నేను మా అమ్మావాళ్ళింట్లో వుంటున్నాను ఇప్పుడు. పొద్దున్నా సాయంత్రం మా యింటికి పంపండి- అన్నాను నెమ్మదిగా.
ఇంక ఏడవకండి. పిల్లవాడికికూడా ఒక పరిష్కారం దొరికిందికదా? కాస్త నిశ్చింత తెచ్చుకోండి- అంది మామ్మ. ఆవిడ లేచి వెళ్ళి, ముఖం కడుక్కుని, బట్టలుకూడా మార్చుకుని వచ్చింది. నిలబడితే తూలిపోతోంది. రెండురోజులైందట, ఆవిడ మంచం దిగి, అన్నం తిని. రాధమ్మ చెప్పింది.
నాకు ఆరుగురు కూతుళ్ళు, ముగ్గురు కొడుకులు. నా మనవరాలు ఇది. రెండోకూతురి కొడుక్కి చేసుకున్నాం- అని మొదలుపెట్టి, మాకుటుంబాన్నిగురించి చెప్పి, మామ్మ ఆవిడ వివరాలన్నీ అడిగింది. ఆవిడ పుట్టిల్లు ఖమ్మం. అత్తవారిల్లు మధిర. బాగా ఆస్థిపరులు. తోటలూ, పొలాలూ వున్నాయి. ఇక్కడ ఫ్లాట్స్ వున్నాయి. అటువైపునీ ఇటువైపునీకూడా వీళ్ళే పెద్దవాళ్ళు. అత్తమామలూ, తల్లిదండ్రులూ చనిపోయారు. ఆవిడకి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఆయనకి ఒక తమ్ముడు. అందరూ వచ్చి కర్మ జరిపించి, సాంప్రదాయాలు పాటించి వెళ్లారట. ఇద్దరు కొడుకులమీద ఇప్పుడీ చనిపోయిన అమ్మాయి. ఒక కొడుకు బెంగుళూర్లోనూ మరోకొడుకు కొచ్చిలోనూ వుంటారు. కర్మంతా అయాక పెద్దకోడలు నెలపాటు వుండి వెళ్ళిందట. రెండోకోడలు వచ్చి మరో నెల వుందట.
ఎవరి కుటుంబాలూ, పిల్లలూ వాళ్లకే. బంధుత్వాలన్నీ గిరిగీసుకున్నట్టే. ఎవరుమాత్రం వచ్చి ఎన్నాళ్ళు వుండగరు? పక్కవాళ్లకోసం చిన్నపాటి ఇబ్బందినికూడా భరించలేనిరోజులు వచ్చాయి. ఐనా వాళ్ళవరకూ వాళ్ళకి పిల్లపోయే మూడునెలలైంది, ఇంక అలవాటుపడివుంటామని. పడితీరాలని- అంది. ఆవిడ కళ్ళు నీటిచెలమల్లాగే వున్నాయి.
అంతేనమ్మా. ఈవేళపోతే రేపటికి రెండోరోజు. కాలం ఎవరికోసమూ ఆగదు- అంది మామ్మ.
మీ కూతుళ్ళలాంటిదాన్నే నేనూను. నన్ను మీరనకండి- అందావిడ.
మనవడికిపేరేం పెట్టారు? మొదటిసారి ఇలా చూడటానికి వస్తున్నామని ఏమీ తీసుకురాలేదు. మరోలా అనుకోకండి- అంది మామ్మ.
మా అమ్మాయి పేరు చందన. హరిచందన. హరీ అనీ పిలిచేవాళ్ళం. వీడినీ అలానే అంటున్నారు వారు- ఆవిడ చెప్పింది.
మేము మాట్లాడుకుంటూ వుండగానే ఆవిడకి కంచంలో అన్నం పెట్టి తెచ్చింది రాధమ్మ. మాకు తినటానికి ఏవో పెట్టింది. మామ్మ తినలేదు.
