పునరపి – 1 by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

ఆమె జీవితంలోకి అతను మొదటిసారి పొరపాటుగా ప్రవేశించాడు. బయటికి వచ్చేశాడు. రెండవసారి మళ్లీ ఇద్దరూ తారసపడ్డారు. ఇలా జరగడాన్ని అతను కాకతాళీయమని అనుకుంటే, కారణం అంతఃకరణమని అతని భార్య అంది.
మనిషి పుట్టుక కాకతాళీయం కావచ్చు. మరణం అకారణంగా జరగవచ్చు. కానీ ఆ రెండింటి మధ్యలో ఉండే జీవితంలోని ప్రతి సంఘటనా సహేతుకంగా ఉండాలనేది అతని అభిప్రాయం అయితే జరిగేది, జరగబోయేది ఏదీ మన చేతుల్లో లేనప్పుడు జనాంతికంగా జరిగేవి హేతుబద్ధంగా ఎలా ఉంటాయని అతని భార్య ప్రశ్న. అతను కాకతాళీయంగా జరిగాయనుకునేవాటికి ఆమె కారణాలు వెతుకుతుంది. చూపెడుతుంది. జీవితం పట్ల ఆమె నిర్హేతుకతకి అతను కూడా. ఈ పరస్పర వైరుధ్యమే వాళ్ళిద్దర్నీ కలిపిందని కృష్ణవేణి భావన. ఈ మధ్యలో ప్రశ్నార్ధకంలా పూర్ణి.


ముందురోజు నుంచీ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఒక స్నేహితుడు అమెరికా వెళ్తుంటే వరంగల్‍నుంచి హైదరాబాద్ వచ్చి సెండ్‍ఆఫ్ ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు శ్రీరామ్ వెళ్లడం తప్పనిసరైంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. దడదడా కురుస్తున్న వాన చప్పుడు తప్ప మరే శబ్దం లేదు. కారు నడుస్తున్న శబ్దం కూడా అందులో కలిసిపోయింది. హఠాత్తుగా ఎవరో రోడ్డుకి అడ్డం వచ్చారు. అతని వెనకే కాస్త దూరంలో చెట్టు కింద నిలబడి ఉన్న మరికొంతమంది వచ్చి చేరారు. ఎందుకోనని భయపడ్డాడు శ్రీరామ్. కారు దిగక తప్పలేదు.
“ఒకామెకి సీరియస్‍గా ఉంది. సిటీదాకా తీసుకెళ్లాలి. దయచేసి లిఫ్ట్ ఇస్తారా?” అభ్యర్థించాడు వాళ్లలో కాస్త చదువుకున్నట్టున్న యువకుడు. ఎన్నో అనుమానాలూ, భయాలూ కలిగాయి. ఆ ప్రదేశం అలాంటిది. అయితే అవన్నీ పక్కన పెట్టి_
“నేనూ డాక్టర్నే. సీరియస్‍గా ఉందంటున్నారు. ఏది పేషెంటు? ఏంటి జబ్బు?” కారు దిగుతూ వృత్తిధర్మంగా అడిగాడు. వాళ్లతన్ని ఆ ఇంటికి తీసుకొచ్చారు.
రోడ్డుకి పక్కగా ఉన్న చిన్న పెంకుటిల్లు. కుండపోత వానకీ, వీస్తున్న ఈదురుగాలికి కరెంటు లేదు. ఒక లాంతరు వెలుగుతోంది.
చెక్కమంచంమీద బిగుసుకుని పడుకుని ఉన్న ఆమె ముఖం అతనికి ఆ గుడ్డి వెలుతురులో సరిగా కనిపించలేదు. చెయ్యి అందుకుని నాడికోసం చూశాడు. నాడి దొరకలేదు. స్పర్శ చల్లగా మంచులా ఉంది. ఎప్పుడో పోయింది ప్రాణం.
