“మేమ్ ! మీకోసం విమలమ్మగారొచ్చారు” అని చెప్పింది నర్సు .
“అలాగే ,పిలువు”, అంది డా.హేమలత.
“కూర్చో విమలా,బాగున్నావా?ఈ మధ్య నీగురించి వింటుంటే చాలా సంతోషంగా ఉందనుకో, కొంచెం ఒళ్ళు చేసావు” అంటూ ఆప్యాయంగా పలుకరించింది.
కాస్త నవ్వింది విమల,” కొత్తబిల్డింగ్‍లోకి ఆఫీసు మారుస్తున్నాం లతమ్మా! మీరు, డాక్టర్‍గారు ఓపెనింగ్ చేయాలి” అంది.
“రాజా ఫైనాన్స్” …ఆహ్వానం చూసి,”తప్పకుండా వస్తాం. నీ పేరు పెట్టకపోయావా?” అంది లత.
“ఎంతైనా కొడుకు గదమ్మా” అని, సెలవు తీసుకుంది విమల. తలుపు తీయగానే, ఆమెకు ముందొకరు, వెనుకొకరు కుర్రాళ్ళు తోడుగా నడుస్తున్నారు.
హేమలత గతం నెమరు వేసుకుంటూ గదిలో కూర్చుంది. విమల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. అవన్నీ తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో!
*****************************
కాకినాడ దగ్గర నవర విమల సొంతూరు. మేనమామనిచ్చి పెళ్లి చేసారు. మొగుడు రంగడు. నిత్యం తాగుడు, పేకాటతో నరకం చూపించేవాడు. తొలిచూలు పురుడయ్యాక ,దిగబెట్టడానికి వచ్చిన విమల తల్లితో అక్కని కూడా చూడకుండా సారె పెట్టలేదని రంగడు వాదులాడాడు. విమలను చితకబాది, కాలనీలో వనమాలచ్మి గుడిదాకా జుట్టు పట్టుకు లాక్కెళ్లి చేసిన గోల ఎప్పటికీ మర్చిపోయేది కాదు. అయినా ఒక్కరూ అడ్డుపడలేదు. అందుకే ఆ పేట మనుషులంటే విమలకు విరక్తి కలిగింది.
అంతే! విమల అందర్నీ ఒదిలేసి గల్ఫ్ ఉద్యోగానికి వెళ్లింది. అప్పుడు తనఖా పెట్టిన చెవుల దుద్దులు విమల మొదటి అప్పు. ఆ తర్వాత కూడా అడపాదడపా అప్పు చేయక తప్పలేదు. నోట్ల వాసన ఆడదానికి సంబంధించినా అవసరాలు ఆగుతాయా! ఇంకా పెరుగుతాయి. విమల దూరంగా ఉండడం చూసి, చెల్లి పెళ్లి, తమ్ముడి ఉద్యోగానికి లంచం ఇలా ఏదో ఒక ఖర్చే.
విమల, డా.హేమలత దుబాయ్‍లో కలిసారు. ఒకరోజు హేమలత షాపింగ్ మాల్‍లో హఠాత్తుగా కళ్లుతిరిగిపడిపోతే , విమల చటుక్కున దగ్గరకొచ్చి, లేవనెత్తి, ఉపచారాలు చేసింది. తర్వాత అంతస్తులు వాళ్ళ పలకరింపులకి అడ్డు రాలేదు.
విమల ఒక సేఠ్ ఇంట్లో పని చేసేది. గదులు,వంట బల్లలు శుభ్రం చేసే పనికి కాకినాడ నుంచి వచ్చిందట. నమ్మకంగా, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడంతో వాళ్ళు విమలను బేకరీ పనిలోకి మార్చారు. చాక్లెట్లు ,క్రీం బిస్కెట్లు, అంజూర్, ఖర్జూరంతో స్వీట్లు, ఇలా ఎన్నెన్నో తయారీ నేర్చుకుంది. రెండునెల్లకోసారి బయటికి పంపేవారు ఓనర్లు. అలా బయటకు వచ్చినపుడే లత తారసపడింది.
హేమలత భర్త డాక్టర్. అక్కడ కాంట్రాక్టుమీద వచ్చారు. లత అప్పటికి ఎం బి బి ఎస్ పాసైంది. తర్వాత హేమలత ఇండియా వచ్చేయడం, పై చదువు,భర్త తో కాకినాడలోనే ప్రాక్టీస్ పెట్టడం జరిగాయి. ఎప్పుడు సొంత ఊరొచ్చినా విమల లతను కలిసేందుకు వచ్చేది.
