శ్రీరామ్, ప్రణవి ఇంతలా హైరానపడుతుంటే అభిజిత్ మాత్రం కూల్‌గా ఉన్నాడు. చాలా విచిత్రంగా తన మనసులోని అలజడి చేత్తో తీసేసినట్టు మాయమైంది. మీరా చనిపోయాక ఏం జరిగిందో ఖచ్చితమైన ఆధారాలు లేకపోవచ్చు. కానీ మీరా ఒక వాస్తవం
“నీలినక్షత్రంమీదికి వెళ్ళగలిగేలా ప్రయోగాలు ముమ్మరం చేస్తాను అభీ! ఇద్దరం వెళ్దాం. శ్రీరామ్ అన్నాడుగా… బాబుని తనకి ఇచ్చేయమని, ఇచ్చేసి వెళ్ళిపోదాం” అంది ప్రణవి. అభిజిత్ చిరునవ్వు నవ్వాడు.
ప్రీమియర్ తో మాట్లాడాడు అభిజిత్. ఆయన్ని కలిసి తను తెలుసుకున్న వాస్తవాలన్నీ చెప్పాడు. ఆయన చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు.
“మీరు అసాధ్యులు అభిజిత్. అనుకున్నది మొత్తానికి సాధించారు” అన్నాడు ప్రశంసగా.
ప్రతిమనిషీ తన మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తెలీకపోతే అనిశ్చితిగా ఉంటాడు. మనుషుల ఇప్పటి స్థితిమీద శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు ఎప్పటినుంచో చేస్తున్నారు. కోతినుంచి మనిషి పుట్టాడనేది ఒక సిద్ధాంతం. అలా ఎదిగిన మనిషి అనేక నాగరీకతలు దాటుకుంటూ వచ్చి ఇప్పటి ఈ స్టేజిని చేరుకున్నాడనేది ఆ సిద్ధాంతాన్ని బలపరిచే వాదన. దానిమీద ఎన్నో చర్చలు జరిగాయి. ఇక్కడ నాగరీకత ఆనవాళ్లు, రాతి పనిముట్లు, అవి లక్ష సంవత్సరాలవి మాత్రమే ఉన్నాయి. లక్ష సంవత్సరాలనేది మానవపరిణామానికి సంబంధించి చాలా తక్కువ సమయం. కాబట్టి ఆ సిద్ధాంతం తప్పనేది వ్యతిరేక వాదన. ఏదీ ఇప్పటిదాకా నిరూపించబడలేదు. ఇప్పుడు నిరూపించబడింది. కానీ ఇదంతా జరిగిన వేదిక ఈ గ్రహం కాదు. మరెక్కడో. ఇక్కడికి వచ్చిన మనిషి ఆధునికుడు. ఆ విషయమే ఆయనకి చాలా వింతగా అనిపించింది. అంత గొప్ప విషయాన్ని అజ్ఞాతంగా ఎందుకు ఉంచాలి? వెల్లడిస్తే తప్పేంటి? తను అభిజిత్ దగ్గర తీసుకున్న మాటని వెనక్కి తీసుకోవాలనుకున్నాడు.
“వాళ్లు చెప్తున్న హైదరాబాద్ బహుశా ఆడమ్స్ కేవ్ ప్రాంతం అయ్యుంటుంది. ఊబి ఉండగలిగే ప్రాంతాన్ని గుర్తించి అక్కడ తవ్వకాలు జరిపితే వాళ్ల పారాచూట్ అవశేషాలు దొరకవచ్చు. అలాగే మిడ్ ఓషన్‌లో అయస్కాంతక్షేత్రం ఏర్పడి నౌకల్ని బలంగా ఆకర్షిస్తోంది. అక్కడ ప్రయోగాలు చేస్తే వాళ్ల స్పేస్ షిప్ భాగాలు దొరుకుతాయేమో! అది రేడియేషన్‌ని ఇంధనంగా మార్చుకుని వాడుకునే టెక్నాలజీతో తయారయింది. అందులోని భాగాలు ఇంకా కాస్మిక్ రేడియేషన్‌ని ఆకర్షిస్తున్నాయేమో! అంత బలమైన అయస్కాంతక్షేత్రానికి అదే కారణమేమో! టెక్నాలజీపరంగా వాళ్లు చాలా ముందున్నారు” అన్నాడు అభిజిత్.
