“అమ్మా! చిన్నీ వాళ్లూ ఇల్లు అమ్మేస్తున్నారట” అంది ప్రసూన పరుగున వచ్చి నన్ను అల్లుకుపోతూ. తన కళ్లలో ఆశ్చర్యం, అపనమ్మకం. నాకూ ఆశ్చర్యం వేసింది.
“ఎందుకట?” అడిగాను.
“వాళ్లక్క పెళ్లట. అందుకు చాలా డబ్బులు కావాలట. ఇల్లమ్మేస్తే బోల్డు డబ్బులొస్తాయట. అమ్మా! ఇల్లమ్మటమంటే ఏమిటి? ఇల్లు తవ్వేసి ఇచ్చేస్తారా?” అమాయకంగా అడిగింది.
నేను నవ్వి, “కాదు. చిన్నీవాళ్లే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు” అన్నాను.
“అంటే చిన్నీవాళ్లు ఇక్కడినుంచి వెళ్లిపోతారా?” నమ్మలేనట్టు అడిగింది. పిల్లలకి చాలా అనుబంధాలుంటాయి. పెద్దవాళ్లకి అవి చిన్నవని అనిపిస్తాయి కానీ వాళ్ల వయసుకి అవి చాలా పెద్దవి.
మేం ఈ ఇల్లు కట్టుకుని ఇందులోకి వచ్చేసరికి ప్రసూనకి ఏడాది. చిన్నీవాళ్లూ అప్పటికే వచ్చి ఉన్నారు. ఆ పిల్ల మొదటి పుట్టినరోజుకి వాళ్లొచ్చి పిలవడంతో మా కుటుంబాలమధ్య పరిచయం మొదలైంది. అప్పట్నుంచీ పిల్లలిద్దరూ స్నేహితులు. ఇద్దరిదీ ఒకటే స్కూలు. ఒక్క క్షణంకూడా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు. రాత్రికూడా వాళ్ళింట్లోనో మాయింట్లోనో. ఒకరు ఏ ఊరేనా వెళ్తే రెండోవాళ్లు బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చేసుకుంటారు. విడిపోవటమనేది వాళ్ల ఊహకే అందని విషయం.
కొద్దినిమిషాల తర్వాత ప్రసూన అడిగింది. “అమ్మా! నా పెళ్లికి మీరుకూడా మనిల్లు అమ్మేస్తారా?”
నేను తృళ్లిపడ్డాను. పైకి చాలా మామూలుగా ప్రశ్నేగానీ లోతైనది. మన వివాహవ్యవస్థనే సవాలుచేసేది. ఆడపిల్ల పెళ్లంటే ఇళ్లూ వాకిళ్లూ అమ్ముకోవాలా? నిలువ నీడ లేకుండా చేసుకోవాలా?
“లేదు. అలా ఎందుకు చేస్తాం?” అని తనకి సర్దిచెప్పాను. నా దగ్గర్నుంచి వెళ్లిపోతుందనుకున్నాను. కానీ వెళ్లలేదు. ఇంకో ప్రశ్నని సంధించింది. దాని మనసు అనే అమ్ములపొదిలో ఎన్ని బాణాలో!
“మున్నక్కకోసం ఇల్లమ్మేస్తున్నారు. మరి చిన్నీ పెళ్ళికేం అమ్ముతారే?” అంది.
“ఏయ్, పెద్దకబుర్లు చెప్పక వెళ్లి ఆడుకో” జవాబు దొరక్క కోప్పడి పంపేశాను. చాలాసేపుదాకా నన్నా ప్రశ్నలు వెంటాడుతునే ఉన్నాయి.
మాకూ వాళ్ళకీ గోడఒక్కటే అడ్డం. గోడకి అటూ, ఇటూ నిలబడి చిన్నీ వాళ్లమ్మ యశోదా నేనూ రోజూ చాలాసేపు మాట్లాడుకుంటుంటాం. మళ్లీసారి మేం మాట్లాడుకున్నప్పుడు యశోద చెప్పింది, మున్నీకి పెళ్లి కుదిరిన విషయం. పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం. ఇంజనీరింగు చదివిన పిల్ల కోసం వెతుకుతున్నారట. తెలిసినవాళ్లద్వారా సంబంధం వచ్చిందని చెప్పింది.
చెప్పి, “ఇల్లు బేరం పెట్టాం. కుదిరినట్టే. మాకు దూరపు బంధువులే తీసుకుంటున్నారు” అంది.
“అదేమిటి?” ఇంకేమనాలో తోచలేదు.
” ఏం చెయ్యాలి రాధా! రెండేళ్లనుంచీ వానలు సరిగ్గా పడక పంటల్లేవు. తన ఒక్కరి జీతం ఏం చాలుతుంది, చెప్పు? వ్యవసాయానికి పెట్టుబడీ, ఇంటి ఖర్చులూ, పిల్లల చదువులూ అన్నీ అందులోనే వెళ్ళాలి. ఈ యేడు మున్నీ ఇంజనీరింగు పూర్తవుతుంది. ఎప్పటికేనా చెయ్యక తప్పదు. అదేదో సంబంధం కలిసొచ్చినప్పుడే చేసేస్తే మంచిదికదా! జీతంమీదైతే దాని పెళ్లి చెయ్యలేం. ఇల్లో పొలమో అమ్మక తప్పదు. ఈ టైంలో పొలం అమ్మితే అంతా నష్టమే. బేరాలు రావు. అందుకే ఇల్లు బేరం పెట్టాం. తెలీనిదేముంది? మాలో కట్నాలు బాగా ఎక్కువ. అందులో అమెరికా సంబంధం. ఖర్చులు పోను మిగిలినదానికి ఇంకొంత కలిపి పొలిమేరల్లో మరో యిల్లు తీసుకుంటున్నాం. అద్దె బాధ లేకుండా” అంది.
