ఝరి – 86 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

అసలు అలాంటి ప్రతిపాదన… అందరూ కలిసి నిలబడి ఇంకొకరికి సాయం చెయ్యడంలాంటిది అక్కచెల్లెళ్ళు ముగ్గురికీ కొత్త. ఊపిరి ఆగినట్టైంది, మిగతావాళ్ళు ఏమంటారా అన్న వుత్కంఠతో. ముందుగా తేరుకున్నది సుధీర్.
“ఎవరం అంతదూరం ఆలోచించలేదు గీతా! రాణా మామగారు తీసుకెళ్ళాడు, చూసుకుంటాడని అనుకున్నాం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనసు కష్టపెట్టుకోకు. నీకు తనతో పోలికేమిటి?” అన్నాడు. ఎవరో వచ్చి గీతని పిలిచారు. లేచి వెళ్ళింది. ఒక ఆలోచనని అక్కడ వదిలి. అందరి మెదళ్ళలో నాటి. వాసు కమలాకర్‍గారింటి వుదంతం చెప్పాడు.
“నాకు చాలా భయం వేసింది. పూర్తిగా మనకి తెలీని విషయాలివి. పెద్దవాళ్ళుకూడా మనతో ఏదీ చెప్పరు. డెలివరీ టైంలో మనింట్లో ఎవరూ చనిపోయినట్టు లేదు. అలా చనిపోతారనికూడా తెలీదు నాకు. ఎక్కడేనా విన్నా చాలా సుదూరమైన, మనసుకి హత్తుకోని సత్యం. అసలెందుకు పెళ్ళి చేసుకున్నాను? నేను చేసుకోకపోతే తనమానాన్న తను బతికేదికదా అనిపించింది. గీత చావుకి నేను కారణం ఔతానా? డెలివరీ అయ్యి తను క్షేమంగా బైటపడుతుందా? మళ్ళీ తనని చూస్తానా? ఎన్నో సందేహాలు. చాలామంది పెద్దవాళ్ళున్నారు మాచుట్టూ. ధైర్యం చెప్తున్నారు. కోప్పడుతున్నారు. కానీ ఎవరిచేతుల్లోనూ ఏమీ ఉండదనే అవగాహనకూడా దానితోపాటే వుంది” అన్నాడు వాసు.
“నీకలాంటి భయం వున్నప్పుడు నాతో ఒక్కమాట చెప్తే హాస్పిటల్ మార్చేవాళ్లం బావా! గైనిక్ చాలా మంచావిడ. వేరే హాస్పిటల్‍కి రమ్మంటే వచ్చేది” అన్నాడు జోగేశ్వర్రావు.
“అలా అడగచ్చని తెలీలేదు” అన్నాడు వాసు. ఇలాంటి విషయాలు అందరూ కూర్చుని ఇంత మామూలుగా మాట్లాడుకుంటే ఆశ్చర్యం వేసింది నీలిమకి. అక్కడ వుండచ్చా, వెళ్ళిపోవాలా అనేది అర్థం కాలేదు. సుమతి వుందని వుండిపోయింది. ఆమె లేస్తే మిగిలిన యిద్దరూ అనుసరించేవారు.
“డెలివరీ అయ్యి, వాళ్ళిద్దర్నీ కళ్ళతో చూసాకకూడా నాకు నమ్మకం కలగలేదు” అన్నాడు వాసు.
“అందరికీ ప్రాణాపాయం వుండదు. అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. లేకపోతే మనుషులే వుండరు” అన్నాడు జో.
“తనకి ఆఫీసులో చేరేదాకా చెప్పలేదు ఆ విషయాన్ని. అసలు అలా జరుగచ్చన్న వూహకూడా లేదేమో షాకైపోయింది. చావంటే ఏమిటి? చచ్చిపోతే ఏమౌతాను? ఎక్కడికి వెళ్తాను? ఒకేలాంటి సందర్భంలో ఆమె చచ్చిపోవడానికీ, నేను బతికి వుండడానికీ కారణం ఏమిటి? నేను చచ్చిపోతే మయూ ఏమైపోతాడు? ఇలాంటి ప్రశ్నలతో సతమతమైపోయేది. భయపడిపోయేది. నన్నడిగేది. ఎంత నచ్చచెప్పినా వినేదికాదు. మా నాన్నచేతకూడా చెప్పించాను. ఆ వుద్వేగం తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడీ విషయంలో తను మళ్ళీ డిస్ట్రబౌతోంది. ఇష్టమైతే అందరం కలిసి చేద్దాం. లేకపోతే మేమిద్దరం చూసుకుంటాం” అన్నాడు వాసు.
