గుమ్మాడమ్మా గుమ్మాడి… అని పాడుతూ తన కాళ్లమీద గుమ్మాడి వూగుతూ పెరిగి—
చిన్ని పింక్‍కలర్ షిమ్మీ వేసుకుని గుండ్రంగా తిరుగుతూ రింగారింగా రోజెస్… అని పాడుతూ పెద్దదై-
సుస్మిత యింతదౌతుందనిగానీ తననే ఎదిరిస్తుందనిగానీ వుత్పల వూహించలేదు.
మనసుని సమాధానపరచుకోలేనివాళ్లే ఎదురు ప్రశ్నలు వేస్తారు. సుస్మితలో కాస్తంత జిజ్ఞాస యెక్కువ. ఆ వయసుపిల్లల్లో సహజంగా వుండాల్సినదానికంటే తన కూతుర్లో చాలా యెక్కువగా వుందనుకుంటుంది వుత్పల. ప్రతీ తల్లీ అనుకునేలానే తనూ అనుకుంటోందని ఆమెకి తెలీదు.
ముందురోజు వెళ్చొచ్చిన సినిమాలోని పాట సన్నగా కూనిరాగం తీస్తూ ఏదో పని చేసుకుంటోంది వుత్పల. “
“అమ్మా!”” సందిగ్ధంగా పిలిచింది సుస్మిత
“ఏంటమ్మా?” చేస్తున్న పని ఆపి అడిగింది. ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి. తను చూస్తున్న రెండు విషయాలకి పొంతన సరిగ్గా కుదరనప్పుడు కలిగేలాంటి అసహనం.
“అమ్మా!… మరి సినిమాల్లో పాటలు పాడేటప్పుడు గౌన్లు, మిడీలు, పెట్టీకోట్లు వేసుకుంటారు… నువ్వు… నువ్వలా పాడవేం?” ఆ పిల్ల వేసిన ఆ ఒక్క ప్రశ్నా పిడుగులాంటిది. ఉత్పలకి మిడిగుడ్లు పడ్డాయి. ఈ చెవినుంచీ ఆ చెవిదాకా గడ్డంనుంచీ నుదుటిదాకా ముఖం ఎర్రబడింది. ముందు గదిలో కూర్చుని పేపరు చదువుతున్న సుధీర్ కొద్దిగా పేపరు వత్తిగించి చూసాడు. కూతురి ప్రశ్నకి షాక్‍తోపాటు భార్యేం జవాబు చెప్తుందో వినాలన్న కుతూహల కూడా కలిగిందతనికి. ఇంచుమించుగా అలాంటి ప్రశ్నల్ని తన ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఎదుర్కొన్నామని చెప్పారు. ఇప్పుడు తన వంతు. వినాలి, వుత్సల ఏం చెప్తుందో!
కూతురికి సమాధానం చెప్పగలిగే శక్తి సంపాదించడానికి ఉత్సలకి చాలా సమయం పట్టింది. ఇంతలో తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. ఉత్పలకి వూహ తెలిసి ఎప్పుడూ ఆమె తల్లి ముడే చుట్టుకునేది.
“అమ్మా! అల్లా సినిమాలో జమునలా యింత పొడుగు జడేసుకుని పూలెందుకు పెట్టుకోవే?” అనడిగింది కుతూహలంగా. దానికావిడ తల్లి బోల్డు సిగ్గుపడిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకుందుకు అయోమయపు నవ్వొకటి నవ్వేసి “”పోవే, నీ ప్రశ్నలూ నువ్వూను” అంది. తండ్రి అక్కడే వున్నాడు. ఏదో పనున్నట్టు లేచి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. బామ్మ వుందక్కడ. పడీపడీ నవ్వింది తన ప్రశ్నకి. “
“మీ అమ్మకి వాలుజడ వేస్తావటే పిల్లా? నలుగురు పిల్లల తల్లయాక ఇప్పుడు వాలుజడేమిటే, మీ సినిమాలని తగలబెట్టా!”” అంది.
ఆరోజుని తల్లికూడా యింత యిబ్బందిపడుంటుందా తన ప్రశ్నకి? ఉండదనిపించింది వుత్సలకి. తను తల్లిని కాస్తంత షోకులు చేసుకోమందంతే. కానీ కూతురు తనని చాలీచాలని బట్టలేసుకుని పాటలెందుకు పాడవూ అనడుగుతోంది. పైపైని ఆలోచిస్తే సమస్య అంత జటిలమైనది కాదు. సినిమా పోకళ్లని కొట్టి పారెయ్యచ్చు. కాస్త లోతుగా ఆలోచిస్తే… తన తల్లికి పిల్లలతల్లయాక వాలుజడ వేసుకోవడం అనుచితంగా తోచింది. తనకాలం వచ్చేసరికి ముపై అయిదేళ్లొచ్చాక కూడా జడ వేసుకుని తిరుగుతోంది. చాలీచాలని బట్టలు వేసుకుని తిరగడం తనకి తప్పనిపిస్తోంది. తరువాతి తరంవాళ్లకది అలా అనిపించదేమో! ఈ పరంపర ఎంతదాకా వెళ్తుంది?
ఇంక ఆలోచించదలచుకోలేదు వుత్పల. కూతురికేదో జవాబు చెప్పాలని మాత్రం నిర్ణయించుకుంది. “”సుస్మీ!”” నాందిగా అంది. అవతలి గదిలో వున్న సుధీర్ చెవులు అప్పజెప్పాడు.
“మనం ఎన్నోసార్లు పార్కుకెళ్లాం. అక్కడెవరేనా పాటలు పాడుకుంటూ గెంతుతూ కనిపించారా? అవి సినిమాలు. సినిమాల్లో వాళ్ళు అలా వుంటేనే అందరూ చూస్తారు. ఎక్కువమంది సినిమాలు చూస్తే అవి తీసినవాళ్ళకి బోల్డు డబ్బులొస్తాయి. మనం అలావుంటే అంతా నవ్వుతారు” అంది. సుస్మితకి అర్థమైందో లేదో మరి, యింక తర్కించలేదు. తల్లి ముక్తసరిగా జవాబివ్వడంతో ఆమెకి ఆ టాపిక్ యిష్టం లేదని గ్రహించి వూరుకుంది.
ఆ సంభాషణైతే అక్కడికి ఆగిపోయిందిగానీ వుత్పలకి కూతురిమీద మరికాస్త శ్రద్ధ పెరిగింది. ఏ పనిచేసినా దాన్ని కూతురు ఏవిధంగా తీసుకుంటుందా అనే కోణంలోంచి చూసి చెయ్యడం అలవాటైంది. టీవీలో వచ్చే పాటల దగ్గర్నుంచి తను సుధీర్‍తో మాట్లాడ్డందాకా ప్రతిదానికీ జాగ్రత్తపడటం, కూతురి స్పందనకోసం చూడ్డం తెలీకుండానే అలవాటై పోయింది వుత్పలకి. ఇదే విషయాన్ని ఒక డాక్టర్ ఫ్రెండుతో అంటే ఆమె నవ్వి, “”ఒక్కరే పిల్లలున్నవాళ్ళంతా ఇంతే ఉత్పలా! నీలానే ఆలోచిస్తారు. తోడు మరోపిల్లలు లేక వాళ్ళుకూడా తల్లిదండ్రులనే గమనిస్తారు. మగపిల్లలైతే నాన్ననీ, ఆడపిల్లలైతే అమ్మనీ అనుకరిస్తూ వుంటారు. వాళ్లలా చేసేసరికి వింతగా అనిపించి మీరు భయపడతారు”” అని కొట్టి పారేసింది.
