పునరపి – 2 by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

గది బయట సన్నగా అడుగుల చప్పుడు, గాజుల గలగలలు, పట్టుచీరల రెపరెపలు. మల్లెపూల సుగందం… ఆమెని గదిలోకి పంపి బయట గొళ్ళెం పెట్టిన చప్పుడు. ఆమె తలుపువైపుకి తిరిగి ఉంది. లోపల్నుంచి గొళ్ళెం పెట్టింది. ఇటు తిరుగుతుంది అనుకున్నాడు. కానీ లేదు. ఆమె భుజాలు కదులుతుంటే ఏడుస్తుందని అర్ధమైంది. అతను చకితుడయ్యాడు. భయపడుతోందా? ఫ్రిజిడా? వేణిలా ఏమీ తెలీదా?
“అనూరాధా!” మృదువుగా పిలుస్తూ ఆమె దిశగా నడిచాడు.
“వద్దు. నా దగ్గరికి రావద్దు” ఆమె దిగ్గుమని ఇటు తిరిగింది. ఏడుస్తూనే చేతుల్లో ముఖం కప్పుకుని తలుపులకు జారబడి కిందికి జారుతూ కుప్పకూలింది.
భయం కాదు. మరి?
“నాకు పెళ్లయింది. ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాను. అతన్ని చంపేసి బలవంతంగా ఈ పెళ్లి చేశారు. అతన్ని వాళ్లు చంపేశారు
చం…పే… శా…రు. నా కళ్ళముందే కొట్టి చంపేశారు” విహ్వలంగా ఏడుస్తోంది. బహుశా మొదటిసారి వైధవ్యపు దుఃఖాన్ని అనుభవించగలిగే అవకాశం దొరికిందేమో! చాలా హిస్టీరిగ్గా ఉంది. మధ్యలో నెత్తి కొట్టుకుంటోంది. పిడికిళ్ళు బిగబట్టి నుదుటిని బాదుకుంటోంది. చెలియలికట్ట దాటిన సముద్రంలా, కట్టలు తెంచుకున్న వరద ప్రవాహంలా ఉంది ఆమె దుఃఖం. క్షణక్షణానికీ ఆ ఏడుపు వుధృతమౌతోంది. దిగంతాలని తాకే స్థాయిని చేరుకుంది.
“నేను చచ్చిపోతాను” తల గోడకేసి కొట్టుకుంటోంది.
శ్రీరామ్‍కి ఏం చేయాలో తోచలేదు. చేష్టలు దక్కి, అలా బొమ్మలా నిలబడిపోయాడు. ప్రేమ కథ… విషాదాంతమైన ప్రేమకథ… తనకి సంబంధం లేకపోయినా ఆక్టోపస్‍లా చుట్టుకుపోతోంది.
ఎవరీ అనూరాధ? తనకి భార్య, కాళ్ల పారాణి ఆరలేదు. బుగ్గన చుక్క ఇంకా చెరగలేదు. తను ఎదురుగానే ఉన్నాడు. కానీ ఆమె మరెవరికో భార్యనని చెస్తోంది. అతని వైధవ్యపు దుఃఖాన్ని అనుభవిస్తోంది. తను ఏం చేయాలి? ఆమె చావు ఆమెదని వదిలేయాలా? ఓదార్చాలా? ఏది, తండ్రి తనకు చెప్పిన ధర్మం?
అవతల ఎవరో నిలబడి ఇదంతా విన్నట్టున్నారు. తలుపులు దబదబా బాదిన చప్పుడు. అతను తేరుకున్నాడు.
“లే. జరుగు. తలుపు తీయకుండా ఎలా?” అన్నాడు కఠినంగా ఆమె బెదరి కొద్దిగా జరిగింది. అతనిలా బోల్ట్ తీసాడో లేదో ధడేల్మని తలుపు తెరుచుకుంది. ఆ విసురుకి అంతదూరం వెళ్ళి పడింది. ఆమె ఇద్దరు అన్నలు, తండ్రి లోపలికి అడుగు పెట్టారు.
