నీలినక్షత్రం – 7 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

గుహకి వెళ్ళటం, అవంతి శిల్పాన్ని చూడటం, గుహలోని రోదన వినటం, క్రిస్‍తో పరిచయం, అవంతి అనే అక్షరాలు అతను మట్టిలో రాయటం… అన్నీ చెప్పాడు అభిజిత్. అతనికంటే ఎక్కువగా ప్రణవి థ్రిల్లౌతోంది. “ఈ గుహలగురించి ఇక్కడ కొన్ని కథలు ప్రచారంలో వున్నాయిట శ్రీరాం, క్రిస్ చెప్పాడు. కొందరు ఏలియన్స్ ఇక్కడికి వచ్చారనీ, అందులో ఈ అమ్మాయిని చూసి ఒకతను ప్రేమలో పడ్డాడనీ, ఆమె తనవాళ్ళతో తిరిగి వెళ్ళిపోతే అతను విరహంతో వేగిపోతూ ఆ శిల్పాలని చెక్కాడని ఒక కథ. అతనికోసం ఆమె ఇక్కడే వుండిపోయిందనీ, అమృతం తాగి బతికేదనీ, అది దొరక్క చచ్చిపోయిందనీ ఇంకొక కథ. ఇంకా చాలా వున్నాయి. అన్నీ ప్రేమకథలే” అంది వుద్వేగంగా.
“సరిపోయింది. వాడిని మారుస్తావనుకుంటే నువ్వూ ఆ ధ్యాసలోపడ్డావా? ఇద్దరు మహామేథావుల సంతతి. పుట్టబోయే దొరవారింకెన్ని వింత ఆలోచనలు చేసి వింత సిద్ధాంతాలు కనిపెడతారో!” అన్నాడు శ్రీరాం.
ప్రణవి సిగ్గుపడింది. “వాణ్ణి నీకు ఇచ్చేస్తాంలే. నువ్వు పెంచు. అనుభవంకలవాడివికదా?” అన్నాడు అభిజిత్ పరిహాసంగా.
“మీరిచ్చేదేంటి? నేనే తెచ్చేసుకుంటాను. మీలా వాడిని పెరగనివ్వను” అన్నాదు శ్రీరాం ధాటీగా. “సరే, ఇంతకీ ఎప్పుడు తిరిగొస్తున్నారు?” అడిగాడు.
“వెంటనే బయల్దేరుతున్నాం. మళ్ళీ కావాలనుకుంటే రావచ్చని ఆలోచన” అభిజిత్ చెప్పాడు.
అతనితో మరికొద్దిసేపు మాట్లాడాక, ప్రిమియర్‍తో మాట్లాడింది ప్రణవి. “శ్వేతపత్రగ్రంథాన్నిగురించి మీకు తెలుసా? ” అనడిగింది.
“శ్రీనివాస్ అడిగి తీసుకున్నాడు దాన్ని” ఆయన చెప్పాడు.
“శ్రీనివాసా?” ఆ జవాబు విని తెల్లబోయింది. “ఎందుకు? ఎప్పుడు తీసుకున్నాడు? ఏం చేసుకుంటాడు?” గబగబ అడిగింది.
“అది చాలా పాతది. దాన్ని తయారుచేసిన పదార్థమేదో తెలుసుకుంటే మనంకూడా తయారుచేసుకుని మన పరికరాల్లో వాడచ్చని తీసుకున్నాడు. ఐనా దాని నకళ్ళు అన్ని మ్యూజియంలలో వున్నాయి. స్కాన్‍చేయించి పెట్టారు. ఒరిజినల్ పూర్తిగా చెడిపోయింది. ముట్టుకుంటే పొడిపొడిగా రాలుతోంది. నీకు దేనికి ప్రణవీ, అది?” ప్రిమియర్ అడిగారు.
“అభీ చిప్‍గురించి మీకు చెప్పాదుకదా, సర్? అందులోని మీరా డైరీ మధ్యలో ఆగిపోయింది. అనేక ప్రశ్నల్ని వదిలింది. ఇప్పుడీ గ్రంథంలో క్లూ ఏమైనా వుందేమోనని ఆలోచన. అవనతేశ్వరం వచ్చాము. మిగిలిన విషయాలు తనొచ్చి మీతో మాట్లాడతాడు” అంది.