నిజమే! సుస్మిత తర్వాత మరోపాపో బాబో వుంటే బాగుణ్ణని సుధీర్‍కీ వుత్సలకీ ఎంతగానో అనిపించింది. ఎందుకో అవలేదు. వాళ్ల ఆందోళన చూసి డాక్టరు కోప్పడింది. “”అసలు పిల్లల్లేనివాళ్ల గురించి ఆలోచించు ఉత్పలా! పిల్లలకోసం వాళ్లుపడే ఆరాటం, తపన చూస్తే నీకే అనిపిస్తుంది నీ సమస్య ఎంత చిన్నదో! ఎందుకో మళ్ళీ పుట్టలేదు. ఉన్నపిల్లని చక్కగా పెంచుకోండి”” అంది.
ఔను! అంతకన్నా ఏం చెయ్యగలరు? శాస్త్రీయపద్ధతులకి వెళ్ళే స్తోమత తమకి లేదు. ఉత్పల మనసు సరిపెట్టుకుంది. కూతురే కేంద్రబిందువుగా బతికేస్తోంది.
సుస్మితకి పదమూడో ఏడు వచ్చింది. అంటే టీనేజిలోకి అడుగుపెట్టిందన్నమాట. పిల్లకి వులుకూ కులుకూ ఎక్కువయ్యాయి. పువ్వు చుట్టూ తిరిగే భ్రమరంలా అద్దం చుట్టూనే తిరుగుతూ వుంటుంది. పోయి గంటల తరబడి డెస్సింగ్‍టేబుల్ ముందు నిల్చుంటుంది. జుత్తు అటు పీక్కుంటుంది, యిటు పీక్కుంటుంది. అందులోని అందం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. ఉత్పల చూస్తే కేకలేస్తుంది “అస్తమానూ అద్దం దగ్గిరేం చేస్తున్నావే?”” అని.
“అమ్మా! నువ్వు తెల్లగా వుంటావు. నేనెందుకే యింత నలుపు?” వుత్పల బొట్టుపెట్టుకుంటే పక్కనొచ్చి అద్దంలోకి చూస్తూ అడిగింది. ఇద్దరికీ వున్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్పల గుటక మింగింది. చిన్నప్పట్నుంచీ సుస్మితకి తను నలుపనే కాంప్లెక్స్ ఎక్కువ. ఆ పిల్ల బుర్రలోకి ఎలా వచ్చిందో తెలీదు. ఇద్దరి చేతులూ పక్కపక్కని పెట్టి చూసుకునేది. పని చేసుకుంటూ చీరకుచ్చెళ్లు పైకి దోపుకుంటే తల్లి కాళ్లకేసి విస్మయంగా చూసేది“చిన్నప్పుడు.
“కొందరు పిల్లలు చిన్నప్పుడు నల్లగా వుంటారు. పెద్దయి చీరలు కట్టుకుంటే తెల్లబడతారు” అని సర్దిచెప్పేది వుత్పల. ఆ పిల్ల నమ్మేది. ఇప్పుడలా కాదు. ఏదో అర్థమైనట్టు వుంటోంది.
“తెలుపు నలుపుల్లో అందం వుండదు సుస్మీ! మనం మంచిగా వుంటామనుకో మన మనసు అందంగా వుంటుంది. అటువంటి అందమే మన మొహాల్లో కనిపిస్తుంది. అందుకే చూడు, కొందరు ఎంత తెల్లగా వున్నా బావుండరు. విమలాంటీవాళ్ల స్వీటీని చూడు, నల్లపిల్ల. ఐనా ముద్దొచ్చి అందరం ఎత్తుకుంటాం”” వుత్పల నచ్చజెప్పింది.
“అమ్మా! పెద్దయ్యాక నాకు నల్లపిల్లలే పుడతారా?” ఠపీమని అడిగింది సుస్మిత.
ఉత్పల మ్రాన్పడిపోయింది. తను నలుపన్న భావన ఆ పిల్ల మనసులో ఎంత లోతుగా నాటుకుపోయిందో అర్థమైంది. చెప్పుడూ సుస్మీ రంగుని కామెంట్ చెయ్యలేదు. తను తెల్లని తెలుపు. భర్త నలుపు. పెళ్లయిన క్రొత్తలో అనిపించేది అతను బాగా నలుపని. కానీ యిప్పుడది అలావాటైపోయింది. పిల్లలకి తన రంగు రాకపోయినా పర్వాలేదు, చామనచాయలో వుంటే చాలనుకుంది. సుస్మీకి బామ్మ పోలిక వచ్చింది. బాగా నలుపు. ఐనా కళగల మొహం. బ్లాక్ బ్యూటీ. మరెందుకు దానికీ బాధ? స్కూల్లో ఎవరేనా ఏడిపిస్తున్నారా? అప్పటికి సుస్మితకి ఏదో జవాబు చెప్పి స్కూలుకి పంపించింది. తనూ పనంతా ముగించుకుని స్కూలుకెళ్లి ప్రిన్సిపాల్‍ని కలిపింది. ఆవిడ చాలా సరళ హృదయురాలు.
“మా సుస్మీని స్కూల్లో ఎవరేవా ఏమైనా అంటున్నారా మేడమ్? తమ నలుపని ఒకటే బాధపడుతోంది” అని వుత్పల అనగానే-
“నేను తెలుసుకుంటాను ” అని వెంటనే చెప్పింది. ఆవిడ దృష్టి కైతే తీసికెళ్లిందిగానీ ఒక విద్యార్థికోసం అలాంటి విషయం మీద అంత పట్టించుకుంటుందని వుత్పల వూహించలేదు.
స్కూల్‍డేనాడు ‘మిస్టర్ క్లీన్’ నాటకం వేయించింది పిల్లలచేత. అందులో ముగ్గురు పిల్లలుంటారు. ఇద్దరు ఆడ, ఒక మగ. ఒక పిల్ల చాలా అందమైనది. దాంతో అహంభావం చాలా ఎక్కువ. మరోపిల్ల చాలా డబ్బుగలది. కానీ ఏబ్రాసి పిల్ల. మూడో పాత్ర మగపిల్లవాడిది. అందవికారంగా వుండే పిల్లవాడి పాత్ర. అతడి పేరు మిస్టర్ క్లీన్. పేరుకి తగ్గట్టు చాలా పరిశుభ్రతని పాటిస్తాడు. ముగ్గురూ క్రిస్మస్ ట్రీని అలంకరించుకుని శాంటా ఆగమనంకోసం ఎదురుచూస్తుంటారు. క్రిస్మస్ తాత అపరిశుభ్రంగా వుండే పిల్ల దగ్గరకిగానీ ఆర్భాటంగా క్రిస్మస్ ట్రీని అలంకరించిన మొదటిపిల్ల దగ్గరకిగానీ వెళ్లడు. మిస్టర్ క్లీన్‍కి మాత్రం అద్భుతమైన బహుమతినిచ్చి వెళ్లిపోతాడు.
పదిహేను నిమిషాల ఈ నాటికని అందరూ వూపిరి బిగబట్టి చూసారు. అందులోని అందమైన పిల్ల పాత్ర సుస్మిత వేసింది. చక్కటి గౌను, లైట్ల ఎఫెక్టులో ఆ పిల్ల నిజంగా అందంగా వుంది. అద్భుతంగా వుంది. ఉత్పల మనసు ప్రిన్సిపాల్‍పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు థేంక్స్ చెప్పి వచ్చింది.