తెలివైన ఆలోచనే. అమ్మాయి పెళ్లీ, మరో ఇల్లూ రెండూ పూర్తవుతున్నాయి. ఐనా సంతోషంగా అనిపించలేదు. ఒకప్పుడు భూమికి ఇంత వ్యాపారవిలువ ఉండేది కాదు. అనుబంధాలన్నీ పూలతీగల్లా అల్లుకుపోయి ఉండేవి. ఇరుగుపొరుగులు, స్నేహితులు వారసత్వసంపదలా వచ్చేవారు. ఇప్పుడలా లేదు. ఎక్కడికక్కడ తుంచుకుని డబ్బుగా మార్చుకోవటమే.
ఇంకా ఏవేవో చెప్పింది. అన్యమనస్కంగా విన్నాను. పదేళ్లుగా ఒక దగ్గర కలిసి ఉంటున్నాం. ఎలాంటి సమస్యలూ లేవు. కొత్తవాళ్లతో ఎలా ఉంటుందో? అన్నిటికీమించి ప్రసూన చిన్నీని మర్చిపోవటానికి ఎన్ని రోజులు పడుతుందో?
మున్నీ పెళ్లయ్యాక యశోదావాళ్లు ఇల్లు ఖాళీ చేశారు. కొత్తింట్లో పాలుపొంగించుకున్నారు. ఆసరికే. పెళ్లి హడావిడంతా అయ్యాక సామాన్లు పంపించేశారు. ఇక వీళ్లు వెళ్లే రోజు చిన్నీ ఏడుపు అంతా ఇంతా కాదు. తను పెంచుకున్న మొక్కల్నీ జామచెట్టునీ వదిలిపెట్టి రానని ఒకటే ఏడుపు.
“కొత్తింటి దగ్గర నాకు ఫ్రెండ్సెవరుంటారు, నాన్నా? స్కూలు కూడా బోల్డు దూరం. ఎవరూ మనింటికి రారు. అక్కడ ప్రసూన ఉండదు. నేనిక్కడే ఉంటాను. నేనసలే రాను” అని ఏడుస్తున్న పిల్లని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు వాళ్ల నాన్న, రామసుబ్బారావు. తీసుకెళ్తుంటే-
సంజయ్ అన్నాడు. “పోనీ, రెండురోజులు మా ఇంట్లో ఉంచండి. అమ్మమీదికి మనసు మళ్లితే తనే వస్తుంది” అని.
“అది పెళ్లి చేసుకుని బైటి ఇంటికి పోవలసిన పిల్ల. ఇలా మమకారాలు పెంచుకుంటే ఎలా కుదురుతుంది?” అన్నాడాయన. చిన్నపిల్లకి అంతంత పెద్దవిషయాలు తెలుస్తాయా అని నాకే అనిపించింది. కానీ ఆయనకి ఎలా చెప్పగలను? వాళ్ళకి వీడ్కోలు చెప్పాను.
“ఎప్పుడేనా వస్తుండు రాధా!” అంది యశోద కళ్లనీళ్లు పెట్టుకుని. నాకూ బాధనిపించింది. తలూపాను. ఆయన కూడా చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మేం లోపలికొచ్చాము. ప్రసూన కళ్లలో దిగులు.
“బోర్ కొడుతోందమ్మా!” అంది ఇంట్లోకి రాగానే నావళ్లో తలపెట్టుకుని పడుకుని. కదిలిస్తే బావురుమనేలా ఉంది. సంజయ్ తనని తీసుకుని బైటికి వెళ్లిపోయాడు తిప్పి తీసుకు రావటానికి.
నాలుగు రోజులు గడిచాయి. చిన్నీని తీసుకుని యశోదా, భర్త వచ్చారు. పిల్ల బాగా డీలాపడింది. కొత్తింటికి వెళ్లినప్పట్నుంచీ జ్వరమట.
“కొత్త వాతావరణం. చుట్టుపక్కల పిల్లలెవరూ లేక బెంగపెట్టుకుంది రాధా! ప్రసూనతో కొద్దిసేపు ఆడుకుంటే దిగులు తీరుతుందని తీసుకొచ్చాం” అంది యశోద, తాము రావటానికి గల కారణాన్ని వివరిస్తూ. నేను నవ్వాను.
“ఈ పూటకి ఇక్కడే భోజనాలు చేసి వెళ్లండి” అన్నాడు సంజయ్.
“ఎందుకు? శ్రమ” అని రామసుబ్బారావుగారు మొహమాట పడితే, “శ్రమేం లేదు. ఆధరవులన్నీ ఉన్నాయి. అన్నం ఒక్కటి వండేస్తే చాలు!” అని మాట్లాడుతూనే బియ్యం పడేశాను. మేం నలుగురం కబుర్లలో పడ్డాం. చిన్నీ, ప్రసూనా ఒకటే ఆటలు. వాళ్ల పాత ఇంటికి వెళ్లి వచ్చారు, చెరిరెండూ జామకాయలు తెంపుకుని తిన్నారు.
“అంటీ! మేం ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకుంటాం తెలుసా?” అంది చిన్నీ మాటల మధ్యలో. ఆ అమ్మాయి కళ్లలో వయసుకి మించిన మెచ్యూరిటీ, ఆత్మవిశ్వాసం. నాకు ఆశ్చర్యం కలిగింది. వెళ్లేరోజుని అంతగా ఏడ్చింది, అక్కడికెళ్ళి బెంగతో జ్వరం పడ్డది తనేనా అనిపించింది. రాత్రిదాకా ఉండి వాళ్లు వెళ్లిపోయారు.
