చీలినదారులు by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

(2000కి ముందు ప్రచురించబడిన కథ)

“ఏమిటే సుధా! బావ మరీ అంత చవకబారు డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నాడు? ఇలాంటి అకేషన్‍లో వేసుకోవడానికి నాలుగుజతలన్నా ఖరీదైనవి తెచ్చుకోవద్దా? లేవా? డబ్బు నేనిస్తాను. తెచ్చుకోమను” అంటూ దూకుడుగా వచ్చిన సురేష్‍కేసి తెల్లబోయి చూసింది సుధ.
“మరీ క్లరికల్ మెంటాలిటీ వంటపట్టించుకున్నాడేంటే? ఈపాటికి ఒకటో రెండో ప్రమోషన్లు తీసుకుని ఆఫీసరయి వుంటాడనుకున్నాను. అలాంటిదేం లేదు సరిగదా, సంబంధం మాట్లాడటానికి ఇందాకా వాళ్ల మేనేజర్ వస్తే స్వయంగా లేచి మర్యాదలు చెయ్యడం మొదలెట్టాడు. నాకు తలకొట్టేసినట్టయింది. అలాంటివాళ్లు మాకు లక్షలమంది. డిపాజిట్లు చెయ్యమని మా చుట్టూ తిరుగుతుంటారు. అలాంటివాడికి బావ మర్యాదలు చేయ్యడం… ఏమన్నా బావుంటుందా? ఆయన్ని కాస్త పద్ధతులు మార్చుకోమను” అంటూ చెల్లెలి ముఖంలోకి చూసి, “నీకు కోపం వచ్చినట్టుంది. సారీ! ఏం చెయ్యలేను. మీకుగా తెలీనప్పుడు చెప్పక తప్పదు” అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
అతనూ వెళ్లాడో లేదో, భర్త కుమార్ వచ్చాడు.
“సురేష్ పూర్తిగా మారిపోయాడు సుధా! స్టేట్స్ వెళ్లకముందు చనువుగా తిరిగేవాడు నాతో. ఇప్పుడు గొప్ప స్టేటస్ మెంటేన్ చేస్తున్నాడులే!” అన్నాడు చిన్నబుచ్చుకుని. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టైంది సుధ పరిస్థితి.
“సంబంధం మాట్లాడటానికి మా మేనేజర్ వచ్చాడు. సురేష్‍కి ఆయన లెక్కలోనివాడు కాకపోవచ్చు. కానీ నాకోసమేనా కొంచెం ప్రాధాన్యత ఇవ్వచ్చుకదా? పట్టనట్టు వూరుకున్నాడు” అన్నాడు కోపంగా.
సుధ ఏమీ జవాబివ్వలేదు. సురేష్ ఇప్పుడు తన అన్నైతే కదా, ఏదేనా చెప్పడానికి? చాలా పరాయివాడైపోయాడు. డబ్బు, అంతస్తుల భేదం తమ మధ్యని విస్తారంగా పరచుకుంది. ఆ మాధ్యమంలోంచీ చూస్తుంటే వెనుకటి అనుబంధాలు కనిపించడంలేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“సర్లే! నేనలా బైటికెళ్లొస్తాను. నాకోసం ఉందద్దు. భోజనం చేసేయ్” అన్నాడు.
“మీరు ఎన్నింటికొస్తారు? తిరిగొచ్చేసరికి బట్టలవీ సర్ది వుంచుతాను. వెళ్ళిపోదాం” అంది సుధ ఆరాటంగా అతని చెయ్యిపట్టుకుంటూ. “నాకూ ఇక్కడుండాలని లేదు. అన్నయ్యలో చాలా మార్పొచ్చింది. నాతో వెనుకట్లాకూడా లేడు. పూర్తిగా డాలర్ల మనిషైపోయాడు”
అతను నిశితంగా ఆమె ముఖంలోకి చూసి, ఏదో అర్ధమైనట్టు “సరే” అనేసాడు. “మీ అమ్మానాన్నలకి ఏదో ఒకటి సర్దిచెప్పు. లేకపోతే మర్యాదలు సరిగ్గా జరగలేదని అలిగాననో, మరొకటనో లేనిపోనివి ఊహించుకుంటారు” ఆమె చెయ్యి విడిపించుకుని వెళ్లిపోయాడు.