“ఎందుకే ఆ ఏడుపు? ఎవరు చచ్చారనే? చక్కగా పెళ్లి చేస్తే వాడివడో చచ్చాడని ఏడుస్తావేమే? ఎవడి వాడు? మా పరువు బజారున పెడుతున్నావుకదే పాపిష్టిదానా? వాడితోపాటు నిన్ను కూడా చంపేస్తే పీడా పోయేది. బజారున పడతామని భయపడ్డాము. అసలు నువ్వు పుట్టగానే వచ్చినా బావుండేది. ఈ పదిరోజులూ నోరెత్తకుండా ఉంటే ఉంటే మేమే చంపి పూడ్చి పెట్టేసేవాళ్ళం” వాళ్లు ఆమెని తిడుతూ తంతున్నారు. కొడుతున్నారు. జుట్టు పట్టి గుంజి వీపుమీద బాదుతున్నారు. ఆమె జంతువులా మూలుగుతోంది.
శ్రీరామ్ రక్తం గడ్డకట్టింది. తాత్కాలికమైన నిష్క్రియాపరత్వం చోటుచేసుకుంది. విశాలమైన మ్యారేజ్ హాల్, బాజాభజంత్రీలు, తెల్లటి మధుపర్కాలలో తను, ఆమె. విశాలమైన ఈ శోభనం గది… అందమైన దృశ్యాలన్నీ మాయలఫకీరు మాయలోలాగ చెదిరి అదృశ్యమైపోయాయి. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఆమె తండ్రి, బావగారూ అంటూ వెంటవెంట తిరిగి మర్యాదలు చేసిన ఆమె అన్నలు మారురూపాలు తీసేసిన రాక్షసుల్లా ఆమెమీద పడి కొడుతున్నారు. చంపిస్తారా? ఆమెని చంపేందుకే ఈ పెళ్లి చేశారా? తనేం చేయాలి? ఇప్పుడు ? కోపం తెచ్చుకోవాలా? ఎవరిమీద? ఒక్క ఉదుటున వెళ్లి అసంకల్పిత చర్యలా వాళ్ళ ముగ్గురినీ నెట్టేశాడు. నేలమీద ముద్దలా పడి ఉన్న ఆమెని రెక్కపట్టి లేవదీసి ఇవతలికి తీసుకొచ్చాడు.
అప్పటికి పెళ్లింట్లోని బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అనూరాధ తల్లి అతని కాళ్లని చుట్టుకుపోయింది. ఆవిడని విదిలించుకుని ముందుకు నడిచాడు. అంతా ఏదో జరగబోతోందని పుత్కంఠగా చూశారు. ఆడపెళ్లివారికి ఈ పెళ్లిలో ఏదో లొసుగు ఉందని తెలుసు. కానీ భయానికి నోరు విప్పలేదు. అనూరాధ తండ్రి చాలా పలుకుబడి కలవాడు. మగపెళ్ళివారు ఇప్పుడు అదేంటో తెలుసుకుంటున్నారు. నిశ్చేష్టులై చూస్తున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు.
“బాబాయ్! రిసెప్షన్ ఏర్పాట్లు మానేయమని అమ్మావాళ్లకి ఫోన్ చేసి చెప్పండి. అందరూ బయలుదేరి పొండి. ఈ పెళ్లి పెద్ద నాటకం. మనల్ని మోసం చేశారు. అదేంటో తేల్చుకుంటాను” అంటూ అనూరాధని అలాగే లాక్కెళ్ళి వెనుక సీట్లోకి తోసి తను డ్రైవింగ్ సీట్లో కూలబడి కారు స్టార్ట్ చేసాడు.