“శ్రీనివాస్‍కి నెను చెప్తాను. దాన్ని అభీకి ఇమ్మని. అతనికి అభిజిత్ అంటే చాలా గౌరవం. తప్పక తనే తెచ్చిస్తాడు” అన్నారు ప్రిమియర్. ఆయనకి తెలుసు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమౌతారో! కానీ ఒక స్థాయికి వచ్చాక మనుషులు మానవసంబంధాల సంకెళ్ళలోంచీ ఇవతలికి వచ్చేసి, కేవలం వ్యక్తులుగానే మిగిలిపోతారు. ఇప్పుడు శ్రీనివాస్‍కీ ప్రణవికీ మధ్య రాగద్వేషాలు వున్నాయని ఆయన అనుకోవడంలేదు.
అభిజిత్ కేవలం ఆయన్ని గ్రీట్ చేసాడు. అతను తన వుద్వేగాన్ని ఏమాత్రం అదుపులో వుంచుకోలేకపోతున్నాడు. ఇలాంటప్పుడు అతను ఏకాంతాన్ని అభిలషిస్తాడు. మామూలుగానైతే కొన్నిరోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా వుండిపోతాడు. ఇప్పుడు తనగదిలో తన కంప్యూటరుముందు అంటే తన కంఫర్ట్‌జోన్‍లో ప్రణవితో తన భావాలని పంచుకోవాలని వుంది. అది క్షణక్షణానికీ పెరుగుతోంది. మనసు ఉద్వేగంతో నిండిపోతోంది.
ఫోన్‍లో మాట్లాడటం అయాక కాటేజికి వెళ్ళారు. ప్రణవిమీద చాలా ప్రేమ కలిగింది అభిజిత్‍కి. నీటి అలలా మొదలై వుత్తుంగ తరంగలా ఎగిసిపడుతోంది. అందులో ఆ వయసుకి సహజమైన మోహంకూడా మిళితమైవుంది. కాటేజిలో అడుగుపెట్టగానే ఆమెని రెండుచేతుల్లోకీ తీసుకుని మొదటిముద్దు పెట్టాడు. ఎంతో ఇష్టంగా. తర్వాత ఇంకొకటి… ఇంకొకటి… వర్షంలా తడిపేసాడు. ఇద్దరి మనసులూ వశం తప్పాయి.
“ఈవేళ వుండిపోదామా? ” అడిగింది ఆమె.
“లేదు. వెళ్ళిపోవాలి. నా కంప్యూటర్తో పంచుకోవాలి ఈ ఆనందాన్ని” అన్నాడు. వెంటనే స్ఫురించి ” నువ్వు జర్నీ చెయ్యగలవా?” అడిగాడు.
“ఇక్కడినుంచీ రావాలనిపించదంలేదు. ఈ పూలూ, గాలీ, ఎండా, వెన్నెలా అన్నీ బావున్నాయి. నువ్వుకూడా. ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా బావుంటావు అభీ! నీకెవరూ ఈ విషయం చెప్పలేదా? ” అడిగింది.
“నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలు” అతను నవ్వాడు.


అవనతేశ్వరం గుహల్లోకి వెళ్ళారనేసరికి శ్రీరాం ప్రణవీ, అభిజిత్‍లగురించి చాలా కంగారుపడ్డాడు. తను వద్దన్నా వెళ్ళేసరికి కోపంకూడా వచ్చింది. ఐతే ఇద్దరం సంతోషంగా వున్నామని ప్రణవి చెప్పడం అతనికి కొంత వూరట కలిగించింది. వాళ్ళతో మామూలుగా మాట్లాడినా లోలోపల ఏదో భయం. ఆ గుహల్లోకి వెళ్ళినవాళ్ళెవరూ నార్మల్‍గా వుండరని ఆందోళన. తన భయాన్ని పంచుకుందుకు ఒక పని చెయ్యకుండా వుండలేకపోయాడు. అందుకు జీవనికూడా ఆమోదం తెలిపింది.


