మరుసటిరోజు పేపర్లలో ప్రకటన వచ్చింది, నీలినక్షత్రమ్మీదికి మనుష్యుల్ని పంపించే ప్రతిపాదన నిరవధికంగా వాయిదాపడిందని. అభిజిత్ చాలా నిరుత్సాహపడ్డాడు. ముందురోజే ఈ విషయమ్మీద మాట్లాడుకున్నారు, ఇంతలో ఏం జరిగిందని మథనపడ్డాడు. అంతేగానీ తను వెళ్ళడం ప్రిమియర్‌కి కూడా ఇష్టంలేదని గ్రహించలేదు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిమానాలుకూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభావాన్ని చూపిస్తాయని అతనికి తెలియదు.
ఇంతలో ప్రణవి ఒక వార్త చెప్పింది, తల్లి కాబోతున్నానని. అభిజిత్‌కి ఆశ్చర్యం కలిగింది. సృష్టి ఇంత తేలికా? కోట్లకికోట్లు ఖర్చుపెట్టి ప్రయోగశాలల్లో
టెస్ట్ట్యూబుల్లోనూ , క్లోనింగ్ ద్వారానూ, జన్యుమార్పిడిద్వారానూ ప్రాణులని సృష్టిస్తున్నారు. పుట్టినదగ్గిర్నుంచీ, కృత్రిమంగా పుట్టిన ఆ ప్రాణి ఎలా వుంటుంది, ఎలా ప్రవర్తిస్తుందనే భయమే. ఎలాంటి ప్రయోగాలూ జరగలేదు. అసలే ప్రయోగశాలా లేదు. ఐనా ఇదెలా సాధ్యం? మనిషికన్నా ప్రకృతి బలమైనది. ప్రకృతిలో వున్నవాటినే మనిషి తిరిగి కనిపెడుతున్నాడు అంతేగానీ స్వంతంగా కాదు… ఆలోచిస్తున్నకొద్దీ అతనికి ఆశ్చర్యం పెరిగిపోతోంది. తన భావాలనీ , ఆశ్చర్యాన్నీ ప్రణవితో పంచుకోవడానికి సంకోచించలేదు.
“పెళ్ళిచేసుకొవాలంటే ఎంతో భయపడ్డాను. కానీ పెళ్ళితో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుందని ఇప్పుడే తెలిసింది. మన జీన్ కేరియర్…పుట్టడం, మనం మరోతరానికి చేరుకోవడం… వోహ్…ఆ ఆలోచనే గొప్పగా వుంది. థేంక్స్ ఫర్ ఎవెరిథింగ్” అన్నాడు ఎంతో వుద్వేగంగా.
ఆ సంతోషంలోనే ఆడమ్స్ కేవ్ చిప్‌ని మళ్ళీ బ్రౌజ్ చెయ్యటానికి వుపక్రమించాడు. అదొక వేట. సముద్రంలోంచీ ముత్యాలు ఏరి తేవడంలాంటిది. ఇప్పటిదాకా అందులో అతనికి దొరికినవి వేరు, ఇప్పుడు దొరికినది వేరు. అదొక డైరీ. తన లేంగ్వేజి మిషనుకి అనుసంధానించి చదవటం మొదలుపెట్టాడు.
ప్రొఫెసరు మిత్రాగారి క్లాసు జరుగుతున్నప్పుడు ఒక నోటీసు వచ్చింది. దాన్ని చదువుతునే ఆయన భృకుటి ముడిపడింది. చదివి, సంతకం చేసి, తీసుకొచ్చినతన్నీ పంపేసాడు. తరువాత టెక్స్ట్‌బుక్ మూసేసి కొద్దిసేపు ఆలోచనలో వుండిపోయాడు. ఆ నోటీస్ ఏమై వుంటుందా అని మాలో మేము చర్చించుకుంటూ ఉంటే ఆయన గొంతు వినిపించింది. అందరం మాటలాపేసి వినసాగాం.
