ఝరి – 82 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

నీలిమని మాధవ్ చేసుకోవటంతో తెరిపినపడ్డారు కుటుంబరావు దంపతులు. అంతా తన ప్రజ్ఞ, కూతుళ్ళ అందచందాలే అనుకుంటాడు అతను. కమలాక్షికి తెలుసు, ఎదుటివాళ్ళు కట్నకానుకలకి ఆశించకపోవడంచేతనే ఇంత వెంటవెంటనే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యగలిగారని.
తప్పుచెయ్యకపోవటం గొప్పవిషయం కాకపోవచ్చు, కానీ చెయ్యగలిగే అవకాశం వున్నప్పుడు చెయ్యకుండా వుండటంమాత్రం చెప్పుకోదగినదే. అంత సంస్కారం, సభ్యత, ఐకమత్యంగల కుటుంబాన్ని ఆవిడ ఎప్పుడూ చూడలేదు. ఆరుగురు తోడల్లుళ్ళు. ఎవరికివాళ్ళు మహాపర్వతాలవంటివాళ్ళు. ఎవరి అహాలూ, బేషజాలూ వాళ్లవి. వాళ్ళెవరిమధ్యా ఎలాంటి స్పర్థా రాకుండా ఎవరికీ గౌరవభంగం కలగకుండా వియ్యపురాలి అన్నకూతురు జాగ్రత్తగా సమన్వయపరిచి చూసుకుంటుందని తెలిసి ఆశ్చర్యపోయింది.
గీతని కుతూహలంగా చూసింది. చదువుకుని, వుద్యోగం చేస్తున్న పిల్లని గౌరవం కలిగింది. మాటా మన్ననా నచ్చాయి. సున్నితంగా, ఆచితూచి పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి మనసుని ఆకట్టుకుంది. రామారావు వెంటవెంట తిరుగుతూ పనులన్నీ చక్కబెట్టుకున్న అరుణని చూసి మొదటా, లక్ష్మిని చూసి తర్వాతా చాలా గౌరవం కలిగింది. రామారావుకి బావమరుదులు ఇచ్చిన ప్రాధాన్యతకీ అలానే అనిపించింది. అందరికీ అన్ని విద్యలూ రావు. పదిమందివున్న కుటుంబంలో ఒకొక్కరు ఒకొక్కదాంట్లో తెలివికలిగి వుంటారు. వాళ్ళని ముందుపెట్టుకుని నడిపిస్తే ఎలాంటి వ్యవహారమేనా పొసుగుతుంది. రామారావు అనుభవం ఆడపిల్లల పెళ్ళి పొదుపుగా చెయ్యడానికీ, మగపిల్లల పెళ్ళిలో దూబరా ఆపటానికీ వుపయోగపడింది.
ఆవిడ మాధురికి పెళ్ళైనప్పుడే చెప్పింది, “చాలా చక్కటి కుటుంబంలో పడ్డావు. అదృష్టవంతురాలివి. మీ నాన్నలా అతితెలివితేటలు చూపించకుండా కాస్తంత నెమ్మదిగా వుండు. ఇంకా మాకు బాధ్యతలు తీరలేదు. నీతోనే ఆఖరు కాదు. నీ వెనక ఇద్దరున్నారు” అని.
మాధురికి తల్లిమాటలు, వాటి వెనక వున్న ఆశా అర్థయ్యాయిగానీ ఆమెలో చిన్నగా చోటుచేసుకున్న అసహనం.
గీత!!
మంగళసూత్రధారణా, తలంబ్రాలూ, భోజనాలూ అయాక తరువాతి కార్యక్రమానికి వున్న వ్యవధిలో మగపెళ్ళివారి విడిదిగదుల్లోకి వెంటబెట్టుకు వెళ్ళాడు ప్రహ్లాద్. అందరూ ఒకదగ్గిరే వున్నారు. భోజనాలప్పుడు ఆడవాళ్ళందరూ పట్టుచీరలు మార్చుకున్నట్టున్నారు, నూలుచీరల్లోనూ, సిల్కుచీరల్లోనూ వున్నారు. తరవాతి కార్యక్రమాలకి ఆడపెళ్ళివాళ్ళ పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. ఏవో మాటలు సాగుతున్నాయి. మాటలకన్నా పరిహాసాలూ, నవ్వులే ఎక్కువగా వొలికిపోతున్నాయి. ఎవరికివాళ్ళు విడివిడిగా కాక అందరూ కలిసి మాట్లాడుకోవడం, ఒకదగ్గిర అనుకున్న మాటని ఇంకెక్కడో అందుకోవడం చూసింది మాధురి.
