బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

“ఆయీ యే అఘోరీ యే!” అంటూ ఏదో రాయబోతూ మానేసి పెన్నూ, పుస్తకం టీపాయ్‍మీద పెట్టింది సీత, అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన తమ్ముడు శేఖర్నీ, అతని కొడుకు నానినీ చూసి.
“అఘోరించమంటున్నావు ఏమి అమ్మమ్మా? ఇది రాబోయే తుఫాను సూచికయా? మా అపరాధమేమి?” అన్నాడు డ్రమాటిక్‍గా నాని.
“చాల్లే డ్రామాలు. తుఫానా, పాడా? పొద్దున్ననగా వెళ్ళారు. ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. ఓ ఫోన్ ఏడవొచ్చుకదా? ఎన్నిసార్లు చెప్పాను లేటవుతుందంటే ఫోన్ చెయ్యమని నీకు, మీ నాన్నకీ? ఇద్దరూ, ఇద్దరే… ఎక్కడేం రాచకార్యాలు వెలగబెట్టారింతసేపు? మొన్నే పడి లేచావు కదరా తమ్మూ! వేళాపాళా లేకుండా తిండీ, తిరుగుడూ అయితే ఆరోగ్యాలు బావుండమంటే ఎలా బావుంటాయి? అయినా ఇప్పటివరకూ రాలేదంటే ఇక ఈ పూటకి మీరు రారని ఆ వండినవన్నీ సర్దేసి కాసేపు కునుకుతీద్దాం అని నడుం వాల్చేసరికి ఫోనూ…
అది మాట్లాడటం అయేసరికల్లా ఇదిగో ఇలా మీరు తయారు. ఇంకేం నిద్ర నాకు?” అంటూ లేచింది సీత.
“అయ్యో! పడుకుంటే ఎలా అక్కా, ప్రతి బుధవారం గజల్ రాయాలి కదా నువ్వు? ఈరోజు బుధవారం మరిచిపోయావా?” అన్నాడు శేఖర్.
“సరేలే! సంబడం. నా మొహానికి గజల్ ఒకటి తక్కువయింది. నే రాద్దాం అనుకునేసరికి మీకు కలేమైనా వస్తుందేమో! టక్కున ప్రత్యక్షం అయి కలం కాయితంమీద పెట్టకుండా అడ్డుపడతారు. హుమ్!” అని విసుగ్గా ఓ దీర్ఘశ్వాస విడిచిన సీతని చూసి నవ్వుతూ-
“అయ్యో! అక్కా! అంత డీలాపడిపోనవసరం లేదు. నిజానికి నీ గజల్ పోదామన్నా ఎటూ పోలేదు తెలుసా? నీకు తెలిసిన పుంజీడు భావాలు, నీకు పరిచయం ఉన్న మూడు భాషల్లో తెలిసిన మహా అయితే ఓ రెండువేల పదాల్లో నా చిన్నప్పటినుండీ నువ్వు గజల్స్, కవితలూ రాసేస్తూనే ఉన్నావు. నే చూస్తూనే వున్నాను. నిజానికి ఇప్పుడు నేనే నీ భావాలతో, పదాలతో నువు రాయబోయే గజల్ రాసీగల్ను, నువ్వు రాయలేవా? అనవసరంగా నువు బాధ పడిపోతూ మమ్మల్ని తిట్టుకోకు…మా భోజనాలయాక నీ పాతగజల్స్ చిట్టా తెరిచి ఓసారి చూడు. అందులోంచి ‘నేనిక్కడే వున్నాను’ అని నువు రాయబోయే గజల్ నిన్ను పలకరించక పోతే అడుగు.” అని ఆట పట్టించాడు శేఖర్.