“మీలో ఎవరికేనా న్యూస్ పేపరు చదివే అలవాటు వుందా?” అడిగాడు.
ఎవరం మాట్లాడలేదు.
“కొద్దిరోజులక్రితం ఆఖరిపేజీలో ఒక వార్త వచ్చింది…నీలిరంగులో మెరుస్తున్న నక్షత్రం ఒకటి భూమికి అతిదగ్గిరలో కొద్ది క్షణాలు మెరిసి మాయమైందని” ఆయన అన్నాడు.
ఆ వార్త నేనూ చదివానుగానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు దానిగురించి ఎందుకు?
“నీళ్ళు కొనుక్కుని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. ఆక్సిజెన్ మాస్కులు చేకుండా నిముషంకూడా వుండలేకపోతున్నాం. సహజంగా పండించుకోవడం మానేసి చాలాకాలమైంది. బయోటెక్ ఫాక్టరీల్లో తయారైనవాటిని తిని, తాగుతున్నాం. ఒకవైపు ఎండ రక్తాన్ని వుడికించేస్తోంది. మరోవైపు చలి గడ్డ కట్టిస్తోంది. అన్నీ వైరుధ్యాలే. మనిషి కేన్సరుతోతప్ప మరోలా చావటంలేదు. ఈ మార్పులన్నీ చాలా త్వరగా అంటే ఎలక్ట్రానిక్ విప్లవం తర్వాత వంద సంవత్సరాల్లో వచ్చినవి.
అన్నీ తెలిసినవే. కొత్త విషయాలేం కాదు.
ఇంట్లో బామ్మ అంటుంది, ” మా చినప్పుడు ఇలా కాదు. నీళ్ళకి ఎద్దడేగానీ పంటలు పండించుకుని తినేవాళ్ళం. కాయలూ, పళ్ళూ చెట్లకి కాస్తే కోసుకుని తినేవాళ్ళం. అన్నం, కూరలూ వండుకుని తినేవాళ్ళం. చూస్తుండగా రోజులు ఎంత మారిపోయాయి! అన్నీ ఫాక్టరీల్లోంచీ వస్తున్నాయి…”అని.
దానికి అమ్మ స్పందన…
“నేను పుట్టి పెరిగింది సిటీలోనే. ఐనా చెట్లూ మొక్కలూ తెలుసు. గాలి చల్లగా వుండేది. ఏసీ చాలాకాలందాకా తెలీదు. ఇప్పుడేమిటే బాబూ, పగటివేళ ఇంట్లోంచీ బైటికి కదల్లేకపోతున్నాం. ఎంత ఎండ…”
నావరకూ నాకు చెట్లూ, మొక్కలూ వ్యవసాయ, బయోటెక్ ప్రయోగశాలల్లోని లేదా పుస్తకాల్లోని విషయాలు. అక్కడక్కడా నాలుగు గడ్డిపోచలు కనిపిస్తే ఆగి వింతగా చూసే తరం మాది. ఇప్పుడు ప్రొఫెసరు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నట్టు?
“భూమ్మీద నీరు ఇంక కొన్ని సంవత్సరాలుమాత్రమే వస్తుందని అంచనా. వెయ్యి అడుగులలోతునించీ తవ్వి తీస్తున్న నీరు ఎన్ని పద్ధతుల్లో శుద్ధిచేసినప్పటికీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తునే వుంది. సముద్రపునీటిని శుద్ధిచేసే ప్రక్రియ కొన్ని రాష్ట్రాలు చేపట్టాయి. నీటినీ లవణాలనీ వేరుచేసే ప్రాసెస్‌లో వచ్చిన లవణాలు మేటవేసుకుపోయి కొన్ని లక్షల ఎకరాల నేల చౌడుబారిపోయింది. ఇప్పుడు మనకి కావల్సినది వుండడానికి అనువైన నేల. స్వచ్చమైన గాలీ , నీరూ అందుబాటులోగల నేల. దురదృష్టవశాత్తూ మనిషి పాడుచేసుకున్నదీ, తిరిగి బాగుచెయ్యలేనిదీ ఇదే”.
