“అలాటపుడు ఇద్దరూ రిజిస్టర్డ్ మేరేజ్ చేసేసుకోవలసింది మా ఎవరికీ చెప్పకుండా. ఎవరి మాటా ఏ కొంచెం వినలేనప్పుడు మీకు తోచినట్లు మీరు చేసుకోక మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగావు?” సహనం కోల్పోయింది కవిత తల్లి.
కవిత, “నేను అలాగే అన్నాను. రామ్ మా అమ్మకి చెప్పకుండా పెళ్ళి చేసుకోను అన్నాడు. ఆవిడ ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని దుంపతెంచుతోంది” అత్తగారిపట్ల తిరస్కారభావంతో అంది.
“హుఁ! నాన్న మాటతీరు పుణికి పుచ్చుకున్నావు. ఇంత పిసరు మాటలో, చేతలో సున్నితత్వం లేని ఆయనగారు, మీ నాయనమ్మ అతిగారం చేసి నిన్నిలా తయారుచేసారు. ఆరోజుల్లో కాబట్టి, నా తరపున వాళ్ళని అడిగేవారు ఎవరూ లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి. ఉన్నన్నినాళ్ళు ఆయన నా నోరు ఎత్తనీకుండా చక్రం తిప్పేరు. అదే బావుంది అనుకుని నువ్వు ఆ మార్గం పడితే దెబ్బతింటావు” అన్న సీత మాటలకి…
“తల్లీ! అక్కడ వాళ్ళు దొబ్బేరు. ఏదో ఇంటికి వచ్చాను అంటే కాస్త సుఖంగా ఉండనీకుండా నువ్వు బాదేస్తున్నావు. కాసేపు ప్రశాంతంగా వుండనీ. మళ్ళీ రేపు పూజలు అంటూ మీరంతా నా ప్రాణాలు తోడేస్తారు” కవిత చిరాగ్గా అంది.
“మేమా?!! బాదేస్తున్నామా!! ఆ మాట అనటానికి నీకు నోరు ఎలా వచ్చింది? పెళ్ళి అనుకున్న దగ్గరినుండి నువు పెడుతున్న అల్లరిపట్ల నీకు కనీసస్పృహ ఉందా అసలు? ఆరునెలల పరిచయం లేదు, అప్పుడే అతనితో పెళ్ళి అన్నావు. వాళ్ళు సంప్రదాయం ప్రకారం నడిచే మనుషులు. నీకు వారి విధానాలు పడవు, నిదానించు అంటే ససేమిరా అన్నావు. పోనీ అలాగే కానీ అన్నాను. ఆ పిల్లాడు ఒక్కడే కొడుకు. పుట్టకుండానే తండ్రి పోతే అన్నీ తానే అయి అవీ, యివీ పోసి పెంచి, ప్రయోజకుడిని చేసింది ఆ తల్లి. నీ వాలకం చూసి కాస్త భయపడినా కొడుకు మనసు కాదనలేక సరే అంది. కాకపోతే అతని పెళ్ళి ఒక్కటీ తన చేతులమీద చేయాలని ఆవిడ ముచ్చట పడింది. అదికూడా సహించలేక నువు అతనికి పెళ్ళి కాకుండానే అమ్మకూచి అని ముద్ర వేసేసావు. తెలిసీ తెలియకుండా అలా తీర్పులిచ్చేయకు అంటే నామీదా ఎగిరావు. సరే, నాలుగురోజులు అతనితో కలిసి ఉన్నాకా నువ్వే తెలుసుకుంటావులే అని ఊరుకున్నాను. ఇక పెళ్ళిలో అంతా నీ ఇష్టమే. ఎవరి మాటా లక్ష్యపెట్టలేదు. ఎదురుకోలు సన్నాహంకి పట్టుచీర కట్టుకోమంటే నాకు చీర అంటే చిరాకు అని పంజాబీడ్రెస్‍లో వస్తానని నానా యాగీ చేసావు. పెళ్ళికూతురు చేయటానికి కుసుమత్త తెచ్చిన పట్టుచీర అప్పుడు ఓసారి అతిబలవంతంమీద కట్టి కాసేపయినా ఉంచుకోకుండా విప్పేసి ఆ మెటీరియల్ నీవంటికి చిరచిరగా ఉంది అంటూ ఆవిడముందే ఆ చీర నామీదకి విసిరేసావు. కల్యాణంబొట్టు వద్దని, పసుపు పారాణి పెట్టవద్దని, గౌరీపూజకూడా పంజాబీడ్రెస్‍లో చేస్తానని, బుట్టలో కూచోనని, జీలకర్ర బెల్లం తలమీద ఏమిటి చిరాగ్గా అని ఎడాపెడా చిత్తం వచ్చిన వ్యాఖ్యలు చేస్తూ అత్త మాటలు ఖండిస్తుంటే ఆవిడ చాలా నొచ్చుకుని-
