రష్యన్ మూలం: ANTON P. CHEKHOV
The story was originally Published in Russian in the year 1889 with the romanised name, “Pari” and translated into English by Constance Garnett
అదొక శరద్రాత్రి.
పదిహేనేళ్ళక్రితం ఇదే శరదృతువు. ఇలాంటిదే ఒక రాత్రి. ముసలి బ్యాంకర్ విందు ఇచ్చాడు. దాని జ్ఞాపకాలు మనసులో చెలరేగిపోతుంటే స్టడీరూంలో ఈమూలనుండి ఆమూలదాకా నడుస్తున్నాడు. చాలమంది మేథావులు ఆ విందుకి వచ్చారు. బాగా చదువుకున్నవారితోపాటు పాత్రికేయులుకూడా వున్నారక్కడ. ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. అనేక విషయాలతోపాటు మరణశిక్షగురించికూడా చర్చించుకున్నారు. దాదాపుగా అందరూ మరణశిక్షపట్ల అసంతృప్తిని వెలిబుచ్చారు. అదొక ఆటవికమైన, కాలం చెల్లిపోయిన శిక్ష అనీ, ఒక క్రైస్తవదేశానికి ఏమాత్రం నప్పదనీ, అంతకన్నా యావజ్జీవఖైదు మంచిదనీ అంతటా అదే వుండాలనీ అభిప్రాయపడ్డారు.
“నేను మీతో ఏకీభవించను” బ్యాంకరు చెప్పాడు. “నేను స్వయంగా ఈ రెండిట్లో ఏదీ అనుభవించకపోయినా సైద్ధాంతికంగా ఆలోచిస్తే యావజ్జీవఖైదుకన్నా మరణశిక్ష నైతికమైనదీ, మానవీయమైనదీను. మరణశిక్ష వెంటనే ప్రాణం తీస్తే, ఖైదు కొద్దికొద్దిగా, నిరంతరాయంగా చంపుతుంది. కాదంటారా?” అని అడిగాడు.
“రెండూ అనైతికమైనవే. సరిసమానంగా. ఒకటి ఎక్కువా ఇంకొకటి తక్కువా కాదు. రెండిటి ధ్యేయం ఒకటే. మనిషిని చంపటం. రాజ్యం అనేది దేవుడు కాదు, రేపెప్పుడేనా తిరిగి ఇవ్వాలనుకున్నా తిరిగి ఇవ్వలేనిదాన్ని తీసుకోవటానికి ” అతిథుల్లో ఒకరు అన్నారు. ఈ చర్చలో వున్నవాళ్ళలో ఒక లాయరు కూడా వున్నాడు. సుమారు ఇరవయ్యైదేళ్ళవాడు.
“తమరి అభిప్రాయమేమిటి మిత్రమా?” అని ఎవరో అడిగారు.
“రెండూ అనైతికమైనవేకానీ, రెండిటిలోంచీ ఎంచుకోమంటే నేను మాత్రం జీవితఖైదునే ఎంచుకుంటాను. పూర్తిగా చచ్చిపోవటంకన్నా, ఏదో ఒకలా బతికుండటం మంచిదంటాను” అన్నాడు.
వాతావరణం కొద్దిగా వేడెక్కింది. బ్యాంకరు అప్పటికి కాస్త చిన్నవాడు. దుడుకురక్తంతో వున్నాడు. ఆ మాటలకి మహాకోపం వచ్చేసింది. పిడికిలి బిగించి టేబుల్మీద బలంగా కొడుతూ యువలాయరుకేసి తిరిగి గట్టిగా అన్నాడు. “అబద్ధం. నేను రెండుమిలియన్ రూబుళ్ళు పందెం కడతాను. జీవితాంతం కాదు, ఐదుసంవత్సరాలుకూడా ఎవరూ జైల్లో వుండలేరు”
“మీరనే మాట నిజమే ఐతే” లాయరు జవాబిచ్చాడు. “నేను ఐదు కాదు, పదిహేనేళ్ళు జైల్లో వుండటానికి సిద్ధం”
“పదిహేనేళ్ళు!! సరే ఐతే” అని, మిగిలినావారితో అన్నాడు “రెండుమిలియన్ రూబుళ్ళు పందెం”
“ఒప్పుకుంటున్నాను. మీరు రెండు మిలియన్ రూబుళ్ళు పందెం కట్టండి, నేను నా స్వేచ్ఛాస్వతంత్రాలని” అన్నాడు లాయరు.