మయూఖ్‍ని ముద్దుచేస్తోంది అరుణ. ఆమెని ఆనుకుని కూర్చుని వున్నాడు నందకిషోర్. అలాంటి చనువు తన తల్లిదండ్రులమధ్య ఎప్పుడూ చూడలేదు మాధురి. ఇలాంటి కుటుంబం తనచుట్టూ ఎప్పుడూ లేదు. తండ్రికి చాలాకాలం సరైన వుద్యోగం లేకపోవటంతో తమమీద అందర్లోనూ చిన్నచూపు ఏర్పడిపోయింది. ఇరువైపుల బంధువులూ ఆయన్ని డామినేట్ చేస్తారు. ఆయన ఆలోచనలనీ, మాటల్నీ పట్టించుకోరు.
“ఎవరివిరా, నువ్వు?” అడుగుతోంది అరుణ మయూఖ్‍ని.
ఎవరిదగ్గిర నేర్చాడో, “గీత కొడుకుని” అని వచ్చీరాని మాటల్తో అంటున్నాడు వాడు. పొద్దుటినుంచీ అదేపాట. ఆమాట పట్టుకుని అడుగుతోంది.
“నువ్వేమో గీత కొడుకువి, వాడేమో గీత మొగుడు. ఇంక నేనెవర్నిరా?” అని దబాయించింది లక్ష్మి.
“నువ్వు… నువ్వు… గీత కొడుకు మామ్మవి” తడుముకుంటూ జవాబిచ్చాడు.
“సరిపోయింది. లోకంలో గీతా, గీతకొడుకూ తప్ప ఇంకెవరూ లేరా?” అంది లక్ష్మి.
“నేనెవర్నో చెప్పరా! గీత కొడుకు అత్త మొగుడ్ని” అన్నాడు జో గుంపుమధ్యనుంచీ. సుమతి అతని భుజమ్మీద చిన్నగా వేసింది. “వాడికి ముదరమాటలు నేర్పిస్తారేంటి” అని. జో మాటల్ని మాధురి మర్చిపోలేదు. అంత చదువుకున్నాడు, ఇతనుకూడానా అనే సందిగ్ధం సుమతినీ అతన్నీ చూసినప్పుడల్లా కలిగేది.
అంతా పెద్దగా నవ్వేసారు.
“ఒరేయ్! గీత కొడుకు ప్రహ్లాద్ బాబాయ్, పిన్నీ వచ్చార్రా!” వీళ్లని చూసి అరిచింది పల్లవి. ప్రహ్లాద్‍నీ మాధురినీ చూసారు అంతాను.
“కొత్తపెళ్ళికూతురా, రారా!” అని అందుకున్నారు ఆడపిల్లలంతా. గదంతా నవ్వులతో దద్దిరిల్లిపోయింది.
ఈ హడావిడంతటిమధ్యనా గీత. కనకాంబరంరంగు చీర, మెడలో చంద్రహారం, పెద్దజడ, ఒక చేతికి నాలుగు బంగారంగాజులు, రెండోచేతికి వాచీ వున్న ఆహార్యంతో వుండి మాట్లాడుతున్నదల్లా ఆగి కూర్చున్నచోటే వెనక్కి తిరిగి , మాధురిని చూసి సస్నేహంగా నవ్వి, లేచి ఎదురొచ్చి, ఇద్దర్నీ పక్కని కూర్చోబెట్టుకుంది. ఆమెకి మరోవైపు వాసు. ఆ రూపం, ఆమె నవ్వు, స్వరం మాధురి మనసులో ముద్రించుకుపోయాయి. గీత ముఖంలోది గర్వమా, అతిశయమా ఎలా అన్వయించుకోవాలో ఆమెకే అర్థంకాని భావన. కానీ సహజంగానైతే అనిపించలేదు. యద్భావం తద్భవతి. చూసేవాడి దృక్పథాన్నిబట్టే చూసే దృశ్యం అర్థమౌతుంది. మానస పెళ్లయేదాకా ఆమె గీతని గమనిస్తునే వుంది. నిశితంగా. ఇంకా సూక్ష్మంగా. ఎందుకు? కొన్నిటికి జవాబులు వుండవు.