ముఖంమీదికి టార్చ్‌లైట్ ఫోకస్ చేశాడు. దిగ్భ్రాంతితో ఒక్క అడుగు వెనక్కి వేశాడు.
“అనూరాధా!” అన్నాడు అప్రయత్నంగా.
“మీకు తెలుసా?” అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యంగా అడిగారు.
“తెలుసు. ఆమెకో పాప ఉండాలి. ఏది?” అన్నాడు.
ఆమె అతనికి బాగా పరిచయమని వాళ్ళకి నమ్మకం కలిగింది. ఏడుస్తూ అక్కడే కూర్చుని వున్న పన్నెండేళ్ళ పిల్లని ముందుకి తోసారు. కుతూహలంగా ఆ పిల్లని చూసాడు. ఇదే మొదటిసారి చూడటం. అనిర్వచనీయమైన భావమొకటి మనసులో కదిలింది.
“అనూరాధకి తోడుగా ఒక ముసలావిడ ఉండేది…?” సందిగ్ధంగా ఆగిపోయాడు.
“చనిపోయింది. మూడేళ్లయింది చనిపోయి”
ఆ విషయం తనకి ఎవరైనా చెప్పారో లేదో శ్రీరామ్‍కి గుర్తురాలేదు.
“అనూరాధ మీకేమౌతుంది?” ఎవరో అడిగారు..
“ఏమీ అవదు. పరిచయస్తురాలు”
“…”
“మరి ఏం చేద్దాం?” ఆ ఒక్క ప్రశ్నతో అనూరాధ చనిపోయిన విషయం తేటతెల్లమైంది. భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది.
“ఆమెకి ఎవరూ లేరు. కానిచ్చెయ్యండి” తనే మళ్లీ అన్నాడు.
“కర్మ మీరు చేస్తారా?”
“నా తల్లిదండ్రులిద్దరూ బతికి ఉన్నారు. నేను చెయ్యకూడదు”
“మరి ఎలా?”
“ఎవరు లేని వాళ్ళకి ఎలా చేస్తారో, అలాగే చెయ్యండి”.
“పాప?”
“ఇక్కడ ఎవరికైనా పెంచుకునే ఉద్దేశం ఉంటే సరే. లేకపోతే నాతో తీసుకెళ్తాను”
ఎవరూ మాట్లాడలేదు. పాపని తనే తీసుకెళ్లాలని అర్థమైంది. తెల్లారేదాకా అందరూ అక్కడే ఉన్నారు. ఎవరూ కదల్లేదు. ఎక్కడినుంచి వచ్చిందో, ఇక్కడ కన్నుమూసింది. ఏ జన్మ రుణమో! ముసలమ్మ ఉన్నప్పుడూ పోయాకా కూడా ఒకరితో మాట్లాడింది కాదు. ఒకరింటికి వచ్చింది కాదు. పెళ్లయిన వెంటనే భర్త పోయాడట. ఎంత దురదృష్టవంతురాలో! రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అనూరాధ కూతురు ఏడుస్తుంటే బుజ్జగిస్తున్నారు.
ఇంటిని పరీక్షగా చూశాడు శ్రీరామ్. ఒక్క గది, వరండా ఉన్న పెంకుటిల్లు. పెద్దగా సామాన్లేవీ లేవు. మూలన ఒక ట్రంకు పెట్టి, దానిమీద సూట్‍కేసూ, దండెంమీద నాలుగైదు చీరలు, కొద్దిపాటి గృహసామాగ్రి… చాలా క్లుప్తమైన జీవితం. ఆ తర్వాత ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. ఇవతలకి వచ్చి భార్య సెల్‍కి చేసాడు. ముఖ్యంగా అనూరాధ కూతుర్ని తనతో తీసుకెళ్లక తప్పని పరిస్థితి గురించి అతను చెప్తే
ఆమె అంతా విని, సంక్షిప్తంగా, “తీసుకుని అయితే రండి. వచ్చాక ఆలోచిద్దాం” అంది. ఆ క్లుప్తత అతన్ని ఇబ్బంది పెట్టింది.
