ఝరి – 87 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

రాణాని చూసింది. అతను వీళ్లందర్లా ఎందుకు లేడు? వీళ్ళలో ఎందుకు కలవడు? వీళ్ళెందుకు కలుపుకోరు? అందరూ ఏకతానులో ముక్కలమని చెప్పుకుంటారు, అతన్నెందుకు దూరంగా వుంచారు? అతని భార్యకి తామంతా కలిసి వైద్యం చేయించడం దేనికి? గీత చెప్పగానే మారుమాట లేకుండా అంతా ఎందుకు సరేనన్నారు? ఆమె మాటకి ఎందుకంత విలువ? వాళ్ళు పదకొండుమందని చెప్తాడు మాధవ్. అతనిమాటకీ అంతే విలువ వుంటుందా, ఆ గ్రూపులో?
గీతకి పెళ్ళైనవెంటనే మయూఖ్ పుట్టాడట. తులసికీ అంతే. తన పెళ్ళికి ఆమె ప్రెగ్నెంటు. తన తర్వాత పెళ్లైనవాళ్ళిద్దరికీ పుట్టేసారు. తనకెందుకు ఇంకా పుట్టలేదు? ఈ విషయం ముల్లులా గుచ్చుతుంది ఆమెని. మాధవ్‍కికూడా ఈ బాధ వుందా? ఉంటే అలా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఎలా తిరుగుతున్నాడు?
చిన్నప్పుడు వీళ్ళలో వీళ్ళకి గొడవలొచ్చి, మగపిల్లలూ ఆడపిల్లలూ విడిపోయి దెబ్బలాడుకునేవారట.
“గీత భూమికి జానెడుండేది. నడుంమీద రెండు చేతులూ పెట్టుకుని వాసుతో దెబ్బలాడటానికి వెళ్ళిపోయేది. వాసు అప్పటికే చాలా పొడుగు. ఈవిడ తల బాగా పైకెత్తి చూస్తుంటే వాసు తలదించుకుని మాట్లాడేవాడు. ఇప్పుడూ అంతేకదరా?” అని ప్రహ్లాద్ పగలబడి నవ్వుతుంటే అందులో నవ్వటానికి అంతేముందో తనకి అర్థమవ్వలేదు. విడిగా చూస్తే కాదుగానీ, వాసుపక్కని గీత పొట్టే.
“అప్పుడేకదరా, మీకు డేవిడ్ అండ్ గోలియాత్ కథ చెప్పాను?” అన్నాడు మాధవ్. నవ్వులు హోరెత్తిపోయాయి.
అతనికి ఎలాంటి బాధ లేదా? ఎప్పుడూ తన దగ్గిర బయటపడలేదు. తను బాధపడితే ఒక బయటిమనిషిలా వోదార్చాడుతప్ప, ఆ సమస్యలో వున్న రెండోమనిషిలా స్పందించలేదు. అతనికి తనమీద ప్రేమ లేదా? ప్రేమంటే ఏమిటి? గీత, వాసు చిన్నప్పుడే ఒకరికొకరు పేరుపడ్డారా? లేదని చెప్పింది లక్ష్మి. ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారట. పుట్టినప్పట్నుంచీ తెలిసిన మనుషులమధ్య ప్రేమ ఎలా సాధ్యం? చిన్నప్పట్నుంచీ తెలుసుకాబట్టి ప్రేమా? మేనత్తమేనమామ పిల్లలుకాబట్టి ప్రేమా? పెళ్లైనవెంటనే కొడుకు పుట్టాడుకాబట్టి ప్రేమా? మాధవ్‍కీ తనకీ మధ్యన వున్నది ఎలాంటి ప్రేమ? కేవలం తన అందం చూసిన ఆకర్షణేనా అతనిది? కవ్వంతో చిలక్కొడుతున్నట్టు సాగుతున్న ఆలోచనలన్నీ గీత దగ్గిరకి వచ్చి ఆగాయి.
