ఝరి – 76 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

“దాని లైఫ్‍స్టైల్ మారింది. పద్మత్త కోరుకున్నది ఆ మార్పే” క్లుప్తంగా అంది గీత. మహతి ఆమెవంక చూసింది. సుమతితో స్పర్థ లేకపోతే గీతకూడా ఆ ప్రవాహంలో కలిసేదా? సుధీర్ని చేసుకుని వుంటే? ఈ రెండోది విడదీయరాని ఆలోచనగా మారిపోయిందేం అందరికీ?
“నువ్వేం అనుకుంటున్నావో నేను వూహించగలను. ఆ ఆలోచనని మీరంతా మనసుల్లోంచీ చెరిపెయ్యలేరా?” అడిగింది గీత. “మహీ! మనలో చాలామంది ముళ్ళకిరీటాలని మోస్తూ వుంటారు. నచ్చని జీవనశైలి, ఇముడ్చుకోలేని జీవితం, ఇష్టంలేని మనుషుల సహచర్యం, ఆ కిరీటానికి వుండే కొన్ని ముళ్ళు. నేను సుధీర్ని చేసుకుని వుంటే ఒక వికృతమైన ప్రాణిగా మారేదాన్ని. ఆ విలాసం, సరదాలు నాకు అమర్చిపెట్టడానికి నాన్న త్యాగం వుందన్న ఆలోచన నన్ను స్థిమితంగా వుండనిచ్చేది కాదు. నాన్నకీ నాకూ మధ్య ఒక అగడ్తలాంటిది వుండేది. సుధీర్ తల్లిదండ్రులకి నాన్నకి వున్నలాంటి సమస్యలు లేవు. వాళ్ళకోసం అతను చెయ్యాల్సింది ఏదీ లేదు. ఇద్దరికీ ఒకటే మెట్టు తేడా. అది డబ్బు కాదు, జీవనశైలి. కానీ నాన్నతో అలా కాదు. ఆయన నా చేయూత తీసుకోడు. తనుగా బాధ్యతల్లోంచీ బైటికి రాలేడు. ఇల్లు అమ్మేసాక కృష్ణకి ఏమీ మిగిలేదికాదు. ఎక్కడో ఓ చిన్న వుద్యోగం వెతుక్కోవలసి వచ్చేది వాడికి. వాడిని తక్కువస్థాయిలో చూడ్డం నావల్లకాదు. ఇవన్నీ నేను సరిపెట్టుకోగలిగితే…” ఆగింది గీత. కొద్దిక్షణాల మౌనం తర్వాత పూర్తిచేసింది. “నడమంత్రపుసిరితో కళ్ళుమూసుకుపోయి వుండేవి. ఒకవేళ నేను సుధీర్ని ఇష్టపడి చేసుకుని వున్నా, నేను పొందే ఆనందంయొక్క మౌలికతలో మార్పు వుండేదేమోగానీ సాంద్రతమాత్రం మారేది కాదు”
మహతి అలాగే చూస్తూ వుండిపోయింది. గీత సంభాషణ మళ్ళించేసింది.
“చెప్పానుకదా, బారసాలకార్యక్రమం తర్వాత అందరం కలిసి కూర్చున్నామని. ఇరవయ్యోకుర్చీ మయూఖ్‍ది.
మన టీమ్ కొత్తమెంబరేడే- ప్రహ్లాద్ అడిగాడు. వాడిని తీసుకొచ్చాను.
చిన్నబాస్కెట్ తెచ్చి అందులో దుప్పటీ మడిచి వేసి, దాన్ని కుర్చీలో పెట్టి అందులో వాడిని పడుక్కోబెట్టడానికి ఏర్పాటు చేసాడు. పల్లవిదాకా అందరూ అత్తలకీ బాబాయ్‍లకీ పుట్టిన పిల్లలు. వీడు మన తర్వాతితరంవాడు. అందరికీ థ్రిల్‍గా వుంది. ప్రహ్లాద్ ఈ విషయమే చాలా వుద్వేగంగా చెప్తూవుంటే వాడు ఒక్కసారి కంయిమన్నాడు. చూస్తే పాస్ పోసేసుకున్నాడు.
