నీలినక్షత్రం 10 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

జనావాసాలకోసం, ఏరోడ్రోమ్స్ కోసం వెతికాము. ఎక్కడా అలాంటివి కనిపించలేదు. చాలాసేపటిదాకా తిరుగుతునే వున్నాము. అందర్లోనూ తికమక. నీళ్ళు, చెట్లు, ఆక్సిజెన్ వున్న ఈ గ్రహమ్మీద మనుషులు లేరా?
“ఫ్యూయెల్ ఐపోతోంది. సేఫ్‍లాండింగ్‍కి ఇక్కడెక్కడా వీలుగా లేదు. పారాచూట్స్‌తో దూకెయ్యటమే” అన్నాడు హర్ష. అలాగే చేసాం. సముద్రం వొడ్డుని దిగాం. హెలికాప్టర్ ఒకచోట కూలి పేలిపోయింది. ఆ మంటకీ, శబ్దానికీ జంతువులు విహ్వలంగా పరిగెట్టాయి. అది కొద్దిసేపుమాత్రమే కనిపించిన దృశ్యం. తర్వాత చిత్రకారుడు తుడిచేసిన కాన్వాస్‍లా మారిపోయింది. ఒక్క జంతువుకూడా మళ్ళీ కనిపించలేదు.
సముద్రం చాలా విలయంగా ఉంది. పెద్దపెద్ద కెరటాలు. అడవులు బాగా విస్తరించి ఉన్నాయి. అక్కడ జంతువులు ఏమున్నాయో తెలియడం లేదు. మొసలి అంత పెద్ద జంతువు కళేబరం సముద్రపు ఒడ్డున కనిపించింది. అలాంటి జంతువులు ఉన్నాయని అర్ధం అయింది. పైన పక్షులు తిరుగుతున్నాయి. అవన్నీ వయొలెంట్‍గానే ఉన్నాయని నాకనిపించింది. ప్రాణులన్నీ మా రాక తెలుసుకుని దాక్కుని అవకాశం చూసుకుని ఒక్కసారి దాడి చేస్తాయేమోనన్న అంతర్గత భావన భయాన్ని కలిగిస్తోంది. నాలాగే మిగతావాళ్లు కూడా ఆలోచిస్తున్నారు. అది ఊహే అయినా మా ప్రయత్నాలన్నీ ఆ ఊహకి అనుగుణంగానే సాగాయి.
“స్పిరులినా… ఈ గ్రహం మంచుయుగలాంటి దేంట్లోంచో బయటపడ్డట్టుంది” ఒక మొక్కనీ, అక్కడి నాచునీ, పైనున్న పక్షులనీ చూసి అంది అవంతి, “ఇలా ఓపెన్లో ఉండటం అంత మంచిది కాదు. ఇక్కడ యే జంతువులు తిరుగుతున్నాయో తెలీదు” అంది.
నడవటం ప్రారంభించాం. కొంతదూరంలో ఒక కొండ కనిపించింది. దాన్ని గమ్యంగా పెట్టుకుని నడవడం ప్రారంభించాము. కొండ మొదట్లోనే పెద్ద గుహ ఉంది. అందులో జంతువులు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. గౌతమ్, హర్ష కొన్ని కర్రముక్కలని పోగుచేశారు. హర్ష తన దగ్గరున్న లైటరు తీశాడు. గుహ మొదట్లో పొగపెడితే అందులో ఏదైనా జంతువు ఉంటే ఇవతలికి వచ్చేస్తుందనీ అలా గుహ ఖాళీ అయితే అందులో మేము తాత్కాలికంగా ఉండవచ్చని ఆలోచన.
పొగ పెట్టి మేము దూరంగా దాక్కున్నాము. కాసేపటికి ఒక పెద్దబల్లి… డైనోసర్ కాదుగానీ దాదాపు మీటరు పొడవు ఉంది, అందులో నుంచి వచ్చింది. ఇంకాసేపు అక్కడే దాక్కుని ఉన్నాం. ఇంకే ప్రాణులూ రాలేదు. తన దగ్గరున్న చిన్న టార్చిలైట్ గుహలోపలికి ఫోకస్ చేసి చూశాడు గౌతమ్. గుహ ఖాళీగానే ఉందని నిర్ధారించాడు. లోపలిదాకా వెళ్ళొచ్చాడు.
“డబుల్ బెడ్రూం ఫ్లాట్ బాగానే ఉంది. పరవాలేదు” అన్నాడు. అలాంటి సందర్భంలో కూడా జోక్స్ వేయడం అతనికే తగింది. ఇద్దరు మగవాళ్ళూ కలిసి లోపలంతా శుభ్రం చేశారు. చెత్తంతా పోగుచేసి అక్కడక్కడ పొగ పెట్టారు. “ఏం చేయాలో తేలేదాకా మన మకాం ఇక్కడే” అన్నాడు హర్ష.