అభిజిత్, ప్రణవీ తిరిగొచ్చేసరికి అటు అతని తల్లిదండ్రులూ, ఇటు ఆమె తల్లిదండ్రులూ కూడా వచ్చేసి వున్నారు. వాళ్ళని జీవనీ, శ్రీరాంలు వెంటబెట్టుకుని వచ్చారు. శ్రీరామ్‍కి అభిజిత్ ఫ్లాట్‍కి తాళం వేసి తీసే కోడ్ తెలుసు. అందర్నీ ఒకదగ్గిర చూసి ప్రణవి వుక్కిరిబిక్కిరైంది. అప్పటికే వాళ్ళకి ఆమె తల్లి కాబోతోందన్న విషయం తెలుసు. జీవని చెప్పింది. తనే వాళ్ళదగ్గిరకి వెళ్దామనుకుంటే వాళ్ళే ఇలా వచ్చినందుకు ప్రణవి థ్రిల్లైంది.
“అమ్మా! ” అంటూ తల్లి చేతుల్లో వాలిపోయింది.
“ఏమ్మా! నీ ఆరోగ్యం బావుందా? ఇలాంటప్పుడు అలాంటిచోటికి వెళ్తారా? ” అని తల్లి ప్రేమగా కోప్పడుతుంటే “నువ్వేనా, ఇదంతా చెప్పి రప్పించింది?” అన్నట్టు శ్రీరాంని కోపంగా చూసింది.
అన్నీ వదులుకుని విరాగిలా బతుకుతున్న కొడుకులో ఇంత మార్పొచ్చినందుకు అభిజిత్ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అందుకు ప్రధానకారణమైన ప్రణవి వాళ్ళకి ఎంతో అపురూపంగా అనిపించింది. ప్రణవికాకుండా మరే అమ్మాయేనా ఐతే అతని జీవితం ఇంత బావుండేది కాదు. అతనితోపాటు ఆమెకూడా బాధపడేది. ఇద్దరిమధ్యా చేదు అనుభవాలు మాత్రమే మిగిలేవి ఇలాంటి అపురూపమైన క్షణాలు కాకుండా.
ప్రణవి అమ్మానాన్నలుకూడా అలాగే సంతోషపడ్డారు. శ్రీనివాస్‍వలన ఎన్నో కష్టాలుపడింది ప్రణవి. ఎంతో ఉన్నతంగా పెంచుకున్న వాళ్ళ కూతుర్ని, మంచి చదువులు చదివి వున్నతశిఖరాలు ఎక్కాల్సిన యువ శాస్త్రవేత్తని … ఒక మామూలు ఆడపిల్లలా కన్నీళ్ళుపెట్టుకునే స్థాయికి తీసుకొచ్చాడతను. అది గుర్తొచ్చి వాళ్ళకి బాధకూడా కలిగింది. వీటన్నిటికీ భిన్నంగా అందర్నీ చూసి అభిజి‍కి పెద్దగా సంతోషం కలగలేదు. అతను సుదీర్ఘమైన ఏకాంతాన్ని కోరుకుంటున్నాడు. వాళ్ళు ఆటంకంలా అనిపించారు. చాలాకొద్దిసేపుమాత్రం అందరితో గడిపి వెళ్ళి తన గదిలో తలుపేసుకున్నాడు.
“అతనక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాడు. వాటిని విశ్లేషించుకోవాలి. అంతదాకా మనతో మాట్లాడలేడు. బలవంతంగా కూర్చోబెట్టినా చికాకుపడతాడు. ఎవరూ పట్టించుకోవద్దు” ఎంతో ప్రశాంతంగా ఒక చిన్నపిల్లవాడిగురించి చెప్పినట్టు చెప్పింది ప్రణవి. ఎవరూ అతని ప్రవర్తనకి బాధపడలేదు. వాళ్ళమధ్య వున్న అవగాహనకి సంతోషపడ్డారు. వాళ్ళతో తనే రాత్రిదాకా గడిపింది. జీవని మంచి భోజనం తయారుచేసింది. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళాకగానీ అభిజిత్‍తో గడపడానికి ఏకాంతం దొరకలేదు. అంతలోనే అందర్నీ ఎక్కడివాళ్ళనక్కడికి పంపించి జీవనిని ఇంటిదగ్గిర డ్రాప్‍చేసి శ్రీరాం మళ్ళీ వచ్చాడు.
“మళ్ళీ వచ్చావా?” అన్నట్టు వురిమి చూసింది ప్రణవి.
అతను కోపంతెచ్చుకోలేదు. నవ్వాడు. ఇలాంటి కోపాలు అతనికి అభిజిత్‍తో అనుభవమే. ఇప్పుడు ప్రణవి తోడైంది.
