పెళ్లైన రెండేళ్లకి ఆమెకి కూతురు. ప్రసవానికి పుట్టింటికి తీసుకెళ్ళారు. నార్మల్ డెలివరీ అయింది. బారసాల అనుకున్నారు.
“ఇప్పుడీ మందమందంతా బారసాలకి వచ్చిపడతారా? చీమ చిటుక్కుమటే చాలు, మూలనున్న ముసలమ్మ దగ్గిర్నుంచీ బొడ్డూడని పిల్లదాకా అందరూ కట్టకట్టుకుని తయారైపోతారు. ఇప్పుడు వీళ్ళందరికీ తిళ్ళకీ పడకలకీ నేనెక్కడ ఏర్పాట్లు చెయ్యగలను? వచ్చినవాళ్ళందరికీ బట్టలుకూడా పెట్టలా?” అని చిరచిర్లాడాడు కుటుంబరావు.
“పద్ధతులన్నీ మా అత్తగారు చెప్పింది నాన్నా! అందరూ పొద్దున్న వచ్చి ఎంతరాత్రైనా ఫంక్షనైపోయాక వెళ్ళిపోతారట. మరీ వెంటనే ప్రయాణం చెయ్యలేనివాళ్ళు ఒకళ్ళిద్దరు వుంటారేమో! బట్టలుకూడా మాయింట్లోవాళ్ళకీ, ఆవిడ అమ్మగారికీ పెడితే సరిపోతుందట. మిగిలిన పెట్టుబడులు వాళ్ళే చూసుకుంటారట” నెమ్మదిగా చెప్పింది మాధురి.
“బానే వుంది తెలివి! మీ అత్తగారిదిమాత్రం డబ్బు కాదా? ఇలా దూబరా చేసుకుంటే కొండలేనా తరుగుతాయి. అందులోనూ మీ ఆయనకి గవర్నమెంటు వుద్యోగంకూడా కాదు. ఇంతంత బంధుప్రీతి పనికిరాదు” అన్నాడు.
“వాళ్ళూవాళ్ళూ ఏదైనా చేసుకుంటారు. మధ్యలో మీకూ నాకూ ఎందుకు? ఇంటికి పదిమంది వస్తే సదుపాయాలు చెయ్యలేమని చేతులెత్తేసారు. ఇంక దేనికి మీ భేషజం? పెళ్ళి చేసి పంపించాక ఇంకా పిల్లని పట్టుకుని వేలాడటం దేనికి? ఇదుగో మాధురీ! నువ్వు ఆ యింటిపిల్లవికానీ, మాయింటి పిల్లవి కాదు” అంది కమలాక్షి విసుగ్గా.
అలాంటివే ఇంకొన్ని సంఘటనలు. ఒక్కోకూతురికీ పెళ్ళై బాధ్యతల్లోంచీ బైటపడుతున్నకొద్దీ ఆయనకి కూతుళ్ళ కాపురాలు చక్కదిద్దాలనే తాపత్రయం మొదలైంది. గీతకి వూపిరి బిగువవ్వడం మొదలైంది. అది క్రమంగా జరిగింది.
పొద్దున్న ఏడూ ఎనిమిదిమధ్యని బద్ధకంగా లేచి వయ్యారంగా వంటింట్లోకి వెళ్ళి, రెండు కప్పుల కాఫీ చేసుకుని, ట్రేలో పొందిగ్గా అమర్చుకుని తెచ్చుకుని మాధవ్‍తో కూర్చుని తాగి, తొమ్మిదింటిదాకా అతన్తో కబుర్లు చెప్పి, అతను ఆఫీసుకి వెళ్ళాలని తయారౌతూ వుంటే మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఉప్మాయో, రెండు దోసెలో చేసుకొచ్చి, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ముద్దుమురిపాలు తీర్చుకున్నాక అతన్ని ఆఫీసుకి పంపి, కాసేపు విశ్రాంతి తీసుకుని, స్నానం చేసి, వంట మొదలుపెట్టి అతను భోజనానికి వచ్చేవేళకి పూర్తిచేసి, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ తినాలని వుంటుంది నీలిమకి.