గొప్పగా పెంచారు వదినా! బొత్తిగా మంచీ చెడూ లేని తెంపరితనం. ఇంత పెడసరితనం మా ఇంటా, వంటా లేదు. దీనికెక్కడినుండి వచ్చిందో మరి! బాగా గారంచేసి చెడగొట్టారు. మీరేమయినా అనుకోండి, ఈ పిల్లది యీ తీరయితే జెల్లలు తినటం ఖాయం. అయినా నాకెందుకు? రెండ్రోజులు ఉండి పోయేదాన్ని-
అని నిష్ఠూరాలాడింది. ఎప్పటిలా కార్యం సజావుగా జరగటం ముఖ్యం అనుకున్నానుకాబట్టి నేను నోరిప్పలేదు. ఇలా అడుగడుగునా అసహనం, విసుగు, తలబిరుసుతనం చూపిస్తూన్న నువ్వు కన్యాదానం అనేసరికి మరీ రెచ్చిపోయి నేనేమయినా వస్తువునా, దానం ఇవ్వటానికి అని చేసిన రభసకి నలుగురిలో తల ఎత్తుకోలేకపోయాను. ఎదురుగా ఏమైనా అంటే తన మర్యాద నిలబడదని గ్రహించిన మీ కుసుమత్త నీవెనక నిన్నూ, నన్నూ ఏకి పారేసి-
నయం మా అమ్మ మాట విని దీన్ని నా కోడలు చేసుకున్నాను కాదు. బతికిపోయాను దేముడి దయవలన – అంది.
ఇప్పుడే అంతా అటూయిటూ వెళ్లారు, మనిద్దరమే ఉన్నాంకాబట్టి చెబుతున్నా కాస్త విను” అంది సీత కాస్త కోపంగానూ, అనునయంగానూ.
“అబ్బా! ఏమిటి మమ్మీ! నా ప్రాణాలు తోడేస్తున్నావు విను విను అంటూ.ఈ వెధవసుత్తి భరించలేకపోతున్నాను” అంటూ చయ్యన లేచిన కవితను చూసి సహనానికి ప్రతిరూపం అయిన సీతకి కోపం కట్టలుతెంచుకుంది.
“నోర్ముయ్! నాది సుత్తా? నీది వీణానాదం అనుకుంటున్నవా మాకు? నిజానికి నీ తలతిక్క వ్యవహారం భరించలేక బాధపడుతున్నది నేనూ, రామ్. అయినా నోరు మూసుకుని ఉన్నామంటే నువు చేస్తున్నది అంతా మాకు నచ్చిపోతోందని, లేదా అద్భుతంగా ఉంది అని కాదు. అసలు నీ ధోరణి నీదే కానీ నువ్వు ఏ కొంచెం మాబాధ అర్ధం చేసుకోవడం లేదు. ఈ అహంకారం, తొందరపాటు, తలబిరుసుతనం, మాటసరళి మీ నాన్నకి చెల్లింది అంటే నేను నోరు ఎత్తకుండా ఇల్లు చక్కబెట్టుకున్నాను కాబట్టి. నీలా అయినదానికీ, కానిదానికీ చిందులు తొక్కితే మనిల్లూ, నీ బతుకూ ఎప్పుడో తుప్పలు పట్టేసి ఉండేవి. బొత్తిగా ఇంగితం లేకుండా వదరుతున్నావు. కాస్త కళ్ళు, కాళ్ళు నేలమీద నిలపడం నేర్చుకో” అని మందలించింది.
“అబ్బా! ఇప్పుడు నేనేమంత నేరాలూ ఘోరాలూ చేశానని నామీద అంతలా విరుచుకుపడుతున్నావు” ఎంతో అసహనం, తిరస్కారం ధ్వనిస్తూ అంది కవిత.