నేను ఇన్నిసార్లు తినను. అరగదు- అని తిరస్కరించింది. నన్ను తినమంటే నేనుమాత్రం తీసుకున్నాను.
పక్కరోజు మాయింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించి, వస్తామని మాటతీసుకుని తిరుగు ప్రయాణం అయాము.
అలా చేసావేమిటే, గీతూ- ఇంటికి రాగానే అంది మామ్మ.
ఆ పిల్లాడు చచ్చిపోతాడని ఆవిడందికదా, మామ్మా? నాకు భయం వేసింది- అని ఆవిడ మెడచుట్టూ చేతులు వేసి బావురుమన్నాను. ఆ విషయం అందరికీ తెలిసినా ఎవరూ దానిగురించి నాతో అనలేదు. ఒక స్త్రీగానూ. అమ్మగానూ నేను తీసుకున్న నిర్ణయాన్నీ నా ప్రైవసీనీ అందరూ గౌరవించారు.
నాలో ఎన్నో ఆలోచనలు. ఎన్నో భయాలు. ఆ అమ్మాయికి బదులుగా నేను చచ్చిపోయివుంటే? మయూఖ్… నా యీచిన్నిప్రాణి ఏమైపోతాడు? హరిలాగే వీడినీ పట్టించుకోరా? ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురుచూసేవారా? వీడు పెరిగి పెద్దయేదాకా నేను బతుకుతానా? చచ్చిపోవడమంటే ఏమిటి? చచ్చిపోతే అసలేం జరుగుతుంది? ఆ అమ్మాయికూడా నాలాగే పిల్లతోనో పిల్లాడితోనో తిరిగొస్తాననే ఆశతో ఆరోజు హాస్పిటల్‍కి వెళ్ళి వుంటుంది. నాకూ తనకీ చెరోలా జరగడానికి కారణం ఏమిటి? ఎవర్నడిగినా కోప్పడతారని వాసుని అడిగాను.
నీకేం కాదు గీతూ! కాలేదుకదా? అందరికీ ఒకేలా జరగదు- అని ఓదార్చాడు. నేను సమాధానపడలేదు. తెలియాల్సింది ఇంకేదో వుందనిపించింది. జీవితమంటే ఈ వెతుకులాటేకదా? కానీ తనుమాత్రం ఎంతవాడు? చిన్నవాడేకదా? తనూ భయాలతో సతమతమైపోయాడు. ఆఖరికి విసుగొచ్చి, వాళ్ళ నాన్నముందుకి తీసుకెళ్ళి కుదేసాడు.
ఎంతసేపటికీ మీరు చదువుకుని మీరే సంతోషాన్ని పొందటం కాదు. దీనికి కాస్త తెలివి మప్పండి నాన్నా! అర్థంపర్థంలేని ప్రశ్నలతో నా ప్రాణం తినేస్తోంది. ఎవరికి ఏం జరిగినా అవన్నీ తనకే జరుగుతాయని భయపడుతోంది- అన్నాడు.
ఆయన తనదైన పద్ధతిలో చెప్పారు.