అప్పటికే క్లాసులో ఆ విషయం బోరుకొడుతోందనేందుకు సూచనగా గుసగుసలు మొదలయ్యాయి. నేనుమాత్రం ఆలోచిస్తున్నాను. ఇదంతా దేనికి నాంది? మరే కొత్త ప్రయోగం మొదలవ్వబోతోంది?
“చంద్రునిమీదికి బిచాణా ఎత్తేద్దామన్నా అక్కడ వాతావరణం లేదు. గాలీ నీళ్ళూ ఇక్కడినుంచే రావాలి. ఇంతమందికి అక్కడ సరిపోదు. అలాకాకుండా ఒక కొత్త గ్రహాన్ని అన్వేషించాలన్న ప్రతిపాదన వచ్చింది. విశ్వంలోకి వెళ్ళి మనకి అనువైన గ్రహాన్ని వెతకాలి.”
“అలాంటి గ్రహం వుంటుందా?” ఎవరో అడిగారు.
“మహా విస్ఫోటనం వలన విశ్వం ఏర్పడింది. ఏ వాయుమేఘాలైతే మనిషి జీవించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించగల భూమిని ఏర్పరిచాయో , అలాంటి వాయుమేఘాలు ఇంకొన్నిచోట్లకూడా కేంద్రీకృతమై వుండొచ్చు. భూమిలాంటి ఇంకొన్ని గ్రహాలని తయారుచేసి వుండచ్చు”.
క్లాస్‌లో గుసగుసలు తగ్గాయి. తెలీకుండానే స్టుడెంట్సంతా ఆ టాపిక్వైపు ఆకర్షితులయ్యారు.
“క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఎలక్ట్రాన్లాంటి పార్టికల్ ఒకే సమయంలో రెండుచోట్ల వుండగలదు. మహావిస్ఫోటనం తరువాతి పరిణామాల్లో అలా ఒకే సమయంలో రెందుచోట్ల వున్న ఎలక్ట్రాన్తో సంయోగం చెంది పదార్థంగా మారి విశ్వంగా ఏర్పడుతున్న సమయంలో సమాంతర విశ్వాలు ఏర్పడే అవకాశం వుందని ఎవరెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదన. అంటే అనేక విశ్వాలు వుండవచ్చు. అంటే భూమిలాంటి అనేక గ్రహాలుకూడా వుంది తీరాలి. అలాంటి గ్రహాన్ని మనం ఆకాశంలో కొద్ది క్షణాలు చూసాంకూడా. దాన్ని వెతకటానికి ఒక బృందాన్ని పంపుతున్నారు. ఇప్పుడొచ్చిన సర్క్యులర్ దానికి సంబంధించినదే. అందులో చేరటానికి ఆసక్తి వుంటే ఎవరేనా ముందుకి రావచ్చు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయేది కాదు. పేరిచ్చినంతమాత్రాన ఇచ్చిన అందర్నీ తీసుకుంటారనీ కాదు” ఆయన చెప్పడం ముగించాడు. మమ్మల్ని చర్చలకి వదిలేసి క్లాసులోంచీ వెళ్ళిపోయాడు.
“సాధ్యమా? అలా వెతకడానికి మనిషి జీవితం చాలుతుందా?” అందర్లోనూ అదే అనుమానం. కొద్దిసేపు చర్చించుకుని అది తమకి సంబంధంలేని విషయమన్నట్టు వదిలేసారు. నేను మాత్రం అలా వుండలేకపోయాను. ప్రొఫెసరు మిత్రాగారుండే చోటికి వెళ్ళాను. ఆయన ఒక్కడే కూర్చుని బాస్ జర్నల్ చదువుతున్నారు.
“ఎక్స్క్యూజ్ మీ సర్!” గుమ్మం దగ్గిర నిలబడి అడిగాను.
