కదిలే మేఘం by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

“మీకు నేనెవరో తెలుసు. హర్షతో మిమ్మల్ని చూడగానే అర్థమైంది, మా పెళ్ళి జరగదని . కానీ, ఒక్క విషయం ఆలోచించండి… అతనికి అలాంటి పరిచయాలేవీ లేవా? లేకుండా ఎలా వుంటాడు? ఫ్రెండ్స్ వూరుకోరే? గే అని బనాయిస్తారు. సో… మీరు ఫెయిర్‍గా వుంటారని నేను అనుకోవటంలేదు” నా సెల్‍కి వచ్చిన మెసేజి.
నాకసలు ఎలా స్పందించాలో అర్థమవలేదు.


హంపీతో నాకొక ప్రత్యేకమైన అనుబంధం వుంది. వర్ధన్‍కి చరిత్రంటే చాలా యిష్టం. ఇద్దరం స్కూల్‍టీచర్లం. పెళ్లైన కొత్తలో స్కూలు సెలవుల్లో వారంరోజులు హంపీ తీసుకెళ్ళిపోయాడు. మంచి హోటల్ కావాలంటే హోస్‍పేటలో వుండాలి. యునెస్కో హెరిటేజి సైటు కావటంతో హంపీలో చాలా కొద్దిమందిమాత్రమే ప్రత్యేకమైన అనుమతితో యిల్లు కట్టుకుని వుంటారు. వాళ్ళదగ్గర పేయింగ్ గెస్టు వసతి దొరుకుతుంది. అలా ఒకరింట్లో వారంరోజులు వుండి, హంపీ అంతా తిరిగాము. ఆ రాళ్ళు, రాళ్ళగుట్టలు, శిథిలమైపోయిన కట్టడాలు అవీ చూస్తుంటే చరిత్ర పెద్దగా తెలియని నాకే గుండెలు మెలిపెట్టినట్టైంది. వర్ధన్ విషయం చెప్పనే అక్కర్లేదు.
ఇంట్లోనూ, బైటి స్నేహితులూ ఒకటే వేళాకోళం చేసారు.
“కొత్తగా పెళ్ళైనవాళ్ళు ఏ కూర్గో, వూటీయో వెళ్తారు, హంపీ వెళ్లటమేమిటి?” అని. నాకూ నవ్వే వచ్చింది.
చరిత్రలో ఏదో ఆకర్షణ వుంది. అది వర్ధన్‍ద్వారా నాలోకి ప్రవహించించింది.
“చాలా బాధగా అనిపిస్తుంది నళినీ! ఇలాంటి జీవితం ఒకటి వుందని తెలియకపోతే వేరు. తెలిసి ఆ శిథిలాలని చూస్తుండటం వేరు. ఒకటో రెండోతరాల తర్వాత ఒక రాజ్యం బలహీనపడవచ్చు. అలా బలహీనపడ్డ రాజుని ఇంకో రాజు గెలవచ్చు. కానీ ఈ విధ్వంసం చూస్తుంటే మనసు చెదిరిపోతోంది. హంపీ, శ్రీరంగపట్నం, వరంగల్, చంద్రగిరి…. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆవేదన వెంటాడుతూ వుంటుంది. గవర్నమెంటేనా పోయినవన్నీ పోగా మిగిలినవాటిని ప్రిజర్వ్ చేయచ్చుకదా?” అన్నాడు.
“మనదేశంలో వూరికో కోట, వీధికో గుడీ వున్నాయి. అదంతా గతించిపోయిన కాలం. అప్పటి రోజులు. మనుషులు తక్కువా, స్థలాలు ఎక్కువా కావటంతో అంతంత పెద్దగా కట్టేవారు. ఎన్నిటినని కాపాడతారు?” నా ప్రశ్న.
“స్ట్రక్చర్ దెబ్బ తినకుండా వాటిని నిరాశ్రయులకి హెబిలిటేషన్‌కీ ఆఫీసులకీ వాడచ్చుకదా? డిల్లీలో రెడ్‍ఫోర్ట్ వాడుకోవటంలేదా? అలా. వాళ్లకే ఆ కోటల బాధ్యత ఇవ్వచ్చు” అన్నాడు.
