ఝరి – 85 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

ఏమిటీ ప్రేమ? తనమీద వీళ్లకి ఎందుకుండదు అలాంటి ప్రేమ? తనూ అక్కో వదినో ఔతుంది వీళ్ళకి. కానీ దూరదూరంగా వుంటారు. మాటల్లో కలుపుకుంటారుగానీ, ప్రత్యేకం తనతోటే మాటలనేవి వుండవు. గీతతో రహస్యాలుంటాయి, చెవుల్లో గుసగుసలుంటాయి. గలగల, కిలకిల, కిచకిచ నవ్వులుంటాయి. వీళ్ళు తనని ఇంత దూరంగా వుంచుతున్నారని మాధవ్‍కి తెలీదా?
ఉన్నట్టుండి రవళి వచ్చింది. రైల్వేలో జాబ్‍కి రాతపరిక్షలో పాసైందట. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గైడెన్స్‌కోసం వచ్చింది. గీత, లక్ష్మీ హాల్లో వున్నారు.
“మహీనికూడా తీసుకు రావల్సిందే. దాన్ని చూసి చాలారోజులైంది” అంది లక్ష్మి.
“దాన్నసలు నాన్న బతకనిస్తున్నాడా ఆమ్మా? వద్దామనే బయల్దేరింది.
నీకన్నా చిన్నవాళ్ళు, గీతకీ, మాధవ్‍కీ పెళ్ళిళ్ళయ్యాయి, వాళ్ళింటికి వెళ్లడానికి సిగ్గులేదూ- అన్నారు. అది పాపం ఆగిపోయింది.
ఆయన మాటలకేం? ఎప్పుడూ వుండేవే. రావే- అని ఎంత చెప్పినా ఇంక రాలేదు. అమ్మా చెప్పింది” అంది రవళి. ఆమె గొంతు విని నీలిమ వాళ్ళ గదిలోంచీ వచ్చింది. ఇక్కడుండేది గీత, లక్ష్మే అన్న పాత అలవాటుతో రాగానే అనేసింది. లోపల నీలిమ వుందని అనుకోలేదు. అంటున్నదల్లా నీలిమని చూసి ఆగిపోయి నాలిక్కరుచుకుంది. నీలిమా చూసింది, గీతా చూసింది.
“పైవాళ్ళెవరు? నీలిమేగా, చెప్పు” అంది గీత. అదొక హెచ్చరిక. చెప్పేది మధ్యలో ఆపద్దనీ, అతిగా చెప్పద్దనీకూడా.
“ఏదో సంబంధం చూసారుకదే, వాళ్ళకి నచ్చిందనికూడా అన్నారట. ఎంతదాకా వచ్చింది?” అడిగింది లక్ష్మి. కొంచెం ఇబ్బందిపడింది రవళి. చెప్పకుండా వుండటానికి వీలులేని పరిస్థితి. అసలే వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళకీ కాస్త గర్వం వుందని చిన్న అపప్రథ వుంది. నీలిమ ఇదంతా గ్రహించుకుంది. అక్కడినుంచీ వెళ్ళిపోనా అనుకుంది. మళ్ళీ ఎందుకు వెళ్ళాలని పంతగించుకుంది.
“కట్నందగ్గిర బిగదీసుకుని వున్నారు ఆమ్మా! నాన్నకి అదే కోపం.
కుదిరిన సంబంధం వదులుకోవద్దు. డబ్బు కావాలంటే అందరం కలిసి సర్దుతాం. తర్వాత లెక్కలు చూసుకోవచ్చు- అన్నాడు రవి మామయ్య.
నా కూతురి పెళ్ళి నేను చేసుకోగలను. మీరంతా చందాలేసుకుని చెయ్యక్కర్లేదు- అన్నారు. దాంతో మామయ్యకి కోపం వచ్చింది.