“అలా వున్నావేమే?” అడిగింది లక్ష్మి, భోజనాలకి కూర్చున్నప్పుడు వుదాశీనంగా వున్న ఆమె వైఖరి చూసి. నీలిమ మాట్లాడలేదు. లక్ష్మే అర్థం చేసుకుంది. పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టకపోతే ఎదురయ్యే మాటలు తనకి తెలీనివి కాదు.
“ఏదేనా విశేషమా?” అని అడుగుతారు మొదట్లో.
“ఇంకా పిల్లల్లేరా? జాతకం చూపించుకున్నావా? డాక్టరుకి చూపించుకున్నావా?” అనే పరామర్శలోకి దిగుతారు. తమింట్లో ఎవరు అలా అడగరు, కానీ బయటివాళ్లని అలా అడక్కుండా ఆపడం సాధ్యం కాదు. తెల్లారిలేస్తే ఎవరెవరో వస్తారు తనింటికి. వాళ్లలో ఎవరేనా అనచ్చు. అదొక సహజకుతూహలంలాంటిది. ఏళ్ళతరబడి పరిచయం వున్నవాళ్ళు, ప్రేమగానే అడుగుతారుతప్ప, బాధపెట్టాలని కాదు. ఎవరూ అడక్కపోయినా తోటివాళ్ళని చూసాక నీలిమకే అనిపించవచ్చు.
“బాధపడకు నీలిమా! మీకేం వయసు మించిపోలేదు. డాక్టరుకూడా ఏ లోపం లేదని చెప్పిందికదా? రోజూ దేవుడికి దీపం పెట్టుకుని దణ్ణం పెట్టుకో. సంకల్పబలం వుంటే సాధించలేనిది వుండదు” అంది ఓదార్పుగా.
“నేనింత బాధపడుతున్నానుగానీ, మీ అబ్బాయికి కొంచెంకూడా పట్టింపు లేదండీ!” అంది నీలిమ జవాబుగా.
లక్ష్మి నవ్వింది. “ఏం చెయ్యమంటావు వాడిని? బైటికి బాధపడితే అందర్నీ చూసి అసూయపడుతున్నారనుకోరా?”
“బైటివాళ్ళెవరూ లేరుకదా? అందరూ వీళ్ళువీళ్ళేకదా? ఎందుకనుకుంటారు?”
“తప్పుగా అనుకోరుగానీ మనకో కష్టం రాగానే కనిపించినవాళ్లందరికీ చెప్పుకోవడం దేనికి? సుధీర్‍తోనూ, జోతోనూ మాట్లాడుతున్నాడు. లేడీడాక్టర్ని కలవమని వాళ్ళే అనుంటారు”
నీలిమ తెల్లబోయింది. అలా జరిగి వుంటుందని ఆమె వూహించలేదు.
“మనింట్లో ఎవరూ వంటరివాళ్ళు కారు నీలిమా! రాణా ప్రవర్తన సరిగ్గా లేదని దూరం పెట్టారు వీళ్ళు. అలాగని యమునని వదిలేసారా? వైద్యానికి సాయం చేద్దామనుకున్నారటకదా, అందరూ కలిసి?”
“అక్కగారంటే అందరూ తలూపారు. మా విషయంలో తనేం చేస్తుంది?” అడిగింది నీలిమ. ఇంకేమీ మాట్లాడకుండా తినేసి లేచింది.
ఆ సాయంత్రం గీత ఆఫీసునించీ రావటమే అలసటగా వచ్చింది. పెళ్ళి అలసట అనుకుంది లక్ష్మిగానీ, గీత అలా పనికి అలిసిపోయేంత సున్నితమైనది కాదు.
