నీలినక్షత్రం – 12 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

ఇంతమంది పిల్లల్ని కని, పెంచుతుండేసరికి నాకు పెద్దరికం వచ్చేసినట్టు అనిపిస్తోంది. నాజుకు, సున్నితం పూర్తిగా తగ్గి, ఎప్పుడైనా నదిలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు ఇది నాదేనా అనే అనుమానం కలుగుతోంది. కానీ భూమి మీద ఉన్నప్పుడు కలిగే జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్యాలు ఒక్కటి కూడా రాలేదు మాలో ఎవ్వరికీ. చాలా ఆరోగ్యంగా ఉన్నాము.
అందరు పిల్లల తల్లి స్థానంలోనూ, గురుస్థానంలోనూ నేను కూర్చున్నాను. అవంతి మిగతా విషయాలు చూసుకుంటోంది. ఒకప్పుడు ఎంతో చలాకీగా ఉండేది తను. చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. గురుకులంలా మారిపోయింది మా ప్రదేశం. గౌతమ్, హర్ష కలిసి పిల్లలకోసం మొదలుపెట్టిన ఇల్లు పూర్తయింది. పిల్లల సాయంతో పూర్తిచేశారు. చెట్లకింద మేము కూర్చుని చదువుకోవడానికి వీలుగా చిన్నచిన్న మట్టి అరుగులు కూడా కట్టుకున్నాము. వాటిమీద పిల్లలు ఆడుకుందుకు అష్టాచమ్మా, వామన గుంటలూ, పచ్చీసు, చైనీస్ చెక్కర్, చదరంగంలాంటి ఆటల్ని గీశాడు హర్ష.
ఒక సాయంత్రం… దూరం నుంచి సముద్రపుహోరు వినిపిస్తోంది. పక్షుల కలకలం కూడా ఉంది. నేను ఒక తిన్నె మీద కూర్చుని ఉన్నాను. నా కూతురు ఎనిమిదేళ్ళది ఏడుస్తూ వచ్చింది. దాని పేరు సృజన. పన్నెండేళ్ల పిల్లలా కనిపిస్తోంది. భూమ్మీద కన్నా ఏపుగానూ, ఎత్తుగానూ పెరుగుతున్నారు. అమర్ వాడి వయసుకి నాకన్నా ఎత్తు ఉన్నాడు.
“ఏమిటే? ఏమైంది?” అడిగాను.
“మరే….” అని ఏడుస్తూ కళ్ళు నులుముకుంది. శరీరాలు పెద్దవైనా మనసులు ఇంకా పసివే.
“ఏమైందమ్మా?”” దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. దాని దుఃఖం ఎక్కువయింది.
“మనం ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చాము కదా, అమ్మా? మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్లిపోతామా? నేను బాగా అల్లరి చేస్తున్నాను కాబట్టి నన్ను వదిలేసి మీరంతా వెళ్లిపోతారట?”” అంది వెక్కుతూ.
“ఎవరు చెప్పారు?” అడిగాను.
“అమర్”” అంది.
“వెళ్ళి వాడిని పిలుచుకు రా!” అన్నాను.
సృజన వెళ్ళి పిలిస్తే వాడొచ్చాడు.
“దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్పావా?” గద్దించాను.
“బాగా అల్లరి చేస్తోందమ్మా! నన్నసలు ఏ పనీ చేసుకోనివ్వటంలేదు” పెద్దమనిషిలా అన్నాడు.
“ఐతేమాత్రం? చిన్నదికదా, అలా అనచ్చా?” కోప్పడ్డాను.
“నాలాగే చెయ్యాలని చూస్తోంది. చేతులు నలగ్గొట్టుకుంటోంది. ఏడుస్తోంది. ఊరుకోపెట్టలేక పోతున్నాను” అన్నాడు అమర్ దాని పిడికిళ్ళ్ ఇప్పి చూపిస్తూ.
అరచేతులు చెక్కురేగి ఎర్రగా ఉన్నాయి. అందరూ అన్ని పనులూ చెయ్యలేరు. దానికి అమర్ అంటే చాలా ఇష్టం. వాడి వెంటే ఉండడానికి వాడు చేసేదే తనూ చేయాలనుకుంటోంది. నాకు గౌతమ్ గుర్తొచ్చాడు చప్పుని. అవంతికోసం ఇంత దూరం వచ్చిన గౌతమ్. ప్రేమనేది ఎలాంటిదైనా ఏ వయసులోనైనా ఒకేలా ఉంటుంది. దాన్ని వ్యక్తపరిచే విధానం కూడా మారదు. చేతులకి తేనె రాసి, ఊరుకోపెట్టి పంపించాను సృజనని.
