్‍మీద వెళ్ళాను.
అక్కడ లతను చూసాను. ఆమెకి నా ముఖం కనబడకుండా కాప్ ముందుకు లాక్కున్నాను. ఇప్పుడు ఆమె నన్ను చూసినా నా ఆయిల్ మరకలు పట్టిన టీషర్ట్, జీన్స్ ,చేతులవల్ల గుర్తుపట్టలేదని నా నమ్మకం. టైర్ మార్చేసి, పాతటైర్ చేత్తో పట్టుకున్నాను. లత అన్నావదినలు ఫ్రంట్‍సీట్‍లో, లత బాక్‍సీట్‍లో కార్‍లో కూచున్నారు. కార్ స్టార్ట్ చేయబోతుంటే లత నాకు టిప్ ఇవ్వబోయింది. నేను ఇంగ్లీష్‍లో “ఇట్స్ ఫైన్ మేడమ్. నో నీడ్!” అని నాలుక్కరుచుకున్నాను. “అయ్యో! ఇంగ్లీష్‍లో ఎందుకు మాట్లాడాను?” అని బాధపడ్డాను.
లత నన్ను తేరిపార చూసి “అయ్యో రామా! ఆ షాప్ మీదా?” అని అడిగింది.
“కాదు! నేను అక్కడ పని చేస్తున్నాను” అనేసి అక్కడినుండి బయలుదేరిపోయాం.
రాము నేను టిప్ తీసుకోనందుకు బాధపడ్డాడు. “నా క్లాస్‍మేట్ దగ్గర టిప్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. మొహమాటంగా కూడా అనిపించింది” అన్నాను.
తరవాత క్లాస్‍లోకూడా వీలయినంతవరకూ లతను తప్పించుకు తిరిగేవాడిని. ఆమె కాలేజ్‍లో చదువేకాక అన్నిరకాల కార్యక్రమాలలో పాల్గొనేది. నాకు అలాటివాటికి టైం ఉండేది కాదు. చదువుకోవటం, నా చదువుకు ఉదారంగా సహాయపడుతున్న మా ఓనర్‍పట్ల కృతజ్ఞతతో అతని షాప్‍లో కష్టపడి పనిచేయటం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. వీలైయినంత తక్కువలో బతుకుతూ, కాస్త
పాకెట్‍మనీగా ఉంచుకుని సంపాదనంతా ఇంటికి పంపించేసేవాడిని. వర్క్‌షాప్‍లో వర్కర్స్ వండేవారు. అక్కడే భోజనం చేసేసేవాడిని. మా ఓనర్ సర్దార్జీ భార్యది చాలా దయగల మంచిమనసు. మాకు రేషన్, కూరలు ఇచ్చేది.
నాలుగవ సంవత్సరంలో నాకు లతను తప్పించుకుందికి కుదరలేదు. ప్రాజెక్ట్‌కి మేమిద్దరం ఒకే గ్రూప్‍లో ఉండటంచేత కలిసి మాటలాడుకోక తప్పేదికాదు. లత నాపట్ల చాలా సంస్కారంతో, అభిమానంతో ప్రవర్తించేది. రోజులు గడుస్తుంటే మామధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరిపట్ల ఒకరికి ఉన్న ఇష్టం ప్రేమగా పరిణామం చెందింది. నా మనసులో నాకు నా పేదరికం, ఖర్చుపెట్టలేనితనం వలన బెరుకు, చిన్నతనం పూర్తిగా పోకపోయినా మేమిద్దరం మామధ్య ఉన్న ప్రేమని పరిణితితో అర్ధం చేసుకున్నాము. ఆమె చదువులోను, అనేక సాంస్కృతికకార్యక్రమాలలోను కనబరచే ప్రతిభ నన్ను ముగ్ధుడిని చేసేది.