“మొదట్నుంచీ తనంతేకదా? మనసుకి ఏదేనా ఎక్కడమేగానీ దిగడం వుండేది కాదు” అంది సుమతి. ఆ అనడంలో కొంచెం కఠినత్వం వుంది. ఎవరూ గుర్తించలేదు. వాసు పట్టుకున్నాడు.
“చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, పెద్దయ్యాక అందరం కలిసి ఏదో చెయ్యాలని. చేసేద్దాం” అన్నాడు మాధవ్.
“సరేరా, నువ్వన్నట్టు అందరం తలోచెయ్యీ వేసి, యమునని ఈ సమస్యలోంచీ బైటపడేద్దాం. వాసు అరేయ్, మీవి రెండు చేతులు” అంది సుమతి సర్దుకుని, వాతావరణాన్ని కాస్త తేలికపరుస్తూ.
గీత, రవళి కలిసి వచ్చారు.
“మహీ ఏదే? దాన్నీ తీసుకురాకపోయావా?” అడిగింది సుమతి రవళిని.
“రాత్రిముహూర్తం కదే, అప్పుడు మేలుకుని వుండాలని ఇప్పుడు నిద్రపోతోంది” అంది రవళి. అంతా మామూలు మూడ్‍లోకి వచ్చారు.
నీలిమకి అక్కడ వుండాలనిపించలేదు. లేచి నెమ్మదిగా అక్కడినుంచీ వచ్చేసింది. ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళకి వూరికే కార్డులు అచ్చేసుకుని అందర్నీ పిలవరు. పిలుపులు చాలా క్లుప్తంగా వుంటాయి. అందుకే పెళ్ళిహాలులో రద్దీ లేదు. మంటపం అలంకరణలు నడుస్తున్నాయి. ఇంకా ఆమె తల్లిదండ్రులు రాలేదు. ముహుర్తం టైముకి వస్తారేమో! ఒకమూలకి వెళ్ళి కూర్చుంది. కాస్త దూరంగా అర్చన, పల్లవి చేతులుపట్టుకుని వప్పులకుప్ప తిరుగుతున్నారు. మయూఖ్ వాళ్ళ కాళ్లకి అడ్డంపడుతున్నాడు. ఇంకా ఎవరెవరో పనులమీద తిరుగుతున్నారు. అదంతా తనకి చెందని ప్రపంచం అనిపించింది. తులసి, మానస, సమీర తనకన్నా చిన్నవాళ్ళు. వాళ్ళు ముగ్గురికీ పిల్లలు పుట్టి తనకి ఇంకా పుట్టకపోవడం ఆమెలో అసహనాన్ని నింపుతోంది. ఆ విషయంలో ఆమెకి ఒక ఓదార్పులాంటిది కావాలి. అది ఎలాంటిదో ఆమెకే తెలీదు. మాధవ్‍నుంచీ రావాలని కోరిక.
మగవాడు భార్య పుట్టింటి చుట్టాలని వెంటేసుకుని తిరుగుతూ వుంటే వోర్చుకోలేడు. ఆమె తనని నిర్లక్ష్యం చేస్తోందని బాధపడిపోతాడు. అలాంటి ఫీలింగ్సే ఆడవారికీ వుంటాయి. మాధవ్ తన చుట్టూ తిరగాలి. తన వెంటే వుండాలి. తనతో మాట్లాడాలి. ఈ చుట్టాలూ, స్నేహితులూ ఎంత ఆప్తులైనా అదంతా పెళ్ళికిముందు. తను రానప్పుడు. వీళ్ళలో తనకి ఎవరూ ఏమీ కారు. చుట్టరికాలన్నీ అతన్నిబట్టే. అలాంటి మనిషి అంతమందిమధ్య తనని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? అని కోపం వచ్చింది.