అసలు నీ సమస్యేమిట్రా? నువ్వే పక్కలో టేప్ ఇప్పేస్తావు. బట్టలన్నీ తడిపేసుకుంటావు. పైనుంచీ నేనేదో నిన్ను చేసినట్టు ఇంటి పైకప్పు ఎగిరిపోయేట్టు ఏడుస్తావు- అన్నాను వాడిని పైకి లేవదీస్తూ. వాళ్ళంతా వాడికోసం ఏర్పాట్లు చేసినంతసేపు పట్టలేదు వాడా పనిచెయ్యడానికి. అందరూ నవ్వందుకున్నారు.
వీళ్ళిద్దరికీ ఒక్క క్షణంకూడా పడట్లేదు- వాసు అన్నాడు.
వీడితోకూడా గొడవేనా నీకు? ప్రాసెస్ పూర్తైపోయింది- వసంత్ నవ్వుతున్నాడు.
ఏం ప్రాసెస్‍రా- దబాయించాను. చెప్పడే.
నవ్వులు ఆగడంలేదు. ఎంత సరదాగా వుండేవి మహీ, ఆరోజులు? అన్నిటికీ నవ్వే. సిల్లీసిల్లీగా మాట్లాడేసుకుని ఆ విషయాలకికూడా నవ్వేసుకునేవాళ్ళం.
అంతంత నవ్వులేంటి? పిల్లకుంక దడుసుకున్నట్టున్నాడు- మామ్మ వచ్చి అందర్నీ కోప్పడి, వాడిని తీసుకెళ్ళింది. ముగ్గురునలుగురు పెద్దవాళ్ళు నిరంతరం వాడి డిస్పోజల్లో వుండేవారు. ఏడిస్తే చాలు, బుజ్జగింపులూ, వూసులూ. వాడు కుంయ్‍మన్నా కంయ్‍మన్నా వాళ్లకి అందులో ఏవో అర్థాలు దొరికేసేవి. వింతల్లో వింత, ఇంత పెద్దటీమ్‍ని తయారుచేసిన మామ్మకికూడా వాడిని చూస్తే మురిపెమే. మునిమనవల్ని లెక్కపెట్టుకుంటూ సంతోషపడే మోడ్‍లోకి వచ్చేసింది.
సుమతి నాతో పూర్తిగా మాటలు మానేసింది. వాళ్ళ పెళ్ళి తర్వాత మేమిద్దరం కలుసుకోవడం ఇది మూడోసారి.
వాళ్ల పెళ్ళయ్యాక మేం కలుసుకున్న మొదటి సందర్భం నాన్న వెళ్ళి ఇద్దర్నీ భోజనానికి తీసుకొచ్చినప్పటిది. మమ్మల్నీ రమ్మన్నారు. కొత్తగా మన కుటుంబంలోకి వచ్చినవాళ్ళని ఇంటికి ఆహ్వానించి, కుటుంబాలుగా పరిచయం చేసుకోవడం మనింట్లో పద్ధతి. పైవాళ్లం కాకపోయినా మా పెళ్లయాక నన్నూ వాసునీకూడా అలానే పిలిచారు. అందులోనూ సుమతి మామ్మకి ముద్దులమనవరాలు. నాన్నకి పెద్దమేనకోడలు. ఇక అమ్మ విషయం తెలుసుగా? మనలో ఎవర్ని చూసినా తనకి ప్రేమే.
