(సాహిత్య ప్రస్థానం- జూన్ 2006)
“అమ్మకి బీపీ ఏమిట్రా? అసలేమైంది?” రైలు దిగుతూనే ఆతృతగా అడిగింది సౌజన్య, ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చిన తమ్ముడిని. తల్లి హైబీపీతో హాస్పిటల్లో చేర్చబడిందన్న విషయం ఆమెకి అపనమ్మకాన్నీ కలిగిస్తోంది… చాలా.
దినకర్ వెంటనే జవాబివ్వలేదు. ఆమె చేతిలోంచి బేగ్ అందుకుని జనాన్ని తప్పించుకుంటూ నడుస్తున్నాడు. అతడి వెనకే వస్తూ అదే విషయాన్ని గురించి ఆలోచిస్తోంది సౌజన్య.
తండ్రికి రైల్వేలో ఉద్యోగం. ఎప్పుడూ కేంపులమీద తిరిగేవాడు. తామిద్దరినీ చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చింది తల్లి. స్కూలుకి తీసుకెళ్ళి తీసుకురావడం, అనారోగ్యాలూ కొంత వయసొచ్చేదాకా. వయసుతోపాటు మౌలికరూపాన్ని మార్చుకున్నా తాము పెద్దవుతున్న కొద్దీ యింకెన్నో సమస్యలు. అన్నిటినీ సమర్ధవంతంగా నిర్వహించుకొచ్చిన వ్యక్తి… దేనికీ చలించకుండా తండ్రి సహకారం తమకి లేకపోవడం ఒక లోటని కాకుండా సహజపరిణామంగా నిర్వచించిన వ్యక్తి… అంతర్గత వత్తిడి కారణంగా అనారోగ్యంపాలై హాస్పిటల్లో చేరటమనేదాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆమె ధ్యాస తమ్ముడి జవాబుమీదకన్నా సమస్య విశ్లేషణమీద ఎక్కువగా ఉంది.
ఏం జరిగింది అమ్మకి? పైకి అలా నవ్వుతూ నిండుగా కనిపించినా లోలోపల బాధపడేదా? ఏ సమస్యనేనా తెలివిగా పరిష్కరించడం ఆమె బహిర్భాగమా? అంతరంగంలో వేరే విధంగా వుండేదా? ఆమె ఆలోచనలు ఆగటం లేదు.
ఇద్దరూ స్టేషన్ బైటకొచ్చారు.
“నువ్విక్కడే వుండు. నేను బైక్ తెస్తాను” అన్నాడు దినకర్.
ఆమె ఆగిపోయింది. అతను వెళ్ళి బైకుతో రావటానికి ఐదునిముషాలు పట్టింది. ఈ కాస్త వ్యవధిలో మరికొన్ని ఆలోచనలు… మరింత విశ్లేషణ…
“ముందు హాస్పిటల్‍కెళ్ళి అమ్మని చూసి యింటికెళ్లాం” అంది. అతను అంగీకార సూచకంగా తలూపాడు.
“అసలేం జరిగింది? నాన్న కూడా రిటైరైపోయాడు. ఇద్దరూ సంతోషంగా వుండక ఎందుకిలా టెన్షన్ పెంచుకుంటోంది అమ్మ? అయినా పడాల్సిన టెన్షనంతా మన చిన్నతనాల్లోనే పడి వుండాలి… ” మళ్ళీ ఎన్నో ఆలోచనలు… జ్ఞాపకాలు. తమ్ముడు స్కూల్లో ఆటలాడి దెబ్బలు తగుల్చుకున్న రోజులు… తనకి జ్వరం, దగ్గు, జలుబు తరచుగా వచ్చినప్పటి రోజులు… అవన్నీ గుర్తొచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకాల వలయంలో తిరుగుతున్నాయి.
“చెప్పాలంటే చాలా వుంది సుజీ! నిన్న మొన్నటిదాకా మనింట్లో ఏ సమస్యలూ లేవు. అమ్మ కూడా బాధ్యతలన్నీ తీరి సంతోషంగా వుండేది. మా పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళడం, తనంతట తను లైబ్రరీకి వెళ్ళటం, జయతో గుడికెళ్ళటం…. అంతా సరదాగా గడిచింది”
“మరి?”
“నా ఆలోచన తప్పేమో తెలీదు”
“ఏమిటి?”
“రిటైరైనవాళ్ళని కొంతకాలంపాటు మానవ వనరుల శాఖకి పంపిస్తే బావుంటుందేమో! నిన్న సాయంత్రం ఆరింటిదాకా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఉదయం నుంచి ఒక్కసారి శక్తిహీనుడవటమో, ఏమీ చేయలేని నిరాసక్తుడవటమో జరగదు. నిర్దుష్టమైన వ్యాపకమనేది లేకుండా ఎలా వుండగలుగుతాడు?”
“నాన్న గురించా, నువ్వనేది?”
“హెచ్చార్టీకి వాళ్ళని సరెండర్ చేస్తే వాళ్ళ సేవల్ని ఏ సమాజసేవకో వినియోగించుకుంటే ఈ రోజుని మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు. పరిష్కారమవుతాయి. వాళ్ళలో కొందర్లో కొన్ని నైపుణ్యాలు వుండొచ్చు. ఉద్యోగం ఒక ఆటంకం కాగా సంగీతం, పెయింటింగ్‍లాంటి హాబీలని వదిలిపెట్టేసి వుండవచ్చు. వాళ్ళని అలాంటి అవసరం వున్నచోట వుపయోగించుకుంటే? వాళ్ళకీ అంత త్వరగా వృద్ధాప్యం రాదు వాళ్ళకిచ్చే పెన్షన్ ప్రభుత్వానికి భారమనిపించదు.”
