భారతదేశం.
ప్రపంచమేథోసంపత్తిలోని సింహభాగం తనదేనని సగర్వంగా ప్రకటించుకున్న దేశం. బిడ్డ పుట్టాక కొన్నాళ్ళకి ఎండిపోయి రాలిపడే బొడ్డుతాటి ముక్కని జాగ్రత్తగా రాగిగొట్టంలో దాచుకుని, మొలతాడుకో దండకో తాయత్తులా కట్టుకుంటూ అదొక మూఢనమ్మకం అనిపించుకోవడం దగ్గర్నుంచీ ఎదిగి, జన్యుసంబంధమైన ఎన్నో ప్రయోగాలు చేసి మూఢనమ్మకాలనుకున్న ఎన్నో ప్రశ్నలకి శాస్త్రపరంగా సమాధానం చెప్పి జన్యువిప్లవానికి చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించిన దేశం. అంతర్గత, ప్రపంచ, రాజకీయాలకి అతీతంగా ఎదిగిన ఒక బృహత్తరమైన విజ్ఞానశక్తి.
విజ్ఞానం ..మానవీయస్పర్శతో సమ్మిళితమైనప్పుడు ప్రగతి. విడివడితే ఎంత సాధించినా మిగిలేది మహాశూన్యం. సున్నాని ప్రపంచానికి అందించిన భారతీయులే ఈ మహాశూన్యాన్నికూడా గుర్తించారు. ఐనా ఒకటోరెండో పొరపాట్లు. వాటికి కొన్ని దిద్దుబాటు తీర్మానాలు. అలాంటిదే ఒకటి జరిగి ఒక పిల్లవాడిని మనిషిగా గుర్తించడం జరిగింది.
విశ్వమానవ పరిషత్తు… విమాప.
కులాలు, మతాలు అంతమయ్యాయి. ప్రపంచంలో ఇప్పుడు మూడురకాల మనుషులున్నారు. సహజమానవులు, యంత్రసాంకేతిక మానవులు, జన్యుసాంకేతిక మానవులు. అనేక కారణాలవలన మనుషులు సహజంగా పుట్టడం తగ్గిపోయింది. మరమనుషుల సంఖ్య బాగా పెరిగింది. వీరివలన మనుషుల దైనందిన జీవితాలు చాలా సులభతరం కావటం, ఔద్వేగిక అవసరాలకికూడా ఆసరా కావటంతో మానవోద్వేగాలతో సమానమైన సెన్సర్లున్న ఆండ్రాయిడ్లని తెచ్చుకుని, వాటికీ హక్కులు, కుటుంబంలో స్థానం కల్పించడం మొదలైంది. ఎవరేనా ప్రత్యేకమైన అవసరాలకోసం ఒక మిషన్ని తయారు చేసుకుని, అవసరం తీరాక వదిలేస్తే, మరొకరు దాన్ని కొనుక్కునేదాకా ఆశ్రయాన్నీ, మెయింటెనెన్సునీ అడిగే హక్కు వీటికి వుంటుంది. విమాప కల్పిస్తుంది.
ఇక మూడోతరగతికి చెందినవారు చాలా ముఖ్యమైనవాళ్ళు. అలాంటి ఒక పిల్లవాడికి సంబంధించి ఒక వ్యాజ్యం విమాప ముందు నడుస్తోంది. మూడువందలయాభైమంది ప్రయాణీకులని తీసుకెళ్తున్న పాసింజర్ విమానం కొద్దిరోజులముందు పసిఫిక్ మహాసముద్రపు ఉపరితలంమీద పక్షి తాకిడికి కూలిపోయింది. అందులోని ప్రయాణీకులంతా చనిపోయారు. చనిపోయినవారిలో చంద్రహాస్, అవంతికూడా వున్నారు. చంద్రహాస్ భారతదేశపు అత్యధిక ధనవంతులలో ఒకరు. అవంతి అతని భార్య, వ్యాపారదక్షతలో అతనికి సమవుజ్జీ. వాళ్ళకొడుకు ఆ పిల్లవాడు. అతడికి ఆరేళ్ళు. పేరు ప్రీతమ్. వివాదానికి సంబంధించిన ఆరుగురు విశిష్టమైన వ్యక్తులు పరిష్కారంకోసం విమాప ఆవరణలో ఎదురుచూస్తున్నారు.