నీలిమ రావటం చూసి చెల్లెలి చెయ్యిపట్టుకుని లేవదీసి వెంటపెట్టుకుని వచ్చేసింది మాధురి.
“ఇక్కడ కూర్చున్నావేమే?” అడిగింది నీలిమని. ముగ్గురూ సర్దుకుని కూర్చున్నారు.
“ఏం మనుషులే బాబూ! పెద్దాచిన్నా అందరూ ఒకటే. వాళ్లలో వాళ్ళే తప్ప ఎవ్వరినీ కలుపుకోరు. ఎప్పటెప్పటి విషయాలో మాట్లాడుకుంటారు. అక్కడికి వీళ్ళొక్కరికే చిన్నతనాలున్నట్టు, ముద్దుమురిపాలు జరిగినట్టు ఒకటే డప్పుకొట్టుకోవడం” అంది ఆమే మళ్ళీ. నిరసనగా.
“మనకి ఈ తలనెప్పి ఎప్పుడో ఒకసారి. దీనికైతే నిత్యం నట్టింట్లోనేకదా?” అంది మానస నవ్వి.
“ఆవిడ పెత్తనమేమిటే, అందరిమీదాను? ఆమె అడగడం, అన్నిటికీ వీళ్ళంతా తలూపడం. నాకైతే చిరాకేసింది. రాణాగారి భార్యకి మనమంతా కలిసి వైద్యం చేయించడమేమిటి? రెండుజీతాలవాళ్ళు, మా బావగారూ తోటికోడలూను. ఎలాగేనా తగలేసుకోవచ్చు. మనందర్నీ ఇందులోకి లాగటమేమిటి?” చిరచిరగా అంది నీలిమ. ఆమె మనసంతా అప్రసన్నతతో నిండి వుంది.
మానస ఇంట్లో వ్యవహారాలమీదికి పోయింది వాళ్ళ సంభాషణ. కట్నం తేలేదని పద్మకీ భర్తకీ వున్న కోపాన్ని ఆమెమీద ఏదో ఒకలా చూపిస్తునే వుంటారు. వసంత్ పట్టించుకోడు. పట్టించుకోకుండా వుండటం ఎలాగో మానసకి తెలీదు. తనూ ఒకటో రెండో మాటలు సన్నసన్నగా అంటుంది. పెద్ద గొడవౌతుంది. వసంత్ ఆమెనే కోప్పడతాడు.
“పెద్దవాళ్ళు, ఒకమాటంటే ఓర్చుకోలేవా? నాన్న వద్దంటుంటే వినకుండా నిన్ను చేసుకున్నాను. ఆ అసంతృప్తి వుంటుందికదా? నాలుగురోజు వచ్చి వుండి వెళ్తాం. ఈ నాలుగురోజులకే గొడవపడాలా?” అంటాడు.
“ఏమోనక్కా! గొడవంతా తిరిగితిరిగి గీతావాళ్ళదగ్గిరే వచ్చి ఆగుతుంది. కట్నం లేదని వదిలేసారా, ఆమెకి బంగారం పెట్టి, స్థలం ఇచ్చారని ఎత్తి చూపిస్తారు. ఉంటే నాన్నమాత్రం ఇవ్వడా?” అంది.
“కట్నం వద్దంటేనేకదా, సంబంధానికి వెళ్ళాం? ఇప్పుడు కొత్తగా ఏమిటి? నాన్నకి చెప్పాలన్నా, నీకొక్కదానికీ యిస్తే మిగతావాళ్ళు వూరుకుంటారే? అసలు మన ముగ్గుర్నీ ఒకచోట ఇవ్వటమే తప్పు. ఎక్కడ దేన్ని సరిచెయ్యాలన్నా, ముగ్గురికీ కలిపి చుట్టుకుంటుంది” అంది మాధురి. ఎవరి సమస్య వాళ్ళది. తమ ముగ్గుర్నీ ఒకేచోట ఇవ్వడం తప్పని వీళ్ళకి అనిపించినట్టే అలా తెచ్చుకోవడం తప్పని వాళ్ళకీ అనిపించేరోజు ముందుంది. అక్కచెల్లెళ్ళు చాలాసేపు అవే విషయాలు మాట్లాడుకున్నారు.
