రష్యన్ మూలం: FIODOR M. DOSTOYEVSKY
The story was originally Published in Russian as “Yolka i svad’ba” in the year , 1848 and translated into English by Constance Garnett as “THE CHRISTMAS TREE AND THE WEDDING”
Available in Project Gutenberg in the Public domain.
ఐదేళ్ళైంది …
క్రిస్మస్, కొత్తసంవత్సరం వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లల కార్యక్రమానికి ఫిలిప్ అలెక్సేయెవిచ్ అనే పెద్దమనిషి నన్ను ఆహ్వానించాడు. అతను పెద్ద వ్యాపారవేత్త. చాలా పరిచయాలున్నాయి. ఈ వేడుకలనేవి పదిమందిని ఒకచోట చేర్చడానికి ఒక మిష మాత్రమే. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళవాళ్ళ పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తారు. పిల్లలు వాళ్ళ సందడిలో వాళ్ళుంటే, పెద్దవాళ్ళు వాళ్ళకి సంబంధించిన, లావాదేవీలని చాలా మామూలుగా … అమాయకుల్లాగా మాట్లాడుకుంటారు. వ్యవహారాలు నడుపుకుంటారు. పరిష్కరించుకుంటారు.
కార్యక్రమంలో నావరకు నేను వీటన్నిటికీ పూర్తిగా బైటివ్యక్తిని. నాకేమీ ప్రత్యేకమైన లావాదేవీలూ, వ్యవహారాలూ లేవు. పెద్దగా ఎవరితోటీ కలవకుండా పైపై పలకరింపులతో స్వేచ్ఛగా తిరుగుతూ అందర్నీ గమనిస్తున్నాను.
నాలాగే మరో పెద్దమనిషి కూడా అక్కడికి విచ్చేసాడు. వచ్చీరాగానే అతను నా దృష్టిని ఆకట్టుకున్నాడు. నేను గమనించిన మొదటి వ్యక్తి అతనే. పెద్ద డాబూదర్పంగా ఏమీ లేడుకానీ మంచి బట్టలే వేసుకున్నాడు. పొడుగ్గా సన్నగా వున్నాడు. ముభావిగా అనిపించాడు. అతనికి ఇలాంటి కుటుంబసమేత వేడుకలంటే పెద్దగా ఆసక్తిలేదని అర్థమైంది. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో వచ్చిన అతను అందర్నీ తప్పించుకుని ఒక పక్కకి వెళ్ళి నిలబడి అలంకారప్రాయంగా వున్న చిరునవ్వుని తీసి పడేసాడు. నల్లటి దట్టమైన కనుబొమ్మలు ముడివడ్డాయి.
ఆతిథ్యం ఇస్తున్న ఫిలిప్ అలెక్సేయెవిచ్ తప్ప అతనికి మరెవరూ తెలీకపోవటంచేత ముఖంలో విసుగు కనిపిస్తోంది. దాన్ని అణచివేసుకుని సంతోషాన్ని చివరిదాకా ప్రదర్శించాడు.
అతనేదో అతిముఖ్యమైన పనిమీద ఈయనని కలవటానికి సిఫార్సు వుత్తరం తీసుకుని చుట్టుపక్కల వున్న ఓ పల్లెటూరినుంచీ ఈ రాజధానినగరానికి వచ్చాడని తరువాత తెల్సింది. అతిథేయుడు తప్పదన్నట్టు అనాసక్తిగా అతడి బాధ్యత తీసుకున్నాడు. మర్యాదకోసం పిల్లల బాల్కి కూడా ఆహ్వానించాడు. అక్కడ ఎవరూ అతన్ని పేకాటలో కలుపుకోలేదు. సిగార్లు ఇవ్వలేదు. కనీసం ఎవరూ మాట్లాడనుకూడా లేదు. స్వజాతి పక్షులజట్టులో ఇతను విజాతికి చెందినట్టు వేరుపడిపోయాడు. ఏం చెయ్యాలో తోచక ఇబ్బందిపడిపోయాడు. అలా నిర్వ్యాపారంగా నిలబడి వున్నప్పుడు సాధారణంగా మగవారి చేతులు మీసాలని నిమురుకుంటూ వుంటాయి. అతని చేతులుకూడా అదే చేసాయి. నిజానికి అతని మీసాలు చాలా అందంగా వున్నాయి. అతను వాటిని దువ్వుతున్న తీరు చూస్తుంటే ముందు అవి పుట్టి. వాటిని దువ్వడానికి ఆ మనిషి పుట్టినట్టు అనిపించింది నాకు.