“అలాగే చేద్దాం” ప్రీమియర్ మాట ఇచ్చాడు.
ఇంకేం మాట్లాడాలో అర్ధం అవ్వలేదు అభిజిత్‌కి. మనసంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంది. అది దేంతో నింపుకోవాలి? వీడ్కోలు తీసుకుని వచ్చేసాడు.
డీఎన్ఏ , మైటోకాండ్రియల్ జెనోమ్ టెస్టులు చేయించుకుని వచ్చింది ప్రణవి.
“అభీ! నేనెవర్ని? అవంతీ గౌతమ్ ల డిసెండెంటునా లేక మీరా హర్షల వారసురాలినా? తెలుసుకోవాలని ఉంది” అని అడిగింది.
వాళ్ల డిఎన్ఏ, జెనోమ్ పిక్చర్స్ కంప్యూటర్ చిప్‌లో ఉన్నాయన్న విషయం శ్వేతపత్ర గ్రంథంలో ఉంది. అభిజిత్ కంప్యూటర్లో వెతికాడు. శ్వేతపత్ర గ్రంథంలో ఎక్కడ ఏముందో కంప్యూటర్ చిప్‌లో మీరా క్లుప్తంగా చెప్పింది. కాబట్టి వాటిలోంచి వెతుక్కోవడం కొంత తేలిక అయింది. అయినా ఫైల్సన్నీ ఒక క్రమంలో లేకపోవడంతో కచ్చితంగా ఎక్కడుందో తెలుసుకోవడం కష్టమైంది. అన్నిటికన్నా ముందుగా అతన్ని కదిలించినవి వాళ్ళ ఫోటోలు.
నలుగురు వ్యక్తులు. వాళ్ళవి పాతికేళ్లవయసులో ఉన్నప్పటి ఫోటోలు. తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంది అవంతి. పింక్ కలర్ శారీ కట్టుకుంది. మెరిసే కళ్ళు, చిరునవ్వుని నింపుకున్న చూపులు. పక్కన గౌతమ్. ఆమెకు తగ్గట్టే ఉన్నాడు. వెరసి యుగాలకి నిలిచిన ఒక ప్రేమకథకి సృష్టికర్తలు. తర్వాత మీరా… ప్రేమను త్యాగం చేసి వచ్చిన అమ్మాయి. ఆ తర్వాత హర్ష. వీళ్లలో ఎవరికి తను చెందుతాడు? ఎవరికి వారసుడు తను? తనలోని జన్యువులు ఎవరివి? రక్తం అంతర్మిళితం కాకుండా అలాగే ఉందా? ప్రణవి డిఎన్ఎ పిక్చర్ మేప్ చేసి చూశాడు. అవంతి గౌతమ్‌ల వివరాలతో సరిపోయింది. ఇంకా వెనక్కి కూడా వెళ్ళింది. కానీ అది అవసరం లేదు. ఒక జంట పిల్లల్ని ఇంకో జంటలోనివాళ్ళు చేసుకున్నారు కాబట్టి అందర్లోనూ నలుగురి జీన్సూ ఉంటాయి. తల్లిదండ్రుల జీన్స్ కొద్దిగా ఎక్కువ. అతను కొత్త కుతూహలంతో చూశాడు ప్రణవిని. అవంతి పోలికలున్నాయా ఈమెలో? అవంతి ఇలాగే ఉండేదా? అన్న ప్రశ్న వేసుకున్నాక తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. లక్ష సంవత్సరాల తర్వాత పోలికలు అలాగే ఉంటాయా? అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మొదట్లో రెండు ప్రేగులు కలిసేచోట అపెండిక్స్ అన్న చిన్న అవయవం ఉండేది. ప్రారంభదశలో మనిషికి ఉండే తోక అలా మారిందని చెబుతారు. ఇప్పుడా అపెండిక్స్ లేదు. కోరపళ్ళు సమతలం అయ్యాయి. అవయవ నిర్మాణపరంగానే ఇన్ని మార్పులు వచ్చినప్పుడు బాహ్యరూపంలో మార్పులు రావా? అనుకున్నాడుగానీ అతనికి ప్రణవిలో అవంతి ముద్ర కనిపిస్తూనే ఉంది. వెంటనే ఒక విషయం తట్టింది. ఆలస్యం చేయకుండా ప్రీమియర్ కి ఫోన్ చేశాడు.
