పగిలిన టీ కప్పు ముక్కలు గదంతా చిందరవందరగా పడి వున్నాయి. అందులోంచీ వొలికి టీ మరకలు గచ్చంతా పరుచుకున్నాయి. కొన్ని ఆరినవి, కొన్ని ఇంకా ఆరనివి.
ఆమె డైనింగ్టేబుల్ ముందు రెండుచేతుల్తోనూ తల నొక్కుకుంటూ కూర్చుని వుంది.
పెద్దసోఫాలో ఒక మూలకి తడి తువ్వాలు వుండ…
సోఫాకీ షూరేక్కీ మధ్య విడిచిన షూస్, వాటికి కొంచెం దూరంగా సాక్స్…
షూ రేక్మీద సగం చదివిన పేపరు…
బెడ్రూమ్లోంచీ బాత్రూంకి వెళ్ళేదార్లో విడిచిన బట్టలు…
సోఫాలమీదా కుర్చీలమీదా ఎక్కడంటే అక్కడ నిండిపోయిన దుమ్ము…
“నువ్వు చాలా మారిపోయావు ప్రమీలా! చాలా… ” బయటికి వెళ్ళడానికి తయారయ్యి దబదబ అడుగులు వేస్తూ అన్నాడు అతను.
“ఇల్లు చాలా అందంగా వుంచేదానివి. ఎక్కడా పిసరంత దుమ్ముకూడా కనిపించేది కాదు. పనిమనిషినికూడా పెట్టుకోకుండా పనంతా చేసుకునేదానివి. ఏమైంది అసలు నీకు? “
“…”
“ఇంటికి అతిథులు వస్తే పొందికగా అలంకరించి చూయించేదానివి. చెత్త కుక్కినట్టు అన్నీ కప్బోర్డ్స్లోకి తోసేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళు వెళ్ళగానే వూపిరి పీల్చుకుంటున్నావు”
“…”
“పదిరకాలు ఇష్టంగా వండిపెట్టేదానివి. స్విగ్గీలు, జొమాటోలూ వరసకడుతున్నారు”
“…”
“పుస్తకాలూ, టీవీ, సెల్… ఇదే నీ కాలక్షేపం. ఇదివరకూ నా చుట్టూ తిరిగి ఏం కావాలో చూసుకునేదానివి. తాగిన కాఫీకప్పుకూడా అలాగే వదిలేస్తున్నావు”
“…”
“ప్రతిదానికీ నామీద కంప్లెయింటు… తడి తువ్వాలు సోఫాలోనో బెడ్మీదో పడేస్తాననీ, షూస్ రేక్‌లో వుంచననీ… అన్నీ నీకు ఫిర్యాదులే. కోపం. విసుగు… ముప్పయ్యేళ్ళుగా ఇలాగేగా వున్నాను? కొత్తగా ఏం జరిగిందని? నువ్వు చాలా మారిపోయావు…ప్రమీలా!”
అతను ఇంట్లోంచీ వెళ్ళిపోయినట్టు దూరమైన అడుగుల చప్పుడు. తెరిచిన వదిలేసిన గేటు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.