“ప్రభా! గంటలో వస్తాను. తలుపు వేసుకో” అని చెప్పి వెళ్ళిన వ్యక్తి తనుగా తిరిగిరాడనీ, తీసుకురాబడతాడనీ వూహించలేదు ప్రతిభ.
పెద్దవాళ్ళని ఎదిరించి చేసుకున్న పెళ్ళి కావటంతో అతను పోవటం ఎవర్నీ కదిలించలేదు. వద్దనుకోగానే బంధుత్వాలన్నీ తెగిపోయాయన్నట్టు వదిలేసారు. ఆఫీసువాళ్ళు, ఫ్రెండ్సే అన్నీ చూసుకున్నారు.
“బెనిఫిట్సన్నీ వీలైనంత తొందర్లో వచ్చేలా చూస్తానమ్మా! నువ్వేం అధైర్యపడకు. మేమంతా వున్నాం” ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆఫీసరు.
కాలం ఎంత వేగంగా గడుస్తోంది! అని ఆగి చూసుకునే వ్యవధికూడా లేనట్టు రోజులు పోతున్నాయి. భర్త నాటిన నైట్‍క్వీన్ మొక్క యిప్పటికీ పూలు పూస్తూనే వుంది. పరిమళాలు వెదజల్లుతునే వుంది. కిటికీ పక్కని కుర్చీ వేసుకుని కూర్చుని ఉస్తాద్ అలీ ఖాన్ షెహనాయ్ వినేవాడతను. కేసెట్లలాగే వున్నాయి, వాటిల్లోని సంగీతమూ అలాగే వుంది. లేనిదల్లా అతనే. ఇల్లంతా అతను లేకపోవడంతో నిండిపోయింది. జీవనసరళిని మార్చుకోవడం కష్టంగా వుంది.
“నాన్న కావాలమ్మా!” అని ఏడేళ్ళ బిందు ఏడుస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతున్నాయి ప్రతిభకి. ఎవరేనా తామిద్దర్నీ గుండెల్లోకి పొదువుకుని, లాలించి ఓదారిస్తే ఎంత బావుండును! తను పెళ్ళిని ఇలా చేసుకుని ఎంత పొరపాటు చేసింది! ఒక ఆట ఆడేప్పుడు దాని షరతులన్నీ వప్పుకోవాలి. ఆ షరతులేకదా, అందరినీ సమన్వయపరిచేది! అది తనకప్పుడు అర్థమవ్వలేదు. ఎవరూ లేకుండా ఎలా బతకాలనుకుంది? అతను వుండని ప్రపంచం ఇంత శూన్యంగా వుంటుందని ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఎంత వంటరితనం ముందుముందు!
చిన్నసంసారం, చీకూచింతా లేని సంసారం అంటారు నిజమే!। బాధ్యతలు తగ్గేసరికి ఎదుటివారి కష్టాల్లో సానుభూతి చూపించలేనంతగా మనిషి మనోవైశాల్యం కుదించుకుపోతోంది. ఆ మేరకి అహం పెరుగుతోంది. తన తండ్రికి… ఆయన మాట కాదని పెళ్లిచేసుకుందని తనమీద కోపం. అత్తమామలకీ అంతే. ఎవరికీ పట్టువిడుపులు లేవు. వాళ్ళే కాదనుకున్నాక యింకెవరున్నారని తనకి? ఎవరికోసం బతకాలి?
ఏ నిద్రమాత్రలో మింగి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన బలంగా కలిగేది ప్రతిభకి. కానీ బిందుని చూస్తూ ఆ పని చెయ్యలేకపోయేది. రోజులలాగే దొర్లుతున్నాయి.
భర్త ఆఫీసులోనే కారుణ్యనియామకం యిచ్చారు ప్రతిభకి. బైటి ప్రపంచంలో అడుగు పెట్టడంతో మూసుకుపోయిన మనోద్వారాలు కొద్దికొద్దిగా తెరుచుకున్నట్టైంది. ఒక నియమిత దినచర్య మొదలయాక ఆలోచనలు తగ్గాయి.