“ఉత్తుత్తి థాంక్స్ కాదు. దీంతో మీ పాపలో మార్పు రావాలి” నిండుగా నవ్వుతు అందావిడ.
నాటిక తర్వాత సుస్మితలో చాలా మార్పొచ్చింది. మార్పంటే సమూలంగా ఎప్పుడూ ఎక్కడా వుండదు. కొద్దిగా ఏదో ఒక కోణంలో వుంటుంది. మిగతా విషయాలు అలాగే వుంటాయి. అలాంటిది, సుస్మితలో వచ్చిన మార్పు. మిస్టర్ క్లీన్‍లా వుండడం అలవాటు చేసుకుంది. ఉత్పల తేలిగ్గా వూపిరి పీల్చుకుంది.
సుధీర్ వారంరోజులనుంచీ డెప్యుటేషన్‍లో వున్నాడు. ఆవేళే వూర్నించీ వచ్చాడు. రాగానే చాలా పనుందని ఆఫీసుకి హడావిడిగా వెళ్ళిపోయాడు. అంత పని వుందన్నవాడు మధ్యాహ్నం అయేసరికల్లా కంగారుపడుతూ యింటికొచ్చాడు. రాగానే భార్యని అడిగాడు, “సుస్మీ ఏది?”
“ఈవేళప్పుడు అది యింట్లో ఎందుకుంటుంది?” వుత్పల ఎదురు ప్రశ్నించింది.
“ఈ వారంరోజులూ నువ్వు దాన్ని స్కూలుకి పంపించలేదా? ఏం? ఎందుకని? కనీసం లీవేనా అప్లయి చెయ్యలేదా? ఈవేళ స్కూల్నించీ ఫోనొచ్చింది. వంట్లో బాగుండటం లేదా, వారంరోజుల్నించీ మీ సుస్మిత స్కూలుకి రావడం లేదని వాళ్లడిగేసరికి నేను తెల్లమొహం వేసాను” అన్నాడు.
ఉత్పల నిశ్చేష్టురాలైపోయింది. కనీసం భర్తకి జవాబివ్వాలనికూడా తోచలేదు. సుస్మీ – వారంరోజుల్నించీ స్కూలుకి వెళ్లడం లేదా? యూనిఫాం వేసుకుని, స్కూల్‍బేగ్, టిఫిన్ బాక్సు పట్టుకుని బై చెప్పి ఎక్కడికెళ్తోంది? ఏమైంది దీనికి? ఎందుకిలా చేస్తోంది? ఆమె కళ్లల్లోంచీ ధారాపాతంగా కన్నీళ్లు కారిపోయాయి. ఏదో జరిగిందని సుదీర్‍కి అర్థమైంది.
“ఏమైంది వుత్పలా? ఏమైందో చెప్పు” భుజాలు పట్టి కుదిపేస్తూ ఆందోళనగా అడిగాడు.
తనని తను కూడదీసుకుని చెప్పింది. “స్కూలుకని చెప్పి ఇది ఎక్కడికెళ్తోందో ఎందుకిలా చేస్తోందో తెలీడం లేదు. రానీండి కనుక్కుంటాను”
ఆమె కూతుర్నెంత గారంగా చూస్తుందో అంత కఠినంగానూ వుండగలదు. సుధీర్‍కది చాతకాదు. సుస్మితని వెంట తిప్పుకోవడం, అడిగినవల్లా కొనివ్వడం తప్ప గట్టిగా కసురుకోవడం కూడా రాదు. ఎప్పుడేనా ఆపిల్ల తనదగ్గర చేరి అల్లరి చేస్తుంటే “ఉత్పలా! ఇది నన్ను విసిగిస్తోంది, చూడు”” అని భార్యకి కంప్లయింట్ చేస్తాడు. అలాగని భార్య కూతుర్నో దెబ్బవేసినా నాలుగు కేకలేసినా భరించలేదు.
ఇప్పుడు భార్య కూతుర్ని బాగా దండిస్తుంది. ఆ సంగతి అతను వూహించగలడు. చూసి తను తట్టుకోలేడు. అదీగాక సుస్మీ తననో ఫ్రెండులా భావిస్తుంది. తల్లి కొట్టినపుడు తను అడ్డం పడాలనుకుంటుంది. ఇదివరకు ఎన్నోసార్లు అలా జరిగింది కూడా. ఇప్పుడు తనలా సుస్మీని వెనకేసుకు రావడం కుదరనిది. అలాగని తనుండి చూస్తూ వూరుకుంటే ఆ పిల్ల హర్టవుతుంది. అందుకే తల్లీకూతుళ్లకి సమస్య వదిలేసి బైటికెళ్లిపోయాడు సుధీర్. అతనికి తెలిసిన పరిష్కారం అదొక్కటే.
ఎప్పట్లానే స్కూలునుంచి వచ్చినట్టు యింటికొచ్చింది సుస్మిత. అప్పటిదాకా ఏం చెయ్యాలో తోచని బాధతో ఏడుస్తూ కూర్చుంది వుత్పల. కూతుర్ని చూసాక ఆమెలో ఆవేశం తప్ప మరేమీ లేదు. “ఆగక్కడే”!” అరిచింది.
తను చేస్తున్న పని తల్లికి తెలిసిందని సుస్మితకి అర్థమైంది. ఆమెకేసి ఒకసారి చూసి తలొంచుకుని నిల్చుంది. ఆ నిల్చోవడంలోనూ తప్పు చేసిన భావన లేదు. నిరసన వుంది. అంతే. తను చేస్తున్నది తప్పని ఆ పిల్లకి తెలిస్తేకద!
“వారంరోజుల్నించీ స్కూలుకెళ్ళటం లేదట. ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకేం తక్కువ చేసామనే మమ్మల్నిలా ఏడిపిస్తున్నావు? ఎక్కడ తిరిగావు? ఈ బుద్ధులన్నీ నీకు పుట్టినవేనా, ఎవర్నేనా చూసి నేర్చుకుంటున్నావా? చెప్పు, ఎవరు నిన్నిలా చెయ్యమన్నది? చెప్పవే, చెప్పు” రెండు భుజాలూ పట్టి వూపేస్తూ అడిగింది వుత్పల. ఆమె మనసులో రకరకాల అనుమానాలు. ఈ పిల్ల చెడుసావాసాలు పట్టిందా? కథల్లోనూ సినిమాల్లోనూ చూపించేట్టు ఏ డ్రగ్స్‌కేనా అలవాటుపడుతోందా? బాయ్‌ఫ్రెండ్స్‌ని వెతుక్కుందా? ఇది తమ పెంపకం లోపమా? కొన్ని లక్షల అనుమానాలూ, ఒక నిస్సహాయత… వాటిల్లోంచీ పుట్టుకొచ్చిన కోపం.
తల్లికి అంత కోపం వస్తుందని అనుకోలేదు సుస్మిత. అలాంటి కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. ఐనా భయపడలేదు. మొందిగా నిలబడింది. ఉత్పలకి వళ్ళూ పెయ్యీ తెలీలేదు. కన్నూముక్కూ కానకుండా ఎడాపెడా వాయించేసింది. మౌనంగా దెబ్బలకి వళ్ళు అప్పగించేసింది సుస్మిత. కొట్టీకొట్టీ అలసిపోయింది వుత్పల. ఆఖరికి విసిగిపోయి “నిన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించేస్తాను. అక్కడే వుందువుగాని. నీకు స్కూలు, చదువు ఏమీ అక్కర్లేదు” ఆవేశంతో రొప్పుతూ అంది.
