పెద్దాడబడుచైతే మర్యాదలు చేయించుకోవాలి. అక్కడేదైనా తేడా వస్తే దబాయించి అడగాలి. కొత్త ఆట ఆడతాం. అంతేగానీ ఈ మాట్లాడకపోవటం, తప్పుకు తిరగడం, గీత బాధపడటం నాకెందుకో బాలేదు. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన ప్రేమలు అలా పక్కకి పెట్టేస్తే ఎలా- అన్నాడు వాసు చిన్నబుచ్చుకుని. మామ్మ తనని చెయ్యిపట్టుకుని పక్కని కూర్చోబెట్టుకుంది. ఎంతటి కోపాలూ ఈ లాలనలో చల్లారిపోతాయి. వాసూ తగ్గాడు.
ఏవి ఎలా వున్నా, సుధీర్ వచ్చి వెళ్లడం, వాడి ఆకారం నాకు గుండెల్లో ఎక్కడో కదిలించినట్టైంది. ప్రిన్స్‌కదూ, వీడు? సుధీర్ని అలానే చూసేవాళ్ళం అందరం. తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా వుండేవాడు. వాళ్ళ నాన్నకి వాడంటే ఎంత ముద్దో! ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళకి నిజంగా డబ్బులేదా? మిథ్యాగౌరవంతో బతికేవారా? డబ్బుకి మించిన అవసరాలవల్ల ఆ లేనితనం, సరిపోకపోవడం వచ్చాయా? కాదనిపించింది.
జీవితం మనకి పర్యవసానంగానే తప్ప కారణంగా ఎప్పుడూ కనిపించదు. ఒక్కోసారి అది వూహలమీద కట్టుకున్న పేకమేడకూడా. నా పెళ్ళిప్రతిపాదన మరో రెండుమూడేళ్ళు ఆలస్యమై వుంటే వాళ్ళింట్లో అన్నీ సరిగ్గా జరిగి వుండేవి. ఈ మార్పులు వచ్చేవి కాదు. అప్పోసప్పో చేసి ఇతన్నీ చదివించేవారు. ఇతనికికూడా అది పెద్ద అభ్యంతరం అనిపించేదికాదు. నా పెళ్ళివిషయం అత్తకి మోస్తున్న ఆర్థికభారాన్నుంచీ తప్పుకోవడానికి ఒక అవకాశాన్ని చూపించింది. పేకమేడకి కదలికలు వచ్చాయి. మళ్ళీ ఇదీ కారణం కాదు, పర్యవసానమే. వాసు చదువైపోయి వుద్యోగం రావటం నాన్న నా పెళ్ళి చెయ్యాలనుకోవడానికి కారణం. అతనికి అంత వెంటనే వుద్యోగం రాకపోయి వుంటే అందరూ అంత తొందరపడేవారుకాదు. ఇదీ పర్యవసానమే. సుధీర్‍వాళ్ల నాన్నలాగా వాసూ వాళ్ళనాన్న ఇంటిని పట్టించుకోకపోవడం అతను పై చదువులకి వెళ్లకుండా వున్నచోటే వుద్యోగం వెతుక్కోవడానికి కారణం. ఇలా వెతుక్కుంటూ వెళ్తే దేనికీ మూలం దొరకదు మహీ! పైకి కనిపించేదాన్నే కారణం అనేసుకుని కళ్ళెదురుగా వున్నవాళ్లని తప్పుపడతాం. నా విషయంలోనేనా, ప్రమీలత్త విషయంలోనేనా జరిగింది ఇదే” అంది గీత.
మహతి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. నరేంద్ర అకారణద్వేషం వెనక వున్న కారణాన్ని తెలుసుకోగలిగిన తనకన్నా ఇలాంటి విషయాలు మరెవరు అర్థం చేసుకోగలరు?