“దాన్ని ఏడిపించకూడదు” అని అమర్ కి చెప్పాను.
“ఎలామ్మా?” అంటాడు వాడు. “అది నా వెంటే తోకలా తిరుగుతుంది. రాని పనుల్లో దూరుతుంది” అన్నాడు.
“దగ్గరుండి నేర్పించు” జవాబిచ్చాను. వాడు సరేనని వెళ్ళిపోయాడు.
నా లెక్కల ప్రకారం మేము వచ్చి నూటయాభయ్యారు పున్నములు గడిచాయి. గడిచాయి అంటే ఈ గ్రహపు సంవత్సరాలు పదమూడు గడిచాయి. అవి భూమ్మీద లెక్కల్లో ఎన్నిటితో సమానమో తెలీదు


ఒకరోజు అవంతి ఎటో వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. అందరం కంగారుపడుతూ వెతికాము. ఎంత వెతికినా కనిపించలేదు. మరుసటి రోజుకి తన శవం సముద్రం వడ్డుని కనిపించింది. అక్కడ కొంత చాటుకి రాతి మీద చెక్కబడిన అక్షరాలు….
“నాకీ ఒంటరితనం విసుగు పుట్టిస్తోంది. నాకు మనుషులు కావాలి. నేనిక్కడ ఉండలేను. నాకీ గ్రహం నచ్చలేదు. నాతో గౌతమ్ జీవితం కూడా నాశనం చేశాను. హర్ష, మీరాల జీవితాలు కూడా నాశనమయ్యాయి. మనిషి నిలబడడానికి నీడను కూడా ఆక్రమించుకునేంత సైన్సు ఎవరికి లాభం? ఆగకుండా ఏడాదికి ఒక్కరు చొప్పున పుట్టుకొస్తున్న ఈ పిల్లలు, వాళ్ల తర్వాతి తరాలు ఏమవుతారు? నా యువరాజులు, యువరాణులు మట్టిలో మట్టిలా… అడవులు పట్టుకుని తిరుగుతూ ఆటవికుల్లా ఉంటారా? ఇదేనా మేము సాధించిన ప్రగతి?… ముందుముందు ఏం జరుగుతాయో నా ఊహకి అందటంలేదు. ఎలాంటి సమాజం ఏర్పడుతుంది? ఇవన్నీ కాకతాళీయంగా జరగాల్సిన విషయాలు. ఒకరు నిర్దేశించి నియంత్రించలేరు…””
ఇలా ఎన్నో రాతలు… అన్నీ ఒక్కరోజు రాసినవి కాదు. కొన్ని రోజుల… యేళ్ళ సంఘర్షణ. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఒక్కర్తీ ఏకాంతంలో రాసిన రాతలు. అందరము విచలితులయ్యాము.
గౌతమ్ దాదాపు పిచ్చివాడైపోయాడు. అతన్ని ఓదార్చడం నాకూ హర్షకీ సాధ్యపడలేదు. తన లోకంలో తను ఉండిపోయి బొమ్మలు చెక్కుతూ మానుండి దూరంగా వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాలేదు. నన్నూ, పిల్లల్ని వదిలేసి అతనికోసం దూరం వెళ్లి వెతికే సాహసం చెయ్యలేకపోయాడు హర్ష. అవంతి మరణం మమ్మల్ని కుంగదీసింది. ఆశావహదృక్పథం క్రమంగా సన్నగిల్లుతోంది. అయినా గుండెదిటవు చేసుకున్నాను. మాకేదైనా అయితే ఈ పిల్లలు ఏమవుతారు? మేము వచ్చిన పని ఏమౌతుంది? నన్ను నేనే నిలదీసుకున్నాను. హర్షతో కూడా అలాగే చెప్పాను. క్రమంగా ఇద్దరం సర్దుకున్నాము.
ఎలాంటి వివక్షత లేకుండా అందరు పిల్లల్నీ ఒకేలా చూస్తున్నాను. తల్లీ తండ్రీ లేని అవంతి పిల్లల్ని చూస్తే ఒకింత జాలి కూడా. నేనెంత ప్రేమ చూపించినా వాళ్లు అమ్మానాన్నల కోసం తపించిపోతున్నారు. అవంతి చిన్నకుతురు ఏడాదిన్నర వయసుది. తిండి తినడం మానేసింది. కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని కీచుమని ఏడ్చేది. అసలింత పసిదాన్ని వదిలిపెట్తి అవంతి ఎలా ప్రాణం తీసుకుందో అర్థమవలేదు. హర్ష దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎత్తుకుని దింపటం లేదు. దానికోసం ఒక కోతిని మచ్చిక చేశాడు. ఆ కోత దాని లోకం. క్రమంగా ఆ పిల్ల తేరుకుంది.