అక్కడ మరొక అతిథికూడా నన్ను ఆకర్షించాడు. ఐతే అతను మొదటి వ్యక్తికి పూర్తిగా భిన్నమైనవాడు. అతనొక ప్రముఖుడు. అతన్ని జూలియన్ మాస్తకొవిచ్ అని సంబోధించారు. చూసీచూడగానే అతను అతిథేయుడికి సమస్థానంలో వున్నాడనీ, మీసాలు దువ్వుకుంటున్న వ్యక్తితో పోల్చితే వాళ్ళకి చాలా ముఖ్యుడైనవాడనీ అర్థమౌతుంది. అతిథేయుడూ, అతని భార్యా ఆయనతో ఎడతెరిపి లేకుండా సరదా కబుర్లు చెప్తున్నారు. చాలా శ్రద్ధ చూపెడుతున్నారు. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతని చుట్టే తిరుగుతున్నారు. వచ్చినవారిని అతని దగ్గరకు పిలుచుకు వచ్చి పరిచయం చేస్తున్నారే తప్ప ఎవరి దగ్గరికీ అతన్ని తీసుకెళ్ళటం లేదు.
“ఇంత ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని నా జీవితంలో ఎప్పుడూ గడపలేదు” అన్నాడు జూలియన్ మాస్తకొవిచ్. అతిథేయుడి కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి.
ఈ నాటకం అంతా కొంతసేపు చూసాక నాకు జూలియన్ మాస్తకొవిచ్ వునికి చిరాకనిపించింది. అతను రాకుండా వుంటేనో, ఇంక వెళ్ళిపోతేనో బావుండేదనిపించింది. ప్రపంచమంతా ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతూ వుండి, అందులో మనకి చోటులేనప్పుడు ఆసక్తిగా వుండదుగా! నెమ్మదిగా నేను పిల్లలవైపుకి కదిలాను. నాకు పిల్లలంటే ఇష్టం. వాళ్ళని గమనించడం మరీ యిష్టం. వాళ్ళు తమని తాము ప్రకటించుకోవడానికి చేసే పోరాటాన్నీ, అలాంటి పోరాటపటిమని చూపించే వాళ్ళ వ్యక్తిత్వాన్నీ గమనించడం ఇంకా యిష్టం. అందరు పిల్లలూ చాలా ముద్దుగా వున్నారు. అందులో ఐదుగురు అతిథేయుని పిల్లలు. మిసమిసలాడుతున్నారు. పిల్లలెవరూ అమ్మానాన్నలుగానీ, గవర్నెస్లుగానీ చెప్పినట్టు చెయ్యటానికి నిరాకరిస్తున్నారు. క్షణాల్లో క్రిస్మస్చెట్టుని ఎలాంటి మొహమాటం లేకుండా స్వీటుకూడా దులిపి పారేసారు. సగం బొమ్మలు విరగ్గొట్టేసారు. ఆ విరిగిపోయిన ముక్కల్లో ఏది ఎవరిదో కూడా గుర్తుపట్టడానికి లేకుండా వుంది. వాళ్లలో మరీ ముఖ్యంగా అందమైన చిన్నపిల్లాడు ఒకడున్నాడు. నల్లటి కళ్ళు, ఉంగరాల జుత్తు… వాడి చేతిలో ఒక కొయ్యతుపాకీ వుంది. దాన్ని నాకు గురిపెట్టి కాల్చాలనే బలమైన కోరికని వెలిబుచ్చాడు. పిల్లలందర్లోకీ ఆకర్షణీయమైనది వాడి అక్క. పదకొండేళ్ళ పిల్ల. సౌందర్యదేవతకి ప్రతిరూపంలా వుంది. చాలా నెమ్మదైనది. కాస్త ఆలోచనాపరురాలుకూడా. చక్కటి పెద్ద, నిండైన కళ్ళు… కలలు కనే కళ్ళు.
పిల్లలతో కొద్దిసేపు గడిపాక, ఖాళీగా వున్న సిట్టింగ్రూమ్లోకి వెళ్ళి అందులో సగభాగం ఆక్రమించి వున్న గాజుగదికి చివరన కూర్చున్నాను. కొద్దిసేపటికి ఆ అందమైన పిల్లకూడా వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను కూర్చున్న గదిలోకే వచ్చి, వొళ్ళో బొమ్మ పెట్టుకుని ఒక మూల కూర్చుంది.