అర్ధరాత్రి చిమ్మచీకటిని చీల్చుకుంటూ కారు దూసుకుపోయింది. వెనుక సీట్లోంచి ఆమె ఏడుపు వినిపిస్తోంది. అతన్ని చికాకు పెడుతోంది. అక్కడ తన తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుంటారు. బంధువులంతా అక్కడే ఉన్నారు. ఏర్పాట్లు ఆపమన్న వార్త వెళ్లిపోయి ఉంటుంది. ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఇప్పుడా బంధువుల తాకిడిని ఎదుర్కోగలడా, తను? అసలీ అనూరాధని ఎందుకు తీసుకొచ్చాడు? ఏదో ఉద్వేగంతో, ఆవేశంతో తీసుకొచ్చాడుగానీ తనని ఆమెగానీ ఆమెని తనుగానీ స్వీకరించగలరా? మెదడు కాగిపోయేలా ఆలోచనలు. ఊరి పొలిమేరల్లోకి వచ్చాక అతని గమ్యం మారింది.
తెలతెలవారుతుంటే గేటు ముందు ఆగిన కారుని, అందులోంచి దిగిన శ్రీరామ్‍ని అప్పుడే నిద్రలేచి ఇవతలికి వచ్చిన కృష్ణవేణి ఆశ్చర్యంగా చూసింది. రాత్రంతా నిద్రలేక అలసటగా కనిపిస్తున్నాడు శ్రీరామ్. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. కృష్ణవేణిని చూడగానే అతనికి ఎడారిలో వయాసిస్సుని చూసినట్టు అనిపించింది.
“పెళ్లి అనే అందమైన కలగన్నాను వేణీ! అది చెదిరిపోయింది…. తిరిగి కూడగట్టుకోలేనంతగా” అన్నాడు ఆవేదనగా.
“శ్రీరామ్!”
“ఆమె వెనక సీట్లో ఉంది. నిద్రపోతోందేమో! లేకపోతే ఏడ్చేడ్చి సొమ్మసిల్లిపోయిందో! క్లినిక్‍లో ఎవరైనా ఉంటే లోపలికి తీసుకెళ్ళమను”
“అసలేం జరిగింది?”
“అమ్మనీ నాన్ననీ ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి” ఆమె అడిగినవేవీ అతని మెదడుకి అందడం లేదు. ఏం చేయాలని ప్రయాణమంతా ఆలోచించుకోగలిగాడో అవి మాత్రమే చెప్పి తాను నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లి విజిటర్స్ రూమ్‍లో కూర్చున్నాడు రెండు అరచేతుల్లో ముఖం దాచుకుని. అరగంట తర్వాత వేణి చెయ్యి అతని భుజంమీద పడింది. ఈ వ్యవధిలో చాలా జరిగింది.
కృష్ణవేణి కుతూహలంగా కాదు వెనక విండోలోంచి లోపలికి చూసింది. ఏడ్చేడ్చి అలసిపోయినట్టు అస్తవ్యస్తంగా కూర్చున్న అనూరాధ కనిపించింది.
“దిగండి. రండి” అంది కృష్ణవేణి ఆమెతో.
ఆమె మౌనంగా డోర్ తెరుచుకుని దిగి వచ్చింది. ఆమె రూపాన్ని చూసి కృష్ణవేణి స్థాణువైంది, చేతులకు ఉన్న గాజుగాజులు చిట్లిపోయి చేతులనిండా గీరుకున్నాయి. ఒకట్రెండు బంగారు గాజులు కూడా వంకర తిరిగాయి. జుట్టంతా చెదిరిపోయి పూలదండలు, దారాలు వేలాడుతున్నాయి. చీర నలిగిపోయింది. శరీరం బహిర్గతమవుతున్న చోటంతా కమిలినట్టు దెబ్బలు. రోజున్నర క్రితం పీటలమిద చూసింది యీమెనేనా? ఆ పెళ్లికూతురేనా? అసలేం జరిగింది? ఈ రాకేంటి?
చేతుల గాయాలు తుడిచి ఆయింట్‍మెంట్ రాసింది. ఒక్కసారి చైతన్యంలోకి వచ్చినట్టు మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది అనూరాధ.
“పెథెడిన్ ఇవ్వు” విసుగ్గా అన్నాడు శ్రీరామ్ తనున్నచోటునుంచే. బెడ్ మీద పడుకోబెట్టి మైల్డ్ డోస్ ఇచ్చింది కృష్ణవేణి. ఇంజక్షన్ ప్రభావంతో అనూరాధ కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంది.