వెళ్ళేముందు వాసు నాతో అన్నాడు-
గీతూ! సుమతిని కలవడం నీకేకాదు, నాక్కూడా ఇష్టంలేదు. స్నేహాలు తుంచుకోగలంగానీ చుట్టరికాలు తుంచుకోలేంకదా? అదీకాక జరిగిన ఒకటో రెండో సంఘటనలు పుట్టినప్పట్నుంచీ వున్న అనుబంధాలని చెడగొట్టకూడదు. వాళ్లకి ఏదో కాస్త బాధగా వుంది. కొన్నాళ్లకి అన్నీ సర్దుకుంటాయి. అందుకని మనం తటస్తంగా వుందాం. ఇంకా రప్చర్స్ వద్దు. మరో విషయం. అది పెళ్ళిచేసుకుని, కొత్తకుటుంబంలోకి వెళ్తోంది. అతను మనకి పూర్తిగా తెలియని మనిషి. మనందరం దాన్ని బాగా చూస్తేనే అతనికి దానిమీద గౌరవం కలుగుతుంది. ఇంతమంది అన్నదమ్ములు నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నారని అనిపిస్తే తనూ తగ్గకుండా చూసుకుంటాడు. మనమధ్య గొడవలున్నాయని బైటపడితే అతనిముందు దాని విలువ తగ్గుతుంది- అని.
తనే అతనికి చెప్తే- అడిగాను.
దానంత తెలివితక్కువది ఇంకొకరు లేనట్టు- అన్నాడు.
మేమిద్దరం ముందుగానే వెళ్ళిపోయాం. ఇల్లంతా చకచక సర్దేసాను. అమ్మ సుమతికోసం కొన్న చీర చూపించింది. పసుపురంగుమీద వూదారంగు ప్రింటున్న వులీ నైలెక్స్ చీర. బావుంది. అతని బట్టలూ చూపించింది. ఫాంటు, షర్టు ముక్కలు. ఐనా మగపిల్లలకి అప్పట్లో పెద్ద వెరైటీలేం వుండేవి? నలుపో, ముదరరంగో ఫాంట్లు, లేతరంగో తెల్లవో షర్టులు. ఉంటే పెద్దవో చిన్నవో గళ్ళు. అంతేకదా?
కాస్తేదైనా తిను. వాళ్ళొచ్చి, కబుర్లు తెమిలి, భోజనాలకి కూర్చునేసరికి ఏవేళౌతుందో- అని మామ్మ తినడానికి ఏవో పెట్టింది. కృష్ణ స్కూలు మానేసి వుండిపోతానన్నాడు.
అరేయ్, నువ్వు చదివేది ఇంటరు. అలా కాలేజి మానకూడదు. మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడు వాళ్ళని చూద్దువుగాని. ఇప్పట్నుంచీ ఇంట్లో వుండి ఏంచేస్తావు- అన్నాడు వాసు. వాడు ముఖం ఇంత చేసుకుని వెళ్ళాడు. నాన్న వెళ్ళి సుమతినీ, జోనీ వెంటబెట్టుకుని వచ్చారు.
అమ్మ వాకిట్లోకి ఎదురెళ్ళి లోపలికి తీసుకొచ్చింది. పలకరింపులూ, మర్యాదమన్ననలు, మొదటివిడత కాఫీలూ అయ్యాయి. మాయిల్లు చూసి జో ఆశ్చర్యపోయాడు. ఎలాంటి భేషజం తెలీని మనిషి.
ఇంతంత పెద్దపెద్ద యిళ్ళు మాకు లగ్జరీయే. చిన్నప్పట్నుంచీ అపార్టుమెంట్స్‌లోనూ, అద్దె యిళ్ళలోనే పెరిగాను. ఎప్పటికేనా రెండొందలగజాలో మూడొందలగజాలో స్థలం కొనుక్కుని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని అంటుంటారు మా నాన్న అపార్టుమెంటులైఫ్‍మీద విసుగొచ్చినప్పుడు. మీది ఫ్యూచరిస్టిక్ జెనరేషనన్నమాట- అన్నాడు.
వాసూ వాళ్ళిల్లు ఇంకా పెద్దది- అంది సుమతి.