విమాప వివాదంకోసం వచ్చినవాళ్ళలో నలుగురు ప్రీతమ్‍కి తల్లి లేక తండ్రి అనదగ్గవాళ్ళు . ఆ నలుగురి ముఖాలలో తీవ్రమైన ఆందోళన. అనంతం గురుకులాశ్రమ నిర్వాహకులు , సిస్టర్ శోభన మాత్రమే ప్రశాంతంగా వున్నారు. ఆ పిల్లవాడు, ప్రీతమ్ తన బొమ్మలమధ్య కూర్చుని ఆడుకుంటున్నాడు.
“ఏం చేద్దాం ఇప్పుడు? ప్రీతమ్ పరిస్థితి ఏమిటి?” ఆందోళనగా అడిగింది సాకేత. ఆమె జన్యుశాస్త్రవేత్త. అనేక ప్రయోగాలు చేసింది. ఒక ఎగ్‍బాంకుద్వారా దాదాపు వందమందికి డోనర్‍గా వుంది. ఆమె అంశతో పుట్టిన శిశువులు విభిన్నదేశకాలపరిస్థితుల్లో, విభిన్న ఆచారవ్యవహారాలలో పెరుగుతున్నారు. ప్రీతమ్ అలా పుట్టినవాడే. చంద్రహాస్ అవంతిల కొడుకు. ఈ పిల్లలు ఎలా పెరుగుతున్నారనేది, జన్యువులు ఎలా స్పందిస్తాయనేది ఆమె చేస్తున్న ముఖ్యమైన ప్రయోగం. తన డిటెక్టివ్‍లని పెట్టుకుని రహస్యంగా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ వుంటుంది. చాలా గొడవలూ కేసులూ వున్నాయి ఆమెమీద.
“వాడిని నేను తీసుకెళ్తాను. ఎవరైతే ఇతని పుట్టుకని స్పాన్సర్ చేసారో వాళ్ళే లేనప్పుడు ఇతన్ని పుట్టించిన పర్పస్ నెరవేరదుకదా? నా లేబ్‍లో వుంచుకుంటాను. కొన్ని ప్రయోగాలకి వుపకరించవచ్చు” అన్నాడు హరిశ్చంద్ర. అతనూ శాస్త్రవేత్త. జెనెటిక్స్‌లో కాదు, క్లినికల్ టెక్నాలజీలో. అతడి స్పెర్మ్‌వల్లనే ప్రీతమ్ పుట్టినది.
“నేను వప్పుకోను. వాడు మనిషిగానే పెరగాలిగానీ గినీపిగ్‍లాగా కాదు” అంది సాకేత.
“ఎవరు పెంచుతారు, వాడినలా? ఎవరికి అంత ఆసక్తి? వాడొక జెనెటిక్ కంపోజిషన్. ఉపయోగించుకుని డిసింటగ్రేట్ చేసేద్దాం”” అతను నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. అతడు కొత్తగా ఒక మందుని కనిపెట్టాడు. దాన్ని ఎలుకలమీదా కుందేళ్ళమీదా ప్రయోగించి ఫలితాలని చూడటం ఐపోయింది. ఇప్పుడిక ప్రయోగాలకి మనిషి కావాలి. ఒకప్పుడు దేశంలో బీదరికం వుండేది. రాజకీయాలుండేవి. డబ్బు ఎరగా చూపించి ఎలాంటి మందు ప్రయోగించినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడంతా గట్టి వ్యవస్థ ఏర్పడింది. ఎవరిని ఎవరూ ఎక్స్‌ప్లాయిట్ చెయ్యగలిగేందుకు ఎలాంటి వీలూ లేదు. అందుకే ప్రీతమ్ కనిపిస్తున్నాడు.
“కాదు . . .””సాకేత నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తోంది. అలాగని ఆమెకి వాడిమీద ప్రేమలేదు. ప్రీతంలాంటివాళ్ళు ప్రయోగానికి దొరకరు. ఇప్పుడు ఇదో గొప్ప అవకాశం. ఇప్పటిదాకా తన స్పెసిమన్స్ అందరికీ తల్లిదండ్రులున్నారు. ఇదొక కొత్త ఫినామినన్. జీవితపు కొంతభాగం గడిచాక వచ్చిన మార్పుల్లో శిశువు ఎలా పెరుగుతాడని కూడా అధ్యయనం చెయ్యవచ్చు. అతన్లో జెనెటిగ్గా ఇంకేవేనా మార్పులు చేసి చూడచ్చు.
