కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari

  1. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  2. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  3. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  4. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  5. మృతజీవుడు by Ramu Kola
  6. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  7. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  8. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  9. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  10. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  11. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  12. ఏం దానం? by Mangu Krishna Kumari
  13. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  14. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  15. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  16. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  17. జ్ఞాననేత్రం by Rama Sandilya
  18. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

వీణాధరికి వృత్తి అంటే ప్రాణం. కాంట్రాక్టుమీద ఉద్యోగం చేస్తున్నా పిల్లలకి చదువు చెప్పేదగ్గర రాజీపడదు. క్లాసులో కొందరు బాగా వెనకపడి ఉన్నారని గమనించింది. వస్తున్న ఆదివారం ప్రైవేటు క్లాసుపెట్టి వాళ్ళందరినీ రమ్మంది. మర్నాడు ఎవరికి వాళ్ళు తమకి రాడం అవదు అని చెప్పేరు. తనకి కష్టం అయినా చదువు చెప్పే ఉద్దేశంతో రమ్మంటే రాం అంటున్న పిల్లలని చూసి ఏం మాటాడాలో తెలీలేదు. బయటకి వచ్చేసరికి సీనియర్ పెర్మనెంట్ ఉద్యోగి అయిన సూర్యారావు నవ్వుతూ కనిపించేడు.
“ఏమిటమ్మా, ఆదివారం ప్రైవేటు క్లాసుకి రాం అన్నారా?” అడిగేడు.
వీణాధరి కూడా అతనితో పాటూ ఉపాధ్యాయుల విశ్రాంతి రూమ్ వేపు నడుస్తూ, “అవునండీ! మీకెలా తెలుసు?” అడిగింది.
“మీకు ఇక్కడ కొత్త. మా అందరికీ అనుభవమే. ఇక్కడ పిల్లల తల్లులు చదువులకన్నా, వాళ్ళ మిగతా పనులకే ప్రాధాన్యత ఇస్తారు” అన్నాడు. ఇద్దరూ టీచర్స్ రూమ్‍లో కూలబడ్డారు. క్లాస్ లేని మిగతా కో టీచర్స్ కూడా అంతా విని నవ్వేరు. శారద సోషల్ టీచర్.
“వీణా నీ ఆలోచన మంచిదేకానీ ఈపిల్లలు వాళ్ళ అమ్మానాన్నలు పిల్లలకి చదువు ఒక సర్టిఫికేట్ కోసం అన్నట్టే ఉంటారు. సెలవల్లో పిల్లల చేత మిగతా పనులు చేయించుతారు” అంది.
“అదేమిటి?” అయోమయంగా అంది.
“అంతే వీణా… మెజారిటీ మనుషులు ఉద్యోగం చేయాలని, డబ్బు సంపాదించాలని, బతుకు తెరువుకోసం అనికదా చదువుతారు?” శారద అంది.
“అయితే…” అడిగింది వీణాధరి.
“ఈ ఊరి వాళ్ళ తెలివితేటలు ఇవి. పిల్లలకి చదువుతోపాటు వృత్తిపనులు కూడా మానకుండా నేర్పిస్తారు” శారద చెప్పింది.
సూర్యారావు అందుకొని “ఉదాహరణకి పాల వ్యాపారం చేసే సత్తెయ్య, తన పిల్లలచేత ఇలా ఆదివారాలూ సెలవలకీ గొడ్లపని చేయిస్తాడు.‌ కాలేజీ చదువుకి వచ్చేసరికి వీళ్ళి ఈ వృత్తిలో ఆరితేరతారు” వివరించేరు.
లెక్కల టీచర్ నారాయణమూర్తి “ఒక్క పాలవ్యాపారం అన్నమాట ఏమిటి, కిరాణా దుకాణాల్లో చూడలేదూ? పొద్దుట పాలపేకెట్లు ఇవ్వడాలు అవీ యూనీఫారమ్‍లో ఉన్న పిల్లలే చేస్తారు. అదనీ ఇదనీ కాదు కుండలపని, కమ్మరిపని , సైకిల్ రిపేర్ చేసేవాళ్ళు, సెలూన్ నడిపేవాళ్ళు పిల్లలకి ఇప్పటినించే ట్రైనింగ్ ఇవ్వడం మొదలెడతారు” అన్నాడు.
“ఏదో కొంత తెలుసు కానీ మరీ చదువు అక్కరలేదు అనుకుంటారా?”వీణాధరి అనుమానంగా అడిగింది.
“చదువుల ధ్యేయం‌ సంపాదనే కదా, వీణా.. వీళ్ళు చేస్తున్నది అదే.‌ అందరూ ఇంజనీర్లు అయితే దేశం ఎందరికి ఉద్యోగాలు చూపించగలదు?”
అంది శారద.
“నన్నడిగితే వీళ్ళు చాలా తెలివయి‌న వాళ్ళే అంటాను. బాగా తెలివయిన పిల్లలు ఎటూ చదువు మానరు. సగటు పిల్లలు ఇప్పటినించే చేతిపనులు నేర్చుకోడం సరయినది” అన్నాడు నారాయణమూర్తి.
“కోటి విద్యలూ కూటికోసమే కదా!” అంటూ నవ్వింది శారద.
“ఇక్కడి పరిస్థితులకి ఇలా ఉంటే సరేకానీ, చదువు‌ మరీ అక్కరలేదు అంటే నేను ఒప్పుకోలేను” బింకంగా అంది వీణాధరి.
“అలా అనం. మరి మా పిల్లలందరికీ చదువే ముఖ్యం, అన్నం‌ పెట్టే అమ్మ, సరస్వతీదేవి అని నూరి‌పోస్తున్నాంకదా, చూడాలి ఈ పోటీ ప్రపంచంలో ఏ చదువు బతుకుతెరువుని ఇస్తుందో, ఏ చదువు విదేశాలకి విమానాలని ఎక్కిస్తుందో ఎవరం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం” అంది శారద.
తరవాత చదువులో వెనకపడ్డ పిల్లల ఇళ్ళకి వెళ్ళిమరీ మాటాడింది వీణాధరి. ఇంచుమించుగా అందరూ

“పిల్లలని పరీక్షలముందు ప్రైవేటు క్లాసులకి పంపుతాం కానీ ఉత్తపుడు వాళ్ళు పని నేర్చుకోవలసిందే” అనే అన్నారు.
స్కూల్లో జరిగిన సంభాషణలు తలచుకొని‌ వాళ్ళ ఆచరణలో‌ జీవితసత్యం ఇమిడి ఉన్నాదని వీణాధరి కొత్తకోణంలో ఆలోచించడం మొదలెట్టింది.