అప్పుడు యిప్పింది సుస్మిత నోరు. “”నాకు నీ దగ్గరకన్నా అమ్మమ్మ దగ్గిరే బాగుంటుంది. నన్నెందుకు కొట్టావసలు? నాకు వీసీపీ కావాలని ఎన్నిసార్లు చెప్పాను? రమ్యావాళ్లూ కొనుక్కున్నారు. ఎంత బాగుందో. రోజూ మూడు కేసెట్స్ వేస్తున్నారు. చూసినవే చూస్తున్నారు. నేను వాళ్లింటికే వెళ్తున్నాను” అంది పెద్దగా.
ఉత్పల స్థాణువైపోయింది. ఏమిటి ఈ పిల్ల మనస్తత్వం? ప్రవృత్తి? ఇదసలు తన కడుపుని పుట్టిన కూతురేనా? టీవీ తనే సంతోషంగా కొంది. వీసీపీ కొనడం తనకిగానీ భర్తకిగానీ యిష్టంలేదు. కూతురు తన అభిరుచుల మేరకి పెరగాలా? లేక కూతురు కొత్తగా ఏర్పరచుకుంటున్న యిష్టాలమేరకి తాము మారాలా? ఏది సబబో కాదో ఆ పిల్లకి చెప్పే హక్కు తమకి లేదా?
నిజమే. వీసీపీ కొనమని ఎన్నోసార్లడిగింది. అడిగినపుడల్లా వద్దని తను నచ్చజెప్తూనే వుంది. ఐనా వీసీపీ అంటే మాటలా? పైగా దానికోసం కేసెట్ల అద్దె? ఈవేళ వీసీపీ అంది, రేపు మరొకటి. ఇలా అడిగినవన్నీ కొంటూ వెళ్లేంత స్తోమతు తమకేది? ఐనా, వద్దని చెప్పినా ఎందుకీ పిచ్చి? ఎక్కణ్ణుంచీ వచ్చిందో ఇంత మొండితనం? పైగా తన దగ్గిరకన్నా అమ్మమగారింట్లో బావుంటుందట. ఎందుకని? తమ్ముడు వీసీపీ కొన్నాడు కనుకనా? అంటే అమ్మకన్నా దీనికి వీపీపీ ఎక్కువైందా? ఇక్కడ వుత్పన్నమైనది తల్లి ప్రేమతో చెప్పే హితవుకన్నా పై ఆకర్షణలు ఎక్కువయ్యాయా అన్న మౌలికమైన ప్రశ్న. అలాంటి ప్రశ్న పుట్టిందంటే తనకీ సుస్మీకీ మధ్యని తేడా ఏర్పడినట్టేగద ! ఎలా చెప్తే అర్ధమౌతుందీ పిల్లకి? ఎలా బోధపర్చాలి రమ్యావాళ్లకీ తమకీ వున్న స్థాయీ బేధం?
కూతుర్నలాగే వదిలేసి నిశ్శబ్దంగా అక్క ణ్ణుంచి వెళ్లిపోయింది వుత్పల. సుస్మిత తల్లి వెనకాల వెళ్లలేదు. మూతి ముడుచుకుని అక్కడే సోఫాలో పడుకుంది. తండ్రి వచ్చేసరికి అలాగే నిద్రలోకి జారుకుంది.
సుధీర్ యింటికొచ్చేసరికి కాస్త చీకటిపడింది. చీకట్లో సోఫాలో ముణగదీసుకుని పడుకున్న సుస్మితని చూడగానే అతని మనసు ఆర్ద్రమైంది. సమయానికి తను యింట్లో లేకుండా వెళ్లిపోవడం ఆ పిల్లపట్ల అమానుషమైనదిగా అనిపించింది. కూతురి పక్కని కూర్చుని “సుస్మీ!” అని మృదువుగా పిలిచాడు. దుఃఖంతో అతని గొంతు రుద్ధమైంది.
తండ్రి పిలుపుకి సుస్మిత కళ్ళు తెరిచి చూసింది. మళ్లీ నిద్రలోకి జారుకుంటూ సగం జాగృతీ సగం నిద్రాగా వున్న స్థితిలో నిలదీస్తున్నట్టు అడిగింది. “వీసీపీ అడిగానా? మమ్మీ కొనలేదు. రమ్యావాళ్లింట్లో చూసానని కొట్టింది. ఎందుకు కొట్టాలి చెప్పు?”
సుధీర్‍కి ఒక సగం అర్ధమైంది. మిగిలిన సగం అర్ధం కాలేదు. మృదువుగా కూతురి తల నిమిరి భార్య దగ్గిరకెళ్ళాడు. ఇద్దరూ ఒకలానే అనిపిస్తారతనికి ఒక్కొక్కసారి.
“లైట్లేనా వెయ్యకుండా చీకట్లో ఏంటిది?” లైటు వేస్తూ మందలింపుగా అడిగాడు.
ఏడ్చిఏడ్చి వుత్పల ముఖం ఎర్రగా వుబ్బింది. కళ్లు మంకెనపూల్లా అయ్యాయి. “సుస్మీ ఏం చేస్తోంది? పడుకుందా?” ఆమె గొంతు భారంగా వుంది.
“పడుకుంది, ఏం జరిగిందసలు?”
ఉత్పల క్లుప్తంగా చెప్పింది. “
“బాగా కొట్టావా?”” అడగలేక అడిగాడు.
ఆమె ఏడ్చేసింది. ” ఏం చెయ్యమంటారో చెప్పండి. ఇంతకు ముందు చాలాసార్లడిగింది వీసీపీ కొనమని. నచ్చజెప్పాను, పెద్దయ్యాక కొంటానని. బాగా చదువుకుని వుద్యోగం చేస్తే తనే కొనుక్కోవచ్చనీ చెప్పాను. విన్నట్టే వింది. ఎలాంటి పనిచేసిందో చూడండి. ఎవరింట్లోనో కొనుక్కుంటే యిది కన్నతల్లిని నన్ను… నన్ను మోసం చేసి వెళ్తుందా? ఒకరోజు కాదు, రెండురోజులు కాదు, ఏడురోజులపాటు! ఏం? ఏం తక్కువ చేసామని దానికి? వీసీపీ కొననంతమాత్రాన నేను దానికి అమ్మని కాకుండా పోయానా? మనింట్లోకంటే మా అమ్మావాళ్లింట్లోనే బావుంటుందట!” వెక్కిళ్ల మధ్యని అంది.
“ఏమిటిది వుత్పలా? చిన్నపిల్ల. దానికేం తెలుసు? దానికా వీసీపీ మీద మోజుగా వున్నట్టుంది. రేపు లోన్ తీసుకుంటాను. కొందాం” భార్య భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకుంటూ అన్నాడు.
“చాల్లెండి. మీకు మతిలేకపోతే నాకన్నా వుండాలి. తాహతుకి మించిన కోర్కెలు మనిషిని చెడగొడతాయి. ఈ రోజు యిదైంది. రేపింకొకటి. ఐనా వీసీపీ అంటే మాటలా? అదొక్కటీ కొనేస్తే ఐపోతుందా? గట్టిగా కట్టడి చేస్తే అదే దార్లో పడుతుంది”” అంది వుత్పల.