వాళ్ళిద్దరిమధ్యా అభిప్రాయబేధంగా మొదలైన చర్చ వాదించుకోవటాన్ని చేరుకుంది.
చంద్రహాస్‍కిగానీ అవంతికిగానీ పిల్లలు పుట్టే అవకాశంలేదు. పిల్లలు పుడితే కెరీర్, బిజినెస్ దెబ్బతింటాయన్న వ్యతిరేక సూచనలు వాళ్ళ మెదళ్ళలో ఎప్పుడో ఇమిడిపోయాయి. అందుకే కావాలని మనసులో కోరికవున్నా అది వుండవలసినంత బలంగా లేకపోవటంతో పిల్లలు కలగలేదు. అప్పటికే భారతదేశం జెనెటిక్స్‌లో విజయకేతనం ఎగురవేసింది. ఏది నైతికం, ఏది అనైతికం అనే స్పష్టమైన రేఖలు గీసుకున్నారు. శృంగారసంబంధాలు లేకుండా ప్రయోగశాలల్లో ఎవరు ఎవరికి పిల్లల్ని కన్నా తప్పులేదనే వప్పందానికి వచ్చారు. అదొక రాసుకోని వప్పందంలాంటిది. తర్వాత చట్టమైంది. నిజానికి ఇలాంటి విషయాల్లో డోనర్స్ పేర్లు రహస్యంగా వుంచబడతాయి. కానీ వీళ్ళు ఒక సంస్థగా ఏర్పడ్డారు. ఎవరికేనా ఐచ్చికంగా ఇస్తూ వుంటారు. ఎవరో అపరిచితులకి సంతానం కనటానికన్నా తెలిసిన వీరికి కనటం మంచిదన్న అభిప్రాయంతో అత్యంత తెలివితేటలుగల కొడుకుకోసం చంద్రహాస్ వీళ్ళ దగ్గిరకి వచ్చాడు.
అప్పటిదాకా వాళ్ల మాటల్ని వింటూ కూర్చున్న సునయనలో ఒక ఆలోచన. ప్రీతమ్ వాళ్ళ జెనెటిక్ కంట్రిబ్యూషన్ వుండొచ్చుగానీ వాడిని నవమాసాలు మోసి కన్నది తను. వాడిని పెంచి పెద్ద చేసే హక్కు తనకే వుంటుంది. సరొగసీతో కన్నందుకు బాగానే ముట్టింది. . . ఐనప్పటికీ ఇప్పుడు వీడు తన కొడుకే. వాడితోపాటు వాడి ఆస్థీ తమకే రావాలి. అలాగని వాడికి తను చేసే అన్యాయం ఏమీ వుండదు. ఎంత కాదనుకున్నా తన కడుపున పుట్టినవాడు వాడు. తన దగ్గిర పెరుగుతాడు. ఇప్పటికి తాను మైనర్ గార్డియన్‍గా వున్నా వాడు పెద్దయాక అందరూ కలిసి ఆస్థిని అనుభవిస్తారు. పక్కనే వున్న భర్తకేసి చూసింది. సునయన మనసు గ్రహించినట్టు అతను తలూపాడు. అతడి అనుమతితోనే సునయన ప్రీతమ్‍ని కన్నది.
“ప్రీతమ్‍ని కన్నతల్లిని నేను. వాడి బయలాజికల్ పేరెంటుని. వాడిని నేను పెంచుతాను. సాకేతగారు ఆశించినట్టే ఒక కోటీశ్వరుడి కొడుకెలాంటి వాతావరణంలో పెరుగుతాడో అలాంటి వాతావరణంలో పెంచుతాను. చంద్రహాస్, అవంతిలు వీడికి లీగల్ పేరెంట్సు మాత్రమే. వాళ్ళు లేనప్పుడు వాడు నాకే చెందాలి” అంది.