పొద్దున్నే తయారవ్వటం, బిందుని స్కూలుకి పంపి తను ఆఫీసుకెళ్ళటం, మళ్ళీ తిరిగొచ్చేసరికి టీవీ బిందు హోమ్‍వర్కు… అయిష్టంగానేనా సరే అనివార్యంగా చెయ్యాల్సిన దినచర్య. అన్నీ తనే చేసుకోవాలి. కూరగాయలు తెచ్చుకోవటం దగ్గర్నుంచి వంటా, బిందు స్కూలు విషయాలు …. ప్రాణం విసిగిపోతోంది. ఏదో వుక్రోషం…
ఆరోజు స్కూల్ రిక్షా రాలేదు. అవతల తనకి ఆఫీసుకి టైమైపోతోంది. సూపర్నెంటు లేటైతే వూరుకోడు.
“ఎలా మమ్మీ? ప్రేయర్ బెల్ అయ్యాక వెళ్తే పనిష్ చేస్తారు. అందరూ నవ్వుతారు” అంటోంది బిందు గుడ్లనీళ్ళు కక్కుకుని. భర్త వుండగా బిందుని టైముకి పంపించలేకపోవటమన్న సమస్య ఎప్పుడూ రాలేదు. అతని యాక్టివా హోండా షోకేసులో బొమ్మలా వెక్కిరిస్తూ కనిపించింది. తనని నేర్చుకోమనేవాడు తనే శ్రద్ధపెట్టలేదు.
సరిగ్గా అప్పుడే ప్రతిభ కొలీగ్ రామకృష్ణ అటుగా వెళ్తున్నాడు. ఇద్దర్నీ చూసి లూనా స్లో చేసుకుని “ఏంటి ప్రతిభగారూ! ఎనీ ప్రాబ్లమ్? పాప యింకా స్కూలుకి వెళ్ళలేదు ఎందుకు?” అనడిగేడు.
“రిక్షా రాలేదంకుల్” బిందు అరచేతుల్తో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.
“ఓ! దానికేనా ఏడుస్తున్నావు? రా! డ్రాప్ చేస్తాను” అని బిందుని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. పెద్దల బరువు దిగినట్టైంది ప్రతిభకి, ఆఫీసుకెళ్ళాక థాంక్స్ చెప్పిందతనికి.
మరోరోజు…
అప్పటికి రెండురోజులైంది ప్రతిభ ఆఫీసుకి వెళ్ళి. ఎందుకు రాలేదోనని వెళ్ళాడతను. తల్లీకూతుళ్ళిద్దరికీ జ్వరం. చేసేవాళ్ళు ఎవరూ లేరేమో, మంచానికి అంటిపెట్టుకుపోయి వున్నారు.
“ప్రతిభా! నాకు ఫోన్ చెయ్యొచ్చుకదా?” కోప్పడ్డాడు రామకృష్ణ. ఆమె పరిస్థితికి అతని హృదయం ద్రవించిపోయింది.
“ఆయనుండి నేను పోయినా బావుండేది. మరోపెళ్ళి చేసుకుని హాయిగా వుండేవారు. ఒక్కదాన్ని మిగిలిపోయాను. మగపనీ ఆడపనీ రెండూ చేసుకోలేక చచ్చిపోతున్నాను” బావురుమంది ప్రతిభ.
“ఛ… చ… ఏంటిది? ఇలాంటప్పుడు ఏడుస్తారా? జ్వరం ఎక్కువౌతుంది. ఒంట్లో బాగోలేనప్పుడు నాకు ఫోన్ చేస్తే వచ్చేవాడిని,డాక్టరు దగ్గరికి తీసికెళ్ళేవాడినని అన్నానుగానీ నిన్ను హర్ట్ చెయ్యాలని కాదు. ప్లీజ్, ఏడవకండి” బుజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు. వెళ్ళి పాలపేకెట్టూ, బ్రెడ్డూ తీసుకొచ్చి తనే పాలు కాచాడు. ఇద్దరికీ పాలూ బ్రెడ్డూ యిచ్చి తినిపించాడు.