మొత్తానికీ ఈ హాస్యాస్పదమైన, అదేసమయానికి కౄరమైన పందెం మొదలైంది. బ్యాంకరుకి చాలా డబ్బుంది. ఈ రెండు మిలియన్లూ ఒక లెక్కలోకి రావు. అతను కొంచెం దారితప్పినవాడు. కపటత్వం వుంది. పొంగిపొర్లుతున్న వుల్లాసంతో వచ్చి భోజనాలసమయంలో లాయరు పక్కని కూర్చుని పరిహాసం చేసాడు.
“ఆలస్యం కాకముందే కాస్త స్పృహ తెచ్చుకో పందెపుగుర్రమా! రెండు మిలియన్లనేవి నాకు పెద్దమొత్తం కాదు. కానీ నీ జీవితంలోని అత్యుత్తమమైన మూడునాలుగేళ్ళ కాలాన్ని పోగొట్టుకుంటావు. మూడునాలుగేళ్ళని ఎందుకు అంటున్నానంటే, నువ్వు అంతకన్నా నీ మాటకి కట్టుబడి వుండలేవు. అదొక్కటే కాదు, నీ అంతట నువ్వు జైలుకి వెళ్తున్నావు. నిర్బంధంతో కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రాగలిగే స్వేచ్చ నీకుంది. ఆ స్పృహ నీలో ఎప్పటికీ సజీవంగా వుండి, నిన్ను పందెం గెలవకుండా చేస్తుంది” అన్నాడు.
ఇదంతా జరిగి పదిహేనేళ్ళైంది. పదిహేనేళ్ళు…
అలాంటి పందెం ఎందుకు కట్టాడు తను? దానివలన ఏ ప్రయోజనం వుంది? ఆ లాయరు పదిహేనేళ్ళ జీవితకాలాన్ని పోగొట్టుకున్నాడు. తను రెండు మిలియన్ రూబుళ్ళు. అంతమాత్రంచేత మరణశిక్ష యావజ్జీవంకంటే మంచిదనో చెడ్డదనో ఎలా నిరూపితమౌతుంది? అంతా తెలివితక్కువ వ్యవహారం. డబ్బుందని తనూ, డబ్బు మీది ఆశతో ఆ లాయరూ ఆడిన ఆట. అంతే!
పార్టీ తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నాడు బ్యాంకరు. ఇంటితోటలో ఒకమూలకి నిరంతరం గమనిస్తూ వుండేలాగ బందిఖానా ఏర్పాటైంది. సుక్ష్మమైన వివరాలన్నిటితోసహా వొప్పందపత్రం రాసుకున్నారు. కొన్ని షరతులు విధించబడ్డాయి. కొన్ని అనుమతులు ఇవ్వబడ్డాయి. ఖైదీ గడపదాటకూడదు. మనుషులెవర్నీ చూడకూడదు. మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పేవి వినటంకూడా చెయ్యకూడదు. ఉత్తరాలూ, వార్తాపత్రికలూ అందుకోకూడదు. ఐతే అతను వాయిద్యపరికరం వుంచుకోవచ్చు. పుస్తకాలు చదవచ్చు. ఉత్తరాలు రాయచ్చు. వైన్కీ, పొగాకుకీ అనుమతి వుంది. తనకి కావల్సినవన్నీ ఒక కాగితంలో రాసి గదికి వున్న చిన్న కిటికీలోంచీ ఇవ్వచ్చు.
ఆ వొప్పందం ప్రకారం లాయరు 14-11-1870 రాత్రి పన్నెండుగంటలనుంచీ పదిహేను సంవత్సరాలు బ్యాంకరు ఖైదులో వున్నాడు. షరతులేవీ అతిక్రమించలేదు. కానీ… విడుదలవటానికి రెండునిముషాలముందు మాత్రం పారిపోయే ప్రయత్నం చేసాడు. దాంతో బ్యాంకరుకి వప్పుకున్న డబ్బు ఇవ్వవల్సిన అవసరం లేకపోయింది.
మళ్ళీ అవే ఆలోచనలు.
ఖైదులో వున్న మొదటిసంవత్సరం అతను రాసుకున్న రాతలబట్టీ వంటరితనంతో బాధపడ్డాడు. విసుగేసింది. అతని గదిలోంచీ పగలు రాత్రీ అనే తేడా లేకుండా పియానో వినిపించేది. వైను, పొగాకులనిమాత్రం తీసుకునేవాడు కాదు.