“అసలు మనం ఇక్కడ ఏం చేయాలి?!” అయోమయంగా అడిగింది అవంతి.
“అది ఆలోచించుకోవడానికి చాలా టైం ఉంది” అన్నాడు గౌతమ్.
మేము అప్పుడే గుహలోకి వెళ్లద్దని నిర్ధారించుకున్నాం. లోపల పురుగు పుట్ర ఉంటే అవి కూడా పొగకి ఇవతలకి వచ్చేస్తాయని ఆగాము. చుట్టూ సర్వే చేసి రావాలని బయలుదేరాం. పారాచుట్స్ అక్కడే గుర్తుగా ఒక చెట్టు తొర్ర అనుకుని పెట్టుకున్నాం. అది మామూలు తొర్ర అనుకున్నాంగానీ ఊబి చుట్టూ పెరిగిన చెట్టు, లోపలికి లాక్కుంది. ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నాం. నా దగ్గర ఇంకా ఆకలిదప్పులు నివారించే కొన్ని క్యాప్స్యూల్స్ ఉన్నాయి. అవి అయిపోయేదాకా వాటిమీదే ఆధారపడాలని నిర్ణయించుకున్నాం.
గుహ చుట్టూ తిరిగి చూస్తే వెనకవైపునుంచి బయటికి వస్తామని అర్ధమైంది. ఆకలిదప్పులు లేవు. కాబట్టి అలసిపోయేదాకా నడిదాం. అంతా గుహ చుట్టూనే. పక్షులన్నీ రాక్షసి సైజులో ఉన్నాయి. వాతావరణంలో కాలుష్యం లేదు, పుష్టిగా తిండి దొరుకుతుంది కాబట్టి అలా ఉన్నాయనుకున్నాను. నా ఆలోచన చెప్తే అవంతి నవ్వింది. తను చాలా సుదీర్ఘమైన ఆలోచనలో ఉంది.
“మన గ్రహంలాగే ఇక్కడా ఉంది. వాతావరణంలో అవే మూలకాలున్నాయి. మనిషికి అనువైన వాతావరణమే. కానీ ఎక్కడా మనుషులుగానీ ఇల్లుగానీ లేవంటే ప్రోటోజోవా.. కార్డేటా… రెప్టైల్స్… పక్షులు… ఇంకా మానవదశకి చేరటానికి చాలాకాలం పడుతుందేమో!” నెమ్మదిగా అంది. అప్పటిదాకా తను మాకు వట్టి కబుర్లపోగులాగో, గౌతమ్ బహిప్రాణంగానో, హర్షతో తగవుపడే అమాయకపు అమ్మాయిగానో అనిపించింది. హర్షకి జ్వరం వస్తే వైద్యం చేసి నాకు కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇచ్చిన ఒక మామూలు డాక్టర్లా కూడా అనిపించింది. ఇప్పుడు ఆమెకుగల విద్వత్తు అపారంగా తోస్తోంది.
మొక్కని చూడగానే దాని లక్షణాలు చెబుతోంది. ఏది తినవచ్చో, తినకూడదో చెస్తోంది. తను మాతో ఉండడం మాకు పెద్ద ఎసెట్. ఆవెంటనే మిత్రాగారి దూరాలోచన విభ్రాంతికరంగా అనిపించింది. భూమ్మీదికి మెసేజ్‍లాంటిది ఏదైనా పంపాలన్నా మా దగ్గర ఇప్పుడు ఎలాంటి అవకాశం లేదు. కానీ విషయం తెలిస్తే ఆయన ఎంత సంతోషిస్తారో అనిపించింది.
సాయంకాలం దాకా తిరిగాము. గృహప్రవేశం ఇవాళే వద్దన్నాడు గౌతమ్. ఎండిన పుల్లలను పోగేసుకుని గుహ ముందు మంట పెట్టుకుని కూర్చున్నాము. ఆకాశంలో రెండు చందమాములు ప్రత్యక్షం. ఇది ఒక వింతైన అనుభవం. నాకు చాలా ఫ్యాసినేటింగ్‍గా ఉంది, కొన్ని జంతువులు మంటని చూసి వెళ్లిపోతున్నాయి. అవే ఇంపల్సెస్.
హర్షకూడా అవంతిలాగే తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు.
“అవంతీ! ఇందాకటి నీ ప్రశ్నకు జవాబు. నువ్వు చెప్పినదానిప్రకారం ఈ గ్రహంమీద మనమే మొదటి మనుషులం. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఉన్నా వాళ్ళది ఆటవిక దశ. మనం నాగరికులం. చదువుకున్న వాళ్ళం. ఇక్కడినుంచి తిరిగి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే ఉండక తప్పదు మనకి. ఎలాంటి బళ్ళు, వాహనాలు లేవు. ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేము. నలుగురం ఇక్కడే ఉండాలి. కలిసి చేయాలి ఏది చేసినా. ఇక్కడినుంచే మన సంస్కృతి, నాగరికత విస్తరించాలి” అన్నాడు చాలా గంభీరంగా,
అతనలా అంటుంటే భయంగా అనిపించింది. మోయలేని బరువులు భుజాలమీద వేళ్ళాడుతున్నట్టు కనిపించింది. ఒంటరితనం నా అణువణువునా నిండిపోయి, హర్ష చేతిని గట్టిగా పట్టుకున్నాను.