“రిటైరయ్యాక కూడా ఉద్యోగం చేయమంటే ఎవరు చేస్తార్రా?”
అతనిదంతా ఎందుకు చెప్తున్నాడో అర్ధమవక అయోమయంగా అడిగింది. దానితో తల్లి అనారోగ్యానికి గల సంబంధం అస్పష్టంగా కనీ కన్పించనట్టుంటే ఆశ్చర్యం కూడా కలిగింది.
“ఉద్యోగం అనుకుంటే బాధ్యతగానూ, భారంగానూ అనిపిస్తుంది. అందుకే ప్రవృత్తిని సంతృప్తిపరిచేచోట అన్నాను”చివరి మాటలు వత్తి పలికాడు.
“కానీ రిటైరయ్యాక ఎవరేనా విశ్రాంతిగా గడపాలనుకుంటారు, నువ్వేంట్రా యిలా అంటావు?” మళ్ళీ అదే అడిగింది.
“అలా బతగ్గలిగే ట్రెయినింగేనా ఇవ్వాలి, రిటైర్ చేసేముందు” అన్నాడు.
ఇంతలో హాస్పిటల్ చేరుకున్నారు. సౌజన్యకి సరైన జవాబు రాకముందే వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. దినకర్ బైక్ పార్క్ చేసి వచ్చేలోపు సౌజన్య తల్లిని వుంచిన స్పెషల్ రూమ్‍కి వెళ్ళిపోయింది. తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. నెమ్మదిగా తోసింది. తల్లి మంచంమీద ఆకుపచ్చటి హాస్పిటల్ దుప్పటిమీద పడుక్కుని ఉంది. నిద్రపోవటం లేదు. మంచానికి కొంచెం దూరంగా స్టూలు మీద కూర్చుని ఏదో మేగజైన్ చదువుతోంది జయ – దినకర్ భార్య.
కొద్దిగా తోసిన తలుపుల మధ్య నిలువెత్తు విగ్రహంలా వున్న సౌజన్యని చూసి లేచి నిలబడి, “రండి. ఒక్కరే వచ్చారా? దినా స్టేషన్ కొచ్చారు. కలవలేదా?” అనడిగింది. ఆమె ప్రశ్న యింకా పూర్తవనే లేదు. వెనకనుంచీ దినకర్ అడుగుల చప్పుడు వినిపించింది. సౌజన్య తల్లి అన్నపూర్ణ. కూతుర్ని చూసి ఆవిడ లేచి కూర్చుంది.
“ఎలా వుందమ్మా నీకు?” ఒక్క అంగలో తల్లి పక్కన వెళ్ళి కూర్చుంది సౌజన్య. ఆవిడనలా నీరసంగా వుండగా చూడటం ఆమెకి బాధని కలిగించింది. కళ్లమ్మట నీళ్ళు తిరిగాయి.
“ఎందుకంత బాధ? పెద్దదాన్నవటం లేదూ? ఏవో వస్తూనే వుంటాయి. ఈ మాత్రందానికి నువ్వింత కంగారుపడి రావడం దేనికి? మీ ఆయనకి లీవు దొరికాక యిద్దరూ కలిసే రావల్సింది… అంతగా రావాలనుకుంటే” అంది అన్నపూర్ణ. కూతురు, కొడుకు, కోడలు అందరూ తనకోసం పడుతున్న తపన చూస్తుంటే ఆవిడకి ఒకవైపు సంతృప్తిగా వుంది. మరోవైపు వాళ్ళని యిబ్బంది పెడుతున్నానన్న బాధకూడా వుంది. ఈ రెండు విరుద్ధభావాల మధ్య నలిగింది కాసేపు. అలాంటి ఎన్నో భావవైరుధ్యాలు కొద్దిరోజులుగా ఆమెని వుక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త రిటైరై యింట్లోనే వుంటున్నాడన్న సంతోషంతో అతడి ప్రవర్తన కలిగిస్తున్న బాధ సంఘర్షిస్తోంది. ఆయన ప్రవర్తనలో లోపం వున్నట్టుగానీ, దానివలన తను బాధపడుతోందనిగానీ, కొడుక్కి, కోడలికీ తెలీకుండా దాచే ప్రయత్నంలో యింకొంత సంఘర్షణ…
ఇదంతా దినకర్ గుర్తించేడు. ఇంకా సౌజన్యతో అనలేదు. వాళ్ళ సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. పూర్తి కావలసి వుంది.
తల్లి దగ్గర అరగంట సేపు కూర్చుని, తమ్ముడితో యింటికెళ్ళింది. తండ్రి యింట్లోనే వున్నాడు. టీవీలో డిస్కవరీ ఛానెల్ చూస్తున్నాడు.