మాధవ్ పెళ్ళయాక మానసని వసంత్‍కి చేసుకుంటే బావుంటుందన్న ప్రస్తావన తెచ్చింది మాధురి.
“అక్కచెల్లెళ్ళం ముగ్గురం అన్నదమ్ములని చేసుకున్నట్టు వుంటుంది. మా నాన్ననికూడా మీ అన్నగారిలాగే అనుకోండి” అని అరుణ దగ్గిర గారాలు పోయింది. సుమంత్‍కో, సుధీర్‍కో అడిగే సాహసం చెయ్యలేకపోయింది. భయాలు, సంకోచాలు మనకి మనమే సృష్టించుకుంటాం. అదీకాక సుధీర్ పెళ్ళి కట్నం దగ్గిర బెడిసికొట్టిందనే విషయం చూచాయగా తెలిసింది. పెళ్ళికూతురెవరనేది ఇదమిత్థంగా తెలియలేదు.
పద్మావాళ్ళకి అలాంటి ఆలోచన లేదు. వసంత్ ఎమ్‍టెక్ చేసి నేరుగా డెప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పోస్టింగ్ తెచ్చుకున్నాడు. మంచి కట్నం ఇస్తారు. కొడుకు వెనకాల కూతురుంది పెళ్ళికి. తమ పెళ్ళిలా కాకుండా ఘనంగా చెయ్యాలని భార్యభర్తలిద్దరి కోరిక. మాధవ్ నీలిమ విషయంలో బైటపడ్డాడు, వసంత్ మనసులో మానసపట్ల ఇంకా అలాంటి ఆలోచన పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఈ ప్రతిపాదనతో మొదలైంది. అంతే తేడా.
“ఇప్పటికి ఇద్దరు పిల్లలని తెచ్చుకున్నాం. ఏం పెట్టార్రా వాళ్ళు? కొబ్బరిబోండంతో పిల్లల్ని పంపించినట్టు పంపించారు. మనమేం వాళ్లకి అప్పున్నామా, ఈ ఆడసంతందర్నీ చేసుకుని సాది సంతరించడానికి?” అన్నాడు పద్మ భర్త నిరసనగా.
“వాళ్లెవరూ కట్నాలు తీసుకోలేదు. నేనూ తీసుకోను. కట్నం తీసుకోనప్పుడు ఏ సంబంధమైతేనేం?” అన్నాడు వసంత్.
“మీరేమైనా స్వంత అన్నదమ్ములా, ఒకళ్ళని చూసి మరొకళ్ళు కట్నం మానేయ్యడానికి? ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి సంపాదనలు వాళ్ళవి. వాసుగాడిది మామూలు చదువు, వుద్యోగం. అందుకు గీతని చేసుకున్నాడు. గీత వాడితో సమానంగా సంపాదిస్తోంది, మేనరికంకావడాన్న కట్నంరూపాన వద్దనుకున్నారు. ఆందుకు మీ మామయ్య దానికేం తక్కువచేసాడు? కావలిసిన బంగారం పెట్టి పంపాడు. మొన్న మయూఖ్ బారసాలలో సైటు దాని పేర్న పెట్టాడు. ఆదర్శాలకి పోయి మునిగింది మాధవ్, ప్రహ్లాద్‍లే” అన్నాడాయన.
“మునగడమేంటి నాన్నా, అసహ్యంగా? కట్నం తీసుకోకపోతే మునిగిపోతామేంటి?” అన్నాడు వసంత్.
“కాస్త బుర్రపెట్టి ఆలోచించు. నువ్వు తీసుకోనంతమాత్రాన చెల్లికి ఇవ్వడం ఆగుతుందా? మీ ఆదర్శాలు మీదగ్గిరే వుంచుకోండి, మాకిచ్చేది మాకివ్వండి అంటారు. ఇటు తీసుకుంటే అటు సులువుగా ఖర్చుపెట్టగలుగుతాం. దానికి పెద్దసంబంధం చెయ్యాలని అమ్మ కోరిక. ఎంత ఖర్చుతో కూడిన పని?”