“తెలుసా? ఆ పిల్ల తండ్రి చాలా పెద్ద వ్యాపారస్తుడు. బాగా ధనవంతుడు” అటుగా వెళ్తూ ఎవరో అంటున్నారు మరెవర్తోనో.
“మూడులక్షల రూబుళ్ళు ఈ పిల్ల పెళ్ళికి కట్నంకోసం పక్కని పెట్టారట”
ఈ సమాచారాన్ని అందించిన గుంపువైపు నేను తలతిప్పి చూస్తుండగా నా చూపులు జూలియన్ మాస్తకొవిచ్ చూపులతో కలిసాయి. చుట్టూ జరుగుతున్న నిరాసక్తమైన సంభాషణని అనాసక్తంగా వింటూ నిలబడి వున్నాడు. కానీ ఆసక్తి చూపిస్తున్నట్టుగా జాగ్రత్తపడుతున్నాడు. చేతులు వెనక్కి పెట్టుకున్నాడు. తల కొద్దిగా పక్కకి వంచాడు.
అతిథేయుడు వచ్చిన పిల్లలకి బహుమతులని పంచుతున్నాడు. ఎలా పంచుతాడోనని కుతుహలంగా చూడసాగాను.
మూడులక్షల రూబుళ్ళ కట్నం ఇప్పుడే దాచుకున్న పిల్ల చాలా అందమైన, ఖరీదైన అమ్మాయి బొమ్మని సంపాదించుకుంది. మిగిలిన బొమ్మలన్నీకూడా వారివారి తల్లిదండ్రుల స్థాయినిబట్టి పంచడం జరిగింది. ఆఖరుకి మిగిలింది, పదేళ్ళ చిన్నపిల్లాడు. వాడి జుత్తు ఎర్రగా వుంది. ముఖంమీద చిన్నచిన్న మచ్చలున్నాయి. వాడికి ఒక బొమ్మల్లేని అనాసక్తికరమైన కథలపుస్తకం వచ్చింది. ఆ పుస్తకానికి మొదలూ వెనుకా పేజీలు కూడా లేవు. అతను అతిథేయుని గవర్నెస్ కొడుకు. ఆమె పేద వితంతువు.
ఎర్రజుత్తు పిల్లవాడు పాతబడ్డ ముతక నాన్కీన్ జాకెట్ వేసుకున్నాడు. చుట్టూ వుండేవాళ్ళు తరుచు హేళనచెయ్యటంచేత బాగా బెరుకుగా వున్నాడు. ఆ వయసుకే అతడికి తన స్థాయేమిటో, చుట్టూ వున్నవాళ్ళు తనని ఎలా చూస్తున్నారో తెలుసుకుని జాగ్రత్తగా వుంటున్నాడు. అతడు ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే వున్న బొమ్మల చుట్టూ ఒకసారి తిరిగాడు. అవన్నీ చాలా నచ్చాయి. ముఖ్యంగా ఒక బొమ్మ థియేటరు. దానితో ఆడుకోవటానికి మిగిలిన పిల్లల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసాడు. చిన్ననవ్వు రువ్వి వాళ్ళతో కలిసిపోయి ఆట మొదలు పెట్టాడు. తన దగ్గరున్న ఒకే ఒక ఏపిల్ని అప్పటికే జేబులనిండా మిఠాయిలు నింపుకున్న ఒక తుంటరి కుర్రాడికి ఇచ్చాడు. మరో పిల్లవాడిని ఉప్పెక్కించుకున్నాడు. ఇంతాచేసి, కొద్ది నిముషాలేనా అతడు ఆ ఆటలో వున్నాడో లేదో, ఒక యువకుడు అతనిమీద పడి పిడి గుద్దుల వర్షం కురిపించాడు.