“మూడునెలల మెటర్నీటీ లీవు పూర్తైంది. మరోనెల ఎక్స్టెండ్ చేసాను. ఈలోగా మయూఖ్ మనుషుల్ని గుర్తుపట్టసాగాడు. నేను ఎటు వెళ్తే అటు తల తిప్పుతున్నాడు. చిన్నచిన్న నవ్వులు ఒలకబోస్తున్నాడు. మెడ నిలుపుతున్నాడు. బోర్లాపడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక చెయ్యిమీద తిరగబడి, ఆ చెయ్యి తీసుకోవడం రాక ఏడుపు. వాడి చెయ్యి తియ్యడానికో అసిస్టెంటు, సదా నీ సేవలో అన్నట్టు. కాస్త ఆలస్యమైందో ఇంటికప్పు లేపేస్తున్నాడు. రోజులు క్షణాల్లా దొర్లిపోయాయి. ఇక ఆఫీసులో చేరాల్సిన సమయం వచ్చింది.
అప్పుడన్నాడు వాసు- ఈరోజు తిథి మంచిదే. మీ ఆఫీసరుగారింటికి వెళ్ళి కలిసి వద్దాం- అని. నాకు నచ్చలేదు. ముఖం చిట్లించి, ఎందుకని అడిగాను.
ఆఫీసులో కలుస్తానుకదా- అన్నాను.
గీతూ! ఆయన కూతురు ప్రసవంలో చనిపోయింది. ఆరోజు నిన్నంత హడావిడిగా రిలీవ్ చెయ్యడానికి అదే కారణం. అక్కడ హాస్పిటల్లో
డెడ్‍బాడీని వుంచుకుని ఆఫీసుకి ఫోన్‍చేసి చెప్పారట. నువ్వు తిరిగి డ్యూటీలో చేరేదాకా ఈ విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదనికూడా స్టాఫ్‍కి స్ట్రిక్ట్‌గా చెప్పారట. అందుకే ఎవరూ నీతో అనలేదు. మీ ఆఫీసుకి వెళ్ళినప్పుడు తెలిసాయి ఈ విషయాలు. వెంటనే వాళ్లింటికి వెళ్ళి చూసి వచ్చాను. నిజానికి వీడు పుట్టేదాకా నాకూ భయంభయంగానే వుండేది- అన్నాడు చప్పుని నా చెయ్యి పట్టుకుని.
నేను నివ్వెరపోయాను. ఒక ఆడపిల్ల, బిడ్డని కనడంలో వున్న రిస్కేమిటో అప్పుడు అర్థమైంది. భయంతో నిలువునా వణికిపోయాను. చావంటే ఏమిటో అర్థమయ్యే వయసుకాదుకదా, అది? నిజం అనేది మంచుతెరల వెనక ఎలా దాగి వుంటుందో, ఆ మంచు కరిగిపోయి బైటపడ్డాక ఎంత కటువుగా వుంటుందో తెలిసింది.
గీతా, ఇది తినమ్మా, బావుంటుంది. బాగా బలం వస్తుంది, మా పాపకోసం తెప్పించాను- అంటూ ఏది కొన్నా నాకూ కొంత వాటా వేసి, ఆయన కన్నకూతురితో సమానంగా నామీదకూడా కన్సర్న్ చూపించిన వ్యక్తిని ఒక చిన్నవిషయం నాముందుకి రాకపోవడంచేత వైషమ్యంతో చూసాను. మహీ! జీవితం నా ముందు ఒకొక్క పొరా ఇప్పుకుంటున్నట్టు కనిపించింది.
బాబా, పాపా? ఎలా వున్నారు- అడిగాను అతికష్టమ్మీద.
బాబు- వాసు జవాబు.
ఏమిటి, మీరిద్దరూ కలిసి చావు పరామర్శకి వెళ్తారా? వద్దు- అంది మామ్మ భయపడుతూ.
గీత పై ఆఫీసరుకద అమ్మమ్మా! వెళ్ళి చూసి రాకపోతే బావుండదు. అదీకాకుండా ఆయన అంతదు:ఖంలో వుండికూడా గీతగురించి ఆలోచించారు- అన్నాడు వాసు.