అతనితో అందేగానీ బట్టలు సర్దాలని కూడా అనిపించక అక్కడే మూల చాప కనిపిస్తే తెచ్చుకుని పరుచుకుని పడుకుంది. మనసంతా అలజడిగా వుంది, గత నాలుగైదురోజులుగా జరుగుతున్నవన్నీ గుర్తొస్తుంటే.
అన్నయ్య స్టేట్స్‌నుంచీ గురువారం వస్తున్నాడు. పదిహేనురోజులు ఇక్కడ వుంటాడు. నేను మాట్లాడి వుంచిన మూడు సంబంధాల్లో ఏది నచ్చితే అది కుదుర్చుకుని పెళ్లిచేసుకుని వెళ్లిపోతాడు. టైమ్ చాలా తక్కువగా వుంది. ఈ వ్యవహారాల్లో నాకూ మీ అమ్మకీ చేయూతనివ్వడానికి మాకు మరో కొడుకు లేడుకాబట్టి కుమార్‍నే మా పెద్దకొడుకని అనుకుంటున్నాం. మీరిద్దరూ ఈ ఉత్తరం అందిన వెంటనే బయల్దేరి రాగలరు – అని తండ్రి రాసిన ఉత్తరాన్ని భర్త బేంకునుంచీ వచ్చేలోగా తను పదిసార్లు చదువుకుని రాగానే అతనిచేత చదివించి ప్రయాణానికి బయలదేరదీసింది సుధ.
వచ్చిన దగ్గర్నుంచీ ఏదో అపశృతి దొర్లుతునే వుంది. సురేష్ ప్రవర్తనకి గుండెల్లో కలుక్కుమంటూనే వుంది. దానికి ఇందాకటి సంభాషణ పరాకాష్ట. చాలాకాలం తర్వాత అతన్ని చూసిన సంతోషంలో మొదట చిన్నవిషయాల్లా అనిపించాయిగానీ అతని దృష్టిలో తన భర్తకి స్థానం లేదు. అతని స్నేహితులముందు కనిపించడానికి తాము అనర్హులు. అవడానికి తన స్వంత అన్నే. అన్నంటే? ఒకే తల్లికి పుట్టి, ఒకే తండ్రి వళ్లో పెరిగి… అంతవరకే తమ చుట్టరికం. చిన్నప్పుడు ప్రతిదానికీ తనతో వంతుకి పోయేవాడు. తామిద్దరి మధ్యనీ తలెత్తే గొడవలు సర్దలేక తల్లి ఒక్కొక్కసారి అతన్ని కొట్టేది. చాలా సందర్భాల్లో అతని తప్పున్నా తనని కొట్టేది.
“ఆడపిల్లవి. అన్నిట్లోనూ వాడితో వంతా? సర్దుకుపోలేవూ?” అని కోప్పడేది.
ఆడపిల్లకి పెళ్లి, మగపిల్లాడికి పెద్దచదువు అని గిరిగీసి తనకి ఇంటరుదాకానే చదువు చెప్పించాడు తండ్రి . తను ఏడ్చి గొడవచేస్తే ఆయన తన నిస్సహాయతని ప్రకటించేడు.
“నాది చిన్న ప్రైవేటు వుద్యోగం. ఒకేసారి ఇద్దరికీ పెద్దచదువులు చెప్పించలేనమ్మా!” అన్నాడు.
“చదువుకుంటే నాకూ ఉద్యోగం వస్తుందికదు నాన్నా? “ఆశగా అడిగింది.
