నీలినక్షత్రం – 8 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

ప్రొఫెసర్ మిత్రా నాకొక చిప్ ఇచ్చారు. అందులో భూమ్మీద ఉన్న విజ్ఞానమంతా పొందుపరిచారు . వేదవేదాంగాలు , పురాణాలూ , బైబిల్, ఖురాన్ , ఇంకా ఇతర మత గ్రంథాలు , సైన్స్ , హిస్టరీ ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా నింపి పెట్టారు . అందులో ఇంకేదైనా చేర్చవచ్చా అన్న ఆలోచనకలిగింది .
“మన ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు పెడదాం . అంతేకాదు, మన ఫోటోలు, బ్లడ్, డీఎన్ఏ, మైటోకాండ్రియల్ జెనోమ్ పిక్చర్‍లాంటివి కూడా ఉంచుదాం” అన్నాడు హర్ష.
“ఎందుకు ? మనమే వెళ్తున్నప్పుడు ? ” అడిగింది అవంతి.
తన ప్రశ్న విని ప్రొఫెసర్ మిత్రా చిరునవ్వు నవ్వారు. ” మీరు వెళ్ళేచోట మనుషులుంటే వాళ్ళతో కమ్యూనికేషన్ సమస్య రావచ్చు . టెక్నాలజీ ఎక్కడైనా ఒకేలా ఉంటుందనేది నా కాన్సెప్టు … ఎవరెట్ సిద్ధాంతంలో సమాంతర విశ్వాల్లా . దీనిలో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసుకుంటే మనమెవరో వాళ్ళకి తెలుస్తుంది . అలా కాకుండా మనిషి అక్కడ అడుగుపెట్టడం మీతోనే మొదలైతే మీకక్కడ ఎలాంటి ఎక్విప్‍మెంట్ ఉండదు . మన చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం . హర్ష అన్నట్టు మీ ఫోటోలని కూడా ఉంచుదాం” అన్నాడు.
మనిషికి ఎంత ఆశో ! ప్రాణులంటూ ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళు తమలాగే ఉండాలనీ, తమకిలాగే భావోద్వేగాలు ఉండాలనీ కోరిక . ఆఖరికి మన దేవుళ్ళుకూడా మనుషులకి భిన్నంగా ఏమాత్రం ఉండరు . రాముడు , కృష్ణుడు వీళ్ళెవరూ మానవసహజమైన భావోద్వేగాలకి అతీతులు కారు . మా ప్రయాణానికి నిదర్శనంగా అప్పటిదాకా జరిగిన విషయాలని డైరీ రూపంలో అందులోకి ఎక్కించాను . మా ఫోటోలు , డీఎన్ఏ, మైటోకాండ్రిఅల్ జెనోమ్ , బ్లడ్ పిక్చర్లు , లైఫ్ యొక్క మాలిక్యులార్ ఫార్ములా …. ఇవన్నీ కూడా అందులో చేర్చాక దాన్ని వెదర్‍ప్రూఫ్ కాప్స్యూల్లో సీల్ చేసారు . ఇంతా చేస్తే అది నా బొటనవేలి గోరంత ఉంది . కొత్తగా కనిపెట్టిన ప్లాస్టిక్‍తో తయారైన ఆ వస్తువు జీవితకాలం ఇప్పటిదాకా ఉన్న ప్లాస్టిక్‍కన్నా ఎక్కువని నిర్ధారించబడింది . లక్ష సంవత్సరాల తర్వాత కూడా అది తన ఉనికిని పోగొట్టుకోకుండా కాలానికి నిలబడి ఉండి సంచలనానికి దారితీస్తుందని ఆ క్షణాన ఎవరం అనుకోలేదు . అంతటి ప్రాఫెట్స్ మాలో ఎవరూ లేరు . ఏ ప్లాస్టికైతే భూమ్మీద మాకు స్థానం లేకుండా చెయ్యడానికి దోహదపడిందో అదే ప్లాస్టిక్‍తో సుదూర భవిష్యత్తుకోసం గతాన్ని నిక్షిప్తం చేసి ఉంచడం చాలా పెద్ద ఐరనీ . అక్కడినుంచీ జరిగినవన్నీ రాయడానికి ప్రొఫెసర్ నాకొక తెల్లకాగితాల పుస్తకం, ప్రత్యేకంగా తయారైన పెన్నూ ఇచ్చారు . ఆ కాగితాలుకూడా కంప్యూటర్ చిప్ తయారైన పదార్ధంతోనే తయారయ్యాయి. పెన్ను లిక్విఫైడ్ ట్రాన్సిషన్ ఎలిమెంటుతో తయారైన ఇంకుతో నడుస్తుంది. రాత ప్రత్యేకమైన పద్ధతిలో రాయాలి . నా రాతకి పరిధి కూడా నిర్ణయించబడింది . పేపర్లని లెక్క చూసుకుంటూ , ఇంకు చూసుకుంటూనూ రాయాలి . గౌతమ్ కథని పూర్తిచెయ్యకుండా ఉండలేకపోయాను . ఆ తర్వాతివన్నీ క్లుప్తీకరించాలనుకున్నాను .