“అలా వున్నావేమే?” కొన్నిగంటలకిందట నీలిమని అడిగిన ప్రశ్నే ఆమెనీ అడిగింది. గీత నవ్వేసి వూరుకుంది. ఈ పెళ్ళి హడావిడిలోనే వాసుతో కలిసి వెళ్ళి డాక్టరుకి చూపించుకుని వచ్చింది. మూడోనెల. రాత్రి భోజనాలవేళకల్లా ఇంట్లో అందరికీ ఆ విషయం తెలిసింది. మనసులో ఏం వున్నా పైకి మాధవ్ నవ్వుతూనే తిరిగాడు. సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
నీలిమకి గుండె లోలోపల ఎక్కడో భగ్గుమంది. ఆరోజు రాత్రి మాధవ్‍తో పెద్ద గొడవేసుకుంది.
“రాణాబావగారి భార్యకి మనమంతా డబ్బివ్వడమేంటి? మీ వదిన ఏదంటే దానికి తలూపుతారా? వాళ్ళకి వుంది. రెండు జీతాలు. తగలేసుకోమనండి. మనకేం వుంది?” అని మొదలుపెట్టి ఏవేవో మాట్లాడింది. పిల్లల్లేనందుకు అతనికి చీమకుట్టినట్టుకూడా లేదని ఆరోపించింది. అన్నీ ప్రశాంతంగా విన్నాడు. గీత విషయం తెలిసినరోజే ఇలా దెబ్బలాడటం నీలిమలోని అసూయని పట్టిచ్చింది. అతనికి కోపం రాలేదు. జాలి కలిగింది. అత్త లేని కోడలూ, కోడల్లేని అత్తా అంటారు. సంఘటనలు జరగనప్పుడే మనుషులు వుత్తములుగా వుండేది. మిగతావాళ్లలాగే నీలిమకీ వెంటనే పిల్లలు పుట్టి వుంటే ఆమెకి ఇంత విరోధం వుండేది కాదు. ఈ విరోధం గీతపట్లకన్నా పరిస్థితులమీద ఎక్కువ.
“మనసు ప్రశాంతంగా వుంచుకో నీలూ! సుధీర్, వాసూ చాలా ఆలస్యంగా పుట్టారు. సుమతికికూడా పెళ్లైన వెంటనే పుట్టలేదు. మనం డాక్టర్ని కలిసాం. ఇద్దర్లోనూ ఏ సమస్యా లేదని చెప్పిందికదా? టైం రావాలి. అంతే. అంతకన్నా ఏం చెయ్యగలం? అందరం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. కలిసి ఏవో చెయ్యాలనుకుంటాం. అంతమాత్రాన ఎవరికీ ఏ బాధలూ లేవని కాదు. ఏవో వుంటాయి. అవే చర్చించుకుంటూ కూర్చోం. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం” అన్నీ విని, నెమ్మదిగా అన్నాడు మాధవ్.
“మనం వేరే వెళ్ళిపోదాం. నేనిక్కడ వుండలేను. మనదార్ని మనం బతుకుదాం. మామూలప్పుడే అందరూ ఆవిడ్ని నెత్తికి ఎత్తుకుంటారు. ఇప్పుడింకా ఎత్తుకుంటారు”
“వేరేనా?” తెల్లబోయాడతను. ఆమె మొదటి రాయి విసిరి చూసింది. అంతే. వెంటనే తనకి కావల్సిన జవాబు వస్తుందని ఆశించలేదు.
మర్నాటినుంచీ గీతని ఇంక కాలుకూడా కదపనివ్వరు, ఆమెకూడా కూర్చుని పనంతా చేయించుకుంటుందనుకుంది నీలిమ. కానీ గీత ఎప్పట్లానే లేచి పనులన్నీ చేసుకుంటుంటే తెల్లబోయింది.
“రెస్టు తీసుకోకపోయావా అక్కా?” అడిగింది అసహనాన్ని లోలోపలే దాచుకుని.
“నాకిప్పుడేమైంది?” అడిగింది గీత.