గతేడాది ,” లతమ్మా! ఈ ఒక్కసారికి తప్పదు “అంటూ ఏవో స్టాంపు కాగితాలు పెట్టింది విమల .
“ఏంటిది విమలా? ఏకంగా దస్తావేజులు తెచ్చేసేవు”,అన్నది ఆదుర్దాగా హేమలత.
“ఔనమ్మా! ఇంటివి. ఓ రెండు లక్షలు అప్పు కావాలి”,అంది విమల.
“ఉన్న ఒక్క నీడ , నీ పదేళ్ల సంపాదన ! ఎందుకిలా ? కాయకష్టం చేసి, డబ్బు తెచ్చి, కాస్త బంగారం కొంటావ్. ఏదో ఒక పనికి , తాకట్టు పెడతావు. ఈమధ్యే సైట్‍మీద అప్పు తీర్చలేక అమ్మేసావు. ఇపుడు ఇల్లు కూడానా? అసలే వెంకటనగర్, మంచి ఏరియా. ఆలోచించు. నలభై దాటిన వయసులో అప్పు చేసి, పెద్ద పెట్టుబడులు పెట్టినా మంచిది కాదు ” అంటూ ఇంకేం వినదల్చుకోనట్టు లత లేచింది. “అసలే రెండోకాన్పు తల్లి నొప్పుల్లో ఉంది. మరి నేను వెళ్తాను”లత అన్నది.
విమల హృదయం తేలికైంది, కళ్ళు విచ్చుకున్నాయి. ఒక్క లతమ్మను మాత్రం ఇచ్చింది జీవితం అనుకుంది. నా బాగు కోరుకునేవారెవరూ లేరింక, అనుకుంటూ ఇంటి దారి పట్టింది. ” రాజాకి నచ్చచెప్పాలి. ఇల్లు పోగొట్టుకోకూడదు” కాస్త ఘర్షణ పడ్డా సర్ది చెప్పి, దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది విమల.
ఇలాగే ఒకసారి విమల తనతోపాటు పనిచేసే మరోమనిషి నాన్న గుండె ఆపరేషన్ ఖర్చుకు సొమ్ము పంపాల్సొచ్చి అప్పడిగింది . “విమలా! సొమ్ము గడించేవాళ్ళకే కష్టం తెలుస్తుంది? తేరగా బేంకులో వేస్తే అందరూ వాడుకుంటారు. నువ్విలా అప్పులు చేయడం అలవాటు చేసుకుంటే కష్టం” అంది.
“అహ ! అప్పు కాదులే తాకట్టు!”అంది విమల.
“తేడా ఏమిటి?” అందామె.
“వస్తువుమీద ఇష్టానికి తొందరగా అప్పు తీరుస్తామని తాకట్టు పెడతాను” అంటూ, తాను ఇష్టపడి కొనుక్కున్న కొత్త చైను ఆ అమ్మాయి చేతిలో పెట్టి, డబ్బు తీసుకుంది విమల. బేంకుద్వారా తమ్ముడికి పంపింది. అప్పటికే గాజుల జత ఒకటి, అలనాటి నాలి తాడు తాకట్టులోనే ఉన్నాయి.
తాకట్టును అప్పు కాదనుకోవడం భ్రమేనేమో! అప్పొక దాస్యం. అదో సుడిగుండం. ఏవో ఆలోచిస్తూ పడుకుంది విమల.
******
విమల గల్ఫ్‌కి వచ్చేటప్పుడు కొడుకు రాజాను ,చెల్లి దగ్గర ఉంచింది. రాజా పదో తరగతయ్యాక జట్లు కట్టడం మొదలెట్టాడు.పని చేస్తున్నానంటాడు.ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు.పంపిన డబ్బులు తనకే డిపాజిట్ చేయించుకోవడం మరిగాడు. విమల తల్లి, చెల్లి ముందు కొన్నాళ్ళు వాడ్ని మందలించినా, ఆపై వాడినేం చేయలేకపోయారు. మిద్దెమీద గదిలోకి భోజనం పంపిస్తుంటారు. విమల వచ్చినప్పుడు మాత్రం అంతా కలిసున్నట్టు నటన. ఆ రెండు నెలలు అందరూ ఆనందంగా ఉన్నట్టు రంగం సిద్ధం చేసేవారు.
