చదువుకుంటూనో, మాట్లాడుకుంటూనో, పాటలు పాడుతూనో, వింటూనో, చుట్టూ జరుగుతున్నవి చూస్తూనో బిజీగా వుంటున్నాము. మా నలుగుర్లో నా ఒక్కదానికే తేలుగు రాయటం వచ్చు. అందుకని డైరీ తెలుగులోనే రాయలనుకున్నాను. ఆ పని మొదలుపెట్టాను. ఇక్కడ ఒక స్వార్థం కూడా ఉంది. మేము వెళ్ళచోట వీలైనంతగా తెలుగునే ప్రాచుర్యంలోకి తేవాలని… ఎందుకంటే మేము నలుగురం తెలుగువాళ్ళం కాబట్టి. వాళ్ళూ వప్పుకున్నారు. ఓ కొత్త ఆవిష్కరణ చేయబొతున్న వుద్విగ్నత మాలో నిండి, కొత్త వుత్సాహంకూడా వచ్చింది. మిగతా ముగ్గురూ కూడా తెలుగు రాయడం నేర్చుకుంటున్నారు. ఇదొక కొత్త జీవనసరళి, మాకు మేమే సృష్టించుకున్నది. అనివార్యంగా ఒదిగిపోవాలి.
మాకు వేర్వేరు పడక గదులు ఉన్నాయి. అయితే ఆరుగంటలపాటు ఒకరు కచ్చితంగా కంట్రోల్ ముందు ఉండాలన్న నిబంధనచేత నేనూ హర్షా ఇద్దరం బెడ్రూంలో ఉంటే అవంతి గౌతమ్‍లలో ఒక్కరే వాళ్ళ బెడ్రూమ్లో ఉండేవారు. మరోసారి మా విషయంలో ఇలా జరిగేది. వాళ్లు విడిగా ఉన్నప్పుడు హర్షతో
సన్నిహితంగా ఉండటం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసినప్పుడు అలా భావరహితంగా ఉండటం దుస్సాధ్యం. కానీ అవంతీ గౌతమ్ అలా ఫీలయ్యేవారు కాదు. ఏకాంతంకోసం ఎదురుచూసేవారు.
మనుషుల్లో భిన్న మనస్తత్వాలంటే ఇదేనేమో! క్రమంగా నేనూ అలవాటుపడ్డాను. అందులోని భౌతికమైన సుఖంకంటే ఒకరికి ఒకరు ఉన్నామన్న భావన సౌఖ్యాన్నిచ్చేది. ఆత్మస్థైర్యాన్నిచ్చేది. అలాంటి ఆలోచన నాలో కలిగాక నేను అవంతి, గౌతమ్‍లని సులువుగానే అర్ధం చేసుకున్నాను.
“ఈ టాబ్లెట్స్ వేసుకో. మానకు” అని అవంతి నాకు కొన్ని పిల్స్ ఇచ్చింది. అవేంటో నేను అడిగేలోగా తనే అంది, “తాదూర సందులేదు, మెడకో డోలు అన్నట్టు మన ప్రయోగాలు ఒక కొలిక్కి రాకుండా అప్పుడే పిల్లలు ఎందుకు? ఇందులోనే మనం చచ్చిపోయే విషయమైతే మనతో వాళ్ళూ ఎందుకు?” అని.
ఇది మాకు మేమే నిర్ణయించుకునే విషయం కాదు. అందుకే నేను సందిగ్ధంలోపడ్డాను. మామధ్య ఏదో జరుగుతోందని గ్రహించిన గౌతమ్ వచ్చాడు మా దగ్గరికి. మా సంభాషణ తెలుసుకుని ట్యాబ్లెట్లు వాడొద్దన్నాడు.
“మన ప్రయోగాలు మనతో ఆగిపోకూడదు. చివరిదాకా కొనసాగి, ఒక ఫలితం రాకపోతే పడిన శ్రమంతా వృధా అవుతుంది” అన్నాడు.
“మేము మానసికంగా సిద్ధపడాలి” అంది అవంతి.