నీలిమ తర్వాత రెండోరాయి పద్మ భర్త విసిరాడు. నిజానికి అతనికి రామారావు యింటివిషయాలలో పెద్ద ఆసక్తేమీలేదు. అక్కడేదైనా వుంటేకదా తను ఆశించడానికీ, ఆసక్తి చూపించడానికీ అనేది అతను పెళ్ళప్పుడే అర్థమైంది. రామారావు కూతురికి స్థలం రాసివ్వడం పద్మలో అసంతృప్తికి కారణమైంది. తల్లిముందు అక్కడిక్కడే దాన్ని వెళ్ళగ్రక్కింది. అక్కడితో ఆగలేదు. భర్తతోకూడా అంది. పదేపదే అంది. అతనికీ చురుక్కుమనిపించింది. వసంత్‍కి కట్నం రాలేదన్న కోపం ఎలాగూ వుంది.
వసంత్ సివిల్ ఇంజనీరు. తపస్వినీనది కెనాల్ ప్రోజెక్టులో చేస్తున్నాడు. కెనాల్‍కోసం భూసేకరణ జరుగుతోంది. పరిహారం ఇస్తున్నారు. మహతి పెళ్ళికి వచ్చిన వసంత్ ఇంకా ఇక్కడే వున్నాడు. ఒక ఫ్రెండుకోసం ఆ వివరాలు తెలుసుకోవాలని వాళ్లింటికి వెళ్ళాడు వాసు. అప్పుడు జరిగింది ఆ సంభాషణ.
“రెండు జీతాలుకదరా మీకు, ఎంత దాచారేం?” కుతూహలంగా అడిగాడు. ఆయన మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడనిగానీ, తను లౌక్యంగా వుండాలనిగానీ అనుకోలేదు వాసు.
“గీత జీతం నేను తీసుకోను బాబాయ్. తనే దాచుకుంటుంది” మామూలుగా అన్నాడు.
“గొప్ప తెలివైనవాళ్ళురా, ఇద్దరూను”
“ఎందులో?”
“అన్నిట్లోనూ” ఆయన తమాషాగా చూసాడు. “గీత కట్నం ఇవ్వద్దనుకుంది. నువ్వు కట్నం తీసుకోననుకున్నావు. మీ మామ స్థలం ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు” అన్నాడు.
“ఆయన అలా చేస్తారని ఎవరం అనుకోలేదు. అసలు వూహించలేదు. గిఫ్ట్‌డీడ్ రాయించి తెచ్చి చేతిలో పెట్టారు”
“ఎలాగైతేనేం? ఆయన యిచ్చాడు, మీరు తీసుకున్నారు. నిన్ను చూసి వరసపెట్టి మిగతావాళ్లంతా కట్నాలు మానేసారు. ప్రహ్లాద్‍కి నందకిషోరూ, వసంత్‍కి నేనూ సంపాదించి అమర్చిపెడతామనుకో, మాధవ్‍గాడి పరిస్థితేమిట్రా? మీ నాన్న ఇల్లు పట్టించుకోడు. కొడుకులు సంపాదనపరులై వుండీ, మీ అమ్మ ఇంటిఖర్చులన్నీ తనే పెట్టుకుంటుంది. మిమ్మల్ని ఒక్క పైస అడగదు”
“ఎవరి జీతాలు వాళ్ళకి మిగుల్తున్నాయికద?”
“ఎంతైనా వాడికి మీలా రెండు జీతాలైతే కావుకదా?”
అప్పుడు ఎర్రబడింది వాసు ముఖం.
“ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవద్దని వాడిని ఎవరేనా అన్నారా బాబాయ్? పోనీ ఇప్పుడేనా ఆమెని చెయ్యద్దని ఎవరేనా ఆపారా?”