చిన్నీని ప్రస్తుతం చదువుతున్న స్కూల్లోంచి తీసేసి ఇంటిదగ్గరున్న మరో స్కూల్లో వేశారు. అప్పుడప్పుడు మాకూ వాళ్లకీగల కామన్ ఫ్రెండ్స్
ఇళ్లలో వేడుకలకి కలుసుకోవటం, చాలా అరుదుగా ఒకరింటికి ఒకరం వెళ్లటం… ఈ రెండింటికీ పరిమితమైపోయింది మా స్నేహం. పక్కింట్లోకి కొత్తవాళ్ళు వచ్చారు. వాళ్లమ్మాయి ప్రసూన వయసుదేగానీ ఎందుకో ఇద్దరికీ అంతగా స్నేహం కలవలేదు. జీవితం అంటే సర్దుబాటు అనే గొప్ప సిద్దాంతానికి అర్థం అంత చిన్న వయసులోనే తెలిసింది ప్రసూనకి.
ఊరి చివరన ఉన్న చిన్నీవాళ్లింట్లో రకరకాల మొక్కలు, చెట్లు. స్థలం చాలా పెద్దది. కూరలు బైట కొనక్కర్లేకుండా అన్నీ ఇంట్లోనే పండించుకుంటున్నారు. చిన్నీ తండ్రి పదిమంది మధ్యన ఉన్నప్పుడు వ్యాపారం చేస్తాడు. ఒక్కడూ ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తాడు. ఎందులోనూ నష్టపోగా చూడలేదు.
“ఇల్లు ఒకసారి అమ్మితే ఇంకోసారి కట్టుకోవచ్చు. జామచెట్టు ఒకటి కాకపోతే ఇంకొకటి నాటచ్చు. జీవితాన్ని మాత్రం పునర్నిర్మించలేం” అన్నాడు ఆయన ఒక సందర్భంలో వాళ్లింటికి వెళ్లినప్పుడు, “ఇల్లు అమ్మను- కష్టపడి కట్టుకున్నది, పొలం అమ్మను- తాతలనాటిది అనే మమకారాలు పెట్టుకుంటే ఏదీ సాధించలేం. ఆ యిల్లు అమ్మేసి చక్కటి సంబంధం తెచ్చానుగాబట్టే ఈరోజుని నా కూతురు ఎవరికీ తీసిపోకుండా అమెరికాలో ఉంది. రెండుకోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారట అక్కడ. గృహప్రవేశానికి రమ్మని మా ముగ్గురికీ రానూపోనూ టికెట్లు పంపింది” గర్వంగా చెప్పాడు. యశోదకూడా చాలా సంతోషంగా ఉంది. తాము కష్టపడి అమెరికా పంపించిన కూతురు తమని అక్కడికి రప్పించుకోవటం ఏ తల్లిదండ్రులకేనా గర్వకారణమే.
“అమెరికా వెళ్లటమే ప్రగతికి గుర్తింపా?” అసహనంగా అడిగాడు సంజయ్ ఇంటికొచ్చాక నన్ను.
“అలా ఎందుకనుకోవాలి? అత్యంత ప్రతిభావంతులందరినీ అమెరికా గుర్తిస్తోంది. కావల్సిన జీతమిచ్చి తృప్తిపరుస్తోంది. ఒక మంచిపుస్తకం కొనుక్కోవాలంటే వెయ్యిరూపాయలు. ధారాళంగా గాలీ వెలుతురూ వచ్చే విశాలమైన ఇంట్లో ఉండాలంటే మన జీతాలూ భవిష్యత్తూ తాకట్టు పెట్టినా సరిపోదు, కారు లగ్జరీ, ఏసీ లగ్జరీ” అన్నాను.
“అవేవీ లేకుండా బతకలేమా?”
“లగ్జరీ కానిదేది? అవసరానికీ లగ్జరీకీ మధ్య తేడా మనిషినీ, అతని స్థాయినీబట్టి మారుతుంది. ఉండే భూమీ, తాగే నీళ్లూ, పీల్చే గాలీ కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కావల్సినంత డబ్బు సంపాదించుకోవటంలో తప్పు లేదు. ఆ డబ్బు సంపాదించటమే జీవనపోరాటం అనుకో. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనుకో” అక్కడితో నూ సంభాషణ ఆగిపోయింది. కానీ సంజయ్ ఆలోచనలు ప్రసూనభవిష్యత్తుని బాగా ప్రభావితం చేస్తాయనేది అప్పటికి నేను గ్రహించని విషయం.
“చిన్నీ మళ్లీ మా స్కూలుకే వచ్చిందమ్మా!” సంభ్రమంగా చెప్పింది ప్రసూన. “ఐఐటీ ఇన్టెన్సివ్ కోచింగ్ బేచిలో చేరింది. హాస్టల్లో ఉంటోంది” అంది.
ఇద్దరి మధ్యా మళ్లీ స్నేహం మొదలైంది. ప్రసూనతో అప్పుడప్పుడూ చిన్నీ మాయింటికి వస్తోంది. పెరట్లో నిలబడి వాళ్ల పాత ఇంటికేసి చూసి తను ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఏడ్చిన విషయం గుర్తుతెచ్చుకుని నవ్వుతూ, “ఎప్పుడో సెలవుల్లో ఒకసారి వచ్చేందుకు ఇల్లెక్కడుంటేనేం ఆంటీ? అమ్మానాన్నల కోసం వస్తాంగానీ ఇంటికోసం కాదుగా?!” అంది.
ఆ అమ్మాయిలో కనిపించిన మెచ్యూరిటీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
” చిన్నీ వాళ్ల నాన్నని మించిన మెటీరియలిస్టు ఔతుంది” అన్నాడు సంజయ్.