తిన్నాక కాస్త ఓపిక వచ్చింది ప్రతిభకి.
“ఆటో తీసుకొస్తాను. డాక్టరు దగ్గరకి వెళ్ళొద్దాం” అన్నాడు రామకృష్ణ.
“మీకు యిప్పటికే చాలా శ్రమ యిచ్చాను” ఇబ్బందిగా అంది ప్రతిభ. అతను నవ్వేసాడు. “మా ఆవిడ ఏ వూరో వెళ్ళినప్పుడు నాకు జ్వరం వస్తే మీరూ అన్నీ చేద్దురుగాని” అన్నాడు. ప్రతిభ కూడా నవ్వేసిందిగానీ రెండు విషయాలు ఆమెకి గుండెల్లో ముళ్ళలా గుచ్చుకున్నాయి. మొదటిది అతనికి పెళ్ళై కుటుంబం వుందని. రెండోది అతనెప్పుడూ తమని వాళ్ళింటికి ఆహ్వానించడంగానీ భార్యతో కలిసి తనింటికి రావటంగానీ చెయ్యలేదని. ఒక బలహీనత ఆమెనా అవమానాన్ని నవ్వుతూ సహించేలా చేసింది.
రామకృష్ణ ఆటో తీసుకొచ్చాడు. ముగ్గురూ డాక్టరు దగ్గిరకి వెళ్ళొచ్చారు. మామూలు జ్వరమేనని చెప్పి, మందులవీ రాసాడు డాక్టరు. అన్నీ కొనిచ్చి, జాగ్రత్తగా వాడమని మరీమరీ హెచ్చరించి వెళ్ళాడు రామకృష్ణ.
“అమ్మా! అంకుల్ ఎప్పటికీ మనదగ్గరే వుండిపోతే బావుంటుంది కదూ?” అశగా అంది బిందు.”
“తప్పు” అంది ప్రతిభ. ఆమాట నాలిక చివర్నించీ వచ్చిందేగానీ అంతరంతరాలలో ఆమెకీ అలానే అనిపించింది. అంతలోనే నవ్వు కూడా వచ్చింది. టైముకి ఆఫీసుకి చేర్చడంకోసం, బజారుపనుల కోసం, జ్వరమొస్తే డాక్టరు దగ్గిరకి తీసికెళ్ళడంకోసం… యిలాంటివాటికోసం అతని తోడు కోరుకుంటోందా తను? ఒక పనిపిల్లాడిని వెతుక్కోవాలి. చాలా సమస్యలు తీరతాయి!
తలంటు పోసుకున్న జుత్తు అరబెట్టుకుంటోంది ప్రతిభ. రెండుచెంపల్నీ కప్పేస్తూ భుజాలమీదుగా వళ్ళోకి జారిన వెంట్రుకలపాయల మధ్యనుంచీ ఆమె మొహం మబ్బుల్లోంచి తొంగిచూస్తున్న చంద్రబింబంలా వుంది. ఆ దృశ్యాన్ని చాలా విస్మయంగా చూస్తున్నాడు రామకృష్ణ, భార్యలో అలాంటి లాలిత్యం ఎప్పుడూ కనిపించలేదు అతనికి.