చందాలమీద పెళ్ళి చేయ్యాల్సిన స్థితిలో నా మేనకోడలు లేదని నాకూ తెలుసులెండి బావా! మాకూ బాధ్యత వుంటుందిగా, ఓ చెయ్యి వేస్తామని చెప్తున్నాను. సంబంధం వదులుకోకండి- అని గట్టిగా చెప్పి వెళ్ళాడు.
ఈయన కాస్త కోపం తగ్గించుకుంటే కుదిరినట్టే” నెమ్మదిగా అంది రవళి. మహతికి సంబంధం కుదుర్తోందంటే గీత ముఖం వికసించింది.
“దాని మొహం చూడు. పెళ్ళికళ ముందు ఇక్కడే వచ్చేసింది” అంది లక్ష్మి నవ్వి.
వాసు, మాధవ్ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. విషయం విని,
“ఇప్పుడు మళ్ళీ గోడలు దూకాలేంటే?” అన్నాడు మాధవ్ పకపక నవ్వి. చిన్నప్పటి అనుభవాలు గుర్తుచేసుకుని.
“పోరా! మీరు గోడలు దూకితేనే మేం పరీక్షలు పాసయ్యామేమిటి? మీకు దూకాలనిపించి దూకారు” అంది రవళి.
“అదేమిటి?” అడిగింది నీలిమ. వాసు చెప్పాడు. గీత అలిగింది. అన్నదమ్ములిద్దరూ పడీపడీ నవ్వారు. తులసి పెళ్ళై వెళ్ళిపోయాక అన్నదమ్ములిద్దరూ బాగా బెంగపడ్డారు. అలవాటుపడటానికి కాస్త టైం పట్టింది. ఇంత చైతన్యం, ఇన్నిన్ని నవ్వులు ఈమధ్య ఇంట్లో లేవు. నీలిమకి అదంతా కొత్తకొత్తగా అనిపించింది. వీళ్ళు నలుగురు కలిస్తేనే ఇలా వుంటే అందరూ కలిస్తే ఎలా వుండేదో వూహించుకునే ప్రయత్నం చేసింది. ఊహకి అందలేదు.
రవళి రెండురోజులుంది వాళ్ళింట్లో. మాధవ్, వాసూ చెప్పగలిగినవన్నీ చెప్పారు. ముగ్గురూ ఆఫీసులకి వెళ్ళిపోయినా చదువుతూనూ, లక్ష్మితో మాట్లాడుతూనూ, మయూఖ్‍ని ఆడిస్తూనూ వుండిపోయిందితప్ప చనువుగా వచ్చి నీలిమ గదిలో కూర్చుని మాట్లాడలేదు. ఆమె ఇవతలికి వచ్చినప్పుడు మాత్రం కలుపుగోలుగానే మాట్లాడింది.
“వదినా!” అంటుంటే,
“చిన్నదేకదే, పేరుపెట్టి పిలువు” అంది లక్ష్మి. చనువనేది వరసల్లోనూ పిలుపుల్లోనూ వుండదు.
సెలవు పెట్టి, రవళిని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి, అదయ్యాక వాళ్ళింట్లో దింపి వచ్చాడు వాసు.
మహతికి సంబంధం కుదిరింది. పెళ్ళి పెత్తనం అంటే గీత చేతిలో డబ్బంతా పెడతారేమోననుకుంది నీలిమ. మహతి తండ్రి నోటిదురుసు మనిషి. మిగిలిన పెళ్ళిళ్ళకన్నా ఇక్కడ ఇంకా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. నిర్మలకోసం ఆవిడ అక్కచెల్లెళ్ళూ అన్నదమ్ములూ సర్దుకుంటారుగానీ, తోడల్లుళ్ళెందుకు సర్దుకుంటారు? పనులతోపాటు ఆయన్ని రవికీ, విజ్జెమ్మకీ అప్పగించింది గీత. మిగిలిన పనులే అందరికీ సర్దింది. పెళ్ళికి బాగా ముందే తల్లిని వాళ్ళింటికి పంపేసాడు రామారావు. ఆవిడకే నారాయణ కాస్తంత వినేది. లేకపోతే నిర్మలని నిరంతరాయంగా తిడుతునే వుంటాడు.