వచ్చి శ్రీరాం పక్కన కూర్చుంది. అతను చెప్పినట్టు అతని తల్లిదండ్రులకి ఫోన్ చేసింది. రిసెప్షన్ ఏర్పాట్లు ఆపమన్న ఒక్క వార్త తప్ప ఇంకేమీ తెలియక విషయం ఏమిటో అర్థం అవ్వక వాళ్లు తల్లడిల్లుతున్నారు. ఏం జరిగిందో తెలియక అయోమయం. కృష్ణవేణి చెప్పగానే వెంటనే బయలుదేరి వస్తున్నామని చెప్పారు.
“పద, లోపల కూర్చుందాం”అంది.
“అమ్మావాళ్లూ వస్తున్నారా?”
“బయలుదేరుతున్నామని చెప్పారు”
“చాలా అలిసిపోయాను వేణి!”
“ఒక్క అనుభవానికే? అసలేం జరిగింది? లోపలికి పద. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కో, కాఫీ ఇస్తాను” అంది. అతను చిన్నగా నిట్టూర్చి లేచాడు. ఆమె చెప్పినట్టు ముఖం కడుక్కుని కాఫీ తాగితే ఫ్రెష్‍గా అనిపించింది. అప్పుడు చెప్పాడు. జరిగినదాన్ని క్లుప్తంగా,
కృష్ణవేణి దిమ్మెరపోయింది. పెళ్లికీ స్త్రీపురుష సంబంధాలకీ ఎంతో ప్రాధాన్యతనిచ్చే శ్రీరామ్ విషయంలోనే ఇలా జరగడం వింత కాకపోతే మరేమిటి?
“ఇప్పుడు ఏం చేద్దామని శ్రీరామ్? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు?”
“నేను తీసురాకపోతే వాళ్లు ఆమెని చంపేసేవాళ్ళు”
“నీకసలు ఫీలింగ్స్ ఉండవా? ఆరోజున పెద్ద రుషిపుంగవుడిలా నాకు పునరుత్పత్తి విధానాన్ని గురించి చెప్పావు. ఈ రోజున ఇంత జరిగాక కూడా ఆమెని వెంటపెట్టుకుని వచ్చావు. భార్యగా స్వీకరిస్తావా?”
వెంటనే జవాబు చెప్పలేదు అతను. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తనేమీ సంఘసంస్కర్త కాదు. ఒక వితంతువునో, ప్రేమించి మోసపోయిన అమ్మాయినో చేసుకుని ఉద్దరించాలనుకోలేదు. పెళ్లి విషయమై అందమైన ఊహలు కలిగాయి. తాను చేసుకోబోయే అమ్మాయి తనకి బాగా పరిచయమున్న ఇద్దరే ఇద్దరు స్త్రీలు- తల్లి, కృష్ణవేణి- వాళ్ళలాగా ఉండాలనుకున్నాడు. ఏ కోణంనుంచి అంటే దానికికూడా తన దగ్గర జవాబు ఉంది. ఆ ఇద్దరి సమక్షంలో ఎంత సంతోషంగా ఉంటుందో ఆమె దగ్గర కూడా అలాగే ఉండాలని ఆశించాడు. విధివశాత్తు అనూరాధ తన జీవితంలోకి అడుగు పెట్టింది. ఆమె అంతరంగిక ప్రపంచంలోకి తనకి ప్రవేశం లేదు. తనామెని స్వీకరించడానికి మనసు సంసిద్ధం చేసుకున్నా ఆమె తనని స్వీకరించదు.
“ఏమిటి. మాట్లాడవు?” కృష్ణవేణి రెట్టించింది.
“ఏం మాట్లాడను?”
“నేను అడిగినదానికి జవాబు?”
“సాధ్యపడదనుకుంటాను”
“మరి?