“ఒర్నీ! నా రాతలంటే నీకంత నవ్వులాట అయిపోయిందిరా? ఇంటి, ఒంటి బాధలతో, బాధ్యతలతో ఏమీ చదవలేక, రాయలేక ఇలా ఉండిపోయాను. నాకూ, నీలా ఎవరైనా అందిస్తూ, వొండి ,వార్చి పెడుతుంటే నేనూ బోలెడు చదువుకునే దాన్ని. పరిధి విస్తృతంగా పెంచుకునేదాన్ని. మీ అందరికంటా బాగానే రాణించేదాన్ని…” ఆమె అంటుంటే-
మధ్యలోనే అందుకుని “అవునక్కా! నిండా పదహారు లేకుండా నీకు ముడేసి అత్తారింటికి తోలీసేరు అమ్మా, నాన్న. ‘ఆటకి పాటకి పుట్టిల్లు ఆ గడప దాటితే అది చెల్లు’ అనే అమ్మ మాట పెళ్ళి కాగానే మొగుడు అందుకుని పుస్తకం ముట్టుకుంటే చాలు ‘అంత చదువుకోవాలనుకున్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావ్!’ అంటూ మన మేనత్త కమ్ అత్తగారితో కలిసి మరీ నిన్ను పొయిలో పెట్టి పెడలోకీడ్చేసాడు బావ. వాళ్ళు పోయాకనేకదా ఈ మాత్రం చదువు, సాము, నీకు తోచింది చేయటం, రాయటం” అంటూ శేఖర్ నవ్వుతుంటే మొహం ముటముటలాడుతూ పెట్టింది.
“చాల్లే! వెక్కిరింత. ఎద్దుపుండు కాకికి రుచీ అని నా గతం కెలక్కు. నీకేం హాయిగా టింగురంగా అని నా కూతుర్ని చేసుకుని నా నెత్తిమీదే బైఠాయించావు. అయినకాడికి నీ పెళ్ళాం మొగుడినీ , కొడుకునీ పోతకీ, మేతకీ, చేతకీ నాకొదిలేసి ఉద్యోగం అంటూ వూళ్ళేలుతోంది. ఇక్కడ నేను మీకు ఎన్నిరకాల చాకిరీ చేస్తున్నా అవేమీ పట్టవుగానీ నేనేమైనా అంటే చాలు నువ్వూ, నీ కొడుకూ ఇలా అన్నిటికీ నాకు కమ్మ కడతారు. అసలు ఆమాత్రం కాయితంమీద పెన్ను పెట్టటానికి నా పెళ్లయ్యాక ఎన్నాళ్ళు పట్టిందో మీకేం తెలుసు? అయినా నా వెర్రిగానీ నీకు చెప్పినా, ఆ గోడకి చెప్పినాఒకటే. ఎక్కి చస్తుందా, పాడా? నువ్వూ మగాడివేగా!” సీత ఆగని వాగ్ధాటికి అడ్డుకట్ట వేస్తూ శేఖర్-
“నీగోడు మాకెక్కదని నిన్నే ఫేస్‍బుక్ గోడెక్కించేసాను అక్కా! ఆ గోడమీద నువ్వేం రాసినా, కూసినా పరవాలేదు. జనం చూస్తే చూస్తారు, లేదా అదా వార పడి ఉంటుంది. అందికే నీకు లాప్టాప్, సెల్ కొని అవి ఎలా వాడాలో నేర్పి ఎటాక్ అని వదిలింది… జూకర్‍బాబు మీలాటివాళ్ళు మనసుల్లో ఊరికే మురగపెట్టుకోనక్కర లేకుండా మూసీనదిలో మురుగులా ఏళ్ళతరబడి మీలో ఉన్నవన్నీ వరదలై పారేందుకు వీలుగా ఈ
ఫేస్‍బుక్ ఏర్పాటు చేసాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా నీ నోటికి తాళం పడటం లేదేమిటి చెప్మా! అని ఆ బాబుతోసహా మేమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం మాతే!” అన్నాడు.