ఆమె బెంగ ఆమెది. తమది మధ్యతరగతి కుటుంబం. బాధ్యతల్లేవు , ఒక్కర్తే సంతానంగాబట్టి నిలదొక్కుకోగలిగారు. చూడబోతే ఆడపిల్ల, రూపసి కాదు. చదువులోనూ అంతే! బొటాబొటిగా చదువుతుంది. ఇలాంటి పిల్లకి పెళ్లి చెయ్యడామంటే మాటలు కాదు. సరదాలకీ విలాసాలకీ మధ్యని గీతగీస్తూ వెళ్లకపోతే కుదరదు. ఐనా పన్నెండేళ్ల పిల్లకి తమ తాహతేంటో తెలీకపోతే ఎలా? దానికి స్వంతంగా తెలీదు. కనీసం తను చెప్పినప్పుడేనా అర్ధం చేసుకోవాలి గద! నయాన్న బుజ్జగించి చెప్పింది. వినలేదు. తిట్టోకొట్టో దార్లో పెట్టుకోవల్సిన బాధ్యత తనది కాదా? ఇది నాణానికి ఒకవైపు.
నాణానికి రెండోవైపు అద్దం పట్టినట్లు౦ది సుస్మిత మనసు. తను కొనమన్నవి కొనకపోగా తల్లి తననెందుకు కొట్టాలి? అనేది ఆమె ప్రశ్న.
రాత్రి ఎవరికీ తిళ్ళు లేవు. సుధీర్ గదిలో పడుకున్నాడు. ఉత్పల మనసాప్పక కూతురి సోఫా పక్కవి చాప పరుచుకుని పడుకుంది. అన్ని దెబ్బలు తిని వళ్లుతెలీకుండా పడి నిద్రపోతున్న కూతుర్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. లేపి యిన్ని పాలు పడదామని వంటింట్లోకి వెళ్లి వెచ్చచేసుకుని వచ్చింది. ఎంత లేపినా సుస్మిత లేవలేదు. నిద్రచేతో అలకచేతో మరి! అదిగో, ఆ మొండిపంతమే వుత్సలకి నచ్చనిది. గ్లాసు అక్కడే టీపాయిమీద పెట్టి మూత వుంచి చాపమీద వరిగింది. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
తెల్లవారి పిల్లి పాలగ్లాసు తోసేస్తే ఆ శబ్దానికి మెలకువ వచ్చింది వుత్పలకి. పక్కకి తిరిగి చూస్తే పోఫాలో సుస్మిత లేదు.
“సుస్మీ!”” అని రాబోయిన పిలుపు ఆమె గొంతులోనే ఆగిపోయింది. ఖాళీగా వున్న సోఫాలో రెపరెపలాడుతూ చిన్నకాగితం. అందులో తండ్రిని వుద్దేశించి సుస్మిత రాసిన రెండే రెండు వాక్యాలు— మమ్మీకి నేనంటే యిష్టం లేదు. అందుకే యింట్లోంచి వెళిపోతున్నాను.
ఆ కాగితమ్ముక్క పట్టుకుని భర్త దగ్గిరకి పరిగెత్తింది.
“సుస్మీ… సుస్మీ…”” అంటూ అతన్ని సుడిగాలిలా వాటేసుకుని బావురుమంది. జరిగినదేమిటో అర్ధమై అతనికి మతిపోయిం ది. లుంగీమీద షర్టు తగిలించుకుని స్కూటరు తీసుకుని వూరిమీద పడ్డాడు. సుస్మిత ఫ్రెండ్సిళ్లకీ తెలిసినవాళ్లందరిళ్లకీ వెళ్లాడు. కూతురు యింట్లోనే ఏమూలో దాక్కుని తమని ఏడిపిస్తోందేమోనన్న ఆశతో వుత్పల యింట్లోనూ డాబామీదా మూలమూలలా వెతికింది. నిన్న వున్న కోపం, రాత్రి పశ్చాత్తాపం తగ్గాక కలిగిన బింకం యిప్పుడు లేవామెలో. వాటిస్థానే గుండెల్ని కోసేసే బాధ. ఎంత మూర్ఖంగా కొట్టింది దాన్ని? నెమ్మదిగా నచ్చజెప్పాల్సింది. ఎవరిచ్చారు తనకలా కొట్టే అధికారం? దాని కోరిక తీర్చలేనపుడు కొట్టే అధికారం మాత్రం తనకెక్కడిది? ఎక్కడికెళ్లిందో, ఏం చేస్తోందో ఏడుస్తూ కూర్చుంది.
మధ్యాహ్నానికి తిరిగొచ్చాడు సుధీర్. ఆతృతగా అతని మొహంలోకి చూడబోయేంతలో అతని నిరాశ ఆమెని కమ్మేసింది.
“అంతటా వెతికాను. ఎక్కడా లేదు. రైల్వేస్టేషన్లోనూ బస్టాండులోనూ కూడా చూసాను. మీ అన్నయ్యకీ, తమ్ముడికీ ఎస్టీడీ చేసాను. అక్కడికి రాలేదట. నిన్న యింక్రిమెంట్ ఎరియర్స్ వెయ్యి వస్తే జేబులో పెట్టాను. తియ్యలేదు. అవి కూడా లేవు. పోలీస్ కంప్లయింటు ఇద్దాం. దాని ఫోటో కావాలి…” అతని మాటలు వినిపించడం మానేసాయి వుత్పలకి. మెదడు మొద్దుబారిపోయింది. కళ్లముందు చీకట్లు! “
“ఉత్పలా! వుత్పలా!”” భర్త కంఠం ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్నట్లు వుంది. ఆ తర్వాత అది కూడా వినిపించడం మానేసింది.
సుస్మిత యింట్లోంచి బైటపడి నాలుగ్గం టలైంది. మొదట ఆమె రైల్వేస్టేషను కెళ్లింది. హైద్రాబాదు వెళ్లాలనుకుంది. అలా ఎందుకనిపించిందో ఆమెతే తెలీదు. టిక్కెట్టు కొనుక్కోవాలని తెలుసు. కౌంటరు ఎక్కడుందో తెలీదు. జేబులోంచి వంద రూపాయల నోటు తీసి చేత్తో పట్టుకుని అటూయిటూ తిరిగింది.
“హైద్రాబాద్ వెళ్లడానికి టిక్కెట్టు ఎక్కడ కొనుక్కోవాలి?” ఎవర్నో ఇంగ్లీషులో అడిగింది.
ఆ వ్యక్తి సుస్మితని ఎగాదిగా చూసి “హైద్రాబాదుకా? ఇలా యివ్వు తెచ్చి పెడతా” అని నోటు తీసుకుని జనంలో కలిసిపోయాడు. అతను తిరిగొస్తాడని ఎంతో సేపు ఎదురు చూసింది ఆ పిల్ల. ఎంతకీ రాకపోయేసరికి అతనికోసం స్టేషనంతా కలయతిరిగింది. చూస్తుండగానే మూడు ట్రెయిన్స్ వెళ్లిపోయాయి. అతనికం రాడని అర్ధమైంది. చిన్న కుదుపు!
ఈసారి తిప్పలుపడి మరో వందనోటు మార్చుకుని తనే టిక్కెట్టు కొనుక్కుని తెచ్చుకుంది. మళ్లీ ఏదో ట్రెయినొచ్చింది. ఎక్కి కూర్చుంది. ఆ పిల్ల ఒక్కర్తే ప్రయాణం చేస్తుండడం అందులోనూ స్కూల్ యూనిఫాంలో వుండడం చూసి చాలామంది కుతూహలంగా వివరాలడిగారు.
రైలు కదలబోతుంటే మేగజైన్స్ బండి వచ్చింది. చందమామ కొనుక్కుందామనుకుంది సుస్మిత. పుస్తకం తీసి పట్టుకుం ది. రెండోచేత్తో డబ్బులకోసం జేబులో చెయ్యి పెట్టింది. వందనోటు వచ్చింది. అది ఇవ్వకూడదనీ, యిందాకా మార్చిన చిల్లరలోంచి యివ్వచ్చనీ ఆమెకి తట్టలేదు. బండివాడు వందనోటు అందుకుని కావాలనే చిల్లర యివ్వకుండా జాప్యం చేసాడు.