“నువ్వు అసాధ్యుడివి. దేన్నైనా తలుచుకుంటే వదిలిపెట్టవు. అసలు నీకా చిప్‍మీద అంత నమ్మకం ఎలా కలిగింది? ” అనడిగాడు అభిజిత్‍ని.
ప్రణవికి చెప్పినంత వివరంగా చెప్పలేదు. అన్నాడు,”ఇన్స్టింక్చువల్. అంతే. అది నిజమనిపించిందికాబట్టే అంత లోతుకి వెళ్ళాను”
“అంటే మనం వాళ్ళిద్దర్లో ఎవరో ఒకరికి పుట్టిన సంతతివాళ్ళమనేగా?” అడిగాడు శ్రీరాం.
అప్పుడు స్ఫురించింది అభిజిత్‍కి ప్రిమియర్ తొందరపడి ఈ విషయాలు ఎవరితోటీ అనద్దని ఎందుకన్నాడో.
“అంత తేలిగ్గా నిర్ధారణకి ఎలా వస్తాం? శ్వేతపత్రగ్రంఠం చదవాలి. అది చదివాక మీరా డైరీకి సరిపోతే ఆధారాలు వెతకాలి. అప్పుడుకదా?” అని తుంచేసాడు.
అతనటు వెళ్లగానే శ్రీనివాస్ అభిజిత్‍కి ఫోన్‍చేసాడు “మీరు శ్వేతపత్రగ్రంథం కావాలని అడిగారట. ప్రిమియర్ చెప్పారు. అది దాదాపుగా పొడిగా మారిపోయింది. అందులో వాడిన పదార్థం ఏమిటో నీలినక్షత్రంమీదికి మనుషుల్ని పంపే ప్రయోగాల్లో వాడితే ఎలా వుంటుందనే విషయంమీద ప్రయోగాలకోసం తీసుకున్నాను. మీరు కావాలంటే తెచ్చిస్తాను. దాని స్కాన్‍డ్ నకలుకూడా వుంది నాదగ్గిర. అదికూడా తెస్తాను. మీ ప్రయోగాల్లో సహకరించడం నాకు అత్యంత సంతోషాన్ని కలించే విషయం” అన్నాడు.
అతని ఇగో సమస్యలన్నీ ప్రణవితోనే. అన్నాచెల్లెళ్ళూ, భార్యాభర్తలమధ్యే పోటీ వుంటుంది. ఇంకెవరితోటీ వుండదు. అలా వుంటే దాన్ని ఓర్వలేనితనమనో అసూయనో అంటారు. అది చెడ్డతనంయొక్క మొదటి లక్షణం. అతను చెడ్డవాడు కాదు. అతనికి అభిజిత్‍తో ఎలాంటి వైరం లేదు. ప్రణవిని చూడాలనే అంతర్గతమైన చిన్నకోరిక కూడా వుంది.
అన్నట్టుగానే మరికాసేపటికల్లా వచ్చేసాడు. అభిజిత్ చాలా సంతోషంగా తీసుకున్నాడు అతనిచ్చిన వస్తువులని. అతనంత శ్రమ తీసుకుని స్వయంగా వచ్చి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ సమయానికి ప్రణవి లోపలెక్కడో వుంది. అభిజిత్ ఆమెని పిలవడానికి సంకోచించలేదు. అతను పిలిచేలోగా శ్రీరాం వెళ్ళిపోయాకకూడా వినిపించిన మూడోగొంతు విని తనే ఇవతలికి వచ్చింది. ఒక్క క్షణకాలపు తడబాటు. వెంటనే సర్దుకుని పలకరించింది. ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పు, సంతోషం ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి.
“బావున్నావా, వాస్?” అభిమానంగా పలకరించింది.
అతను తలూపాడు. అప్పటిదాకా అతన్లో వున్న ప్రసన్నతకి బదులు ఏదో అసహనం. ఆమె ముగ్గురికీ కాఫీ తెచ్చింది. తాగాక ఎక్కువసేపు వుండలేదతను. ప్రణవినీ అభిజిత్‍‍నీ చూస్తుంటే అతని గుండెల్లో అనిర్వచనీయమైన బాధ. అది అసూయమాత్రం కచ్చితంగా కాదు.