“ఎలా వున్నారు నాన్నా?” ప్రేమగా అడిగింది. “
“చాలా తీరుబడిగా”” నవ్వేడాయన. “అమ్మని చూసొచ్చావా? లేచిందా? ఏమైనా తిందా? అనారోగ్యం అసలు రాకుండా వుండదుగానీ వచ్చాక తీసుకునే జాగ్రత్తలే మనని అందులోంచీ బైటపడేస్తాయి” అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ దినకర్ ముఖం అసహనంగా పెట్టుకుంటూ, మళ్ళీ ప్రసన్నంగా కనిపించేట్టో పట్టించుకోనట్టో మార్చుకుంటూ వున్నాడు. ఇంటి వాతావరణంలో ఇదొక కొత్త మార్పు.
ఆ సాయంత్రమే అన్నపూర్ణని డిశ్చార్జి చేశారు. హైబీపీ కాబట్టి ఉప్పూ కారం బాగా తగ్గించమనీ, మందులు క్రమం తప్పకుండా వాడమనీ, రోజూ కొద్ది దూరం నడవమనీ, ప్రశాంతంగా వుండమనీ చెప్పారు డాక్టర్లు.
“చివరిది మాత్రం నా చేతుల్లో లేదు” గొణిగింది అన్నపూర్ణ.
అవిడన్నది స్పష్టంగా వినిపించకపోయినా, ముఖంలో ఖచ్చితంగా చదవగలిగాడు దినకర్. సందిగ్ధంలో పడ్డది సౌజన్య. ఆవిడని తీసుకుని యింటికొచ్చారు. ఆవిడ ఎక్కడ పడుకోవాలో, ఎలా వుంటే ప్రశాంతంగా వుంటుందో, ఏమేం చెయ్యకూడదో అనే ఎన్నో విషయాలమీద చాలాసేపు చర్చించాడు ఆమె తండ్రి గోపాలరావు, ఎవరికీ ఏదీ తెలీదన్న నమ్మకంతో.
ఇలాంటిది యింట్లో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఆయన ఇంటి విషయాలు పట్టించుకునేవాడు కాదు. తల్లే అన్నీ చూసుకునేది. తనే చేసేది. లేదా యిలా చెయ్యమని చెప్పేది. తాము చేసేవారు. తండ్రిలో యీ మార్పు… ప్రతీదీ తన ఆదేశాల ప్రకారం జరగాలన్న ఆకాంక్ష… సౌజన్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఏర్పాట్లు పూర్తయ్యేసరికి అన్నపూర్ణలో స్వల్పంగా వుద్రేకం కనిపించింది. ఆ రాత్రి మూడు వేర్వేరు సమావేశాలు జరిగాయి. మూడు వేర్వేరుచోట్ల. మొదటిది సౌజన్యకీ అన్నపూర్ణకి మధ్య జరిగింది. ఆవిడ గదిలో.
“రిటైరయ్యాక నాన్నలో చాలా మార్పు వచ్చిందే సుజీ! అంతకుముందు ఏదీ పట్టించుకునేవారు కాదా, యిప్పుడేమో అన్నిట్లోనూ తలదూరుస్తున్నారు. ఏదో చాదస్తంగా చెప్పబోతారు. ఎవరికంత తీరిక చెప్పు? జయ తొమ్మిదింటికల్లా ఆఫీసులో వుండాలి. దీనా ఎప్పుడెళ్లాడో, ఎప్పుడొస్తాడో వాడికే తెలీదు. ఈయన వదలరు. వాళ్ళకి విసుగు. దినా అంటే మన పిల్లవాడు. నేను పెంచిన పిల్లవాడు. జయ వేరే యింటినుంచి వచ్చింది. మేం ఏమన్నా సర్దుకుపోయేంత ప్రేమ, గౌరవం ఎక్కడినుంచి వస్తాయి? తెచ్చిపెట్టుకున్నవి ఎంతకాలం నిలుస్తాయి? మనం ప్రేమ చూపిస్తే దగ్గరవుతుంది. విసిగిస్తే దూరం జరుగుతుంది. అయితే దానితోపాటు వీడుకూడా దూరమవుతాడు. సుజీ! మీ యిద్దర్నీ ఎంత ప్రేమగా పెంచానే! నీ పెళ్ళితో వచ్చిన వెళ్లిని వాడి పెళ్ళితో పూడ్చాలనుకున్నానుగానీ అందర్నీ దూరం చేసుకుని మాకు మేమే బతకాలనుకోలేదు” అంది అన్నపూర్ణ. అలా అంటుంటేనే ఆమె గొంతు రుద్ధమైంది. కళ్ళు చెమర్చాయి. తల్లి తపన అర్ధమై సౌజన్య మనసు
ఆర్ద్రమైంది.
“నువ్వన్నీ మనసులో పెట్టుకోకు. కొద్దిరోజులు నువ్వూ నాన్న మా యింటికొచ్చి వుండండి. నీకు మార్పుగానూ వుంటుంది. విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ తమ్ముడికీ, జయకీ కూడా మీ విలువేంటో తెలుస్తుంది. ఎక్కడివక్కడ వదిలేసి వెళ్తే అన్నీ సర్దిపెట్టి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వుంటే వాళ్ళకి తెలీడం లేదు” అంది. తమ్ముడూ మరదలి విషయం ఆమె మనసులో ఏదో ఒక మూల ముల్లులా గుచ్చుకుని బాధిస్తోంది.