ఒక క్షణం…
రెండు క్షణాలు…
ఒక నిముషం…
రెండు నిముషాలు…
“ఏయ్, నా ఛేంజి” అని సుస్మిత గోల పెడుతూనే వుంది. రైలు కదిలింది. పుస్తకాల బండివాడు ఆ పిల్లని హేళనగా చూస్తూ నవ్వాడు. కళ్లనీళ్లపర్యంతమైందామెకి. చుట్టూ వున్నవాళ్ళు ఈ విషయాన్ని కాసేపు గొడవగొడవగా చెప్పుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారు. ఇది రెండో కుదుపు.
ప్రపంచంలో యింతమంది మనుషులున్నా ఒకరికొకరు ఏమీకారనీ, తను ఆంటీ అని పిల్చిన ఎదుటి సీటులోని స్త్రీగానీ అంకుల్ అని పిల్చిన పక్కసీటతనుగానీ తనకేమీ చెయ్యరని గ్రహించింది. అందర్తో మాట్లాడ్డం తగ్గించింది.
రైలు సికింద్రాబాద్ చేరేసరికి నాలుగున్నరైంది. దార్లో ట్రాక్ రిపేరు, క్రాసింగ్స్ చేత బాగా ఆలస్యమైంది. సుస్మితకి రైల్లో ఆకలేసి నప్పుడల్లా ఏవో ఒకటి కొనుక్కుని తింది. వుత్పల అలా ఎప్పుడూ కొనుక్కుని తిననిచ్చేది కాదు. ఎప్పుడేనా దూరప్రయాణం చేస్తే యింట్లోనే ఏవో ఒకటి తయారు చేసి పట్టుకెళ్లేది. సుస్మితకి యిప్పుడు ప్రతిదాంట్లోనూ తల్లిని జయించినట్టు అనిపిస్తోంది.
సికింద్రాబాద్‍లో చాలామంది దిగుతుంటే తనుకూడా దిగింది. ముందురోజు వేసుకున్న బట్టలేమో, చీదరగా వుంది. బాగా మాసిపోయాయి. జుత్తు రేగిపోయింది. మొహంకూడా అలపటకి వడిలింది. అలాంటి రూపంతో ఆ పిల్ల ప్లాట్‍ఫామ్‍మీద నడుస్తుంటే యిద్దరు ముగ్గురు ముష్టిపిల్లలు వెంటపడ్డారు “”నీ పేరేందే పోరీ!” అని.”
వాళ్లని చూస్తుంటే సుస్మితకి అసహ్యం వేసింది. ఇంగ్లీష్‍లో నోటికొచ్చినట్టు తిట్టింది. దాంతో వాళ్లు కొంచెం భయపడి తొలిగారు. టీసీకి టిక్కెట్టిచ్చి స్టేషను యివతలకొచ్చి నిల్చుంది. పొద్దున్న వున్న వుత్సాహం ఆ పిల్లలో యిప్పుడు ఏ కోశానా లేదు. పైగా ఏదో గుబులుగా అనిపిస్తోంది. చీకటి పడుతోంది.
“అమ్మో! ఎక్కడికెళ్లి వుండాలి?” అనుకుంది భయంభయంగా
వారంరోజులు ఎడాపెడా చూసి పారేసిన సినిమాలు గుర్తుచేసుకుని ధైర్యంగా బస్టాపులో నిలబడింది ఎక్కడికెళ్లాలో తెలీడం లేదు. బస్సులు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వాటిని చూస్తూ నిల్చుంది.
ఏదేనా హోటలుకెళ్తే? ఎంతో హోటల్‍కి తనిలా వెళ్తే రానిస్తారా ? మరిప్పుడేమిటి దారి? అంతా గజిబిజిగా అనిపిస్తోంది. చూస్తుండగానే చీకటి పడిపోయింది.
సుస్మిత రైల్లోంచీ దిగాక తనవెంట పడిన పిల్లల్ని ఎడాపెడా ఇంగ్లీషులో తిట్టడం చాలామంది ఆగి చూసారు. అలా చూసినవాళ్లలో పార్ధసారధి కూడా వున్నాడు. అతనూ ఆమె దిగిన ట్రెయిన్లోంచే దిగాడు. ఐతే సరిగా అదే సమయానికి బోంబేనుంచీ మరో ట్రెయినొచ్చి ఎదుటి
ప్లాట్‍ఫాంమీద ఆగడంతో ఆమె బోంబేనుంచి వచ్చి వుండచ్చని వూహించాడు. అక్కడ బాంబుపేలుళ్లలో ఎంతోమంది పిల్లలు అనాధలయారు. ఈ పిల్లకూడా అంతే కావచ్చువనుకున్నాడు. అతని మనసు జాలితో నిండింది.
స్టేషన్లోంచి యివతలికి వచ్చేసరికి బస్‍స్టాపులో నిలబడి కనిపించింది సుస్మిత. అతన్లో ఒక ఆలోచన స్వార్ధపూరితమైనదే కావచ్చు… అది ఆ పిల్లపాలిట వరమైంది. లేకపోతే నిస్సహాయంగా రోడ్డుమీద మిగిలిపోయేది. ఇంకాసేపయాక ఏ చీకటికూపంలోకో నెట్టబడేది తిరిగి బయటపడే వీలులేకుండా దారులన్నీ మూసుకుపోయేవి.
పార్ధసారధిది సామాన్యమైన కుటుంబం. భార్యకూడా వుద్యోగం చేస్తుంది. ముగ్గురు పిల్లలు, పెద్దపిల్లకి ఐదేళ్లు. తరువాతి యిద్దరూ కవలలు. ఏణ్ణర్ధం వయసువాళ్లు. పెద్దపిల్లని స్కూల్లో దించి, చిన్నపిల్లల్ని క్రెష్‍లో వదిలి భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్లాలంటే రోజుకో యజ్ఞం చేసినంత ఔతోంది. నమ్మకమైన దాదికోసం చూస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పనిపిల్లల్ని తెచ్చి పెట్టుకున్నా, వాళ్లు యింట్లోంచి ఏవో తీసుకుని పారిపోవడం జరిగింది. ఈ పిల్లయితే అనాథగాబట్టి తమపంచనే పడుంటుందని భావించాడు.
సుస్మిత దగ్గరగా వెళ్లి “”మా యింటికొస్తావా?” అని అడిగాడు. ఆమె అపనమ్మకంగా చూసి, వస్తానన్నట్టు తలూపింది. వెంటనే ఆటో మాట్లాడాడు. మిగతా వివరాలన్నీ తనే వూహించుకోవడంచేత పేరుమాత్రం అడిగి వూరుకున్నాడు పార్ధసారధి.
అరగంట తర్వాత ఆటో చిన్న డాబాముందు ఆగింది. మొదట పార్ధసారధి దిగాడు. వెనక బెరుగ్గా దిగింది సుస్మిత. అదే క్షణాన్న తమిల్లు గుర్తొచ్చింది. ఆటో దిగగానే ఎంత స్వతంత్రంగా పరిగెత్తేది యింట్లోకి!