అతని చూపుల్లో వచ్చిన మార్పుని గుర్తించింది. ప్రతిభ. ఇబ్బందిగా అనిపించింది. ఈమధ్య తమమధ్యన అవసరాలకన్నా అనురాగాలు ఎక్కువౌతున్నాయని గుర్తించింది. చాలా చనువుగా యింట్లోకి వచ్చేస్తాడతను. స్వతంత్రంగా కుర్చీలో కూర్చుంటాడు. టీవీ చూస్తూ పొద్దుపోయేదాకా గడుపుతాడు. బిందుతో స్క్రాబ్‍లెట్, చైనీస్‍చెక్కర్‍లాంటి గేమ్స్ ఆడతాడు. ఒక్కోక్కసారి తనడిగితే భోజనం కూడా చేస్తాడు. ఆఫీసులో తమ వెనుక గుసగుసలు మొదలయ్యాయి. మరి అతని మనసులో ఏముందో?
“ప్రతిభా!” అన్నాడు రామకృష్ణ.
“చెప్పండి”
“మనం… పెళ్ళి చేసుకుంటే బావుంటుందేమో!” అనేసాడు.
ఆ ప్రస్తావన నచ్చలేదు ఆమెకి. అది మనసులో వూహించుకుని అలా జరిగితే బావుంటుంది అనుకోవడంలా లేదు. ఇరుకున పడ్డట్టైంది.
“ఎందుకూ? పెళ్ళి చేసుకోకుండానే ఒక గృహస్థు చేసే పనులన్నీ … ఐమీన్.. కూరలు తేవడం, బిందుని స్కూల్లో దింపడంలాంటివన్నీ చేస్తూనే వున్నారుగా?” నవ్వులాటగా అనబోయింది.
అతను చురుగ్గా చూసాడు. చూసి, కుర్చీలోంచీ లేచి వెళ్ళి ఆమెకి అభిముఖంగా కూర్చుని ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ దగ్గరకి రాబోతుంటే చెయ్యడ్డుపెట్టింది ప్రతిభ. ఆమెకి చనిపోయిన తన భర్త గుర్తొచ్చాడు ఎబ్బెట్టుగా అనిపించింది. రామకృష్ణని దూరంగా తోసేసి లేచి నిల్చుంటూ అంది ” ఇప్పటికే చాలా దూరం వచ్చాము. మీ ఆవిడ తంతుంది జాగ్రత్త”
“ఎందుకు తంతుందో చూస్తాను. తనని నేను వప్పిస్తాను. సరేనా?” ఆమె జవాబుకోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు.
మరుసటిరోజు ఉదయం బిందుకి జడ వేస్తోంది ప్రతిభ. రామకృష్ణ పెళ్ళి ప్రస్తావన తెచ్చి వెళ్ళిన దగ్గర్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. అతన్ని చేసుకోవాలో వద్దో తనకి తనే నిర్ణయించుకోలేకపోతోంది. చేసుకుంటే తనకతడు తోడౌతాడు. ఒంటరిజీవితంలోకి మలయమారుతంలా వచ్చి పలకరించి వెళ్తాడు. మరతనికి? తను కావాలి. మగవాడు కాబట్టి అలా కోరుకుంటున్నాడు. ఎంత ప్రాణస్నేహాలేనా ఎవరి జీవితాలు వారివి కాబట్టి ఏదో ఒకప్పుడు విడిపోక తప్పదు. భార్యాభర్తల మధ్య అలాంటి ప్రాణస్నేహం లేకపోయినా చివరిదాకా కలిసుంటున్నారు. కారణం.. జీవితాల్ని కలుపుకోవడమే. మరి తామిద్దరూ పెళ్ళి చేసుకుంటే రామకృష్ణ భార్య? ఆమె వప్పుకుంటుందా? ఒప్పుకుంటే… తనామెకి ఎలాంటి యిబ్బంది కలిగించదు. ఒకవేళ పప్పుకోకపోతే? ఒప్పిస్తానని వెళ్ళాడుగా, రామకృష్ణ? ఏం జరిగిందో!
“ఒక జడ వదులు, యింకోటి బిగుతూను. ఏంటి మమ్మీ?” బిందు విసుక్కుంటే ఆలోచనల్లోంచీ తేరుకుంది.
సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తీసింది. ఎదురుగా గుమ్మంలో… తను వెతుకుతున్న ప్రశ్నకి సమాధానంలా మీనాక్షి, అంటే రామకృష్ణ భార్య. దూరాన్నించీ ఒకటి రెండుసార్లు రామకృష్ణతో చూడటంవల్ల గుర్తుపట్టింది ప్రతిభ. గంజిపెట్టి ఇస్త్రీ చేసిన సాదా నూలు చీర కట్టుకుంది. రామకృష్ణకి ముగ్గురు పిల్లలని తెలుసు. ముగ్గురుపిల్లల తల్లిలా లేదామె.
“రండి” పక్కకి తప్పుకుని ఆహ్వానించింది.
లోపలికి వస్తూనే యిల్లంతా పరికించి చూసింది. “బావుంది. మీవారున్నప్పుడు కట్టించుకున్నారా?” మామూలుగా అడిగింది. కానీ అందులో సునిశితమైన విమర్శ వుంది. దాన్ని గుర్తించింది ప్రతిభ. ఏం నిర్ణయించింది యీమె? రామకృష్ణ రావల్సినది, తనొచ్చిందేమిటనే ప్రశ్నలు తలలో మొదలయ్యాయి. బిందు సందిగ్ధంగా చూస్తోంది.
“ట్యూషన్‍కి వెళ్ళు” అంది బిందుతో. ఆ పిల్ల తలూపి వెళ్లిపోయింది.
“పాప ట్యూషన్‍కి వెళ్ళిపోయినట్టేనా?” అడిగింది మీనాక్షి.
“ఆ….” అంది ప్రతిభ జవాబుగా,
“ఇల్లంటే నాలుగు గోడలూ, తలుపులూ కిటికీలూ మాత్రమే కాదనుకుంటాను. మన ఆశలు, ఆశయాలూ, అనుభూతులూ, అనుభవాలూ అందులో నిక్షిప్తం చేసుకుంటాం. అలాంటి యింట్లోకి మరో వ్యక్తిని ఎలా రానిస్తాం? మీ అభిప్రాయలు మీవి అనుకోండి…” అంది మీనాక్షి.
ఆమె మాటలు నిజమేననిపించాయి ప్రతిభకి. రామకృష్ణ యింట్లోకి స్వతంత్రంగా వచ్చేసి భర్త ఎంతో యిష్టపడే కిటికీ దగ్గరికి అతను ఎప్పుడూ కూర్చునే కుర్చీ లాక్కుని కూర్చుని కబుర్లు చెప్తుంటే ఎంతో కష్టంగా వుండేది మొదట్లో. తనకి ఎంతో సహాయంగా వున్న అతన్నెలా వారించాలో తెలిసేది కాదు. క్రమేపీ అలవాటుపడిపోయింది. కానీ అతను స్వతంత్రించి యిల్లంతా తిరుగుతుంటే యిప్పటికీ ఎబ్బెట్టుగానే వుంటోంది. తన అంతరంగంలోకి ఎప్పుడూ ప్రవేశాన్నివ్వలేదు. అలాంటిది. అతన్ని తన బెడ్రూమ్‍లోకి ఆహ్వానించగలదా? ఆ తర్వాత భర్త జ్ఞాపకాలు, అనుభూతులు నిండి వున్న తన మనసులోకి?
“మీ అభిప్రాయాలు మీవని చెప్పానుగా? నావరకూ నేను మా యింటిని మరొకర్తో పంచుకోలేను. నాతో ముడిపడున్న నా భర్త జీవితాన్ని కూడా” మీనాక్షి చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది.