గౌతమ్ తన ఆస్థిని తమ్ముళ్ళ పేరుమీంచి తప్పించి తను చదువుకున్న స్కూలుకి అనుసంధానంగా ఉన్న అనాథాశ్రమానికి రాసేసాడు . అతనిలో బాధ తప్ప మరే భావాలూ లేవు . మేము అటావానుంచి బయల్దేరి వెళ్తున్న రోజు అతని తల్లి , ఆవిడ భర్త , పిల్లలు విమానాశ్రయానికి వచ్చారు . వాళ్ళు దూరంనుంచి మమ్మల్ని చూసి విమానం కదిలేదాకా ఉండి వెళ్ళిపోయారు . ఆ దూరంలోనే నిజమైన విషాదం ఉందనిపించింది .
“గౌతమ్ , ఇక మనం ఇండియా వెళ్తున్నాము. బేస్‍కి వెళ్తాం. అక్కడినుంచి రోదసిలోకి , ఇంకో గ్రహానికి . ఈ భూమ్మీది బాధలూ , మమకారాలూ వదిలెయ్యాలి . ఇకమీదట మనకి మనమే ” అన్నాడు హర్ష.
“నీకు తోడుగా అవంతి ఉంది ” నేను చెప్పాను .
“లైఫ్‍టైం హనీమూన్ . ఎవరికీ దొరకని ఛాన్సిది “
ఆ మాటలకి అవంతి కొద్దిగా సిగ్గుపడింది . ఆమె సిగ్గు చూసి గౌతమ్ నవ్వాడు . క్రమంగా మార్పొచ్చి మామూలుగా మారాడు .
మేం ఇండియాలో లేని ఈ స్వల్పకాలంలోకూడా చాలా మార్పులొచ్చాయి . పూర్తిగా బేస్‍లోనే ఉండిపోయి మా ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాము . ఆరోజు కూడా వచ్చింది . మా షిప్ బయలుదేరింది . భూమ్మీద నీటికోసం జరిగిన ఆఖరిపోరాటాన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూసాము . మా వ్యోమనౌక భూకక్ష్యని వదిలిపెట్టింది . అప్పటిదాకా మేం అదే రోదసి వాతావరణంలోనే ఉన్నా అలా ఉండటానికీ , నిజంగా రోదసిలోకి వెళ్ళటానికీ గల తేడాని మనసు గుర్తించింది . ఏదో తెలియని దిగులు.
“మళ్ళీ నీళ్ళు దొరుకుతాయేమో ! మన ప్రయాణం అర్థం లేనిదేమో !” అంది అవంతి . నాయనమ్మని గురించిన దిగులు తన గుండె నిండా ఉంది.నేనూ అమ్మానాన్నల గురించి బాధపడ్డాను .
” అంతరిక్షంలోకి వెళ్ళినా మీరు ఆడవాళ్ళేనని నిరూపించుకున్నారు, పుట్టిళ్ళ గురించి బాధపడుతూ ” అని గౌతమ్ పరిహాసం చేసాడు .