అలా పరిష్కారం దొరకని ఆ సమస్య గురించి వాదించుకుంటూ వాదించుకుంటూనే ఎన్నో కోటల్నీ, రాజులు గతించిన రాజ్యాలనీ చూసేసాము. చూస్తూనే ఇద్దరు పిల్లల తల్లిని అయాను. నాకు చరిత్రతో మొదటిసారి ప్రత్యక్షపరిచయాన్ని కలిగించిన హంపీ నా మనసులో చెరగని ముద్ర వేసింది.
“వాళ్ళూ వీళ్ళూ కట్టి వదిలేసిన యిళ్ళ చుట్టూ తిరుగుతారేమిటమ్మా మీరిద్దరూ?” అని పిల్లలు మా యిద్దర్నీ విసుక్కునే వయసుకి వచ్చారు.
ఇంతలో అనూహ్యమైన సంఘటన. వర్ధన్‍కి డెంగ్యూ వచ్చింది. ప్లేట్‍లెట్ కౌంటు దారుణంగా పడిపోయింది. ఏం చేసినా అతన్ని బతికించలేకపోయాము. జీవితం జీవించడం ఆగి, కాలంగా మారి, రోజులు, సంవత్సరాలుగా కదలడం మొదలైంది.
పిల్లలు…హర్ష, హాసిని. ఇద్దరి చదువులూ అయాయి. ఉద్యోగాలొచ్చాయి. ఒకేసారి. ఒకరికి చెన్నైలో, ఇంకొకరికి బెంగుళూర్లో. వర్ధన్ జ్ఞాపకాలతో నేను మిగిలాను.


మనసు మళ్ళీ హంపీమీదికి మళ్ళింది. వంటరిగా వెళ్ళి, జంటగా తిరిగినప్పటి జ్ఞాపకాలని వెతుక్కోవాలనే కోరిక ఆ రాళ్ళూ శిథిలాలమధ్య తెగిన గాలిపటంలా చిక్కుకుపోయింది. మనసుకి ఏదో మోహం… వర్ధన్ని పోగొట్టుకుని అనుభవిస్తున్న దు:ఖానికీ వంటరితనానికీ అక్కడ సాంత్వన దొరుకుతుందేమోనని.
“ఒక్కదానివే ఎందుకు? ముగ్గురం కలిసే వెళ్దాం” అన్నాడు హర్ష. హాసినికూడా ఆమోదం తెలిపింది. కానీ నా మనసు అటు గుంజుతున్న వేగాన్ని వాళ్ళు అందుకోలేకపోయారు. ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. వాళ్ళకి చెప్పలేదు. బస్సు ఎక్కాక మెసేజి పెట్టాను.
“ఎందుకలా? అసలు ఈ సెలవుల్లో నిన్నే యిటు రప్పిద్దామని నేనూ హాసినీ అనుకున్నాం. కనీసం మేం వచ్చేదాకానేనా ఆగితే బావుండేది. ఈ వంటరి ప్రయాణం నీకు అవసరమా? ఎలాగా వెళ్ళావుకాబట్టి ఒక్కరోజు వుండేసి వచ్చెయ్యమ్మా! మా యిద్దరికీ టెన్షన్‍గా వుంటుంది” అన్నాడు హర్ష.
ఈ వ్యామోహం నాది. వాళ్ళకి నాన్నంటే ఈ శిథిలాలని చూసి దు:ఖపడే భావుకుడు, తన ప్రియురాలిని కూలిపోయిన అంత:పురాల మధ్య దర్శించుకునే ప్రేమికుడు కాదు. రెక్కలగుర్రంమీద తమని విశ్వదర్శనం చేయించి అదృశ్యమైపోయిన హీరో.