అన్నపూర్ణ చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అడిగింది. “స్పర్ధలనేవి ఎందుకు రావాలి?” చాలా లోతైన ప్రశ్న. ప్రేమించే మనస్తత్వం వున్నవారిని తీవ్రంగా బాధపెట్టే ప్రశ్న. ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు ఆ విషయంమీద యిద్దరూ ఏకాభిప్రాయానికి రావల్సినప్పుడు పుట్టే సంఘర్షణ స్పర్థ. మనుషులమధ్య ఇంటరాక్షన్స్ జరుగుతూ వున్నప్పుడు అభిప్రాయభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇంట్లో మనుషుల మధ్య సంఘటనలు, స్పందన ప్రతిస్పందనలు, చర్య ప్రతిచర్యలు లేకుండా ఎలా వుంటాయి? అంటే స్పర్ధలు తప్పనిసరా? ఎడమొహం, పెడమొహంగానో, తిట్టుకుంటూ, దెబ్బలాడుకుంటూనో వుండాల్సిందేనా? కాదనిపించింది. అంతకన్నా జవాబు దొరకలేదు. అన్నపూర్ణ తనకి తనే వెతుక్కుందిగానీ సౌజన్య నుంచీ ఆశించలేదు.
భోజనాలవేళ అంది సౌజన్య “అమ్మనీ నాన్ననీ కొద్దిరోజులు మా యింటికి రమ్మంటున్నాను దినా!”
అతనేం మాట్లాడలేదుగానీ జయ మాత్రం ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ దించుకుంది. భోజనాలయ్యాక తండ్రి దగ్గరకెళ్ళి కూర్చుంది సౌజన్య. అది రెండో సమావేశం.
“నేను చెప్పిన విషయాన్ని గురించి ఏమాలోచించారు నాన్నా? కొన్నాళ్ళు మీరిద్దరూ నా దగ్గరకొచ్చి వుంటే సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కృతమవుతాయి” అంది.
“అసలిప్పుడు మీ అమ్మకి గల సమస్యలేమిటి?” అడిగాడు గోపాలరావు. “ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోకపోవడం, ఇంట్లో డిసిప్లిన్ లేకపోవడం, వంటింట్లోంచీ సగం పనిలో వచ్చి టీవీముందు కూర్చుంటుంది. గంటో అరగంటో చూసి మళ్ళీ పని మొదలెడ్తుంది. మళ్ళీ నిద్ర. ఆ పనులనేవి ఎప్పటికీ తెమలవు. ఎనిమిదిన్నరకి జయ వెళ్ళిపోతుంది. ఇంకో అరగంటకో గంటకో అమ్మ కూడా వంటింట్లోంచి ఎందుకు బయటపడదు? ఎందుకా దేవులాట? దినా డ్రింక్ చేస్తాడు. ఆ విషయం నేను గ్రహించి చెప్తేనేకానీ ఆమెకి తెలియలేదు. ఏం పెంపకమే సుజీ, అది? మగపిల్లలు ఎంతలో చెయ్యిజారిపోతారు? ఇన్నాళ్ళు ఏం జరిగిందో జరిగింది. అన్నీ నాకొదిలిపెట్టి నిశ్చింతగా వుండమంటున్నాను” అన్నాడు.
మరో ముల్లు దిగబడింది సౌజన్య గుండెలో. తండ్రి అలా మాట్లాడుతుంటే అసహనంగా అనిపించింది. ఎక్కడో లోపం జరుగుతోంది. అసలా లోపమేంటో, ఎక్కడ ఎందుకు జరుగుతోందో మాత్రం అర్ధమవలేదు. నిశ్శబ్దంగా లేచి యివతలికి వచ్చేసింది. తల్లి నిద్రపోతోంది. అదే గదిలో చప్పుడవకుండా మరో మంచం వాల్చుకుని తను పడుకుంది. గంటసేపు నిద్రపోయిందో లేదో సెల్ మోగింది. తల్లికి మెలకువ వస్తుందేమోనని కంగారుపడ్తూ సెల్ తీసుకుని గదిలోంచీ యివతలికి వచ్చేసింది. ఫోన్ చేసింది ఎవరో కాదు, దినకర్.
“నీకోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తున్నాను”
సౌజన్య నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఆమె కాళ్ళు డాబామెట్లకేసి దారితీశాయి.
“కార్పొరేట్ రంగంలో చాలావరకూ నిర్ణయాలు వైన్ కప్ వెనుకనుంచే వెలువడతాయి. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వున్న నేను తాగటం తప్పనో, తాగననే నియమం పెట్టుకున్నాననో నా తోటివారినుంచీ వేరుపడలేను. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ డ్రింకింగ్ నా దృష్టిలో తప్పు కాదు. మనమీద మనకి నియంత్రణ పోయేదాకా తాగి గొడవ చెయ్యటం తప్పు…”
రాత్రి పన్నెండుగంటల వేళవటంతో ఆరుబయట కావటంచేత చిరుగాలి సన్నగా వణికిస్తోంది. చున్నీని తలమీంచి భుజాల చుట్టూ కప్పుకుని కుర్చీలో ముడుచుకుని కూర్చుని వుంది సౌజన్య. దినకర్ చెప్పింది వింది. తమ్ముడు, భర్త, మరెవరేనాకానీ తాగటాన్ని సమర్ధించుకుంటూ చెప్పే మాటలవే. అందులో విశేషమేమీ లేదు.