భూకక్ష్యని వదిలిపెట్టాక ఇంక పగలూ రాత్రీ అనే పదాలకి అర్థం ఉండదు . కాలం నిరామయమైంది . బిగ్‍బాంగ్‍తో సృష్టి మొదలైందని శాస్త్రవేత్తలు చెప్తారు . బిగ్‍బాంగ్‍కి ముందు ఏముందని తార్కికులు ప్రశ్నిస్తారు . బిగ్‍క్రంచ్ ఉందనేది ఊహ . బిగ్‍బాంగ్ కూడా ఊహే ఐనా , అది కచ్చితంగా జరిగినట్టు ఆధారాలు చూపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి . అదే బిగ్‍క్రంచ్ విషయంలో జరగడంలేదు .
విశ్వం పదార్థంగా ఎలా ఏర్పడింది ? అపారమైన శక్తి పదార్థంగా మారిందా ? ఆ శక్తి ఎక్కడిది ? అంటే క్రంచ్ ఉన్నట్టేనా ? ఎవరెట్ ప్రతిపాదనలు సరైనవేనా ? ఇంకో విశ్వం ఉందా ? ఎక్కడ ? మాకు తటస్థపడుతుందా ? మా అన్వేషణ ఫలవంతమౌతుందా ? కొన్ని ప్రశ్నలకి జవాబు దొరక్కపోతేనే అందం . కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది . అలాకూడా దొరకని వాటికి జవాబులు వెతుక్కోవటంలో పరిపక్వత ఉంటుంది .
అవంతి ఒక కథ చెప్పింది . వాళ్ళ నాయనమ్మ చెప్పారట . ఒక వ్యక్తి. వ్యక్తిత్వం ఉండటంచేత అతన్ని వ్యక్తి అనవలసి వచ్చిందిగానీ అతనికి రూపంగానీ శరీరంగానీ లేవు . ఐతే అతను అపారమైన శక్తిగలవాడు . కొన్ని ఊహల్ని సృజించి తన శక్తిలో కొంత ఉపయోగించి వాటికి రూపం ఇవ్వగలడు . తనకోసం ఒక అందమైన స్వర్గాన్ని నిర్మించుకుని అందులో ఉంటున్నాడు . అతడు ఒకసారి విశ్వసంచారం చేస్తూ భూమ్మీదికి వచ్చాడు . సూర్యుడి చుట్టూ నిర్వికారంగానూ , నిర్విరామంగానూ తిరుగుతున్న ఆ నీలిపచ్చగ్రహాన్ని చూడగానే అతడికి అందమైన ఊహలు కలిగాయి . వెంటనే వాటిని వాస్తవంగా మార్చేసాడు . చెట్లు , తీగలు , పూలు , ఎగిరెగిరి వాటిని అందుకుంటున్న జింకలు , వాటిని తరుముతున్న పులులు … ఇలా చాలానే సృష్టించాడు . తిరిగి చూసుకుంటే తన సృష్టి తనకే చాలా సంతోషం కలిగించింది . దాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది . వెంటనే మనిషిని సృష్టించాడు . తనని తను దేవునిగా పరిచయం చేసుకుని , అక్కడే ఉండి తను పొందవలసిన సంతోషాన్ని అతనిపరం చేసి వెళ్ళిపోయాడు. అతను ఇప్పటికే చాలా శక్తిని కోల్పోయి అలసిపోయాడు.
