ఝరి – 84 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

“ఇదోనే లక్ష్మీ! నీ కొడుకుని జాగ్రత్తగా దింపుకొచ్చాను. మాకిద్దరికీ చాక్లెట్లు నువ్వే కొని పెట్టాలి” అనేవాడు నవ్వుతూ. ఆ మేనమామ మాధవ్ మనసులోంచీ చెరిగిపోలేదు. నీలిమకి ఇవేవీ తెలీవు. గీత తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యత తన తండ్రికి ఇవ్వట్లేదనుకుంటుంది.
“మా నాన్నతోకూడా ఓ మాట చెప్తే…” అంటుంది.
“ఏం చెప్పాలి?” అని అడుగుతాడు మాధవ్.
“మీ అమ్మగారు అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు ఆయనకి చెప్తారు. ముఖ్యమైనవికూడా మానాన్నకి చెప్పరేంటి?” ఆమె కోపం.
ఏం చెప్పగలడు అతను? తండ్రి ముగ్గురు పిల్లల్నీ భార్యనీ వదిలేసి ఇంట్లోంచీ పారిపోతే వెతికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి కట్టేసిన సంగతి చెప్పగలడా? అప్పట్నుంచీ కుటుంబం బాగోగులు చూసింది ఆయనే అని చెప్పగలడా? అన్నీ చేయించుకుని, ఇప్పుడు నీ అవసరం ఇంక మాకు లేదని చెప్పగలడా?
“నాన్నని చూసావుకదా, ఎంతసేపూ భక్తీ, పూజలూ అంతే. మా చిన్నప్పట్నుంచీ మామయ్యే దగ్గిరుండి అన్నీ చూసుకునేవాడు” అన్నాడు.
“ఇప్పుడు మీరు పెద్దవాళ్లయారుకదా?”
“ఐతే ఏంటి? మేం పెద్దవాళ్ళమైపోయాం. ఇంక నీ అవసరం మాకు లేదని చెప్పమంటావా? నాకు చేతకాదుగానీ, నువ్వెళ్ళి చెప్పు” అన్నాడు కొంచెం కఠినంగా. అతనలా అంటే నీలిమ కళ్ళమ్మట నీళ్ళు పెట్టేసుకుంటుంది. అతనికి గిల్టీగా అనిపిస్తుంది.
“నీలూ! మా తాతయ్య అమ్మావాళ్ళ చిన్నప్పుడే పోతే అందరినీ చూసుకున్నదీ, చదివించి పెళ్ళిళ్ళు చేసిందీ మామయ్యే. అన్నాచెల్లెళ్ళమధ్య అనేకం వుంటాయి. వాళ్ళు తొమ్మండుగురైనా ఏ ఇద్దరిమధ్యా ఒకేలాంటి ఇంటరాక్షన్స్ వుండవు. ఆడవాళ్లలో పెద్దదని ఆమ్మని తనతో సమానంగా చూస్తాడు. మా అమ్మతో ఇలా. అరుణ పిన్నిని చూసావుకదా? ఆయన పక్కని కూర్చునీ, చెయ్యిపట్టుకుని తిరుగుతూనూ చిన్నపిల్లలా సంతోషపడుతుంది. మా అందరి జీవితాలూ ఆయనతో అల్లుకుపోయి వున్నాయి. ఆయన్ని మేము ఏరకంగానూ బాధపెట్టలేము. గీతని ప్రేమగా చూసుకోవడంకూడా అందుకే. ఆయనకి సంతోషం కలుగుతుందని. అదేమీ చెడ్డపిల్ల కాదు. మీ నాన్నని మనింటికి రావద్దని ఎవరూ అనలేదు. రెండురోజులకోమాటు ఆయన్నీ రమ్మను. వచ్చి అమ్మతో వ్యవహారం మాట్లాడమను. ఏవేనా పనులు చెప్తే అందుకొమ్మను. మన రెండుకుటుంబాలకీ మధ్య సంబంధాలు పెరుగుతాయి” అన్నాడు బుజ్జగిస్తున్నట్టు.
“వదిన్ని పట్టుకుని అదీ ఇదీ అంటారేంటి? ఎవరేనా వింటే తప్పుపడతారు. ఎవరిదాకానో ఎందుకు, మీ అన్నయ్యకే కోపం రావచ్చు” మాట మార్చేసింది.