ఔననుకో, నువ్వెలాగా వెళ్ళి చూసొచ్చావుకదా? తప్పనిసరైతే దీన్ని తీసుకుని నేను వెళ్తాను. చిన్నపిల్ల, ఇదేం వోదార్చుతుంది అంత పెద్దవాళ్లని. ఇక్కడే భయపడిపోతోంది. వెళ్లక తప్పదా – అని మరోసారి అడిగి, నాతో బయల్దేరింది. ఆత్మీయులని పోగొట్టుకున్నవాళ్ళని పరామర్శించడంకూడా ఒక నైపుణ్యమే. తప్పనిసరిగా నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎంత పెద్ద దు:ఖంలోంచేనా తమని తాము ఓదార్చుకుని బైటపడతారనుకుంటాం. అది తప్పు. వాళ్లకీ ఓదార్పు కావాలి. ఆ దు:ఖంలోంచీ బైటపడేసే స్నేహహస్తం కావాలి. లేకపోతే ఆ దు:ఖం వారిని లోలోపల్నుంచీ ఆర్చేస్తుంది. వారి నీడ ఎవరికీ చల్లగా వుండదు.
మయూఖ్‍ని అమ్మకి వదిలి మేమిద్దరం వెళ్ళాము. మొదటిసారి వాడిని వదిలిపెట్టి వెళ్లడం. నా శరీరంలోంచో, మనసులోంచో ఒక భాగాన్ని వుంచేసి వెళ్తున్నట్టనిపించింది. నాకు వాడిమీద అంత ప్రేమ వుందనికూడా అప్పటిదాకా నాకు తెలీదు. ఉద్యోగం చేసే ప్రతి అమ్మా ఎదుర్కోవలసిన పరిస్థితి ఇది. మయూఖ్‍కోసం ప్రాణం పెట్టేవాళ్ళు చుట్టూ వున్నారు. నేను నిశ్చింతగా వెళ్ళచ్చు. ఐనా నాకంతా దిగులుదిగులుగా వుంది. వీడికోసం వుద్యోగం మానేస్తానన్నా వాసుగానీ మరెవరూగానీ వద్దనరేమో! నిర్ణయం తీసుకోవలసింది నేనే. ఇలాంటి సపోర్ట్‌సిస్టమ్ లేనివాళ్ల పరిస్థితి ఏమిటని ఆలోచించుకుంటే చాలా భయం వేసింది. ఆఫీసులో సీట్లో కూర్చున్నా యింట్లోనో ఇంకెక్కడో వదిలిపెట్టి వచ్చిన పిల్లలగురించే ఆలోచించే నా సహోద్యోగులు గుర్తొచ్చారు. వీళ్ళంతా ఆఫీసులో వున్నప్పుడు ఎంతో దిగులుగా, అన్యమనస్కంగా వుంటారు. కీ యిస్తే నడిచే ప్రాణమున్న బొమ్మల్లా వుద్యోగధర్మంచేత నడుస్తుంటారు. ఒకామె పనావిడమీద కూతుర్ని వదిలిపెట్టి వస్తుంది. ఇంకొకావిడ కొడుకుని చెయిల్డ్‌కేర్‍లో వుంచుతుంది. పిల్లలకి అక్కడ సరిగ్గా జరుగుతుందా జరగదా అనికాదు, ఏం కావాలో నోరుతెరిచి చెప్పుకునే వయసులేని తమ పిల్లలకి ప్రతినిధులు ఆ అమ్మలు, తాము లేకపోవడంతో ఆ పిల్లలని సరిగా అర్థం చేసుకోవటం జరుగుతోందా లేదా అని.
ఈ వూగిసలాట, దు:ఖం ఇలాగే వుండగా ఈ కొత్త దు:ఖం వచ్చి మీదపడింది.