“కంప్యూటర్ చిప్ విషయాలు బయటకు చెప్పొద్దని మీరు అన్నప్పుడు నేను చాలా నిరుత్సాహం చెందాను. కానీ ఇప్పుడు అర్థమైంది, మీరలా ఎందుకన్నారో” అన్నాడు.
ప్రిమియర్ చకితుడయ్యాడు. ఎందుకని ప్రశ్నించకముందే జవాబు వచ్చింది అభిజిత్ దగ్గరనుంచి.
“ప్రణవి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంది. తన జీన్స్ అవంతి జీన్స్‌తో కలుస్తున్నాయి. అప్పట్నుంచి నాకు తన మొహంలో అవంతి ముద్రే కనిపిస్తోంది. తను అవంతి డిసెండెంట్ అనే విషయం చాలా వింతగా తోస్తోంది. విషయం తెలిసిన ప్రతివాళ్ళూ చేయించుకుంటే…” ఆగాడతను. అవును… చేయించుకుంటే? ఎవరు ఎవరో తెలిసిపోతుంది. ఏవి క్రాస్ రిలేషన్సో ఏవి పేరలల్ రిలేషన్సో తెలుస్తాయి. అప్పుడు సమాజమంతా అవంతులు, మీరాలతో నిండిపోతుంది. మగవాళ్ళంతా గౌతమ్‌లు, హర్షలు అవుతారు. బంధుత్వాలన్నీ అపసవ్యంగా మారతాయి. అప్పుడు? తను ఊహించినదానికన్నా పెద్ద తిరుగుబాటే జరుగుతుంది సమాజంలో.
“ఇలాంటివి ఎవరికీ తెలియకపోవడమే మంచిది. అయినా ముందుతరాలలో ఎవరైనా ప్రయత్నిస్తే తెలిసేలా కోడిఫై చేసి ఉంచుతాను” అన్నాడు అభిజిత్.
“నీ పరిశోధన ఎంత గొప్పదో అర్థం చేసుకున్న క్షణాన ఆ విషయాలన్నీ బయటపెట్టమని చెప్పుబోయాను. ఇంత దూరం ఆలోచించలేదు. శాస్త్రవేత్తల ప్రయోగాలకి మీరు వ్యతిరేకంగా వెళ్తే గొడవలవుతాయన్న కోణం నుంచి మాత్రమే ఆలోచించాను. మీలా కాదు” అన్నాడు.
ప్రీమియర్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడన్న వార్త దేశంలో కొంత సంచలనాన్ని రేపింది. ఏదైనా హిల్ స్టేషన్‌కి వెళ్లి కుటుంబంతో గడుపుతాడన్న అందరి అంచనాలకు వ్యతిరేకంగా ఆయన వంటరిగా ఆడమ్స్ కేవ్‌కి వెళ్లాడు. అక్కడ అడుగు పెడుతుంటే వళ్లు గగుర్పొడిచింది.