“చిన్నప్పట్నుంచీ అలా అలవాటైపోయింది. వాళ్ల పెళ్ళిలో అమ్మమ్మ అందరికీ వార్నింగిచ్చింది, తనని ఇకమీదట వరసతో పిలవాలని. మా అందరికన్నా ఎక్కువగా వాసే నవ్వాడు. చాలా బావుండేది నీలూ, లైఫ్ అప్పట్లో. మా బేచి మొత్తం పదకొండుమందిమి. కలిసి అల్లరిచేస్తూ వుండేవాళ్లం. సగంమందికి అప్పుడే పెళ్ళిళ్లైపోయాయి. పిల్లలుకూడా పుట్టేస్తున్నారు. పెద్దవాళ్ళమైపోతున్నాం కదూ?” అన్నాడు. చిన్నప్పటి విషయాలు చాలా చెప్తాడతను. గీత ప్రస్తావన వచ్చేదాకా బాగానే వింటుంది. ఆమె మాట రాగానే ఏదో వుక్కిరిబిక్కిరితనం. ప్రహ్లాద్‍ని మాధురి అడిగినట్టు నువ్వూ తనని చేసుకోవాలనుకున్నావా అని అడగలేదు. చిన్నప్పుడెప్పుడో వేసుకున్న బంధాల్లో ఇంకెంతకాలం ఇరుక్కుని వుంటారు, బైటికిరాకుండా? బాల్యస్నేహాలు, లోతైనస్నేహాలు వుండచ్చు, మరీ ఒకింట్లోనే వుంటే ఎలా? అని ప్రశ్నించుకుంటోంది.
“నాన్న ఇటొచ్చిపోతూ వుంటే బావుంటుందికదమ్మా? మా తోడికోడలి తండ్రి మాటమీద ఇల్లంతా నడుస్తుంది. మా స్థానం ఎక్కడో నాకు తెలీడంలేదు. మాధవ్‍కి చెప్పినా వినడు” అంది తల్లితో దిగులుగా.
ఆవిడ సుదీర్ఘంగా నిశ్వసించింది.
“పెళ్ళై కొత్తగా వెళ్ళింది నువ్వు నీలూ! నువ్వు వెళ్ళకముందునించే ఆ మనుషులున్నారు. అలానే వున్నారు. ఇమడటానికి ప్రయత్నం చెయ్యి. వాళ్ళంతా కలిసి ఆ పిల్లని నెత్తిన పెట్టుకుని వూరేగనీ. అటేమైనా మీ అత్తగారు ఎక్కువ పెట్టేస్తుంటే మేం చూస్తూ వూరుకుంటామా? పెట్టడానికేనా వున్న ఆస్తులేమిటి? ఆ యిల్లొక్కటేనా? ఇప్పట్నుంచీ నీకు అలాంటి ఆలోచనలు దేనికి?” అంది.
కానీ నీలిమ కోరుకునేది, తెల్లకాగితంలాంటి, తను తప్ప మరే బలమైన అనుబంధాలూ లేని మాధవ్‍ని.


లక్ష్మిది నిగూఢమైన దు:ఖం. గీత పైకి కనపడని ఓదార్పు ఆమెకి. కొడుకులకన్నా ఎక్కువగా ఆమెమీదే ఆధారపడుతుంది. వాళ్ళకి ఏదీ చెప్పుకోలేదు. గీత అన్నీ అర్థమైనట్టే వుంటుంది. అన్నగారితో ఏదైనా చెప్పుకుంటే, “నేనేం చెయ్యగలనమ్మా? అశక్తుడిని” అని తనూ కంటతడి పెట్టుకుంటాడు. బాధపడతాడు. గీత అలా కాదు. వంటికీ, మనసుకీ హాయినిస్తూ మెల్లగా సాగే ప్రవాహం. ఆమె వచ్చి పక్కన కూర్చుంటే, నేనున్నాననే ధైర్యం దొరుకుతుంది. ఒక రక్షణకవచంలో వున్నట్టుంటుంది. వెయ్యికళ్ళతో అన్నీ గమనించుకుంటుంది. ఏ చిన్నకదలికా ఆమె కంటిని దాటిపోదు. ఒక సమస్య వున్నప్పుడు, దాన్ని గురించి చెప్పక్కర్లేకుండానే తెలిసిన మనిషి తోడుంటే వుండే సౌలభ్యం అది.