“నాన్న గుర్తొచ్చారామ్మా? తనకి చారిత్రక స్థలాలంటే చాలా యిష్టం కదా? మీరు పెళ్ళయాక మొదటిసారి అక్కడికే వెళ్ళారటకదా?” గొంతు పూడుకుపోతుంటే ఫోన్ పెట్టేసాడు. ఇక్కడ నాకూ అలాగే అయింది.
మళ్ళీ తనే చేసాడు. “ఇద్దరం బయల్దేరి వస్తాం. నువ్వు మరి అక్కడే వుంటావా?” అడిగాడు.
“వద్దు హర్షా! నాకు వంటరిగానే వుండాలనుంది. ప్లీజ్! అర్థం చేసుకో” అన్నాను.
ఎన్నో జాగ్రత్తలు చెప్పి పెట్టేశాడు. హాసినికూడా మాట్లాడింది. “నువ్వు తొందరగా వచ్చెయ్యమ్మా! అన్న చెన్నై వస్తానంటున్నాడు. ఇద్దరూ కలిసి రండి. ఫీనిక్స్‌మాల్‍లో బోల్డంత షాపింగ్ చెయ్యాలి” అని కొన్ని కలలు నా వొళ్ళో వొలకబోసింది. తన కోరికల గాలం విసిరింది. నేను చిక్కుకుంటానని తనకి తెలుసు.
ఇన్నేళ్ల తర్వాత కూడా హంపీ ఏమీ మారలేదు. దారులూ అన్నీ గుర్తే. చెట్టు కింద బస్ ఆగింది. దిగితే ఆ పక్కనే టీస్టాల్స్. అందులో గద్దెమీద వున్న ఎత్తైన స్టాల్‍లోకి వెళ్ళాను. టీ కావాలని చెప్తే డిస్పోజబుల్ కప్‍లో ఇవ్వబోయాడు.
“అంత కొంచెం కాదు. ఇందులో ఇవ్వు. ఎంతైందో చెప్పు” అన్నాను బేగ్‍లోంచీ స్టీలుగ్లాసు తీసిస్తూ. అతను నవ్వి, దానినిండా టీ పోసి ఇరవైరూపాయలు తీసుకున్నాడు. ఒక పక్కకి వున్న బెంచీమీద కూర్చున్నాను.
నాకు కొంచెం దూరంగా మరో బెంచిమీద ఐదుగురు పిల్లలు సర్దుకుని కూర్చుని వున్నారు. ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. అంతా జీన్సూ, టీషర్టులూ వేసుకున్నారు. ఆడపిల్లలు ముగ్గురూ చూడటానికి బొమ్మల్లా వున్నారు. అందులో ఒకమ్మాయి చాలా అందంగా వుంది. వేసుకున్న పింక్ టీషర్టు చాలా బాగా నప్పింది. రెండో అమ్మాయి సైలెంటుగా వుంది. పెద్దగా మాట్లాడట్లేదు. నల్లటి దట్టమైన కనురెప్పలు, వత్తైన పెద్ద జుత్తు. పోనీ వేసుకోవటంతో గాలికి ఎగురుతోంది. మూడో అమ్మాయి ఆగకుండా మాట్లాడుతోంది. ఎక్కువగా మాట్లాడని అమ్మాయి పేరు నీలిమ అని వాళ్ళ మాటల్లోనే తెలిసింది. చూపుకి మామూలుగా వుంది. మిగిలిన ఇద్దర్లో అందమైన అమ్మాయి మళ్ళీ తటస్థపడుతుందని ఆ క్షణాన తెలీదు.

వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుని నవ్వుతుండటంతో కొద్దిగా చికాగ్గా అనిపించింది. నా నిశబ్దాన్ని భంగపరిచే హక్కు వీళ్ళకేముంది? వీళ్ళనే కాదు, ఇప్పటి పిల్లలంతా అలాగే వుంటున్నారు. వెళ్ళిపోదామని లేచి నిల్చున్నాను. ఉన్నట్టుండి వాళ్లమధ్య చిన్న వివాదం మొదలైంది.