“నాదగ్గర ఉంచి వెళ్ళు. శ్రీరామ్ కొంచెం కుదుటపడ్డాక నెమ్మదిగా అడుగుతాను ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో, ఏం చేయాలనుకుంటుందో! ఆమెని మీ ఇంటికి తీసుకెళ్లి అందరికీ నీ భార్యగా చూపించి అనవసరమైన చర్చలకి అవకాశం ఇవ్వటం ఎందుకు? రిసెప్షన్‍కోసం వచ్చిన బంధువులకి అక్కడేదో గొడవ జరిగిందని సర్ది చెప్పితే సరిపోతుంది. ఇంకా రానివాళ్ళకి ఫోన్ చేసి ఆగిపొమ్మనండి”
“వేణీ!” అతను విచలితుడయ్యాడు. స్నేహం ఇంత బాధ్యతని నెత్తిమీద వేసుకుంటుందా?
“ఆలోచించు శ్రీరామ్! అమ్మ లేదు. చిన్న వదినకి ఒంట్లో బాగాలేకపోతే చూడటానికి వెళ్లింది. ఆవిడ ఉన్నా ఇంతే చెప్పేది. అనూరాధ కూడా షాకులో ఉన్నట్టుంది. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచి వైద్యం చేస్తాను. ఈలోగా వాళ్లవైపునుంచో మనవైపునుంచో ఏదో ఒకటి జరుగుతుంది” అంది.
శ్రీరామ్‍కి అంతకన్నా మార్గాంతరం కనిపించలేదు. కొద్దిసేపటికి అతని తల్లిదండ్రులు వచ్చారు. విషయమంతా విన్నారు. కోపాలు వచ్చాయి.
“మోసం చేయడానికి మనమే దొరికామా!” ఆగ్రహంగా అంది శ్రీరామ్ తల్లి. అనూరాధని కూడా తీసుకువచ్చినందుకు అతన్ని కోప్పడింది. ప్రధమ కోపాలూ, ఆవేశాలూ చల్లారాక అనూరాధని తమతో ఎలా తీసుకెళ్లాలనే ప్రశ్న ఉత్పన్నమైంది వాళ్ళిద్దరిలో కూడా. కృష్ణవేణి ప్రతిపాదనని చెప్పాడు శ్రీరామ్.
కృష్ణవేణిని ఇబ్బంది పెట్టడం వాళ్లకి సమ్మతంగా అనిపించలేదు. కొంత తర్జన భర్జన జరిగాక అదే మంచిదనిపించింది. శ్రీరామ్‍ని తీసుకుని వాళ్లు వెళ్లారు.
కృష్ణవేణి ఆశించినట్టు అనూరాధవైపునుంచి ఎవరూ రాలేదు. నిండా మునిగినవాడికి చలేమిటన్నట్టు ఊరుకున్నారు. తీసుకెళ్లినది శ్రీరామ్ కాబట్టి వుంచుకున్నా చంపుకున్నా అతనిదే బాధ్యతన్నట్టు వదిలేశారు. పైగా, ఏ మొహంతో అతన్ని వచ్చి బతిమాలతారు? ఆడపిల్లలంటే ఎంత వివక్షతో అనిపించింది కృష్ణవేణికి, అనూరాధపట్ల స్త్రీ సహజమైన జాలి కలిగింది.
స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షిస్తారు కాబట్టి ఆమెకి స్వతంత్రం అక్కర్లేదనేస్తారు. కానీ, మాధవికి యయాతిలాంటి తండ్రి, కైకకి దశరథుడిలాంటి భర్త, రేణుకాదేవికి పరశురాముడిలాంటి కొడుకు ఉంటే ఆ రక్షణకి అర్థమేమిటి?
యయాతి కూతురు మాధవి.