నాకెందుకో నేను ప్రయోగశాలలో వినియోగించుకోబడే గినీపిగ్‍లాగానో, తెల్లఎలుకలాగానో అనిపించాను. బహుశా వాటికి కూడా వాటి ఆలోచనా పరిధిలో ఒక వ్యక్తిగతగౌరవం ఉండే ఉంటుంది. వాటిని ప్రయోగాల పేరుతో ఎంత కించపరుస్తాం? అలాంటిది నా అనుభవంలోకి వచ్చిందనిపించింది. ఏదో ఒక చిన్నపాటి అసహనం. నా సబ్జెక్టు స్పేస్‍సైన్స్, జీవసంబంధమైన విషయాలను మెదడుతో కాకుండా మనసుతో విశ్లేషిస్తాను. అవంతిది బయాలజీ. తన అప్రోచి వేరేగా ఉంటుంది.
సున్నితత్వాన్ని వదిలేసి మేము కూడా ఆ ఇద్దరు మగవాళ్ళలాగే ఆలోచించే ప్రక్రియ మొదలయింది.
ఇది ఒక సమాజానికి ప్రారంభదశ అనే విషయం కూడా అర్థమైంది. అవంతి అన్నట్టు మనసు ఇష్టపడటానికి కొంత వ్యవధి తీసుకున్నాను.
రోజులు గడిచిపోతున్నాయి. ఏ మార్పూ లేదు. భూమ్మీంచి ఎలాంటి మెసేజులూ రావడం లేదు. మేం పంపినవి అక్కడికి చేరటం లేదు. చాలా దూరం వచ్చేసాము.
హర్షకి రెండురోజులు జ్వరం వచ్చింది.
“ఈ షిప్ పూర్తిగా ఇన్సులేటెడ్. ఎలాంటి వైరస్ రావడానికి అవకాశం లేదు. ఎలా జరిగిందబ్బా?” అని ఆలోచించింది అవంతి.
ఏవో మందులు ఇచ్చింది. అతను సర్దుకున్నాడు. ఈ రెండురోజులు నేను హర్షని చూసుకుంటుంటే వాళ్ళిద్దరూ కంట్రోల్స్ చూసుకున్నారు. నిజానికి కంట్రోల్ చేయడం అంటూ ఏమీ ఉండదు. షిప్ తనంతట తాను దూసుకుంటూ వెళ్ళిపోతుంది. తోకచుక్కలు, గ్రహశకలాలవంటివి తాకకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు డైరెక్షన్ మార్చాలి. అది చాలా రిస్కుతో కూడుకున్నది. ఏమాత్రం తేడా వచ్చినా షిప్ పేలిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా నావిగేట్ చేయాలి.
“నాకేమైనా అవుతుందని చాలా భయపడ్డాను మీరా!” అన్నాడు హర్ష. “ఎలాంటి ఇన్సెస్ట్‌కీ అవకాశం లేని, ఎలాంటి అనైతికతకు చోటివ్వని ఆరోగ్యకరమైన సమాజానికి మనం ఆద్యులం కావాలన్నది నా ఆకాంక్ష” తన మనసులోని బాధ చెప్పాడు.
“నువ్వన్నట్టే జరగాలని కోరుకుందాం” అన్నాను. నాకు ఆ విషయంలో ఇంకా లోతుగా ఆలోచించటం ఇష్టం లేదు. అతనికి ఏదైనా జరిగితే ఏం చెయ్యాలో ఆ క్షణాన్నే నిర్ణయించుకున్నాను. అవంతితో కూడా నా నిర్ణయాన్ని చెప్పాను. ఆలోచించింది. నమ్మిన విలువకన్నా ఏదీ ఎక్కువ కాదు.