ఇంటర్లో రెసిడెన్షియల్ కాలేజీకోసం విజయవాడ వెళ్లిపోయింది. ఎంత కష్టపడేనా ఐఐటీలో సీటు తెచ్చుకోవాలనేది ఆ అమ్మాయి పట్టుదల. ఒక తపస్సులా చదువు తోంది. సెలవుల్లో కూడా ఇంటికి రావడం లేదు. హాస్టల్లోనే ఉండిపోతోంది. లేకపోతే తోటిపిల్లల ఇంటికి వెళ్తోంది, కలిసి చదువుకుందుకు వీలుగా.
“అబ్బో! అంత చదువు నావల్ల కాదు. నాకా హాస్టల్సనీ సరిపడవు. లోకల్లో సీటొస్తే చాలు” అని ఎమ్‍సెట్‍తో సరిపెట్టుకున్న ప్రసూనకీ చిన్నీకి ఎంతో తేడా. ఇద్దరూ కోరుకున్నట్టే సాధించారు. చిన్నీకి ఢిల్లీ ఐఐటిలో సీటొచ్చింది. ప్రసూన లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది. ఢిల్లీ వెళ్లే ముందు చిన్నీ మరోసారి మా ఇంటికొచ్చింది.
చూస్తుండగా నాలుగేళ్లు గడిచిపోయాయి. ప్రసూన ఉద్యోగంలో చేరింది. ఎమ్మెస్‍కోసం అమెరికా వెళ్తోంది చిన్నీ. “”నువ్వూ జీఆర్‍యీ రాస్తే? స్టేట్స్‌లో ఎమ్మెస్ చేస్తే మంచి ఫ్యూచర్ వుంటుంది. కనీసం ఈ ఏడాదేనా రాయి” అంది
“ఉహు” అంది ప్రసూన. ” అక్కడ మా బంధువులెవరూ లేరు. ఎక్కడుంటాను? ఇప్పుడు నేను స్టేట్స్ వెళ్లపోతేనేం? నెలకి ఇరవైవేలొస్తే చాలదా?” ఇత్యాది ప్రశ్నలన్నీ వేసింది.
“నేను లేనా? మున్నక్క లేదా? అక్కడిదాకా వెళ్తే ఎక్కడుండాలనేది సమస్యే కాదు. నెలకి ఇరవైవేలా, అరవైవేలా అనేది పక్క పెట్టు. ఉన్నవాటిలో మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకోవటంలో తప్పులేదుగా? ఓ పదేళ్లు పోయాక మనం చదవాలనుకున్నా చదవగలమా? పరిస్థితులు అనుకూలిస్తాయా? ఇప్పుడే చదువెందుకు ఆపడం?”అంది చిన్నీ. ఆ అమ్మాయి మాటల్లో. తండ్రి ప్రభావం బాగా కనిపించింది. మరి ప్రసూన మీద? మమ్మల్ని వదిలిపెట్టి తను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నంత ప్రేమ ఉన్నందుకు సంతోషించాలా? ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం ఉన్నందుకు ఆనందించి పోరాటపటిమ లేనందుకు బాధపడాలా?.
చిన్నీ అమెరికా వెళ్లిపోయింది. వెళ్లే ముందు మా ఇంటికొచ్చింది. రిచ్చి ఎంబ్రాయిడరీ వర్కున్న క్రేప్‍సిల్కు చీర కొని పెట్టాను. చీర చూసి చాలా ముచ్చటపడింది. అప్పటికప్పుడే ప్రసూన బ్లౌజుమీద కట్టేసుకుని, “ఆశీర్వదించండి ఆంటీ!” అంటూ వంగి నా కాళ్లకి నమస్కరించింది.
చిన్నీకి ఎన్నారై సంబంధం కుదిరిందని ఎంతో సంతోషంగా చెప్పారు యశోదా, భర్తా. ఎనిమిది నెలల తర్వాత పెళ్లి. అక్కడే సింపుల్‍గా జరుపుకున్నారు. అక్కడినుంచి తిరిగొచ్చాక మా ఇంటికొచ్చారు. పెళ్లి విశేషాలవీ చెప్పారు.
“ఉన్న ఇద్దరు పిల్లల్నీ అమెరికా పంపించేశారు. ఏదేనా అవసరం వస్తే? ముందుముందు వచ్చేది ముసలితనంగానీ పడుచుతనం, పటుత్వం కావు” అన్నాడు సంజయ్ రామసుబ్బారావుగారితో.
ఆయన ఫెళ్లుమని నవ్వాడు. “నాకింకా అరవయ్యేళ్లు లేవు. అప్పుడే ముసలితనమా? సరే వస్తుంది. వస్తే? పిల్లలు మనకేం చేస్తారు? ఏం చెయ్యాలి? ఇద్దరూ ఆడపిల్లలు. వాళ్లకి పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపక తప్పదు. ఆ అత్తవారిల్లు అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా మనకొకటే. వాళ్లకి నచ్చాలి గానీ” అన్నాడు.
“ఇంకా పాతకాలం మాటలు మాట్లాడతారేమిటి అంకుల్? ఆడేంటి? మగేంటి? తల్లిదండ్రులని చూసుకోవలసిన బాధ్యత పిల్లలకి ఉండదా? వాళ్లని వంటరిగా వదిలెయ్యటం తప్పు కాదా?” చురుగ్గా అంది ప్రసూన.
“తిని తిరుగుతున్నాం. హాయిగా ఉన్నాం. ఎప్పుడో ఒక్కసారి వచ్చే చావుకోసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు మాకు మీరేం చెయ్యాలి?”