పదినిముషాలకి భార్యని వెతుక్కుంటూ ప్రహ్లాద్ వచ్చాడు.
“ముగ్గురూ ఇక్కడ కూర్చున్నారా?” అన్నాడు. హేవింగ్ యువర్ టైం అనేది అతని భావన.
“లేకపోతే? విసుగుపుట్టి చస్తున్నాం” అంది మాధురి కొంచెం పెడసరంగా. ఇప్పుడిప్పుడే అలాంటివి రుచికి తగుల్తున్నాయి ప్రహ్లాద్‍కి.
“చాలారోజులకి అందరం ఒక్కచోట కలిసాం. టైం తెలీడం లేదు. ఐనా మాపక్కని కూర్చుని, మామాటలు వింటూ బోరుకొడుతోందంటే ఎలాగే?” అన్నాడు.
“మా ఖర్మానికి మమ్మల్నొదిలేసి, మీదార్న మీరు కబుర్లు చెప్పుకుంటుంటే మా కాలక్షేపం మేం చేసుకోవాలనా, బావా?” చురుగ్గా అడిగింది నీలిమ. ఆ చురుకు బానే తగిలింది ప్రహ్లాద్‍కి.
“ముగ్గురం ఇంటికెళ్ళిపోయి ముహుర్తం టైముకి వద్దామనుకున్నాం” అంది మానస.
ప్రహ్లాద్ వెళ్ళి, మిగిలిన ఇద్దర్నీ తీసుకొచ్చాడు. ఆరుగురూ కాసేపు కూర్చుని మాట్లాడుకునేసరికి మళ్ళీ సమీకరణాలు మారాయి.
రాత్రికి పెళ్ళీ, హడావిడీ అయ్యి, ఎవరిళ్లకి వాళ్ళు తిరిగొచ్చేసరికి, గీత జీవితంలో వురుము వురిమి మంగలంమీద పడ్డదనిపించేలాంటి మార్పు మొదలైంది.
వెలుతుర్ని వదిలేసి బయటికి వచ్చినట్టు మాధవ్‍కీ, క్రిక్కిరిసిపోయిన జనసమ్మర్దంలోంచీ బయటపడి వూపిరి పీల్చుకున్నట్టు నీలిమకీ అనిపించింది. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. అత్తాకోడళ్ళిద్దరే ఇంట్లో మిగిలారు. మయూ ఆడుతున్నాడు.
అంతా ఆఫీసులకి వెళ్ళిపోయాక ఇంట్లో వీళ్ళిద్దరే వుంటారుకాబట్టి బాగానే మాట్లాడుకుంటారు. లక్ష్మికి తన వయసూ, అనుభవరీత్యా నీలిమగురించి ఒక స్పష్టమైన అవగాహన వుంది. ఈ కుటుంబానికి సంబంధించి ఆమెకి తెలిసింది తక్కువ. ఒక తెల్లకాగితంలాంటిది ఆమె మనసు. దానిమీద ఎలాంటి రాతలు రాస్తే అవే ముద్రలు పడతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి చెప్తుంది విషయాలని.
“మా నాన్న పోయినప్పటికి అన్నయ్యకి పంథొమ్మిదేళ్ళు. చాలా కష్టపడి మా అందర్నీ పైకి తీసుకొచ్చాడు” అంది ఒకసారి. అదే విషయం ఆమె పుట్టింట్లో చర్చకి వచ్చినప్పుడు, కుటుంబరావు-
“అందులో పెద్ద వింతేం వుంది? పెద్దకొడుకన్నాక, లంకంత కొంప తండ్రి రాసిచ్చాక చెయ్యకేం చేస్తాడు?” అన్నాడు చులకనగా. ఆయన భార్యకి ఆ విషయంలో రామారావుమీద గౌరవం వుంది. ప్రతివ్యక్తినీ అలా తీసిపారేసినట్టు మాట్లాడటం ఆవిడకి నచ్చదు.