“అలాంటి తప్పు నేనెప్పుడేనా చేస్తే, ఆ క్షణంనుంచి తనెలా చెప్తే నేనలా నడుచుకుంటాననేది జయకీ నాకూ మధ్యగల ఒప్పందం”
సౌజన్య పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అలాంటి ఒప్పందం చాలామంది భార్యాభర్తల మధ్య వుంటుంది. దాన్ని అతిక్రమించడం కూడా ఎంతోమంది మధ్య ఎన్నోసార్లు జరిగి వుంటుంది!
“అలా నవ్వక్కర్లేదు. ఇప్పటిదాకా నేను బ్రీచ్ చేయలేదు” అని నవ్వేడు దినకర్ కూడా. ఇద్దరి మధ్య వాతావరణం కాస్త తేలికపడింది.
“మీ మంచికోసమేగా మేం చెప్పేది?” అడిగింది సౌజన్య
“ఆ విషయమూ తెలుసు, మా మంచీ మాకు తెలుసు”
మనిషికి తోటివారి అవసరం ఎప్పుడూ వుంటూనే వుంది. తన తల్లిదండ్రుల సమయంలో నలుగురైదుగురు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ , కజిన్సూ వుండేవారు. పెళ్ళిళ్ళలోనూ, చావుల్లోనూ కలుసుకునేవారు. కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకుని బాధని పంచుకునేవారు. ఇప్పుడలా కాదు. అలాంటి ఆత్మీయులూ లేరు. అంత చిక్కటి అనుబంధాలూ లేవు. మన చుట్టూ వున్నవారికంటే వెనుకబడకుండా వుంటే చాలు, గుంపులో తోసుకుపోతున్నారు. ఇది యిప్పటి జీవన సరళి.
“అమ్మకి నేను డ్రింక్ చేస్తాననే విషయం తెలుసు. కానీ ఆవిడ పెద్ద డిప్లమాట్. తెలీనట్టుగా వూరుకుంది. అంటే బైటపడితే నేనే పడాలి. లేకపోతే ఆవిడలాగే నేనూ డిప్లమాటిగ్గా వుంటూ కవర్ చేసుకోవాలి. నాన్న మాత్రం తనో గొప్ప విషయాన్ని తెలుసుకున్నానని అనుకుంటున్నారు. అమ్మని కోప్పడ్డారు. నాతో కూడా మాట్లాడతారట. ఏం మాట్లాడతారు? చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి అబ్బాయీ అని ఐదేళ్ళపిల్లాడికి చెప్పినట్టు చెప్తారా? సుజీ! నేను చిన్నపిల్లాడినో, నూనూగుమీసాల యువకుడినో కాను, ఒకరిచేత సరిదిద్దించుకోవడానికి. కొన్ని జతల కళ్ళు యీర్ష్యగానూ, యింకొన్ని జత కళ్ళు ఆరాధనగానూ చూసేంత స్టేచర్ నాకు వుంది”
సౌజన్యకి అర్థమైంది. కొన్ని విషయాలు తెలిసీ తెలియనట్టు వుండిపోతేనే బావుంటాయి. వాటిని చర్చకి పెట్టుకోవడంవలన అందులోని సున్నితమైన పార్శ్వం దెబ్బతింటుంది. అది తండ్రికి అర్థంకాదు. ఆయన నమ్మే విలువలు వేరు. కొన్ని దశాబ్దాలపాటు అంటే వుద్యోగం మీద వున్నకాలం వచ్చిన మార్పులు ఆయన తెలికిడిలోకి రాలేదు.
“అమ్మ పెంపకం సరిగా లేదనేది నాన్న చేసే అభియోగం. అదామెకి ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించు. మనిద్దర్లో ఏ లోపం వుంది? ఏం తక్కువ? ఇంకా ఎలా వుండాలి మనం? మన చుట్టూ వున్నవాళ్ళలో మంచివాళ్ళు ఎక్కువ కష్టాలు పడటాన్ని, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా వుండటాన్నీ చూస్తుంటాం. దానికిగల కారణం చెప్పనా? సంఘర్షణ. తను చేసేది తప్పని అనుకోనివాడు చేసేది తప్పే అయినా హాయిగా బతికేస్తాడు. అది కాకుండా తప్పా తమ వప్పా అనే సంఘర్షణలో కొట్టుకునేవాడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు. అలాంటి సంఘర్షణ యిప్పుడు మనింట్లో మొదలైంది” అంటూ బయస్కోపులో బొమ్మని తిప్పినట్టు సౌజన్య దృక్కోణంలోంచి తనని తప్పించి తల్లిని వుంచాడు దినకర్.
““… అమ్మతో ఆయనకి రోజూ గొడవే. అన్నింట్లో గొడవే. పెళ్ళికి ముందు యిరవయ్యేళ్ళూ, పెళ్ళయాక మరో ముప్పయ్యైదేళ్ళూ కొన్ని పద్ధతులకి అలవాటు పడిపోయిందావిడ. ఈ పని ఇలా ఎందుకు చేశావనేదానికి వాస్తవానికి ఎలాంటి జవాబూ లేదు. ఆ పని అలాగే చేయడంవలన ప్రత్యేకించి వచ్చిన లాభంగానీ, నష్టంగానీ లేదు. అయినా అక్కడో ప్రశ్న ఆవిడ ఎదుర్కొంటోంది. ఇదిలా కాకుండా యింకోలా చెయ్యొచ్చుగా అని”
సౌజన్య చకితురాలైంది. తమ్ముడిలో ఇంత పరిశీలనాసక్తి వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజమే… ఎన్నో పనులు… కొన్ని యిలాగ, కొన్ని మరొకలాగా చేస్తుంటారు. ఏది ఎందుకు యిలాగ ఇంకోటి అలాగ అనేది ఎవరికి వారు ఆలోచించరు. మరొకరి దృష్టికోణంలోంచే ఆ మీమాంస జనిస్తుంది.