పెళ్ళిలో మొదటిసారి అందర్నీ ఒకచోట చూసింది నీలిమ. అంతమంది పెద్దవాళ్ళుండి పనులన్నీ చూసుకుంటూ వుంటే చెయ్యటానికేమీ లేక అవీయివీ తింటూ పదిమందో పాతికమందో వూరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటం ఎలా వుంటుందో అనుభవంలోకి వచ్చింది. కానీ ముగ్గురూ ఆ కుటుంబానికి స్పష్టంగా కనిపించే అతుకులానే అనిపించారు తమకి తాము.
పెళ్ళికి రాణా వచ్చాడు. అతనిప్పుడు వైఫల్యాలకి సాకారరూపం. ఎవరితోటీ కలవలేకపోయాడు. అటూయిటూ తిరిగేసి వెళ్ళిపోయాడు. గీతవైపు చూసే సాహసం చెయ్యలేదు.
గీత పెళ్ళైన తర్వాత అతను వుద్యోగం వెతుక్కుని దుబాయ్ వెళ్ళాలనుకుని ఒక ఏజెంటుకి డబ్బు కట్టాడు. ఆ ఏజెంటు ముంబైదాకా అతన్ని రప్పించి కనిపించకుండా పోయాడు. మోసం జరిగిందని గ్రహించాడు రాణా. పోలీసు కంప్లెయింటిస్తే అదొక బోగస్ సంస్థని తేలింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు వెనక్కి రాలేదు. చిన్నాపెద్దా వుద్యోగాలు చేసాడు. పెళ్ళి చేసుకుంటానని ఒకమ్మాయిని మోసం చేసి, కడుపుచేస్తే ఆ వూరివాళ్ళు కట్టుగా నిలబడి గుళ్ళో పుస్తె కట్టించారు అతనిచేత. ఇది బయటికి వచ్చిన వార్త. మగపిల్లలకే తెలిసి, ఆడపిల్లలదాకా రానిది చాలా వుంది.
సంధ్యగానీ, ఆమె భర్తగానీ ఆ అమ్మాయిని ఆదరించలేదు. కడుపులో కవలలు. ఆర్ హెచ్ మిస్‍మేచింగ్ వుంది. ఆ అమ్మాయికి వైద్యం జరగాలి. రాణా దగ్గిర డబ్బు లేదు. విజ్జెమ్మ కూతుర్ని తిట్టింది. ఆ అమ్మాయి తండ్రికి కబురుపెడితే వచ్చి కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. గీతకి ఈ వ్యవహారం అంతా తెలిసింది. మనసంతా కలతబారిపోయింది. తమలో ఒకడు, భార్యకి వైద్యం చేయించలేని అసమర్ధుడు. పరాయి ఆడవారిని గౌరవించలేని దుర్మార్గుడు.
గీతకి పెళ్లై ఇప్పటికి ఐదేళ్లైంది. ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు. ఎవరు ఎలా వుండబోతున్నారో రూపుకడుతున్నట్టే వుంది. మాధవ్ తప్ప అందరికీ పిల్లలు. ప్రహ్లాద్‍కీ, వసంత్‍‍కీ కూతుళ్ళు. సుమతికి కొడుకు. సమీరకీ, తులసికీకూడా పుట్టేసారు. ప్రవల్లికకి సంబంధాలు చూస్తున్నారు. పెద్దపెద్ద సంబంధాలకీ, డబ్బున్న సంబంధాలకీ వెళ్తుంటే నివ్వెరబోయి చూస్తుంది మాధురి. కూతురికోసం అరుణ అన్నీ కొని దాస్తోంది. బంగారం చేయిస్తోంది. పిల్లలని ఇంత అపురూపంగా చూసుకుంటారా అని ఆశ్చర్యం.