ఒకరోజు నేను లతతో మా ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూ ఉండగా డిగ్రీ చదువుతున్న మా చెల్లెలు వచ్చింది. నేను లతని ఆమెకు పరిచయం చేసాను. మా చెల్లి ముఖం చిట్లించి లతతో సరిగా మాట్లాడకుండా వెళిపోయింది. వారం తిరక్కుండా మా అమ్మగారు ఓరోజు కాలేజ్‍కి వచ్చేసారు. ఆమెను చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఆమె లతను కలిసి తీవ్రపదజాలంతో దూషించారు. నేను సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాను. నాకు లత మనసు తెలిసినా అప్పటినుండి నేను లతకు దూరంగా మెలగసాగాను.
కాలేజ్ తరవాత క్యాంపస్ ప్లేస్‍మెంట్స్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. ఒక స్వీట్ పేకెట్ తీసుకుని మా ఓనర్ దంపతుల దగ్గరకి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి స్వీట్స్ ఇచ్చి “ఉద్యోగం వచ్చింది” అని చెప్పాను. ఇద్దరూ పొంగి పోయారు.
నన్ను వర్కషాప్‍లోనే వుండనియ్యమని అడిగాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు, “నాది చాలా పెద్ద కుటుంబం. దానికి నేనే ఆధారం” అని నా పరిస్థితి వివరంగా చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు.
ఉద్యోగంలో చేరిన కొద్దికాలంలోనే పై అధికారుల దృష్టిలోపడ్డాను నా పనితనంవలన. వారు నన్ను అప్పుడప్పుడు యూరపు పంపుతూ ఉండేవారు. నేను చాలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ నా సంపాదనంతా మా అమ్మగారికి పంపేసేవాడిని. నా యూరోప్ ప్రయాణాలవలన వచ్చే బోనస్‍లతో మంచి అమెరికన్ యూనివర్శిటీనుండి ఎంబీఏ చేసాను. జీవితంలో ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాను.
నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళుకూడా స్థిరపడ్డారు. నాకు కంపెనీ ఇచ్చిన షేర్లు సొమ్ముగా మార్చుకుని హైద్రాబాద్‍లో అపార్ట్‌మెంటు కొనుక్కున్నాను. బాంక్ ఇచ్చిన లోన్లతో కార్లు కొనుక్కున్నాను.
“మీ ఇంటికి ఎలా వెళ్ళాలి సర్?” అనే డ్రైవర్ ప్రశ్నతో ఈ లోకంలోపడ్డాను, “అప్పుడే ఊరు చేరిపోయానా!” అనుకుంటూ.
ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మేముండే మా పూర్వీకుల ఇల్లు పూర్తిగా శిథిలమైనస్థితిలో ఉంది. అక్కడ వసారాలో మా అమ్మగారు ఓ కుక్కిమంచంమీద లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకుని వున్నారు. నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరూ కనబడలేదు. నన్ను చూడగానే ఆవిడ లేని శక్తి కూడదీసుకుని లేచి బావురుమంటూ ఏడిచారు. ఆ ఏడుపులోనే మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు డబ్బు తీసుకుందికి, లేదా వేరే ఏదయినా అవసరం అయితేనే వస్తారు. లేకపోతే ఎవరూ రారని చెబుతూ…
“నీ సంపాదనకోసం నేను నీ జీవితం నాశనంచేసాను బిడ్డా! ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుని నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేస్తావేమోనని భయపడ్డాను. బంగారంలాంటి అమ్మాయిని అనరాని మాటలు ఆడాను. నీకు నలభైయేళ్లు వచ్చినా పెళ్ళికాకుండా చేసానురా! నే చేసిన పాపానికి నన్ను ఆ దేముడుకూడా క్షమించడు” అంటూ ఆమె ఆగకుండా ఏడుస్తుంటే…
నేను మాట రాని మౌనాన్ని అయి మ్రాన్పడిపోయాను. నా కంపెనీలో సమస్యకి పరిష్కారం ఎక్కడ వెతకాలో చురుక్కుమనేలా అర్థమవటం ఆ వెంటనే జరిగింది.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.