కానీ గీతతోఅలా కుదరదు. పొద్దున్నే ఐదూ ఆరూ మధ్యలో లేచేస్తారు భార్యాభరలు. కాఫీ తాగుతూ పెరట్లో కూర్చుంటారు. దొర్లీ దొర్లనట్టు, ప్రభాతసమయపు ఏకాంతానికి భంగం కలుగుతుందేమోనన్నట్టు ఒకటి రెండు మాటలు. వాసు తండ్రికి కాఫీ అవీ అవసరం లేదు. చిన్న ఎలక్ట్రిక్ కెటిల్ వుంటుంది ఆయన దగ్గిర. దాంట్లో వేడినీళ్ళు కాచుకుని నిమ్మకాయరసం తేనె కలుపుకుని తాగుతాడు.
“వేణ్ణీళ్ళు పెట్టి, నేను కలిపిస్తాను మామయ్యా!” అని గీత ఎన్నిసార్లో చెప్పింది. ఆయన వినడు.
ఆరింటికి వాసు గ్రౌండుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ రావటం తొమ్మిదింటికి. పెళ్ళవకముందు మాధవ్‍కూడా కలిసేవాడు. ఇప్పుడిక అతను రావట్లేదు. వాసు ఒక్కడే వెళ్తాడు. గీత నవల తెచ్చుకుని చదువుతూ అక్కడే కూర్చుంటుంది. లేకపోతే పెయింటింగ్ చేస్తుంది. పనావిడ రావడం, వెళ్లడం ఔతాయి. లక్ష్మి లేస్తుంది. ఆవిడ వెంటే మయూఖ్ వస్తాడు. పనులు మొదలౌతాయి. స్నానం చేసి, పూజ చేసుకుని చకచక వండేస్తుంది గీత. ఆఫీసులకి వెళ్ళేది నలుగురు. అందరూ భోజనాలు చేసి, బాక్సులు తీసుకెళ్తారు. బాక్సుల్లో పెట్టడానికి ఉప్పుపిండో, పులిహోరో ఇంకా అలాంటివేవో చేస్తుంది. అందరూ వెళ్ళాక మిగిలినవన్నీ జాగ్రత్తగా చిన్నగిన్నెల్లో సర్దిపెడుతుంది లక్ష్మి. నీలిమ ఆలోచనలకి ఇదంతా భిన్నంగా వుంటుంది. యాంత్రికంగా తనూ ఏవో చేస్తున్నట్టు చెయ్యి కలిపినా, అయిష్టంగానే.
ఆమెకి పూర్తి ఫీడింగ్ ఇచ్చే పంపించాడు తండ్రి
“చూడు, మీ ఆయనది పెద్ద వుద్యోగం. మనుషుల్ని పెట్టి చేయించుకునే స్థాయి అతనిది. ఏవేనా పనులుంటే ఆఫీసునించీ వచ్చి చేసిపెడతారు. మా ఆఫీసరు నాకు చాలా క్లోజు. అందుకని ఆయన పనులన్నీ నాకే అప్పజెప్తాడు. అలా మీ ఆయనకీ చేసేవాళ్ళు వుంటారు. ఇప్పటిదాకా ఆ అవసరం రాకపోతే ఎవర్నేనా పంపించమని నువ్వు అడుగుతూ వుండు. ఊరికే ప్రతీపనిలోనూ దూరిపోకు. వాళ్లు చేసుకుంటే చేసుకోనీ. చిన్న వుద్యోగాలు చేసేవాళ్ళు మరొకళ్ళకి చెయ్యాలితప్ప, వాళ్లకి ఎవరూ చేసిపెట్టరు. తప్పదనిపిస్తే పైపైని చేసి వూరుకో” అన్నాడు. ఇంకా చాలా చెప్పాడు. వాసుది పెద్ద వుద్యోగం కాదుగాబట్టి బావగారని పడిపడీ గౌరవం యివ్వక్కర్లేదనీ, గీతని లెక్కేచెయ్యక్కర్లేదనీ అలా. కమలాక్షి ఆయనకి భిన్నమైన మనిషి. అలాంటివి ఆవిడకి తెలీదు. అత్తవారిళ్ళలో జాగ్రత్తగా వుండమనే చెప్తుంది. అందుకని పిల్లలకి తనే చెప్పుకుంటాడు. మాధురిది పూర్తిగా తండ్రి మనస్తత్వం. నీలిమకి చెప్పాలి. ఎలా చెప్తే అలా వింటుంది. మానసది కాస్త స్వతంత్రమైన మనస్తత్వం. తండ్రిమాటలన్నీ మనసుకి ఎక్కించుకుని, కొన్నిటిని దాచుకుని, కొన్నిటిని జీర్ణించుకుని వచ్చింది నీలిమ.