అంతా బుజ్జిబుజ్జి పిల్లల్నేసుకుని తిరుగుతున్నారు. పెద్దవాళ్ళకి చేతినిండా పని. కొత్తగా నాన్నలుగానూ, మేనమామలుగానూ అవతారం ఎత్తిన మగపిల్లలు ఈ పిల్లలందర్నీ ఎత్తుకుని మోస్తున్నారు. తాతలు సరేసరి. అదో కొత్త హోదాలా వుంది అందరికీ.
సుమతి కొడుక్కి జలుబు చేసింది. ముక్కూనోరూ ఏకప్రవాహంలా కారుతోంది. కాసేపు వాడిని ఎత్తుకున్నాక కర్చీఫ్‍తోపాటు జోకి అందించింది.
“అదేమిటే, పాపం? వాడికి ముక్కు కారుతోందికదా?” అని సుమంత్ కోప్పడితే-
“ఏం, బొబ్బ పోసి, పౌడర్లు రాసి, ముక్కూమూతీ తుడిచి మీ చేతిలో పెడితేనేగానీ ఎత్తుకోరా?” అని దెబ్బలాడింది.
వాసు బాగా పొడుగు. అటూయిటూ వెళ్తుంటే మంటపం అలంకరణకి కట్టిన పూలదండలూ, తోరణాలూ తలకి తగుల్తున్నాయి. మొదట సరదాగా కేరింతలు కొట్టి, తర్వాత అవి తనకి తగలట్లేదని మయూఖ్ ఏడుపు మొదలు పెట్టాడు. వాసు ఎత్తుకోబోతుంటే-
“అమ్మనికూడా ఎత్తుకో, అమ్మకీ తగలట్లేదు” అన్నాడు. వాసు తల కొట్టుకున్నాడు. ఎవరేనా విన్నారేమోనని చుట్టూ చూసుకున్నాడు.
మాధురి కూతురు ఏడుస్తుంటే చాక్లెట్ బార్ చేతిలో పెట్టి “నాన్న దగ్గిరకి పో. నా చీర పాడౌతుంది” అని పంపేసింది. అప్పటిదాకా పాస్టెల్ కలర్ షర్టులు వేసేవాడల్లా ప్రహ్లాద్ ఈ పిల్ల పుట్టాక నలుపుమీద ఎర్రగళ్ళూ, ఎరుపుమీద నీలంగళ్ళకి మారిపోయాడు.
పద్మకీ, భర్తకీ మానసమీద కోపం. ఐనా మనవరాలిని ఎత్తుకుని దింపరు. ఇద్దరు మనవల్నీ చెరొకళ్ళూ ఎత్తుకుని తిరుగుతారు.
గీత మనసులో వుదయించిన ప్రశ్న. ఈ అందరిమధ్యా రాణా భార్యస్థానం ఎక్కడ? మామ్మ అత్తని తిట్టింది. ఆవిడ తన చేతుల్లో ఏమీ లేదనేసింది. రాణా భార్యపట్ల ఈ కుటుంబానికిగానీ , తమందరికీగానీ ఎలాంటి బాధ్యతా లేదా? వాడు దుర్మార్గుడైతే వాడి భార్యకి శిక్ష వేస్తే ఎలా? ఆమె మనసులో దు:ఖం సుళ్ళు తిరుగుతోంది. తనకి ముందు అదే డెలివరీబల్లమీద చనిపోయిన హరిచందన గుర్తొచ్చింది. ఆమె చనిపోయాక సర్వం కోల్పోయినట్టు మిగిలిన కమలాకర్, వసుంధర దంపతులు గుర్తొచ్చారు. తన చేతుల్లోకి వచ్చి ప్రాణాన్ని నిలుపుకున్న హరిచందన్ గుర్తొచ్చాడు. మనసంతా వికలమైంది.