“సాక్షాత్తు పైనుండి మన తాతే దిగి వచ్చినా మీ మట్టిబుర్రలకి అర్ధం అయి చావదు మా ఆడవాళ్ళ బాధేంటో. సెల్, లాప్టాప్ కొని ఇచ్చేస్తే చాలదు. వాటివంక చూడటానికి టైం అనేది ఒకటి మిగిల్చాలి. సదా మీ సేవలో హరించుకుపోతున్న నాకు వాటిమీద కూర్చుని స్థిమితంగా పనిచేసే వీలెక్కడ? ఒక పదం టైప్ చేసేసరికి పదిసార్లు పిలుస్తారు. పనంతా చేసేసి దాని మీద కూచున్నా. నేనేదో పెద్ద నేరం చేసినట్లు మీకు ఉపయోగపడవలసిన నా శక్తీ, టైం నేను వృధాగా ఖర్చుపెడుతున్నట్లు నావైపు గుర్రుగా చూస్తారు. మీరు కొంత నయం. నోటితో ఏమీ అనరు. అదే మీ ఆవిడ అనబడే నా పుత్రికారత్నం లక్ష్మి అయితే ‘ఈ వయసులో నీకివన్నీ అవసరమా అమ్మా’ అంటూ ముదరకిస్తుంది” జవాబిచ్చింది సీత.
“…”
“ఏ వయసులో నాకేది అవసరమో నేను తప్ప ఇంటా బయటా అని లేకుండా యావత్ ప్రపంచమూ నిర్ణయిస్తుంది. అదేమిటోగానీ,
‘సొంత మేనత్తకొడుకని ఇచ్చి నా గొంతు కోసారమ్మా! పెళ్ళి తరవాత నన్ను వాళ్ళు చదువుకోవద్దన్నారు‘ అనేడిస్తే… అమ్మా, నాన్నా ‘చాల్లే, ఊరుకో. మేనత్త అయితేమాత్రం అత్తగారు కాదా? వాళ్ళు చెప్పినట్లు విను. వాళ్ళకి తెలుసు నీకేం కావాలో. అయినా
పెళ్ళయిన పిల్లవి సంసారం చేసుకోక దేనికొచ్చిన చదువులు, సాములు? పిచ్చివేషాలు వేయక వాళ్ళు చెప్పినట్లు చెయ్యి అని నా నోరు నొక్కేసారు. ఇదిగో ఇప్పుడీ వయసులో ఆ తరం వెళ్ళింది. కాస్త ఇప్పుడైనా నా మనసుకి నచ్చింది చేదాం అనుకుంటే మీరంతా తయారయ్యారు నాపాలికి. ముందుతరమే కాస్తనయం అనిపించేస్తున్నారు నాయనా- మీరు, మీ అర్ధంలేని పరుగులు, అసలు నేలమీద నిలబడనివ్వని ప్రణాళికలతో. అప్పట్లో ఇంతలా పనికిమాలిన పరుగులు, ఉరకలు ఉండేవి కాదు. వాళ్ళకి ఓ వేళాపాళా తీరూతెన్నూ ఉండేవి భోజనాలకీ, బొట్లకీ. ఇప్పుడిక అలాటివి ఏమీ లేవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పెడితే అలా, ఏది పెడితే అది తినటం. ఇంట్లో వండితే బయట తిని వస్తారు. ఆ వండినవన్నీ ఫ్రిజ్‍లో కుక్కటం. పోనీ బయట తిని వస్తారేమో అంటే రెండుఝాముల వేళ వచ్చి ‘అన్నం పెట్టెయ్‘ అనటం. అప్పటికప్పుడు ఏదో చేసి కంచాల్లో వడ్డించాలి. బొత్తిగా పద్ధతీ, పాడూ లేకుండా తయారవుతున్నారు. ఏమైనా అంటే కోపాలు”
“ఏ కోపం లేదులే. ఈ మాటలన్నీ మాకు అలవాటు అయిపోయాయి. అసలు రోజూ ఇవన్నీ వినకపోతే ఏమిటో చించుకున్నట్లు ఉంటుంది అమ్మామ్మా! అన్నం తిన్నా తిననట్లని పిస్తుంది. కడుపు నిండదు అనుకో” అన్నాడు సింక్ దగ్గర చేయి కడుగుతూ నాని.