“వైన్ మనిషిలో కోరికలని పెంచుతుంది. కోరికలనేవి ఖైదీకి ప్రథమశతృవులు. అదీకాక వొంటరిగా వైను పుచ్చుకోవడంకన్నా విసుగు పుట్టించేది మరోటి వుండదు. ఇక పొగాకు… గదినిండా వాసన నింపేస్తుంది. ఇష్టం లేనప్పుడుకూడా దాన్ని పీల్చవలసి వుంటుంది” అని రాసుకున్నాడు.
ఆ సంవత్సరమంతా తేలికపాటి ప్రేమకథలు, కల్పితగాథలు, అపరాథపరిశోధక కథలు, హాస్యనవలలు పంపించడం జరిగింది.
రెండోయేటికి వచ్చేసరికి పియానో వినిపించడం మానుకుంది. లాయరు క్లాసిక్స్ మాత్రమే పంపమని అడిగాడు. ఐదోయేట సంగీతం మళ్ళీ మొదలైంది. వైన్ కావాలనికూడా అడిగాడు.
“ఈ యేడాదంతా అతను తినడం, తాగడం, మంచంమీద పడి నిద్రపోవటం మాత్రమే చేసాడు. తరుచుగా ఆవులించేవాడు. తనలో తను కోపంగా మాట్లాడుకునేవాడు. పుస్తకాలు చదవటం పూర్తిగా మానేసాడు. ఒక్కొక్కసారి రాత్రివేళల్లో రాయటానికి కూర్చునేవాడు. రాత్రంతా కూర్చుని రాసి, పొద్దున్నే రాసిన కాగితాలని చింపి పారేసేవాడు. ఒకటిరెండుసార్లు అతను ఏడవటంకూడా వినిపించింది” అతన్ని గమనించినవాళ్ళు చెప్పారు.
ఆరోసంవత్సరం సగం గడిచేసరికి ఖైదీ చాలా వుత్సాహంతో భాషలు, వేదాంతం, చరిత్ర నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అతను ఈ పుస్తకాలమీద ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. బ్యాంకరుకైతే సరిపడ్డన్ని పుస్తకాలు వెతికించి తెప్పించడానికి సంమయం చాలేది కాదు. ఈ నాలుగేళ్ళలో ఆరువందల పుస్తకాలు అతని కోరికమీద కొనటం జరిగింది. అతని ఆ ఆసక్తి అలా నిలిచి వుండగానే ఒక వుత్తరం రాసి పంపేడు. అందులో ఇలా వుంది.
“నా ప్రియమైన జైలరూ! నేను ఈ కింద కొన్ని విషయాలని ఆరుభాషల్లో రాసాను. పండితులకి చూపించు. వాళ్లకి ఒక్క తప్పేనా కనిపించకపోతే తోటలోని నీ సేవకుడికి ఒక్కమాటు తుపాకీ పేల్చమని చెప్పు. నాకు ప్రయత్నాలేవీ వృధా అవ్వలేదని అర్థమౌతుంది. అనేకమంది పండితులు అనేక భాషల్లో యుగయుగాలుగా ఎన్నో చెప్తున్నారు. వాళ్ళందరినీ దహించేది ఒకే ఒక జ్వాల. నా యీ అవధుల్లేని ఆనందం నీకు అర్థమవాలని నా కోరిక”
అతని కోరిక ప్రకారం రెండుసార్లు తుపాకీ పేల్పించాడు బ్యాంకరు.
పదోయేటినుంచీ లాయరు టేబుల్‌ముందు కదలకుండా కూర్చుని కొత్త నిబంధన చదవటం మొదలుపెట్టాడు. నాలుగేళ్ళలో ఆరువందల గొప్ప పుస్తకాలు చదివిన మనిషి తేలిగ్గా అర్థమైపోయే ఈ చిన్న పుస్తకాన్ని ఏడాదిపాటు వదలకుండా చదవటాన్ని వింతగా చూసాడు బ్యాంకరు. ఆ తర్వాత మతాలయొక్క, వేదాంతశాస్త్రంయొక్క చరిత్ర చదవడం మొదలుపెట్టాడు. ఆఖరి రెండేళ్ళు ఒక పద్ధతంటూ లేకుండా విపరీతంగా చదివాడు. సామాన్యశాస్త్రం, బైరన్, షేక్సిపియర్… ఇలా అడ్డదిడ్డంగా. ఒకేసారి ఏమాత్రం పొంతనలేని వివిధరకాలైన పుస్తకాలు కావాలని రాసి పంపేవాడు.
రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, ఒక నవల, వేదాంతం… ఇలా వుండేది ఆ జాబితా. విరిగి ముక్కలైన పడవతో కలిసి సముద్రంలో యీదుతున్న వ్యక్తి ఎలాగైతే తనని తను కాపాడుకోవటానికి ఏ ముక్క దొరికితే దాన్ని పట్టుకుంటాడో అలాంటి అభినివేశంతో చదివేవాడు.
బ్యాంకరు లాయరు జ్ఞాపకాల్లోంచీ ఇవతలికి వచ్చాడు. అంటే గతంలోంచీ తక్షణవాస్తవంలోకి. కర్తవ్యంలోకి.
“రేపు రాత్రి పన్నెండింటికి అతనికి స్వతంత్రం వస్తుంది. నేను అతనికి రెండుమిలియన్ రూబుళ్ళు ఇవ్వాలి. అంత మొత్తం ఇస్తే తన పని పూర్తిగా దివాలా తీసినట్టే” అనుకున్నాడు.
పదిహేనేళ్ళక్రితం పరిస్థితి బ్యాంకరుకి ఇప్పుడు లేదు. అప్పులెక్కువో ఆస్థి ఎక్కువో తేలిని పరిస్థితి. షేర్లలో పెట్టుబడి పెట్టాడు. మదుపు చేసేప్పుడు వుండాల్సిన జాగ్రత్తలేవీ పాటించలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాని ఫలితం ఇప్పటికీ ఈ ముసలితనంలోకూడా అనుభవిస్తున్నాడు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఒకప్పటి ధనగర్వం, దర్పం, ఆత్మవిశ్వాసం అన్నీ దెబ్బతిన్నాయి. ఆస్తంతా పోగొట్టుకుని మామూలు బ్యాంకరుగా మారిపోయాడు. షేర్ మార్కెట్లో వచ్చే చిన్నచిన్న కుదుపులుకూడా వణికిస్తున్నాయి ఇప్పుడు అతన్ని.
“ఆ దిక్కుమాలిన పందెం… ” నిస్సహాయంగా తల రెండుచేతుల్తోటీ పట్టుకుని తనలో తను గొణుక్కున్నాడు. “ఆ లాయరు చచ్చిపోయినా బావుండేది. అతనికిప్పుడు నలభయ్యేళ్ళు. నాకున్నది కాస్తా వూడ్చి తీసేసుకుంటాడు. నేనేమో దివాలా తీసేస్తాను. అతడేమో చక్కగా పెళ్ళి చేసుకుంటాడు. జీవితాన్ని ఆస్వాదిస్తాడు. షేర్లు కొంటాడు. లాభాలు సంపాదిస్తాడు. నేనొక దివాలాకోరు బిచ్చగాడిలా తయారౌతాను. అతను నన్ను చూసి-
నేనీరోజుని ఇలా వున్నానంటే నువ్వే కారణం. నీకు సాయం చేయనివ్వు.
-అంటాడు. ఓహ్! అదెంత దుర్భరం? ఈ దివాలానుంచీ, అవమానంనుంచీ తప్పించుకోవాలంటే అతను చచ్చిపోవాలి” మనసులో ఒక కౄరమైన ఆలొచన.