అందరూ ఇక్కడే వున్నారు. అడిగేస్తే సరిపోతుందని అనుకుంది. బయటికి అనేముందే అన్నీ ఆలోచించుకుంటుంది గీత. ఈ ప్రక్రియంతా చకచక జరిగిపోతుంది. నాన్చడం వుండదు. ఆమె అన్నది నచ్చలేదని విమర్శించేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరూ లేరు. అందుకే సంకోచించలేదు. నెమ్మదిగా అంది.
“కొన్నాళ్ళకిందట నీలిమతో ఒకమాట అన్నాను-
మాయింటి మగపిల్లల భార్యలు పరాయివాళ్ళుకారని.
మిమ్మల్నిబట్టి మా విలువా, లేక పెళ్ళి చేసుకుని వచ్చినందుకు కుటుంబంలో మీతో సమానంగా మాకూ స్థానం వుంటుందా?” అడిగింది. ఏవో మాట్లాడుకుంటున్నవాళ్లంతా ఆగిపోయారు. ఎవరికీ ఆ ప్రశ్న అర్థమవ్వలేదు.
“కాస్త అర్థమయ్యేలా చెప్పవే” అన్నాడు ప్రహ్లాద్. మాధురీవాళ్ళు అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కుతూహలంగా చూసారు.
“వాడు వెధవే, కాదనను. అలాంటివాడిని నమ్మి తొందరపడటం ఆ పిల్లది తప్పే. అదీ కాదనను. అందుకు తనని అలా వదిలెయ్యడమేనా? మనది ఏకకుటుంబమని అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. మనలో మనకి సాయం చేసుకుంటాం. ఈ మనంలో ఆమెకి చోటులేదా?” గీత ఎవర్నిగురించి అంటోందో అందరికీ అర్థమైంది. మగపిల్లలందరి ముఖాల్లో అదోరకమైన భావం వ్యక్తమైంది. ఒకళ్లకేసి ఒకళ్ళు చూసుకున్నారు.
“ఇక్కడ జరగట్లేదని మామ్మ వాళ్ళ నాన్నని పిలిపించి ఆమెని పంపేసింది. వాళ్ళు బాగా పేదవాళ్ళు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయన ప్రైవేటువైద్యం చేయించలేడు. గవర్నమెంటు హాస్పిటల్‍కి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. డాక్టర్లు బాగానే చూస్తుండవచ్చు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ, ఎక్విప్‍మెంటు వుండవు. మందులు వుండవు. రాసిస్తాం, కొనుక్కోమంటారు. ఆయన కొనలేడు. నాకైతే అలాంటి వైద్యం చేయిస్తారా? ఇక్కడ ముగ్గురు డాక్టర్లున్నారు. డిసిప్లిన్స్ ఏవేనా కావచ్చు. కానీ కనీసపు వైద్యం చేయించుకోలేక ఒకమ్మాయి చచ్చిపోవడమనేదాన్ని మీ ముగ్గురూ వప్పుకోగలరా?” సూటిగా అడిగింది. “మందులూ, సరైన తిండీ లేకపోతే కనలేక చచ్చిపోతుంది యమున. అప్పుడా పిల్లల పరిస్థితేమిటి? పొట్టలో వున్న పిల్లలకికూడా ఏవో కాంప్లికేషన్సట. ఎలా పుడతారు వాళ్ళు? జబ్బులతోనా? ఏదేనా దారి ఆలోచించండి. మూడు నిండు ప్రాణాలు. మనందరికీ వుద్యోగాలున్నాయి. అందరం తలోకొంతా వేసుకుని వాళ్లకి సాయం చేద్దాం. ఆ పిల్లని ఈ విపత్తులోంచీ బైటపడేద్దాం.
ఆ తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేస్తారా, లేదా, తల్లీపిల్లలూ ఎలా బతుకుతారు అనేది మనకి అనవసరం” అంది. ఎవరూ ఏమీ జవాబివ్వలేకపోయారు.