ఎర్రజుత్తు పిల్లవాడు బిక్కచ్చచ్చిపోయాడు. కనీసం ఏడవటానికి కూడా భయపడ్డాడు. అతని తల్లి వచ్చి పిల్లవాడిని కోప్పడి అక్కడినుంచీ దూరంగా తీసుకుపోయింది. అతను నెమ్మదిగా ఆ మూడులక్షలరూబుళ్ళ కట్నం పిల్ల వున్న గదిలోకి చేరుకున్నాడు. ఆమె అతన్ని తన పక్కని కూర్చోనిచ్చింది. కొద్దిసేపట్లో ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ కలిసి ఆమె వొళ్ళో వున్న ఖరీదైన బొమ్మ యొక్క బట్టల్ని ఇప్పి కట్టడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరిమధ్యా జరుగుతున్న సంభాషణ వింటూ దాదాపు అరగంట అలాగే గడిచింది నాకు. కునికిపాట్లొస్తున్నాయి.
ఉన్నట్టుండి జూలియన్ మాస్తకొవిచ్ అక్కడికి వచ్చాడు. నేను మొక్కల వెనుక వుండటంచేత అతను నన్ను గమనించలేదు. పిల్లలు బాగా గొడవ చేస్తున్నందున తప్పించుకుని ఇక్కడికి వచ్చాడట. అదో వంకని కాసేపటికే అర్థమైంది. కొద్దిసేపటిముందే అతను ఆ మూడులక్షల రూబుళ్ళ పిల్ల తండ్రితో ఆతృతగా మాట్లాడటం నా దృష్టిని దాటిపోలేదు. వాళ్లకి ఒకరొకరికి అతిథేయుడే పరిచయం చేసాడు. నేనున్న గది మధ్యలో కదలకుండా నిలబడి తనలో తను చేతిలెక్కలు వేసుకుంటూ గొణుక్కోవటం మొదలుపెట్టాడు.
“మూడు లక్షల రూబుళ్ళు… ఐదేళ్ళలో… కనీసవడ్డీ నాలుగుశాతం …” అవి ఆ లెక్కలు. “కానీ ఆ ముసలాడికి నాలుగుశాతం వడ్డీ అన్నది నచ్చుబాటుగా లేదు. కనీసం ఎనిమిదో పదో కావాలనుకుంటున్నాడు. ఎంతకాదనుకున్నా ఈ పిల్ల పెళ్ళికి వచ్చేసరికి అంటే మరో ఐదేళ్ళకి … ఐదులక్షలేనా ఔతుంది. ఐదులక్షలనేది కచ్చితం. ఆ పైన ఎంతొచ్చినా అది చేతిఖర్చులకని అనుకోవచ్చు…” డబ్బులెక్కలు పెడుతూ అతను చాలా వుద్విగ్నంగా కనిపించాడు. చేతులు నులుముకుంటూ అటూయిటూ అస్థిమితంగా తిరిగాడు. అలా తిరుగుతూ ఇంకా వుత్తేజితుడయ్యాడు.
చివరికి ఒకసారి ముక్కు ఎగబీల్చి గదిలోంచీ వెళ్ళబోతూ ఆ మూడులక్షల పిల్లని చూసి అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. నెమ్మదిగా తనని తను అదుపులోకి తెచ్చుకుని ఆమెకేసి చూపు నిలిపాడు. తరువాత ఏదో తప్పుచేసి దానికి క్షమార్పణ కోరుకుంటున్నట్టు ఆ పిల్ల దగ్గరికి అడుగులో అడుగేసుకుంటూ కదిలాడు. ఆమె తలమీద ముద్దుపెట్టుకున్నాడు.
అతనలా హఠాత్తుగా తనదగ్గిరకి వచ్చేస్తాడని వూహించని ఆ పిల్ల కెవ్వుమని అరిచింది.
“ఇక్కడేం చేస్తున్నావమ్మాయ్?” చుట్టూ చూస్తూ అని, నెమ్మదిగా ఆమె బుగ్గని గిల్లాడు.
“ఆడుకుంటున్నాం”
“ఆటా? వీడితోనా?” అయిష్టంగా అడిగాడు. “నువ్వు ఇక్కడకాదు, వుండాల్సింది. డ్రాయింగ్రూమ్లోకి వెళ్ళు” అని ఎర్రజుత్తు పిల్లవాడికి చెప్పాడు. అతడక్కడే కళ్ళు విప్పార్చుకుని ఆ పెద్దమనిషిని చూస్తూ నిలబడ్డాడుగానీ కదల్లేదు. జూలియన్ మాస్తకొవిచ్ చుట్టూ ఒకమాటు చూసి, మూడులక్షల పిల్లమీదికి వంగి, అడిగాడు.
“నీకు బహుమతిగా ఏం వచ్చిందమ్మా? బొమ్మా?”