“అలాకాదు వాసూ! ఎవరి జీతాలు వాళ్లకి మిగులుతున్నాయి. నిజమే. కానీ మీ యిద్దరికీ కలిపి ఒకటే యిల్లుంది. అది ఆలోచించే బావ ఆ స్థలం ఇచ్చి వుంటాడు. ఆయనేం తక్కువవాడు కాదు. త్రిమూర్తులిని అడక్కుండా ఏదీ చెయ్యడు. మీరు అందులో కట్టుకుని వెళ్ళిపోతే ఇప్పుడున్న యిల్లు మాధవ్‍కి ఔతుంది, కూతురు పక్కనే వుంటుందని ఆలోచించుకుని వుంటాడు. ఇద్దరికీ వుద్యోగాలుకాబట్టి మీకు లోన్‍కూడా బానే వస్తుంది. తీర్చుకోవడం తేలిక” అన్నాడు పద్మభర్త. రెండు బొమ్మలు చిన్నపిల్లలకి పంచి యిచ్చి ఇది, నీకూ అది వాడికీ అని చెప్పినంత తేలిగ్గా ఆయన పంపకాలు చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోయాడు వాసు. చిన్నప్పట్నుంచీ ఎరిగుండి, వసంత్‍తో సమానంగా ప్రేమ చూపించిన మనుషులు అలా మాట్లాడటం అతనికి షాకే. వసంత్ వెంటనే కలగజేసుకున్నాడు.
“ఏం మాట్లాడతారు నాన్నా? చిన్నప్పుడు నన్ను కూర్చోబెట్టి చదువు చెప్పింది మీరేనా? వాళ్ళింటి విషయాలు వాళ్ళు చూసుకోలేరా? ఇల్లు కట్టుకోవాలా వద్దా అనేది వీళ్ళిష్టం. వీళ్ళకి లోన్లు వస్తే మాధవ్‍కీ వస్తాయి” అన్నాడు కోపంగా.
తినికూర్చుని గొడవలు పెట్టుకోవడం అంటే ఏమిటో వాసుకి అర్థమైంది. వెళ్తానని లేచాడు. వసంత్ బయటిదాకా వచ్చాడు.
“ఇవేవీ పట్టించుకోకురా, వాసూ! చిన్నప్పట్నుంచీ ఏది నేర్చుకున్నా నిన్నూ, సుధీర్నీ చూసే నేర్చుకున్నాను. రవళికీ గీతకీ తప్పొప్పులు చెప్పినట్టే నాకూ చెప్పావు. నేను అలా బుద్ధిగా వున్నందుకు అమ్మావాళ్ళూ సంతోషపడ్డారు. అప్పుడు మంచిదైన విషయం ఇప్పుడు కాకపోవడానికి కారణం వాళ్ల ఆలోచనల్లో మార్పు రావడం. నువ్వు నాకెప్పుడూ రోల్‍మోడల్‍వే” అన్నాడు ప్రేమగా చెయ్యినొక్కి.
వాసు ఏమీ మాట్లాడలేదు. ఇల్లు చేరుకున్నాడు. మాధవ్ ఇంకా ఆఫీసుకి వెళ్ళలేదు.
“అరేయ్, నీకేదైనా మనసులో వుంటే సూటిగా నాకే చెప్పు. వాళ్లచేతా వీళ్లచేతా చెప్పించకు” అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఏం జరిగిందో అర్థమవలేదు మాధవ్‍కి.
“మామయ్యగారు అన్నదాంట్లో తప్పేం వుంది? ఇంట్లో రెండు ఆస్తులున్నప్పుడు చెరొకటీ పంచుకోరా?” అంది మానస.
“నీకు తెలిసి అడుగుతున్నావో, తెలీక అడుగుతున్నావో తెలీదు మానసా! తెలీకపోతే తెలుసుకో. ఏదో ఒకటి మాట్లాడి గౌరవాన్ని పోగొట్టుకోకు. వాళ్ళకి వున్నది ఒకటే. రెండోది గీతది. ” కఠినంగా అన్నాడు వసంత్. ఈ గొడవంతా తెలిసాక నీలిమకూడా చెల్లెలన్నట్టే అంది. మాధవ్ అంత కఠినంగా జవాబివ్వలేకపోయాడు.