“దిసీజ్ టూ మచ్. బెంగుళూర్లో బయల్దేరినప్పుడు ఏమని అనుకున్నాం? అమ్మాయిలం ఒకరూంలో, అబ్బాయిలు ఒక రూంలో అనికదా? అలా అంటేనే నేను మీతో వచ్చాను? ఇప్పుడేంటి యిలా? మీదారిని మీరు వెళ్ళేట్టైతే నన్నెందుకు రమ్మన్నట్టు?” అప్పటిదాకా సైలెంటుగా వున్న నీలిమ నిలదీస్తోంది. మిగిలిన నలుగురూ నవ్వుతున్నారు. ఆమెని వెక్కిరిస్తున్నట్టు… వేళాకోళం చేస్తున్నట్టు.
“అలా చెప్పకపోతే నువ్వు రావుకదా? నువ్వు రాకపోతే మాయింట్లో మమ్మల్ని పంపించరు…” నవ్వుతూ నవ్వుతూనే ఆడా మగా జంటలుగా విడిపోయి బస్ ఎక్కేసారు.
ఆ అమ్మాయి అలా చూస్తూ వుండిపోయింది. ముఖంలో వుక్రోషం. కళ్ళలో చిరుతడి.
నాకు అర్థమయ్యీ కానట్టుగా వుంది.
“నీ పేరేంటమ్మా?” నేను జోక్యం చేసుకున్నాను.
తను వులిక్కిపడి నావైపు తిరిగింది.
“నేను తిరిగి వెళ్ళిపోతాను” అంది కోపంగా. “మీరు ఇక్కడే వున్నారుగా? అంతా వినే వుంటారు. అర్థమయ్యీ వుంటుంది”
“ముందు ఇది చెప్పు, స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చావా? హంపీ చూడాలనా?” అడిగాను.
“హంపీ చూడాలనే వచ్చాను. వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు”
“పోనీ, మనిద్దరం కలిసి చూద్దామా?” అడిగాను.
“లేదండీ! నేను వెళ్ళిపోవాలి. లేకపోతే నన్ను మరీ లోకువ కట్టేస్తారు. హంపీ వుంటుంది, నేనూ వుంటాను. కుదిరితే మరోసారి వస్తాను” అంది. ఇంతలో బస్ వచ్చింది. నీలిమ ఎక్కేసి చెయ్యూపింది. నేనూ చెయ్యూపి అక్కడినుంచీ కదిలాను.
విరూపాక్షాలయానికి వెళ్ళే దారిలో కుడివైపుకి తిరిగితే పేయింగ్ గెస్ట్ ఇళ్ళన్నీ వస్తాయి. వర్ధన్ నాతో నడుస్తున్న భ్రమలో పడిపోయాను కొద్దిసేపు. ఒక యింట్లో గది చూసుకుని అందులో దిగాను. ఎక్కడికీ వెళ్ళాలనిపించలేదు. మనసంతా తెలీని బరువు. ఇక్కడికి రావటమైతే వచ్చానుగానీ ఒక్కదాన్నీ తిరగలేననిపించింది. టిఫెనుకి కూడా వెళ్ళలేదు. స్నానం చేసి అలాగే మంచంమీద వొరిగిపోయాను. నిద్రపట్టేసింది.
కాలింగ్‍బెల్ మోగితే మెలకువ వచ్చింది. అలవాటులేని పగటినిద్ర … అదీ టిఫెనుకూడా తినకుండా కావటంతో సన్నగా తలనెప్పి వచ్చింది. నిద్రకళ్లతోటే తలుపు తీసాను. ఇంటతను. పూర్తి మెలకువ వచ్చింది.
“అమ్మా! మీరు టిఫెనుకి కూడా బయటికి వెళ్లలేదు. భోజనం ఇక్కడికే తెప్పించమంటారా?” అని అడిగాడు.
“వద్దు. నేనే వెళతాను” అని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు.