సాకేత సాలోచనగా చూసింది. హరిశ్చంద్రకి ఆ ఆలోచన నచ్చనట్టు అతని ముఖకవళికలు చెప్పాయి.
“చెప్పండి గురువుగారూ ! ప్రీతమ్‍ని నేను తీసుకెళ్ళనా? వాడి అమ్మని” సునయన మరోసారి గుర్తుచేసింది.
ఆశ్రమ నిర్వాహకుడు నెమ్మదిగా నోరిప్పాడు.
“చంద్రహాస్, అవంతి బిజినెటూర్లలో తిరుగుతుంటారుగాబట్టి వాళ్ళు లేనప్పుడు ప్రీతమ్‍ని నా దగ్గిర వదిలేవారు. వాళ్లకి మరెవరిమీదా నమ్మకం వుండేదికాదు. నేను నడిపే ఆర్ఫనేజికి ఫండ్స్ ఇచ్చేవారు. ఇది ఎంతోకాలంగా జరుగుతూ వస్తున్న పద్ధతి. ఇప్పుడూ అలాగే చేసారు. యూయస్ వెళ్తూ వాడిని నాకు అప్పగించారు. వాడు నాకెప్పుడూ అసాధారణంగా పుట్టిన శిశువులా అనిపించలేదు. నాదగ్గరున్న పిల్లల్లాగే అనిపించేవాడు. పోతే ధనికుడికొడుకు కాబట్టి కొంత ప్రత్యేకంగా. . .అవకాశాలన్నీ అందుబాటులో వున్నాయిగాబట్టి తోటిపిల్లలందరికంటే తెలివిగా చురుగ్గా వుంటాడు. వాళ్ళు చనిపోయాక వాడి జన్మ విషయం బైటపడింది”
“అదేం కాదు, వాడి ఐక్యూ 100/100, వుండేలాగా, ఎత్తు, రంగు, రూపు ఐడియల్‍గా వుండేలా అన్నిటినీ డిజైన్ చేసాము. కొన్నిరకాల జబ్బులు రాకుండా జీన్స్‌ని సరిదిద్దడం జరిగింది. మీరు వాడిని నాకు అప్పజెప్తే, టెలిమర్స్ పొడవు పెంచడం సాధ్యపడుతుందేమో చూడాలి. అది జరిగితే మనుషులందరికీ వుపయోగపడుతుంది. వందల యేళ్ళు బతకచ్చు. ఈ భూమి మనది. ఎన్నో ప్రయోగాలు చేసాం. ఆవిష్కారాలు చేసాం. జీవితకాలమంతా ప్రయోగశాలల్లో గడిపాం. ఫలితాలు చూసుకునేలోగా మృత్యువు వచ్చి వాలితే సంతోషం ఎక్కడుంటుంది?” అడిగింది సాకేత.
“చంద్రహాస్‍ది బిజినెస్ మైండ్ కదా, ఇలాంటి సందర్భం ఎప్పుడేనా రావచ్చుననే అనుమానం వుండేదనుకుంటాను. అనేక సినారియోలు అప్ప్లై అయేలా విల్లు రాసాడు. తనుండి అవంతి చనిపోతే, లేదా అవంతి వుండి తనే పోతే ఏం చెయ్యాలి, ప్రీతమ్‍కి ఏ వయసులో ఏ సంఘటన జరిగితే ఎలా చెయ్యాలి… ఇవన్నీ వందపేజీల డాక్యుమెంటులో రాసాడు. దాన్ని లాయరు దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒకటీ వుంచాడు… ఎప్పుడు చదవాలో ప్రత్యేకంగా చెప్తూ. ఆ డాక్యుమెంటు సీల్డ్ కవర్లో వుంది. విమాప అధికారిముందు దాన్ని తెరవటం జరిగింది” అన్నాడు ఆశ్రమ నిర్వాహకుడు. “వాడి పుట్టుకలో భాగం వున్నవారందరికీ తెలియచెయ్యటం జరిగింది, అదీ ఆయన ఆదేశాలమేరకే”” అన్నాడు.
“ఆస్థి గురించి రాసారా?”” సునయన బైటపడిపోయింది.