“ప్రొఫెసర్ మిత్రా మననుంచి ఆశించినదీ, మనం చేయగలిగినదీ ఇదే. ప్లీజ్, ఈ వాస్తవాన్ని గుర్తించండి” అన్నాడు నన్నూ, అవంతినీ ఉద్దేశించి.
ఆ రాత్రి ఎవరం నిద్రపోలేదు. గుహ ముందు మంట పెట్టుకుని కూర్చున్నాము. ఏవో ఆలోచనలు… ఏవో ఊహలు… వాస్తవాన్ని గుర్తించి మార్పుని స్వీకరించే ప్రయత్నాలు… మరుసటిరోజునుంచే మా కొత్తజీవితం ప్రారంభమైంది.
మేముంటున్న ప్రాంతానికి హైదరాబాద్ అని పేరు పెట్టుకున్నాం. మేము దిగిన గ్రహంపేరు భూమి అనుకున్నాం. ఇది మేము వదిలి వచ్చిన సౌరకుటుంబంలోని మూడోగ్రహం కాదు. హెలికాప్టర్లో ఉన్నప్పుడు గీసిన మ్యాపులు తీసి వాటిల్లో ఉన్న ప్రదేశాలకి, సముద్రాలకి, నదులకి, అడవులకి భూమ్మీద పేర్లే పెట్టాము. అలాగైతే భూమ్మీద ఉన్నట్టే ఉంటుందని హర్ష సూచన.


మా కొత్త జీవితం మొదలైంది. మానవ సమాజం విస్తరణ గురించి, మనిషి యొక్క నాగరికత ప్రస్థానం గురించి భూమ్మీద మాకు చెప్పిన పాఠాలు ఎంతవరకు నిజమో నాకు తెలీదుగానీ ఇక్కడి ప్రాక్టికల్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అదే అంటే, “ఇప్పుడు కాదు. మన తర్వాతి తరాల్లో అవి నిజమవుతాయి” అన్నాడు హర్ష.
కానీ అతని మాటలు నిజమనిపించలేదు. అవంతి కూడా ఒప్పుకోలేదు. “భూమిమీద నాగరికత మొదలైన క్రమం వేరు, ఏనిమేలియా
కింగ్‍డమ్‍కి చెందిన హోమో ఎరెక్టస్ ఏప్ హోమో సేపియన్‍కి దారిచ్చి పాతరాతియుగాన్నీ, కొత్త రాతియుగాన్నీ, లోహయుగాన్నీ దాటుకుని ఆధునికతని చేరుకున్నాడు. అందుకు అతనెంతో శ్రమ పడవలసి వచ్చింది. కానీ మనం పరిపూర్ణమైన మనుషులం. మేధోపరంగా ఎంతో ఎదిగి ఉన్నాం. ఇవల్యూషన్‍పరంగా దాదాపు అన్ని దశలు దాటాము. ఇప్పుడు మనకి లేనిదల్లా పరికరాలు. వాటిని మనం సృష్టించుకోగలిగితే కనీసం గత ఒకటి రెండు శతాబ్దాల క్రితం మనుషుల్లాగానైనా ఉండగలుగుతాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళటం ఎంతలో జరుగుతుంది? అదంతా ఒక పారిశ్రామిక విప్లవం జరిగినట్టు జరుగుతుంది” అంది. ఆ మాటలు ఆ క్షణాన ఆశాజనకంగా అనిపించాయి.
చేయడానికి ఏమీ కనిపించక చాలా రొటీన్‍గా గడిచిపోతోంది జీవితం. కొన్ని జంతువులని చూసాము. అడవి కుక్కలు, అడవిలో విశృంఖలంగా తిరిగే ఆవులు, తోడేళ్లు, పులులు, అక్కడ భూమ్మీద ఉన్నట్టే ఉన్నాయి కొద్ది మార్పులతో. సౌరకుటుంబపు భూమిమీదికన్నా వెనుక దశలు. అయితే మచ్చిక అలవాటు లేక అక్కడ సాధువులుగా కనిపించే జంతువులు కూడా ఇక్కడ క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. ఒక కుక్క మాకు అతికష్టమ్మీద మచ్చిక అయింది. మాకు రక్షణగా ఉండటం మొదలుపెట్టింది. దాన్ని చూసి ఇంకొన్ని కుక్కలు కూడా మా గుంపులో చేరాయి.