కొన్నాళ్ళకి , రాజా ఇక చదవలేనని తెగేసి చెప్పాడు. విమలకి నచ్చచెప్పి, సైట్‍మీద బ్యాంకులోన్ తీయించి పేటలోనే పచారీకొట్టు పెట్టాడు. ఇంతట్లో ఏదో ఎలక్షన్ వచ్చింది .ఈ రాజాలాంటి కుర్రాళ్ళు లోకల్ లీడర్ల జేబుల్లోకి చేరిపోతారు. వాళ్ళకి జెండాలు కట్టడం,ఫ్లెక్సీలు పెట్టడమే పననుకుంటే పొరపాటే. ఓటుకోసం డబ్బు , వస్తువులు వగైరా పంచక తప్పదు. సిగరెట్టు, తాగుడుకు అలవాటు పడతారు. అన్నిటికన్నా పెద్ద వ్యసనం బద్ధకం. రెండు వర్గాల మధ్య గొడవల్లో ఒకసారి రాజా అరెస్టై బైటికొచ్చాడు కూడాను.
చూచాయగా రాజా వైఖరి విమలకీ తెలిసింది. కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ వృధా అయిపోయాయని విమల దిగులు. వాడికోసం ఇల్లు తాకట్టు పెడతానంటేనే లత వద్దన్నది. మరో ఏడాదికి విమల ఇండియా వచ్చింది. డా.హేమలతను కలిసింది. కాసేపు మాట్లాడుకున్నాక విమల కూర్చున్నదల్లా వెనక్కు తిరిగింది. నెమ్మదిగా చీర చెంగు పక్కకి తీసి, ” ఇలా చూడండమ్మా !” అంది . వీపు మీద నల్లగా జెర్రెగొడ్డులా మచ్చలు.
“అయ్యో ఏమైంది, విమలా “, అంటూ చేయి పెట్టి తడిమింది లత. చీర సర్దుకుని, తిరిగి కూర్చుని చెప్పింది విమల. “మేం పని చేస్తున్న బేకరీలో ఏదో కల్తీ చేశారట, రైడ్ అయింది. పిండి కలిపేచోట ఉన్నవాళ్ళం మమ్మల్ని నలుగురిని పట్టుకుపోయి జైల్లో వేశారు. మా యజమాని కాస్తోకూస్తో దయగలవాడై మమ్మల్ని విడుదల చేయించాడమ్మా”.
“అదేంటి?మీ ఓనర్ నేం చేయరా?”
“ఏం చేస్తారమ్మా!వాళ్ళు తప్పించుకుని, మమ్మల్ని ఇరికించేందుకే, పనిలో పెట్టుకుంటారు. ఇంకా నయం, మా ఓనర్ మంచివారు. మేం కాళ్లావేళ్లా పడి, నెమ్మదిగా మా వీసా, పాస్‍పోర్ట్ వాళ్ల దగ్గర అడుక్కుని వచ్చాం” అంది విమల.
“అదేంటి? మీ వీసా, పాస్ పోర్టు మీ దగ్గర ఉండవా?”
“ఉండవమ్మా. వెళ్ళిన మొదటిరోజే ఆ రెండూ యజమాని దగ్గర ఇవ్వాలి. మనం రావాలంటే ఓనరు దయే ఉండాలి ” లత మందులు రాసిచ్చింది.
“లతమ్మా! నేనిక దుబాయ్ పోను. నిన్న రాత్రి రాజాను గట్టిగా దులిపేశాను. వ్యాపారం దివాలా తీసింది. కొత్త వ్యాపారం పెట్టడానికి ఒప్పుకుంటే తప్ప నాతో కలిసి రానన్నాడు. పేగు తీపి కదమ్మా! అందుకనే వాడిచేత బేకరీ ఏదైనా పెట్టిస్తాను. ఆ చాక్లెట్లు, బిస్కెట్ల విద్య చేతిలో ఉంది కదా! ఇల్లు తాకట్టు పెట్టి, కొంచెం దూరంగా రాయుడుపాలెం దగ్గర సైట్ చూశాడట, అక్కడ వ్యాపారం పెడతాం” అన్నది విమల. ఆఖరి యుద్ధం చేయడానికి వెళ్ళే సైనికుడిలా కనబడింది విమల.
“అసలే ముప్పొద్దులా కొడుకు దగ్గరే ఉంటానంటున్నావు. తాగితే వాడు మనిషి కాదు. ఏం చేస్తాడో ఏమో? జాగ్రత్త” అన్నది హేమలత.