“హుం! నువ్వేమి చేస్తున్నావనే స్పృహ నీకుంటే నాకిన్ని తిప్పలెందుకూ! అయినా ఆ పెళ్లి పందిట్లోనే-
నాకివన్నీ నచ్చవు అని నీకు ముందే చెప్పాను రామ్, ఏమిటి ఇప్పుడు ఈ న్యూసెన్స్
-అని అతనిని కూడా నిందించటం తప్పనిపించలేదా? కాస్త తమాయించాలని తోచలేదే. అతను బాధపడతాడు. నలుగురిలో అవమానించబడతాడు అని కనీసం నీకు తట్టలేదే. నువ్వన్నదానికి అతను బాధపడి తరవాత నాతో-
రెండురోజులు సర్దుకోలేదా ఆంటీ నాకోసం? తన ప్రవర్తనకు అమ్మ మనసు చిన్నబుచ్చుకుంది. అయితే అమ్మ ఏదీ ఎక్కువసేపు మనసులో ఉంచుకోదు. నా సుఖసంతోషాలకోసం దేన్నైనా భరిస్తుంది. కాకపోతే ఈ పోట్లగిత్తతో ఎలా వేగుతావో అని భయం వేస్తోంది రా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది
-అన్నాడు.
ఏమనాలో తెలియక-
మెల్లిగా తెలుసుకుంటుంది లే బాబూ!
-అన్నా ను. కానీ నువ్వు ఎప్పటికైనా అర్ధం చేసుకుని నీ ప్రవర్తన సరిదిద్దుకుంటావో, లేక నీ మూర్ఖత్వంతో మరిన్ని సమస్యలు సృష్టించుకుంటావో అనే పక్కబెదురుతో అనుక్షణం నలిగి చస్తున్నాను. అయినా ఎందుకైనా మంచిది అని నావైపునుండి నేను మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి-
ప్రధమకోపం కానీ మా అమ్మాయి మనసు మంచిది. ఏమీ అనుకోకండి. పిల్లని కడుపులో పెట్టుకోండి
-అని చేతులు జోడించి క్షమించమంటే మీ అత్తగారు పెద్దమనసుతో-
పరవాలేదండీ. పిల్లా, పిల్లాడు కోరుకున్నారు. మనం చేస్తున్నాం. వాళ్ళు సుఖంగా ఉంటే అదే చాలు. ఇవన్నీ ఎంత? ఏదో మనకి సంప్రదాయం, ముచ్చటకోసం. వాళ్ళకి ఫోటోలు, వీడియోలకోసం. అంతే తప్పిస్తే నిజానికి ఇద్దరు మనుషులు కలిసి అన్యోన్యంగా బతకడానికి ఇంత హంగామా కావాలా! అయినా ఈ రెండురోజుల ముచ్చటా తీరిపోతే వాళ్ళ ఉద్యోగాలు అంటూ ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోయేవాళ్ళే. మన దగ్గర ఉంటారా ఏమన్నానా?
-అని పరిస్థితి తేలికపరిచింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఆవిడ అవగాహనకు, విశాలహృదాయానికి, సర్దుబాటుతత్వానికి శతకోటి దండాలు పెట్టుకున్నాను మనసులోనే. ఇప్పుడిక రేపు మీ అత్తవారింట్లో సత్యనారాయణవ్రతం, కామేశ్వరి కొలువు ఉన్నాయి. మనం వెళ్ళాలి. కుసుమత్త, మామయ్య కూడా వస్తారు. అత్తయ్య ముత్తైదువ కాబట్టి అక్కడ అన్నీ ఆవిడ చేస్తుంది. కుసుమత్తకి కోపం తెప్పించకు అక్కడ. పైగా అది మీ అత్తవారిల్లు. నువు తొలిసారి అక్కడకి వెళుతున్నావు. కాస్త నిదానించి కుసుమత్త, మీ అత్తగారు చెప్పినట్లు విని నా పరువు, నీ పరువు కాపాడు. మూడ్రోజుల భాగవతం అది ఆ తరవాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఒకటిమాత్రం చెబుతున్నాను. ఎదుటి వారి మనసు, కష్టం ఏ మాత్రం గ్రహించకుండా నాకు నచ్చిందే మార్గం, నాకు తెలిసిందే వేదం అనే తీరు మంచిది కాదు. పెళ్ళితో వ్యక్తికి కేవలం జీవితభాగస్వామితోమాత్రమే కాక అతని కుటుంబంతో కూడా సంబంధం ఏర్పడుతుంది. వారిపట్ల కూడా ఆదరాభిమానాలతో, గౌరవంతో, బాధ్యతతో వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉంది అని జంటలు గుర్తించటం, తనుగుణంగా ప్రవర్తించటం నేర్చుకొని తీరాలి. లేకపోతే వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడిక ఇంతకంటే నేనేమీ చెప్పను. సమస్యలు వస్తే ఇక పై నేను నీకు ఏమీ చెయ్యను”
కఠినంగా అనేసి సమాధానంకోసం కూడా చూడకుండా విసురుగా వెళ్ళిపోతున్న తల్లితో…
“నాకు నచ్చనివి చెయ్యమని ఎందుకు హింసిస్తారు? నా స్వేచ్ఛ నాకుంచరు ఎందుకూ !!”అని దాదాపుగా అరిచినట్లు అడిగింది కవిత.