“బాగా నేర్చావు మీ అమ్మ డైలాగులు. దానికి అసలు తల్లి అనే జీవికి ఏదైనా ఆలోచన, అవసరం ఉంటాయి అన్న స్పృహే ఉండదు. ఎప్పుడూ తల్లుల కష్టం అర్ధం చేసుకోవడంగానీ, వారిని కాస్త ఊపిరి పీల్చుకోనీయటంగానీ అసలు చేయటంలేదు ఈ తరం కూతుళ్ళు. మీ అమ్మ మరీను. నా జన్మ మొత్తం తనకి, తన సంసారానికే అన్నట్లు మాట్లాడుతుంది ఎప్పుడూ. తాను రిటైర్ అయేవరకూ నేను మరోటి ఆలోచించకూడదట. ఇహ అప్పుడు నాకు ఆలోచించే శక్తీ, ఓపికా ఎక్కడుండి చస్తాయి? హుమ్! నాకోసం నేను బతికిన ఒక్క క్షణం లేకుండానే వాళ్ళు, వీళ్ళు చెప్పినట్లు ఆడటమే ఎప్పుడూ. ఎంతసేపు వాళ్ళ అవసరాలు తప్ప నాకేమి కావలనేది నాటినుండి నేటివరకూ ఒక్కడు ఆలోచించిన పాపాన పోలేదు. పులివేషం వేసేవాడి తోక పట్టుకు గెంతేవాడిలా ఈ ఇంట్లో మనుషుల చిత్తాలకి అనుగుణంగా గెంతటంతోనే సరిపోయింది నాకు బతుకంతా. నా ఆశా, ఆలోచనా ఏమిటనే స్పృహే లేకుండా ఈ బతుకు ఇక ఇలా తెల్లారాల్సిందే” అని వాపోతున్న సీత ధోరణికి బాగా అలవాటుపడ్డారు వాళ్ళు.
సీత తన అసంతృప్తులు ,అత్తవారింట్లో తను పడ్డ పాట్లు రోజూ ఏకరువు పెడుతుంది. అవి లైట్‍గా తీసుకుని జోకులు వేస్తారు తప్ప ఆమె ధోరణి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఏమన్నా వారికి వేరే వెళ్ళి ఉండలేదని వాళ్ళకి తెలుసు. మాట కఠినం అయినా సీత మనసు వెన్న. కుటుంబసభ్యులపట్ల బాధ్యత విస్మరించదు. వాళ్ళమీద ఎంతో ప్రేమ అభిమానం చూపే సీత మనసు వాళ్ళు కంటికి కనబడకపోతే
విలవిలలాడిపోతుంది. తామే ఆమె ప్రపంచం అని వారికీ తెలుసు.
అందికే ఆమె మాటలకి అడ్డుతగులుతూ నాని మధ్యలో అందుకుని, “అయ్యో! సరదాకి అన్నాను. అంతంత మాటలు ఎందుకు అమ్మామ్మా!! డిప్రెస్ అవకు. మా భోజనం అయ్యాక రాసుకుందువులే. నిన్ను డిస్టర్బ్ చేయను. ఒట్టు” అన్నాడు.
మళ్ళీ సీత మొదలుపెట్టింది.
“మరే, డిప్రెషన్ తప్ప మరేముంటుంది నాకు? వేళాపాళా తీరూతెన్నూ లేని మీ నాన్నకూ, నీకూ నన్ను ఆహారంగా పడేసి మీ అమ్మ ఉద్యోగం అంటూ ఉడాయించాకా? కర్ణుడి చావుకి కారణాలనేకం అని నా గజల్ ఫిజిల్ అయిపోవటానికి ఇప్పటి వరకు ఉన్న ఎన్నో కారణాలకు మీ రాక ప్లస్ వన్ అయింది” అంది భారంగా.
‘కుటుంబంకోసం అరిగిపోయి, కరిగిపోయాను. జీవితం నిస్సారంగా, వృధాగా గడిపేసాను‘ అని బాధ పడి ఆ బాధని వొలకబొయ్యని క్షణం ఉండదు. కదిపితే చాలు ఫ్లాష్‍బాక్‍లోకి వెళిపోతుంది. అందులోంచి పైకి లాక్కురావటం మనతరం కాదని తెలిసిన నాని, శేఖర్ మధ్యలోనే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఆమె వాక్ప్రవాహానికి అడ్డువేస్తూ శేఖర్ పాటందుకున్నాడు.