అందరి కళ్లూ ఆమెవైపుకి తిరిగాయి. కొంత విస్మయం. ఆమెకి తను చేసిన తప్పు తెలిసింది. వెంటనే సర్దుకునే ప్రయత్నం చేసింది. “
“ఆయన వాడిని వినూత్నంగా పుట్టించాడు. మరి మామూలు మనుషులందరికీ వుండే హక్కులు వాడికి వుంటాయా? వారసత్వచట్టం వర్తిస్తుందా? ఎవరేనా వాడి హక్కుని సవాలు చెయ్యచ్చా? అలా సవాలు చేసేవాళ్ళు అంటే.. చంద్రహాస్‍గారికి లేక అవంతిగారికి బంధువులున్నారా?” ఇవన్నీ ఆలోచిస్తున్నాను.” అంది.
అంత బాగా కవర్ చేసుకున్నందుకు భర్త ఆమెని ప్రశంసగా చూసాడు. ఆమె పొరపాటుగా మాట్లాడి, దాన్ని సరిదిద్దుకుందన్న విషయం అందరికీ స్పష్టమైంది.
“వాడు చంద్రహాస్ కొడుగ్గా వుంటే ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాలి. అలా కాకుండా నేను తీసుకుంటే వున్నంతకాలం హేపీగా వుంటాడు. నా ప్రయోగాల్లో పాల్గొన్నందుకు గుర్తింపుకూడా వస్తుంది ” అన్నాడు హరిశ్చంద్ర మరోసారి.
“సునయన అన్నట్టు సరైన పేరెంటింగ్ వుంటేనే నా ప్రయోగం కొనసాగుతుంది.” సాలోచనగా అంది సాకేత. “అలా కాకపోతే లేబ్‍లో పెట్టాలి” మళ్ళీ ఇద్దరూ విబేధించారు.
అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా వూరుకున్న దాది శోభన ఒక్కసారి అంది.
“నేను ట్రెయిన్డ్ నర్సుని కాబట్టి అంతా కాకపోయినా కొంతవరకూ మీరు మాట్లాడుకున్నవి అర్థమయ్యాయి. డబ్బుందికాబట్టి ఒకరు సంకల్పించారు. మరొకరు ప్రయోగంకోసం అతడి జన్మకి సగం కారణమైతే ఇంకొకరు తనంత తెలివిగలవాళ్లు భూమ్మీద పుట్టి పెరగాలని మిగిలిన సగకారణం అయ్యారు. మరొకళ్ళు సంఘంలో స్థాయిని పెంచుకోవాలని జన్మనిచ్చారు. నేను భుక్తికోసం, గురువుగారు వృత్తిధర్మంకోసం అతడిని పెంచాము. అతడి జన్మ గురించి నాకు తెలీదుగాబట్టి అతన్ని నేనొక సాధారణ మానవశిశువులాగే భావించాను. అతడి చేష్టలకి స్పందించాను. నాకతడిని అలాగే చూడాలని వుంది. చూడండి, బొమ్మలమధ్య కూర్చుని అతడెలా నవ్వుతూ ఆడుకుంటున్నాడో! ఎలా పుట్టినా అతడు పిల్లవాడే. అతడినలాగే బతకనివ్వండి” అంది. ఆశ్రమనిర్వాహకుడి మనసులోనూ అదే వుంది. విమాప ఏం తీర్మానిస్తుందో!
సునయనకి స్వర్గమేదో అందీ అందకుండా వూరించి జారిపోయినట్టనిపించింది. ఆమె భర్తకికూడా. హరిశ్చంద్రకి కోపం వచ్చింది.
ఆఫ్ట్రాల్ ! వీళ్ళంతా చెప్తే తను వినడమా? నోవే. కోర్టుకి వెళ్ళేనా తన హక్కుని సాధించుకుంటాడు. ఎవరడ్డం వస్తారో చూస్తాడు! అనుకుని సాకేత ఏం చెప్తుందోనని చూసాడు. ఆమెకి అలానే వుంది. ప్రీతం మామూలు పిల్లాడు కాదు మామూలుగా పెరగటానికి. అది వీళ్లకి ఎందుకు అర్థమవదు? లీగల్ పేరెంట్సు లేరు కాబట్టి మదర్‍గా కోర్టుకెళ్తే తనకి హక్కులు వస్తాయేమో! ఇంతకీ ఆ మహానుభావుడు చంద్రహాస్ విల్లులో ఏం రాసాడో?