కొంతకాలం తర్వాత, అతను సృష్టించినవన్నీ ఎలా వున్నాయో చూడాలన్న కోరిక పుట్టి మళ్ళీ భూమిమీదికి వచ్చాడు. ప్రకృతి స్తబ్దంగా ఎలాంటి మార్పూ లేని చాయాచిత్రంలా వుంది. అదతనికి నచ్చలేదు. శైశవానికి రూపకల్పన చేసాడు. శిశువులో సగభాగం పురుషుడినుంచి స్వీకరించి పరిపూర్ణతకోసం స్త్రీని సృష్టించి తిరిగి వెళ్ళిపోయాడు. మానవశిశువు తొలి ఏడుపుతో సృష్టి చైతన్యవంతమైంది. ఆ తర్వాత తరాలు గడిచాయి. యుగాలు గతించాయి. శైశవం పదేపదే పునరావృతమైంది. మనిషి దైవత్వంనుంచి మనుష్యత్వం దిశగా ప్రయాణిస్తున్నాడు. స్వార్థచింతన పెరిగి, ఇతరులని బాధపెట్టడం అనే ప్రక్రియ మొదలైంది. మొదటి మనిషి దీన్ని చూసి తట్టుకోలేకపోయాడు. పరిష్కారం కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుడు అతన్ని స్వర్గానికి
ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుడు పదార్ధం కాదు. అతనికి రూపం లేదు. ఈ ఆతిథ్యం అనేది ఆత్మైక్యతాపరంగా జరిగినది. అలా కొంతకాలం గడిచింది. ఎంతకాలమని ఒకరికి అతిధిగా ఉండగలడు? దేవుడేమో మాట్లాడడు. మళ్ళీ తిరిగి వచ్చేసాడు.
తను చూసి వచ్చిన దేవుడి గురించి ప్రజలకు చెప్పసాగాడు. దేవుడిలా ఉంటే సంతోషంగా ఉండవచ్చుననే విషయాన్ని బోధపరిచే ప్రయత్నం చేసాడు.
“దేవుడు ఎలా ఉంటాడు?” అని ఒకడు అడిగాడు. వాడు నల్లనివాడు.
“నువ్వు చూస్తే నీలా ఉంటాడు. నేను చూస్తే నాలా ఉంటాడు. మనం తప్పు చేస్తే వంకరగా కనిపిస్తాడు. మనకి ప్రతిబింబంలాంటివాడు” అన్నాడు మొదటి మనిషి.
దేవుడు తనలా నల్లగా ఉంటాడని మాత్రమే వాడికి అర్థమయింది. వాడి దేవుడు నల్లనివాడు. మరొకడికి బంగారం మీద ఆశ. అందుకని తన ఆశ ప్రతిబింబించేలా కిరీటాలూ అవీ రూపుదిద్ది దేవుడికి ఒక మణుగు బంగారం తొడిగాడు. మరొకడు బలహీనుడు. అందుకని నాలుగు చేతులు తగిలించాడు . తర్వాత ఎవరి దేవుడు గొప్పవాడు అని గొడవ మొదలైంది. ఎవరి అంతరంగానికి వాడే దేవుడు. ఎదుటివాడు తనని ఒప్పుకోవాలి. తగ్గే ప్రసక్తి లేదు. మొదటి మనిషి విసిగిపోయాడు. మళ్లీ వెళ్లి దేవుని కలిశాడు. దేవుడు ఇప్పుడు మృత్యువుని సృష్టించాడు.
“దేవుడు మనల్ని శాశ్వతంగా బతకమని సృష్టిస్తే మీ నాయనమ్మలాంటి ఒక ముసలాయన మృత్యువుని వెంటబెట్టుకుని వచ్చాడు” అని అవంతి చెప్పిన కథ విని హర్ష గొడవేసుకున్నాడు.
అది ఎప్పటికి తెగేది కాదు. ఈ కథని కూడా నేను రాశాను. చాలా గమ్మత్తైన కథ. అమ్మానాన్నలు లేని అవంతికి అదొక అందమైన జ్ఞాపకం. వాళ్ళ నాయనమ్మ గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చదివేది. చదివినప్పుడల్లా హర్ష తనతో గొడవవేసుకునేవాడు.