ఆత్మీయులు పోయిన బాధ ఎంత బలమైనదో కళ్ళారా చూసాను. మేము వెళ్ళేసరికి మా ఆఫీసరుగారింటి వీధితలుపు తీసే వుంది. మా ఆఫీసరు. ఆయన పేరు కమలాకర్‍గారు. హాల్లో కూర్చుని వున్నారు. ఆయన చేతిలో పుస్తకం వుందిగానీ దృష్టి దానిమీద లేదు. పుస్తకాన్ని తెరిచిపట్టుకుని వెనక్కి తలవాల్చి ఏవో ఆలోచనల్లో వున్నారు. ఇస్త్రీ బట్టల్లో చక్కగా టక్ చేసుకుని నవ్వుతూ నవ్వుతూనే ఆఫీసు నడిపిస్తూ, మాకు తెలీనిచోట రూల్సూ రెగ్యులేషన్సూ చెప్తూ, సరిగా ఇంగ్లీషు రానివారికి డ్రాఫ్టింగ్ నేర్పిస్తూ ఎంతో చైతన్యంతో వుండే వ్యక్తి నలిగిపోయిన బట్టలు వేసుకుని, గెడ్డం పెరిగి, ఎముకలపోగులా ప్రాణావశిష్టంగా వున్నారు. ఆయన ఎదురుగా స్టాండువుయ్యాల. అందులో మయూఖ్‍కన్నా రెండురోజులు పెద్దవాడైన బాబు. పక్కంతా తడుపుకుని, వాడుకూడా బోర్లాపడి చెయ్యితీసుకోలేక ఏడుస్తూ. అలా ఆ దృశ్యం చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు.
రాధమ్మా! వీడెందుకో ఏడుస్తున్నాడు చూడు- అంటూ లోపలికి కేకపెట్టి యాదృచ్చికంగా ద్వారంవైపు తలతిప్పిన ఆయన నన్ను చూసి తెల్లబోయారు. నమస్కారం చేసాను.
గీతా! నువ్వామ్మా? రా. జాయినయ్యావా? ఎలా వుంది ఆఫీసు? ఏ బ్రాంచి ఇచ్చారు- మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ అన్నారు. నావెనక వున్న మామ్మని చూసి లేచి నిలబడి ప్రశ్నార్థకంగా చూస్తే పరిచయం చేసాను. ఒకటో రెండో ప్రశ్నలు వాళ్ళిద్దరిమధ్యా అటూ యిటూ నడిచాయి. ఆయన నాపట్ల చూపించిన కన్సర్న్‌కి కృతజ్ఞతలు చెప్పింది.
ఆవిడ లోపలుంది. వెళ్ళండి. పూర్తిగా మంచం పట్టేసింది- అంటూ వుండగా లోపల్నుంచీ రాధమ్మ అన్నావిడ వచ్చి బాబుని వుయ్యాల్లోంచీ తీసి ఎత్తుకుంది.
వీళ్ళని అమ్మగారిదగ్గిరకి తీసుకెళ్ళు- అని ఆమెకి చెప్పారు.
రండమ్మా- అంటూ కమలాకర్‍గారి భార్య వున్న గదిలోకి తీసుకెళ్ళింది. ఆవిడ మంచంమీద పడుక్కుని వుంది. కనుచీకట్లో ఆవిడ ముక్కుకీ చెవులకీ వున్న వజ్రాలు తళుక్కుమంటున్నాయి. కానీ ఎంతటి సంపదాకూడా కడుపుని ఆర్చేసే బాధని తీర్చలేదని సూచనగా కలిగిన స్ఫురణ. అలా త్రుటిలో కలిగే అవగాహనలకి పెద్దగా అనుభవం అవసరం వుండదు.
మావెనకే తనూ వచ్చి, లైటు వేస్తూ-
వసుంధరా! చూడు, గీతని చెప్తూ వుంటానే ఆ అమ్మాయి వచ్చింది. వాళ్ళ మామ్మగారుకూడా వచ్చారు- అన్నారు. ఆవిడ నెమ్మదిగా లేచి కూర్చుంది. పమిటకొంగుతో మొహం, కళ్ళూ తుడుచుకుంది. ఆవిడకీ నమస్కారం చేసాను.