ఇది జరిగిన కొన్నాళ్ళకి విమల గురించి కబురు వచ్చింది. హుటాహుటిన లత,ఆమె భర్త వెళ్ళారు. ఎ.డి.బి.రోడ్ మలుపు తిరిగి, ముందుకెళ్ళారు. ఖాళీ స్థలం. ఒక షెడ్డు. టేబుల్స్ సర్దేసి, కుర్చీలన్నీ పైకెక్కించారు. ఖాళీ ప్లాస్టిక్‍ట్రేలు నీలం, ఎరుపు రంగుల్లో గుట్టగా ఉన్నాయి. మంచినీళ్ళ బాటిల్స్ ఒక పక్క. కోడిగుడ్ల క్రేటర్స్ మరోపక్క. అక్కడక్కడా, వేస్ట్ బేస్కెట్లు పెంగ్విన్ ఆకారంలో నిల్చున్నాయి. భయంకరమైన నిశ్శబ్దం.
పెద్ద ఫ్లెక్సీ . రాజాగాడు నవ్వుతూ బైక్‍ని ఆనుకొని ఉన్న ఫోటో. నిలువెత్తున ఉందేమో, వాడే నిలుచున్నాడా! అన్నట్టుంది.
లతను చూసి మనుషులు పక్కకు జరిగారు. లోపల గదిలో,విమల కూర్చునుంది. తలెత్తి చూసి, ఘొల్లుమని ఏడ్చింది.
లత, విమల భుజంమీద చేయివేసి ‘ఏమైంది?ఎలా జరిగింది?” అంటూ రుధ్ధ కంఠంతో అడిగింది. విమల చెల్లి కాబోలు,” ఈమధ్య రాజా బాగా తాగుతున్నాడమ్మా. నిన్నరాత్రి ఇంటికి రాలేదు. సుమారు తెల్లవారాక ఎవరో చూసి, చెప్తే పెద్దాస్పత్రికి మోసుకెళ్ళాం. అప్పటికే తల గాయంవల్ల ప్రాణాలు పోయాయని చెప్పేశారు.” మెల్లగా చెప్పింది.
లతకు విమలనెలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఇల్లు కొదువబెట్టి బేకరి పెట్టారట. పని మొదలుపెట్టి, ఏడెనిమిది నెలలవ్వచ్చు.
“నా డబ్బు, నా కష్టం మంచివమ్మా! అవి తినేటోళ్ళకే రీతి, రివాజు లేవు” నిర్లిప్తంగా అంది విమల. విషాదం విమలను వదలనంటోంది.”విమల మళ్ళీ తాకట్టులోకెళ్ళి పోయినట్టే! అటు ఉద్యోగం పోయింది.ఇటు బంధువులు రాబందులు “, అనుకుంది లత.
***************************
ఔను. ఆ విమలే, ఒకనాటి తాకట్టు విమలే. ఇవాళ స్థిరంగా నిలబడింది. తన డబ్బు మైక్రోఫైనాన్స్‌కి మార్చింది. స్వంతవ్యాపారానికి పేటలో ఆడవాళ్లకి అప్పులిస్తుంది. తాకట్టుకు వస్తువుల బదులు వాటా ఇవ్వాలి. లాభంలో కాదు. వ్యాపారంలో! ముడిసరుకు కొనడం,పనివాళ్ళ నియామకం,అద్దె, పన్నుల చెల్లింపు, ఇలా ఏ పనైనా తనుకూడా పర్యవేక్షిస్తుంది. ఇచ్చిన వారికి మళ్ళీ అప్పివ్వదు. కానీ, వాళ్ళంతా ఒక సమూహంగా ఉంటారు. స్వయంగా ఆ యూనిట్లను తనిఖీ చేస్తుంది. సొమ్ము పొదుపుచేయడం ఆ ఆడవాళ్ళకి అలవాటు చేస్తుంది. ఈ కొత్తపద్ధతి అందరికీ నచ్చింది. ముఖ్యంగా మహిళలు, విమలని నమ్మి బతకనేర్చారు. మంచి పేరొచ్చింది.
ఆమధ్య, వాళ్ళ పేటలో కౌన్సిలర్ మహిళా అభ్యర్ధి కోసం ఒక రాజకీయ పార్టీ వారు పిలిచి టికెటిస్తామన్నారు.
“టౌను సిటీ ఔతుంటే చితికిపోయే కుటుంబాల్లో ఒక రంగడు , ఒక రాజా ఉంటూనే ఉంటారు. నాలాటి విమలమటుకు ఉండకూడదు .ఏ పేట జనం నాకు కలిసి రాలేదో వాళ్ళకే దగ్గరవాలని నిర్ణయించుకున్నాను లతమ్మా! దీనికీ పదవికీ సంబంధం లేదు “, అంది దృఢంగా.