అమర్ ఏ పని చేస్తున్నా వాడి కళ్ళు తల్లిదండ్రులకోసం వెతుక్కుంటూ ఉండేవి. చావంటే ఏమిటో తెలియని వయసు. అమ్మ ఇక రాదని గ్రహించగలిగినా, వుండీ కనుమరుగైన నాన్నకోసం… రోజంతా తన వెంటవుండి నడిపించిన సహచరుడికోసం… వాడి ప్రాణం తపించిపోయేది. ఒకరోజు రాత్రి ఎంతవేళయినా వాడు తిరిగి రాలేదు. పిల్లల్ని అడిగితే ఉదయంనుంచి వాడిని చూడలేదన్నారు. చుట్టుపక్కల అంతా వెతికాడు హర్ష. ఎక్కడా కనిపించలేదు. గుండెలనిండా భయం. బిడ్డ ఏ జంతువువాతేనా పడ్డాడా? ఏమయ్యాడు? ఎక్కడని వెతకాలి? వాడిని వెతుకుతూ మేం వెళ్తే ఈ పిల్లలకి రక్షణ ఎవరు? మా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ఐతే వీళ్ల భవిష్యత్తు ఏమవుతుంది? నాకు కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోతున్నాయి. మా మిషన్ పూర్తిగా ఓడిపోయిన భావన కలిగింది. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. హర్ష నిస్సహాయంగా చూస్తున్నాడు.
“నువ్వలా ఏడవకు మీరా! నా అసమర్ధత ఎత్తి చూపిస్తున్నట్టుంది. ఈ చీకట్లో వాడికోసం ఎక్కడని వెతకను? మనం ఉన్నామన్న ధైర్యంతో వెళ్ళిపోయింది అవంతి. మనం ఈ పిల్లలని కాపాడలేక పోతున్నాము” అన్నాడు తనూ ఏడుస్తూ.
వాడింకా తిరిగి రాడనే అనుకున్నాము. తెల్లారేక పుట్టెడు జ్వరంతో తిరిగి వచ్చాడు. వాడిని దగ్గరికి తీసుకుని బావురుమన్నాను. “ఒక్కడివీ ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంత బెంగపడ్డామో తెలుసా?” అన్నాను.
“నాన్న కనిపిస్తారేమోనని వెళ్లాను” వాడి జవాబు.
నేను నిశ్చేష్టురాలైపోయాను. గౌతమ్‍ని వెతకడంలో మా నిస్సహాయతని అర్థం చేసుకునే వయసు వాడికి లేదు. పనుల్లో పడి మేం వెతకటం లేదనుకుని వాడే వెతకటానికి వెళ్ళాడు. పరిస్థితిలో ఉన్న నిస్సహాయతని వాడికి బోధపరిచే ప్రయత్నం చేశాము.
“మరోసారి ఇలా ఎప్పుడూ చెయ్యకు. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. మీ నాన్న ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటాడు. మీరు కొంచెం పెద్దయ్యాక అందరం తలో చోటికి వెళ్ళి వెతుకుదాం” అని హామీ ఇచ్చాడు హర్ష.
అది వాడి మనసుకి చాలా సాంత్వననిచ్చింది. వాడికి జ్వరం తగ్గడానికి కొద్దిరోజులు పట్టింది. కళ్ళలో దిగులు మాత్రం తగ్గలేదు. అందుకని వాడిని డ్రైవర్ట్ చేయాలంటే ఒక బృహత్తరమైన బాధ్యతని అప్పగించాలి అనుకున్నాము. సృజనతో పెళ్లి చేసాము. అవంతీ గౌతమ్‍ల కుటుంబానికి పెద్దలుగా వాళ్లని గుర్తించి తమ్ముళ్ల చెల్లెళ్ళ బాధ్యతలు, వాళ్ల పెళ్లి పెద్దరికం, ఇలా ఒక్కొక్కటి వాడిమీద వేస్తూ ఊపిరిసలపకుండా చేసాము. హర్ష తనతో సమానప్రతిపత్తి ఇచ్చాడు. గౌతమ్‍ని సంప్రదించినట్టే ప్రతిదానికి వాడిని సంప్రదించడం చేసేవాడు.
