Ramukola
మనిషికి చావు వున్నదా?
ప్రశ్నే.
జ్ఞాపకాలు వున్నంతకాలం, జ్ఞప్తికి తెచ్చుకునే ఆ మనిషి వున్నంతకాలం అతనికి చావు లేదు.
ఇద్దరూ ఒక ఆత్మా, రెండు శరీరాలుగా జీవించినవారు. చెట్టూ-పుట్టా, పువ్వూ-పునుగూ అన్నిటినీ నాలుగు కళ్ళతోనూ, రెండు మనసులతోనూ ఆస్వాదించి, ఒకరిలోకి ఒకరు ప్రవహించి ఏకధారగా వ్యక్తీకృతమయారు. అలాంటిది దమయంతి ఆవార్త విని మొదలు నరికిన తరువులా విరుచుకుపడిపోయింది. నలబై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న మనిషి, కూతురు చేతిలో పసిపాపలా ఒదిగి పోయింది.
ఆమె మనసు తిరోగమనం పట్టింది.
ఔను, అతను లేకపోతేనేం? అతని జ్ఞాపకాలున్నాయి. ఆ జ్ఞాపకాల్లో తను వంటరి కాదు. అతనున్నాడు అక్కడ. అక్కడే వుంటుంది తను.
“ఒక్క నిమిషం ఉండండలా! “
“వచ్చేస్తున్నాను !మీరు ఇంత త్వరగానే వచ్చేస్తారని అనుకోలేదు,సుమండీ!”
“అలసటగా ఉండి ఉంటుంది! ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలకు వచ్చేయండి, మీరు వస్తారని వేడి నీళ్ళు ,టవల్ సిద్దంగా ఉంచానులేండి .సబ్బు కూడా పక్కన పెట్టాను చూడండి .”
“…”
“జాగ్రత్త నీళ్లు బాగా వేడిగా ఉన్నట్లు ఉన్నాయి. పక్కన బక్కెట్లో చల్లని నీళ్ళు పెట్టానో లేదు? మరోసారి చూసుకోండి! .ఎందుకైనా మంచిది!
ఈమధ్యనే కాస్త మతిమరుపు నాకు ఎక్కువ ఉన్నట్లుగా ఉంటుంది..”
“…”
“అనుకున్నా సమయానికి త్వరగానే వచ్చినట్లున్నారే?”
“…”
“కొత్త బాస్ వచ్చాడన్నారుగా?”
“…”
“కలుపుగోలు మనస్తత్వమేనా అతడిది.?”
“…”
“మీతో సరదాగా ఉన్నారా?”
“…”
“లేక కోపంతోనే రుసలాడుతూ ఉన్నారా?”
“…”
“హా…ఎవ్వరు వస్తే ఏమిటిలే,మీ పని మీరు చేసుకు పోతూనే ఉంటారు కదా!.”
“…”
“ఎక్కడా చిన్న తప్పు దొరకనివ్వరు లేండి! నాకు తెలుసులేండి ?”
“…”
“ముపై ఏళ్ల వైవివాహిక జీవితంలో ,నేనే మీ దగ్గర చిన్న తప్పు దొరకబుచ్చుకోలేక పోయానే, ఇక మీ బాసుకి సాధ్యమా! చెప్పండి .”
“…”
“అవును మర్చిపోయాను?”
“…”
“మీ చెల్లాయ్ ఏదో అవసరం ఉంది !డబ్బులు పంపించమని చేసినట్టుగా ఉంది?” ,
“…”
“మర్చిపోకండి! రేపు ఉదయం తన పేరున బ్యాంకులో చేసేయండి”
“…”
“ఎంత అవసరం వచ్చిందో ఏమో ?లేకుంటే నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతుందా.!”
“…”
పిచ్చిపిల్ల నేనేమైనా అనుకుంటాను అనుకుందేమో? మెసేజ్ చేసి వెంటనే డిలీట్ చేసింది.”
“…”
“పెళ్లయిన తర్వాత మొదటిసారి అడుగుతోంది. వదినా నువ్వైనా కాస్త అన్నయ్యకు గుర్తుచేయవచ్చు కదా? అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి?”
“…”
“అంతగా మీదగ్గర ఉన్నవి చాలకుంటే నా నగలు బ్యాంక్లో పెట్టిన తనకు సర్దేయండి”
“…”
“ఇలా కూర్చోండి!”
“…”
“ఒకటే పరుగులు మీకు,నేమ్మదిగా నాలుగు ముద్దలు కూర్చుని తృప్తిగా తినరుకదా! ఆఫీసు పనులు వత్తిడి ఎప్పుడూ ఉన్నదేకదా!”