“…ఎనిమిదిన్నరకి జయ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా అమ్మకి వంటింట్లో యింకా చాలా పనుంటుంది. తొమ్మిదిన్నరదాకా అయినంతవరకూ చేసుకుని టిఫెన్ తింటూ టీవీ చూస్తుంది. మళ్ళీ లేచి వెళ్ళి మిగిలిన పని చూసుకుంటుంది. ఆవిడ టీవీ చూడాలని వచ్చే టైముకి నాన్న బీబీసీనో, ఎన్‍జీసీనో చూస్తున్నారు. అమ్మని పనంతా పూర్తి చేసుకుని వంటింటికి గొళ్ళెం పెట్టేసి రమ్మంటారు. అది అయ్యే పనేనా? లైబ్రరీ వెళ్ళి తెలుగు నవలలు తెచ్చుకునేది అమ్మ. ఇప్పుడు నాన్న అదే కార్డుమీద ఫిలాసఫీ బుక్స్ తెచ్చుకుంటున్నారు. అమ్మ చదివేవి చెత్త పుస్తకాలని విమర్శ. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదంటారు. ఈ అపార్టుమెంట్లలో ఎక్కడ ఆడుకుంటారు? గ్రౌండుకి వెళ్తే పెద్ద పిల్లలు కొడుతున్నారు. రోజూ వాళ్లని పార్కుకి తీసుకెళ్ళి ఆడించి తీసుకొచ్చేదెవరు? అలా ఆడి అలసిపోయి యింటికొస్తే హోంవర్కు ఎవరు చేస్తారు? చదువు ఎవరు చదువుతారు? మననేనా శనాదివారాల్లోనేకదా, వదిలిపెట్టేది అమ్మ? … ఇంకా ఎన్నో!”
“దినా!”
“… వాళ్ళని టీవీ చూడనివ్వరక్కా! కాసేపు వాళ్ళు టీవీముందు కూర్చుంటే జయ రిలాక్సై పనులు చేసుకుంటుంది. ఇప్పుడలా కాదు. ఇంటికొచ్చాక ఒక్క నిమిషంకూడా తనని వూపిరి పీల్చుకోనివ్వకుండా అల్లరి. సుజీ! ఒకరకంగా చెప్పాలంటే యింట్లో అందరం ప్రైవసీని కోల్పోయాం. ఆ ఒత్తిడంతా అమ్మమీద పడుతోంది. నాన్నకి సర్ది చెప్పలేక, సజావుగా సాగిపోయేవన్నీ సమస్యలౌతూ వుంటే తీర్చలేక సతమతమైపోతోంది”
“…”
“నా ఆలోచనలు తప్పో రైటో తెలీదు. కొన్ని సంవత్సరాలుగా అలవాటుపడిన జీవనసరళిని మార్చుకోవడం ఎవరికేనా కష్టమే. అది పూర్తిగా వ్యక్తిగతానికి వదిలేసి మనుషులు కలిసి వుండలేరా? ఒకళ్ళకి అనుగుణంగా మిగతావారంతా మారిపోవలసిందేనా? అది సాధ్యమేనా?” ఎంత నెమ్మదిగా మాట్లాడినా దినకర్ గొంతులో తీక్ష్ణత చీకట్లో కత్తి అంచు మెరుస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది.
మనుషుల మధ్య స్పర్ధలెందుకొస్తాయో అర్ధమైంది సౌజన్యకి. తమ్ముడిని తప్పుగా అర్ధం చేసుకొన్నందుకు బాధనిపించింది కూడా. “
“తప్పు చేస్తున్నట్టు నాన్న ముందు తలొంచుకునో లేకపోతే పార్టీలవీ మానేసి, అలా మానేయడంవలన నేనేదో కోల్పోయానని బాధపడుతూనో బతకడం నావల్ల కాదు… అదొక్కటే కాదు. అమ్మ యిక్కడేదో కష్టపడిపోతోందని తనని కొంతకాలం తీసుకెళ్తే బావుంటుందని అనుకుంటున్నావు కదూ? కానీ సుజీ, నాది స్వార్ధమే అనుకో, అమ్మని కష్టపెడుతున్నాననే అనుకో… నా పిల్లలు అమ్మ పెంపకంలో ఒద్దిగ్గా పెరగాలని కోరిక. వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి… యింటినీ, యింట్లోవాళ్ళనీ… వంటరిగా తొణక్కుండా మనని పెంచుకొచ్చిందే అలాంటి స్థితప్రజ్ఞత… చాలా బరువైన పదంకదూ… కానీ అలా పెరగాలని నాకుంది. ఈ విషయాలన్నీ నాన్నతో నేనే మాట్లాడాలనుకుంటున్నాను ” అన్నాడు.