రాగానే పరిస్థితులన్నీ చూసుకుంది. అత్తగారిది పెద్దగా ఏదీ కలగజేసుకునే తత్వం కాదు. గీత యింటిపని చూసుకుంటే వాసు బైట చూసుకుంటాడు. మాధవ్‍కి వాళ్ళు చెప్పేవి తక్కువ. అతనూ తనకి తోచినవి చేస్తాడు. అన్నదమ్ములిద్దర్లో ఎవరు ముందు స్నానం చేస్తే వాళ్ళు మంచినీళ్ళు నింపుతారు. పనావిడ తోమిన గిన్నెలు బైట కనిపిస్తే తెచ్చి లోపల పెడతారు. తిన్న పళ్ళాలు ఎవరివివాళ్ళు తీసెయ్యటం, తాగిన మంచినీళ్ళగ్లాసులు కడిగి పెట్టడం, ఎవరి బట్టలు వాళ్ళు ఇస్త్రీ చేసుకోవటం చేస్తూ గీతకి పని సులువుచేసిపెడతారు. తమతో సమానంగా అల్లరిచేస్తూ తిరిగిన గీత ఇక్కడ నడుం బిగించి తల్లికి బదులుగా వంటచేసిపెడుతుంటే వాళ్లిద్దరికీ వింతగా వుండేది. దానికి అలవాటుపడటానికి కాస్త టైం పట్టింది. పనులు వంతులువేసుకునే అలవాటు వాళ్ళమధ్యని లేదు. ఇది ఆ కుటుంబంలో వున్న ఏర్పాటు. కానీ కొత్తగా వచ్చిన నీలిమకి అంతా తండ్రి చెప్పినట్టే కనిపించింది.
పొద్దున్నే లేవట్లేదని ఆమెగురించి లక్ష్మి అంటే,
“పోనివ్వత్తా! కొత్తగా పెళ్లైనవాళ్ళు. ఎంత పని? తులసి వెళ్ళిపోయింది, ఆ స్థానంలో ఈ అమ్మాయి వచ్చింది. అంతేకదా?”’ అంది గీత.
“మీ పెళ్లైనకొత్తలో నన్ను తిట్టుకున్నారేంటే?” అనుమానాన్ని పరిహాసంతో జోడించి అడిగింది లక్ష్మి. గీత చెంపలు ఎర్రబడ్డాయి.
“పో అత్తా!” అంది ముఖం తిప్పుకుని.
“అంత పొద్దున్నే వండుకోవడం దేనికండి అక్కా? టిఫెన్లు తినేసి ఆఫీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనాలకి ఇంటికి రావచ్చుకదా?” అంది గీతతో.
“ఆఫీసన్నాక చాలా పనుంటుంది నీలిమా! ఒక్కోసారి లంచికి టైముండదు. టిఫెనైతే వేళదాటినా తినెయ్యచ్చు. ఆఫీసుకి వెళ్ళిందగ్గర్నుంచీ ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే అక్కడ పనెలా ఔతుంది? కూర్చోబెట్టి ఎవరూ జీతం ఇవ్వరుకదా?” అంది గీత.