నీలిమమీద లక్ష్మికి ఆక్షేపణ ఏమీ లేదు. చిన్నపిల్ల. చక్కటిది. మాధవ్ ఏరికోరి చేసుకున్నాడు. కానీ గీత తనకి అవిభాజ్యమనిపిస్తుంది. ఆ తొమ్మిది కుటుంబాల మనుషులూ, ఎవరు ఎలా వుంటారో, ఎవరికి ఏ బాధలూ, సంతోషాలూ వున్నాయో ఇవన్నీ గీతకి సహజంగా తెలుసు. ఏ మూసలోనైనా ఇమిడిపోగలదు. ఇవ్వవలసిన గౌరవం ఇవ్వగలదు, తీసుకోగలిగే చనువు తీసుకోగలదు. హద్దులూ తెలుసు, వాటిని కొద్దిగా దాటి వెళ్ళి వెనక్కి రావటమూ తెలుసు. నీలిమ పరాయింటినుంచీ వచ్చింది. గీతకూడా పరాయిదే ఐతే అన్ని కుటుంబాల్లోనూ అవ్యక్తంగా వుండే ఈ సూక్ష్మవిషయాలు వ్యక్తపడేవి కాదు. గీతకి కనిపించేవి నీలిమకి కనిపించవు. తెలియవు. కనిపించవూ, తెలియవూ కాబట్టి అర్థమవ్వవు. ఒకరు చెప్పేవి కాదు. ఈ అమరిక ఇద్దరి స్పందనల్లో తేడాగా స్థిరపడి, ప్రవర్తనగా కనిపిస్తోంది.
ఇళ్ళలో గొడవ చాలావరకూ వంటింటిపని దగ్గిర మొదలౌతుంది. అందరూ ఒకరికొకరు అనువుగా చేసుకుంటే ఒకళ్ళపని ముగ్గురిమధ్య సర్దుబాటై తేలికపడుతుంది. తండ్రిలో వున్న అననుకూలత నీలిమలోనూ వుంది. రెండురోజులు మాధవ్‍కోసం అన్నీ మళ్ళీ వండి, కళ్ళు తేలేసి, లక్ష్మితో అనేసింది.
“తనకి వేడిగా చేసిపెట్టాలని సరదాపడ్డానుకానీ, మీరన్నట్టు గేస్ దండగ. అందరికీ కలిపి పొద్దునే చేసేసుకుంటాం” అంది. ఆ అమ్మాయి వుమ్మడిలో కలవటానికి ఇబ్బందిపడుతోందనుకుంది లక్ష్మి ఆమె తల్లికిలాగే. కానీ ఎక్కువతక్కువ భావాలతో సతమతమౌతోందనుకోలేదు. తండ్రి అన్నట్టు పెద్దవుద్యోగస్తుడి భార్యకాబట్టి తను చెప్పగానే యింట్లో పద్దతులు మారిపోతాయని ఆశించింది. అది జరగలేదు. పొద్దుటివంట గీతచేస్తోందికాబట్టి రాత్రి తను చేస్తానంది. అలా అన్న మొదటిరోజే చుక్కలు చూపించింది గీతకి. ఆమె పుట్టింట్లో తొమ్మిదైతేగానీ తినరు. అదే పద్ధతిలో ఇక్కడా మాధవ్ వచ్చాక మొదలుపెడదామనుకుంది.
“అలా కుదరదులే నీలిమా! మయూ అంతసేపు వుండలేడు. వాడిదవగానే అందరం తినేస్తాం. వాడిని పడుక్కోబెడితే నాకింకా పనుంటుంది. మాధవ్ రాగానే మీరిద్దరూ చక్కగా కబుర్లుచెప్పుకుంటూ తినంది” అంది గీత వంటకి వుపక్రమిస్తూ.
“ఇంకేం పనుంటుంది మీకు?” అడిగింది నీలిమ నిరుత్సాహాన్ని అణుచుకుంటూ.
“నేను డిగ్రీతో చదువు ఆపేసి వుద్యోగంలో చేరిపోయాను. ఎమ్మేకి కట్టాను. వెంటనే పెళ్ళవటం, మయూఖ్ పుట్టడం వీటితో ఎప్పటికప్పుడు అవట్లేదు. అదిప్పుడు చేస్తున్నాను. మళ్ళీ ఆటంకాలు రాకుండా పూర్తిచెయ్యాలి” అంది. అన్నీ ఓపెన్‍గా చెప్పేస్తుంది గీత. మనసులో ఏదీ దాచుకోదు. దాచుకుని లౌక్యం చూపించదగ్గ విషయాలని అనిపించదు. ఎదుటివాళ్ళు తను చెప్పేవి జీర్ణించుకుంటున్నారా లేదా అనేదికూడా ఆమెకి పట్టదు.
“కూరలు బావగారు తేవడం దేనికి? మీ ఆఫీసులో ఎవరిచేతేనా తెప్పించవచ్చుకదా?” అని ఒకసారీ,
“ఫాను ఆగిపోయింది. మీ అటెండరు ఎవర్నేనా పంపించండి” అని యింకోసారీ అంది మాధవ్‍తో.