ఇంటికెళ్ళాక అందరూ పడుకుని వుంటారనిపించాక అతను ప్రణవికి ఫోన్‍చేసి మాట్లాడాడు. “నువ్వు తొందరపడ్డావు ప్రణవీ! ప్రేమకీ, పెళ్ళికీ విలువనేది లేకుండా చేసావు. నువ్వు అభిజి‍త్‍ని చేసుకోకుండా ఇంకొన్నిరోజులు ఆగివుంటే మనం పేచప్‍చేసుకునేవాళ్ళం… కచ్చితంగా” అన్నాడు.
ప్రణవి బాధపడలేదు. నవ్వేసింది. “నువ్వేం మారలేదు వాస్. ఇప్పటికీ నన్ను తప్పుపట్టడం మానలేదు” అంది.
“నిన్ను మర్చిపోలేకపోతున్నాను” అన్నాడు దీనంగా.
“అది నన్ను మర్చిపోలేకపోవటం కాదు. నా స్థానం ఇంకా ఖాళీగా వుండటం. నీకు తగిన అమ్మాయిని చూసుకుని చేసుకో. నేనింక గుర్తురాను”.
“అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు?”
“మరేం చెయ్యను? నీకోసం ఏడుస్తూ కూర్చోనా? అలా చాలాసార్లే చేసాను. ఐనా మన సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడుకదా, విడివిడిగా బతకాలని నిర్ణయించుకున్నది?”
“నీలాంటి అమ్మాయి నాకు మళ్ళీ దొరకదు. చాలా పశ్చాత్తాపపడుతున్నాను”
“నో రిగ్రెట్స్. నన్ను డిస్టర్బ్‌చెయ్యకు. మన దారులు కలవ్వనే విడిపోయాము. మళ్ళీ కలుసుకోలేనంత దూరంకూడా జరిగాం. వెనక్కి తిరిగిచూసుకోవడం నాకిష్టంలేదు” అని ఫోన్ పెట్టేసింది.
బాధగా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాధ సిల్లీగా కూడా అనిపించింది. ఐనా అది ముల్లులా కెలక్కుండా వూరుకోలేదు. మనసుకి అరలుంటాయి. ఏ భావానికి ఆ భావమే ఒక అర. ఆ భావానికి సరిపడా అనుభవం ఆ అరలో వుంటుంది. దేనికదే తెరుచుకుంటుంది, దేనికదే మూతపడుతుంది. ఎంత స్థితప్రజ్ఞతకలవాడికైనా అది అదుపులో వుండదు. శ్రీనివాస్‍తో చాలా గొడవలయ్యాయి. అతని దృష్టిలో అవి గొడవలు కావు. సర్దుకుపోగలిగే, సర్దుకుపోవల్సిన విషయాలు. భరించలేక విడాకులు తీసుకుంది. అతనికి ఇష్టంలేదు. ఆమెమీది ప్రేమతో వప్పుకున్నాడు. ఏదో ఒకలా బైటపడితే చాలనిపించింది.
ఒక సైంటిస్టుగా ఎన్నో సాధించిన తను ఒక సామాన్య యువతిలా ఎంత బాధపడింది! అతనొక మామూలు మగవాడిలా ప్రవర్తించాడు. అవన్నీ సహజసిద్ధమైనవాటిలా భరించాలని నిర్దేశించాడు. తన తెలివీ, స్పూర్తీ ఎందుకూ కొరగానివైపోయాయి. అతని మూర్ఖత్వం, అసూయ అన్నిటినీ అణిచి వుంచాయి. అవన్నీ ముగిసాయి. ఇప్పటికి ఒక దారంటూ దొరికింది. మనసుకి సుఖంగా వుంది.
ఆలోచనలని అదుపు చేసుకుంటూ పడకగదిలోకి వెళ్ళింది. అభిజిత్ కంప్యూటరు ముందు కూర్చుని తన లోకంలో తనున్నాడు. అతన్నలా చూసి ఏదో తప్పు చేసిన భావన కలిగింది. మరొక్కమాటు శ్రీనివాస్‍తో మాట్లాడాలనిపించింది. అతనితో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంది. రింగ్ చేసింది. అతను ఎత్తగానే-
“అభిజిత్‍మీద గౌరవం వుంటే ఇంకొక్కసారి మన పాత సంబంధాన్ని ఎత్తకు. అలాగని అతనిమీద నేకెలాంటి గౌరవం లేదంటే నీ మాటల్ని పట్టించుకునే అవసరంకూడా నాకు లేదు. బై” అని చెప్పి పెట్టేసింది.