మా షెడ్యూలు కంప్యూటర్లో ఫీడ్ చెయ్యబడింది. మాలో ప్రతి ఒక్కరం స్టాప్‍వాచ్ ప్రకారం ఆరుగంటలసేపు కంట్రోలుముందు కూర్చోవాలి. బయలాజికల్ క్లాక్ ప్రకారం ఎప్పుడు నిద్రవస్తే అప్పుడు నిద్రపోవాలి. మా వ్యోమనౌక పెద్దది. భూమ్మీద ఉండేంత గురుత్వాకర్షణ శక్తిలాంటి కృత్రిమవాతావరణం ఉండటంచేత మేము గాల్లో తేలడం తిండి తినలేకపోవడంవంటివేమీ లేవు. పదార్ధాలన్నీ నిలకడగానే ఉన్నాయి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ విడగొట్టి రోదసిలోకి వదిలేసేలా కొన్ని గదులు ఉన్నాయి. మాకు పడకలకి రెండు, స్టోర్‍కి ఒకటి, సైంటిఫిక్ పరికరాలకి ఒకటి, ఒక బాత్రూమ్ ఇలా.
స్నానాల్లేవు. ఒళ్ళు స్పాంజితో తుడుచుకోవటమే. నీరు దొరకదు కాబట్టి దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆకలిదప్పులు నియంత్రించడానికి మందులు ఉన్నాయి. కంప్రెస్ట్ ఫుడ్, ఫుడ్ కాప్స్యూల్స్ … ఇలా నాలుగైదురకాలవి ఇచ్చారు. మేం వాడుకుని విడిచిపెట్టేసిన నీరు… అది ఏ రూపంలోదైనాసరే, అనేక పద్ధతుల్లో రీసైకిల్ అయి మళ్లీ స్వచ్ఛంగా మారిపోవడానికి పరికరాలు అమర్చారు. భూమ్మీద రకరకాలుగా వాడిన నీరు ఎలాగైతే భూమి పొరల్లో చేరి శుభ్రపడుతుందో ఇక్కడా అలాగే జరుగుతోంది. చుట్టూ చీకటి. నక్షత్రాలు, గ్రహాలు మినుకుమినుకుమంటూనో, ప్రస్ఫుటంగా వెలుగుతూనో, మండుతున్న గోళాలలాగానో దర్శనమిస్తున్నాయి. తోకచుక్కలు, గ్రహశకలాలు వేగవంతంగా వచ్చి తాకేంత దూరంలోకి వస్తున్నాయి. వాటిని తప్పించుకుంటూ ప్రయాణం చేసి మరో గ్రహాన్ని వెతకడం ఎంతవరకు సాధ్యమో అర్ధమవలేదు. మొదటిసారి నగరం మధ్యలోకి వచ్చినవాడికి ఎంత గజిబిజిగా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. అందరం ఈ ప్రయాణానికి అవసరమైన అన్నిరంగాలలో పూర్తిస్థాయి శిక్షణ పొందినవాళ్ళమే అయినా వాస్తవాన్ని ఎదుర్కోవడం కొంచెం కష్టంగానే ఉంది.
కంట్రోలు దగ్గర హర్ష కూర్చున్నాడు. అవంతి వట్టి కబుర్లపోగు. గౌతమ్‍కి తనెంత మాట్లాడినా విసుగులేదు. వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ గడిపివేస్తారేమోననిపిస్తుంది నాకైతే. వాళ్ళది అవధులు లేని, ఎలాంటి అరమరికల్లేని ప్రేమ. అలాంటి ప్రేమ సహజంగా తప్ప మరోలా రాదు. నాకూ హర్షకీ మధ్య ఎంత ప్రేమ ఉన్నా డిప్లమసీ అనే ఇంకా కరిగిపోని తెర ఒకటి ఉంది. మా ప్రేమ సహజమైనది కాకపోవడంచేత ఆ తెర అలాగే ఉండిపోయింది. మామూలుగానే హర్ష చాలా తక్కువగా మాట్లాడతాడు. నాదీ అదే అలవాటు.
మేము బయల్దేరి ఎన్ని రోజులైందో లెక్క తెలియడంలేదు. ఎన్నిసార్లు భోజనం తినాలనిపించిందో. మిగిలిన బయలాజికల్ నీడ్స్ లెక్క వేసుకుంటే పదిహేనురోజులై ఉంటుందనిపించింది. ఇంకెంతకాలం ఇలా?