ఆశ్రమనిర్వాహకుడు చెప్పాడు.
“ప్రీతమ్ మేజరు కాకుండా తమకేదైనా జరిగితే అతను నా దగ్గిరే పెరగాలని చంద్రహాస్ విల్లులో రాసారు. అతడి చదువుకీ, పెరిగి పెద్దవటానికీ ఆర్ఫనేజి నడవటానికీ కొంత కేటాయించి మిగిలినదంతా గవర్నమెంటుకి చెందాలని రాసేసారు. అంతేకాదు, తనూ అవంతీ వాడికి లీగల్ పేరెంట్స్ కాబట్టి ఇంకెవరికీ వాడిమీద క్లెయిమ్ వుండదనికూడా స్పష్టం చేసారు”
హరిశ్చంద్ర కోపంగా లేచి వెళ్ళబోయాడు. ఫాదర్ అతన్ని ఆగమని సౌంజ్ఞచేస్తే అయిష్టంగా మళ్ళీ కూర్చున్నాడు.
“మమ్మల్నెందుకు పిలిపించినట్టు?” అడిగింది సునయన. ఆమె గొంతులో నిరాశ స్పష్టంగా వినిపిస్తోంది. “ఇవన్నీ మీకందరికీ స్పష్టం చెయ్యటానికి. చంద్రహాస్ ఆకాంక్షనీ విమాప ఇచ్చే తీర్పునీ గౌరవించమని చెప్పటానికి ” ఫాదర్ గొంతు స్థిరంగా వుంది. “”ఎలా పుట్టినా అతనొక మానవశిశువు. ఇది మానవసమాజంకాబట్టి మిగిలిన పిల్లలందరికీ వుండే హక్కులన్నీ అతనికి వుంటాయి. అందరు పిల్లల్లాగే అతనూ పెరగాలి, పెద్దవాలి, పెర్పెచ్యువేట్ కావాలి. ప్రస్తుతానికి ఇది చంద్రహాస్‍గారి తీర్మానం. ఆయన వాడికి ఆ అవకాశాన్ని ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. అందరం ఆయనవలన ఎంతోకొంత లాభం పొందాముగాబట్టి ఆయన తీర్మానాన్ని గౌరవించవలసిన అవసరం అందరికీ వుంది. ఎక్కడో ఒక స్త్రీ . ఇంకెక్కడో పురుషుడు. ఒక ఎగ్. ఒక స్పెర్మ్. టెస్ట్‌ట్యూబ్‍లో కలయిక. ఇంకో తల్లి గర్భంలో మనుగడ. ఒక దాది వొళ్ళో పెంపకం. ఇది క్లుప్తంగా ఒక పిల్లవాడి జీవితమైతే ఆ జీవితకర్త చంద్రహాస్. అతను ఆశిస్తే, అతని డబ్బుతో శాసిస్తే ఇదంతా జరిగిందిగాబట్టి, తరువాతిదికూడా అలాగే జరగవలసి వుంది. మిమాప కూడా ఇందుకు భిన్నంగా చెప్పదనే అనుకుంటున్నాను “
ఆయన చెప్పినట్టే జరిగింది. కొద్దిసేపట్లో విమాప తీర్మానం వచ్చింది.
అంతా ప్రీతమ్ వున్నవైపు చూసారు. వాడింకా ఆటల్లోనే వున్నాడు. వాడికి తన పుట్టుకగురించి తెలీదు. ఇప్పుడీ జరుగుతున్న చర్చలూ తెలీవు. తల్లీతండ్రీ అనుకుంటున్న ఇద్దరు వ్యక్తులతో పెద్దగా అనుబంధంలేదు. ఇప్పటిదాకా తనేమిటో అన్న సందిగ్ధం వాడికి లేదు. ఇప్పుడుకూడా వాడికి తెలీకుండానే వాడికి మనుష్యత్వం ఇవ్వబడింది. దాని విలులేమిటో అతనికి తెలియకపోవచ్చు. ఎప్పటికీ అతని జన్మవిషయం మరుగున వుండిపోవచ్చు. కానీ…ఇకమీదట వాడొక మనిషి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.