గాలవుడు విశ్వామిత్రుడి శిష్యుడు. గురుదక్షిణ కోసం గాలవుడు యయాతిని ఎనిమిదివేల ఆవులు ఇమ్మని అడుగుతాడు. యయాతి ఆరువేలు మాత్రమే ఇవ్వగలవుతాడు. మిగిలిన రెండువేలకి బదులుగా తనకి ఒక అప్సరస ద్వారా కలిగిన కూతురైన మాధవిని ఇస్తాడు. గాలవుడు ఆమెని వినియోగించుకుని ఒక కొడుకుని కంటాడు తర్వాత ఒక రాజు దగ్గరకు పంపిస్తాడు. ఆ రాజుకి కొడుకు పుట్టాక అతను ఇవ్వగలిగినన్ని ఆవుల్ని తీసుకుని, మరొక రాజుకి అప్పగిస్తాడు. అలా తనకి కావల్సినన్ని ఆవులు సమకూరేదాకా నలుగురు రాజులకి ఆమెని ఇస్తాడు. చివరికి యయాతి దగ్గర వదిలిపెడతాడు.
దశరధుడికి పిల్లలు లేరు. కైకకి పుట్టబోయే సంతానానికి రాజ్యం ఇస్తానని చెప్పి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఆపైన అడగకుండానే అతను ఇచ్చిన వరాలు రెండు ఉన్నాయి. రాచరికంలో చావు పుట్టుకలు, మాన మర్యాదలు అన్నీ రాజ్యంతోనే ముడిపడి ఉంటాయి. కైకేయి తన కొడుక్కి సహజంగానే రాజ్యం కావాలనుకుంది. హక్కులని ప్రకటించింది. ఉత్పాతం జరిగింది. రామరావణ యుద్ధానికి నాందీ ప్రస్తావన జరిగింది.
రేణుకాదేవి జమదగ్ని భార్య, ఆయనకి ఆవిడ పాతివ్రత్యం మీద అనుమానం కలిగింది. ఆమెను నరికి రమ్మని కొడుకులని ఆదేశిస్తే పరశురాముడు తప్ప ఇంకెవరూ ముందుకి రారు. అతడు తల్లిని నరుకుతాడు. జమదగ్ని కొడుకు యొక్క పితృభక్తికి సంతోషించి వరం ఇవ్వటం, పరశురాముడు తల్లిని బతికించమనడం వేరే విషయాలు. కానీ, తల్లిమీదకి గొడ్డలివెత్తిన కొడుకు… సంరక్షణ అంటే ఇదేనా?.
ఈ పురాణాలనీ, సాంప్రయాలనీ తప్పించుకోలేకపోతున్నారు ఆడవాళ్లు. స్త్రీ తన మాన విత్త ప్రాణాలమీది ఆశలన్నీ వదిలేస్తే అప్పుడు మగవాడు ఆమెపట్ల కొంత దయగాను, ఉదారంగాను ప్రవర్తిస్తాడేమో!
కూతురిని అపురూపంగా పెంచి ఆమెకి నచ్చినవాడిని కాకుండా, తనకి నచ్చినవాడిని వెతికి తీసుకొచ్చి ఆమెని సాలంకృతంగా స్త్రీ ధనంతో సమేతంగా దానం ఇస్తాడు. తనకి అనుకూలంగా ఉన్నంతకాలం భార్య చేసే గృహశ్రమని భర్తగా స్వీకరిస్తాడు. తనకీ, తన కుటుంబానికీ ఉపయోగపడుతుందనుకుంటే వృద్ధాప్యంలో కొడుకై ఆమెకింత ఆశ్రయమిచ్చి తిండి పెడతాడు. ఆమె వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని చూస్తే మాత్రం మగవాడు పశువో రాక్షసుడో అవుతాడు. స్త్రీకి కష్టం వస్తే అయినవాళ్ళెవరూ ఆశ్రయం ఇవ్వరు. స్నేహితులో సేవాసంస్థలో ముందుకు రావాలి. మగవాళ్ళకి అవసరం లేని రక్షణ గృహాలు, వృద్ధాశ్రమాలు స్త్రీలకే అవసరం.
అనూరాధకోసం ఏదైనా చేయాలనుకుంది కృష్ణవేణి. ఆమె సమస్యని పరిష్కరించడంలో శ్రీరామ్‍కి అండగా నిలబడాలనుకుంది.

(ఇంకా వుంది)