“ఔనండీ”
“బొమ్మలు దేంతో తయారౌతాయో నీకు తెలుసా?”
“లేదండీ!”
“చింకి, పాతబట్టలతో తల్లీ” అని ఎర్రజుత్తు పిల్లవాడివైపు తిరిగి, “నిన్ను మిగిలిన పిల్లలదగ్గిరకి వెళ్ళమని చెప్పానా? వెళ్ళు” అని కటువుగా అన్నాడు. పిల్లలిద్దరూ ముఖాలు చిట్లించారు. ఒకళ్ళని ఇంకొకళ్ళూ గట్టిగా పట్టుకున్నారు.
“నీకు బొమ్మ ఎందుకు ఇచ్చారో తెలుసా?” అతను ఆ అమ్మాయిని అడిగాడు జూలియన్ మాస్తకొవిచ్ వీలైనంత సౌమ్యంగా గొంతు మార్చుకుంటూ.
“తెలీదు”
“నువ్వు గతవారం అంతా చాలా బుద్ధిగా వున్నావని” ఇలా అంటుంటే జూలియన్ మాస్తకొవిచ్ బలమైన భావసంచలనానికి గురయ్యాడు. చూట్టూ మరోసారి చూసి, లోగొంతుకతోనేగానీ, అసహనంగా అడిగాడు.
“నేను మీయింటికి వద్దామనుకుంటున్నాను. అలా వచ్చినప్పుడు నాతో ప్రేమగా వుంటావా?” అని అడుగుతూ ఆ పసిదాన్ని ముద్దుపెట్టుకోవాలని చూసాడు. ఆ పిల్ల కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. ఎర్రజుత్తు పిల్లాడు తన స్నేహితురాలు కన్నీళ్ళతో కంపించిపోవటం చూసి ఆమె చేతిని తన చేత్తో పట్టుకుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. జూలియన్ మాస్తకొవిచ్ పెద్దమనిషికి చాలా కోపం వచ్చింది.
“పోరా! పో…. నిన్నిక్కడినుంచీ వెళ్ళమని చెప్పానా?”
“అతన్ని నేను వెళ్ళనివ్వను. మీరే వెళ్ళిపొండి… అతనొక్కడే వుండాలి” ఏడుస్తూ అంది మూడులక్షల పిల్ల. ద్వారందగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. జూలియన్ మాస్తకొవిచ్ తన భంగిమని గౌరవనీయంగా వుండేలా సవరించుకున్నాడు. ఎర్రజుత్తుపిల్లాడు మరింత భయపడిపోయాడు. మూడులక్షల పిల్ల చెయ్యి వదిలేసాడు. గోడకి అతుక్కుపోయినట్టు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందు డ్రాయింగ్రూములోకీ తర్వాత భోజనాలగదిలోకీ నడిచాడు.
ఎవరి దృష్టిలోనూ పడకుండా వుండేందుకు జూలియన్ మాస్తకొవిచ్కూడా బోజనాలగదిలోకి నడిచాడు. ఎర్రటి ఎండ్రకాయలా వున్నాడతను. అక్కడున్న అద్దంలో తన రూపు కనిపించి తనకి తనే భయపడ్డాడు. తన ఆవేశం అసహనం తలుచుకుంటే అతనికే చిరాకేసింది. డబ్బు లెక్కలముందు తన గౌరవం, హుందాతనం అన్నీ మర్చిపోయాడు. నచ్చిన వస్తువు కంటపడగానే మీదపడి లాక్కునే పసిపిల్లాడికన్నా ఎక్కువగా ప్రవర్తించలేదు. మూడులక్షలపిల్ల నిజానికి ఇప్పటికిప్పుడు తను దక్కించుకోవల్సినది కాదు. తొందరపడవలసినది ఏమీ లేదు. చాలా చిన్నపిల్ల. పెళ్ళికి ఇంకా వ్యవధి వుంది. ఇంకో ఐదేళ్ళేనా పడుతుంది.
నేనుకూడా ఆ పెద్దమనిషి వెనక డైనింగ్రూమ్లోకి వెళ్ళాను. ఈ కొద్దివ్యవధిలోనే అక్కడ ఒక పెద్ద నాటకం మొదలైంది. జూలియన్ మాస్తకొవిచ్ తన విసుగూ చిరాకూ మాటల్లో చూపిస్తూ, చూపుల్లో విషాన్ని వొలికిస్తూ ఎర్రజుత్తు పిల్లాడి మీదిమీదికి వెళ్తూ బెదిరిస్తున్నాడు. ఆ పిల్లాడు వెనక్కి వెనక్కి నక్కుతూ ఒక మూల ఇరుక్కుపోయాడు.