“ఏదో మొక్కుబడిగా చెయ్యడంకాదు, జాగ్రత్తగా యిటుకమీద యిటుక పేర్చి గోడ కట్టినట్టు, కుటుంబాన్ని నిర్మించుకుని వచ్చాడు. ఇంట్లోవాళ్ళందరి గౌరవాన్నీ సంపాదించుకున్నాడు” అంది. భార్యాభర్తలమధ్య వుండే ఈ బేధాభిప్రాయలవలన పిల్లల దృక్కోణంలో స్పష్టత లోపించి పరిస్థితుల్ని చూసేతీరు అనిశ్చితంగా మారుతుంది. నీలిమకి ఆ సమస్య మొదలైంది.
తనచుట్టూ వున్నవాళ్లందర్నీ సునిశితంగా గమనించింది. అక్కకి పెళ్ళి జరిగినప్పుడు వీళ్ళెవరూ తనకి పరిచయం లేరు. తన పెళ్ళిలో వేడుకలూ, వేళాకోళాలూ తమ చుట్టే జరిగాయికాబట్టి సరదాగా అనిపించింది. చెల్లెలి పెళ్ళిసమయానికి తల్లికి సాయంగా ఆడపెళ్ళివారివైపు వుండిపోయింది. ప్రహ్లాద్, మాధవ్ ఎంత తమవెంట తిరిగినా, తను ఈ గుంపుకి దూరమే. ఇప్పుడు అంటే, మహతి పెళ్ళిలో గుంపులో కలిసింది. ఆ కలయిక ఆమెలో సంతోషాన్ని నింపలేదు. వేదికమీద షో చేస్తూ తనని ప్రేక్షకపాత్రలో మాధవ్ కూర్చోబెట్టినట్టనిపించింది. తనందులో భాగంగా వుండికాక అదొక విహంగవీక్షణం.
గీత, సుమతి నేరుగా మాట్లాడుకోరు. ఎందుకనే ప్రశ్న పక్కని పెడితే, గురుమూర్తి పక్కని కూర్చుని గీత చక్కగా కబుర్లు చెప్పడం, రామారావు చెయ్యిపట్టుకుని సుమతి నడవడం చూసింది. మళ్ళీ ఈ యిద్దరే రవికి చెరోపక్కనీ కూర్చుని మాట్లాడ్డంకూడా. వాళ్ళమధ్య గొడవేంటి? ఎప్పట్నుంచీ మాట్లాడుకోవట్లేదు?
సుధీర్, సుమంత్‍లు ఇంకా ఎందుకు పెళ్ళిచేసుకోలేదు? తల్లిదండ్రులు కట్నం తీసుకోవాలనుకున్నారనీ, అది సుధీర్‍కి యిష్టం లేదనీ చూచాయగా తెలిసింది. వాళ్ల తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నారు, వుద్యోగాలు చేస్తున్నారు. కట్నానికి ఆశపడ్డమేమిటి? అతను వాళ్ళకి గట్టిగా చెప్పలేడా? తులసికీ, సమీరకీ కట్నం ఇచ్చి, ఘనంగా పెళ్ళిచేసారు. ఇద్దరు మగపిల్లలకి తీసుకోకుండా తనింట్లోనూ, వున్న ఒక్క కొడుక్కీ తీసుకోకుండా వసంత్ ఇంట్లోనూ ఆడపిల్లకి కట్నం ఇవ్వటందగ్గిర ఆ సిద్దాంతం ఎందుకు వదిలిపెట్టారు? ఇప్పుడు ప్రహ్లాద్ చెల్లెలికి సంబంధం చూస్తున్నారట. ఇచ్చిపుచ్చుకోవడాలమీద ఆమెకిగల అభిప్రాయంలో ఎక్కడో చిన్నచీలిక వచ్చింది. తన తండ్రిమీద వాళ్ల ఆధిక్యత రుజువైన భావన కలిగింది.