హర్ష జ్వరం తగ్గి, మళ్లీ కంట్రోల్ ముందు కూర్చున్నాక జరిగిన మొదటి సంఘటన. ఎందుకో స్పేస్‍షిప్ ఒడిదుడుకులుగా ఉంది. ఊరికే కుదుపులకి గురవుతోంది. ఎందుకు ఇలా? అందరిలో ఆందోళన మొదలైంది. ఆస్థాయిడ్ జోన్లోకి ప్రవేశిస్తున్నామా? బ్లాక్‍హోల్ మా షిప్‍ని ఆకర్షిస్తోందా? ఏమీ అర్థంకానంతగా కుదుపులు. భూమికి లక్షల మైళ్ళదూరాన వున్నాము. ఇక్కడ మా ప్రాణాలు అర్థాంతరంగా పోబోతున్నాయా? ఏమీ అర్థం కావటం లేదు. ఇంతలో తృటిలో జరిగిపోయింది ఆ సంఘటన. ఒక బంతిని బలంగా విసిరేసినట్టు మా షిప్ అంత దూరానికి వెళ్ళిపోయింది. మేము ప్రయాణించిన దూరం
ఇంతకు ముందు చూసినదానికి ఎన్నోరెట్లు ఎక్కువ ఉంది. అంతరిక్ష అద్భుతం అని భూమిమీద ఉన్నప్పుడు దేనినైతే అన్నానో అది జరిగింది. రెండు తలాలు కలుసుకుని విడిపోయేచోట ఒక తలంనుంచి మా పిప్ మరోతలం మీదకి రెండు బిందువుల మధ్య కనిష్ట దూరం సిద్ధాంతం ప్రకారం చేరుకుంది. తలాలు విడిపోయినప్పుడు అంటే కొన్ని కోట్ల మైళ్ళు తృటిలో దాటేసాము. చదువుకున్న సైన్సు సిద్ధాంతాలు వాస్తవంలో జరిగటం చాలా వింతగా అనిపించింది నాకు.
అయితే దీనికి ఒక ప్రయోజనం ఉంటుందని ఆ క్షణాన అనుకోలేదు.
అంతలోపే మరో ప్రమాదం… ఎవరో బలంగా గుంజుతున్నట్టు కింది దిశగా వేగంగా వెళ్ళిపోతోంది. క్షణక్షణానికీ వేగం పెరిగిపోతుంది. నా మనసు ప్రమాదాన్ని శంకించింది.
“హర్షా! ఏం జరుగుతోంది?” అని నేనంటునే ఉన్నాను.
అతను, ““మైగాడ్! ఏదో గ్రహపు గురుత్వాకర్షణ మనని లాక్కుంటోంది. గౌతమ్… వ్యవధి లేదు. ముందు మనం బరువు తగ్గించుకోవాలి. క్యాబిన్సన్నీటినీ రిలీజ్ చేసెయ్! మీరా, నీకు ప్రొఫెసర్ మిత్ర ఇచ్చిన చిప్ నీ దగ్గరే ఉంచుకో… నువ్వు రాస్తున్న డైరీ ఇంకా ముఖ్యమైనవని నీ పర్సన్‍మీద ఉంచుకో… అవంతీ! పారాచూట్లు తీసి వుంచు…” అని అతను చకచకా డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇలా జరుగుతాయని ముందే మాకు ట్రైనింగ్‍లో చెప్పినప్పటికీ ఇలాంటప్పుడు ఎలా స్పందించాలో శిక్షణ ఇచ్చినప్పటికీ ఇంత తొందరగా జరుగుతుందని ఊహించలేదేమో, కొద్దిగా తడబాటు.
నేను తీసుకోవాల్సిన వస్తువులన్నీ తీసి నా ఒంటికి బెల్టులతో బిగించుకున్నాను. మాకు బెడ్రూమ్స్‌గాను, లివింగ్‍రూమ్‍గాను బిగించబడిన క్యాబిన్లని గౌతమ్ విడగొడుతుంటే నేనూ సహాయపడసాగాను. ఒక్కొక్కటే అంతరిక్షంలో జెట్టిసన్ చేస్తూ క్రమంగా దూరమవుతున్నాయి. మా షిప్ వేగం పెరుగుతుండడంతో మేము చాలా త్వరత్వరగా చేయాల్సివచ్చింది.
“గౌతమ్, అటుచూడు… నీలంగా… అచ్చు భూమిలాగే…” ఇంతలో అవంతి విభ్రాంతిగా అరిచింది.
ఇద్దరం తలతిప్పి చూశాము. ఆ గ్రహానికి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం.
“మైగాడ్! ఈ గ్రహం మనని ఆకర్షిస్తోంది. ఎలా? ఇక్కడ వాతావరణం కూడా ఉన్నట్టుంది. అదుగో… నిప్పురవ్వలు కనిపిస్తున్నాయి. టైమ్ లేదు” హర్ష కంట్రోల్‍ని వదిలేసి లోపలికి వచ్చాడు. ఇప్పటిదాకా స్పేస్‍షిప్‍గా ఉన్నదాన్ని కూడా రిలీజ్ చేసేసారు. ఇప్పుడు మేము చిన్న గ్లోబ్‍లాంటి దానిలో ఉన్నాము. దానికి వింగ్స్ ఉన్నాయి. అవి లోపలికి ముడుచుకుని ఉంటాయి. వాటిని తెరవగానే అది హెలికాప్టర్లా పనిచేస్తుంది. అయితే ఇది నడవడానికి ఇంధనం కావాలి. హర్ష, గౌతమ్ ఎంత సమన్వయంతో పనిచేశారంటే అక్కడ స్పేస్‍షిప్ భాగాన్ని వదిలేయటం ఇక్కడ హెలికాప్టర్ మొదలవటం ఒకేసారి జరిగిపోయాయి.