“సమీరకి మంచి సంబంధం చూడండి నాన్నా! ఖర్చంతా పెట్టుకుంటాను. అప్పు చేస్తే తీర్చుకుంటాను. అప్పులన్నీ తీరాకే నేను చేసుకుంటాను. ఈ సంబంధం కాకుండా వేరే సంబంధమైనా కట్నంమాత్రం తీసుకోను. ఈ సంబంధం ఏవో కారణాలు చెప్పి వద్దనుకుని కట్నంకోసం వేరేది చేసుకుంటే అది అందరికీ అర్థమైపోతుంది. నాకు చాలా ఇన్సల్టుగా వుంటుంది” అన్నాడు వసంత్ కచ్చితంగా. అతనికి కట్నం తీసుకుని, దాన్నటిచ్చి సమీరకి చేసి, చేతులు దులుపుకునేంతటి పరిస్థితులు వాళ్ళకేమీ లేవు. ఎవరికివాళ్ళకే చదువులకీ, పెళ్ళిళ్ళకీ అని విడివిడిగా దాచాడాయన. ఐనాకూడా వచ్చేది వదులుకోవడమంటే బాధగానే వుంది.
“బుర్ర వుందా, నీకసలు? ఎవరో పిల్లకోసం నువ్వు తిప్పలు పడతానంటావు? నువ్వు చెప్పేది ఎంత అసంబద్ధంగా వుందో నీకేమైనా తెలుస్తోందా? ఆ కుటుంబరావు పడాల్సిన కష్టాలు నువ్వు పడతానంటావేంటి? ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోవు” అని విసవిసలాడాడు. కొన్నాళ్ళపాటు కూతురికీ కొడుక్కీ పెళ్ళిమాటే ఎత్తలేదు. సంవత్సరం నలిగింది ఆ వ్యవహారం. సమీరకి మంచి సంబంధం వచ్చింది.
“కట్నం ఇచ్చేట్టైతే నాకూ యివ్వద్దు. అన్న నాకన్నా పెద్దవాడు. వాడికి కాకుండా నేను చేసుకోను” అని పేచీ పెట్టుకుని కూర్చుంది. సమీరది అన్నకోసం పేచీ. అంతే తప్ప కట్నం ఇవ్వద్దనే ఆదర్శాలేమీ ఆమెకి లేవు. తల్లిదండ్రులకి అన్నీ తెలుసనే నమ్మకం వుంది. ఆ పిల్లని వప్పించడానికి కొడుకుతో రాజీపడ్డాడాయన. రెండుపెళ్ళిళ్ళూ ఒకే ముహూర్తానికి జరిగాయి. వీలైనంత ఖర్చు కుటుంబరావుమీదకి నెట్టేసాడు. వాళ్లకి పెట్టేదగ్గిరా చిన్నచెయ్యే చూపించాడు. అరుణకీ, లక్ష్మికీ, వీళ్ళకీ వున్న తేడా స్పష్టంగా అర్థమైంది కుటుంబరావు కుటుంబానికి. వసంత్ వుద్యోగం వేరేవూళ్ళో కావటాన్న పెళ్ళైన వెంటనే భార్యని తీసుకుని అటువెళ్ళిపోయాడు. మాధురి, నీలిమ అత్తవారిళ్ళలోనే వుండటంతో స్పర్థలు వచ్చాయి.
అప్పటికింకా డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ రాలేదు. లేకపోతే జీవితాలు తలకిందులయ్యేవి.


ముగ్గురి పెళ్ళిళ్ళూ అయాక నెమ్మదిగా ఒకొక్కరింటికీ వున్న తేడా అర్థమైంది అక్కచెల్లెళ్లకి. మానసది అత్తమామలకి ఇష్టంలేని పెళ్ళి. వసంత్‍, మాధవ్‍లా ప్రేమించికూడా చేసుకోలేదు. అప్పటికి అతను ఎవరినీ ప్రత్యేకంగా ఇష్టపడలేదుగాబట్టి ఆమెని చేసుకున్నాడు. మాధురిమీద అరుణ అజమాయిషీ వుంది. తనకి ఏం కావాలో, కోడలు తమతో ఎలా వుండాలో కచ్చితంగా చెప్తుంది. ఇక లక్ష్మిది పెద్దగా అజమాయిషీ చేసే మనస్తత్వం కాదు. భర్త జీతం చేతికిస్తాడు. ఇల్లు, ఖర్చులు వాసు సహకారంతో చూసుకుంటుంది. మిగతావి గీత చూసుకుంటుంది. ఆవిడ పిల్లలు ముగ్గురికీ పెళ్ళిళ్ళైపోయాయి. అదొక నిశ్చింత. కానీ నీలిమకి తేడా తెలుస్తోంది. ప్రహ్లాద్, వసంత్‍ల్లా మాధవ్ ఒక్క కొడుకు కాదు. ఆ యింట్లో ప్రతీదీ వాసు, గీతలతో పెనవేసుకుని వుంటుంది. అప్పటికే మాధురి చెల్లెలిముందు కొంత బైటపడింది. అది గరళంలా అడ్డుపడుతోంది నీలిమ గొంతుకి. ఈ వుక్కిరిబిక్కిరిలో ఆమె అనుకుంటున్నది కొంత.