మొదటిసారి నవ్వేసి వూరుకున్నా, రెండోసారి అన్నప్పుడు వివరంగా చెప్పాడు.
“చిన్నచిన్న వూళ్ళలో ఆఫీసర్లకి వుండే హోదా ఇలాంటి సిటీస్‍లో వుండదు. సెక్షన్ సూపరింటెండెంట్లలాగే మేమూను. పోతే గెజెటెడ్ కాబట్టి కొన్ని పవర్స్ వుంటాయి. ఐనా ఆఫీసుస్టాఫ్ యింటిపనులెందుకు చేస్తారు నీలూ? మాతో పనిబడి, కాకాపట్టడానికి చేస్తారు. అలాంటివాటికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఇలాంటి తెలివితక్కువమాటలు ఎవరిదగ్గిరా అనకు. బావుండదు” అన్నాడు. తండ్రిగురించి అలా అనుకోలేకపోయింది నీలిమ. అతనికి సాగదన్నదానికన్నా, యిష్టం వుండదన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత యిచ్చింది.
అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసో, వసంత్ ఇటువైపు వచ్చినప్పుడు మానసనికూడా కలుపుకునో బైటికి ప్రోగ్రాం పెట్టుకుంటారు. ముఖ్యంగా వసంత్ భార్యని తీసుకుని తల్లిదండ్రులదగ్గిరకి వచ్చినప్పుడు ఈ కలుసుకోవటాలు ఎక్కువగా వుంటాయి. ఆడపిల్లలకి తమ మూడు జంటలే కలిసి వెళ్ళాలని కోరిక. అలాంటి ప్రోగ్రామ్ వుందనగానే ప్రహ్లాద్, వసంత్ వాసుకి ముందు చెప్తారు. మాధవ్‍కి అసలతన్ని తమ మధ్యనుంచీ తప్పించాలన్న ఆలోచనే వుండదు. నీలిమకి గీతని తమతో రమ్మనక తప్పనిపరిస్థితి. గీతకికూడా వాళ్ళమధ్యని ఇరుకిరుగ్గా వుంటుంది. ఆమెతో వాళ్ళు కలుపుగోలుగా వుండరు. ఆమె పరాయిదన్న స్పృహతో మర్యాదగా మాట్లాడుతున్నట్టు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక వయసువాళ్ళమధ్య అడ్డుగోడలెందుకు మొలుచుకుని వస్తున్నాయో గీతకి అర్థమవ్వదు. అదీకాక ఒక చీరకోసమో, మేచింగ్ గాజులు, ఫాల్స్‌కోసమో గంటలతరబడి షాపింగ్. అది ఆమెకి నచ్చదు.
రెండుసార్లు వెళ్ళాక వాసుతో చెప్పేసింది,
“ఇకమీద నేనిలా రాను బావా! బోల్డంత టైం వేస్టౌతోంది. ఇటేమో మయూఖ్‍ని అత్తదగ్గిర వదిలిపెడుతున్నాను. ఆఫీసయ్యాకకూడా వాడిని వదిలిపెట్టి వుండటమంటే బావుండట్లేదు” అనేసింది.
“వాళ్లకీ అక్కచెల్లెళ్ళూ తోడల్లుళ్ళూ కలిసి వెళ్ళాలని వుంటుందేమో! మనం మానేద్దాం. మరీ తప్పించుకుంటున్నట్టుకాక మధ్యలో ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోతుంది” అన్నాడు వాసు.
“మాధవ్ అన్నాడా?” అనుమానంగా అడిగింది గీత.
“ఛ… అదేం లేదు. వాళ్ళక్కచెల్లెళ్ళు ముగ్గురికీ మనం వుండటాన్న ఫ్రీగా లేనట్టుంది. మనకేనా అంతేకదా, మన పదకొండుమందిమధ్యా వున్న చనువు వీళ్ళతో ఎలా వస్తుంది? చిన్నప్పటి స్నేహాలకీ చుట్టరికాలకీ తేడా వుండదూ?”
అందరికీ చెందటాన్నించీ కొందరికి అక్కర్లేనితనంలోకి వెళ్లడంలో తేడా తెలుస్తోంది ఇద్దరికీ. ఏదో అర్థమవని బాధ ఆమెని ఆవహిస్తోంది. ఐతే వాసు బైటపడడు. ఆమెకి అర్థమౌతుంది. మరోసారి మాధురి చీరల షాపింగ్‍కి వెళ్తూ తమనీ రమ్మందని నీలిమ చెప్పినప్పుడు గీత అనేసింది.