వాళ్లు నలుగురూ సముద్రం ఒడ్డున దిగారు, ఇక్కడికి వచ్చి ఈ గుహలో ఉన్నారు, మొదటిరోజు రాత్రి ఇక్కడే కూర్చుని వుంటారని అనుకుంటుంటే తెలీని ఉద్వేగంతో మనసంతా నిండిపోయింది. బహుశా ఇక్కడే వాళ్లు మొదటి గ్రామాన్ని నిర్మించుకొని ఉంటారు. ఆ రాతిమీద రాతలు అవంతి రాసినవే అయ్యుంటాయి. ఈ గీతలు పౌర్ణముల పండగరోజున వాళ్ళు చెక్కుకున్నవి కావచ్చు. ఒకటో రెండో మిగిలాయి. గుహ గోడల నిండా బొమ్మలు, తెలీని లిపిలో అక్షరాలు, ప్రతీదీ తడిమి చూశాడు. రెండురోజులు అక్కడే గడిపాడు. అర్ధంకాని ఆవేదన.
అవనతేశ్వరం వెళ్లాడు. అవంతి శిల్పం చూశాడు. మీరా హర్షల శిల్పాలు, వాళ్ల పిల్లలవి చూశాడు. తర్వాత ఎవరు వద్దంటున్నా వినకుండా గుహలోకి వెళ్లి గౌతమ్ ఏడుపు విని దుఃఖాన్ని గుండెలనిండా నింపుకుని వచ్చాడు. ఆ దుఃఖం గుండెల్లో నిండి ఉన్న నేపథ్యంలో అవంతి విగ్రహంకేసి చూస్తూ ఎంతోసేపు గడిపాడు. తన చెల్లెలిలాగో తల్లిలాగో అనిపించింది. రేపెప్పుడో పెద్దయ్యాక తన కూతురు కూడా అలాగే ఉంటుందనిపించింది. సుదూర గ్రహంలోని యువతి, అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఇమడలేక ప్రాణం తీసుకుంది. బాధతో విలవిల్లాడిపోయాడు.
క్రిస్ ఆయన్ని కలిసి తనని తాను పరిచయం చేసుకున్నాడు. అతడు తమ శత్రుదేశానికి చెందిన మనిషి. ఆ దేశపు నిర్ణయాలు తమకి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. దేశరక్షణపరంగానూ, ఆర్ధికపరంగానూ తమకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయినా ఆ క్షణాన అవేవీ గుర్తురాలేదు. అతడు కూడా ఆ నలుగురి సంతతేకదా అనిపించింది.
ఏ కారణాలైతే వాళ్లని ఇక్కడిదాకా తీసుకొచ్చాయో అవే కారణాలు ఇక్కడ కూడా పుట్టుకొస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం పెరిగింది. ఉద్గారవాయువుల స్థాయిలు పెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. అయినా పరిస్థితి చెయ్యి దాటలేదు.
తిరిగి రాగానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్లాస్టిక్ వాడకం నిషేధించలేదు. కాగితం వాడకానికి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించాడు. నారతో చేసిన వస్తువులకి గవర్నమెంట్ తరపున ఆకర్షణీయమైన మద్దతుధర ప్రకటించాడు. చాలా ప్రతిఘటన వచ్చింది ప్లాస్టిక్ ఇండస్ట్రీనుంచి. ఎవరైనా వాళ్ళ ఇండస్ట్రీని అమ్మేసేట్టైతే ప్రభుత్వమే కొంటుందని చెప్పాడు. ఇంకా ఎన్నో చెయ్యాలన్న తపన ఆయనలో తన్నుకొస్తోంది. ఆయన నిర్ణయాలు చాలామందికి నచ్చలేదు. ఆయన్ని దింపేసేందుకు లాబీయింగ్ మొదలైంది. ఎలాంటి పదవి కూడా ఈ పుడమిని కాపాడలేదనే విషయం అర్ధమైంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా నాగరికత పెరిగి పెరిగి మనిషి తన ఉనికికే చేటు తెచ్చుకున్నాక అతన్ని పక్కకి తప్పించి ప్రకృతి తనని తను సరిదిద్దుకుంటుంది. తను చెయ్యగలిగింది మానవప్రయత్నం మాత్రమే. ఈ వాస్తవం ఆయన్ను చాలా బాధపెట్టిందిగానీ కర్తవ్యవిముఖుడిని చెయ్యలేదు. అన్నిటికీ బదులుగా ఒకే మాటలో తన స్పందన చెప్పాడు అభిజిత్.