“త్యాగశీలివమ్మా మహిళా
అనురాగశీలివమ్మా
తోటివారికై సకలము
నొదిలిన కరుణామయివమ్మా ” అని .
దానికి నాని వత్తాసుగా-
“తోటివారికై గజలును
విడిచిన ఓ మా అమ్మమ్మా
సాంబారు వేయమ్మా” నవ్వుతూ అన్నం కలుపుతూ నాని గొంతు కలిపాడు.
సాంబార్ నాని కంచంలో పోస్తూ, “ఒరే తమ్మూ! రోజురోజుకీ ఈ నానిగాడి ఆకతాయితనం మరీ పెరిగిపోతోంది. ఇంత వయసు వచ్చి నీకు బుద్ధిలేదు. నిన్ను చూసి వీడు తయారవుతున్నాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? బొత్తిగా స్క్రూ లూజు సన్నాసులు తయారయారు నా ప్రాణానికి” అంది సీత
“ఏది లూజ్ అయినా నువ్వూరుకుంటావా అక్కా? అసలే త్యాగశీల, అనురాగశీల , మరెన్నో రకాల శీలవి. మా శీలలు బిగించటం నీకో లెక్కా మాతే?” శేఖర్ పరిహాసం చేసాడు.
“మీ స్క్రూలు బిగించి మిమ్మల్ని దారిలో పెట్టే శక్తి నాకెక్కడ నాయనా? మీకు తీరు, తెన్ను మాట అలా వుంచి కనీసం వేళకి ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి అనే విషయం నేర్పలేక నా హతమారిపోతోంది. పెందరాడే మీ భోజనాలు అయిపోతే నేను మరో పనిమీద దృష్టిపెట్టగలుస్తానుకదా? పొద్దుటినుండి ఆ గజల్ రాద్దామంటే కుదిరిందే కాదు నాకు” అంది ఆమె ఒకింత అసహనం ధ్వనిస్తున్న గొంతుతో.
“అయితే, ఆకలేస్తోందిగానీ నాకుకూడా మేత పడేసి ఆనక నీ కూత మొదలెట్టు అక్కా!” అన్నాడు శేఖర్ నవ్వుతాలుగా.
“అదే నీ తక్షణ కర్తవ్యం అమ్మామ్మా! ముందు నాన్నకి మేతా, తరవాత నీ కూతా అని ఫిక్స్ అయిపో !! ఓకే! షాట్ రెడీ !! ఏక్షన్ అమ్మామ్మా!” అల్లరిగా అన్నాడు నాని.
“సినిమా డైరెక్టర్‍లా తెగ పోజు కొడుతున్నావుగానీ ఆపు నీ వేళాకోళాలు. అయినా తప్పు నీది కాదు, మీ నాన్నది. వాడు బొత్తిగా నీకు మంచీ చెడూ నేర్పలేదు” అంది సీత.
“నాన్న నాకేం చెప్పినా పోనీలేరా, వాడు చిన్నపిల్లడు, ఎదిగాకా వాడే నేర్చుకుంటాడు… వాడినలా దెబ్బలాడకు అని నువ్వే అంటావు. మళ్ళీ అస్తమానూ చిన్నపిల్లాడినైన నన్ను పట్టుకు నాన్న నేర్పలేదు అని ముదరకిస్తావు. ఇలా అయితే ఎలా అమ్మామ్మా నీతో?” కొంటెగా నవ్వాడు నాని.
“ఎలాకేముంది? ఏదో నా నోరుండబట్టక వాగుతానుకానీ, ఎనుబోతుమీద వాన కురిసినట్లే కదా? ఈ ఇంట్లో మనుషులకి ఎక్కి చావదుగా ఏదీ? నువ్వుగానీ మీ నాన్నకానీ కొంచెమైన వింటారా, పెడతారా? నా గోల నాదే. మీ లీల మీదే”
“నానీ అమ్మమ్మమీద జోకులేయకు” అన్నాడు శేఖర్. “ఏంటక్కా, లీల అంటున్నావు? వీడు ఏమైనా లీలలు మొదలుపెట్టాడా ఏమిటి?” అని సీతని అడిగి, “ఏరా ! ఏమైనా గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారమా?” అని నానికేసి చూసి నవ్వుతూ కన్ను గిలిపాడు.