రెండో కాల్ చేశాడు. అది కాలిఫోర్నియాలోని ఒక ఇంట్లో రింగ్ అయింది. కృష్ణవేణి ఎత్తింది. శ్రీరామ్ గొంతు విని సంతోషంగా “హాయ్!” అంది.
“యాదృచ్చికత అంటే ఏమిటో తెలుసునా వేణీ, నీకు? అనూరాధ కూతురు నా దగ్గరికి చేరుకోవడం” అన్నాడు.
ఆమె నివ్వెరపోయింది. “అనూరాధ!” విస్మయంగా అడిగింది. “ఎలా?”
“జస్ట్… కోఇన్సిడెన్స్”
“మీ…” ఆశ్చర్యంతో మాటలు రాలేదు చాలాసేపటిదాకా. “ఏం చెయ్యబోతున్నావు ఆ అమ్మాయిని?”
“మేనమామలు బాధ్యత తీసుకోరనుకుంటా. అనుకోవడం ఏమిటి, కచ్చితంగా తీసుకోరు. తన కాళ్లమీద తాను నిలబడేదాకా చదివిస్తాను. ఇంట్లో ఉంచటమా, హాస్టల్లో వెయ్యటమా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. వచ్చాక ఆలోచిద్దాం అంది నా భార్య”
“కంగ్రాట్స్”
“దేనికి?”
“నీ మ్యాడ్ నెస్ ని ఓపికగా భరించే భార్య దొరికినందుకు”
“ఒకప్పుడు నువ్వు కూడా భరించావుగా?”
కృష్ణవేణి నవ్వేసింది. శ్రీరామ్ తనుకూడా నవ్వి బై చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఆ ఇద్దరూ అనూరాధ జీవితానికి పునర్నిర్మాతలు.
వాన ఇంకా పడుతూనే ఉంది. శ్రీరామ్ మళ్లీ లోపలికి వచ్చాడు. అతనికో కుర్చీ తెచ్చి వేశారు. అందులో కూర్చున్నాడు.
చాలా సుదీర్ఘంగా అనిపించిన ఆ రాత్రి ఎలాగైతేనేం తెల్లవారింది. చకచక దహనసంస్కారానికి ఏర్పాట్లు చేశారు. అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం దాటింది. ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. పాపని తీసుకుని శ్రీరామ్ బయల్దేరాడు.
“నీ పేరు?” అడిగాడు కారులో ఎక్కేముందు.
“పూర్ణి… పూర్ణిమ” చెప్పిందా అమ్మాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పదేపదే తుడుచుకుంటోంది. కారులో కూర్చోగానే ఇంక ఆపుకోలేనట్టు బావురుమంది. శ్రీరామ్ గుండె ద్రవించింది. మృదువుగా ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ దగ్గరకు తీసుకున్నాడు. చాలాసేపు ఏడ్చి అలా ఏడుస్తూనే నిద్రపోయింది. వెనక సీట్లో పడుకోబెట్టి స్టీరింగు ముందు కూర్చున్నాడు.
కారు స్పీడందుకుంది. శ్రీరామ్ ఆలోచనలు అంతే వేగంగా సుదూర గతంలోకి దూసుకెళ్లాయి.


“గుడ్‍నైట్. ఇప్పటికే పదైంది. ఇంకా ఆలస్యం చేస్తే అమ్మాయి మమ్మల్ని తిట్టుకుంటుంది” అంటూ ఇచ్చి లేచారు శ్రీరామ్ స్నేహితులు.
అంతకుముందు రోజు అతని పెళ్లి జరిగింది. పెళ్లి ఇంట్లోనే మొదటి రాత్రి జరిపించే సంప్రదాయం ఆడపెళ్లివారికి ఉందట. అందుకని శ్రీరామ్ ఉండిపోయాడు. అతనితోపాటు కొద్దిమంది ముఖ్యమైన బంధువులు, ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఆగారు. అతని తల్లిదండ్రులు, మిగిలిన బంధువులు వెళ్లిపోయారు.