నేను చీర సరిచేసుకుని, తల దువ్వుకుని తయారై, గదికి తాళం వేసి బయటపడ్డాను. రెండు సందులు దాటితే హోటలు. హోటలని పెద్దగా ఏమీ వుండదు. బంగాళాపెంకుతో కట్టిన ఎత్తైన పైకప్పుల యిల్లు. అందులో చాలా పెద్దగా వున్న హాల్లో ఒక సగం కుర్చీలూ బల్లలూ వుంటాయి. అవి భారతీయులకి. మరోవైపు నేలమీద కుషన్లమీద కూర్చుని తినే ఎత్తులో వుండే బల్లలు మరికొన్ని. అవి విదేశీయులకి. ఇక్కడికి విదేశీయులు చాలామంది వస్తారు. వాళ్లని చూస్తే మనవారికి విపరీతమైన వ్యామోహం. వాళ్ళు టిప్‍గా వదిలేసే డబ్బులు మన కరెన్సీలోకి మార్చుకుంటే చాలా ఎక్కువ. అందుకు మనని వుపేక్షించి వాళ్లకి మర్యాదలు చేస్తారు. ఇవన్నీ నాకు అనుభవాలు.
“ఈ వ్యామోహంలోంచీ బయటపడలేదు మనం. శతాబ్దాలనాడు పోగొట్టుకున్న గౌరవం ఇంకా మనదని అనిపించట్లేదు మనకి” అనేవాడు వర్ధన్.
విదేశీయుల కోలాహలం మధ్య భోజనం అయిందనిపించి విరూపాక్ష దేవాలయానికి వెళ్ళి కొద్దిసేపు గడిపి మళ్ళీ గదికి వచ్చాను. రాత్రికి రెండు ఇడ్లీలు తెప్పించుకుని, తినేసి పడుకున్నాను. పగలు పడుకోవటంచేత రాత్రంతా కలతనిద్రైంది.
నిద్రంతా వర్ధన్ నాతో మాట్లాడుతున్నట్టే. ఏవో చెప్తున్నట్టే. కళ్లలోంచీ నీళ్ళు కారిపోవటం తెలిసింది. కానీ తుడుకునే స్పృహ లేదు.
“ఎన్ని గుళ్ళు… మరెన్ని కోటలు… అన్నీ శిథిలమైపోయాయి. ఎంతకాలం ఇలా మన చరిత్రంతా ధ్వంసమౌతో వుంటుంది నళినీ? రాజులూ రాజ్యాలూ కాలగర్భంలో కలిసిపోవచ్చుకానీ ప్రజలూ సంస్కృతీ కూడానా? అన్నీ మంత్రగాడు మాయం చేసినట్టు కనుమరుగయ్యాయి. కొనసాగింపులేని దేన్ని చూసినా విషాదమేకదూ? మనం నమ్ముతున్న విలువలూ, బతికిన బతుకూ అన్నీ ఇక్కడివరకూ వచ్చి ఆగిపోతున్నాయి”
ఆ మాటలు అతని గొంతులోంచీ విన్న భ్రాంతి కలిగాక నాకు హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. అవి నా ఆలోచనలే అనుకున్నాక ఇంక నిద్ర పట్టలేదు. ఆలోచనలు మరోవైపుకి మళ్ళాయి. నీలిమ ఇల్లు చేరుకుని వుంటుందా? వివరాలేం చెప్పలేదు. ఏవూరో వాళ్లది? మిగిలిన ఇద్దరూ గుర్తొచ్చారు. బాయ్ఽఫ్రెండ్సుతో హోటల్‍రూమ్స్‌కి వెళ్ళిన అమ్మాయిలు. ఇదికూడా విధ్వంసమేకదా?
ఆదే ఆ అమ్మాయిలతో చెప్తే వప్పుకుంటారా? ఉ<హు<
“ఒక్కమాటు మన పురాణాలు గుర్తుతెచ్చుకోండి” అంటారేమో!