“సడేలే సంబడం. మీ ఇద్దరితోనే వేగలేక చస్తున్నా, ఇక వీడికో గర్ల్‌ఫ్రెండ్ కూడానా? రేపు వీడికి పెళ్ళి అయితే మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జీవి ఇంట్లో ఓమూల దేవుల్లాడుతూ. మరో నాలుగు కాఫీకప్పులు, తిన్న ప్లేట్లు, అందింపులు నాకు. ఎవరొస్తే ఏమిటి? నా పని నాకు తప్పదు కదా!” సీత శరపరంపర వదిలింది.
“అంతే, తనకున్న పని తినకున్నా తప్పదని నువ్వే కదక్కా చెప్తావు”
“అదే నాయనా నే చేసిన తప్పు. అలా అంటూ రెక్కలు ముక్కలయేలా ఏళ్ల తరబడి మీ అందరికీ అడ్డమైన చాకిరీ చేస్తున్నాను. అది చూసి మీరు అన్ని పనులు నావే అనేసుకుంటూ మీ పనులుకూడా మీరు చేసుకోవటం మానేస్తున్నారు. రేపు నేను పోతే ఏమి చేస్తారోగానీ…” అలా ఆపకుండా సీత ధోరణి కొనసాగుతూనే ఉంది.
శేఖర, నాని భోజనాలు ఆమెను ఆట పట్టిస్తూనే ముగించారు.
ఇది రోజూ జరిగేదే ఆ ఇంట్లో.


శేఖర్ సీత తమ్ముడు. ఇద్దరికీ పదేళ్లు తేడా. కూతురు లక్ష్మిని అతనికిచ్చి పెళ్లి చేసింది.
శేఖర్‍ది హైద్రాబాద్‍లో సొంతవ్యాపారం. లక్ష్మి గవర్నమెంట్ డాక్టర్. బదిలీలు అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏలూరులో పోస్టింగ్. ఒక్కగానొక్క కొడుకునీ సంసారాన్నీ అటూయిటూ తిప్పటం ఇష్టంలేని శేఖర్, లక్ష్మీ సీత అపార్ట్‌మెంట్ పక్క అపార్ట్‌మెంట్ కొనుక్కుని అక్కడే వుంటారు. నాని పెంపకం అంతా సీతే చూసుకుంది. సీతకి భర్త ఫామిలీ పెన్షన్ వస్తుంది. సీత కొడుకు అమెరికా లో ఉంటాడు భార్యా పిల్లలతో.


మర్నాడు ఉదయాన్నే శేఖర్ బయటికి వెళ్ళాడు. నాని బ్రేక్‍ఫాస్ట్‌కోసం డైనింగ్‍టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
మళ్ళీ సీత మొదలు పెట్టింది.
“ఇప్పుడు పది గంటలయింది. ఎప్పటికీ బ్రేక్‍ఫాస్ట్‌కి రారు. వాడెటో పోయాడు. పోనీలే నువ్వయినా దిగబడ్డావు. అదే పదివేలు. ఏ పనీ నేర్చుకోకుండా, ఇల్లు దిద్దుకోకుండా మీరిలా ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులుఅని ఊళ్ళు తిరుగుతూ ఉండండి. నేనిలా సర్వం త్యజించి నిద్రలేచిన దగ్గరినుండి రాత్రి పక్క చేరేవరకూ వంటిల్లు పట్టుకు అనాధికా కృతం ,కృతం అనుకుంటూ అదేదో చందమామ కథలో సగం శవం, సగం మనిషీలా చావూకాక బతుకూకాక వేలుతూ ఉంటాను. ఊహ తెలిసిన దగ్గరినుండి వంటపొయ్యి, ఇంటిచాకిరీ తప్ప మరోటి తెలియదుకదా, నాకు?”