“మా నాన్న అలానే చేస్తారు. పొద్దున్న కాఫీ ఎలాగా తాగుతారు. టిఫెను తినేసి, మరోసారి కాఫీ తాగి ఆఫీసుకెళ్తారు. ఒంటిగంటకల్లా వచ్చేస్తారు. మళ్ళీ మూడింటికి వెళ్ళి రాత్రి కొంచెం పొద్దుపోయాక వస్తారు”
“అందరికీ అలా కుదరదులే” అంది గీత. మగవాళ్ళు ఆఫీసువేళలో బైటపనులమీద తిరిగినా, రాత్రిదాకా వుండి పని పూర్తిచేసుకుంటారు. ఆడవారికి అలా కుదరదు. అందుకని సీటు వదలకుండా పనిచేసుకుని, వేళకి బైటపడతారు. ఐదయ్యేసరికి ఠంచనుగా బేగులు సర్దేస్తారని కొన్నిసార్లు మాటా పడతారు. ఇవన్నీ ఉద్యోగానుభవం లేని నీలిమకి తెలీవు.
“ఏమో మరీ!” అంది. అదోక పదప్రయోగం. నువ్వేదో చెప్పావు, నాకు దానిమీద నమ్మకం కలగలేదు అని సూచిస్తుంది. గీత వాదన పొడిగించలేదు.
“అంత పొద్దున్నే వండేసరికి మీరు తినే టైముకి అన్నీ చల్లారిపోతున్నాయి. పోనీ వాళ్ళ వంట అక్క చేసినా మనకి నేను వండనా?” లక్ష్మిని అడిగింది నీలిమ.
“రోజుకి మూడుసార్లు వంటంటే బోల్డంత గేస్ ఖర్చౌతుంది నీలిమా! సిలిండరు బుక్ చేస్తే నెలైనా రావటం లేదు. నువ్వూ వాళ్లతో తినేసెయ్” అంది లక్ష్మి. నీలిమది అలా పరిష్కారంవైపుకి జరిగి సర్దుకునే తత్వం కాదు.
“అంత పొద్దుటే భోజనం చేస్తారేమిటి మీరు? ఆకలి ఎలా వేస్తుంది? తినబుద్ధౌతుందీ?” మాధవ్‍తో అంది.
“వదిన అందరికీ అలా అలవాటు చేసేసింది. గ్రౌండుకి వెళ్ళొస్తాంకదా, నేనూ వాసూను? మంచి ఆకలిమీద వుంటాం” అన్నాడతను.
“ఇప్పుడు మీరు వెళ్ళట్లేదుకదా?” అడిగింది.
“ఇక వెళ్ళడం మొదలుపెట్టాలి. ఇక్కడ వున్నన్నిరోజులేనా వెళ్తే బావుంటుంది. వేరేచోటికి ట్రాన్స్ఫరైతే గ్రౌండూ అవీ వుండవు” అన్నాడతను.
“అబ్బ! మీకు ఎలా చెప్పాలో తెలీడం లేదు. మీ వదిన పొద్దున్న పొద్దున్నే వండిపడేసే అన్నం తినడానికి ఆకలి పుట్టడంకోసం మీరిప్పుడు గ్రౌండుకి వెళ్ళి ఆడి ఆవురావురుమంటూ రావాలా? భలే వున్నారు” అని మురిపెంగా విసుక్కుంది. అతను నవ్వేసాడు.
“సరే, నువ్వే చెప్పు. ఏం చెయ్యాలో” అన్నాడు.
“పొద్దున్న వెళ్తే రాత్రికిగానీ రారు మీరు. మాట్లాడే మనిషి లేక బోరుకొట్టిపోతుంది. మధ్యలో రావచ్చుకదా?” అంది. మిగిలినవాళ్లకి తోచకపోవడం సమస్య వుండదు. తోచకపోతే ఏదో ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటారు. టీవీ చూస్తారు. మరొకళ్ళు వచ్చి కాలక్షేపం చెయ్యాలని అనుకోరు. ఎమెస్కో పాకెట్‍బుక్స్, కొన్ని పత్రికలూ తెప్పించుకుని అన్నిళ్ళమధ్యా తిప్పుకుంటారు. నీలిమ పుస్తకాలు పెద్దగా చదవదు. చుట్టూ అన్ని పుస్తకాలు చూసి, ఇప్పుడిప్పుడే తిరగేస్తోంది.