“ఇంటరుకి కూడా వస్తుంది. ఎల్లైసీ, బేంకు, పోస్టల్… వీటిల్లో ట్రైచేద్దువుగాని”’
“బోడి క్లర్కు ఉద్యోగం. నేను కూడా ఎమ్‍సెట్ రాస్తాను. మెరిట్లో సీటొస్తేనే చదివించండి”
” నీకు బీటెక్ చెప్పించి మరో బీటెక్‍ని తీసుకొచ్చి చేసేంత స్తోమతకూడా నాకు లేదు. చెప్పిన మాట విను”
“నా పెళ్లికి తొందరేంటి? కష్టపడి చదువుతాను. ఎమ్‍సెట్లో రాంకు తెచ్చుకుంటాను. ఆపైన బీటెక్‍లో కూడా కష్టపడితే మంచి జాబ్ వస్తుంది”
అందుకు తండ్రి చిన్నగా నవ్వి. “ఇద్దరికీ ఒక్కసారి చెప్పించలేనని ముందే చెప్పాను. నీకి సామెత తెలిసేవుంటుంది. ఏ బర్డ్ ఇన్ హేండ్ ఈజ్ బెటరేన్ టు ఇన్ ద బుష్ అని. నీ పెళ్లికోసం దాచిన డబ్బులో నీకు చదువు చెప్పించడం, ఆపైన నీకు జాబొచ్చేదాకా ఆగడం…అంతా తెలివితక్కువగా లేదూ? అంతకన్నా నీ పెళ్లి చేసేస్తే నాకో బాధ్యత తీరిపోతుంది” అన్నాడు. ఆయన నవ్వుతూ చెప్పినా, కోపంగా చెప్పినా అందులోని గట్టితనం ఒకేవిధంగా వుంటుంది. ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మారిన కాలందృష్ట్యాకూడా దాన్ని మార్చుకోవాలనుకోవట్లేదు. ఒకే తల్లికి పుట్టిన పిల్లలందరి రాతలూ ఒకేలా వుండవంటారు. తండ్రే ఇలాంటి దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా వుంటాయి? తల్లి తనకి మద్దతు ఇవ్వలేదు. ఆవిడ ఆశలన్నీ కొడుకుమీద వున్నాయి.
సురేష్ బీటెక్ సెకండియర్లో వుండగా కుమార్‍తో తన పెళ్లయిపోయింది. సంబంధం మంచిదే. ఏ వంకా పెట్టడానికి లేదు. మనిషీ మంచివాడే. అత్తవారిని పీడించే దుర్గుణాలు లేవు. అవన్నీ ఎప్పుడు? తనకంటూ ఏ ఆశయాలూ లేనప్పుడు. పెళ్లెన కొత్తలో ఈ మామూలు జీవితంతో సర్దుకుని రాజీపడడం కష్టంగా వుండేది. కానీ మరుదులు, తోటికోడళ్లు, ఆడబడుచులు, వీళ్లందరి కలుపుగోలుతనంతో ఆ కొత్త జీవితంలో కూడా రుచులు దొరకడం ప్రారంభమైంది. నిశ్చింతగా కాలం గడిచిపోతోంది.
ఇంతలో ఉత్పాతంలా సురేష్ స్టేట్స్‌నుంచీ వూడిపడ్డాడు. దాంతో మానిన గాయం మళ్లీ రేగింది.


చాలాసేపటికి ఆలోచనల్లోంచి తేరుకుంది సుధ. చిన్నప్పటినుంచీ సురేష్ దాష్టీకాన్ని తను భరిస్తునే వుంది. ఇంక భరించడం తనవల్లకాదు. అతనికి రేపు పెళ్లవుతుంది. భార్య వస్తుంది. ఆమెకూడా హైస్టేటస్ మనిషే అవుతుంది. అన్నకే లేని అవగాహన ఆమెకి వుంటుందని తను ఆశించలేదు. తల్లిదండ్రులుకూడా తన విషయంలో వివక్షతే చూపించారుకాబట్టి వాళ్లుకూడా అతని పక్షమే వుంటారు. ఈ ఇల్లు, ఇందులోని మనుషులు తనకి పరాయివాళ్లు. తనకంటూ వున్నది కుమార్ ఒక్కడే. అతను బాధపడుతున్నాడు. అతన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపోవాలి.
దృఢనిశ్చయంతో లేచి నిలబడి తండ్రి గదికేసి వెళ్లింది. లోపలినుంచి మాటలు వినిపిస్తుంటే ఆగిపోయింది.
“సుధ పెళ్లి విషయంలో తొందరపడ్డాననిపిస్తోంది. దాన్నికూడా బాగా చదివించాల్సింది. అది చదువుకుంటానని గొడవ చేసినా వినకుండా పెళ్లిచేసేసాను” ఆవేదనగా అంటున్నాడు తండ్రి.
“ఇప్పుడు దానికేం తక్కువైందని? ఇద్దరూ చిలకాగోరింకల్లా వున్నారు” తల్లి జవాబు.