“…”
“సరిగ్గా నిద్ర కూడా పోతున్నట్లుగా లేదు,చూడండి కనురెప్పల క్రింద నాల్లని చారలు వచ్చేసాయి.అప్పుడే.”
“…”
“అదిగో!మీకు ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కూర,కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పచ్చడిచేసా,మజ్జిగ చారు చేసా.”వేడివేడిగా తినేయండి.”
“…”
“మీ అమ్మ చెప్పేవారు-
చూడమ్మా ! కోడలుపిల్లా ! మావాడు బహుభోజనప్రియుడు ,వాడికి ఎలా వంటలు చేసి పెడతావో, నన్ను మరిపించాలి
-అని “
“…”
“ఇన్నిరోజులూ అమ్మా అమ్మా అంటూ , నా కొంగు పట్టుకొని తిరిగేవాడు, రేపటి నుండి నీ కొంగు పట్టుకుని తిరిగేలా వంట చేసి పెట్టాలి-
అని పదే పదే చెప్పేవారు అత్తయ్య గారు.”
“…”
“నాకు అంతగా వంట రాకున్నా !ఏదో మా అమ్మగారు నేర్పిన దానితో ,మీకు నచ్చుతుందో నచ్చదో అన్నట్లుగా వంట చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నచ్చకపోతే చెప్పండి నేర్చుకుంటాను, కానీ అలకతో భోజనం మాత్రం మానకండి..
“ఉండండి తలగడ సర్దుతాను! మీకు తలగడ సరిగా లేకుంటే నిద్రపట్టదు,ఉదయమే నీరసంగా నిద్ర లేస్తారు.”
“…”
“ఫ్యాన్ మూడు మీదే ఉంచాను,మీకు అవసరమైతే కాస్త పెంచుకొండి.”
“…”
“బయట మంచు కురుస్తుంది ,అందువలనే కాస్త తగ్గించాను. అలా కిటికీ లోనుండి చూడండి,మీకు జోలపాడేందుకు మేఘాలు కదలి వస్తున్నాయి”
“…”
“చేతికి అందుబాటులో మంచినీళ్ళు పెట్టాను. ఇంకా ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి,మీరు రాత్రి పూట లేచి ఇబ్బంది పడకండి.”
’”…”
“కాళ్ళు చాపుకోండి ,రగ్గు కప్పుతాను. గుడ్ బోయ్..అలా పడుకోవాలి…”
తలుపు శబ్దం కావడంతో తల తిప్పి చూసింది దమయంతి. కూతురు. వినమ్ర.
“అమ్మా! నాన్నగారు నిద్రపోయారు,ఇక నువ్వుకూడా త్వరగా పడుకోవాలి. ఉదయం నాన్నగారికి తలంటు స్నానం చేయించాలి కదా!”
“అవును. ఉదయమే త్వరగా నిద్రలేవాలి. పద! త్వరగా పడుకుందాం! ఉదయం కాస్త ఆలస్యమైనా మీ నాన్నకు చెప్పలేనంత కోపం వస్తుంది.”
గదిలోనుండి దమయంతిని చంటిబిడ్డలా బయటకు తీసుకు వచ్చింది వినమ్ర.
తండ్రి యాక్సిడెంట్లో చనిపోయిన తరువాత తన తల్లి జ్ఞాపకాలలో మిగిలింది ఇలా… వైద్యం దారి వైద్యానిదే.
పేరు రాము కోలా. ప్రస్తుతం ఖమ్మంలో నివాసం, స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలం,దెందుకూరు,చదువు డిగ్రీ వరకు,ప్రస్తుతం ఖమ్మంలో గ్రానైట్ లో వర్కు చేస్తున్నాను,ఇప్పటి వరకు 1500కవితలు 100కు పైగా కథలు వ్రాసాను,అనేక కథలు, ప్రముఖ వారపత్రిక లు,సండే మ్యాగజైన్స్ లో ప్రచురితమైన వి.ప్రతిలిపిలో వ్రాసిన అత్తమ్మ కథ నాకు మంచి గుర్తింపును కలిగించింది.
నా రచనలను మొదట ముఖపుస్తకంలోనే ప్రారంభించాను,ఎన్నో సన్మానాలు,బిరుదులు అందుకున్నాను.
గాంధీ గ్లోబుల్ ఫ్యామిలీ &గాంధీ విజ్ఞాన ప్రతిష్టాన్ సాహితీ విభాగం హైద్రాబాద్ వారు గాంధీ విశ్వకవి సమ్మెళనంలో అందించిన “సాహిత్య రత్న”బిరుదు ఎంతో విలువైనది.