తమకని ఏర్పాటుచేసిన గదిలోకి అడుగుపెట్టాడు శ్రీరామ్. విశాలమైన గది. మధ్యలో డబల్ కాట్, దానిమీద మెత్తని బూరుగుదూది పరుపులు, తెల్లటి దుప్పట్లు, గదినిండా పల్చగా అలముకున్న చందనపరిమళం… కిటికీలోకి జాజిలత అల్లుకుని ఉంది. నక్షత్రాలు వెదజిమ్మినట్టు పూలు విచ్చుకుని ఉన్నాయి. గాలితెమ్మెర మంద్రంగా కదులుతూ పూలసుగంధాన్ని గదిలోకి మోసుకొస్తోంది. జాజిరెమ్మల సందుల్లోంచి చంద్ర కిరణాలు దోబూచులాడుతున్నాయి. శ్రీరామ్ మనసంతా ఉద్విగ్నత నిండిపోయింది. తర్వాత చిన్నగా నవ్వు వచ్చింది.
ఎమ్మెస్ చదివాడు తను. స్త్రీ పురుషుల శరీర నిర్మాణం గురించి, పునరుత్పత్తి చర్యల గురించి కుణ్ణంగా తెలుసు. అన్నీ తెలిసీ తామిద్దరి మధ్య ఏం జరగబోతోందో అర్థమై ఇంకా తనకెందుకీ భావోద్వేగం?
టైం చూసుకున్నాడు. పదింబావు. ఇంకా రాలేదేమిటి? ఆలోచనలు మరోవైపు సాగాయి. మెడిసిన్లో చేరిన కొత్తలో క్లాసు జరుగుతోంటే-
“వాస్ ఎఫరెన్స్‌లోకి విడుదలయిన స్పెర్మటోజోవా వాస్ డిఫరెన్స్‌లోకి, అక్కడినుంచి యురెత్రాలోకి వెళ్తుంది. సరే, ఫెలోపియన్ ట్యూబ్‍లో ఉన్న వోవమ్‍ని ఎలా చేరుతుంది? వేరు వేరు వ్యక్తులు కదా? ఎలా సాధ్యం?” వెనకనుంచీ సన్నటి గొంతు.
తను తల తిప్పి పక్కకి చూసాడు. కృష్ణవేణి. ఎంసెట్లో ముప్పయ్యైదో ర్యాంకు. ఆమెకు ఇది తెలియదా? లేక ఆకతాయితనానికి అడుగుతోందా? బాప్ రే!
ఆ అమ్మాయి ముఖంలో అభ్యర్ధన… ప్లీజ్, చెప్పవా అన్నట్టు.
ఆమె తనకి కొత్తగా పరిచయం ఏం కాదు. ఎల్‍కేజీనుంచి ఐదోతరగతిదాకా ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ స్కూలు స్టాండర్డ్ పడిపోవడంతో వేర్వేరు స్కూల్స్‌కి మారిపోయారు. ఇళ్ళు దగ్గిరే. రోజుకి పదిసార్లు ఎదురు పడుతూనే ఉంటారు.
“మాది మిషనరీ స్కూల్ కదా, పునరుత్పత్తి గురించి చెప్పరట. అసలేం చెప్పలేదు. పదో తరగతిలో నేనే చదువుకుని పరీక్షలకి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఇంటర్లో కూడా ఈ డౌటు క్లియర్ అవలేదు” అమాయకంగా అంది.