“రామ్మాయ్!”” ఆటోకి పైసలిచ్చి, చెప్పా డు పార్ధసారథి. ఇలా గేటు తీసాడో లేదో బిలబిల్లాడుతూ యింట్లోవాళ్లంతా యివతలికొచ్చేసారు. ముగ్గురుపిల్లలకీ తలో యాపిలూ యిచ్చి, నడిచాడు. బేగ్ భార్య చేతికిచ్చి లోపలికి నడిచాడు. వెనకాలే వెళ్ళింది సుస్మిత.
“ఇదో, కొత్త పనిపిల్లని తీసుకొచ్చాను” భార్యకి చెప్పాడు.
“ఇదా?”” వెనక్కి తిరిగి సుస్మిత మురికి బట్టలకేసీ చింపిరిజుత్తుకేసీ అసహ్యంగా చూస్తూ అడిగింది.
“రైల్వేస్టేషన్లో దొరికితే తీసుకొచ్చాను”
“ఇలాంటి ముష్టి … ఎందుకు తీసుకొస్తారు? వీళ్లు పనీపాటా చెయ్యరు. తేరగా వస్తే మెక్కుతారు. ఐనా, అడుక్కుతినే వెధవలకి యింట్లో నీడపట్టుని వుండమంటే ఎందుకు బావుంటుందీ?” పార్ధసారధి భార్య పేరు నాగమణి. సన్నగా పొడుగ్గా రివటలా వుంటు౦ది. కాస్త నోరెక్కువ. అది పెట్టుకునే చాలా పనులు సాధించుకొస్తుంది.
“నాలుగు రోజులుంచుకుని నచ్చకపోతే తగిలేద్దాం. మవ్వు చెప్పిన టైపు కాదు. బొంబాయినుంచి వచ్చింది” సర్దిచెప్పాడు.
“నీ పేరేంటే?” అంతదాకా మౌనంగా వాళ్ల సంభాషణ వింటున్న సుస్మిత ఆ ప్రశ్నకి వులిక్కిపడింది.
“సు… సుస్మిత”” ఠపీమని చెప్పింది. నేమ పనిపిల్లని కాను, నీలాంటి ఓ అమ్మ కూతుర్నని చెప్పాలనుకుందిగానీ మాట పెగిలిరాలేదు.
“తెలుగువాళ్ళా? తెలుగెలా వచ్చు నీకు?”
“ఏ వూరు మీది?””
“నీకు అమ్మా, నాన్నా లేరా?”
“చచ్చారా? ఇద్దరూనా? ఎలా? ఎక్కడ?”
“మీ నాన్నేం చేసేవాడు?””
అబద్ధాలు చెప్పడంలో పొద్దున్న వున్న సరదా యిప్పుడు లేదు సుస్మితకి. ఒక్క ప్రశ్నకీ జవాబివ్వలేదు. కళ్లలోంచి నీళ్లు వుబికి వస్తున్నాయి. ఆ కన్నీళ్లని చూసి మరోలా అర్థం చేసుకుంది నాగమణి.
“సర్లే! పో! పోయి బాత్రూంలో అంట్లున్నాయి. అవి తోమి బాత్రూం కడిగి శుభ్రం చెయ్యి. స్నానం చేసి రా. ఇంకో గౌనుందా నీకు?… ఏమీ నీతో తెచ్చుకోలేదా ? నాదో పాతలంగా యిస్తాను అది కట్టుకుని బట్టలుతుక్కుని ఆరేసుకో. పో…” అంది నాగమణి బాత్రూంకి దారి చూపిస్తూ.
చేతయ్యీ కాక అంట్లన్నీ తోమింది సుస్మిత. వదలనివన్నీ మళ్లీమళ్లీ తోమించింది నాగమణి. ఒకవైపు చలి వణికిస్తున్నా టేంకులోని చన్నీళ్లు స్నానం చేసి ఆవిడిచ్చిన లోలంగా జాకెట్టు వేసుకుని భోజనానికి బాత్రూం ముందున్న ఖాళీస్థలంలో కూర్చుంది సుస్మిత. స్నానం చేస్తున్నప్పుడు స్కర్టు జేబులోని డబ్బులు ఇవతలికి తీస్తుంటే,
“ఎక్కడివీ అవి? ఇలా తే. నేను దాస్తాను. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు?” అని నాగమణి తీసేసుకుంది.
సత్తుపళ్ళెంలో పొద్దుటి అన్నం పెట్టి, యింత పచ్చడి వేసి, ఒక్క పిసరు కూర విదిపి లోపలికెళ్లిపోయింది నాగమణి.
సుస్మితకా అన్నం తినబుద్ధికాలేదు. బొంబాయినుంచి వచ్చిన అనాధనైతే మాత్రం యింత నిర్దయగా చూస్తారా? కళ్లలోంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అమ్మ తననెప్పుడూ యింత నిర్దయగా చూడలేదు. తననే కాదు, ఎవరితోనూ ఇలా మాట్లాడదు. తను ఎంత అల్లరిచేసినా చిరునవ్వుతో సహించింది. అల్లరి మరీ దాటిపోతేనే కోప్పడేది, ఆ తర్వాతే కొట్టడం. అదీ తగిలీ తగలనట్టు చిన్న దెబ్బ వేసేది. దానికే ఏడ్చి అలిగి నాన్న దగ్గర గారాలుపోయేది. ఇప్పుడు తను చేసింది తప్పుకాదూ? వెక్కిళ్లొస్తున్నాయి.
రమ్యావాళ్లూ తననేమంత బాగా చూసేరని? వీసీపీ కొనుక్కున్న రోజు వాళ్లమధ్య కూర్చోబెట్టుకుని తనకీ ఐస్క్రీమ్ ఇచ్చారు. రెండోరోజున వాళ్లమధ్య కూర్చోబోతే, నువ్విక్కడ కాదు, అక్కడ అని కుర్చీ చూపించారు. చూస్తుండగా హాలంతా నిండిపోయింది. ఇంకెవరో వస్తే తనని కుర్చీంలోంచి లేపి కిందిని కూర్చోబెట్టారు. ఫ్రెండు రమ్య తన తనకేసి దొంగచూపులు చూస్తూ సోఫాలో కూర్చుంది. అలాంటపుడు తనెందుకు వాళ్లింటికి వెళ్లాలి? అందుకే కదూ, అమ్మ కొట్టింది? సుస్మితకి ఏడుపు ఆగలేదు. మోకాళ్లు ముడుచుకుని అందులో ముఖం దాచుకుని
వెక్కివెక్కి ఏడ్చింది.
“ఎందుకే ఏడుస్తున్నావు? అన్నం కూడా తినలేదు?” నాగమణి కఠోరమైన స్వరం వినిపించేదాకా అలా ఏడుస్తూనే వుంది. ఆవిణ్ణి చూసాక నెమ్మదిగా పరికిణీ అంచుతో కళ్లు తుడుచుకుంది.
“ఊ< తిను…”” అక్కడే నిల్చుంది నాగమణి. అన్నాన్ని గబగ ముద్దలు చేసి మింగింది సుస్మిత. తర్వాత పళ్ళెం, గ్లాసు కడిగి తెచ్చుకుని ఒక వారగా బోర్లించింది.
“ఈవేళ్టికి పడుకో. పొద్దునే నాలుగింటికి లేపుతాను. తెలిసిందా?” అని ఒక చాప, దిండు, కప్పుకోవడానికో దుప్పటి యిచ్చి, ముందుగదిలో పడుకోమని లోపలికెళ్లి ఆమె రాగానే తలుపు గొళ్ళెం పెట్టుకుంది నాగమణి.