వాసుతో మాట్లాడుతోంది. నాతో మాట్లాడట్లేదు. వాసు చెయ్యిపట్టుకుని వదిలిపెట్టట్లేదు. అతిథిని ఇల్లంతా తిప్పి చూపించాము. ఆఖరికి వచ్చి, పెరట్లో జామచెట్టుకింద నిలబడ్డాము. పెద్ద జామకాయ వుంటే వాసు అందుకుని కోసిచ్చాడు. తలుపుసందులో పెట్టి దాన్ని నాలుగుముక్కలు చేస్తుంటే జో ఆశ్చర్యంగా చూసాడు- ఇంత సింపులా, తినడం అన్నట్టు. అల్లుడుకాబట్టి, అతనికి అలా యివ్వకూడదని అమ్మకి ఆ విషయం తెలిసినప్పుడు చెప్పింది. నిజానికి మనకి అలాంటివేం వుండవు. పెద్దవాళ్ళే నేర్పిస్తారు.
వీళ్ళిద్దరూ మాట్లాడుకోరా_ అడిగాడు జో.
వాసు నాకు కళ్ళతో సౌంజ్ఞ చేసాడు.
ఎందుకు మాట్లాడుకోం? మా కబుర్లు ఎప్పుడూ వుండేవే. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే విందామని చూస్తున్నాను- అన్నాను.
మేమిద్దరమూనా? ఇంకా నేను మాట్లాడ్డం మొదలుపెట్టలేదు. మొదటి సంవత్సరమేగా, ఇది- అతను పెద్దగా నవ్వాడు.
పదవే, లోపలికెళ్ళి కూర్చుందాం- అని సుమతి చెయ్యిపట్టుకుని లోపలికి లాక్కెళ్ళాను. ఆ వెళ్ళడంలో, గడప తట్టుకుంటే తను గట్టిగా నా భుజం పట్టుకుని ఆపింది.
కళ్ళు ఎక్కడో పెట్టుకుని నడిస్తే అలానే వుంటుంది- అంది నెమ్మదిగా.
కళ్ళు అక్కడా యిక్కడా పెట్టేస్తున్నావా నువ్వు, పెళ్లైందని- అన్నాను నవ్వు ఆపుకుని.
మామూలుగానైతే ఈ ఒక్క విషయంమీదా అరగంటేనా మాటలు జీళ్ళపాకంలా సాగేవి. కానీ తను జవాబివ్వకపోవడంతో ఆగిపోయాయి. ఇంట్లోకి వెళ్ళాక నాగదిలో కూర్చున్నాం. ఎదురుగా గోడకి మా పెళ్ళిఫోటో తగిలించి వుంది. ఆ ఫోటోనీ నన్నూ ఒకమాటు మార్చి చూసి, చూపులు తిప్పేసుకుంది. తను నాకు కొత్తమనిషిలా అనిపిస్తోంది. మావెనకే వాళ్ళిద్దరూ వచ్చారు. ఒకప్పుడు అదే గదిలో మంచమ్మీద మన నలుగురం ఇరుక్కుని పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం. ఆరోజులు మర్చిపోయినట్టుంది. ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని రెండునిముషాలకి లేచి నాన్న దగ్గిరకి వెళ్ళిపోయింది. నేను లేచి వంటింట్లోకి వెళ్ళాను. అప్పుడే వంటైపోయింది. మామ్మ కొంగుకి చెయ్యితుడుచుకుంటూ దాని వెనకే వెళ్తే నేను ఏవో సర్దుతూ వున్న అమ్మదగ్గిరకి వెళ్ళి వెనక ఆనుకుని, తన భుజంవంపులో ముఖం పెట్టి నిలబడ్డాను. కళ్లమ్మట నీళ్ళు వుబికి వస్తున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నాను. మనసుకి ఎంత సర్దిచెప్పుకున్నా బాధగానే అనిపిస్తోంది.
ఏమ్మా? సుమతి మాట్లాడ్డంలేదనేనా- చేస్తున్న పని ఆపి అడిగింది. నేను జవాబివ్వలేదు.