మనిషి పుట్టాక చనిపోక తప్పదు గీతా! జీవితం అనేది ఒక ప్రయాణం. పుట్టుకకి చావు అనేది గమ్యం. గమ్యం లేని ప్రయాణం వుండదు. ఎవరి కర్మనిబట్టి వాళ్లు జీవిస్తూ, చిట్టచివరి గమ్యాన్ని చేరతారు. ఎలాగా గమ్యం చేరాల్సింది చేరకుండా వుండంకదాని ప్రయాణపు ఏర్పాట్లు మానేసి కూర్చుంటారా ఎవరేనా? నువ్వు మీ నాన్నని చూడటానికి వెళ్ళాలనుకుంటావు. వాసు బైకు ఎక్కుతావు. అది కండిషన్లో వుండాలి. పెట్రోలు పొయ్యాలి. రోడ్డు బావుండాలి. వాన పడకూడదు. ఇవన్నీ చూసుకుంటావా? నాన్నని చూడాలని మనసులో అనేసుకుని ఇంట్లో కూర్చుంటావా? కూర్చోవుకదా? అలా. రోడ్డుమీద వెళ్ళేవాళ్ళకి ఎంతోమందికి యాక్సిడెంట్లౌతాయి. అలాగని అందరికీ ఔతాయా? కావు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకకూడా రోడ్డుమీదికి వెళ్ళిన వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే అది అనేకానేక సంభావ్యతల్లో ఒకటి. అలాగే ప్రపంచంలో వున్న ఆడవాళ్ళంతా పిల్లలు పుట్టేటప్పుడూ, మగవాళ్ళంతా యాక్సిడెంట్లలోనూ చనిపోతున్నారా? లేదుకదా? అదీ సంభావ్యతే. ఈ సంభావ్యతలు లక్షల్లోనూ కోట్లల్లోనూ ఒకటో అరో వుంటాయి. చదువుకున్నావుకదా? అది నువ్వే కావటానికి వున్న అవకాశాలు ఎన్ని వుంటాయి? ఒకొక్కరి జీవితంలో సంఘటనలు ఒక్కోలా జరుగుతాయి. నీకు ఇంత పెద్ద కుటుంబం వుంది. ఇంకొందరికి అపారమైన సంపద వుంటుంది. మరొకళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. అన్నీ ఒకే మనిషికి జరుగుతాయా అంటే అదికూడా ఈ సంభావ్యతల్లో ఒకటి. అలా ప్రతిదానికీ భయపడకూడదు. భయపడితే అడుగుముందుకి వెయ్యలేవు- అన్నారు.
నాకు అర్థమైంది, కాలేదు.
మయూఖ్ ఏడుస్తున్నాడని అత్త వాడిని ఎత్తుకుని మాదగ్గిరకి వచ్చింది. వాడికోసం చేతులు చాపి, మళ్ళీ ఆ చాపిన చేతుల్ని వెనక్కి తీసుకున్నారు మామయ్య.
మూడునెలలు హరిని నేను పెంచాను. ఆరోనెలలో అన్నప్రాశన చేసుకున్నాడు. పోతపాలు పడని పిల్లాడికి అన్నం, పప్పు, నెయ్యి పడ్డాయి. ఆ తర్వాతకూడా రాధమ్మ పొద్దున్నే వాడిని తీసుకుని నేను ఎక్కడింట్లో వుంటే అక్కడికి వచ్చేసేది. వసుంధరగారుమాత్రం ఇల్లొదిలిపెట్టి ఎప్పుడోగానీ బయటికి వచ్చేదికాదు. ఆ రావటం నా దగ్గిరకే.
మా కాళ్ళకి అడ్డంపడుతూ, కాళ్లని చుట్టుకుపోతూ, మయూఖ్‍తో సమానంగా అల్లరిచేస్తూ, గారాలుపోతూ రెండేళ్ళు మామధ్య పెరిగాడు హరి. వాడి నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. మంచి సంబంధమే కుదిరింది. బాగా డబ్బుంది. అందం, చక్కటి వుద్యోగం వున్నాయి. హరిని వీళ్ళు పెంచుకుంటుంటే అతనికి రెండోపెళ్ళి పెద్ద సమస్య కాలేదు.