ముగ్గురికీ గీత ఒక కుతూహలం. గీత ఒక ప్రశ్న. ఆమె ఎందుకలా? ఏమిటి ఆమెలో ప్రత్యేకత?
“తను పేంపర్డ్ చెయిల్డ్. చాలా చిన్న ప్రపంచం తనది. వాళ్ళమ్మమ్మగారిల్లు, వాళ్ళిల్లు, మాయిళ్ళు. అంతే. ఇంకెక్కడికీ వెళ్ళలేదు. ఎక్స్‌పోజర్ లేదు. మామయ్యల పిల్లల్లో మొదటిది కావటంచేత ఎక్కడికెళ్తే అక్కడ తనని ముద్దుచేస్తారు. అదీకాక చాలా మంచిది. సాఫ్ట్. వాళ్లది లవ్‍మేరేజి. వాసుకీ తనకీమధ్య చాలా ఎటాచిమెంటు వుంది” అన్నాడు ప్రహ్లాద్ మాధురితో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు. తమ చిన్నతనాన్నిగురించి చెప్తూ.
“లవ్‍మేరేజా? అంత తెలిసినవాళ్ళమధ్య ప్రేమేమిటి?” వింతగా అడిగిందామె.
“అదేకదా, గమ్మత్తు. చిన్నప్పుడే పేరుపెట్టేయ్యటం జరగలేదు మా యింట్లో. మాలోనే ఎవరో ఒకర్ని చేసుకుంటుందని అందరికీ తెలుసు. ఎవర్ననేది ఆఖరిదాకా సస్పెన్స్‌గా వుండింది”
“మీరూ అనుకున్నారా, ఆమెని చేసుకోవాలని?” మాధురి గొంతులో అసూయ మెరమెరలాడింది. తనకి ప్రహ్లాద్‍తో కాకుండా మరోమూడుసార్లు పెళ్ళిచూపులు జరిగాయనీ, ఆ మూడుసార్లూ వచ్చేవ్యక్తి తనని చేసుకుంటాడనే అనుకుని పెళ్ళిచూపులకి కూర్చుందనీ మర్చిపోయింది ఆ క్షణాన.
ప్రహ్లాద్ పెద్దగా నవ్వేసాడు. “తననా, నేనా? నో వే. నాకన్నా చిన్నదేగానీ, పెద్దదనుకుంటారు. ఇద్దరం అక్కాతమ్ముళ్ళలా వుంటాం. చాలా పోలికలున్నాయి మాకు” అన్నాడు.
ఐనా మాధురికి ఏదో అసంతృప్తి. గీతకి సరితూగనివాడిని, ఆమె వద్దనుకున్నవాడిని తను చేసుకుందా అనే అనుమానం దాని వెనక వుందని గ్రహించలేకపోయిందిగానీ, కారణంమాత్రం అదే. కూతురి ఈ అసంతృప్తికి తను కొంచెం ఆజ్యం పోస్తాడు కుటుంబరావు. సానుకూలంగా ఆలోచించడం వుంటుంది, అననుకూలంగా ఆలోచించడం వుంటుంది. మొదటిదాంట్లో ఎందరున్నా కలిసి నడుస్తారు. రెండోదాంట్లో పక్కపక్కనే నడుస్తున్నా ఎవరిదారి వాళ్ళది. ఆయన అటువంటి మనిషి. కూతుర్ని పెద్దకుటుంబంలో ఇచ్చాడు, వాళ్ళకి తగ్గట్టు వుండాలి, కనీసం వాళ్ళతో కలిసే అక్కర వున్నప్పుడు అనే కనీసపు ఆలోచన లేనివాడు.