“మీరా! నువ్వా?! రామ్మా!” అన్నాడు. జర్నల్ మూసి టేబుల్ మీద పెట్టాడు. నేను వెళ్ళి కూర్చున్నాను.
“చెప్పు” అన్నాడు చిరునవ్వుతో. నిజానికి ఈ చిరునవ్వు ముఖాలంకారానికేగానీ ఆయన మస్తిష్కం భయాలతో కాగిపోతుంటుందని నాకు తెలుసు. పర్యావరణంపట్ల ఏ కొద్దిపాటి అవగాహన వున్న వ్యక్తికేనా అలాగే వుంటుంది.
“మీరు చెప్పిన ఎక్స్‌పెడిషన్ నిజమా? భూమిలాంటి ఇంకో గ్రహం వుంటుందని మీరు నమ్ముతున్నారా?” ఆతృతగా అడిగాను.
“నమ్మకం ప్రయత్నానికి పునాది. అవసరం ఆవిష్కారానికి మాతృక. ప్రత్యామ్నాయ గ్రహం మన అవసరం. ఎక్కడో అలాంటిది వుందని నమ్మితేనే దానికోసం ప్రయత్నించగలుగుతాం. లేదని ఇప్పటిదాకా నిర్ధారించబడలేదు. అంటే వున్నట్టేకదా?”
“ఒకవేళ వున్నా వెతికి పట్టుకోవడానికి మనిషి జీవితం చాలుతుందా?”
“విశ్వం నిశ్చలమైనది కాదు. నిరంతరం విస్తరిస్తూవుంటుంది. పదకొండు అక్షాలలో కదుల్తూ వుంటుంది. ఎక్స్-వై అక్షాలు సున్నా దగ్గిర కలుసుకున్నట్టు ఈ అక్షాలుకూడా కలుసుకునే బిందువులు వుంటాయి. రెండు బిందువుల మధ్య దూరం తక్కువలో తక్కువ సున్నా. ఎక్కువలో ఎక్కువ అనంతం. మీరు ప్రయాణిస్తున్న తలం ఏదేనా వత్తిడికి గురై సుదూరపు బిందువు మీరున్న ప్రదేశాన్ని వచ్చి తాకినప్పుడు ఆ బిందువుమీదికి మీరు చేరగలిగితే తృటిలోనే కొన్ని కోట్లమైళ్ళదూరాన్ని దాటచ్చు. ఖగోళంలో ఇలాంటివి సాధ్యమని నమ్ముతున్నాం. ఫిలడెల్ఫియా ఎక్స్పరిమెంటు ఇదేగా?” అన్నాడు. నేను మాటలు మర్చిపోయినట్టు వుండిపోయాను.
నిజమే! ఏదేనా ఖగోళపు అద్భుతం జరగవచ్చు. అసలు ప్రయత్నమంటూ జరిగితేకదా, అద్భుతాలు జరగటానికి?
“ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ విద్యార్థులందరికీ ఈ సర్క్యులర్ పంపించారు. ఈమెయిల్ , ఎస్సెమ్మెస్ ద్వారా పంపించారు. నీక్కూడా వచ్చి వుండాలి?”
వచ్చిందన్నట్టు తలూపాను. “అందులో ఇంత వివరంగా లేదు. స్పేస్‌లోకి వెళ్ళటంపట్ల ఆసక్తి వుందా అని మాత్రం పంపించారు” అన్నాను.
“ఎలిమినేషన్ ప్రాసెస్. ఇష్టంలేదన్నవాళ్ళని అక్కడితో వదిలేస్తారు”.
“…”
“ఇష్టప్రకటన చేసాకకూడా అందర్నీ తీసుకుంటారనుకోవద్దు. ఇదేం ఎయిర్‌బస్ కాదు, కుదిరినంతమందిని ఎక్కించుకుపోవటానికి. చాలా ఫిల్టరేషన్సుంటాయి. ఆఖరికి మిగిలేది ఒక స్పేస్ సైంటిస్ట్, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ కావచ్చు” ఆయన నాకు కొన్ని విషయాలే చెప్పి వుంటాడు.