కమలాకర్‍గారికి అటు నాన్నతోటీ, ఇటు మామయ్యతోటీ స్నేహం కుదిరింది. ముగ్గురికీ వేదాంతచర్చల్లోనూ, సాహిత్యచర్చల్లోనూ పడితే టైము తెలిసేదికాదు. ఆయన వాసుకి డబ్బువిషయాల్లో చాలా సలహాలిచ్చారు. మధ్యతరగతిలో వుంటూ పైకెదగటానికీ, ధనికకుటుంబంలో వుండి ఇంకొంత డబ్బు పోగేసుకోవడానికీ తేడా వుంటుంది. షేర్లలోనూ మ్యుచువల్ ఫండ్స్‌లోనూ ట్రేడ్ చెయ్యడం, అందుకు కావల్సిన క్రమశిక్షణ దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పారు. మాకు ఆయన ఇచ్చిన మరో సలహా-
మీకు వుండటానికి ఇల్లుంది. మీ మామగారు స్థలం ఇచ్చారని చెప్తున్నావు. ఇంక ఇళ్లమీదా, ఫ్లాట్లమీదా పెట్టకండి. బేంకులోన్లూ, కిస్తులూ అవన్నీ లాభసాటి వ్యవహారం కాదు. పొలాలమీద పెట్టండి. ఎకరమైతే ఎకరం, అరెకరమైతే అరెకరం కొనండి చాలా లాభాలొస్తాయి. అదీకాక ఇంటికోసం మందులూ, ఎరువులూ వెయ్యని పంట పండించుకొవడం చాలా అవసరం- అని.
రెండేళ్ళ తర్వాత ఆయనకి ప్రమోషన్‍మీద ట్రాన్స్‌ఫరైంది. వెళ్ళిపోయారు. వెళ్ళేముందు నన్ను ఆవిడ పిలిపించుకుంది.
నాకు నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది గీతా! క్షణాలమీద చక్కటి నిర్ణయాలు తీసేసుకుంటావు. ఇల్లు, పని, ఆఫీసు, బాబు, అటు అమ్మగారిల్లు, ఇంత పెద్దకుటుంబం, అన్నిటిమధ్యా నువ్వు చలాకీగా తిరుగుతుంటే చాలా ఇన్స్పిరేషనల్‍గా వుంటుంది. నా ధైర్యాన్ని ఇక్కడ నీదగ్గిర వదిలిపెట్టేసి వెళ్తున్నాను. ఎప్పుడేనా వచ్చి వెళ్తుంటావుకదూ- అని అడిగింది కన్నీళ్ళతో. నా చేతిని తనచేతిలోకి తీసుకుంది. మామూలుగానే అనుకున్నాను. తన చేతిగాజులు ఒక జతతీసి తొడగబోయింది. చప్పుని చెయ్యి వెనక్కి తీసుకున్నాను.
వద్దండీ! ఇంతంత ఖరీదైన కానుకలు ఇవ్వడానికి మీరు మాకు బంధువులు కాదు- అన్నాను సున్నితంగా తిరస్కరిస్తూ.
నా కూతురివవేకదమ్మా? మనవడిని నాకు భిక్షగా వేసావు. నాకన్నా గొప్పదానివేగా? అంతకన్నా ఇది గొప్ప కానుకా?- అంది.
ఆ ప్రేమ చాలండీ- అన్నాను. ఆవిడ నన్ను బలవంత పెట్టలేదు. మాటలే మర్చిపోయినమనిషి, వాదనేం చేస్తుంది? చాలాసేపు నన్ను వెళ్లనివ్వలేదు. అలా పట్టుకుని కూర్చుంది.
ఇక్కడినుంచీ వెళ్ళాక వసుంధరగారి ఆరోగ్యం ఇంకా పాడైంది. రెండుసార్లు నేనూ వాసూ వెళ్ళి చూసి వచ్చాం. తర్వాత ఆవిడ పోయిందన్నవార్త వచ్చింది. హరి కమలాకర్‍గారిదగ్గిరే పెరిగాడు. రిటైరయ్యాక ఆయన వాడిని తీసుకుని పెద్దకొడుకు దగ్గిరకి వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మాకు ఫోన్ చేసేవారు. హరిచేత మయూఖ్‍కి వుత్తరాలు రాయించేవారు. ఫోన్ చేయించేవారు. ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్ళు ఒక ఫాంటసీలాగ వుండి వుద్యోగాలొచ్చాక కలుసుకుని మళ్ళీ స్నేహాన్ని మొదలుపెట్టారు. కానీ వాడిలో ఒక అస్పష్టమైన దు:ఖరేఖ, దేన్నో పోగొట్టుకుంటానేమోనని ఇంకదేన్నో గట్టిగా వదలకుండా పట్టుకోవాలనిపించే తాపత్రయం. మయూఖ్‍లో లేని ఇంకొన్ని అసహజమైన ట్రెయిట్స్ కనిపిస్తుంటాయి. అలాంటి మనుషులు కదిలే విషాదాలుకదూ?” అంది గీత చెప్పడం ఆపి.