“సురేష్‍కూడా ఏ క్లర్కో అయుంటే అనుకోవాల్సిన మాట అది. ఇప్పుడు చూడు. వీడిలో డబ్బు పొగరు పెరిగింది. వాళ్లేమో కలవలేక పోతున్నారు. తప్పుకు తప్పుకు తిరుగుతున్నారు. నాకున్న ఇద్దరు పిల్లల్లో అంతస్తుల తేడా ఎంతగా వచ్చేసిందో చూడు. నేనేమీ చెయ్యలేకపోతున్నాను”
“బావుంది మీరనేది. వీడింత పైకొస్తాడని మనం అనుకున్నామా? ఐనా ఎవరి తలరాతలకి ఎవరు బాధ్యులు?”
“పైకి ఎగరకుండా దాని రెక్కలు కత్తిరించేసాం. దాన్నీ సరిగా చదివించి వుంటే అప్పుడుకదా, ఏ పోలికేనా”
తండ్రి తన గురించి ఎంత బాధపడుతున్నాడో సుధకి అర్ధమైంది. కానీ ఏం లాభం? తలకిందులుగా తపస్సు చేసినా తమ స్థాయి మారదు. కుమార్‍కి చదువుమీద ఇంకా చదవాలనిగానీ, ప్రమోషన్‍కోసం పరీక్షలు రాయాలనిగానీ ఏమాత్రం ఆసక్తి లేదు. డిగ్రీ ఎలా చేసాడో, ఎలా బేంక్ ఉద్యోగం వచ్చిందో! అక్కడితో సరి. తనకి వున్న ఆశలేవీ అతనికి లేవు. ఏదో బతికెయ్యడమే. తనకి పూర్తిగా వ్యతిరేకం. ఐనా అతన్తోటే తన జీవితం ముడిపడివుంది. ఆ ముడి విప్పుకునే సాహసం లేదు తనకి. అతన్ని దాటుకుని వెళ్ళి సంసారాన్ని ఇరుకునపడేసుకోవటం అవసరం లేదు. అంతా బాగున్నప్పుడు ఈ విషయాలకోసం సంసారం పాడుచేసుకోవడమంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
“పరాయిదాన్లా అలా నిలబడ్డావేంటి సుధా?” తల్లి అడిగింది
“పరాయిదాన్ని కాకపోతే ఈ ఇంటిదాన్నా అమ్మా?” నిర్వేదంగా అడిగింది సుధ.
“వచ్చి నాలుగురోజులైంది కదా నాన్నా! ఇక్కడుండి చేసేదికూడా ఏమీ కనిపించడంలేదు. వెళ్లిపోదామనుకుంటున్నారు తను. మీరు సంబంధం ఖాయం చేసుకుని ముహుర్తాలు పెట్టుకుంటే అప్పటికి వీలు చూసుకుని మళ్లీ వస్తాం” మాటల్లో ఏమాత్రం తొణక్కుండా అంది తండ్రితో.
తను రాసిన ఉత్తరంమీద గౌరవం వుంచి భర్తతో కలిసి పదిరోజులుందామని వచ్చిన కూతురు మధ్యలోనే తిరిగి వెళ్లిపోతానంటే ఆమె మనసు ఎంతగా గాయపడిందో ఆయనకి అర్ధమైంది.
“నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి సుధా! చెప్పే అధికారాన్ని నేను రెండుసార్లు దుర్వినియోగం చేసాను. మొదటిసారి చదువుకుంటానంటే వినకుండా నీ పెళ్లిచేసి, రెండోసారి నిన్నిలా రమ్మని పిలిచి. కానీ ఒక్కమాటమ్మా! ఇది నా ఇల్లు. సురేష్‍ది కాదు. ఎంత డబ్బు సంపాదించుకోనీగాక, నువ్వెంతో వాడూ నాకంతే. వాడి దారి చీలిపోయింది. నువ్వు మాత్రం మమ్మల్ని దూరం చెయ్యకు” అన్నాడాయన.
సుధకి కళ్లలో నీళ్లు తిరిగాయి. తలదించు కుంది. ఆమె తల్లికిమాత్రం వాళ్ల సమస్యేంటో ఏమీ అర్ధం కాలేదు. అలా అర్ధంచేసుకునే తెలివే వుంటే కొడుకునీ కూతుర్నీ మొదటినుంచీ ఒక్కలానే చూసివుండేది. చదువు ఆపేసి కూతురి పెళ్ళి చేస్తానంటే వప్పుకునేది కాదు.