సౌజన్య ఏమీ మాట్లాడలేదు. తండ్రికి కొన్ని ఆకాంక్షలున్నాయి. వాటికి అనుగుణంగా పరిస్థితులుండాలని ఆయన కోరిక. కానీ అందుకు సమయం మించిపోయింది. దినకర్‍గానీ, తనుగానీ, మా మంచి మాకు తెలీదా అనే వయసుని చేరుకున్నారు. తమ చుట్టూ మార్పుకి అనువుగాలేని, తమని బైటకి వదిలిపెట్టని ప్రపంచం ఏర్పడిపోయింది. ఆ విషయం ఆయనే గుర్తించాలి. ఇద్దరూ ఇంకాసేపు అలాగే కూర్చుని ఏవేవో జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
దినకర్‍కి తండ్రితో మాట్లాడాల్సిన అవసరం రాలేదు.
సౌజన్య సెల్ మోగడంతో అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న గోపాలరావుకి మెలకువ వచ్చింది. ఆమె డాబా ఎక్కుతుంటే చూశాడు. అల్లుడి దగ్గర్నుంచేమో ఫోను, ఏకాంతంకోసం వెళ్తోందనుకుంటే డాబామీంచి కొడుకు గొంతు వినిపించింది. ఇద్దరూ అక్కడే వున్నారు. అన్ని విషయాలూ కొడుకుతో చెప్పడానికి అదే అనువైన సందర్భం అనిపించి తనూ లేచి మెట్లెక్కాడు. ఆఖరి మెట్టుమీద వుండగా కొడుకు చెప్తున్నది తన గురించేనని అర్ధమై ఆగిపోయి విన్నాడు.
ఒక్కక్షణం… తలదిమ్మెక్కినట్టయింది. ఉద్రేకం ముంచెత్తగా వంట్లోని రక్తం వడివడిగా ప్రవహించింది. క్రమంగా భావోద్వేగాలన్నీ చల్లబడ్డాయి. నెమ్మదిగా వెనక్కొచ్చి తన మంచంమీద కూలబడ్డాడు. ఒక అవగాహన… స్పష్టంగా ఏర్పడింది. రిటైర్మెంటువలన మార్పు వచ్చింది తన జీవితంలో. వాళ్ళు ఇంతకు ముందెలా వున్నారో యిప్పుడూ అలాగే వున్నారు. ఇకముందు కూడా అలాగే వుండాలనుకుంటున్నారు. ఆ ఒరవడిలోనే తనని యిముడ్చుకోగలరు. ఇరవైనాలుగ్గంటల విరామ సమయాన్ని చేతిలో వుంచుకొని ప్రతీదీ గమనిస్తూ వుంటే అన్నీ లోపాలే కనిపిస్తున్నాయి. ఆ విరామం లేని రోజుల్లో కూడా ఇవన్నీ వున్నవే. వాటివలన ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. తను పట్టించుకోవడం వలన యిబ్బందిగా మారింది. భార్యని ఎలివేట్ చేసే ప్రయత్నం తనెప్పుడూ చేయలేదు. ఆమె స్థాయికి తగిన వినోదాన్ని, విజ్ఞానాన్ని ఆమె ఎంచుకుంది. కొడుకు చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. ప్రపంచాన్నిబట్టి వెళ్తున్నాడు. తను వెళ్ళలేదూ, వయసులో వున్న భార్యనీ పిల్లల్నీ వదిలేసి వుద్యోగానికి? తనకది అనివార్యం. సోషల్ మూవింగ్ అనేది కొడుక్కి అనివార్యం.
సుదీర్ఘంగా నిశ్వసించాడు. భ్రమలన్నీ తొలిగాయి. తన పరిధి అర్ధమైంది.
మర్నాడు ఉదయం పోస్టులో కొన్ని అప్లికేషన్లు పంపించాడు. వాటిలో యిలా వుంది – “ఉద్యోగం కావలెను. అరవయ్యేళ్ళ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగికి…”
దాదాపు వారం తర్వాత మొదటి రిగ్రెట్ లెటరొచ్చింది. ఎదుటివారి అభిప్రాయాలు మనమీద రుద్దబడటంలోని చేదు, వారికిగల తిరస్కరించగలిగే అధికారం మనకి ఛాయిస్ లేకుండా చేయడంలోని బాధ రుచికి వచ్చాయి. ముప్పయ్యేళ్ళ పైబడి సర్వీసు చేసి, రిటైరైన తనకి తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎవరేనా వినియోగించుకుంటే అదొక గుర్తింపులా అనిపించి సంతృప్తి కలిగేది. ఇప్పుడది దొరకలేదు. దొరకలేదంటే తనకి నైపుణ్యం లేదని కాదు, వాళ్ళకి అది అవసరం లేదని. వాళ్ళకి నచ్చినట్తు లేడని. అదే సమయాన అతనికి మరో విషయం స్ఫురించింది – ఇలాంటి ఎన్నో తిరస్కారాలని ఈమధ్య భార్యకి రుచి చూపిస్తున్నానని. పిల్లల పెంపకం సరిగా లేదనటం దగ్గర్నుంచి, తన అభిప్రాయాలే సరైనవనీ, ఆమెవి విలువ లేనివనటందాకా.