చిన్న విండో పక్కని కూర్చుని బైటికి చూస్తూ కూర్చుంటే మొదట్లో బాగానే ఉండేది. కానీ ఎంతకాలం అనే ప్రశ్న. తర్వాత్తర్వాత విసుగ్గా అనిపించసాగింది. అంతా వృధా ప్రయాసలా తోస్తోంది. రేడియో మెసీజీలు పంపిస్తున్నాము. భూమ్మీద పరిస్థితి ఎలా ఉందో తెలీక చికాకుగా ఉంది. నా విసుగు గుర్తించి హర్ష లేచి వచ్చాడు.
“ఎందుకంత డల్‍గా ఉన్నావు?” లాలనగా అడిగాడు. హర్ష లేచి రావడం చూసి గౌతమ్ కంట్రోల్ దగ్గరికి వెళ్లాడు. అలా ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిందే.
“ఇదంతా వృధా ప్రయాస అనిపిస్తోంది. అందరితో పాటే మనమూ, ఉంటే ఉండేవాళ్ళం, లేకపోతే పోయేవాళ్ళం” అన్నాను. ఎందుకలా అనిపిస్తోదో తెలీదు. ఉండుండి నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
“నాకు మాత్రం అలా లేదు. నీతో ఉన్న ఈ క్షణం ఇలాగే శాశ్వతమైతే బావుండునని ఉంది”
“ఇప్పుడు ఇంక అదొక్కటి మిగిలింది శాశ్వతంగా” అన్నాను.
“రోదసిలో ఎవరైనా ప్రేమ కబుర్లు చెప్పుకుంటారా? ఇల్లులాంటిది కట్టుకుని ఉండగలుగుతారా? ఎవరికీ దొరకని అరుదైన అదృష్టం మనకి దొరికింది చూడు” అతను నన్ను చీరప్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను దాన్ని గుర్తించి మామూలుగా అయ్యేందుకు చూస్తున్నాను.
“ఏయ్, అవంతీ! మీరెన్నిసార్లు అనుకున్నారు, ఎవరూ లేని ఏకాంతంలోకి వెళ్ళి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలని?” అని అవంతిని దబాయించి అడిగాడు.
“నేనయితే నూటాముప్పయ్యెనిమిదిసార్లు అనుకున్నాను. గౌతమ్ సంగతి తెలీదు” అదే టోన్లో జవాబిచ్చింది తను.
“అదేం లెక్క? అంత ఖచ్చితమైన లెక్క?” నేను నవ్వి అడిగాను.
“అలాంటి ప్రశ్నలకి ఇలాంటి జవాబులే ఉంటాయి” మళ్ళీ అలాంటిదే జవాబు.
నా నవ్వు చూసాక ఇద్దరూ తేలికగా విశ్వసించారు.
నాలాగే ఒకసారి గౌతమ్ దిగులుపడిపోయాడు. అతను దిగులుపడితే అవంతి తట్టుకోలేదు. అతన్ని హర్ష ఓదార్చాడు. ఒకరకంగా అతని మానసికపరిణతిని బట్టి హర్ష మాకు కేర్‍టేకర్ రోల్ తీసుకుంటున్నాడు. దిగులు, బాధల్లోంచి ఇవతలికొచ్చి మార్పుని పూర్తిస్థాయిలో మనసు స్వీకరించాక అందరం గ్రహించింది ఒక్కటే. నిర్వ్యాపారత్వమే మా ఈ ఉద్వేగాలకు కారణమని, ఆ విషయాన్ని అంత స్పష్టంగా గుర్తించాక ఎవరం ఖాళీగా లేము.

2 thoughts on “నీలినక్షత్రం – 8 by S Sridevi”

  1. 🙏🙏🙏🙏🙏 great అమ్మా….
    మాటల్లో నేనేమీ చెప్పలేను….👏👏👏 మీ ఊహా అద్భుతం….👏👏👏👏

Comments are closed.