“దగ్గరుండి మీ అవసరాలు చూడక్కర్లేదా? మమ్మల్ని కని పెంచి ఇంతవాళ్లని చేసినందుకు మాకు మీపట్ల బాధ్యత ఉండక్కర్లేదా?”
“అవసరాలంటే? మీ భర్తలతో భార్యలతో మీరు దెబ్బలాడీ, మమ్మల్ని దగ్గర పెట్టుకొని వాళ్లతో పోరాడుతూ, మాకు మంచినీళ్ల దగ్గర్నుంచీ అమర్చిపెడుతూ మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వకుండా ఉండటమా, చూసుకోవటమంటే? అలాంటి బతుకులో మాకూ స్వేచ్ఛ ఉండదు. మీకూ సంతోషం ఉండదు. రెండేళ్లకోసారి ఎయిర్ టికెట్లు పంపిస్తుంది మున్నీ, వెళ్లి వాళ్లని చూసి వస్తాం. ఇక్కడికొచ్చి మా బతుకేదో బతుకుతాం. ఫోన్లుండనే ఉన్నాయి. ఈమెయిలుంది, ఛాటింగుంది. ఈమధ్య మాలాంటి తల్లిదండ్రులంతా ఒక్కోచోట అనుకుని కలుసుకుంటున్నాం. పిల్లలకీ మాకూ మధ్య ఎలాంటి గొడవలూ లేవు, అల్లుళ్లుకూడా మంచి వాళ్లు” అన్నాడాయన. “ఇవన్నీ బాగానే అడుగుతున్నావుగానీ, నీ పెళ్లై ప్పుడు తల్లీ?” వాత్సల్యంగా అడిగాడు.
అలా హఠాత్తుగా అడిగేసరికి ప్రసూన సిగ్గుపడిపోయింది.
“సంబంధాలు చూస్తున్నాం” అన్నాడు సంజయ్.
“మీ దృష్టిలో ఏవైనా ఉంటే చెప్పండి” అన్నాను నేను.
ప్రసూన పెళ్లి ఒక సమస్యగా మారింది. ఏవో ఆలోచనలున్నాయి సంజయ్‍కి ఈ విషయంలో. అవేమిటో స్పష్టంగా చెప్పడు. ఏదైనా సంబంధం మావరకూ వస్తే దానికి తనే వంకలు చెప్పేస్తున్నాడు.
“నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాతో వచ్చి వుండాలి. అమ్మావాళ్లకి నేనొక్కదాన్నే. నేను వాళ్లని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లను. ఉద్యోగంకోసమైనా పెళ్లికోసమైనా” అంది ప్రసూన. తనిలా ఆలోచిస్తోందని నాకు తెలీదు. కానీ ఆ మాటలు నాకు సంతోషాన్ని కలిగించలేదు.
రామసుబ్బారావుగారు సాలోచనగా చూశారు. “అలా ఎవరుంటారు ప్రసూనా? నాకు తెలిసి మీకీ ఇల్లూ, కొద్దిగా బేంకు బేలెన్సూమించి ఆస్తులేమీ లేవు. మన మధ్యతరగతి కుటుంబాలలో ఈపాటి ఉండటం సాధారణం. వీటికోసం ప్రలోభపడి ఇల్లరికం ఎవరొస్తారు? అంటే ఒక మెట్టు కిందకి దిగి చేసుకుంటావా?” సూటిగా అడిగారు.
“…”
“దాని వలన ఇగో క్లాషెస్, సర్దుబాటు సమస్యలు ఎన్నొస్తాయి? అదలా ఉంచితే మీ ఇల్లూ డబ్బూ చూసి వచ్చే అతను వాటికోసం నీ తల్లిదండ్రుల తదనంతరందాకా వేచి ఉంటాడా? సమస్యగా మారతాడా? సాంప్రదాయం పేరు చెప్తే ఎవరేనా మారు మాట్లాడకుండా గౌరవిస్తారుగానీ ఒప్పందం అంటే మాత్రం దాన్ని అతిక్రమించటానికే ప్రయత్నిస్తారు. అది మానవ నైజం. ఎంత చదువుకున్నా మనది పురుషాధిక్య సమాజం. అది మర్చిపోకు. మగవాడు భార్యమీద ఏదో ఒక సందర్భంలోనైనా ఆధిక్యత చూపించకుండా ఉండడు. అది ఆధిక్యతని ఎవరూ గుర్తించలేరు కూడా. బాగా ఆలోచించుకుని నిర్ణయించుకో” అన్నారు.
“అమ్మా! అంకుల్ మాటలు వింటుంటే మన ఆలోచనల్లో ఏదో తప్పున్నట్లుగా అనిపించట్లేదూ?” వాళ్లు వెళ్లిపోయాక అడిగింది ప్రసూన.
“నీ ఆలోచనలేమిటో ఇంతదాకా నాకెప్పుడూ చెప్పలేదు” అన్నాను. తనకి నాకన్నా సంజయ్ దగ్గర చనువు ఎక్కువన్న విషయాన్ని గుర్తుచేస్తూ.