“ఏం చేస్తున్నావురా ఇక్కడ, పనికిరాని వెధవా? పో ఇక్కడినుంచీ… పళ్ళు దొగతనం చేస్తున్నావా? అంతే అయ్యుంటుంది… మచ్చలవెధవా! పో… నీలాంటి అలగావాళ్ళున్నచోటికి పోయి తగలడు. ఇక్కడేం పని నీకు?” అని అరిచాడు.
హడిలిపోయిన ఆ పిల్లాడు అతన్నుంచీ తప్పించుకుందుకు ఆఖరి ప్రయత్నంగా టేబుల్కిందికి దూరాడు. పెద్దమనిషికి వళ్ళింకా మండిపోయింది. జేబులోంచీ పెద్ద లైనన్ రుమాలు తీసి కొరడాలా ఝళిపిస్తూ పిల్లాడిని అక్కడినుంచీ తరిమేసాడు.
ఇక్కడొక మాట చెప్పాలి. చక్కటి తిండి తిని, నునుపైన వుబ్బిన బుగ్గలతో, పెద్దబొజ్జతో గుండ్రటి కాలిమడమలతో వున్న జూలియన్ మాస్తకొవిచ్ కాస్తంత భారీకాయుడు. పిల్లాడిని తరిమినందుకు అతను ఆయాసపడుతూ వగర్చుతున్నాడు. అతనికి ఆ ఎర్రజుత్టుపిల్లాడి పట్ల వున్నది అయిష్టమా, అసూయా? మూడులక్షల పిల్లతో వాడు స్నేహంగా వున్నందుకా? ఒక పిచ్చివాడిలాగ తన కోపాన్ని ప్రదర్శించాడు.
అంతటి భారీ మనిషి… పెద్దమనిషికూడా…
అతను చేసిన విన్యాసాలకి నేను మనస్పూర్తిగా నవ్వేసాను. నా నవ్వు విని జూలియన్ మాస్తకొవిచ్ నావైపు తిరిగాడు. చాలా తికమకపడ్డాడు. తన ప్రాధాన్యత తగ్గిపోయి, మూర్ఖుడిలా ఎలా ముద్రపడ్డాడో ఇంకా గుర్తించలేదు. ఇంతలో అతిథేయుడు వచ్చాడు. ఎర్రజుత్తు పిల్లవాడుకూడా టేబుల్ కిందినుంచీ మోకాళ్ళు, మోచేతులమీద పాకుతూ బయటికి వెళ్ళి, లేచి నిలబడి అంటుకున్న దుమ్ము దులుపుకున్నాడు.
జూలియన్ మాస్తకొవిచ్ ఒక కొసపట్టుకుని కొరడాలా ఝళిపించిన తన రుమాలుని గబగబ ముక్కు దగ్గరికి తెచ్చుకుని, తుడుచుకుంటున్నట్టు నటించాడు. అతిథేయుడు ఏం జరిగిందో తెలియక మా ముగ్గుర్నీ సందేహంగా చూస్తూ నిలబడ్డాడు. కానీ అతడు చాలా లౌక్యంగల పెద్దమనిషి. వెంటనే పరిస్థితిని తనకి అనువుగా మార్చేసుకున్నాడు. అక్కడే నిలబడి వున్న గౌరవనీయ అతిథిని చక్కగా కాకాపట్టడం మొదలుపెట్టాడు.
“ఇందాకా మీకు చెప్తూ వుంటినే, వాడే వీడు” ఎర్రజుత్తు పిల్లాడిని చూపిస్తూ చెప్పాడు. “మీరేమీ అనుకోరని ఇంత స్వతంత్రిస్తున్నాను ” మొహమాటంగా అన్నాడు.
“ఓహ్! చెప్పండి” అన్నాడు జూలియన్ మస్తకొవిచ్. అతనింకా కుదుటపడలేదు.