మేము వాతావరణంలోకి ప్రవేశించడం, మాతోపాటు గ్లోబుని వదిలేసి వి-ఆకారాన్ని మాత్రమే మిగుల్చుకున్న స్పేస్‍షిప్ గాల్లో పేలిపోవటం త్వరతరగా జరిగిపోయాయి. అది పేలి వుండకపోతే మొత్తం అంతా కలిసి ఒక ఫ్లయింగ్ సాసర్‍లా మారిపోయేది. అందులోని టెక్నాలజీ మాకు చాలా ఉపయోగపడేది. అలాంటి వ్యవధి లేకపోవడంచేత వదిలేయక తప్పలేదు. ఆ కింద సముద్రం ఉండటంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం. ఈ సంఘటన మేం వెళ్తున్న గ్రహంమీద అపారమైన సంచలనం సృష్టిస్తుండవచ్చు.
మమ్మల్ని ఆకర్షిస్తున్న గ్రహానికి మేము బాగా దగ్గరగా వచ్చేసాం. మా వేగం కూడా బాగా కంట్రోలై హెలికాప్టర్ మా స్వాధీనంలోకి వచ్చేసింది. కింద ఆకుపచ్చగా నీలంగా రెండిటి సమ్మిళితంగా కనిపిస్తోంది. సముద్రాలు… అడవులు… మాలో ఆశ్చర్యం. భూమ్మీదికి తిరిగి వచ్చేసామా? అక్కడ అడవులు ఎక్కడ మిగిలాయి? మడఅడవులు సైతం కబ్జా చేయబడ్డాయి. అలా అనుకున్న వెంటనే నిస్పృహ. ఏరియల్ సర్వే చేశాం. నా దగ్గరున్న రాడార్ అనుసంధానిత చిన్నపరికరం సహాయంతో మ్యాపులు గీశాను. అవంతి దగ్గరున్న మరో పరికరం వాతావరణంలోని గాలిని పరీక్షించి దాని కంపోజిషన్లు చెబుతోంది. అంతా ఇంచుమించు భూమ్మీద ఉన్నట్టే ఉంది, స్వల్పమైన తేడాలతో. ఎంత కిందికి వచ్చినా ఇళ్ళు, నివాసాలు కనిపించట్లేదు. కానీ పక్షులు ఉన్నాయి. అవి చాలా పెద్దవి. మా హెలికాప్టర్‍మీదికి దాడికి వస్తున్నాయి. వాటిని తప్పించుకోవటం చాలా కష్టమవుతోంది. అడవులు చాలా ఎత్తుగా ఉన్నాయి. క్రమంగా చీకటి పడుతోంది.
విభ్రాంతికరమైన రెండు వాస్తవాలు. ఈ గ్రహానికి రెండు చందమామలు. ఒకటి దగ్గరగా. ఇంకొకటి కొంచెం దూరంగా. రెండు వరుసల్లో పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తూ.ఈ రెండు చందమామలకీఈరోజే పౌర్ణమికాబోలు,పూర్ణాకృతిలో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. చీకటి విడిపోయి పగల్లాగే అనిపిస్తోంది. ఒకేసారి రెండు పౌర్ణములు కావడాన్ని సముద్రం విశృంఖలంగా ఎగిసిపడుతోంది. మా హెలికాప్టర్ని తాకుతాయన్నంత పైకి ఎగిసిపడుతున్నాయి కెరటాలు. అల్లంత దూరంగా నీలంగా మెరుస్తూ ఒక నక్షత్రం, అది భూమి. నా మాతృగ్రహం అని గ్రహించాను. ఒకనాడు అక్కడికి కనిపించినప్పుడు ఈ గ్రహం అలానే కనిపించిందట. అటు చూడగానే ఏదో విషాదం నా గుండెల్లో నిండింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.