“నేను పెళ్లయ్యాకకూడా మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను. నాకు కాబోయే భర్త మనింటికి రావాలని నాకోరిక. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలనుకున్నాను. కని పెంచినందుకు ఈ రుణం అలా తీర్చుకోవాలనుకున్నాను” అంది. ఎంతో అమాయకమైన మాటలని,
“పిల్లల్ని కని పెంచటమనేది ఒక సైక్లిక్ ప్రాసెస్. మేం మిమ్మల్ని కని పెంచాం. మీరూ కంటారు. పెంచుతారు. అదేదో గొప్ప విషయం అనుకోవడంలోనే ఉంది తప్పు. పునరుత్పత్తి అనేది ప్రకృతిధర్మం. పుట్టిన పిల్లల్ని సరిగా పెంచటమనేది సామాజిక బాధ్యత. ఈ కని పెంచటమనేది మన ఒక్క ఇంట్లోనే లేదు. సమాజమంతటా ఉంది. యుగయుగాలుగా ఉంది. కాబట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చెయ్యటంలో ఒక పద్ధతి నిర్దేశించబడింది. ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపిస్తున్నాం, మగపిల్లవాడికి కోడల్ని తెచ్చుకుంటున్నాం. అంటే తల్లిదండ్రుల్ని కొడుకు చూసుకుంటే అత్తమామల్ని ఆడపిల్ల చూసుకుంటుంది. అలా కాదనుకో, ఎవరు ఎవరింటికి వెళ్లాలనేదాని మీద పెద్ద యుద్ధాలే జరుగుతాయి”
“మీకు కొడుకుల్లేరు కదా? “
“అసలీ చూసుకోవటమేమిటే బాబూ? వృద్ధులు పసిపాపల్లాంటి వాళ్లనేది పూర్తిగా వెస్ట్రన్ కాన్సెప్టు. రైలుబోగీలు షంటింగ్ చేయబడ్డట్టు ఏ కుటుంబం విడిపోయి ఇంకే కుటుంబంతో కలుస్తుందో తెలీదు. వాళ్లకి పసితనంలో తల్లిదండ్రుల ప్రేమ దొరికేది అనుమానమే. పధ్నాలుగేళ్ళనుంచీ పాకెట్ మనీ సంపాదించుకోమంటారు. పెళ్లయ్యాక ఒకరితోటే జీవితాంతం కలిసి ఉంటామనేదీ, ఆ ప్రేమ శాశ్వతమనేదీ అనుమానమే. అందుకే వృద్ధాప్యంలో ప్రేమకోసం అలా తపించిపోతారు. నిజానికి పెద్దతనంలో ఉండాల్సింది వైరాగ్యం. అన్నీ అనుభవించాను, ఇంకేమీ అక్కర్లేదనిపించే పరిపక్వత… ఇంక అనారోగ్యాలంటావా? మనిషన్నాక రాకుండా ఉండవు. గుండెజబ్బుల్లాంటివి వచ్చినా మా జాగ్రత్తలో మేం ఉండాల్సినదే తప్ప రాకుండా మీరేం చెయ్యగలరు? వచ్చాక మమ్మల్ని పట్టుకుని ఎంతకాలం ఉండగలరు? అలా మీరు ఉండాలనుకున్నా ఉంచుకోవటం మాకు నచ్చదు. మాలాగే మీరూ జీవితంలో అన్నీ అనుభవించి పరిపక్వతని పొందాలని ఉంటుంది. పెళ్లి చేసుకుని నీదారిన నువ్వు వెళ్లక మా దగ్గర ఉంటానంటావేమిటి? అలా వెళ్లినంత మాత్రాన ప్రేమలుండవా?”
“పెళ్లయ్యాక మేం మీతో ఉండటం నీకిష్టం లేదా?” ప్రసూన హర్టైంది.
“మేం మూడొంతుల జీవితాన్ని గడిపిన వాళ్లం. మీరింకా మొదలు పెట్టాల్సినవాళ్లు. మీ సరదాలూ, అవసరాలూ మావాటితో ఎలా కలుస్తాయి? ఎప్పుడో వచ్చి వెళ్తుంటే ఆ సరదా వేరు” అన్నాను సర్ది చెప్తూ. “రామసుబ్బారావుగారేం కొత్తవిషయం చెప్పలేదు. సాంప్రదాయాన్ని అనుసరించి పొమ్మన్నాడు. అందరూ నడిచిన దార్లో వెళ్తే ఎంత దూరమైనా తేలిగ్గా వెళ్లగలం. చూడు, మీ నాన్నకోసం ఒకసారి నా పద్ధతులనీ అలవాట్లనీ మార్చుకుని సర్దుకుపోయాను. నువ్విప్పుడు పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇక్కడే ఉంటే మళ్లీ కొత్త ఒరవడి మొదలౌవుతుంది. అతనేమీ నీమాటా, నామాటా వింటూ కూర్చోడు. ఇదంతా నానుంచీ కాదు” మా మాటలు విని సంజయ్ కోపంగా లేచి వెళ్లిపోయాడు. ప్రసూన ఆలోచనలో పడింది.
“పెళ్లికే అంత సంఘర్షిస్తున్నావు. తర్వాతి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు” అని నేనుకూడా లేచి అక్కడ్నుంచీ వెళ్లిపోయాను.
సంజయ్ తిరిగొచ్చాక ఇంట్లో కొద్దిగా గొడవైంది ప్రసూన పెళ్లి విషయంమీద.
“మనకి అనుకూలంగా ఉండే వ్యక్తికోసం నేను వెతుకుతునే ఉన్నాను. నువ్వు దాని బుర్ర చెడగొట్టేసావు. ఆ రామసుబ్బారావు అంతా చెత్త మాట్లాడతాడు. పల్లెటూరివాడు, పల్లెటూరి కబుర్లు” అని ఆరోపించాడు రాగానే. ప్రసూన కన్ఫ్యూజనంతా అతను సృష్టించిందేనని గ్రహించాను.