నిజానికి శ్రీరామ్‍కి కూడా ఆ సందేహం పదోతరగతిలో వచ్చింది. వానపాము మేటింగ్ ప్రాసెస్ గురించి చెప్పినట్టు మనుషుల గురించి చెప్పరు. స్కూల్లో సైన్స్‌కి లేడీటీచర్. ఆమె మొదటే చెప్పింది, ఎవరూ ఏ డౌట్లూ అడగకూడదని. ఎవరో తరుముకొస్తున్నట్టు పాఠం పూర్తి చేసింది.
తండ్రిని అడిగాడు. ఆ సమయానికి తల్లి పక్కనే ఉంది. ఏదో పనున్నట్టు లేచు వెళ్ళిపోయింది. తండ్రి కొద్దినిమిషాలు ఆలోచించి చెప్పాడు,
” ప్రాక్టికల్స్‌దాకా వెళ్ళనంటే చెప్తాను” అని.
తను అలాగే ప్రమాణం చేశాడు.
“మిగిలిన అన్ని జంతువులలాగే మేటింగ్ ద్వారా… అంతే. అయితే సృష్టిలో మనది జంతువులు, క్రిమికీటకాలు వీటన్నిటికన్నా చాలా పై స్థాయి. కాబట్టి మన అనుభవంతోటి, ఆలోచనాశక్తితోటి కొన్నింటిని శోధించి తెలుసుకుని, వాటిని నిర్ధారించుకుని కొన్ని పద్ధతులను ఏర్పరచుకున్నాం. సమాజాన్ని నిర్మించుకుని సంఘటితంగా బతుకుతున్నాం. సురక్షితమైన సంఘజీవనానికి పెళ్లి అనేది పునాది. అదొక ఎంపిక పద్ధతి. పుట్టుక కాకతాళీయం కావచ్చు. కానీ పుట్టే జీవి శరీరంలోని జన్యుపదార్ధం ఏదై ఉండాలనేది మాత్రం కాకతాళీయం కాకూడదు. కులగోత్రాలు, మతవిశ్వాసాలు మనలో మనం తన్నుకు చావడానికి కాదు. పెళ్లి అనే ఎంపిక పద్ధతికి ఇవి వర్గీకరణ సూత్రాలు. పెళ్లి ద్వారా స్త్రీపురుషులని ఎంచుకుని మేటింగ్‍కి అనుమతిస్తారు. ఈ పద్ధతిని కొంతమంది వ్యక్తులు అతిక్రమించడం వల్ల ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అంటే ఎయిడ్స్, హెచ్ఐవి ఇలాంటివి ఒకవైపు, సామాజిక సమస్యలు మరోవైపు. స్త్రీలపట్ల అత్యాచారాలు, వీధిపిల్లలు… వీధుల్లో తిరిగే అనాథ పిల్లల్ని సభ్యసమాజం వదులుకుంటుందిగానీ నేరప్రపంచం వదులుకోదు” అని తన వయస్సుకి అర్ధమయ్యేలా వివరంగా చెప్పాడు.
క్రమంగా తనకు చాలా అర్ధమయ్యాయి. ప్రేమ, దాని తర్వాతది ఒక అద్భుతమైన అనుభవం అని పురుగు తనచుట్టూ గూడు కట్టుకున్నట్టు మనిషి తన చుట్టూ ఒక భ్రమని ఏర్పరచుకున్నాడు. ఆ భ్రమని ఛేదించుకోగలిగినరోజున అలాంటి పరిణితి వచ్చిన రోజున ఇప్పుడున్న ఈ అపసవ్యత తొలగిపోతుందని ఓ నమ్మకం ఏర్పడింది.
అయితే ఇవన్నీ కృష్ణవేణితో- తండ్రి తనతో చెప్పినంత వివరంగా చెప్పలేకపోయాడు. సామాజిక జీవనంపట్ల తనకి కలిగిన అవగాహనని వ్యక్త పరచలేకపోయాడు. కొంత చెప్పాడు.
“ఎలా? ఇద్దరూ విడివిడిగా ఉంటారు కదా?” అంటుంది.