“అక్కకీ చెప్పాను. తనకి వీలవదంట. మీరేనా రండి” అంది తనే మళ్ళీ. మాధవ్ మరోలా అర్థం చేసుకున్నాడు. తనకీ వాళ్ళకీ కేడర్ తేడా వుంది. లంచికి లేచిన వుద్యోగిని ఆపి, “ఆ ఫైలు తీసుకురా!” అని చెప్పగలిగే అధికారం తనకి వుంది.
“లంచికి వెళ్తున్నాను, వచ్చాక ఇస్తాను” అనగలిగే అవకాశం వాళ్ళిద్దరికీ లేదు. ఆ విషయాన్ని అతను పైకి అనలేదు. కానీ నీలిమ చురుకైనది. గ్రహించింది. అర్థం చేసుకుంది. ఎక్కడ, ఎలా అన్వయించుకోవాలో అక్కడ అలా అన్వయించుకుంది.
“మీ అమ్మగారు వినేలా చెప్పండి, మధ్యాహ్నం భోజనానికి వస్తానని. నేను వండి పెడతాను. నా వంటకూడా రుచిచూద్దురుగాని. ఎప్పుడూ మీ వదిన వంటేనా?” అంది. తనంత విపులంగా చెప్పినా ఆమె మాట నెగ్గించుకుందని లక్ష్మికి అర్థమైంది. మనసు చివుక్కుమంది.
“వాళ్ళిద్దరికీ వండకులే, గీతూ! మాధవ్ లంచికి వస్తాడట. ఇద్దరికీ వేడిగా వండుకుని తింటామన్నారు” మర్నాడు చురుగ్గా అంది గీతతో. ఆమె నవ్వేసింది.
“నువ్వే పార్టీ?” అడిగింది. “పోన్లే అత్తా! కొత్తగా పెళ్లైందికదా, మాధవ్‍తో ప్రైవసీ కోరుకుంటోందేమో!” సర్దిచెప్పింది. లక్ష్మీ నవ్వింది. తులసికి పెళ్ళి చేసి పంపెయ్యడం మంచిదైందనిపించింది ఆవిడకి. మర్నాడు మామూలువేళకి మయూఖ్‍కి పెట్టి, తను తినేసి, గిన్నెలన్నీ తోమటానికి వేసేసింది. ఆమెకీ కొంచెం పంతం వుంది. ఏదో ఇంత అన్నం వండి, కాస్త వేపుడు చేసి, మిగిలిన ఐటెమ్స్‌తో సరిపెట్టచ్చుననుకున్న నీలిమ అన్నీ మొదట్నుంచీ వండాల్సి రావటంతో తెల్లబోయింది. వాళ్ళిద్దరూ కావాలనే ఇలా చేసారనిపించింది. మాధవ్‍కి చెప్పాలనుకుంది. ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? అంతకుముందు ఇలాంటి అనుభవం ఒకటి జరిగింది. వంటింట్లో జరిగిన ఏదో విషయం అతనికి చెప్పబోయింది.
“నేనిప్పుడు అక్కడికి వచ్చి నీవైపున వకాల్తా తీసుకోవాలా? బావుండదు నీలూ! నలుగురు మనుషులు వుండేచోట నాలుగు అభిప్రాయాలు వుండటం సహజం. నలుగుర్నీ ఒకతాటిమీదికి లాక్కురావటమేకదా, కుటుంబం అంటే. అమ్మ ఎలా చెప్తే అలా విను. ఆవిడ పెద్దదికదా?”అన్నాడు.
“ఆవిడ మీ వదినవైపే మాట్లాడతారు” అంది కినుకగా.
“వదినెవరు? మా మామయ్యకూతురు. అంటే వదినవి మాఅమ్మ పుట్టింటి పద్ధతులు. అందుకని ఇద్దరికీ కలుస్తుంది. వాళ్ళిద్దర్నీ నీదారికి రమ్మనడంకన్నా నువ్వే కాస్త సర్దుకుపోవటం బావుంటుంది. లేకపోతే నచ్చజెప్పు” అన్నాడు.
“అంటే నేనే పైదాన్నన్నమాట” అంది ఆమె విసురుగా. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఎలా సర్దుబాటు చెయ్యాలో మగవారికి తెలీదు. ఆ తెలీకపోవటంతోనే అటు తల్లికో, ఇటు భార్యకో కంటౌతారు.