“తెలివిగా వుండే వ్యక్తుల మాటలు ఎప్పుడూ వినసొంపుగా ఉంటాయి” జవాబిచ్చాను. “ఉన్న ఇద్దరాడపిల్లలకీ పెళ్లిళ్లు చేసి ఎంత నిరంధిగా, సంతోషంగా ఉన్నాడో చూడు. అక్కడ పిల్లలూ సంతోషంగానే ఉన్నారు. నువ్వుకూడా ఆలోచించు. మనకేమంత ఆస్తిపాస్తులున్నాయని అల్లుడు ఇల్లరికం వస్తాడు? అలా వచ్చేవాడు ఎలాంటివాడవుతాడో? అతనొచ్చి మన దగ్గరే ఉండటంవలన ఏం సమస్యలు ఉత్పన్నమవుతాయో? ఎందుకు జీవితంలో ప్రయోగాలు చెయ్యటం?” అన్నాను.
జవాబేమీ రాలేదు.
మరుసటిరోజు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రసూన తన క్లాస్‍మేట్ తరుణ్‍ని తీసుకొచ్చింది. దాదాపు మూడేళ్లనుంచీ పరిచయమట. పెళ్లికూడా చేసుకుందానునుకున్నారటగానీ, పెళ్లయ్యాక ఎవరింటికి ఎవరు వెళ్లాలనే విషయంమీద ఇద్దరూ దెబ్బలాడుకున్నారట. అసలలాంటి చర్చలు రానే రాకూడదు. అహాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ప్రసూనది అదే పరిస్థితి. ఇబ్బందిపడుతోంది.
“ఆంటీ! అసలు తన ప్రాబ్లం ఏమిటి? మేం పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదన రెండేళ్లక్రితం వచ్చినప్పుడు, నువ్వొచ్చి మాతో వుండటానికి అభ్యంతరమా అని అడిగింది. మా తల్లిదండ్రులకి మేం ఇద్దరం. అక్కయ్య పెళ్ళైపోయింది. నేను మావాళ్ల దగ్గరే ఉండను, మీ దగ్గరకెలా వచ్చి ఉంటాను?” అయోమయంగా అడిగాడు.
విషయాన్ని సమస్యగా మార్చుకోవటమంటే ఇదే. నేను ప్రసూనకేసి చూశాను. తను తలదించుకుంది. అతని వివరాలనీ అడిగి తెలుసుకున్నాను. చాలా మంచి సంబంధం. ప్రసూనని ఇష్టపడి వచ్చాడు. వాళ్లిద్దరికీ మాట్లాడుకునే అవకాశం వదిలి ఇద్దరికీ జూస్ ఇచ్చి అక్కడినుంచీ వచ్చేశాను.
కొద్దిసేపటికి అతను వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు ప్రసూన చెప్పలేదు. గట్టిగానే వాదించుకున్నారు. ప్రసూన తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
సంజయ్ ఆఫీసునుంచీ వచ్చాక తరుణ్‍గురించి చెప్పాను. ప్రసన్నంగా విన్నాడు. రాత్రి ప్రసూన చిన్నీతో నెట్లో ఛాట్ చేస్తుంటే నేనూ వెళ్లి కూర్చున్నాను. తన సమస్యనీ ఆలోచనలనీ చిన్నీకి చెప్పింది ప్రసూన. చిన్నీ జవాబు…
“నేను నా గురించే ఆలోచిస్తాను. నేను సంతోషంగా ఉన్నప్పుడు కదా, మరొకరికి సంతోషాన్ని పంచేది? మనమే సంతోషంకోసం తపిస్తూ ఉన్నప్పుడు మరొకరి దుఃఖాన్ని మొయ్యగలమా? ఒక సమస్య తీరితేకదా, దానితర్వాత వచ్చేదాన్ని గురించి ఆలోచించడం? తరుణ్ లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? ముందు నువ్వు పెళ్లిచేసుకుని స్థిరపడు. తర్వాత అమ్మానాన్నలకి ఆసరా ఇవ్వగలిగే స్థితిని గురించీ ఆలోచించు. అందుకు ఎన్నో మార్గాలున్నాయి “
ప్రసూన ఆలోచనలో పడింది. రాత్రంతా ఆలోచనే. మరుసటిరోజు చెప్పింది “పెళ్లికి ముహూర్తం పెట్టించండమ్మా!” అని. సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు తనని.
“చిన్నీ నాకు ఫ్రెండే కాదమ్మా, గైడ్ కూడా. ఏ ప్రశ్ననైతే నేను వేసుకోవటానికి భయపడ్డానో దాన్ని అడిగింది. జవాబే నా నిర్ణయమైనది. తరుణ్ చాలా మంచివాడు” అంది. చిన్నీ అంటే నాకుగల అభిమానం మరింత పెరిగింది. తను సంతోషంగా ఉండే అమ్మాయి. సలహాని కూడా ఆచరించగలిగేలా ఇవ్వటంలోని గొప్పతనం అర్థమైంది.
రామసుబ్బారావుగారికి ఏక్సిడెంటైంది. భార్యాభర్తలిద్దరూ బజారుకి వెళ్లొస్తుంటే జరిగింది. పెద్దదే. ఆయనకి కాలు విరిగింది. ఊళ్లోకెల్లా మంచి హాస్నిటల్లో చేర్చింది యశోద. యాక్సిడెంటు స్పాట్‍నుంచీ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చిందట. విషయం తెలిసి, నేనూ సంజయ్ వెళ్లాం.
ఆయన బెడ్లో ఉన్నాడు. కాలికి ట్రాక్షన్ వేసి ఉంది. పక్కని కుర్చీలో కూర్చుని యశోద ఏవో మాట్లాడుతోంది. ఇద్దర్లో ఎలాంటి అలజడిగానీ, కంగారు, బాధగానీ లేవు. కనీసం పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారట. అవసరమైతే ఇంకో వారంరోజులు కూడా ఉంటామని చెప్పింది యశోద.