వాళ్ళన్నయ్యని కాదన్నావన్న కోపం మనసులో వుంటుంది. పైగా అదిప్పుడు నీకు ఆడబడుచుకూడా. వాళ్ళు ఆరుగురక్కచెల్లెళ్లకీ పెద్దకోడలివని నీగురించి చెప్తున్నారు. వదినా అని పిలవాలనేమో, లక్ష్మత్తని అడిగి తెలుసుకుని అలానే పిలువు. ఇంట్లో ఇద్దరు డాక్టర్లు. తనో డాక్టర్ని చేసుకుంది. ఇవన్నీ నువ్వే అర్థం చేసుకుని, జాగ్రత్తగా వుండాలి గీతూ! ఎంతవరకూ అవసరమో అంతవరకూ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంక మీరు చిన్నపిల్లలు కాదు. పెద్దయ్యారు, పెళ్ళిళ్లయ్యాయి. ఎవరి యిళ్ళూ, వాకిళ్ళూ, సంపాదనలూ, హోదాలూ వాళ్ళకే వుంటాయి. అంటే ఎవరి జీవితాలు వాళ్లవి ఇకపైని- అంది మృదువుగా.
నేను కళ్ళు తుడుచుకున్నాను.
అలా అన్నిటికీ బాధపడకూడదు. అందులోనూ ఇలాంటప్పుడు. నువ్వెంత సంతోషంగా వుంటే పుట్టబోయే పాపాయి అంత నవ్వుతూ వుంటుంది. లేకపోతే నీలాగే ఏడుస్తూ వుంటే మరి నువ్వే వోదార్చుకుంటూ వుండాలి- అంది. నవ్వి, దూరం జరిగాను.
నాన్న నీకు మేనరికం చేస్తానంటే భయపడ్డాను గీతూ! ఐదుగురికీ మగపిల్లలున్నారు, ఎవరికిచ్చి చేస్తే ఎవరికి కోపం వస్తుందోనని. అనుకున్నంతా అయింది. అసలువాళ్ళు మీరిద్దరూ గొడవల్లేకుండా వుంటే అదే చాలు మాకు. వాసుకి కోపం రాకుండా చూసుకో. ఈ విషయాల్లో అతనెలా చెప్తే అలా నడుచుకో. సర్లే, మనం ఇద్దరమే ఇక్కడ మాట్లాడుకుంటుంటే బావుండదు. వెళ్ళి వాళ్లదగ్గిర కుర్చో. నేనూ వస్తున్నాను- అంది.
నేను నాన్నదగ్గిరకి వెళ్ళాను. సుమతి లేచి వాసూవాళ్లదగ్గిరకి వెళ్ళింది.
భోజనాల టైముకి కృష్ణ స్కూలునించీ వచ్చాడు. జోని చూసి చాలా థ్రిల్లయాడు. భోజనాలయ్యాయి. మరికాసేపయాక, వెళ్తామని లేచారు వాళ్ళు. రాత్రిదాకా వుండి వెళ్లమని అంతా అన్నారుగానీ వాళ్ళకి ఇంకేవో ప్రోగ్రామ్స్ వున్నాయట.
తన కాళ్ళకి పసుపు రాసుకుని, సుమతికి కాళ్లకి పసుపు రాసి, చలిమిడీ, పసుపూ, కుంకం, చీరా పెట్టింది అమ్మ. అలాగే నాన్న జోకి బట్టలు పెట్టారు. నాకూ రాసింది. వద్దనటాలూ, బొటనవేలిగోరికి పెట్టు చాలు, సూత్రాలకి పెట్టుకుంటాను అనటాలూ వుండవు. మొట్టికాయలు పడిపోతాయి.
ఎందుకండీ, ఇవన్నీ- అతను బట్టలు తీసుకోవడానికి మొహమాటపడ్డాడు. వాళ్ళు వీళ్ల కాళ్లకి దణ్ణం పెట్టారు. మామ్మకికూడా.
ఇది మీ అమ్మకేకాదు, నీకూ పుట్టిల్లే . వచ్చి వెళ్తూ వుండండి ఇద్దరూను- అంది మామ్మ.
నువ్వు నాతో రాకూడదూ, కొన్నాళ్ళు- గారాలుపోతూ అడిగింది సుమతి మామ్మని.
ఇదో, దీనిలాగ నువ్వూ ఓ కొడుకుని కను. వాడిని చూసుకోవలసింది నేనేకదా? అప్పుడొస్తాను- అంది మామ్మ.