ఎవరు చెప్పాలి వీళ్ళకి? వైదికధర్మం, పురాణాలూ వేరువేరు విషయాలు. ఒకటి విజ్ఞానానికీ దార్శనికతకీ సంబంధించినది. పురాణాలు వ్యక్తుల చరిత్రని చెప్తాయి. ఆయా కాలాలలో అప్పటి అవసరాలని అనుసరించి మనుషులూ రాజులూ ఎలా బతికారో చెప్తాయి. వాటికి అభూతకల్పనలు జోడించబడి వుంటాయి. వాటిని వుదాహరణగా చెప్పుకుని మతంపేరుతో బతుకు వెళ్లదీస్తున్న చాలా ఆధ్యాత్మిక సంస్థలు పిల్లలకి సరైన జవాబు చెప్పలేక వాళ్ళని ఎదిరించలేని మూఢత్వంలోకో, ఎదిరించే మూర్ఖత్వంలోకో నెట్టేస్తున్నాయి.
తెల్లారాక ఇంక వుండాలనిపించలేదు. తోడులేని వెతుకులాట అర్థరహితంగా అనిపించింది. గది ఖాళీ చేసి హోస్‍పేట బస్సెక్కి అక్కడినుంచీ బెంగుళూరు వెళ్ళిపోయాను. హర్షకి ఫోన్ చేస్తే మెజెస్టిక్‍కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. దార్లో హాసిని ఫోన్ చేసింది.
“ఇక్కడికి వస్తావనుకుంటే అన్నదగ్గిరకి వెళ్ళిపోయావా? ” అని అలిగింది. “ఎప్పుడొస్తున్నారు?” అడిగింది.
“నువ్వే ఇక్కడికి రాకూడదూ? ఆ కొనేవేవో ఇక్కడే కొందువుగాని” అన్నాను. చూస్తానంది. శనాదివారాలు ప్రయాణాలంటే అస్సలు ఇష్టం వుండదు తనకి . హర్షే మధ్యలో తన దగ్గిరకి వెళ్తుంటాడు.
ఇంటికి వచ్చాం. నేను దిగులుగా వుండటం గమనించాడు హర్ష. సరదాకబుర్లు చాలా చెప్పాడు. నా దిగులు తను గుర్తించాడని అర్థమైంది. తేలికపడటానికి ప్రయత్నించాను. మొత్తానికి రెండురోజులు పట్టింది మామూలు వాతావరణంలోకి ఇద్దరం రావటానికి.
లోలోపలి దు:ఖం ఎప్పుడూ లోలోపలిదే. అది పుట్టించే వెల్తిని బాహ్య అనుభవాలతో నింపుకోక తప్పదు. లేకపోతే మనుగడ కష్టం. ఈ రెండికీ సమన్వయం కుదర్చటమే జీవనపోరాటం. అది నావరకూ. పిల్లలకి తండ్రి, జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం. కానీ అతనే జీవితం కాదు. వాళ్ళ జీవితంలోని వసంతం కాదు.
హర్షతో పెళ్ళి ప్రస్తావన ఎత్తాను.
“ముందు చెల్లికి చేస్తే బావుంటుందికదమ్మా?” అన్నాడు.
“మొదట నేనూ అలానే అనుకున్నాను. ఎటుతిరిగీ పెద్దమ్మా, పెద్దనాన్నలే పీటలమీద కూర్చుని కన్యాదానం చేస్తారు. అంతవరకూ సరే. ఇంకా జరగాల్సినవి చాలా వుంటాయి. డబ్బు మనం ఖర్చు పెడతాం. పెట్టుపోతలు బయటికి వెళ్తాయి. ప్రతిదానికీ ముత్తైదువలకోసం వెతుక్కోవాలి. వాళ్ళు ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు చేస్తారు. మీ నాన్న పోయాక ఇవన్నీ నేను చాలా అనుభవించాను. కోడలు వస్తే మన యిల్లు, మన వేడుక ఔతుంది” అన్నాను.