గడియారం మూడు కొట్టింది. గంటలు కొడుతుంటే బ్యాంకరు విన్నాడు. ఆ సమయానికి మనుషులంతా నిద్రలో వుంటారు. ఒకవేళ ఎవరేనా మేలుకుని వున్నా, ఈదురుగాలికి చెట్లు బలంగా వూగి చేసే చప్పుళ్ళు తప్ప ఇంకేవీ వినిపించవు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ పదిహేనేళ్ళలో ఒక్కసారికూడా తెరవని ఆ గది తాళాన్ని బీరువాలోంచీ ఎలాంటి చప్పుడూ చెయ్యకుండా తీసుకున్నాడు. ఓవర్కోటు వేసుకున్నాడు. నెమ్మదిగా ఇంట్లోంచీ అవతలికి అడుగుపెట్టాడు. తోటంతా చిమ్మచీకటిగా వుంది. చలి వణికిస్తోంది. వాన పడుతోంది. ఎముకలు కొరికేసేంత చల్లటిగాలి గర్జిస్తోంటే చెట్లన్నీ అవిశ్రాంతంగా వూగుతున్నాయి. కళ్ళుపొడుచుకున్నా కానరాని చీకటి. నడిచే నేల, అక్కడి తెల్లటి శిల్పాలు, తోటమూల, చెట్లు… ఏవీ కనిపించట్లేదు. ఉజ్జాయింపుగా అక్కడికి చేరుకుని వాచ్‌మేన్‌ని రెండుసార్లు పిలిచాడు. జవాబు రాలేదు.
“బహుశ: ఈ చలినుంచీ తప్పించుకోవటానికి వంటింట్లోకో మరో వెచ్చటి ప్రదేశానికో వెళ్ళి వుంటాడు!” అనుకున్నాడు. “నేను కాస్త ధైర్యం చూపించి అనుకున్నదాన్ని అనుకున్నట్టు చెయ్యగలిగితే అనుమానం ముందు వాచ్మేన్మీదికే పోతుంది” అనుకున్నాడు.
తడుముకుంటూ మెట్లెక్కి, తలుపుతీసుకుని తోటభాగపు హాల్లోకి అడుగుపెట్టాడు. అక్కడినుంచీ ఒక సన్నటి దారిపట్టి జేబులోంచీ అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించాడు. ఎవ్వరూ అక్కడ లేరు.
ఒక మంచం. ఎలాంటి పక్కబట్టలు లేకుండా. ఒక మూల చీకట్లో మెరుస్తూ ఇనుప స్టౌ. ఆ మంచం, స్టౌ కాపలాదారుడివి.
ఖైదీ గది తలుపుకి వేసిన ముద్రలన్నీ యథాతథంగా వున్నాయి. గాలికి అగ్గిపుల్ల ఆరిపోయింది. బ్యాంకరు ఆందోళనపడుతూ ఖైదీగదికి వున్న కిటికీలోంచీ తొంగిచూసాడు. గదిలో కొవ్వొత్తి మసగ్గా వెలుగుతోంది. ఖైదీ బల్లముందు కూర్చుని వున్నాడు. అతని వీపు, జుత్తు, చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. తెరిచిన పుస్తకాలు బల్లమీద, రెండు కుర్చీల్లోనూ, బల్లదగ్గర వున్న తివాచీమీదా చిందరవందరగా పడి వున్నాయి.
ఐదునిముషాలు గడిచాయి. ఖైదీలో ఎలాంటి కదలికా లేదు. పదిహేనుసంవత్సరాల సుదీర్ఘఖైదు జీవితం అతనికి గంటల తరబడి కదలకుండా కూచోవటం నేర్పింది. బ్యాంకరు కిటికీ మీద వేలితో తడుతూ చిన్న శబ్దం చేసాడు. ఖైదీనుంచీ ఎలాంటి స్పందనా లేదు. బ్యాకరు తలుపుకి వేసిన ముద్రలని జాగ్రత్తగా తొలగించి, గొళ్ళానికి వున్న తాళంలో చెవి దూర్చాడు. తుప్పుపట్టిన తాళం పెద్దగా చప్పుడు చేసింది. తలుపు కిర్రుమంది. అలికిడికి వెనక్కి తిరిగి ఖైదీ ఆశ్చర్యంతో పెద్దగా అరుస్తాడని బ్యాంకరు అనుకున్నాడు. మూడు నిముషాలు గడిచింది. అక్కడి భావ, శబ్దరాహిత్యంలో ఎలాంటి మార్పూ లేదు. ధైర్యం చేసి గదిలో అడుగుపెట్టాడు.