అప్పటిదాకా ఒక సందిగ్ధంలో వూగిసలాడుతున్న ప్రతిభ కొంత నిరాశపడ్డా తేలిగ్గా నిట్టూర్చింది. చెయ్యబోతున్నది తప్పని తెలిసీ వూగిసలాడుతున్న మనసు. దాన్ని అదుపులో వుంచుకుని సరైన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత వుంది. లేకపోతే పర్యవసానం అనుభవించాల్సింది తనే. ఆ నిర్ణయమేదో మరొకరు తీసుకుని వుందని నిర్ద్వంద్వంగా ప్రకటించడం వల్ల వచ్చిన రిలీఫ్ అది. అంతేకాదు, తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయాలకి ఎదురు తిరగ్గక్కర్లేదని, చనిపోయిన వ్యక్తికి ద్రోహంచేస్తోందన్న అపరాథబావనకూడా.
“ఇద్దరూ గవర్నమెంటు వుద్యోగస్తులు. జాగ్రత్తగా వుండటం అందరికీ మంచిది” శ్వాస తీసుకుందుకు ఆగింది మీనాక్షి.
బెదిరిస్తోందా? ప్రతిభ అహం దెబ్బతింది. సూటిగా ఆమె ముఖంలోకి చూసింది. మీనాక్షి కూడా నిశితంగా చూసి, తర్వాత ప్రతిభ మనసు చదివినట్టు చెప్పింది.
“మా పెళ్ళై యిప్పటికి పన్నెండేళ్ళైంది. ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చాం, పిల్లలు పెద్దవాళ్ళై అందివస్తే చాలు, మా బాధ్యతలు పూర్తయినట్టేననుకునేంత సామాన్యమైన ఆశలు మావి. ఇప్పుడు… రామకృష్ణ చెయ్యబోయే పనివలన మా సంసారం అతలాకుతలమౌతుంది. ముఖ్యంగా పిల్లలమీద దీని ప్రభావం చాలా వుంటుంది. వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు చెడిపోతారు” అంది.పిల్లలగురించి ఆమె పడుతున్న తపన చూస్తుంటే ప్రతిభకి సిగ్గేసింది. ఒకవైపు తనది నీతిబాహ్యతగానూ మరోవైపు బిందుపరంగా ఆలోచిస్తే బాధ్యతారాహిత్యంగానూ అనిపించింది.
“స్వంత యిల్లుంది. మీవారు పోయినందుకు బాగానే వచ్చి వుంటుంది. మహా ఐతే ఫామిలీ పెన్షను ఆగిపోతుంది. బిందు పేరుమీదికి మార్చచ్చు. ఎవరేనా ముందుకొచ్చి పెళ్ళి చేసుకుంటారేమో చూడండి. అంతేగానీ మీతోటి వుద్యోగికి కీప్‍గా వుండాలని ఎందుకు అనుకుంటున్నారు? అది తప్పుగా అనిపించట్లేదా?” పదునైన కత్తితో కోసినట్టు అడిగింది.
చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్టనిపించింది ప్రతిభకి. ముఖం రక్తంలేనట్టు పాలిపోయింది. ఎంత అసహ్యకరమైన పరిస్థితి! తనే కోరి తెచ్చుకుంది. భార్యాపిల్లలున్న రామకృష్ణతో అనవసరపు చనువు పెంచుకుంది. మగవాడిగా అతనేం ఆశించాలో అదే ఆశించాడు. ఇస్తే తన విలువ? సంఘంలో తన స్థానం? బిందు భవిష్యత్తు? క్షణంలో ఎంత ప్రలోభంలో పడిపోయింది తను? మరో స్త్రీతో ముడిపడి వున్న అతన్తో జీవితాన్ని తనెలా పంచుకోగలనుకుంది? పంచివ్వటానికి అతనిదగ్గర ఏం మిగిలి వుందని?