వర్ధన్ చనిపోయాక జరిగినవేవీ ఎవరం మర్చిపోలేదు. వర్ధన్ కర్మకాండ అతని అన్నే చేసాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెళ్ళిళ్లయాయి. అప్పటికి హర్షకి వొడుగు కాలేదు. మాసికాలకీ వాటికీ వాళ్ళింటికే రమ్మనేవారు. ఖర్చంతా నాదే. ముందురోజు రాత్రో, ఆరోజు తెల్లవారో పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్ళేదాన్ని. ఆయన కోడళ్ళలో ఎవరో తలుపు తీసేవారు. నన్ను చూడగానే వాళ్ల ముఖకవళికలు మారిపోయేవి. తిథి శుక్రవారమో, మంగళవారమో పడిందో, ఇంక ఆ ముఖాలు అసలు విడేవి కాదు. వర్ధన్ పోయిన మూడోయేట హర్షకి క్లుప్తంగా ఉపనయనం చేయించి ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు హాసిని పెళ్ళిపెత్తనం పూర్తిగా వాళ్ళ చేతుల్లో వుంచడం నాకు ఇష్టం లేదు.
నా మాటలకి తలూపాడు హర్ష. ఏదో ఆలోచనలో పడ్డాడు.
“సంబంధాలు చూడనా? నా ఫ్రెండ్స్ సర్కిల్‍తో మొదలుపెడతాను” అన్నాను. అప్పటికీ ఆలోచనే.
“హాసిని పెళ్ళయాక చెప్పాలనుకున్నాను…” నెమ్మదిగా అన్నాడు.
“ఎవరేనా నీ దృష్టిలో వున్నారా?”
తలూపాడు. వివరాలు చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులది ఇక్కడే. ఆమెకి వుద్యోగం కూడా ఇక్కడే. పెళ్ళయాక మానాలా, మళ్ళీ వెతుక్కోవాలా అనే శషభిషలు వుండవు.
“ముందు తనని నీకు పరిచయం చేస్తాను. తర్వాత మీరు పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకోండి” అన్నాడు హర్ష. అది పద్ధతో కాదో, కానీ కాదనలేదు నేను. ఎన్నో మార్పుల్లో ఇదొకటి. మర్నాడు సాయంత్రం కలవటానికి నిర్ణయమైంది. ఆ అమ్మాయితో మాట్లాడాడు. తనుకూడా సరేనంది.
అవంతీస్ ఇన్‍కి వెళ్ళాము. ప్రశాంతమైన వాతావరణం. కొడుకు ఎంపిక చేసుకున్న అమ్మాయి ఎలా వుంటుందోనని వొళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూసాను. నా ఆతృత చూసి నవ్వాడు హర్ష.
“పోరా! నీకేంటి? ఇవన్నీ మీ నాన్న వుంటే చూసుకునేవారు. ఇంకోమనిషి లేకుండా పెత్తనం అంతా నాదేనంటే ఆపాటి కంగారు వుండదేమిటి?” అన్నాను చిరుకోపంగా. మరో ఐదునిముషాలు గడిచాయి. మేము వెళ్ళిన పదినిముషాలకి ఆ అమ్మాయి వచ్చింది.
“అదుగో, వచ్చింది…” అంటూ వెంటబెట్టుకుని రావటానికి వెళ్ళాడు హర్ష. తలతిప్పి చూసాను. మనసులో అలజడిలా ఒక బాధ… దాన్ని మించిన విషాదం. ఆ అమ్మాయి హంపీ బస్‍స్టాప్‍లో చూసిన, నీలిమ కాకుండా మిగిలిన ఇద్దర్లో ఒకరు. ఆరోజు చూసిన అందమైన అమ్మాయి. ఏమీ తెలీనట్టే వుండిపోయాను. ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. గుర్తుపట్టలేదేమో! పరిచయాలయ్యాయి. పొడిపొడిగా మాట్లాడి వూరున్నాను.
“అమ్మ పెద్దగా మాట్లాడదు…” హర్ష సర్దిచెప్పాడు. అప్పుడు నా ముఖంలోకి చూసింది తను. పెదాల చివర చిన్న విరుపు. అర్థమైంది.