“వీడు మా గవర్నెస్ కొడుకు” అతిథేయుడు నెమ్మదిగా అన్నాడు. “ఆమె చాలా పేదరాలు. భర్త చనిపోయాడు. అతడొక నిజాయితీపరుడైన వుద్యోగి. అందుకే… మీకు ఏమాత్రం వీలున్నా…”
అతని వుద్దేశాన్ని జూలియన్ మాస్తకొవిచ్ బాగానే కనిపెట్టేసి, సగంలోనే అడ్డుపడి, ” ఫిలిప్ అలెక్సియెవిచ్ మహాశయా! మరోలా అనుకోవద్దు. మీరేమి అడగబోతున్నారో నాకు అర్థమైంది. సాధ్యపడదు. అస్సలే కుదరదు. నేను ఇంతకుముందే తెలుసుకున్నాను. ఖాళీలు లేవట. ముందుముందు రాబోయే ఖాళీలకోసం దరఖాస్తు చేసుకున్నవారు పదిమందేనా వుంటారు. వాళ్ళందరికీ ఇతనికన్నా ఎక్కువ అర్హతలే వున్నాయి. నన్ను మన్నించండి” అన్నాడు.
“వాడి దురదృష్టం. చాలా నెమ్మదైన పిల్లవాడు” అన్నాడు.
“కానేకాదు. చాలా తుంటరివెధవ” అన్నాడు జూలియన్ మాస్తకొవిచ్ కోపంగా. ఎర్రజుత్తపిల్లాడు ఇంకా అక్కడే వుండడం చూసి, “పోరా! ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావ్? ఇక్కడ నీకేం పని? మిగతా పిల్లలదగ్గరికి వెళ్ళు” అని మరోమాటు గదిమాడు. అక్కడే వున్న నాకేసి కూడా ఒక చూపు విసిరాడు. అలా చూడకుండా వుండలేకపోయాడు.
నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. అతను మొహమ్మీదే నవ్వేసాను.
“ఎవరా, వింతమనిషి?” మొహం తిప్పుకుని, అతిథేయుణ్ణి అడిగాడు. నాకు వినబడేలాగే. వాళ్ళిద్దరూ నన్ను లెక్కచేయకుండా ఏవో గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు.
నేనుకూడా అక్కడినుంచీ కదిలి డ్రాయింగ్రూంలోకి వెళ్ళాను.
అక్కడ… మన గొప్పమనిషి… జూలియన్ మాస్తకొవిచ్… చుట్టూ ఆడపిల్లల తల్లులూ తండ్రులూ, అతిథేయుడూ, ఆయన భార్యా మూగి వుండగా అప్పుడే తనకి కొత్తగా పరిచయం చేయబడిన స్త్రీతో చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నాడు. ఆమె మూడులక్షలపిల్ల చేతిని పట్టుకుని వుంది.
జూలియన్ మాస్తకొవిచ్ ఆ పిల్ల అందచందాలనీ, తెలివితేటలనీ, నైపుణ్యాలనీ… ఆమె పుట్టిన వంశాన్నీ ప్రశంసించడం మొదలుపెట్టాడు. అలా పొగడటానికే తను పుట్టినట్టు. పిల్ల తల్లి అదంతా విని చలించిపోయింది. సంతోషంతో కళ్ళమ్మటనీళ్ళు ధారలు కట్టాయి. ఆమె పరిస్థితి అలా వుంటే ఆ పిల్ల తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు. వాళ్ళిద్దరి సంతోషం అక్కడ వున్న అందరిలో నిండింది. ఆ సంభాషణ నిరాఘాటంగా సాగటానికి పిల్లలని అల్లరిచెయ్యకుండా కాపలా కాసారు. వాతావరణమంతా ఒకవిధమైన గౌరవంతో నిండిపోయింది. మూడులక్షలపిల్ల తల్లి లోలోతులదాకా కదిలిపోయింది.
“మా యింటికి ఎప్పుడు వస్తున్నారు? మీరాక మాకెంతో గౌరవనీయం, అభిలషణీయం” ఎంతో గౌరవపూర్వకంగా అడిగింది. జూలియన్ మాస్తకొవిచ్ ఎలాంటి దాపరికం లేని కుతూహలంతో ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. అతిథులంతా నెమ్మదిగా కదిలి అటూ యిటూ వెళ్ళడం మొదలుపెట్టారు.
ఎక్కడ విన్నా ఇదే చర్చ… మూడులక్షలపిల్ల తండ్రిని , అతని భార్యని, ఆ పిల్లని… ముఖ్యంగా జూలియన్ మస్తకొవిచ్ని … పొగుడుతున్నారు.