అప్పటిదాకా తనొక్కమాట కూడా మాట్లాడలేకపోయిన విషయం గుర్తొచ్చింది ప్రతిభకి. వెంటనే అర్థ మైంది. రామకృష్ణని తను చేసుకునివుంటే అప్పుడు కూడా… ఎవరి ముందూ తలెత్తుకోగలిగే అవకాశం వుండేది కాదని. మీనాక్షిపట్ల కృతజ్ఞతతో ఆమె మనసంతా నిండిపోయింది. ఒకవిధమైన ఆరాధనాభావం కూడా కలిగింది. భర్త మరో స్త్రీ ప్రలోభంలో పడ్డాడని తెలిసి కూడా ఎటువంటి వుద్రేకానికీ లోనుకాకుండా, ఎలాంటి అల్లరీ చెయ్యకుండా నిబ్బరంగా పరిష్కరించుకుంది.
“నామాట మన్నిస్తున్నట్టే అనుకోనా?” మృదువుగా అడిగింది మీనాక్షి.
“అయాం సారీ!” అప్పటికి నోరిప్పింది ప్రతిభ. “ఒంటరితనంతో, నిస్సహాయతతో కొట్టుకుపోతున్న రోజుల్లో మోరల్ ఎంతో సపోర్టిచ్చారు తను. ప్రలోభపడ్డాను” అంది.
కళ్ళల్లో నీళ్ళు గిర్రుమని తిరిగాయి. వంచిన తల ఎత్తలేదు. సుదీర్ఘంగా నిశ్వసించింది మీనాక్షి. ప్రతిభ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. “తెలిసో తెలి యకో కొన్ని పొరపాట్లు చేస్తుంటాము ప్రతిభా! మొదట్లో మీగురించి యింట్లో చెప్పేవాడు రామకృష్ణ ఎన్నోసార్లు మీ యింటికి రావాలనుకున్నాను. కానీ తనెప్పుడూ రమ్మనలేదు. ఎందుకెళ్ళాలన్న పంతంతో ఆగిపోయాను. వచ్చివుంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమో!”
“అతనూ ఆశపడ్డాడు. అన్నో తమ్ముడో పెడదారి పడుతుంటే చూస్తూ వూరుకోలేను. అలాగే నా భర్తకూడా. వస్తాను థాంక్స్” అంది మీనాక్షి లేస్తూ.
“కాఫీ తాగి వెళ్ళండి” అంది ప్రతిభ తనూ లేచి వంటింటికేసి వెళ్తూ.
కాఫీ తాగి వెళ్ళిపోయింది మీనాక్షి. ఒంటరితనం మళ్ళీ తన వల విసుర్తుంటే నిస్సహాయంగా అలాగే కూర్చుండిపోయింది ప్రతిభ. అది తనని వదలదనీ తన సహజీవనం దానితోనేననీ అర్ధమైంది. ఒక తుపానులా రామకృష్ణ తన జీవితంలోకి వచ్చివెళ్ళాడు. మళ్ళీ అతను రాడనీ, రాకూడదనీ తెలిసి మనసులో ఏదో ఆరాటం. ఆఫీసు వేళయ్యేదాకా గేటుకేసి చూస్తూ కూర్చుంది. బిందు ట్యూషన్నించీ వస్తే అన్నం పెట్టి స్కూలుకి పంపించింది.
అతను అటుగా రావాల్సిన వేళ దాటిపోయింది. నిస్పృహతో నిట్టూ చేర్చింది. అంత విషాదంలోనూ ఒక ప్రశాంతత. కూకటివేళ్ళతోసహా చెట్లని పెళ్ళగించి వేసే తుపాను వెళ్ళిపోయాక కూడా ప్రశాంతంగానే వుంటుంది. అలాంటి ప్రశాంతత ఇది.
అతను వేరే బ్రాంచికి డెప్యుటేషన్ అడిగి వేయించుకున్నాడని ఆఫీసుకు వెళ్ళాక తెలిసింది. బహుశ: అక్కడే వుండిపోతాడేమో!
భూమి సచిత్ర వారపత్రిక 6/4/2000
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.