“నాకు షాపింగ్ పెద్దగా ఆసక్తి వుండదు నీలిమా! నాకోసం ఎప్పుడూ నేను చీరలు కొనుక్కోలేదు” అంది.
“చీరలే కొనుక్కోవా?” ఆశ్చర్యంగా, అపనమ్మకంగా అడిగింది నీలిమ. ఆ అడిగినతీరుకి నవ్వేసింది గీత.
“మా అమ్మమ్మావాళ్ళు ఏడాదికి మూడు కట్టుడుచీరలు పెడతారు. అమ్మ, అత్త, బావ అకేషన్స్‌లో కొంటారు. ఇంకా నేనేం కొంటాను? ఇవికాక మనిళ్ళలో ఏవో ఒక ఫంక్షన్లు. రెండు పెట్టెలనిండా చీరలున్నాయి. కొత్తవే చాలా వున్నాయి. అసలు ఇన్ని చీరలు వుండటమే నాకు చిరాగ్గా వుంటుంది” అంది.
“అమ్మా, అత్తగారూవాళ్ళూ సరే, ఒకళ్ళు పెట్టిన చీరలు ఏం బావుంటాయి?”
“ఇందులో పైవాళ్ళెవరు? మనిళ్ళలో ఫంక్షన్సుకి అరుణత్త, మా అమ్మా సెలక్ట్ చేస్తారు”
“మీ అందరి విషయంలో తేడా చూపించరేమోగానీ కోడళ్లం పైవాళ్లమేకదా?” దాచుకోలేకపోయింది నీలిమ.
“మా యింటి మగపిల్లల భార్యలు పైవాళ్ళెందుకౌతారు?”’అంది గీత.
సంభాషణ ఆగిపోయింది. గీత వెళ్ళలేదు. ఆమె రాకపోతేనే తేలిగ్గా వుంటుందనుకున్న నీలిమ అంత ప్రశాంతంగా వుండలేకపోయింది. అందరూ ఆమెకి అన్నీ కొనిస్తారు. కొనివ్వడానికి పెద్ద ఆస్తులు వుండక్కర్లేదు. విలువైన వస్తువు కానక్కర్లేదు. పెరట్లో పూసిన పువ్వు, చెట్టుకి కాసిన కాయ, ఇంట్లో వండుకున్న వంట ప్రేమతో ఇస్తారు. ఈమె అంత ప్రేమతోనూ తీసుకుంటుంది.
జీతం తెచ్చుకుంటుంది. ఆమె జీతం ఆమెదే. ఇంటికోసం ఖర్చుపెట్టగా ఎప్పుడూ చూడలేదు. ఇంటి ఖర్చులన్నీ అత్తగారివే.
గీత తండ్రిది పెద్ద వుద్యోగమేమీ కాదు. చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డారట. తన తండ్రీ పడ్డాడు. కానీ తన తండ్రికి లేని గౌరవం, మర్యాద గీత తండ్రికి ఎందుకు దొరుకుతున్నాయి? గీతనెందుకు అందరూ అంత ప్రేమగా చూడటం? ఎవరి కోడళ్ళూ వాళ్ళకే వుండగా ఆమెని పెద్దకోడలు అనడమేంటి? పెత్తనమంతా ఆమెకే అప్పగిస్తారు, ఇంతమంది పెద్దవాళ్ళుండి ఆమె చూసుకోవడమేంటి? ఆరణి కర్రలు రాచుకున్నట్టు అక్కచెల్లెళ్ళ మనసులు రాచుకుని నిప్పు పుడుతోంది. దానిపేరు అసూయ.
ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తునే వుంటారు. రవి కూతుళ్ళు అర్చన, పల్లవి. ఇద్దరూ జోడు గుర్రాల్లా పరిగెత్తుకొస్తారు తండ్రితో. ఒక గులాబిపువ్వో, జామకాయో చేత్తో పట్టుకుని. గీతకి ఒకరికన్నా ఒకరు ముందు ఇవ్వాలని పోటీ పడతారు. ఆమె నడుంచుట్టూ చేతులేసి చుట్టుకుపోతారు. శేఖర్ పిల్లలు వీణ, సంతోష్. వచ్చినదగ్గిర్నుంచీ వీణ మాధవ్‍కీ, సంతోష్ గీతకీ అతుక్కుపోతారు. అతను కృష్ణకన్నా చిన్నవాడు. గీతకి చెప్పే విషయాలకి అంతు వుండదు. వినటంలో ఆమె చూపించే ఓపికకీ అంతుండదు. తులసి, ప్రవల్లిక, సమీర తీరిక దొరికితే చాలు, గీతని వెతుక్కుంటూ వచ్చేస్తారు.