“నాకు వెళ్ళాలని వుంది” అన్నాను.
“జీవితాన్ని పోగొట్టుకోవాలని ఎందుకనుకుంటున్నావు?”అడిగాడు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లోని రెండోమెట్టు అప్పుడే మొదలైందని నాకు తెలియదు. కానీ ఆయనలా ఎందుకడిగాడో గ్రహించాను. మరో గ్రహం దొరికేదాకా అంటే యౌవనం, ఇంకా కాదంటే జీవితం మొత్తం ఆ వ్యోమనౌకలోనే గడపాలి. భూమ్మీదైతే ఇంకొకటో రెండో తరాలదాకా ఏదో ఒకలా ఆనందంగా వున్నామనుకుంటూ బతికెయ్యచ్చు.
నిశ్శబ్దంగా లేచి కిటికీదగ్గిర నిలబడ్డాను.కర్టెన్ తొలగించి కిటికీకి బిగించి వున్న అద్దంలోంచీ చూసాను. బైట తీక్షణమైన ఎండ వున్నట్టు నా చూపులకి తెలుస్తోంది. పవర్ఫుల్ ఏసీ లేకపోతే ఈపాటికి ఈ గదిలోని మనుషులు మాడి మసైపోయేవారేమో! ఇంతలో సుడిగాలి లేచింది. నేలంతా కుప్పలుగా పడి వున్న ప్లాస్టిక్ కవర్లన్నీ సుళ్ళు తిరుగుతూ ఒక స్తంభంలా ఎంతో ఎత్తుకి లేచాయి. గాలి ఆగింది. అవన్నీ మళ్ళీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఏ రోడ్డుమీద ఆగి చూసినా అదే దృశ్యం.
యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ చెత్తని క్లియర్ చెయ్యలేనని గవర్నమెంటు చేతులెత్తేసింది. వాడొద్దంటే వినేవాళ్ళెవరు? కొన్నాళ్ళు ప్రాసెస్ చేసి సముద్రంలో వదిలారు. అవి తిని అనేక సముద్ర జంతువులు చచ్చిపోయాయి. సీఫుడ్స్ తిన్నవాళ్ళకి అంతుచిక్కని రోగాలొచ్చాయి. ఆ పని మానుకున్నారు. కంప్రెస్ చేసి రోదసిలో వదిలిపెట్టే పని. ఖర్చు ఎక్కువ కావటం చేత, కాస్మిక్ డస్ట్తోపాటు అందులో కొంత మళ్ళీ భూమ్మీదికే చేరుతుండటంచేత అది వర్కౌట్ కాలేదు. వదిలిపెట్టేసారు.
ఆ దృశ్యం, ఆలోచనలు నా గుండెని బరువెక్కించాయి. చాలా పాతకాలం సినిమాల్లో చూసాను, చెట్లూ, పూలతో ఎంతందమైన భూమి…ఎలా మరుభూమిలా మారిపోయింది! నేను చూసిన దృశ్యాన్ని ప్రొఫెసర్ మిత్రా నావెనక నిలబడి చూసి చిన్నగా నిట్టూర్చాడు. “ఈ భూమిని బాగుచెయ్యటం మన చేతుల్లోంచీ దాటిపోయింది” అన్నాడు.
హఠాత్తుగా స్ఫురించినట్టై “కానీ ఇంతమంది మనుష్యుల్ని అక్కడికెక్కడికో ఎలా తరలించగలం? ఖగోళ అద్భుతాలు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే జరుగుతాయి” అడిగాను.
“మనుష్యులంతా రారు. అది సాధ్యపడే విషయం కాదు. భవిష్యత్తులో శిశువులుగా రూపొందడానికి అనువైన కొన్ని ఎంబ్రియోలు టెస్ట్ట్యూబులలో వస్తాయి. నలుగురు మనుష్యులు వెళ్తారు. పెళ్ళిచేసుకుంటారు. పిల్లల్ని కంటారు. మానవ నాగరీకత మళ్ళీ మొదలౌతుంది”
“అప్పటికే అక్కడ మనుష్యులుంటే?!”