ఇప్పుడు చెప్పినా, “నువ్వేకదా, నాకు వండి పెడతానన్నది?” అని అడుగుతాడు మాధవ్. ఎటూ మాట్లాడలేక వూరుకుంది.
తర్వాతెప్పుడో తల్లితో చెప్తే, “సిగ్గుందా నీకు? అత్తగారూ, తోడికోడలూ వండిపెడుతుంటే కూర్చుని తింటున్నది చాలక తంపులు పెట్టుకుంటున్నావా? పొద్దున్నే తిని ఆఫీసుకి వెళ్ళడానికి మీ ఆయనకి లేని అభ్యంతరం నీకేంటి? ఉన్నవి తినడానికి మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు?” అని తల్లి ఆమెనే కేకలేసింది.
చిన్నచిన్న గొడవలు మొదలౌతున్నాయి. ఏ యిల్లూ కోడలిరాకతో మొదలవ్వదు. అప్పటికే అనేక వ్యవహారాలు జరిగి వుంటాయి. కోడలు రావడమన్నదే ఆ వ్యవహారాల్లో ఒకటి. లక్ష్మి భర్త ఇంట్లోంచీ వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పట్నుంచీ వాళ్ళ కుటుంబవిషయాలన్నీ రామారావే చూసుకుంటున్నాడు. ఇప్పుడుకూడా అటో యిటో వెళ్తూ రెండుమూడురోజులకి ఒకమాటు వచ్చి చెల్లెల్ని చూసి వెళ్తాడు. ఏది చెయ్యాలన్నా ఆవిడ అన్నగారికి చెప్పకుండా వుండదు. నిర్ణయం వాళ్లదైనా దాన్ని జరిపించేది వాసు. మాధవ్ పట్టించుకోడు. వాసు ఏదేనా చెయ్యమంటే చేస్తాడు. అతనివరకూ ఆయన ఇంకా మేనమామే. అన్నకి పిల్లనిచ్చిన మామగారిగా మారలేదు. కనిపిస్తే ఎదురెళ్ళి చెయ్యిపట్టుకుంటాడు. నడిపించుకు వచ్చి సోఫాలో కూర్చోమని తను పక్కన కూర్చుంటాడు.
చిన్నప్పుడు పిల్లలందరిదీ తలోరకం అల్లరిగా వుండేది. అమ్మమ్మతో పోట్లాట వచ్చినప్పుడల్లా మాధవ్ ఆవిడ మట్టిపొయ్యి విరిచేసేవాడు.
“మామయ్య రానీ! నీ వీపు విరగ్గొట్టిస్తాను” అని ఆవిడ బెదిరించేది. అతను ఇంటిమీదికి ఎక్కి కూర్చునేవాడు. దిగడం వచ్చేదికాదు. మిగిలిన పిల్లలందరూ చుట్టూ మూగి చూసేవారు. అక్కడినుంచీ పడతాడేమోనని లక్ష్మి భయపడేది. వాసో, రాణాయో ఎక్కాలనుకున్నా, మాధవ్ ఇంకే దుడుకుపని చేస్తాడోనని పెద్దవాళ్ళు ఆపేవారు. ఆఖరికి రామారావు వచ్చి దిగమని బతిమాలేవాడు.
“దిగను మామయ్యా! నేను ఇక్కడే వుంటాను. దిగితే నువ్వు కొడతావు” అనేవాడు మాధవ్. అరగంట బతిమాలటాలూ బుజ్జగింపులూ అయ్యాక చాక్లెట్ కొనిస్తాననే ప్రమాణం చేయించుకునేవాడు. రామారావు నిచ్చెన వేసి బలంగా పట్టుకుంటే దిగేవాడు. దిగేసరికి భయంతో చెమటలు పట్టేసేవి. ఆయన్ని గట్టిగా కౌగలించేసుకునేవాడు.
“అంత భయం వున్నవాడివి ఎందుకు ఎక్కేవురా? పడితే ఏ కాలో చెయ్యో విరిగేదికదరా? ” అని కోప్పడేవాడాయన.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.