“అబ్బా, అమ్మామ్మా ! మరో కొత్త విషయం ఏమైనా చెబుదూ. ఎన్నాళ్ళు చెప్పినా ఇదే విషయం.”
“ఇంకేం ఉన్నాయి రా నాకు చెప్పటానికి? బావిలో కప్పని.” అంటూ మరో ఇడ్లీ ప్లేట్లో వేసిన సీతతో నాని అనునయంగా..
“అమ్మామ్మా! ఈరోజు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అరచేతిలో ప్రపంచం అందరికీ. ఇక బావిలో కప్పలుగా మిగిలిపోనక్కరలేదు ఎవరూ. అయినా నువ్వు ఇల్లు , ఇంటి మనుషులమీదనుండి నీ దృష్టి మళ్ళించుకోవటం లేదు. నిజానికి అమ్మా, నాన్నా నువు చేయలేవని వంటమనిషిని పెడితే ఆమె చేసే ప్రతిదానికీ వంకలు పెట్టి మాన్పించేస్తాను అంటేనేగా, అమ్మ ఆ వంటావిడని తనతో తీసుకుపోయింది?
ఇక పనిమనిషిని నువ్వు ఏమి అన్నా నెమ్మదస్తురాలు, పైగా అమ్మ భారీగా ఆమెకి అన్నీ ఇస్తుంది, అదీకాక మనతో బాగా అనుబంధం పెంచుకున్న మనిషి కాబట్టి మన ఇల్లు విడిచి వెళ్ళదు. అసలు సమస్య నీలో ఉంది. ఎవరు ఏ పని చేసినా నీకు నచ్చదు. ఆ వంటగదిలో ఎవరినీ ఏదీ ముట్టుకోనియ్యవు. అందికే అందరూ పనిజోలికి రావటం మానేసారు. అంతేతప్ప నీమీద పనిభారం పడేసే ఉద్దేశ్యం లేదు. కొంచెం అర్ధంచేసుకో ప్లీజ్” అన్నాడు.
ఈమధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో ఉండటంతో సీత తీరుతెన్నులు గమనిస్తున్న నాని మరి ఊరుకోలేకనూ, అమ్మమ్మ దగ్గర తనకున్న చనువువల్లనూ ఈ ధోరణికి ఫుల్‍స్టాప్ పెట్టాలని కృతనిశ్చయంతో వున్నాడు.
“బావుందిరా! పని చేస్తే వద్దు అంటున్నానా, పని సరిగా చేయకపోతే వద్దు అంటున్నానా? చూసి మాట్లాడు” అంది సీత చిరాగ్గా.
“అంటే నీకుతప్ప ఇంట్లో ఇంకెవరికీ ఏ పనీ సరిగా చేయటంరాదంటావు. చేసే అవకాశం ఇయ్యవు. ఏది చేసినా విమర్శిస్తావు. ఎలా చేయాలో, ఏమి చేయాలో స్పష్టంగా చెప్పవు. నీ మనసులో ఉన్నది గ్రహించి మేము చేసీలేము కదా? అదేమీ నీకు పట్టదు. ఊరికే మమ్మల్ని అనటం నీకు అలవాటు అయిపోయింది. ఏదో కోల్పోయాననే భావనతో నీమీద నువ్వే జాలిపడిపోవటం తప్ప రెండోవిషయం నీ బుర్రకి పట్టదు. అస్తమానూ ఇల్లు పుస్తి అయిపోయింది, గానుగెద్దు జీవితం, వంట పొయ్యిలో పాతేసారంటావు. గతంలో నీ పరిస్థితి అదేమో! నేను పుట్టలేదు.చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అదికాదు. నువ్వు గమనించటం లేదు. కోపం తెచ్చుకోకు. మొన్న పై ఫ్లోర్ ఆంటీ నిన్ను రెండురోజులు వాళ్ళతో వాళ్ళమ్మాయి పెళ్ళికి రమ్మంటే –