డిన్నర్ చెప్పబోతే వద్దంది. సూప్‍తో సరిపెట్టుకున్నాం.
” పనుంది హర్షా! నువ్వు రమ్మన్నావని వచ్చేసాను. మరి నేను వెళ్తాను” ఇంక వెళ్తానని లేచింది. ముగ్గురం లేచాము. కార్లో కూర్చున్నాక మెసేజి వచ్చింది.
ఇంటికి వచ్చాము. నాకు ఆశ్చర్యంగా వుంది. కోపంగా వుంది. ఆ అమ్మాయి నాకు సవాలులా అనిపిస్తోంది. వర్ధన్ చనిపోయినప్పుడు నాకు ముప్పైరెండేళ్ళు. అతను పోయి పదమూడేళ్ళు. మరో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన నాలోగానీ, అలాంటి ప్రతిపాదన బయటినుంచీగానీ రాలేదు. వారంక్రితం హోస్‍పేట వెళ్ళిన పిల్ల పెళ్ళిచూపులకి రావటం… నన్ను చూసికూడా ఏమీ జరగనట్టు వుండటం, చివరికి బంతి నా దగ్గరికే విసరటం… దిగ్భ్రమగా అనిపిస్తున్నాయి. ఇది ఏళ్ళతరబడి జరిగిన అణచివేతమీద తిరుగుబాటా? కొత్తగా వచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యటమా? మన స్వేచ్ఛ మరొకరి పరిధిలోకి వెళ్ళకూడదనే కనీసపు ఇంగితమేనా లేకపోవటమా?
“స్మిత నీకు నచ్చలేదామ్మా?” అడిగాడు హర్ష.
“ఇప్పుడు తప్పొప్పులంటూ ఏమీ లేవు. భిన్నాభిప్రాయాలు మాత్రమేననుకుంటా వున్నది” అన్నాను.
“ఏమైంది?” అడిగాడు హర్ష.
ఫోన్లో వచ్చిన మెసేజి చూపించాను.
తన భృకుటి ముడిపడింది. “నీకు తను ముందే తెలుసా?”
హంపీ సంఘటన చెప్పాను. ముఖం ఎర్రబడింది.
“మాట్లాడతాను. తను చేసిన రెండు అభియోగాలకీ జవాబు ఇవ్వాల్సిన అవసరం వుంది” అన్నాడు.
రింగ్ చేసాడు.
“చేస్తావనుకున్నాను” అంది.
“భిన్నాభిప్రాయాలు… ఇప్పుడే తెలిసింది ఆ పదానికి అర్థం లోతైనదని… నేను తప్పొప్పులు, సాంప్రదాయాల గురించి మాట్లాడను. నా అభిప్రాయాలు చెప్పి పెట్టేస్తాను. నువ్వు చేసిన రెండు అభియోగాలకి జవాబుగా. ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా గడిపాక జీవిత భాగస్వామిని చూసే చూపుమీద దాని ప్రభావం వుండదా? నాతో సన్నిహితంగా గడిపిన అమ్మాయి నా స్నేహితుడి భార్యగానో, బావమరిది ఫియాన్సీగానో ఎదురుపడి పాతప్రలోభాలు మళ్ళీ తలెత్తితే ఆ తర్వాత? ఎవర్ని మనం మోసం చేస్తున్నది? మనవాళ్లనేకదా? నాకలా మోసం చెయ్యటంగానీ మోసపోవటంగానీ ఇష్టం లేదు. అలాగే వావి వరుసలు పాటించని ప్రాథమికస్థాయి సమాజంలోకి వెళ్ళటంకూడా”
హర్ష ఫోన్ పెట్టేసాడు. రెండుచేతుల్లో ముఖం దాచుకున్నాడు. “నేను ప్రేమనుకున్నది ఇద్దరికీ చెరో అర్థంలో స్ఫురిస్తుందనుకోలేదు” అన్నాడు ఆవేదనగా.