“భోజనం?” అడిగాను. అన్నీ ఇక్కడేనట. “హాస్పిటల్ కేంటిన్ చాలా బావుంది రాధా! రూమ్ కూడా సదుపాయంగా ఉంది. నా స్నానం భోజనం అన్నీ ఇక్కడే. తనకి రొట్టెలూ కూరా కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. పాలు దొరుకుతున్నాయి. ఇంక ఊరికే అక్కడికీ ఇక్కడికి తిరిగి హైరానాపడటం దేనికి?” అంది.
“పిల్లలకి చెప్పారా? వాళ్లొస్తున్నారా?” అడిగాడు సంజయ్.
“ఫోన్ చేసి మాట్లాడాం. అవసరమైతే ఇద్దర్లో ఒకళ్లు వస్తామన్నారు. వచ్చేం చెయ్యాలి? తగ్గాక మేమే వస్తామని చెప్పాం. ఎదిగిన పిల్లలు, వాళ్ల ఉద్యోగాలూ, కుటుంబాలూ, సమస్యలూ వాళ్లకుంటాయి. అర్థం చేసుకోవాలిగానీ మన అవసరాలతో బాధపెట్టకూడదు” అన్నారు రామ
సుబ్బారావుగారు.
కొద్దిసేపు వుండి, ఏ అవసరం ఉన్నా మొహమాటపడకుండా ఫోన్ చెయ్యమని చెప్పి వచ్చేశాం.
“దిక్కూమొక్కూ లేకుండా హాస్పిటల్లో పడి ఉన్నా భేషజం ఏమాత్రం తగ్గలేదు” ఇంటికొచ్చాక నిరసనగా అన్నాడు సంజయ్. “అనారోగ్యం వచ్చినప్పుడు కూడా చూడ్డానికి దగ్గర లేకపోతే ఇంక ఈ ప్రేమలూ అభిమానాలకి అర్థమేమిటి?”
జవాబు చిన్నీ దగ్గరుంది. ఆ జవాబు ప్రాక్టికాలిటీ. “డాక్టర్లతో మాట్లాడాను. ప్రమాదం లేదన్నారు. ఏవో ఫారిన్ మెడిసిన్స్ ఉన్నాయట, అవి ఎఫర్డ్ చెయ్యగలరా అని అడిగారు. వాడమని చెప్పాను. వాటి వలన విరిగిన ఎముక తొందరగా అతుక్కుంటుందట. తగ్గగానే ఇక్కడికి పిలిపించుకుంటాను. తను ఇక్కడికొస్తే అందరం చూడగలుగుతాం” అంది ప్రసూనతో ఛాట్ చేసినప్పుడు.
“మంచి ఆలోచనే” అంది ప్రసన.
“ప్రపంచం మధ్యతరగతివాళ్ల సెంటిమెంట్స్‌కి విరుద్ధంగానే ఎప్పుడూ పోతుంది ప్రసూనా! నాన్నకి అక్కడ దెబ్బ తగిలినా ఇక్కడ నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి చూడు. అదే ప్రేమ. అదెప్పుడూ చచ్చిపోదు. వ్యక్తపరిచే తీరు మారుతుందంతే! నేను ఇండియాలోనే వుంటే అప్పుడు కూడా నాన్నకి కాలో చెయ్యో విరగటమో అనారోగ్యం రావటమో జరిగే అవకాశం ఉండేది. అప్పుడూ ఈ అధునాతన టెక్నాలజీతో నడుస్తున్న హాస్పిటల్స్ ఉండేవికానీ మనకి అందుబాటులో కాదు. ఇక ప్రపంచం విషయానికొస్తే అది మారుతూనే ఉంటుంది. దానికి మనపట్ల ఉండే కన్సర్న్ అల్లా మన సమస్యలకి పరిష్కారాలు కనిపెట్టడమే… ఎన్నో ఆవిష్కరణలు.. వాటి కోసం ఎంతో ఖర్చు. ఆ ఖర్చు భరించి ప్రభుత్వం మనకోసం అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంచగలదా? సాధ్యం కాదు. అంటే మనకేం కావాలో వాటిని మనమే సమకూర్చుకోవాలి. మన మేధస్సూ శ్రమశక్తీ మార్కెట్ చేసుకోవటం ద్వారా డబ్బు అనే మాధ్యమంద్వారా నాకు కావల్సినవి నేను సంపాదించుకుంటున్నాను. ప్రసూనా! నేనిలా కాకుండా ఇంకోలా బ్రతుకుతాను అనుకుంటే ఈ ప్రపంచం నన్నొదిలేసి ముందుకి సాగిపోతుంది. అప్పుడు కూడా నాకు కావల్సినది డబ్బే. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతీదీ కబ్జా చేయబడింది. డబ్బు చెల్లించి విడిపించుకోక తప్పదు”
“చిన్నీ బాధపడుతున్నావా?” అడిగింది.
“బాధా? బాధెందుకు? ఆత్మవిమర్శ. అంతే. నేనెప్పుడూ విన్నింగ్ సైడే ఉండటానికి ప్రయత్ని స్తాను. ఆఖరి సైనికుడిగా ఉన్నా పర్వాలేదు, విజయం తాలూకు పర్యవసానం నాదాకా రాకపోయినా పర్వాలేదు. కానీ అది మనని కాపాడుతుంది “
“ఈ అమ్మాయికి మెటీరియలిస్టు అనే పదం అస్సలు సరిపోదు. అంతకన్నా పెద్దపదం కావాలి” అన్నాడు సంజయ్ కోపంగా.
“చిన్నీ మాటలంటే మనకిద్దరికీ భయం నాన్నా! సొసైటీ తను చెప్పినదానికి భిన్నంగా లేదు. అలాగని మనం ఒప్పుకోం. అంతే” అంది ప్రసూన నవ్వి.
9/11/2006 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.