అబ్బే ఇల్లు వదిలి రాలేనన్నావు. ఇల్లు వదిలి వెళితే ఏమయిపోతుంది? నీకు ఈ పనులు కాస్త తప్పి వేరే ప్రపంచం చూసే వీలు దొరుకుతుంది. డాడీ వెళ్ళమన్నా ససేమిరా అన్నావు. ఇల్లు వదిలి ఒక్కపూట కూడా ఎటూ వెళ్ళనని నువ్వే అంటావు. ఎవడో నన్ను ఇంటికి కట్టి పడేసాడు అని ఊదరగొడతావు. అసలు నిన్నెవడూ కట్టెయ్యలేదు అమ్మామ్మా! నిన్ను నువ్వే కట్టేసు కుంటున్నావు. నిన్ను ఎవరు ఇవన్నీ చేయమన్నారో ఆలోచించు. ఈ వయసులో ఇంత పని చేస్తూ హైరానాపడుతున్నావనే వంటమనిషినీ పెట్టారు అమ్మా, నాన్నా. కానీ నువ్వు ఆమెని మాన్పించేవరకూ గొడవపెట్టావు. పనివాళ్ళు ఓ డెబ్భయ్ శాతం పనిచేస్తారు. ఆ మిగిలిన ముప్పయి శాతం మనం చేసుకుంటే సరిపోతుంది కదా? వాళ్ళతో ఘర్షణలు పడితే వాళ్ళు వుండరు. మనం చేసుకోలేనపుడు సర్దుబాటు చేసుకుని వాళ్ళతో పని చేయించుకోవటం అనేది అవసరం. నీకా చాకచక్యం, ఆలోచనా లేవు. అందికే నువు ఇబ్బందిపడుతూ, అమ్మనీ నాన్ననీ ఇబ్బందిపెడుతున్నావు. ఈ వయసులో నువ్వు అన్నిపనులూ చేస్తుంటే నిజానికి అమ్మా, నాన్నా చాలా బాధపడుతున్నారు. నీకు చెబితే బాధ పడతావని అన్నీ నీ ఇష్టానికి వదిలేస్తారు వాళ్ళు.
నీ వయసురీత్యా, నీకున్న ఆరోగ్యసమస్యలవలన నువ్వు వెనకటిలా అన్నీ చురుకుగా చేసేయలేవు ఇక. కాస్త అర్ధం చేసుకో. మళ్ళీ చెబుతున్నాను అమ్మామ్మా ! అక్కరలేని బంధాలు, బాధ్యతలు, ఆందోళనలు ఇక నువ్వు వదిలేసి అమ్మానాన్నలకి సహకరించు. ముఖ్యంగా పనివాళ్ళ విషయంలో కొంచెం సౌమ్యంగా, తెలివిగా వ్యవహరించు. అప్పుడు నీమీద పనిభారం తగ్గి నీకు నువు చేసుకోవాలి అనుకునేవాటికి సమయం దొరుకుతుంది” అని కొంచెం కఠినంగానే చెప్పి బ్రేకఫాస్ట్ పూర్తి కావటంతో చెయ్యికడుక్కొని వెళిపోయాడు నాని.
అసలే షుగర్ ,బీపీ, కీళ్ళనొప్పులవలన ఈమధ్య మరీ చేయలేనితనం, నిస్త్రాణ ఎక్కువ అయిపోతున్న సీత, శేఖర్ కూడా ఎప్పుడూ మాట్లాడనివిధంగా తన కళ్ళముందు పుట్టి పెరిగిన మనవడు అంత నిష్కర్ష గా చెప్పిన మాటలకి ఆలోచనలో పడింది.
రాత్రి భోజనాల దగ్గర శేఖర్‍తో “ఆ వంటమనిషికి చెప్పి పంపమని లక్ష్మికి ఫోన్ చేయరా తమ్మూ!” అంది.
“ఆమె వంట బాగా చెయ్యదన్నావుగా!” అన్నాడు శేఖర్.
“పరవాలేదులే, సర్దుకుంటాను. మన పద్ధతులు తనకి నిదానంగా నేర్పుతాను” అన్న సీతని ఆశ్చర్యంగా చూస్తూ “అలాగే చెబుతాను” అన్నాడు.