బల్లముందు కూర్చుని వున్న ఆ మనిషి అసాధారణంగా వున్నాడు. చర్మం, బిగుతుగా చుట్టిన అస్థిపంజరంలాంటి ఆకారం, ఆడవారికిలా పెరిగిన పొడవైన, వుంగరాల జుత్తు, చిందరవందరగా వున్న గెడ్డం, పాలిపోయిన ముఖచ్ఛాయ, లోతుకు పోయిన చెంపలు, సన్నటి పొడవైన నడుము, సన్నగా పుల్లలా వున్న చేతులు… అందులో ఒకదానిమీద తలానించుకుని అతను ఇప్పుడు నిద్రపోతున్నాడు. చూడటానికే బాధగొలుపుతున్న దృశ్యం. జుత్తు నెరిసిపోయింది. అకాలవృద్ధాప్యం ప్రతిబింబిస్తున్న అతని ముఖం చూసిన ఎవరూ కూడా అతనికి నలభయ్యేళ్ళేనంటే నమ్మరు. అతను తలానించి పడుక్కున బల్లమీద, అతని ముఖానికి ఎదురుగా ఏదో రాసి వున్న కాగితం వుంది.
“ఈ దెయ్యంగాడు, పాపం తెల్లారితే వచ్చి పడే డబ్బుమూటల గురించి కలలుగంటున్నట్టున్నాడు. ఈ సగం చచ్చినవాడిని మంచం మీద పడేసి, దిండుతో కుమ్మేసి వూపిరాడకుండా చేస్తే తేలిగ్గా చచ్చిపోతాడు. అసలిది హత్యని కూడా ఎవరూ కనిపెట్టలేరు. ముందు అసలేం రాసాడో చూద్దాం” అనుకుంటూ బ్యాంకరు ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదవటం మొదలుపెట్టాడు.
ముందురోజు రాసినట్టున్నాడు.
“రేపు అర్ధరాత్రి పన్నెండిటికి నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. మళ్ళీ మనుషులతో అవకాశం లభిస్తుంది. ఈ గదిని వదిలి ఇవతలికి వచ్చి తొలి సూర్యోదయాన్ని చూసేలోగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా, భగవంతుని మీద ప్రమాణంచేసి చేస్తూ, స్వేచ్ఛ, జీవితం, ఆరోగ్యం… ఇంకా మీరిచ్చిన పుస్తకాలలో చర్చించబడిన లౌకికసుఖాలన్నిటినీ తృణీకరిస్తున్నాను.
ఈ పదిహేనేళ్ళూ నేను లౌకికమైన జీవితాన్ని గురించి ఎంతో శ్రద్ధగా, లోతుగా చదివాను. ఈ యిన్నేళ్ళూ తోటిమనుషులనిగానీ, బయటి ప్రపంచాన్నిగానీ చూడలేదన్నది వాస్తవమే ఐనా, మీ పుస్తకాలతో నా వూహా జగత్తు ఎంతో విస్తరించింది. పరిమళభరితమైన వైన్ తాగిన, పాటలు పాడిన, జింకలనీ, అడవిపందులనీ వేటాడిన, అందమైన స్త్రీలను ప్రేమించిన అనుభూతులన్నీ పొందాను. కవుల వుహల్లోంచీ సృజించబడిన అందమైన తెలిమబ్బులు రాత్రివేళల్లో నా చెవుల్లో చెప్పిన అద్భుతమైన కథలు విని మత్తెక్కిపోయాను. ఎల్‌బ్రజ్, మాంట్ బ్లాంక్ పర్వతశిఖరాలు ఎక్కి, అందమైన సూర్యోదయాలని చూసాను. అదే సూర్యుడు సాయంత్రాలలో ఆకాశాన్నీ, సముద్రపు వుపరితలాన్నీ, పర్వతశిఖరాలనీ ఊదారంగున్న బంగారు మెరుపుతో నింపటాన్ని చూసాను. అంతేనా? మన తలపైన వున్న ఆకాశంలో పల్చగా మెరిసే మెరుపులు మబ్బులని ఎలా చీల్చుతాయోకూడ అక్కడినుంచే చూసాను. హరితారణ్యాలనీ, పొలాలనీ, నదులనీ, సరస్సులనీ, పట్టణాలనీ దర్శించాను. పక్షి స్త్రీలు పాడటాన్నీ, పాన్పైపులు వాయించటాన్నీ విన్నాను. దేవునిగురించి చెప్పటానికి వచ్చిన దూతల మృదువైన రెక్కల స్పర్శని అనుభవించాను. లోతు తెలియని అగాథాల్లోకి జారిపోయాను. అద్భుతాలు చేసాను. నగరాలని నేలమట్టం చేసాను. కొత్త మతాలని ప్రచారం చేసాను. దేశాలనే జయించాను.
