పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari

  1. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  2. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  3. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  4. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  5. మృతజీవుడు by Ramu Kola
  6. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  7. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  8. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  9. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  10. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  11. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  12. ఏం దానం? by Mangu Krishna Kumari
  13. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  14. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  15. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  16. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  17. జ్ఞాననేత్రం by Rama Sandilya
  18. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

అన్నయ్యా వదినా వస్తాం అని ఫోన్ చేసి చెప్పేరు. వైదేహి గబగబా ఇల్లు సద్ది అన్నయ్యకి ఇష్టమైన చల్ల పుణుకులు చేసింది. అప్పుడప్పుడు కలుసుకుంటున్నా, అన్నయ్య వస్తాడంటె సంబరంగా లేచింది వైదేహి. అన్నంటే చాలా ఇష్టం ఆమెకి.

వైదేహి చిన్నతనంలో చాలా ఇబ్బందులు‌ పడుతూ ఉండేవారు. అసలే తండ్రిది  ప్రైవేటు ఉద్యోగం, ఆ పైన మొహమాటానికి పెట్టిన ష్యూరిటీ సంతకం పీకకి చుట్టుకొ‌ని, జీతంలో కటింగ్ మొదలయింది. తల్లి ఏడవని రోజు లేదు.

ఆమె చెవుల రాళ్ళ దుద్దులు కూడా ఇంటి అవసరాలకే అమ్మేసి, మెళ్ళో పసుపుతాడు, చెవులకి గిల్టు దుద్దులతో తిరిగేది. వైదేహి చెవులకి ‘చిన్న చిన్న’ రింగులు తప్పవేరే ఎలాటి విలువయిన వస్తువులూ లేవు. అప్పటికి చంద్రం, వైదేహీ హైస్కూల్ చదువుల్లో ఉన్నారు.

అన్నాచెల్లెళ్ళ మధ్య చక్కటి ఆపేక్ష, స్నేహం ఉండేవి.

స్కూల్ చాలా దూరం. సిటీ బస్సులకి డబ్బు పోయడం ఇష్టం లేక ఇద్దరూ నడిచే వెళ్లేవారు. బయలుదేరగానే చంద్రం నవ్వుతూ అనేవాడు. “కార్ డ్రైవర్ రాలేదు. స్కూటర్ రిపేర్ లో ఉంది. మరి సిటీబస్సులు కూడా స్ట్రైక్. ఫరవాలేదులే. పదకొండో నంబరు బస్సు తిరుగుతోంది. పదవే చెల్లీ! పదకొండో నంబరుతో పరుగున పోదాం”. వైదేహీ ఇంకా నవ్వుతూ “నేను బస్సు ఎక్కేసా, పదరా అన్నా! పోదాం” అనేది.

ఇద్దరూ హుషారుగా అలసట తెలీకుండా జోక్స్  వేసుకుంటూ నడుచుకుంటూ వెళిపోయేవారు. అనుకోకుండా వైదేహికి ఇంటర్ పూర్తి అయేసరికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అన్న హాస్టల్లో ఉండి చదువుతూ ఉంటే తనే డబ్బు సహాయం చేసేది. అన్న ఉద్యోగస్తుడయినదాకా పెళ్ళి సంబంధాలు కూడా చూడవద్దనేసింది.

చంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తరవాతే ఆమె పెళ్ళికి ఒప్పుకుంది. పిల్లలు పుట్టిన తరవాత కుదరక ఉద్యోగం మానేసింది. ఏళ్ళు గడిచి చంద్రం డైరెక్టర్ కూడా అయేడు. కారు, బంగళా అన్నీ ఆఫీస్ ఇచ్చింది.

వైదేహికి ఇద్దరు పిల్లలు. భర్త బేంక్ ఆఫీసర్! అన్నయ్య కోలనీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆమె ఇల్లు. ఆమెగానీ, ఆమె వదిన గానీ అటూ ఇటూ వస్తూ ఉంటారు. అన్నయ్యకి టైమ్ తక్కువ. చెల్లి వెళితే చాలా సంబరపడతాడు.

బాల్కనీలో ఎదురుచూస్తూ నిలబడింది వైదేహి. దూరంనించీ చంద్రం, సత్యా నడుచుకుంటూ వస్తున్నారు. “ఇదేమిటి! అన్నకి నడవవలసిన అవసరం ఏమిటి?” వైదేహి ఆశ్చర్యంగా అనుకుంది.

లోపలకి రాగానే వైదేహి ఆత్రంగా అడిగింది “ఇదేమిటన్నా! నడిచొచ్చేరేం?”

చంద్రం నవ్వుతూ చెప్పేడు. “కార్ డ్రైవర్ రాలేదు. స్కూటర్ సర్వీసింగ్ లో ఉంది. సిటీ బస్సులు కూడా స్ట్రైక్. ‌ఫరవాలేదే చెల్లీ. పదకొండో నంబరు బస్సు తిరుగుతోంది. అదెక్కి వస్తున్నాం”

అంతే, వైదేహి వెక్కివెక్కి ఏడుపు మొదలెట్టింది. “అయ్యో! అలాంటప్పుడు ఇంత దూరం రాడం ఎందుకన్నా?” అంటూ.

“మంచిదానివే…. బొత్తిగా నడక అలవాటు తప్పి సుగర్ బోర్డర్స్ కి వచ్చేసాం ఇద్దరం. అందుకే ఈ అవకాశం వదలుకోకుండా ఇలా, నడుచుకుంటూ వచ్చేసాం! అయినా చిన్నతనంలో లేని ఏడుపు ఇప్పుడెందుకమ్మా?” అన్నాడు చంద్రం. తనకి ఈ దుఖం ఎందుకో వైదేహికీ తెలీదు.