“మనింట్లో వున్నవాళ్ళు చాలక ఊళ్ళోవాళ్ళకోసంకూడా బాధపడ్డం మొదలుపెట్టావా? ఈ ఏడ్చే మనుషులందర్నీ నీచుట్టూ పెట్టుకుని, వాళ్ల దగ్గిర్నుంచీ కొత్త ఏడుపులు నేర్చుకుంటున్నావా? అసలు మయూఖ్‍కి ఇప్పటిదాకా పెళ్లెందుకు చెయ్యలేదే, నువ్వు?” దబాయించింది మహతి అంతా విని. “ఈపాటికి మనవలు పుట్టి, నీకసలు తీరికలేకుండా చేసేవారు” అంది.
గీత జవాబిచ్చేంతలో మేఘన లోపల్నుంచీ వచ్చి కూర్చుంది. ఆ వెనకనే గేటుతీసుకుని, హరీ, ఇందు వచ్చారు.
శ్యామ్మోహన్ వెళ్ళాడు. త్రిమూర్తులు తన అభిప్రాయం చెప్పాడు.
“ఆ యిల్లు నేను తీసుకుంటాను” అన్నాడు. శ్యామ్మోహన్ తెల్లబోయాడు.
“తాతయ్యా! ఇంట్లోవాళ్ళంతా వప్పుకుంటారో లేదో! ప్రస్తుతం దానికి విలువ లేదు. ఎవరూ కొనడానికి ముందుకి రారు. వచ్చినా, సగానికి సగం తగ్గించి అడుగుతారు. అన్నీ సర్దుకుని మళ్ళీ మార్కెట్‍ధర రావడానికి ఎన్నాళ్ళుపడుతుందో! మీకెందుకు ఈ తలనొప్పి? కేసు సెటిలైపోయాక ఎటో ఒకవైపుకి పంపించేద్దాం ఆ పిల్లని” అన్నాడు వారింపుగా.
“కేసులోంచీ ఆ పిల్ల బైటపడుతుంది. ఇంటికి ఈవేళ కాకపోతే రేపేనా విలువ వస్తుంది” అన్నాడు త్రిమూర్తులు.
“అంత డబ్బు నిలిచిపోతుందికద తాతయ్యా!”
“ఇద్దరాడపిల్లల జీవితాలు చక్కదిద్దే అవకాశం నాచేతికి వచ్చిందిరా! భ్రష్టుపట్టించాను. ఇప్పుడీ పిల్లకో దారిచూపించడం ఈ ఆఖరిదశలో దేవుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటున్నాను. తల్లిదండ్రులు తప్పులు చేస్తే పిల్లలు ఫలితం అనుభవించడం ఎక్కడేనా వుందా? ఆ చచ్చేవాళ్ళు ఎక్కడో బైటికి పోయి ఆ పని చేసినా బావుండేది. ఎంత తెలివితక్కువ మనుషులురా!” అన్నాడు త్రిముర్తులు. ఆయన మాటల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఎప్పుడో చూసిన ఆ మనుషుల ముఖాల జ్ఞాపకాలుకూడా సరిగ్గా ముద్రించుకుని లేవు ఆయన మనోఫలకంమీద. తండ్రి పోయాక తమింటికి వచ్చిన ఆ తెల్లటి పిల్లడు, నలభయ్యేళ్ళ మనిషి పక్కని పెళ్ళిపీటలమీద కూర్చున్న తాటాకు బొమ్మలాంటి పిల్ల, లీలగా మనసులో కదిలారు. అంతే. మనసంతా దు:ఖం నిండింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.