పుస్తకాలు నాకెంతో తెలివిని ఇచ్చాయి. కొన్ని శతాబ్దాలపాటు నిర్విరామంగా సృష్టించిన విజ్ఞానమంతా ఇప్పుడు నా మెదడులో పోగుపడిపోయింది. ఇప్పుడు నేను మీ అందరికన్నా తెలివైనవాడినని అనుకుంటున్నాను.
ఈ పుస్తకాలనీ, వాటిలో చెప్పే లౌకికసుఖాలనీ, అవి ఇచ్చిన తెలివినీ కూడా తృణీకరిస్తున్నాను. సృష్టిలో వున్న ప్రతీదీ మిథ్యే. కంటికి ఏదేనా కనపడిందంటే అది ఒక ఎండమావి. మనిషిని తనవెంట పరిగెత్తేలా చేస్తుంది. నువ్వెంత తెలివైనవాడిననీ, అందమైనవాడిననీ గర్వపడినా, మృత్యువు నిన్ను భూమ్మీంచీ తొలగించేస్తుంది. కప్పేట్టేస్తుంది. బొరియలో వుండే ఎలకకీ, సమాధిలోని నీకూ తేడా వుండదు. నువ్వు, నీ చరిత్రా, వంశం అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి.
మీదొక పిచ్చి. తప్పుదారిలో వెళ్తున్నారు. అబద్ధాన్ని నిజంగానూ, అనాకారితనాన్ని అందంగానూ భావించే మూర్ఖత్వం. అకస్మాత్తుగా ఆపిల్‌పండు నారింజరంగులో ఉంటే మీకు ఆశ్చర్యం. చెట్లకి పండ్లకు బదులుగా కప్పలు మరియు బల్లులు కాస్తే, గులాబీలు గుర్రపు చెమటవాసన వస్తే నిర్ఘాంతపోతారు. నిజానికి అన్నీ ఒకటే. మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం. భూమిని స్వర్గానికి బదులుగా తెచ్చుకున్నందుకు. నాకు మీలాంటివారు ఎప్పటికీ అర్థమవరు. నా ప్రపంచం మీనుంచీ వేరైపోయింది.
బ్యాంకరూ! నేను చెప్తున్న విషయాలని నిరూపించుకోవటానికి ఏ డబ్బుకోసమైతే నీవు జీవిస్తున్నావో, దేనికోసం ఆశపడి నేనీ పందెంలోకి వచ్చానో, ఆ డబ్బుని, నువ్విస్తానన్న రెండు మిలియన్ల రూబుళ్ళనికూదా నేను తృణీకరిస్తున్నాను. వాటిమీద నాకు గల హక్కుని రూఢీగా వదులుకోవటానికి పందెం ముగియటానికి ఐదు నిముషాలముందే విడుదలయ్యి పందెపు షరతులని అతిక్రమిస్తాను”
బ్యాంకరు ఇదంతా చదివి చలించిపోయాడు. కాగితాన్ని బల్లమీదే పెట్టి, ఆ అసాధారణమైన మనిషి తలమీద ముద్దుపెట్టుకున్నాడు. దు:ఖం పొర్లుకు వచ్చింది. అక్కడినుంచీ వెళ్ళిపోయాడు. జీవితంలో ఎప్పుడూ… షేర్లలో డబ్బు భయంకరంగా నష్టపోయినప్పుడు కూడా కలగనంత అసహ్యం తనమీద తనకి కలిగింది. ఇంట్లోకి వచ్చి, పక్కమీద పడుకున్నాడు మనసంతా అలజడి. కళ్లలోంచీ కన్నీళ్ళు ధారలు కట్టిపోయాయి. నిద్ర రాలేదు చాలాసేపటిదాకా.
” ఆ గదిలో వుండే వ్యక్తి కిటికీలోంచీ దూకి, తోట గేటు తీసుకుని పారిపోయాడు” మరుసటిరోజు వుదయం వాచ్‌మేన్ కంగారుగా వచ్చి చెప్పాడు. బ్యాంకరు వెంటనే వెళ్ళి ఆ విషయాన్ని రుజువుపరుచుకున్నాడు. లాయరు రాసిన కాగితం అక్కడే వుంది. అనవసరపు పుకార్లకి ఆస్కారం ఇవ్వకుండా వుండేందుకు ఆ కాగితాన్ని తీసుకెళ్ళి బీరువాలో భద్రపరిచాడు.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.