పక్క బట్టలు చీదర పుట్టిస్తున్నాయి. వంటిమీది బట్టలు చీదర పుట్టిస్తున్నాయి. నాగమణి కఠోరమైన గొంతు చీదర పుట్టిస్తోంది. అన్నీ కలిసి సుస్మిత చిన్ని మనసుమీద తమ ప్రతాపం చూపుతున్నాయి. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. జారుకునేముందు ఒక నిర్ణయానికొచ్చింది. చాలా తెలివైన నిర్ణయమది.
కొత్తచోటు కావడంచేత తెల్లారి మూడి౦టికే మెలకువ వచ్చేసింది సుస్మితకి. తలుపు తీసుకుని వెళ్లి తడితడిగా వున్న బట్టల్ని తొడుక్కుని విడిచిన బట్టల్ని ఒక వార కుప్పగా పెట్టింది. నిశ్శబ్దంగా గేటు తీసుకుని బయటికి నడిచింది. రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. సందు చివరున్న చెత్తకుండీ పక్కని ముడుచుకుని కూర్చుంది తెల్లారేదాకా. తెల్లారాక సంధించిన బాణంలా బస్టాపు చేరుకుంది.
అప్పటికి రెండోరోజు సుస్మిత యింట్లోంచి వెళిపోయి. ఏడ్చింది ఏడ్చినట్టే వుంది వుత్పల. పచ్చిమంచినీళ్లు కూడా గొంతుకలో పోసుకోలేదు. సుస్మిత నాయనమ్మ, తాత, అమ్మమ్మ, మేనమామలు, పినతండ్రి అందరూ వచ్చేసారు. అందరూ తలోవైపూ జీపుల్లోనూ ప్రైవేటు టాక్సీల్లోనూ వెళ్లి వెతుకుతు న్నారు. బేంకులో వున్నదంతా డ్రాచేసి అందినచోటల్లా అప్పుచేసి డబ్బు నీళ్లల్లా ఖర్చుపెడుతున్నాడు సుధీర్.
“ఒక్క మెతుకు నోట్లో వేసుకోమ్మా! నిండింట అభోజనంగా వుండకూడదు”” మనవరాలి కోసం ఏడుస్తూనే కూతుర్ని బ్రతిమాలుతోంది వుత్పల తల్లి. ఆవిడ వొళ్లోపడి బావురుమంది వుత్పల.
“దీనికి నేనేం లోటు చేసానమ్మా? నలుగరేసి పిల్లల్ని మీరు పెంచి పెద్దచేసారు. ఒక్కపిల్లని పెంచడం చేతకాక చేతులు కాల్చుకున్నాం” అడిగింది.
“అదేనమ్మా మీకూ మాకూ వున్న తేడా. ఉన్నదేదో పెట్టి, తింటే తిన్నారు, లెకపోతే లేదన్నట్టు నోరెత్తనివ్వకుండా మేము పెంచితే ఒక్క పిల్లని అడిగినవన్నీ యిచ్చారు. అది కొండమీది కోతిని తెమ్మనేరికి ఇలా అయిపోయారు. మొదటే అదుపులో పెడితే యింతదాకా వచ్చునా? పిల్లల్ని బాగా పెంచడమంటే ఆడపిల్లకి చక్కటి సంబంధం తేవటం, మగపిల్లాడికి ఎడతెగని బాధ్యతల్లేకుండా చూసుకోవటం…”” వుత్పల అత్తగారు అంది.
“సూటిపోటి మాటలనడానికి యిదేనా సమయం వదినా?”” కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటూ అడిగింది వుత్సల తల్లి.
“నేనేం కాని మాటన్నానమ్మా వదివా? పసిది ఎక్కడుందో! ఎలా ఏడుస్తుందో! ఆకలికి ఒక్క క్షణం కూడా ఆగలేకపోయేది. ఏ సెలవలకేనా మా వూరొస్తే దీనికోసమని ఎనిమిదింటికల్లా వండి పెట్టేదాన్ని. ఎలా వుందో!”” వుత్పల అత్తగారు చీరచెంగుతో ముఖం కప్పుకుని రోదించసాగింది.
“అది అడిగిందేదో కొనిపడెయ్యి సుధీర్! ఎప్పుడో నేను చచ్చినవాడు వాటాలేసి యిచ్చే బంగారమేదో యిప్పుడే యిస్తాను. నా గుళ్లపేరు యిస్తాను. అమ్మేసెయ్యి. అసలా దేవుడి దయవల్ల అది తిరిగి రావాలేగానీ… “కొడుకుతో అందావిడ. సుధీర్ తల్లి చేతులు రెండూ అందుకుని తన కళ్లమీద వేసుకున్నాడు. ఎంతో సాంత్వనగా అనిపించి౦ది.
“నీ బాధ నాకు తెలీదేమిటా? ఇంతమంది వెతుకుతున్నారు, పోలీసు కంప్లెయింటుకూడా యిచ్చారు”” అందావిడ.
మధ్యాహ్నం మూడైంది. తెలిసినవాళ్ళు వచ్చి పలకరించి వెళ్తున్నారు. వెతకడానికి వెళ్లిన సుధీర్ తమ్ముడు, బావమరుదులు తిరిగొచ్చారు. మొహాలు వేళ్ళాడేసుకుని వచ్చినవాళ్లని చూసి వుత్పల మరింత నిస్త్రాణ పడింది.
“అదిగో వచ్చింది”” అన్నారెవరో. అందరూ ఒక్కసారి వీధికేసి చూసారు. తలొంచుకుని తప్పుచేసినట్టు బిత్తరచూపులు చూస్తూ… ఒక్కొక్క అడుగూ వేస్తూ వస్తోంది సుస్మిత. పక్కని కాన్‍సేబుల్ వున్నాడు.
“సికింద్రాబాద్ స్టేషన్లో తిరుగుతుంటే గట్టిగా గదమాయించి అడిగారు అక్కడి రైల్వే పోలీసులు. వివరాలు చెప్పి, డ్యూటీ మీద వున్న నాతో పంపించారు” అన్నాడు. అతన్లో దేవుడే కనిపించాడు అందరికీ.
“సుస్మీ!”” చేతులు చాపుతూ బిగ్గరగా ఏడ్చింది వుత్పల. ఆ చేతుల్లో పరుగున వెళ్లి వాలిపోయింది సుస్మిత.
వెచ్చటి అమ్మ కౌగిలి! సంతోషంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు. ప్రేమతో వొళ్లంతా తడుముతున్న స్పర్శ! సుస్మితకిప్పు డు పూర్తిగా అర్ధమైంది. తను, అమ్మ వేరువేరు కాదని, తన వంటిమీద పడ్డ దెబ్బ అమ్మ గుండెమీద కూడా పడుతుందని!
అక్కడితో అవలేదు. సుస్మితని స్కూల్లోంచీ టీసీ యిచ్చి పంపించేసారు. మేనమామలుగానీ, పినతండ్రిగానీ ఆ పిల్లని తమ పిల్లల్తో కలపడానికి భయపడ్డారు. సుధీర్ తల్లి ఇచ్చిన గొలుసు వెనక్కి ఇచ్చేసింది ఉత్పల.
“ఇదే పద్ధతని అది అనుకుంటే కష్టం. అదృష్టంకొద్దీ ఒకసారి తిరిగి వచ్చింది. అదృష్టం ఎప్పుడూ మనని వరించదు” అంది.
సుధీర్ ఇదవరకట్లా డబ్బు షర్టుజేబులో వదిలెయ్యటం లేదు.
మారిపోయిన ఈ విలువలమధ్య సర్దుకోవటానికి చాలా కష్టపడింది సుస్మిత.
ఆంధ్రభూమి మాసపత్రిక 1998
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.