ఆరోజు అభిజిత్ దగ్గరికి ఆమె వెళ్ళలేదు. మాట్లాడలేదు. అతని భావాలనీ తపననీ సంతోషాన్నీ పంచుకోలేదు. మనసులో చాలా యిబ్బందిగా అనిపించి, తనగదిలో తను వుండిపోయింది.
అభిజిత్ శ్వేతపత్రగ్రంథాన్ని ఒక కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాడుగానీ అతని మనసుకి వంటరితనం తెలుస్తునే వుంది. ప్రణవిని పిలుద్దామని అనుకుని ఆమెకూడా అలిసిపోయి వుంటుందనో, శ్రీనివాస్ రావటం చేత కలతచెంది వుంటుందనో అనుకుని ఆమె భావాలకు విలువనిచ్చి పిలువలేదు. మరుసటిరోజుకి ఆమె సర్దుకుంది.


శ్వేతపత్రగ్రంథం అని పిలవబడే ఆ పుస్తకం పేజీలు దాదాపు శిథిలావస్థలో వున్నాయి. దాని నకళ్ళు తీయించి చాలా మంచిపని చేసారు. ఐనా చాలాచోట్ల సరిగా స్కాన్ కాలేదు. స్కాన్ కాబడినంతవరకు అది బిట్‍మాప్ చిత్రం కాబట్టి దాన్ని అభిజిత్ లేంగ్వేజి మిషన్ డీకోడ్ సరిగా చెయ్యలేకపోయింది. అసలా పుస్తకం ప్రత్యేకంగా తయారు చెయ్యబడిన ప్లాస్టిక్ కాగితాలమీద ట్రాన్సిషన్ ఎలిమెంటుతో తయారుచేసిన ఇంకుతో రాయబడింది. ప్లాస్టిక్ కాబట్టి ఇంతకాలం వుంది. ఇంకుగా వాడిన పదార్థానికి మూలకం మరొకటిగా రూపాంతరం చెందే లక్షణం వుంది తప్ప నశించదు. అందుచేత చేతిరాతకూడా మన్నికగానే వుంది.
కంప్యూటర్ చిప్‍లోంచీ డీకోడ్ చెయ్యబడినవాటి ఆధారంగా ఒక్కొక్క అక్షరమే పోల్చి చూసి రాయడం , ఎక్కడైనా అనుమానం వస్తే అసలు ప్రతిని చూడటం… ఇద్దరూ ఒక యజ్ఞంలా చేస్తున్నారు. “ఇదంతా అవసరమా?” అడిగాడు శ్రీరాం కొంచెం బాధగానూ, కొంచెం కోపంగానూ. ప్రణవికూడా అందులో కూరుకుపోవటాన్ని సమర్ధించలేకపోతున్నాడు. కానీ ఆమె అంటోంది, “ఇంకెన్నాళ్ళు? సృష్టిరహస్యం తెలిసాక కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలని అనుకోరు. అభిజిత్ కూడా మారతాడు. చూస్తుండు”
అతను వాళ్ళిద్దరి తపననీ చూస్తునే వున్నాడు.
ప్రీమియర్ కూడా వాళ్ళిద్దరి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. పూసలు గుచ్చినట్టు అక్షరమక్షరం తిరిగి రాసేసరికి చాలా సమయం తీసుకుంది . మొత్తానికి కొన్నిచోట్ల శ్వేతపత్ర గ్రంథం ఒరిజినల్‍లోనే మేటరు మిస్సవటంతో అభిజిత్ తన స్వంత పూరణ చేసాడు . కొన్ని ప్రక్షిప్తాలతో పూర్తైన గ్రంథం మధ్యలో ఆగిపోయిన మీరా డైరీకి కొనసాగింపు కావడం విశేషం . అది అభిజిత్‍కి ప్రపంచాన్ని జయించిన భావన కలిగించింది . నీలినక్షత్రానికి స్వయంగా వెళ్ళివచ్చిన సంతోషాన్నిచ్చింది .