ఇంటర్నెట్‍నుంచి ఫ్లాపీలోకి డౌన్లోడ్ చేసి ఇచ్చాడు.
“హౌ అబ్సర్డ్” అంది అసహ్యంగా.
“నువ్వు తెలుగు సినిమాలు చూడవా?”
“అసలు టీవీయే చూడనివ్వరు మా ఇంట్లో”
ఇద్దరూ కొద్ది రోజులు ఆ విషయంమీద చర్చించుకునేవారు. ఇద్దరికీ లైంగికస్పృహ ఉండేది కాదు. ఆమె అసహ్యం అనేది. కాదనేవాడు తను. ఎలా కాదో చెప్పలేకపోయేవాడు. మానవజాతి అభివృద్ధికి అవసరమైన ప్రక్రియ ఎలా అవుతుంది? కాదనే తనకి నమ్మకం. ఆమెని వప్పించలేకపోయేవాడు. హిట్లర్, రెండో ప్రపంచ యుద్ధం, సద్దాం హుస్సేన్, బుష్, ప్రపంచం, అమెరికాల్లాగే అదీ ఒక చర్చాంశం. అంతే.
క్రమంగా చర్చ ఆపేసి ఇద్దరూ చదువులో మునిగిపోయారు. ఆఖరి సంవత్సరం అయ్యేసరికి ఆమెలో చాలా పరిణితి వచ్చింది.
ఇంటర్న్‌షిప్ పూర్తి అవుతుండగా తాను ప్రతిపాదించాడు. “మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది?”
“అసలేం బావుండదు” వెంటనే వీటో చేసింది.
“ఏం? ఇద్దరం కలిసి ఎం ఎస్ చెయ్యొచ్చు”
“మరోలా అనుకోకు. అన్నీ ఓపెన్‍గా మాట్లాడుకున్నాం. నాకెందుకో నీపట్ల రొమాంటిక్ ఫీలింగ్ కలగడం లేదు. పెళ్లికి అది చాలా అవసరం. లేకపోతే యంత్రాల్లా మారిపోతాం” అంది.
తనకీ ఆమెపట్ల అనురాగం, ప్రేమలాంటివేవీ లేవనే విషయం అప్పుడు అర్థమైంది. ఆమె తిరస్కారంవలన ఎలాంటి బాధ కలగలేదు. ఇద్దరూ కలిసి ఒక విషయాన్ని శోధించి తెలుసుకున్నారు. ఇద్దరు విద్యార్థులకీ, ఇద్దరు శాస్త్రవేత్తలకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటిదే తమ మధ్య కూడా ఉందనిపించింది. అది ప్రేమ కాదు. అవినాభావత్వం కూడా కాదు. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి రాగద్వేషాలు వాళ్ళవి.
తర్వాత మళ్లీ ఎప్పుడూ తమ మధ్య ఆ ప్రసక్తి రాలేదు. దాని తాలూకు జ్ఞాపకం బాధ మిగల్చలేదు.
ఇద్దరిదీ ఎమ్మెస్ పూర్తయింది. ఆమె అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు. తండ్రి చనిపోయాడు అన్నలతో సర్దుబాటవక తల్లిని తీసుకుని వేరే వచ్చేసింది. సొంతంగా ఇల్లు, ప్రాక్టీసు.
తనకి ఎంతోకాలం పెళ్లి ధ్యాస కలగలేదు. తినటానికీ తాగడానికీ కూడా సమయం లేనంత ఉరుకులు పరుగుల జీవితంలో అదొక అనవసరపు బాధ్యతలా అనిపించింది. కానీ తల్లిదండ్రులు వదిలిపెట్టలేదు. ఎన్నో సంబంధాలు వెతికి వెతికి ఆఖరికి అనురాధని చూపించారు. తన అభిప్రాయం మారింది. ఇదిగో ఇప్పుడు పెళ్లి, మొదటి రాత్రి…

(India Today 8/2003)