అలా అంత చిన్నప్పుడే కాకుండా మిగిలిన పిల్లలు పెద్దయ్యాక జంటలుగా విడగొట్టి ఎవరికి ఎవరెవరు అంటే ఇష్టమో తెలుసుకుని పెళ్లిళ్లు జరిపించాము. పెళ్లంటే అనుకున్న ఇద్దరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చివరిదాకా కలిసి ఉండాలనీ, గొడవలు పడకూడదనీ, చిన్నచిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోవాలనీ పంతానికి పోకూడదనీ, ఇంకా ఏదైనా ఉంటే నాకూ హర్షకి చెప్పాలనీ, పిల్లలు కలిగినప్పుడు వాళ్లని కంటికి రెప్పలా చూసుకోవాలనీ చెప్పాము. విడిగా కూడా మగపిల్లవాళ్ళకి హర్షా, ఆడపిల్లలకి నేనూ కౌన్సిలింగ్ చేసాము. మొదటి ఆరు జంటలూ మంచి సమన్వయంతో ఉన్నాయి.
హర్ష కోరుకున్నట్టు మంచి సమాజానికి పునాది పడ్డట్టే.
కాలం ఆగటంలేదు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్లకి పిల్లలు. మళ్లీ పెళ్లిళ్లు… తరాలు తిరుగుతున్నాయి. రెండో తరంలో ఒక సమస్య వచ్చింది. ఒక మగపిల్లవాడు జంట లేక మిగిలిపోయాడు. వాడికి తర్వాత తరంలోని అమ్మాయిని చేయడం జరిగింది. అలాగే ఇంకో తరంలో నలుగురు అమ్మాయిలు మిగిలిపోయారు. వాళ్లలో ఒక అమ్మాయి సంఘసేవకురాలిగా ఉండిపోయింది. ఒక అమ్మాయి భార్య చనిపోయిన వ్యక్తిని చేసుకుంది. ఒకతి పెళ్లి కోసం ఇరవయ్యేళ్ళు ఎదురుచూసింది. మరొక పిల్ల అక్రమ సంబంధం పెట్టుకుంటే. నిబంధనలు, శిక్షాస్మృతి తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది. సమాజం సవ్యంగా నడవాలంటే ఒక్కొక్కప్పుడు కొందరు కొన్నిటిని త్యాగం చెయ్యాలి అని వాళ్లకి వివరంగా చెప్పాము.
ఏది నీతి? ఏది చెయ్యొచ్చు? ఏది చేయకూడదు? ఏది చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇవన్నీ వివరంగా వాళ్లతో చర్చించి వాళ్లంతట వాళ్ళు తప్పులు చేయకుండా ఉండేలా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాము. మంచి చెడు, తప్పు ఒప్పు ఇవన్నీ సమయ సమయానికీ, మనిషి మనిషికీ, సంఘటన సంఘటనకీ మారుతుంటాయి. మన వితరణ ఉపయోగించాలి. ఆ వితరణ శక్తిని జాగృతం చేస్తున్నాము.
పిల్లల్లో రకరకాల మనస్తత్వాలు కనపడుతున్నాయి. అమర్‍కి జిజ్ఞాస చాలా ఎక్కువ. మేం చెప్పిన ప్రతి విషయాన్నీ కుణ్ణంగా అర్ధం చేసుకుంటాడు. అంతదూరం నుంచి మేము ఇక్కడికి అన్నీ వదులుకుని వచ్చామంటే ఎంతో ఆశ్చర్యం, ఎప్పటికైనా అక్కడికి తిరిగి వెళ్లిపోతామంటాడు.
మరొక పిల్లాడు పృధ్వి. బలం బాగా ఎక్కువ, ఎవరికి ఏ ఆపద వచ్చినా తను ముందుంటాడు. అడవిలోకి వెళ్ళేవాళ్ల కూడా ఉండి వాళ్లని జాగ్రత్తగా తిరిగి తీసుకొస్తాడు. మరొకడికి తిండి సంపాదించడంలో అఖండమైన తెలివితేటలున్నాయి. వాడుగానీ అడవికి వెళ్ళినా, వేటకు వెళ్లినా నెలకి సరిపోయేంత గ్రాసం పట్టుకొస్తాడు. వాడి వెంట వెళ్ళవాళ్లు మొయ్యలేక ఏడవాల్సిందే. ఒకడు పాటలపిట్ట. వాడు పాడుతుంటే విని హర్ష అన్నాడు.
“సంగీతాశివనారాయణ గొప్ప సింగర్. తెలుసా, నీకు?”
నాకు అర్ధం కావడానికి కొంత టైం పట్టింది. వాళ్లమ్మ గురించి చెప్తున్నాడు. ఏ జ్ఞాపకాలు అతని మనసును తడుతున్నాయో! అతనెప్పుడూ బయటికి అనలేదు. ఇదే మొదటిసారి.