కూర్చోండి- కుర్చీలు చూపిస్తూ అంది.
ఎన్నోరోజుల్నించీ తిండి సరిగా తినక, దు:ఖం నిగ్రహించుకోలేక, కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నట్టు వుందావిడ.
మామ్మ తన వయసుచేత కొంచెం స్వతంత్రం తీసుకుంది. వాళ్ళు ఆ స్వతంత్రాన్నీ, ఆవిడ చూపించిన ఆధిక్యతనీ గౌరవించి ఆమోదించారు.
ఏమిటమ్మా, ఇది? పోయినవాళ్లతో పోతామా? మీ దు:ఖం ఎవరూ తీర్చగలిగేది కాదు. మీరే వోదార్చుకోవాలి. కాస్త లేచి మొహం అదీ కడుక్కుని, ఏదేనా తిని వచ్చి కూర్చోండి, నాలుగు మాటలు చెప్పి వెళ్తాను. మనసులో పెట్టుకోండి – అంది.
వసుంధరగారి కళ్ళు మళ్ళీ నీటిచెలమలయ్యాయి. ఏడుస్తూ కూర్చున్నచోటే ఒరిగిపోయారు. మామ్మ కొంచెం చనువు తీసుకుని లేచి వెళ్ళి ఆవిడ పక్కని కూర్చుంది. వీపుమీద నెమ్మదిగా రాస్తూ, చిన్నపిల్లని బుజ్జగించినట్టు బుజ్జగిస్తుంటే ఆవిడ కాస్త తేరుకుంది. ఈలోగా రాధమ్మ పిల్లవాడిని కడిగి, బట్టలు మార్చి, తెచ్చి నాకిచ్చింది. వాడు ఏడుస్తున్నాడు. అది పూర్తి ఏడుపూ కాదు, వోపికలేనట్టు కీచుమంటూ వుంది. ఎత్తుకుంటే వాడికీ, మయూఖ్‍కీ వున్న తేడా తెలిసింది. అల్పంగా వున్నాడు. బక్కగా పూచికపుల్లలా వున్నాడు. డబ్బాపాలు పోస్తున్నారట. అరగక నిత్యం అనారోగ్యం. గ్రైప్‍వాటరు, వాముకాటునీళ్ళు, ఆముదం. వీటితో ఆ చిన్నిబొజ్జ నిండిపోతోందట. బతుకుపోరాటం వాడి చిన్నిమొహంలో ప్రతిబింబించింది.
వాడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు రాధమ్మా? నాకు వాడితో ఏ బంధాలూ వద్దు. ఇంకో వారమో, నెలో అంతేకదా? ఇంక వాడికోసంకూడా ఏడ్చే శక్తి నాకు లేదు- అంది వసుంధరగారు విసుగ్గా. అందులో నిస్సహాయత. ఆ మాటలు నాకు అర్థం కావటానికి కొన్ని క్షణాలుపట్టింది. నేను అమ్మనికదూ, మహీ? కొత్తగా అమ్మనయాను.
ఇతన్ని వేరేగదిలోకి తీసుకెళ్లచ్చా- ఆవిడని అడిగాను. నా ప్రశ్న ఆవిడకి అర్థంకాలేదుగానీ, రాధమ్మ వెంటనే గ్రహించింది.
రండమ్మా- అని పక్కగదిలోకి తీసుకెళ్ళింది. మామ్మ తెల్లబోయి చూసింది. సరేననిగానీ, వద్దనిగానీ అనడానికి ఆవిడకి నేను అవకాశం ఇవ్వలేదు. కోపం వచ్చివుంటుందని అనుకోను. పిల్లవాడితో నేను తిరిగి ఆ గదిలోకి వచ్చేసరికి వసుంధరగారు నీళ్ళునిండిన కళ్ళతో రెండుచేతులూ ఎత్తి జోడించింది.
ఆశ వదిలేసుకున్నాం- అంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.