“ధన్యవాదాలు “
అది చాలా చిన్నపదం, తనలో ఆయనలో అందరిలో వాళ్ల జీన్స్ ఉన్నాయి. మానవాళిని కొనసాగించాలన్న తపనని కూడా నింపుకుంటే అదే చాలు.
అభిజిత్ ప్రణవిలు, జీవని శ్రీరాంలతో కలిసి మళ్లీ అవనతేశ్వరం వెళ్లారు. అవంతి విగ్రహం కంప్యూటర్లో ఉన్న ఫోటోలోలాగే ఉండటం జీవనికి ఆశ్చర్యం కలిగించింది.
“గౌతమ్ చాలా మంచి శిల్పే” అని మెచ్చుకుంది అతనేదో నిన్నమొన్నటివాడన్నట్టు, అందరికీ నవ్వొచ్చింది ఆమాటలకి.
ప్రణవికి తన పుట్టింటికి వచ్చినట్టు అనిపించింది. అవనతేశ్వరం గుహలోకి అడుగుపెట్టగానే క్రిస్ కలిశాడు. అతని పరిశోధనలింకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అవి ఎప్పటికీ పూర్తవవు. ఆ విషయం అతనికి ఎవరైనా చెప్తే బావుంటుందనిపించింది ప్రణవికి.
ప్రీమియర్‌కి ఒక సందేహం కలిగింది. అభిజిత్ కి ఫోన్ చేసి అడిగాడు, “వాళ్లు అంతదూరం నుంచి ఎలా రాగలిగారు? వేగాన్ని ఎలా తట్టుకున్నారు?” అని.
“ప్రయాణించినది వాళ్లు కాదు, వాళ్ళ షిప్”అన్నాడు అభిజిత్.
ఆ టెక్నాలజీని తెలుసుకోగలిగితే నీలినక్షత్రానికి వెళ్ళిరావచ్చన్న విషయం అర్థమైంది ప్రీమియర్‌కి వాయిదా వేసిన ఫైలును పునఃపరిశీలనకి పంపించాడు. అందులో మొదటి పేరు అభిజిత్‌ది. తన పేరు కూడా చేర్చమని ప్రణవి అడిగింది. ఆయన సరేనన్నాడు. ఇది కార్యరూపానికి రావడానికి ఎంతకాలం పడుతుందో!
శ్రీనివాస్ శ్వేతపత్రగ్రంథం తయారుచేసిన పదార్థం ఏమిటనేదానిమీద తన ప్రయోగాలని వేగవంతం చేస్తున్నాడు. వీలైతే అభిజిత్ ని తప్పించి ఆ స్థానంలోకి తను వెళ్లాలని అతని ఆలోచన. లేకుంటే ప్రణవిని తప్పించి ఆమెతో కలిసి ఇక్కడే వుండిపోవాలని. శ్వేతపత్ర గ్రంధంలో ఏముందో అతనికి తెలీదు. అభిజిత్‌కి కూడా తెలిసి ఉండదని అతని నమ్మకం.
ప్రణవికి కొడుకు పుట్టాడు. ఇద్దరు మేధావుల కొడుకైన ఆ సరికొత్త మేధావి కొంత పెరిగాక తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ అడిగాడు. “నాన్నా, దీనికి మనలా మాటలు ఎందుకు రావు?” అని.
తన తాతగారిలా ఆ పిల్లవాడిలో జిజ్ఞాస పెంచే జనాలివ్వలేదు అభిజిత్. “అది కుక్క కాబట్టి” అని సింపుల్ గా చెప్పేసి విజ్ఞానశాస్త్రపు విశాల ఆకాశంలోకి మనస్సు విహంగంలా ఎగరగలిగే గవాక్షాన్ని మూసివేశాడు.
(ముగిసింది)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.