విమల తాకట్టు విడిపించుకుంది. చాలామందికి ఆ అవసరం రాకుండా చేస్తోంది.వచ్చే గురువారమే ఓపెనింగ్. “బతుకు బాటలో పడి లేచిన విమల, కలలు చెదిరినా మనసు చెదరకుండా నిలబడింది”,అనుకుంటూ , ఇంటర్‍కామ్ బెల్ కొట్టింది డా.లత ఆలోచనల్లోంచి బైటపడి.
Dr.కాళ్ళకూరి శైలజ .కాకినాడ
తల్లిదండ్రులు :
Sri.హరినాధబాబు,శేషమ్మ., ఇద్దరు చెల్లెళ్ళు,ఒక తమ్ముడు.
భర్త డాక్టర్ శేషగిరి రావు పల్మనాలజిస్ట్.
కుమారుడు హరి వివేక్.
చదువు:
ప్రాధమిక విద్య : తూర్పు గోదావరి జిల్లా.
హైస్కూల్ శ్రీకాకుళం , ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో
ఇంటర్:
Amrat Kapadia women’s college, హైదరాబాద్.
డిగ్రీ: బి ఎస్ సీ, ఖమ్మం,
ఎస్.ఆర్.బిజి.ఎన్.ఆర్.కాలేజీలో చేస్తుండగా,
MBBS: కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించింది.
పీ.జీ.: General Surgery, DNB.
Laparoscopic Surgery.
FCGP ,FIAGES
ప్రస్తుతం:
అసోసియేట్ ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ లో పనిచేస్తున్నాను.
శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి గారు, శ్రీమతి మల్లీశ్వరి గారు సంపాదకులు గా వెలువరించిన ‘నవ నవలా నాయికలు’ లో ఒక వ్యాసం వ్రాసే సదవకాశం వారు కల్పించారు.అదే నా తొలి రచన. నవలా నాయికలు వ్యాస సంకలనం లో ‘అవతలి గట్టు’ అరవింద గారు వ్రాసిన నవలా నాయిక పై విశ్లేషణ. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,2019).
‘చినుకు’, ‘సారంగ’, ‘కౌముది’, ‘ కొలిమి’,’సంచిక’, ‘విపుల’ మేగజైన్స్ లో కధలు ప్రచురింపబడ్డాయి.
ప్రముఖ సైన్స్ రచయిత, మీడియా విశ్లేషకులు శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారి తో కలిసి మహాత్మా గాంధీ గురించి వ్యాసాలు వివిధ దినపత్రికల్లో అచ్చు అయ్యాయి.
‘కరోనా’ నేపధ్యంలో అస్తవ్యస్త మైన జనజీవనం పై విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా దినపత్రికల్లో వచ్చాయి.
‘కవిసంగమం’ ఒక గొప్ప వేదిక ను ఇచ్చి వచన కవిత వ్రాసే ఓనమాలు నేర్పింది.ఎందరో కవులను,భావుకులను, రచయితలను అంతర్జాల మాధ్యమంలో కలుసుకోవడానికి,తెలుసుకోడానికి అవకాశం ఇచ్చింది.
ఇందుకు సదా కృతజ్ఞతలు.
సాహిత్యం మానవ సంబంధాల సంక్లిష్టతను పరిష్కరించడానికి, వ్యక్తిగత అభిప్రాయాల కు పరిమితం కాకుండా సంఘం గురించి ఆలోచన,సహానుభూతి పెంచేందుకు కృషి చేయాలి.శరవేగంతో వస్తున్న సాంకేతికత మనిషిని మరమనిషిగా చేసి రాబోయే రోజుల్లో మానసిక క్రుంగుబాటుకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.ఇందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్ గా పనిచేయాలి. అన్నిటి కంటే స్త్రీల సమస్యలు, గ్లోబలైజేషన్ పేరిట సాంస్కృతిక పరాయీకరణ నన్ను బాధ పెడతాయి .వీటిని అర్థం చేసుకునేలా సాహిత్య ఉద్యమాలు నాపై ముద్ర వేసాయి.
పుస్తకాలు:
1.Interludes – a novelette
Patridge publications.
2. నవతరానికి రోల్ మోడల్ గాంధీజీ
గాంధీ భవన్, కాకినాడ వారిచే ప్రచురణ.
డా.కాళ్ళకూరి శైలజ
9885401882.
sailaja7074@gmail.com