“అతనికి పెళ్ళైందా?” నాకు తెలిసిన ఒకతన్ని అడిగాను. అతను అప్పుడు జూలియన్ మాస్తకొవిచ్ వెనకాలే నిలబడి వున్నాడు. నావైపు ఒక విషపుచూపు విసిరాడు జూలియన్ మాస్తకొవిచ్. నేను కావాలనే అడిగానని గ్రహించి నా మితృడు ఆశ్చర్యపోయాడు.
ప్రస్తుతానికి వస్తే…
కొద్దిరోజుల క్రితం ఓ ఆదివారం నేను చర్చికి బయల్దేరాను.
ఆరోజు చాలా నిరుత్సాహంగా మొదలైంది. సన్నటి తుంపరపడుతోంది. నేను చేరుకునేసరికి అక్కడ చాలామంది జనం జమకూడి వున్నారు. వాళ్ళందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళాను. గొప్పవాళ్లెవరిదో పెళ్ళివేడుక జరుగుతోంది. దాన్ని చూడటానికి చాలామంది చేరారు.
పెళ్ళికొడుకు పెద్ద బొజ్జవేసుకుని బాగా అలంకరించుకుని వున్నాడు. హడావిడిగా అటూయిటూ తిరుగుతూ అందరినీ గదమాయిస్తూ పెళ్ళిపనులు చక్కబెట్టుకుంటున్నాడు. పెళ్ళికూతురు ఇంకా రాలేదు.
ఇంతలో పెళ్ళికూతురు వస్తోందన్న వార్త వచ్చింది. గుంపుని తప్పించుకుంటూ ముందుకి వెళ్ళాను. అద్భుతమైన సౌందర్యవతి ఐన అమ్మాయి. ఇప్పుడిప్పుడే యౌవనంలోకి అడుగుపెడుతోంది. బాల్యపు చిహ్నాలు వీడలేదు. యౌవనపు గుర్తులు రాలేదు. రెండిటి సంధికాలం. ఆ పిల్ల దు:ఖంతో పాలిపోయి వుంది. పెళ్ళిలో పెద్దగా ఆసక్తి లేనట్టు వుంది. కొద్దిసేపటిక్రితమే ఏడ్చినట్టు ఆమె కళ్ళు ఎర్రగా మంకెనపూవుల్లా వున్నాయి. ఆపిల్ల ముఖంలోని ప్రతిరేఖా, ప్రతి కవళీకా ఆమె అందాన్ని ఇనుమడిస్తున్నాయి. ఆ సౌందర్యపు గాఢత, హుందాతనం, ఆమె విషాదం ఇవన్నీకూడా ఆమెలోని పసితనాన్ని ప్రస్ఫుటంగా చూపెడుతున్నాయి.
ఏదో వుంది…
చెప్పడానికి సాధ్యపడనంత అస్పష్టమైనది…
ఇంకా స్థిరపడనిది…
పసితనంతో కూడుకున్నది…
మాటల్లో వ్యక్తమవనంత లీలగా దయచూపమని అడుగుతున్నట్టు…
ఆమెకి పదహారేళ్ళేనట. అక్కడున్నవాళ్ళు అంటున్నారు.
నేను పెళ్ళికొడుకుని పరీక్షగా చూసాను. అతను మరెవరో కాదు, జూలియన్ మాస్తకొవిచ్. అతన్ని ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. పెళ్ళిపిల్లని మరొక్కమాటు చూసాను.
భగవంతుడా!
ఇంక అక్కడ నిలబడలేకపోయాను. వెంటనే ఇవతలికి వచ్చేసాను.
అక్కడ జనం చెప్పుకుంటుంటే విన్నాను. కట్నం ఐదులక్షల రూబుళ్ళట. ఐదేళ్ళలో ఐదులక్షలు. జూలియన్ మాస్తకొవిచ్ లెక్కలేమీ తప్పలేదు. చేతిఖర్చులతో సహా.
ఆ పెళ్ళి జీవితంలో మర్చిపోలేను. చాలా గమ్మత్తుగా అది గుర్తొచ్చినప్పుడల్లా క్రిస్మస్ ట్రీ గుర్తొస్తూ వుంటుంది. దాని కొమ్మలకి బాల్యాలన్నీ వేలాడుతుంటాయికదా!

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.