” మన నాగరీకతకూడా సహజీవనం చేస్తుందని కోరుకుందాం”
అదంతా అనుకున్నంత సులువైన విషయంకాదని నాకు అర్థమైంది. విశ్వాంతరాళంలో ఒక కొత్త గ్రహాన్ని వెతకటం… అక్కడికి వెళ్ళి వుండటం … నాకు చాలా వుద్విగ్నంగా అనిపించి ముఖం ఎరుపెక్కింది.
అది గమనించి ప్రొఫెసర్ మిత్రా చిన్నగా నవ్వి , “ఎగ్జైటవ్వకు. ఇంటికెళ్ళి మరోసారి ఆలోచించుకో” అన్నాడు. నేను సిగ్గుపడ్డాను. అప్పటికి ఆయన్నుంచీ సెలవు తీసుకుని వచ్చేసానుగానీ ఆ క్షణంనుంచే నా మనసు ప్రయాణానికి సంసిద్ధమవసాగింది.
నాన్నతో చెప్పాను. “ఇక్కడే వుంది కేన్సరుతో బాధపడి చావటంకంటే వెళ్ళటమే మంచిది. ముందుముందు వుండేవి ఇంకా గడ్డురోజులు” అన్నారు. తన కళ్ళలో నీరు. తనకికూడా ఒకటిరెండు ట్యూమర్లు మొదలయాయి. అవి బినైనో మాలిగ్నెంటో ఇంకా తెలియదు. పరీక్షకి ఇచ్చి వచ్చారు. రిపోర్టు తెచ్చుకోవాలంటే భయం.
అమ్మదగ్గిర కూర్చున్నాను. బాధపడుతుందని నా నిర్ణయాన్ని చెప్పలేదు. బామ్మ ముఖం చూడలేకపోయాను. కేన్సరుతో ఆవిడ కృషించిపోతోంది. ఇలా ఎందరో… నా దేశంలో. కారణాలు అనేకం. అనేక రకాల రేడియేషన్స్కి ఎక్స్పోజ్ కావడం ఒకటి. ఇంకొకటి… అభివృద్ధి చెందిన దేశాలు ఈవేస్ట్ని వదిలించుకుంటూ వుంటే ఇండియాలాంటి దేశాలు ఆ డంప్‌ని తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తున్నాయి. అశాస్త్రీయమైన పద్ధతుల్లో కంప్యూటర్లలో వుండే ప్లుటోనియం , సెలీనియంలాంటి ధాతువుల్ని మురికివాడల్లో కలెక్ట్ చేస్తున్నారు. కంటికి కనిపించని రేడియోధార్మికత వాతావరణమంతా పరుచుకుపోతోంది.
వాడేసిన సెల్ఫోన్లని గాఢగంధకికామ్లంలో కరిగించి, బంగారాన్ని తీసి, మిగిలినదాన్ని ఎక్కడంటే అక్కడ పోస్తున్నారు. ఎలాంటి నియంత్రణా లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంత డబ్బు భ్రమ? ప్రపంచమే లేకుండాపోయాక ఈ డబ్బు మనకేం ఒరగబెడుతుంది?
కానీ … డబ్బుంటే సృష్టికి ప్రతిసృష్టి చేసుకునేనా బతికెయ్యచ్చునన్న ధీమా. నమ్మకం.
ఒకప్పుడు రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి మారణహోమం సృష్టించేవారట. ఇప్పుడు డబ్బుపిచ్చితో చేస్తున్నారు.
ఎంత బాధనిపించినా ఇది నా దేశం. వీళ్ళు నా మనుషులు. అజ్ఞానంతో అంతరించిపోయిన జాతికి నిదర్శనంగా వీళ్ళని చెప్పుకోకూడదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.