చర్రున వెనక్కి తిరిగి తాను కూడా అదే స్థాయిలో ” స్వేచ్ఛ అంటే కట్లు తెంచుకు కదంతొక్కటమో, చిత్తం వచ్చినట్లు చిందులేయటమో కాదు. అది చాలా బాధ్యతతో, విచక్షణతో కూడిన వ్యవహారం. అయినా నీ స్వేచ్ఛ నీకు కావాలని అనుకుంటే ఎవరితో సంబంధబాంధవ్యాలు పెట్టుకోకుండా ఒంటరిగా ఉండు. ఎందుకంటే ప్రతిబంధంలో ఎంతో కొంత ఇచ్చిపుచ్చుకోవటం, సర్దుబాటు, దిద్దుబాటు అవసరం ఉంటుంది. నువు నీ స్వేచ్ఛ అంటూ నీకు తోచినట్లు ఉండాలనే నిర్ణయం తీసుకుంటే రామ్ తన ఇష్టప్రకారం తన తల్లి మనసు కష్టపెట్టకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు. అలా చేసే స్వేచ్ఛ అతనికి ఉంది. కాదంటానికి నువ్వు ఎవరు? సరే అది నీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అతనితో పెళ్ళికి ఒప్పుకోకూడదు. అక్కడ అలాగే అని పెళ్లికి ఒప్పుకుని కనీసం ఆ పెళ్ళి రెండురోజులు కూడా అతనికి సహకరించలేకపోయావు. దానివలన నువు బాధపడి, అతనిని, అతని తల్లిని బాధపెట్టావు. అలా చేసే హక్కు, అతని నిర్ణయాన్ని విమర్శించే హక్కు నీకెవడిచ్చాడు? ఆమాట అతను అక్కడే అడిగి రచ్చచేస్తే నీ పరిస్థితి ఏమిటి? ఆ తల్లీ, కొడుకు సంస్కారులు, సహృదయులు కాబట్టి సంయమనం పాటించారు. వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే దెబ్బతింటావు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. అతనికి ఏ కొంచెం సహకరించలేను అని నువ్వు అనుకుంటే ఆ మాట ఫోన్ చేసి అతనికి ఇప్పుడే చెప్పేయ్. ఆ సత్యనారాయణ వ్రతం, కామాక్షి కొలువు కూడా వద్దు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు. రెండ్రోజులు బాధపడ్డా వాళ్లే మరిచిపోయి మరో మార్గం చూసుకుంటారు. అక్కడికి వెళ్ళి నీ అహంకారం, మూర్ఖత్వం, సర్దుబాటులేనితనంతో వాళ్ళ బతుకులు నరకం చెయ్యకు. నీ నిర్ణయాలకు పూర్తిగా నువ్వే బాధ్యత వహించు. ఫలితాలు నువ్వే అనుభవించు. నీ విషయాల్లో ఇక పై నేను కూడా జోక్యం చేసుకోను” అని తెగేసి చెప్పి సీత అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఎప్పుడూ తల్లిలో అంత కాఠిన్యత చూడని కవిత ఆశ్చర్యంతో, ఎదో తెలియని భయంతో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
ఫ్రెండ్స్‌ని పంపించి వచ్చిన రామ్, అలా నిశ్శబ్దంగా ఎటో చూస్తూ కూర్చున్న కవితను భుజంపై తట్టి…
“ఏమిటాలోచిస్తున్నావ్?” అని అడిగితే…
ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి కాస్త తడబడుతూ…
“ఉహూఁ ఏమి లేదు. రేపు వ్రతం, పూజ ఉన్నాయికదా. వెళ్ళటానికి ఏమి తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను” అంది.
“ఏమి తెచ్చినా, తేకపోయినా పరవాలేదుకానీ అందరిముందూ టెంపర్ లూజ్ చేసుకోకు ప్లీజ్! చూసేవాళ్ళకి బావుండదు. ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ” అన్న రామ్ మాటలకి మౌనంగా అవునన్నట్లు తలాడించింది కవిత.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.