గోపాలరావు యిప్పుడు రోజులో చాలాభాగం లైబ్రరీలోనో, పబ్లిక్ గార్డెన్లోని సీనియర్ సిటిజన్స్ కార్నర్‍లోనో గడుపుతున్నాడు. ఇంకో కార్డు తీసుకుని లైబ్రరీనుంచి వస్తూ తన పుస్తకాలతోపాటు భార్యకి అర్ధమయ్యే తేలికపాటి నవలలు తీసుకొస్తున్నాడు. మధ్య మధ్యలో ఆమెని ప్రశంసిస్తున్నాడు. తను దూరంగా వుండి, ఎలాంటి సహకారాన్నీ అందించకపోయినా, పిల్లలనీ, ఇంటినీ పైకి తీసుకొచ్చినందుకు బాహాటంగానే ప్రశంసిస్తున్నాడు. అందులో ఆయనకి కొద్దిగా అసంతృప్తి లేకపోలేదు. దాన్ని తనే గరళంలా మింగాడు. తనామెని విమర్శిస్తూ ఏదో పొరపాటు జరిగిపోయిందని బాధపడుతూ వున్నప్పుడు ఆమె అనారోగ్యాన్ని తెచ్చుకుంది. ఆమెలో లోపాలని సరిదిద్దాలనుకున్నప్పుడు ఆమె సంఘర్షించి అనారోగ్యాన్ని తెచ్చుకుంది. ఇప్పుడామెలో స్పష్టమైన మార్పు. ఆమె టీవీ చూసే టైముకి తన పేపరు చూడటం, మనవల్ని కొద్దిసేపు ఆడించి తీసుకొచ్చి దగ్గరుండి హోంవర్క్ చేయించడం అలవాటు చేసుకున్నాడు. వాళ్ళకి మంచి మంచి ప్రోగ్రామ్స్‌ని తనే దగ్గరుండి పరిచయం చేస్తున్నాడు.
జయతో చేసుకున్న ఒప్పందాన్ని ఒకే ఒక్కసారి అతిక్రమించాడు దినకర్. లిమిట్ దాటి తాగాడు. తిన్న పదార్థాలు కడుపులో యిమడలేదు. ఇంటికి రాగానే వాంతి చేసుకున్నాడు. భయంకరమైన వాసన గదంతా నిండింది. పిల్లలు నిద్రలేచి తండ్రిని భయంగా చూడసాగారు. వాళ్ళ చూపులు ఎంతోకాలం వెంటాడాయతన్ని. మళ్ళీ ఎప్పుడూ తాగలేదు. తాగటాన్ని సమర్ధించే సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించలేదు. పార్టీల్లో అంతా డ్రింక్ చేస్తుంటే తను థమ్సప్ పట్టుకుని కూర్చోగలుగుతున్నాడు.
“నాన్న పోస్ట్ రిటైరల్ లైఫ్‍కి అలవాటుపడ్డారు. ఇప్పుడాయన యింట్లో యిమిడిపోగలుగుతున్నారు. ఎలాంటి అలజడీ సృష్టించకుండా”” అన్నాడు దినకర్ సౌజన్యతో. ఆమెకి విషయాలన్నీ తల్లి ద్వారా తెలిశాయి.
“మార్పు ఒకరు చెప్పి తీసుకొచ్చేది కాదు. జీవనగమనరీత్యా రావాలి. మనిషి వ్యక్తిగత సంస్కారపరంగా రావాలి. ఎదుటి వాళ్ళలో మార్పు రావాలని మనం కోరుకున్నప్పటికీ, వాళ్ళ ప్రవర్తన ఎంత బాధనిపించినప్పటికీ వేచి చూడాల్సిందే. వారు మారితే చుట్టూ వున్నవారితో సంబంధాలు బాగుపడతాయి. ఒకరు మరొకరిని మార్చాలని ప్రయత్నిస్తే అవే సంబంధాలు చెడిపోతాయి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినిల్లు చాలా సురక్షితంగా వుంది. అమ్మా, నాన్నా, తమ్ముడూ అనే ఆప్తులున్నారు. నాన్న, నువ్వూ ఒకరినొకరు తమకనుగుణంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే నాకు ఎవరో ఒకరే వుండేవారు. రెండోవారు విరోధులయ్యేవారు. లేదా నేనే యిద్దరికీ దూరమయ్యేదాన్ని” అంది.
సౌజన్య.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
Being a digital marketer today is definitely not easy! Not only do you need high-quality content, you need a lot of it. But creating good content is incredibly time consuming. At least that is what I thought until I came across WordAi… In case you have never heard of WordAi, it is a lightning fast content rewriter that uses Artificial Intelligence to automatically create unique variations of any piece of content. The best part is, WordAi creates rewrites that both humans and Google love. I know, that’s a bold claim and I was pretty skeptical myself. So I decided to test their claims with their free trial and can tell you honestly, I opted directly for the yearly subscription after that. I’m not exaggerating when I tell you that WordAi is better than any other tool, service, or method on the market. I have been using WordAi to fill out my blogs and have already covered the cost of my yearly subscription. Its crazy but Im just scratching the surface of how far I can scale my SEO with WordAi! While I am using WordAi to scale my SEO efforts, you can also use WordAi to diversify your copy or even brainstorm to beat writers block! I could tell you about WordAi all day, but you really just need to try it for yourself. They are so confident in their technology that they offer a completely free 3-day trial AND a 30-day money back guarantee. So what are you waiting for? Click here to get started with WordAi for Free! Register here and get a bonus.